స్టీఫెన్ హాకింగ్ తో అరగంట!

ఏ మాత్రమూ సహకరించని ఆ శిథిల  దేహపు వాస్తవికతతో  అంత సృజనాత్మకంగా బతకడం ఎట్లా సాధ్యమైంది. బయటకు  రాబోయిన   నా ప్రశ్న  నాలోనే ఆగిపోయింది.

(ఈ కధ ఇద్దరు అసాధారణ వ్యక్తులగురించి , వాళ్ళు ఇద్దరూ ‘disabled’, కాదు కాదు ‘differently abled.’  శరీరమంతా చచ్చుబడిపొయ్యి తన మనసులోవున్నది కంప్యూటర్  కీ బోర్డ్ నొక్కి అక్షరాలు టైప్ చేయగా తన మనసులోని మాటని తెలియచెప్పే వాయిస్ synthesiser ద్వారా ప్రపంచానికి తెలియచెప్పే Stephen  Hawking ,పెళుసు ఎముకలతో పుట్టి చిన్నప్పుడు ఆటలాడుకునేటప్పుడు  ఎముకలన్నీ విరిగిపొయ్యి , అప్పటి నుండీ  వీల్ చైర్ కే పరిమితమయిన Firadaus Kanga అనే ముంబై జర్నలిస్ట్, రచయితల  మధ్య జరిగిన ఒక కలయిక .

ఆ ఇద్దరు అసాధారణ వ్యక్తులు వీల్ చైర్ కే పరిమితమయిన తమ జీవితాల గురించి  ‘ normal’  అనుకునే మనుషుల దృష్టిలో ‘disabled ‘ అనుకునే వ్యక్తుల గురించి ఏం మాట్లాడుకున్నారు  …)

నా మనసులో ఇంగ్లాండ్ అంటే  ‘కేంబ్రిడ్జి’ అనే వుండేది . ఇదంతా నేను స్టీఫెన్ హాకింగ్ ని కలవక ముందటి సంగతి , ఇప్పుడు దాని అర్ధమే మారిపోయింది నా మనసులో .

నేను ‘కేంబ్రిడ్జి’ ని, నా వీల్ చైర్ లో కూర్చుని చుట్టబెడుతున్నాను . నాకు గైడ్ గా ఉన్న వ్యక్తి  యూనివర్సిటీ లో ఆ కుర్చీని చూపిస్తూ ‘ దురదృష్టవంతుడు .  యూనివర్సిటీ లో అతను కూర్చునే ఈ కుర్చీ వుంది చూశారూ, Issak Newton ది . ఆ కుర్చీ లో కూర్చునేంత ప్రతిభా వంతుడే, అర్హత కలవాడే, కానీ పాపం కదల్లేడు’ అన్నాడు

నాకు అప్పటిదాకా గుర్తుకు రాలేదు , అత్యంత ప్రతిభావంతుడు , పక్షవాతంతో పూర్తిగా చచ్చుబడిన అవయవాలతో  వీల్ చైర్ కే అంకితమైన ,  ‘బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ రాసిన స్టీఫెన్  హాకింగ్ అక్కడే వుంటున్నాడని అప్పుడే మతిలోకి వచ్చింది.

కేంబ్రిడ్జి  లో తిరగటం అవ్వగానే ఆతృతగా ఫోన్ బూత్ లోకి వెళ్ళీ స్టీఫెన్ హాకింగ్ ఇంటికి ఫోన్ చేసాను . నా విసురుకి ఆ ఫోన్ రిసీవర్ కింద పడినంత పనయ్యింది .  అవతలివైపు స్టీఫెన్  సహాయకుడు ఫోన్ ఎత్తగానే  నన్ను నేను పరిచయం చేసుకుంటూ  నేను ఇండియా నుండి వీల్ చైర్ లో ఇంగ్లాండు కి  వచ్చానని ఇంగ్లాండులో నా యాత్రల గురించి  పుస్తకం రాస్తున్నానని చెప్పాను. [అతనేమనుకొన్నాడో, నేను లండన్ దాకా వీల్ చైర్ చక్రాలని దొర్లించుకుంటూ వచ్చానని అనుకున్నాడేమో పాపం -:).]  నేను స్టీఫెన్ హాకింగ్ ని చూడాలనుకుంటున్నానని  పది నిముషాలయినా చాలని  బ్రతిమిలాడాను.  తరవాత రోజు మధ్యాహ్నం 3.30 నుండి 4.00  వరకు ఒక  అరగంట టైం ఇచ్చి రమ్మన్నారు.

నాకెందుకో శరీరమంతా నిస్సత్తువ ఆవరించింది. ఏదో ఒక వైకల్యంతో పెరుగుతూ పోతున్నకొద్దీ అందరూ ధైర్యంగా వుండు, ధైర్యంగా వుండు అని చెప్పేవాళ్లే, అదేదో ధైర్యమనేది బాంక్ అకౌంట్ అయినట్లు, ఒక చెక్ వేసి దాంట్లోంచి కొంత తీసుకోవటానికి నేను బద్ధకించినట్లు చెప్పేవాళ్లే.  నాలాగే బతుకుతూ, బతుకులో నాకంటే ఎక్కువ సాధించినవాళ్లే నాకు మానసికంగా బలమిచ్చేది. అప్పుడే ఇప్పుడున్న దానికంటే ఎంత బాగా బతకొచ్చో, ఎంత సాధించొచ్చో అర్ధమయ్యేది. అది ఒకోసారి మన ఊహాలకి అందనంత కూడా వుండొచ్చు.

“నేను ధైర్యంగా  ఏమీ లేను”  అని పలికింది విరిగిపోతున్న అతని కంప్యూటర్ సింథసైజర్  స్వరం తరవాత రోజు మధ్యాహ్నం.  “నాకంతకంటే ఇంకో మార్గం లేదు” అని కూడా అన్నాడు.

ఏ మాత్రమూ సహకరించని ఆ శిథిల  దేహపు వాస్తవికతతో  అంత సృజనాత్మకంగా బతకడం ఎట్లా సాధ్యమైంది. బయటకు  రాబోయిన   నా ప్రశ్న  నాలోనే ఆగిపోయింది. నేను మాట్లాడుతూ, ప్రశ్నలడుగుతూ అతనినుండి  వచ్చే ప్రతిస్పందన కోసం ఎదురుచూసే  ప్రతిసారీ నేనేదో తప్పు చేస్తున్నానన్న భావన నాలో-

అతని చేతిలో ఒక చిన్న స్విచ్. దాన్ని నొక్కుతూ, ఆగుతూ  తనకు కావలసిన మాటలకోసం ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ ..- ఆ చేతి వేళ్ళ కదలికలే అతనిలో మిగిలిన కాస్త చలనం. చాలా తరుచుగా అతని కళ్ళు అలసటా, నిస్పృహ తో మూతలు పడుతున్నాయి. అతని లోపల ఆ బాధ, అతని మెదడు లో అలల్లా కెరలివచ్చే ఆలోచనలు,  బయటకు  వచ్చే మాటలు మంచు గడ్డల్లానూ,  బిగుసుకుపొయ్యే శవాల్లానూ బయటకు వస్తుంటే  కనపడీ కనపడని బాధ అతని కళ్లల్లో.

“వైకల్యంతో బాధపడే మనుషులు లోపల్లోపల ఎప్పుడూ అసంతృప్తిగా వుంటారని అందరూ అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదని నాకు తెలుసు. దేనిగురించీ మీకు నవ్వురాలేదా? లోపల్లోపల మీరెప్పుడూ నవ్వుకోలేదా?” అని అడిగాను.

“మనుషులు  నాకు వత్తాసు పలుకుతూ మాట్లాడడం  చూస్తుంటే  వినోదంగా వుంటుంది”  అన్నాడు మూడు నిమిషాల తరువాత సమాధానమిస్తూ.

“నా లాటి వాళ్లొచ్చి అప్పుడప్పుడూ ఇలా  వస్తుంటే మీకూ, మీ పనికీ ఏమీ  ఇబ్బంది కలగట్లేదు కదా ” అన్నాను .

ఆ  మరుక్షణం సమాధానం నాకే తట్టింది మెరుపులాగా. పెదవి చివర్లనుంచి ఒక పక్కకే సాగదీసి నవ్వే అతని నవ్వు చూసాను.  నాకా క్షణంలో అన్పించింది నేను భూమ్మీద కెల్లా అత్యంత అందమైన మనిషిని చూస్తున్నానని.

అతన్ని చూసిన మొదటి క్షణంలోనే నాకొక షాక్. న్యూస్‌ పేపర్లలోనూ, మాగజైన్స్ లోనూ చూసిన ఫోటోలన్నీ రూపుదాల్చుకుని  త్రీ డైమెన్షనల్  నిశ్చల ఛాయాచిత్రంలాగా  నా ఎదురుగా వున్నట్లు. బరువుగా ఒక వైపుకి వాలిపోయిన తల, లేత నీలం చొక్కా లోకి దూరిపోయిన మొండెం, వేళ్లాడబడుతున్న కాళ్ళు. అతని కళ్ళవైపుకి చూస్తుంటే ఏదో గాఢమైన విషయం ఇప్పుడే చెప్పాలన్నట్లు నా వైపు చూస్తున్నాయి. అతనేం చెప్పాలనుకున్నాడో అర్ధం కావటం కష్టం. నేనింతకుముందు చూడాలనుకోనిదేదో ఆ కళ్ళల్లో  కనపడి నాలో సన్నని ప్రకంపనలు.

పగిలిపోయిన  పలుచని పాత గాజు లాంతరు మధ్య  రెపరెపలాడుతున్న  దీపం లాగా పారదర్శకంగా ఆ శరీరంలో అతను. ఆ దేహం నిమిత్తమాత్రంగా వుంది. కేవలం నీడలతో చేసినట్లు రెపరెపలాడుతుంది. శాశ్వతమైన ఆత్మలలో నమ్మకం లేని నేను మనలోపలి నిజమేదో అతనిలో చూసాను. మనందరికీ చెందిన ఆ నిజం తప్ప ఒక్కటి తప్ప జీవితంలో  మిగతావన్నీ అలంకారాలు.

“వైకల్యం తో వున్నవాళ్ళకి గొప్పగా అన్పించే విషయమేదీ” అని ఇంతకు కొద్దిసేపటి క్రితమే అతన్ని అడిగాను.

“వైకల్యంతో  వుండటం ఏమంత మంచి విషయం, ఏముంటుంది అందులో గొప్ప” అన్నాడు.

“ప్రపంచంలో ఎంత దయ వుంటుందో అప్పుడే  కదా మనకు తెలిసేది” అన్నాను.

“అవును, నిజమే” అన్నాడు. ఆ వాయిస్ synthesiser లో అతనిలోని భావానికి సంబంధించిన ఏ కంపనలూ బయటకు తెలియట్లేదు. అతను ఎలాటి భావంతో నాతో  ఏకీభవించాడో  నాకు తెలియలేదు.

నా కుర్చీ లో నేను కదిలిన ప్రతిసారీ, మా మధ్యవున్న  ఆ ముప్ఫయి నిముషాల సమయాన్ని అర్ధవంతంగా  ఉపయోగించుకోవాలకుని నా గడియారం చూసుకున్న  ప్రతిసారీ  నా శరీరాన్ని నాకు కావాల్సినవిధంగా  కదిలించగలిగే అవకాశానికి నాకు సంతోషం కలిగింది. నేనెప్పటికీ నిలబడలేనూ, నడవలేనన్న విషయం కూడా నాకు చాలా చిన్న విషయం లాగా కనపడింది.

అతను నాకూ, నాలాటి వాళ్లకు ఎంతటి ఇన్‌స్పిరేషనో మామూలు రొడ్డకొట్టుడు పద్ధతిలో కాకుండా మనస్ఫూర్తిగా అంటూ ” ఆ మాట మీకు సంతోషమేనా ” అన్నాను .

నేనా మాట అడుగుతుండగానే  నా ఆ ప్రశ్న ఎంత అవివేకమైనదో నాకే తెలిసింది.  నీ దేహమే నీకు భయం కలిగించేంత ఇరుకు  గదిగా మారి, ఆ గది గోడలు రోజురోజుకీ పలచబడి ఇంకా ఇంకా ఇరుకుగా నొక్కేస్తుంటే, నిన్ను చూస్తున్న బయటి జనాలు, నువ్వింకా ఊపిరి పీల్చుకోవటమే గొప్ప విషయంగా చూస్తూ నీ వైపు నవ్వులు చిందిస్తుంటే ఎలా వుంటుంది?

“వైకల్యంతో ఉన్న మనుష్యులకి మీరేమయినా సలహా ఇవ్వగలరా?వాళ్ళ జీవితాలకు ఉపయోగపడేలాటి సలహా ”  అన్నాను.

“వాళ్ళు వాళ్ళు చెయ్యలేనివి వదిలేసి వాళ్ళు ఏ పనులయితే బాగా చెయ్యగలరో ఆ పనులమీద దృష్టి పెట్టటం మంచిది . నా దృష్టిలో వైకల్యం వున్న వాళ్ళకి ఒలింపిక్స్ లాటివి  టైం వేస్ట్ వ్యవహారాలు” అన్నాడు .

“మీరేం  మనసులో పెట్టుకుని ఈ మాట అంటున్నారో నాకు తెలుసు” అన్నాను .

సైజ్ లో నాకంటే  పెద్దదయిన స్పానిష్ గిటార్ ని నేర్చుకోవటానికి  నేను  అవస్థలు పడ్డ రోజులన్నీ గుర్తుకొచ్చాయి. ఆ గిటార్ ని వొళ్ళోనుండి విసిరికొట్టిన రోజు నాకెలాటి ఆనందం కలిగిందో  గుర్తుకొచ్చింది.

నాకిచ్చిన అరగంట  అయిపొయ్యింది.

“మిమ్మల్ని తగినంతగా ఇబ్బంది పెట్టాననే అనుకుంటున్నాను” అని అక్కడ్నించి వెళ్లబొయ్యాను.

“కొంచెం సేపు ఉండండి. కొంచెం టీ తాగి వెళుదురు. ఈ లోపు మీకు నేను నా తోట చూపిస్తాను” అన్నాడు ఆయన.

ఆ తోట పార్క్ కంటే  పెద్దగా వుంది.  కిర్రుమని శబ్దాలు చేస్తున్న అతని  మోటరైజడ్ వీల్ చైర్ లో తోటంతా  తిరిగాడు . అతన్ని అనుసరిస్తూ , కనుసన్నల్లో వుంటూ నేను కూడా అతనితో పాటే  తిరిగాను.  మేమెక్కువగా మాట్లాడుకోలేదు. ఎండ పడటం  మూలానా కంప్యూటర్ స్క్రీన్ మీద అక్షరాలు కనపడట్లేదు.

ఒక గంట తరువాత మేము వీడ్కోలు తీసుకోవటానికి సిద్ధమయ్యామ .  నాకేం చెయ్యాలో తోచలేదు. నేను అతన్ని ముద్దుపెట్టుకోలేను, ఏడవలేను. అతని భుజం మీద తట్టి నా వీల్ చైర్ లో  ఆ ఎండాకాలపు సాయంత్రం బయటకు నడిచాను.

వెళుతూ, వెళుతూ వెనక్కి తిరిగి చూసాను. అతను చెయ్యూపకపోయినా చెయ్యూపుతున్నట్లే అన్పించింది. నా ధైర్యాన్నంతా రూపు కట్టినట్టున్న అతనిలో నన్ను నేను చూసుకుంటూ, ఎన్నో సంవత్సరాలుగా నాకొక్కడికే తెల్సిన అతనివైపు అడుగులేస్తూ కదిలాను. ఇప్పటి ఈ ప్రయాణం అయిపోయిందని నాకు తెలుసు . ఇప్పటికి మాత్రమే అయిపోయింది.

*

బోడపాటి పద్మావతి

బోడపాటి పద్మావతి

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఇంతద్భుతమైన వ్యక్తి గురించి రాసిన ఈ వ్యాసం మరిచిపోలేనిది. రాసిన వారికి , సారంగకు ధన్యవాదాలు.

 • Madam! మీరు ఎప్పటి లాగే అద్భుతంగా రాశారు. మీరు సారంగా కి asset. ఇటువంటి inspirational stories మా స్కూల్ పిల్లలకి చెప్పాలి.

 • మహోన్నత మేధాశిఖరాలను అధిరోహించిన ‘డిఫరెంట్లీ ఏబిల్డ్’ యోధుల అంతరంగాల లోతులను దర్శింపజేసిన వ్యాసం. అనువాదం అని ఎక్కడా అనిపించకుండా సాఫీగా సాగిపోయిన వచనం. అభినందనలు!

 • స్టీఫెన్ నావైపే.చూస్తున్నట్లు, మాటాడినట్లు అనిపిస్తోంది. అనువాదమైనా అనుభూతి కలిగించారు మేడమ్. హార్ట్ టచింగ్

 • పద్మావతి గారు, ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపించింది, ధన్యవాదాలు!

 • ” చేయగలిగినవే చేయండి.
  మిగిలినవి వదిలేయండి”
  ఎంత ప్రేమైక సలహా, అందరికీ.
  థాంక్యూ పద్మావతి గారూ, సారంగా ????

 • స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు . ఇది మా పిల్లల 8 th క్లాస్ ఇంగ్లీష్ నాన్ డిటైల్డ్( CBSE ) పాఠ్యఅంశం . చదువుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది . స్టీఫెన్ హాకింగ్ కి నివాళి గా తెలుగు చేయాలనుకున్నాను

 • ఓ రెండు అంద‌మైన మ‌న‌సులు..
  అద్భుతంగా మాట్లాడుకున్నాయి..
  చ‌దువుతూంటే…
  ఓ గొప్ప అనుభూతి క‌లుగుతోంది.
  చ‌దివాక‌.. నేను గొప్ప క‌ష్టాల‌ని అనుకున్న‌వ‌న్నీ..
  చెత్త‌బుట్ట‌లో ప‌డేయాల‌నిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు