సోమాలియా మేక: ఎప్పటికీ నేటి కథ!

నిజానికి దేశవాళీ చర్మంకింద దేశవాళీ నివసించడం లేదు. అమెరికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, జర్మనీ వంటి రాజ్యాలు నివసిస్తున్నాయి.

పైడి తెరేష్ బాబు ఒక భావ ప్రభంజనం. ఒక కవిత్వ విజృంభణం. ఆంధ్రలో ప్రభవించిన తెలంగాణం. బహుముఖీన ప్రజ్ఞకు నిలువెత్తు తార్కాణం.

ఆకాశవాణిలో నేను మొట్టమొదటి డ్యూటీ ఆయనతోనే చేశాను. నాలోని రచయితని ఎంతో సుతారంగా తెలివిగా బయటకు తెచ్చారు. ఏ మూడ్ లో ఉన్నా ‘మైక్ మూడ్’ లోకి అలవోకగా రావడం ఆయనకు అనౌన్సుమెంటుతో వచ్చిన విద్య. ‘వచ్చిన’ అనే అంటున్నా. ‘పెట్టిన’ అనటం లేదు. ఎవరూ ఆయనకి ‘పెట్టలేదు’. అవార్డు లివ్వలేదు, కిరీటాలు పెట్టలేదు. తమలో ఒకడైన వాడికోసం మనసుల్లో ఇంత చోటు పెట్టారు. మరణించినప్పుడు కంట తడి పెట్టారు. స్వశక్తితో అందలాన్నందుకున్న తెరేష్ పాట పాడితే జనం పరవశించారు. కవిత రాస్తే ఉద్యమించారు. గుండె పగిలేట్టు రాసిన ప్రతి అక్షరమూ ఒక స్ఫూర్తి కెరటమై ఉవ్వెత్తున తెలుగు ప్రజలను ముంచిపారేసింది. డోలాయమానంలో చిక్కుకున్న తెరువరులకు తోవ చూపింది. భక్తి రక్తి విముక్తి — వారి కవితాత్మ స్పృశించని పార్శ్వం లేదు, ఆర్తులకై తపించని క్షణం లేదు. కలాన్నే కరవాలంగా ఝళిపించి వ్యంగ్యం పదును పెట్టి దురాలోచనల కుత్తుకలను తెగనరికిన వాక్యం వారిది.

జననం నేల మీద నడక

మరణం నేల కింద పడక

ఈ దుర్లభ సత్యాన్ని ఎంతో సులభంగా అర్థం చేసుకున్నారు కాబట్టే పైడిశ్రీ (నేను డబుల్ బంగారం అంటుండేవారు) రచయితల్లో మేలిమి పైడి అయ్యారు.

ప్రస్తుత కథ ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’లో వారం కథగా 23 మే 2010 నాడు ప్రచురితం. బొమ్మలు అక్బర్. సోమాలియాలో జరుగుతున్న అంతర్యుద్ధ నేపథ్యంలో దీన్ని రాశానని ఓ కాపీ నాకిస్తూ వారన్న మాట. పేరే భలే ఆకర్షిస్తోందే అన్నాను. ప్రపంచీకరణని కూడా సోమాలియా అలానే ఆకర్షిస్తోంది, బలైపోతోంది అన్నారు. చెమ్కీతో కొట్టినట్టన్న ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. ఎక్కడో ఏదో జరుగుతుంటే మనమెందుకు స్పందించాలి అన్న విషయంపై ఆ తర్వాత మా మధ్య ఎన్నో నాళ్ళు చర్చ జరిగింది. శీర్షిక కరవులో కొట్టుకుపోయిన సోమాలియాదైనా, విషయ వైశాల్యత, సార్వజనీనత, సార్వకాలీనత ఈ కథలో మనం చూడవచ్చు. సౌందర్య తత్వాన్ని ఇంత విపులంగా, ఇంత వ్యంగ్యంగా, ఇంత విభిన్నంగా విశదీకరించిన ఏకైక తెలుగు కథ ఇది. జాగ్రత్తగా గమనిస్తే చెప్పకుండా చెప్పే సత్యాలెన్నో గోచరమై రచయితకు ప్రపంచ రాజకీయాల, పోకడల మీదున్న బలమైన అవగాహన అవగతమవుతుంది. అందుకే ఇది ఎప్పటికీ నేటి కథ, మేటి కథ!

 

సోమాలియా మేక

 

ది యొక రమణీయ పుష్పవనము !

ఆ వనమందొక – మేక!

అందునా ఆడమేక. అవయవ పుష్టితో అలరారుచున్నది.

పేరు సోమాలియా !

అతిలోక సుందరమేకగా అత్యుత్తమ ఆటవిక పురస్కారం పొంది పులిరాజు చేతులమీదుగా కాయగసర్లు  పొదిగిన ‘పర్ణ  కిరీటా’న్ని అందుకున్న అద్భుత మేక!

ఆ మేక కోసం ఒక మగమేక !

పేరు దేశవాళీ !

దేశీయతను అణువణువునా నింపుకున్నది. కండపుష్టి కలిగినది. మాంచి కసిమీద ఉన్నది. దేశీయ మేకను తప్ప విదేశీ మేకల్ని మోహించకూడదని భీష్మించుక్కూర్చున్నది.

మోహమునకు దేశ విదేశీయములనే భేదములు తెలీవు కదా. విధివశాత్తు దేశవాళీకి సోమాలియా మీద మనసైంది. ‘నిలూపరాని మోహామాయేనే’ అంటూ పెనుమానసిక విలాపానికి గురైంది.

సోమాలియాకు కూడా అలాగే ఉంది దాదాపుగా !

ఈ రెండు మేకల మధ్య ఒక ప్రచ్ఛన్న ప్రేమకథ చాలా రోజుల బట్టి హోరాహోరీ నడుస్తోంది.

ఒక చల్లని రాత్రి !

ఒక వెచ్చని తమకం !

ఒక దగ్గరి దూరం !

ఒక దూరపు దగ్గర !

సోమాలియా ఆరాధనగా దేశవాళీ కళ్లలోకి చూస్తూ “జీవితం క్షణ భంగురం. సౌందర్యమే శాశ్వతం. అశాశ్వతమైన ఈ ప్రపంచానికి నీ సౌందర్యతత్వంతో ఒక శాశ్వతత్వాన్ని ప్రసాదించు ప్రియా” అంది.

దేశవాళీ సూడో ఇంటలెక్చువల్ చొంగ కారుస్తూ “సౌందర్యం అంటే ఏమిటి?” అని అడిగింది.

“సౌందర్యం అంటే ఆకలి. సౌందర్యం అంటే దాహం. సౌందర్యం అంటే ఒక.. ఒక స్నిగ్ధ మోహన దగ్ధ బీభత్సం” అంది సోమాలియా.

“కాదు” అంటూ అడ్డొచ్చింది దేశవాళీ !

మేల్ చావనిజం, ఫెమినిస్టిక్ హ్యూమనిజం కలగలిపిన కంగాళీ హుందాతనంతో ఇలా అంది. “సౌందర్యం అంటే శ్వేతసౌధం. సౌందర్యం అంటే థేమ్స్ నదీతీరాన ఘనీభవించిన కెరటం. బెర్లిన్ గోడ శిథిలాల కింద ఎండీ ఎండని పిడక. క్రెమ్లిన్ భవంతిలో అద్దెకిచ్చే మడత మంచం. రామమందిరం ప్రహరీ వెనక బద్దలు కాని బాబ్రీ ఇటుక. తియాన్మెన్ స్క్వేర్ దగ్గర అమ్మే ముంత కింద పప్పు. సౌందర్యం అంటే పేదరిక నిర్మూలన గురించి ఫైవ్ స్టార్ హోటల్లో జరిపే రహస్య సెమినార్”

సోమాలియా దీనంగా ఎటో చూసింది. దాని చూపులకు దిగంత రేఖ గాయపడింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని ఇలా అన్నది. “ప్రియా! దేశవాళీ! అతిశయించిన ఆర్థిక బానిసత్వం నీ చేత అలా మాట్లాడిస్తోందని తెలుసు. దగ్గరగా రా!”

సోమాలియాకు నోరూరుతోంది. జలప్రళయాన్ని ఆపడం సాధ్యమేమోగానీ లాలాజలప్రళయాన్ని ఆపడం చాలా కష్టం. అయినా తమాయించుకుంది. ఆకలి తనకు నేర్పిన పాఠాలన్నిటినీ అమల్లో పెట్టి గంభీర సుందరంగా నవ్వింది.

ఇటు దేశవాళీకి దేహం బిగుసుకుంటోంది. మోహం రగులుకుంటోంది. దేహానికి మోహానికి అహం అడ్డుపడి ‘సోహం’ అంటోంది.

“సౌందర్యం అంటే ఆకలితో ఎండిన డొక్క. సౌందర్యం అంటే ఈడ్చే దిక్కు లేక నడి వీధిలో కుళ్లిపోయే శవం. సౌందర్యం అంటే -” అంటూ సోమాలియా ఇంకా ఏదో చెబుతుండగా….

“స్టాపిట్ !” అంటూ ఆవేశసుందరంగా అరిచింది దేశవాళీ.

“సౌందర్యం అంటే కులం. సౌందర్యం అంటే మతం. సౌందర్యం అంటే కులమతాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా అభ్యుదయం అని కాసేపు, విప్లవం అని కాసేపు బుకాయించడం. ఎరుపు పసుపుల సారధ్యంలో ఏడు రంగుల్నీ ఏకం చేసి అడవికి ఒక ఆకుపచ్చ స్వప్నాన్ని అద్దెకివ్వడం. జంతుబాహుళ్య జడత్వాన్ని చైతన్యంగా వక్రీకరించడం, వక్రీకరణల్ని ధృవీకరించడం, సమీకరించడం .. ఇంకా డం ..డం .. డం ! ఢమా డమ్ ఢమా డం డం !”

“కాదేమో ప్రియా !” అంది సోమాలియా.

“అవునేమో ప్రేయసీ” అంది దేశవాళీ !

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను”

“నేను నీ సౌందర్యాన్ని ప్రేమిస్తూ నీ ప్రేమను అనుమానిస్తున్నాను.”

“నీ మనసులో ఉన్న మాట చెప్పు”

“నీ సౌందర్య రహస్యమేమిటో చెప్పు”

“నేను చెప్పలేను”

“నేనూ చెప్పలేను”

“అంతేనా?”

“అంతేగాక?”

“పోరా గూట్లే” అంది సోమాలియా అక్కణ్ణించీ పశ్చిమానికి వెళ్లిపోతూ.

“పోవే పుస్కీ” అంది దేశవాళీ సరిగ్గా తూర్పు దిక్కుకు నడుస్తూ.

దూరంగా ఎక్కణ్ణించో వినిపిస్తోంది “ఫిర్ వొహీ షామ్… వొహీ గమ్… వొహీ తన్ హాయీ …!”

పుష్కల ప్రేమికులైన ఆ రెండు మేకలు వికల మనస్కులై అలా విడిపోవడం వెనుక ఓ చిన్న కథ ఉంది. అది చెప్పకపోతే ఈ పెద్ద కథ సంపూర్ణం కాదు.

కతిపయనాళ్ల క్రిందట (కొన్నాళ్ల క్రితమని)

కుందేలు చేతిలో చావుదెబ్బ తిన్న మృగరాజు బావిలో పడి మరణించింది. ఆ తర్వాత అధికారం పంజాలు మారి పులి అడవికి రాజైనది.

అడవి మీడియా నిప్పుకోడై కూసింది. మేక జాతి గుండెలు గుభిల్లుమన్నాయి. మేకజాతి పట్ల పులిరాజు ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని పట్టుపట్టాయి. ధర్నాచౌక్ దాపున పార్కులో ఉన్న చెట్లమీద పడి ఆకులు మొత్తం నమిలెయ్యడం వంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. ఆహారదీక్షలు చేశాయి. దాంతో పులిరాజు దిగిరాక తప్పలేదు.

“ఇక నుంచి మేం ప్రపంచ బ్యాంకు నిధుల్ని తప్ప మేకల్ని తినం” అని మాటిచ్చాడు పులిరాజు. అంతటితో ఆగక “ఇవేళ్టి నుంచి పులులు మేకలు ఒక నిర్భయ వాతావరణంలో సంచరిస్తూ ఒక సహజీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తాయి” అన్నాడు. అంతటితోనూ ఆగక మరింత ఉత్సాహానికి పోయి, మేకలకు ఎన్నో సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రకటించాడు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే ఆ ఏర్పాట్లకు పూనుకుంది.

వాటిలో ఒకటి మేకలకు అందాల పోటీ !

ప్రపంచవ్యాప్తంగా అందాల మేకలు అడవిలో విడిది చేశాయి.

అందులో సోమాలియా మేకను చూసి అడవి యావత్తూ మూర్ఛిల్లింది.

మూర్ఛలోంచి మొదటిగా తేరుకుంది దేశవాళీ. అలా తేరుకోవడమేమిటి, ఇలా సోమాలియా పై మనసు పడ్డం ఏమిటి, సోమాలియా మేక అతిలోక సుందరమేకగా ఎంపిక కావడమేమిటి, పులిరాజు అధికార నివాసంలో దానికి రహస్య విందు ఏర్పాటు చేయడమేమిటి.. ఒకటొకటీ చక చకా జరిగిపోయాయి.

విందుమందిరాని కేగింది సోమాలియా.

పులులన్నీ సాదరంగా ఆహ్వానించాయి.

“భోజన పదార్థాలేవీ?” అంటూ చుట్టూ చూసింది సోమాలియా.

“నువ్వే!” అన్నాయి పులులు తలుపు మూసి గొళ్లెం పెడుతూ.

పిడుగుపాటుకు లోనైంది సోమాలియా.

“నన్ను తింటారా?” అంటూ గద్గద స్వరంతో అడిగింది మేక.

“నిన్ను తినని జన్మా ఓ జన్మేనా?” అని ఎదురు ప్రశ్నించి నాలుక చప్పరించాడు పులిరాజు.

“మేకలను తినకూడదనేది కదా మీ విధానం?”

“మేం చెప్పేది చేయం. చేసేది చెప్పం. ఎందుకంటే మేం పాలకులం” అన్నాయి పులులు.

సోమాలియాకి పైప్రాణాలు పైనే పోయాయి.

“నీ చివరి కోరికతో మొదలయ్యే విందు మా మొదటి కోరికతో ముగుస్తుంది. రా..డైనింగ్ టేబుల్ పై ఆసీనురాలవు కమ్ము” అన్నాడు పులిరాజు.

“ప్రభువుల లీలలు ప్రజాబాహుళ్యానికి ఓ పట్టాన అర్థంకావు కదా!” అని నిర్వేదంగా నవ్వి, “విందుకని పిల్చి తేరుకోలేనంత షాకునిచ్చారు. ఏదో – మేకాభక్తిగా నేనూ తమరికొక షాకును సమర్పించుకుంటాను” అంది స్థిరచిత్తంతో సోమాలియా.

“మాకా?! నువ్వా?! షాకా?! హహ్హహ్హహ్హా” అని పెద్దపెట్టున నవ్వాయి పులులు.

“నేను మేకను కాదు, పులిని” అంది సోమాలియా.

పులులు షాక్! “ఏంటేంటీ?!?!?!”

“అవును. నేను మేకవన్నె పులిని. ఆకలి కేకల సోమాలియాలో ఆకలితో యుద్ధం చేసీ చేసీ అలిసిపోయి, చావుతప్పి కన్ను లొట్టబోయి, క్రుంగీ, కృశించీ, బక్కచిక్కి మేకసైజుకి పడిపోయిన మేటిపులిని, సాటిపులిని”

 

ఆ మాటలు విన్న పులులకు మొహాలు మాడిపోయాయి.

అనుమాన వ్యాకోచంతో వాటి కళ్ళు రెండితలయ్యాయి.

“నివేదికలను నమ్మే పాలకులకు నిజం రుచించదు కదా! హుఁ ! నిజం తోలులాంటిది. తోలు ఒలిస్తేగాని బోధపడని ఒక నగ్నసత్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తాను. అవధరించండి” అంటూ సోమాలియా తన తోలు తనే ఊడబెరుక్కుని నగ్నంగా నిలబడింది. సమాధిలో కప్పెట్టిన శవాన్ని వారం రోజుల తర్వాత తవ్వి తీస్తే ఎలా ఉంటుందో అలా వుంది. వర్ణించనలవికాని వికృతరూపం.

ఆ బీభత్సరస ప్రధాన సత్యాన్ని దర్శించిన ఒక పులికి కళ్లు పెటిళ్లున పేలిపోయాయి. రెండు పులులు వాంతి చేసుకున్నాయి. మూడు పులులకు జీవితం మీద విరక్తి పుట్టి తలలు బాదుకున్నాయి. పులిరాజు సరేసరి మూర్ఛపోయి ముప్పావుగంటైంది.

“ఆ మేకతోలేదో తీసుకుని అర్జెంటుగా కప్పుకోవే తల్లీ” అంటూ మగపులులు సోమాలియా ముందు మోకరిల్లాయి.

సోమాలియా మేకతోలు కప్పుకుని తన యథాపూర్వ సౌందర్యాన్ని ప్రదర్శించింది.

పులిరాజు మూర్ఛనుంచి తేరుకున్నాక కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. అటు సోమాలియాకు ఇటు తమకు ఉభయతారకంగా వుండే రహస్యతీర్మానం ఒకదానిని ఆమోదించింది. దాని సారాంశం ఏమిటంటే –

“సోమాలియా తక్షణం ఒక సౌందర్యతత్వాన్ని నిర్మించాలి. అది ఎంత క్రౌర్యమోహన కుట్రబంధురంగా వుండాలంటే…. ఆ తత్వానికి సకల మేకజాతులు సమ్మోహితమై పులుల పాలనను ఎడాపెడా కీర్తించాలి. క్రమంగా తమకు తాముగా పులులకు ఆహారంగా మారాలి. ఈ తరహా ఆహారోత్పత్తిలో నిష్పత్తి ప్రకారం సోమాలియాకు బినామీ పేర్లతో ఇళ్ల స్థలాలు, భూములు, వాహనాలు, డబ్బు, రక్షణ అందుతాయి.”

“అవన్నీ సరేగానీ…. కార్యనిర్వహణ కత్తిమీద సామే!” అంది సోమాలియా సాంతం విన్నాక.

“నేల విడిచిన సాము మాత్రం కాదుగా” అన్నాడు పులిరాజు.

“అయితే నాదో చిన్న సూచన”

“చెప్పు”

“మేకల నమ్మకాన్ని కూడగట్టుకోవడం కోసం ప్రభుత్వ వ్యతిరేక శక్తిగా నటించే అవకాశం నాకు యివ్వండి”

“ఓయస్. పొద్దుట లేస్తే నువ్వు మా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యచ్చు. ఆందోళనలు చెయ్యొచ్చు. బస్సులు తగలబెట్టొచ్చు. రాస్తారోకోలు చెయ్యొచ్చు. మా నివాసాలను ముట్టడించవచ్చు. ఏం కావలిస్తే అది చేసుకోవచ్చు. నీ మీద ఈగ వాలనివ్వం. అలా అరెస్టు చేసి ఇలా ఒదిలేస్తాం. కాకపోతే నువ్వు ఎంత పెద్ద ఆందోళన లేవదీస్తావో అంత పెద్ద సంఖ్యలో మేకల్ని మాకు బలివ్వాలి.”

“ష్యూర్ !” అంది సోమాలియా!

‘విజయోస్తు’ అని దీవించాడు పులిరాజు.

ఆవేళ్టినుంచి ఒక అపూర్వ సౌందర్య తత్వాన్ని నిర్మించే పన్లో ఉండిపోయింది సోమాలియా. మొట్టమొదట దాని కన్ను దేశవాళీ మీద పడింది. తన సౌందర్య తత్వాన్ని దానిమీద ప్రయోగిస్తోంది.

దేశవాళీ కూడా తక్కువదేం కాదు. సబాల్ట్రన్ స్టడీస్ లో అందె వేసిన చేయి. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో ‘మాంచి’ లింకులే వున్నాయి. ఉద్యమ నేపథ్యం వుంది. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోయాక సకల సౌకర్యాలు అనుభవిస్తూ అటు రియలెస్టేటునీ యిటు ఫోర్త్ ఎస్టేటునీ ఆశ్రయించి బాగానే సంపాదించింది. కాకపోతే పాత్రికేయ వృత్తి తనకు ఎంత మంచి పేరు తెచ్చిందో మధుపాత్రికేయ ప్రవృత్తి అంత చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ‘మందుకన్నా మగువ మిన్న’ అనే జ్ఞానోదయం కలిగాక దేశవాళీ మనసు సోమాలియా మీద లగ్నమైంది.

కాకపోతే – దేశవాళీకి ఒక అద్భుతమైన డౌన్ లోడెడ్ ఫిలాసఫీ వుంది. దాని సారాంశం ఏంటంటే:

‘నమ్మి మోసపోవడం ఎంత నరకప్రాయమో… అర్థం చేసుకుని అనుభవించడం అంతకు నూరంతలు స్వర్గతుల్యం’. కాకపోతే – దేశవాళీకి అర్థంకాని ‘అన్ సాల్వ్ డ్ మిస్టరీ’లాంటి ఒక ప్రశ్న మనసులో ఉండిపోయింది.

“ఆకలి కేకల సోమాలియా ఇంత అద్భుత సౌందర్యాన్నెలా ప్రభవించింది?”

ఈ ప్రశ్నకు సమాధానం దొరికేంతవరకు సోమాలియాకు సరెండర్ కాకూడదని, ప్రేమను కంట్రోల్లో ఉంచుకోవాలని తనకు తాను ఒక కఠోర శాసనాన్ని లిఖించి జేబులో పెట్టుకు తిరుగుతోంది దేశవాళీ!

 

ఒక హిమసుందర వెన్నెలరేయి!

ఒక పారదర్శకమైన పచ్చని పూపొద.

సోమాలియా ఆకలితో నకనకలాడుతోంది.

దేశవాళీ మోహంతో తుకతుకలాడుతోంది.

తొడిమ తెగిన పుట్టగొడుగులా ఆకాశంలో వేళ్లాడుతున్న చంద్రుణ్ణి చూసి సోమాలియా యిలా పాడ్డం మొదలుపెట్టింది.

“తుమ్ గగన్ కే చంద్రమా హో! మై ధరాకా ధూల్ హూఁ !”

దేశవాళీ తక్కువ తిందా!? తనూ పాడ్డం మొదలెట్టింది.

“నీవేనా నను తలచినది….. నీవేనా నను పిలిచినది”

సోమాలియా పాట ఆపి పరవశంగా చూసింది.

“ఆపావేం సోమాలియా! కోమలమైన నీ గాన మాధురిలో ఈదులాడ కుతూహలపడే నన్ను వారించకు సోమాలియా! ఈ శృంగార స్వామి సన్నిధిలో మన సంగీత విద్యను సార్థకం చేసుకుందాం. రా!” అంది దేశవాళీ.

“నీ లీల పాడెద దేవా…..” అంటూ పాటందుకుంది సోమాలియా.

“ఆహా! ఏమా గానం! ఏమా గాత్రం! ఏమా సౌందర్యం! ఏమా తత్వం!” అంటూ అర్థ నిమీలిత నేత్రి అయింది దేశవాళీ.

“చిక్కావు లేర్రా! చక్కాని ర్రాజా!” అని మీద పడబోయింది సోమాలియా. అంతలోనే కళ్లు తెరిచిన దేశవాళీ, “అసలు…. సౌందర్యం అంటే ఏమిటి?” అంది! అంతే! కథ మళ్లీ మొదటికొచ్చింది.

కురులు సవరించుకున్నట్టు నటిస్తూ తల బాదుకుంది సోమాలియా. ఆన్సర్ చెప్తేగాని వదిలేట్టు లేదు దేశవాళీ. కనుక మాట్లాడక తప్పింది కాదు సోమాలియాకి.

“సౌందర్యం అంటే ఒక అతి పురాతన బానిసత్వం. ఒక బంధింపబడిన స్వేచ్ఛ. ఒక స్వేచ్ఛాపూరిత బానిసత్వం. అవగతమయ్యే ప్రపంచానికి అంధుడివై అగోచర ప్రపంచంలో అర్థాలకోసం అన్వేషిస్తున్నావు. ఉనికిలో ఉన్న అంధత్వాన్ని జయించి…. కళ్లకు ఒక అంధత్వాన్ని కానుకగా యివ్వడమే సౌందర్యం.”

“కాదు” అంది దేశవాళీ.

“మరేమిటి సౌందర్యం అంటే?” అంది సోమాలియా జఠరాగ్ని మీద లాలాజలాన్ని చిమ్మి తాత్కాలికంగా సదరు మంటల్ని ఆర్పేస్తూ.

“చలనం లౌకికం. చలనసూత్రం అలౌకికం! గమనం లౌకికం. గమ్యం పారలౌకికం! కనిపించే దానిని కనిపించనిది నిర్దేశించడమే సౌందర్యం. జీవితాన్ని మాటలుగా, కాలాన్ని గంటలుగా కార్పొరేటీకరించి… జీవిత కాలాన్ని నిముషాల చొప్పున వేలం వేయడమే సౌందర్యం. గంటకో స్త్రీతో, అరగంటకో పురుషుడితో వ్యభిచారాత్మక పాతివ్రత్యాన్ని ప్రదర్శించడం సౌందర్యం. పిడికిట్లో రష్యాని, పిడికెడంత గుండెలో అమెరికాని ప్రతిష్టించినవాడు…. చర్మం నుంచి హృదయాన్ని బహిరంగంగా విడదీసి రహస్యంగా ఉరితీయడమే సౌందర్యం” అంది దేశవాళీ!

“నువ్వు ఎడ్డెం! నేను తెడ్డెం! క్యా కరూ మై?” అంది దేశవాళీ.

“నువ్వు ఉప్పు! నేను నిప్పు. మై క్యా కరూ?” అంది దేశవాళీ.

“నీ రొడ్డకొట్టుడు ఫిలసాఫికల్ పిచ్చివాగుడు ఆపేస్తావా లేదా?”- సోమాలియా!

“నీ గిడసబారిన రొమాంటిక్ ఊకదంపుడు ఆపేస్తావా లేదా?” – దేశవాళీ!

“ప్రాస కుదిరినంత ఈజీ కాదు… నమ్మకాన్ని అమ్మకాన్ని ఓ గాటన కట్టెయ్యడం”

“శ్వాస తీసినంత ఈజీ కాదు పొందడం…. పోగొట్టుకోవడం”

“మన కలయిక… యిక కలయేనా?” అంది సోమాలియా దీనంగా!

“మన ఇరువురం కలవాలంటే…. మన సౌందర్య తత్వాలు ముందుగా కలవాలి. లాస్ట్ అండ్ ఫైనల్…. చిట్ట చివరాఖరిగా అడుగుతున్నాను. లేనిపోని పెంట పెట్టక సౌందర్యం అంటే ఏమిటో చెప్పు” అంది దేశవాళీ.

“సరే చెప్తా విను. నీ పేగులు నీకోసం అలమటించడం సౌందర్యం. నీ గుండె నీ కోసం కొట్టుకోవడం సౌందర్యం. నువ్వు నేనుల నిమ్నోన్నతాలను దాటి నిన్ను నువ్వు చేరుకోవడమే సౌందర్యం. వేయేల… ఒరే పిచ్చి నా మగకొడకా… నీ చర్మం కింద నువ్వు మాత్రమే నివసించడం సౌందర్యం. దట్సాల్” అంటూ తన అసలు సిసలు సౌందర్యతత్వాన్ని ఆవిష్కరించింది సోమాలియా.

అంతే!

అమాంతం దానిని వాటేసుకుంది దేశవాళీ! ప్రేమతో కాదు, భయంతో!

భయానిక్కారణం?

నిజానికి దేశవాళీ చర్మంకింద దేశవాళీ నివసించడం లేదు. అమెరికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, జర్మనీ వంటి రాజ్యాలు నివసిస్తున్నాయి. ఆ సత్యం సోమాలియాకు తెలిసిపోతుందేమోనని దాని భయం.

భయాన్ని కప్పెట్టగలిగిన ఏకైక సాధనం ప్రేమే కదా! అందుకే అమాంతం సోమాలియా పట్ల అన్ కండిషనల్ ప్రేమను ప్రకటించింది దేశవాళీ.

గొంతు కోయించుకోక ముందు ఎదుటివారి పట్ల కలిగే నమ్మకం లాంటిది దేశవాళీ మనసులో కలిగింది. సోమాలియాతో కలిసి నడిచింది. ఆ నమ్మకం పర్యవసానం ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు, సోమాలియా మేకకు కూడా తెలుసు.

దేశవాళీ మేకకు ఎప్పుడు తెలుస్తుందో!

ఏదేమైనా ఒకరినొకరం ఎప్పటికైనా మోసం చేయలేమా అనే సదాశయంతో సదా ముందుకు సాగడమే సౌందర్యం.

శుభం భూయాత్ !

మోహిత

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంత మంచికథని ఇంతకాలం చదవనందుకు బాధగా ఉంది. ఈ రచయితని ఒక్కమారైనా కలిసానో లేదో గుర్తులేదు. ఆయన ఉండగా ఈ కథ చదివివుంటే వెంటనే బయలుదేరి వెళ్లి కలుసుకుని మనసు కలబోసుకునేవాడిని. సమస్త మానవాళి గురించీ స్పందించే విశ్వమానవ వేదన ఈయనలో ఉంది. ఎక్కడైనా బాధితుల పక్షాన మాటలాడిన తెరేష్ బాబు గారి ఈ కథని పరిచయం చేస్తూ అమ్మా మోహిత గారూ -ఆంధ్రలో ప్రభవించిన తెలంగాణంగా పరిచయం చేయటం నాకు నచ్చలేదు. బాధితులకి తెలంగాణా ఒక పరిష్కారమేమోనన్న సంవేదనలో ఆయన రాసారు. వారి అనేక కార్యాలలో అది ఒకటి. ఆలోచించండి. కోపగించుకోకండమ్మా..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు