సుస్వరాల వీణ నిదురించిన వేళా…

వీణావిద్వన్మణీ, ప్రయోగశీలీ తుమ్మల పద్మినికి నివాళి  

“రాగం అంటే రంగు అనీ, నాదం అనీ కూడా అర్ధం. శ్రవ్య రాగం అంటే నాదం. దృశ్య రాగం అంటే రంగు.

దృశ్య సంగీతం అంటే రంగుల రససృష్టి” అంటారు సంజీవ దేవ్. ఆ రంగుల రససృష్టికి వీణానాదం ప్రేరకం అయితే అది సృజనాత్మక కళారంగాలలో ఓ వినూత్న ప్రయోగం.

“సుషిర వాద్యానికీ, తత వాద్యానికీ పొత్తు కుదరనే కుదరదు.  ఒక వాద్యంలో నాద నైరంతర్యం ఉంటే మరొక వాద్యంలో నాదం క్షణాల్లో ఆగిపోతుంది” అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య. అలాంటి నాదస్వర, వీణానాదాల జుగల్ బందీ జరిగితే అది సంగీత రంగాన ఓ అరుదైన ప్రయోగం.

విభిన్న సంగీత వాయిద్యాల హృదయాలను మహిళలొక్కరే తమ సున్నితమైన మునివేళ్ళతో ఒకింత సుతారంగా, మరింత గంభీరంగా మీటుతూ స్వర తరంగాలను సృజిస్తూ ఉంటే అది ఒక విలక్షణ ప్రయోగం. బహుశా సంగీత రంగాన అదొక స్త్రీ సమానత్వ కాంక్షాప్రకటనేమో కూడా!

ఈ విలక్షణ, విభిన్న ప్రయోగాలు చేసిన వీణావిద్వన్మణీ, ప్రయోగశీలీ తుమ్మల పద్మిని జీవనస్వరం ఫిబ్రవరి 19 న ఉదయం 9:40 కి మూగబోయింది. వారింటి తోడూనీడల్లో వెలుగు వెళ్ళిపోయింది. తన నేత్రాలను కనుచూపు కరవైన వారికీ, దేహాన్ని వైద్య విద్యార్ధులకూ, సంగీతాన్ని భావితరాలకూ ఇమ్మని చెప్పి ఆవలిగట్టుకు వెళ్లిపోయింది.

***

అందరికీ సుపరిచితమైన అభ్యుదయ సాహితీవేత్తల  కుటుంబంలో పద్మిని జన్మించారు. తల్లిదండ్రులు తుమ్మల కృష్ణాబాయి, తుమ్మల వేణుగోపాల రావు. భర్త అత్తలూరి నరసింహారావు తెలుగు అధ్యాపకుడూ, సాహితీ విమర్శకుడు.

తన ఎనిమిదోఏటే వీణావాయిద్య సాధన మొదలుపెట్టిన పద్మిని అనతికాలంలోనే ఆ రంగంలో  ఆరితేరారు. ‘విపంచివీణ’ సృష్టికర్త రామవరపు విజయలక్ష్మి గారి వద్ద ఆమె తొలుత గాత్రాన్నీ, తరువాత వీణనూ నేర్చుకున్నారు. కర్నాటక సంగీతంలో సృజనాత్మక శైలిని ఒడిసిపట్టడానికి మరో ఉద్దండుడు తిరుపతి రామానుజ సూరి గారి వద్ద మనోధర్మ సంగీత మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత తన గురువు రామానుజ సూరి గారే ఆకాశవాణిలో సృజించిన లలిత సంగీత కార్యక్రమాలెన్నింటికో వీణా సహకారం అందించే స్థాయికి పద్మిని ఎదిగారు. ఆకాశవాణి, దూరదర్శన్లలో  ‘ఎ – గ్రేడ్’ కళాకారిణిగా ఎన్నో కార్యక్రమాలను చేశారు.

***

పద్మిని చిన్ననాటి నుంచి విలక్షణమే. డాక్టర్ యగళ్ళ పద్మా రామకృష్ణ గారు ‘నాట్యసుధ విశేష సంచిక’ (1986)లో చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ఈ విషయమే చెబుతుంది. అప్పటికి పదిహేను పదహారేళ్ళ  క్రితం మాట ఇది. ఓనాడు ఉదయాన్నే విశాఖపట్నంలోని కృష్ణాబాయి గారి ఇంటికి పద్మారామకృష్ణ దంపతులు నడిచి వెళ్తున్నారట. ఓ పసిగొంతు నుంచి ‘పరాఙఖ మేలనమ్మా’ అన్న శ్రావ్యాలాపన వారి చెవిన పడింది. పాడుతున్నది పద్మినే అని గ్రహించిన దంపతులిద్దరి మోములపై  చిరునవ్వులు వెలిసాయి. కృష్ణాబాయి గారిని ఆరాతీస్తే వారికి తెలిసిందిదీ- పద్మిని తనమీద కోప్పడ్డ తల్లి  మీద అలిగి ఆ ఆలాపన అందుకున్నదట!

ఈ విలక్షణత పద్మిని జీవితాంతం కొనసాగిందని సంగీతాభిమానులూ, ఆమెను ఎరిగిన వారూ   అంటారు. 1995లో వీణ-నాదస్వరాల జుగల్బందీ, 1996లో కళాకారిణుల వీణ, వయొలిన్, మృదంగ వాయిద్యాల కచేరీ, 1997 లో ‘తిల్లానా నైట్’ వంటి ఎన్నో ఆమె విలక్షణతకు కొన్ని ఉదాహరణలుగా నిలుస్తాయని అంటారు. ఆమె వీణానాదంలో  ప్రయోగ శీలం కనిపిస్తుందన్నది  సంగీత విమర్శకుల పరిశీలన. “ పద్మిని గారు తక్కిన చాలామంది వైణికులలాగా రొటీన్ గా వాయిస్తున్నట్లనిపించదు. మంచి ప్రయోగాలను ఆమె కొన్నింటినైనా చేసింది.” అంటూ ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య ఆమె 1997 లో చేసిన ‘తిల్లానా నైట్’ కార్యక్రమాన్ని ఉదహరిస్తారు. ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి వేదికగా విశాఖపట్నంలో నిర్వహించిన ఈ విభావరిలో పద్మిని ఏకబిగిన నాలుగు గంటల పాటు తిల్లానాలను వాయించి శ్రోతలను తన్మయుల్ని చేశారు.

ఇక 1997 డిసెంబర్ 5 న జరిగిన సంగీత చిత్ర సృజనల వేడుకయితే చాలామందినే ఆకట్టుకుంది. ఈ శ్రవ్య, దృశ్య రాగాల హరివిల్లు ఆవిష్కృతమయింది పుస్తక మహోత్సవ సందర్భంలో కావటం మరింత ఆసక్తికరమైన విషయం. వీణపై పద్మిని, మృదంగంపై వి.వి.రమణమూర్తి శ్రావ్యరాగ రచన చేస్తుండగా వాటినుంచి ప్రేరణ పొందుతూ అబ్బూరి గోపాలకృష్ణ, వెంకట్ దృశ్య సంగీతాన్ని కాన్వాసుపై ఆవిష్కరించారు. ఆ చల్లని శీతాకాల సాయంత్రం పద్మిని గారి రాగ ప్రవాహం కొనసాగుతుండగా చిత్రకారులిద్దరూ వేర్వేరు కాన్వాసులపై భిన్న ఆకృతులకు ప్రాణం పోశారు. నాట్య శాస్త్రం నిర్వచించిన రాగ, వర్ణ సంకేతానికి భిన్నంగా, సంగీతాలాపనలు తమలో కలిగించిన సద్యోజనిత ప్రేరణకు అనుగుణంగా ఈ చిత్రకారులు వర్ణాలను ఒలికించారు. ఒకరు రూపానికీ, ఒకరు నైరూప్యాకీ జన్మనిచ్చారు.

పద్మిని అన్నమయ్య కీర్తనలను, దేశభక్తి గీతాలను కూడా వీణపై పలికించారు. వీటిలో దేశభక్తి గీతాలు ఆకాశవాణి (1998), దూరదర్శన్(2001) లలో దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ప్రసారమయ్యాయి. ఆ తరువాత అవి సీడీలుగా వెలువడ్డాయి కూడా.

దేశ, విదేశాల్లో పద్మిని ఎన్నో కచేరీలు నిర్వహించారు. కెనడాలో, అమెరికాలో ఎన్నో చోట్ల కచేరీలు ఇచ్చారు. నెల్లూరు ‘కళారాధన’ సంస్థ ఈమెకు 1985లో ‘వైణిక విద్వన్మణి’ బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ 1982-83లో ఈమెను ప్రతిభావంతురాలైన యువ సంగీతకళాకారిణిగా గుర్తించింది. ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ 1998లో ఈమెకు ప్యానల్ ఆర్టిస్టుగా సముచిత స్థానమిచ్చి గౌరవించింది.

సంగీతం ఐచ్ఛికాంశంగా పద్మిని బీ.ఏ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో 1991 లో సంగీతంలో ఎం.ఏ(గాత్రం) చేశారు. గాంధర్వ మహావిద్యాలయలో వీణలో ‘అలంకార’ ను 1995 లో సాధించారు. అన్నమయ్య కీర్తనల్లో తత్వచింతన అనే అంశంపై తులనాత్మక విశ్లేషణ చేసి అబ్బూరి గోపాలకృష్ణ గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రా యూనివర్సిటీనుంచి 1998లో డాక్టరేటును పొందారు. వీటన్నింటికంటే ముందు 1978 లోనే ఆమె ఎం.ఏ ( ఇంగ్లిష్) చేశారు.  పద్మినికి సాహిత్యాభిలాష కూడా ఎక్కువే. పిల్లలంటే ప్రేమ. సంగీతంలో మునిగిపోయికూడా ఆ అభినివేశాన్ని కాపాడుకున్నారు. రష్యన్ రచయిత యూరి ఒలేష రచించిన పిల్లల నవల ‘The Three Fat Men’ ను  ‘ముగ్గురు బొండాంగాళ్ళు’ పేరుతో ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. ప్రముఖ భారతీయాంగ్ల రచయిత ఆర్కే నారాయణ్ రచించిన ‘The Axe’ను తెలుగులో ‘గొడ్డలి’గా అనువాదం చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు అధ్యయనం కోసం వచ్చిన అమెరికన్ యువతులకు 1979లో సంగీతం నేర్పారు. పద్మిని కొన్నాళ్ళు విశాఖ మహిళా కళాశాలలో సంగీత అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు. తన ఇంటివద్ద చివరి వరకూ సంగీత పాఠాలు బోధిస్తూనే ఉన్నారు. వందలాది మంది ఆమెవద్ద వీణావాదనం నేర్చుకున్నారు. గుర్తింపు పొందారు. పద్మిని అంతిమదినాన ఆమె ఇంటి వీణమెట్ల మీద గుమిగూడిన వారందరి పరిస్థితి రసపట్టుకు చేరిన కచేరీలో స్వరతంత్రులు తెగిన వీణలా ఉంది. కాసింత దూరాన ఉన్న నీలి సముద్రపు తరగల్లో ఆమె వీణానిక్వణం శాశ్వతంగా వారికి వినిపించే దారి ఉందని చెప్పగల పెద్దదిక్కు గర్భశోకంలో ఉంది.

*

 

Avatar

వాసు

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • పద్మిని గారి గురించి చాలా విషయాలు తెలియచేసినందుకు కృతజ్ఞతలు సర్

 • Padmini also translated some children’s stories for Tulika publishers, as she is very fond of children. She has mounds of children’s books at home which she presented to various groups of children. She also translated Bangalore Nagaratnamma’s story for HBT. She assisted Attaluri in translating “ Tuesdays with Morie” and Amul Kurien’s biography .

 • Great to know about our guru Smt T. Padmini Garu. Apart from music she is a wonderful human being and tried to extend a helping hand towards needy.

 • పద్మినిగారి గురించి ..
  గుండె తడిపేశారు. ఒక గొప్ప కళాకారిని కంటే ముందు ఒక మంచి మనిషిని కోల్పోయాము. ఆమెలో భేషజాలు నాకెప్పుడూ కనిపించలేదు. సాహిత్యం, సంగీతం జమిలిగా ఆమెలో జీర్ణించుకు పోయాయి . బాలసరస్వతి , సాలూరి పాటలంటే పద్మినిగారికి ఎంతిష్టమో! ఆమె స్వరంలో ఎన్నో మధురమైన రసగుళికలు వినే అదృష్టం నాకు కలిగింది. ధన్యోస్మి పద్మిని గారూ!

 • చాలా హృదయాన్ని స్పృశించేలా పద్మిని వ్యక్తిత్వం కళ్ళకు కట్టెలా రాశారు.

 • కూతురు పద్మిని గారిని పోగొట్టుకున్న గర్భశోకంలో ఉన్న కృష్ణక్కను ( విరసం కృష్ణా బాయి గారిని ) కానీ, తన జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న శోకంలో ఉన్న డా. అత్తలూరి నరసింహ రావు గారిని కానీ ( సోదర ప్రేమతో నోర్షిం అంటూ త్రిపుర గారు పిలుచుకునే ) అత్తలూరి గారిని పలకరించ లేని అశక్తతలో ఉన్న మాలాంటి వాళ్లకు పద్మిని గారి వ్యక్తిత్వం కళ్ళకు కట్టెలా చేసినందుకు కృతజ్ఞతలు వాసు గారూ.

  గజయీతరాలు కధకుడు గొరుసన్న అన్నట్లు ఆమెలో భేషజాలు మాకెప్పుడూ కనిపించలేదు ( ఫోనులో జరిపిన సంభాషణలలోనే అయినా ).

  విరసం మార్గం ఎంచుకున్న అమ్మ, వామపక్షాల పంధాలలో తనకు లోపాలనిపించే వాటిని నిష్కర్షగా ప్రశ్నించే అత్తలూరి గార్ల మధ్య పద్మిని గారు సాధించిన సమ్యవనం గురించి కూడా పెద్దలెవరైనా ప్రస్థావిస్తారని ఆశిస్తున్నాను.

 • పాల కురియన్, మోరీతో మంగళవారాలు పుస్తకాల గురించి తెలిసికూడా ఇందులో పొందుపరచడం మర్చిపోయాను.

 • తక్కువ పరిచయ మయినా గానీ పద్మిని చాలా స్నేహశీలి అని తెలుసు. నళిని ద్వారా కొన్ని విన్నాం. ఇప్పుడు ఈ వ్యాసం ద్వారా తన గురించి చాలా విషయాలు తెలిసాయి. Multiple talented person.

 • Padmini also sang for Vizag JNM during the late 70s and early 80s. Sri Sri ‘s “ Kontha Mandi kurravallu”, Cherabanda raju’s “Kondalu pagalesinam”, Panigrahi’s “Ennalli kapuralu” and Vangapandu’s “Bhoomi bhagotam” and two “Samvadams “were rendered explicitly by her, along with other folk songs.

 • తుమ్మల పద్మిని గారి గురించి నళిని గారు అందిస్తున్న మరిన్ని విశేషాలు :

  1970 దశాబ్ధం చివర, 1980 ప్రారంభం లో విశాఖ జన నాట్య మండలి కోసం ఇతర జానపద గీతాలతో పాటు శ్రీశ్రీ గారి ” కొంతమంది కుర్రాళ్లు పుట్టకతో వృద్ధులు ” గీతాన్ని; విప్లవ కవి చెరబండరాజు గారి ” కొండలు పగలేసినం”; విప్లవ ప్రజాకవి సుబ్బారావు పాణిగ్రాహి గారి ” ఎన్నాళ్లీ కాపురాలు “; ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, జననాట్యమండలి అధ్యక్షుడు వంగపండు ప్రసాదరావు గారి భూమి భాగోతం* మరో రెండు సంవాదాలు పద్మిని పాడారు.

  ( గ్రామీణ జీవితాన్ని అతలాకుతలం చేసిన దుర్మార్గమైన మునసబు కరణాల వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన ఆయుధమే వంగపండు గారి ‘భూమి బాగోతం’. ఎన్టీరామారావు ఆ వ్యవస్థనే రద్దుచేసేందుకు ‘భూమి బాగోతం’ కారణమైందంటే అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ~ గంటేడ గౌరునాయుడు )

 • గొరుసన్నా!

  విశాఖ లోని క్రిష్ణక్కకు ( విరసం కృష్ణాబాయి అక్కకు ) ఫోను చేసి తడబడుతూ నాలుగు తడిపొడి మాటలు మాట్లాడాను ( గొరుసన్న వాళ్ల అమ్మగారు పోయినప్పడు మీరు రాసిన ముత్యాలకోవ అక్షరాల ఉత్తరం మాకెప్పుడూ గుర్తుకొస్తుందమ్మా, కాని మీకిప్పుడు అలాంటి ఉత్తరం ఎవరు రాస్తారూ?! అంటూ ).

  తనూ ఓ బిడ్డ ( పద్మిని గారి ) తల్లే అని గుర్తుకు తెస్తూ ఉద్వేగంతో మాట్లాడారు క్రిష్ణక్క. అనారోగ్యంతో ఎంతో ధైర్గంగా పోరాడిన పద్మినిని ఓ డాక్టర్ గారు తనో చాంపియన్ అని అన్నారని అంటూ విలపించారు.

  అన్నింటికన్నా అత్తలూరి గారు ( త్రిపుర గారి డా. అత్తలూరి నరసింహరావు గారు ) కనబరిచిన నిబ్బరమే తనకు కొంత ఊరట కలిగించిందని అన్నారు. తిరుపతి మావో అని పిలువబడ్డ విరసం త్రిపురనేని మధుసూధన రావు, తన మేనల్లుడు త్రిపురనేని శ్రీనివాస్ ( నిలువెల్లా సాహిత్యం, సాహసం మూర్తీభవించిన వ్యక్తి , రహస్యోద్యమ కవితల కవి ) లను పోగొట్టుకున్నప్పుడు కలిగిన వ్యధను కూడా తనలోనే దాచుకున్న అత్తలూరిని తలుచుకుంటూ బాధపడ్డారు క్రిష్ణక్క.

  తన కడుపుకోతను ఎవరూ తీర్చలేరు కాని ఇంత ఆలస్యంగా నైనా, ఇప్పుడైనా తనను పలకరించమన్న పర్స్పెక్టివ్ పబ్లికేషన్స్ ఆర్కె అన్నగారి గురించి క్రిష్ణక్కకు చెప్పా.

  పద్మినికి వాళ్ల నాన్నగారు తుమ్మల వేణుగోపాలరావు తోటి ఉన్న అనుబంధాన్ని కూడా రాయాలి అమ్మా అన్నా ( TummalaVenugopala Rao former principal of Andhra University College of Engineering who suffered from Alzheimer’s dementia during the his last six years of life ) . మరెందరో విశాఖ ప్రముఖులు ( రావి శాస్త్రి, చలసాని ప్రసాద్ ) తనపై కలిగించిన ప్రభావం గురించి కూడా రాయాలి అమ్మా అన్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు