అద్దం లో చూసుకుంటూ నడుం పక్కగా రక్తం ఊరుతున్న గాయానికి పసుపు అద్దుకుంది.”ఈ సెంపల మీదై తగ్గితే గానీ డాన్సుకు పోటానికి యాడ కుదిరిద్ది. పోనీలే, ఈ వారమంతా తిని పొణుకో” తనకే చెప్పుకుంది. చాలా సేపు రాత్రి ఏడుస్తూ ఎప్పటికో నిద్ర పోవడం వల్ల, తలంతా దిమ్ముగా ఉంది. ఒంట్లో ఓపికంతా ఎవరో చేద బకెటేసి తోడినట్టు హరించుకు పోయింది. ఏదైనా వేడిగా తిని నిద్ర పోవాలనుంది. కానీ రాత్రి ఆ ఎదవలు చేసిన రచ్చ గుర్తొస్తే నిద్ర కాదు, రక్తం మరిగి పోతోంది. ఆళ్ళని చంపాలనుంది.కానీ ఎవురున్నారు ఆ ఎదవల్ని కనీసం నాలుగు తన్నిపిచ్చే దానికి?”మ్మా, అన్నం తింటా? అన్నీ రెడీ గా ఉన్నై. సీతాకాంతమ్మ కూరలిచ్చి పోయింది. శాపల పులుసు . కాస్త తిని పొణుకో”సాంబయ్య మాటలు వింటూనే మొహం చిట్లించింది
“యోవ్, ఆడ బెట్టు. నాకు జెరమొచ్చినట్టుంది ” అంది
“అయ్యో, పదమ్మా డాట్రు కాడికి పోదాం ” ఆందోళన పడ్డాడు
“అక్కర్లేదు లే నువ్వు పో సావీ ,నా మతేమీ బాగలా, పో నువ్వు” విసుగ్గా అరిచింది
సాంబయ్య నెమ్మదిగా వరండాలోకి వచ్చాడు.
“కొట్టెప్పుడు తీస్తా?” ఎవరో సైకిల్ మీద నుంచి ఒక కాలు కింద బెట్టి అడుగుతున్నాడు
“మాయిటేల నాలిగింటికి తీస్తా” జవాబు చెప్పి బీడీ ముట్టించి దిగులు గా కొబ్బరి చెట్టు కింద మంచం మీద కూచున్నాడు. తనని దగ్గరకే చేరనీదు .ఏమీ చెప్పదు
తన సంపాదన మీద బతకడానికి ఇష్టపడదు. ఇంకో పనా ? చేతకాదాయె
రికార్డింగ్ డాన్స్ కి వెళ్ళినపుడు ఇట్టా జరగడం అరుదేమీ కాదు . తన జీవితం ఇంతే అని అర్థం చేసుకున్న సీత వాటిని ఏ భావమూ లేకుండా అంగీకరించింది . కాదూ కూడదు , నేను రాను లాంటి తిరస్కారాలు పని చేయవని తెలుసు . కొంతమంది డాన్సర్లకు ఉన్నట్టు తనకు అండ లేదు . ఎవరన్నా చెయ్యేస్తే ఆ చెయ్యి విరిచేసే మగాడు లేడు , ఒంటికాలు తో బడ్డీ కొట్టు నడిపే మారుటి తండ్రి తప్ప
ఎవరితోనైనా స్నేహంగా ఉండి ఆ అండ సంపాదించుకోవాలన్నా, వాడు రమ్మన్నపుడల్లా పోవాలి. అందుకే వీలైనంత లౌక్యంగా నడుపుకొస్తుంది బండి. గ్రూప్ లో వెళ్లడం, డాన్స్ అయిపోగానే ఎవరూ చూడకుండా వెనక ఉండి పోవడం, ఫోన్ ఆఫ్ చేసి ఉంచడం లాంటి చిన్న చిన్న చిట్కాలతో. కాంట్రాక్టర్ ఒప్పుకోడు గా
అందమైన పిల్ల కావాలనగానే “సీతని పంపిత్తాగా” అని మాటిస్తాడు.
సాంబయ్య తన తండ్రి కాడని సీతకి బానే తెలుసు. తను పుట్టకముందే తండ్రి వదిలేసి పోయాడు తల్లిని. తనకి ఏడేళ్ళొచ్చాక అమ్మ ఇతన్ని తీసుకొచ్చింది.
నాన్న అని ఎప్పుడూ పిలవలేదు.ఇష్టం లేదు. లారీ డ్రైవర్ కాబట్టి వారాల తరబడి డ్యూటీ లో ఉండటం వల్ల ఇంట్లో తక్కువే ఉండేవాడు. అదొకటి నచ్చింది
ఈ మనిషికి యాక్సిడెంట్ లో కాలు పోయాక, అమ్మ ఇంట్లో ఉండాల్సి రావడంతో రికార్డింగ్ డాన్సులకు పోవడం ఆపేసింది. తనకి పధ్నాలుగు రాగానే “నువ్వే నడపాల ఇంగ. ఏరే దారి లేదు” అని చెప్పేసింది
చదువు పెద్దగా ఒంటబట్టక పోయినా, రికార్డింగ్ డాన్సులు మాత్రం చెయ్యాలని లేదు. అసలు ఎవరైనా పెళ్ళి చేసుకుంటే, ఇంత వండి పెడుతూ అందరు ఆడవాళ్లలాగా బతకాలని ఉండేది
కానీ అందులోకే దిగాల్సి వచ్చింది
పన్నెండేళ్ళుగా చేస్తూనే ఉంది డాన్సులు. అయినా సరే, సరైన సంపాదనే లేదు. అమ్మ పోయాక ఈయనతో కల్సి ఉండాల్సి వచ్చింది. ఈయన తనకేమవుతాడో తెలీదు. దగ్గరగా అనిపించడు. కాసేపు ఏదైనా చెప్పుకోవాలనిపించదు
కలలొస్తాయి, తను ప్రభల మీద డాన్సు చేస్తుంటే ఎవరో చూసి “ఇంక ఇవన్నీ చెయ్యమాక. మనం పెళ్ళి చేసుకుందాం. నీకిష్టమేనా?” అని అడిగినట్టు, తను ఒప్పుకున్నట్టూ. ఈ వూరు నుంచి పోయి, ఏ ఇజీవాడలోనో బందరు కాలవొడ్డున, కట్ట మీద సిన్న ఇంట్లో కాపరం పెట్టినట్టూ, పిల్లలూ.. బడీ
తెప్పరిల్లింది
రాత్రి ఒక్కడే అని సెప్పి, తీరా పొయినాక నలుగురొచ్చారు . ముగ్గురు ఎదవలు నానా హింసలూ పెట్టారు. “వామ్మో, ఒద్దయ్యో” అని ఏడిస్తే నోట్లో విస్కీ పోశారు.నలుగురిలో ఒకడు దయదల్చి, “ఒరే, పోన్లేరా పాపం , కష్టం రా ఆ పిల్లకి, నాకొద్దు ” అని సిగరెట్ ముట్టిచ్చి బయటికి పోయి నిల్చుకున్నాడు
సదూకున్న ముండల్లాగే ఉన్నారు ఎదవలందరూ
“ఏందే? మరీ ఇయాలే మొదటి సారన్నట్టు ఏసాలేస్తాన్నావ్?” అన్నాడొకడు. చాచి మొహం మీద తన్నాలనిపిచ్చింది.
మొహమంతా రక్కులు, గాట్లు, పెదాలు సిట్లి పోయినై
తన మీద తనకే జాలితో కళ్ళలో నీళ్ళొచ్చాయి
ఆ బయటికి పోయి నిల్చున్నోడే తెల్లారు జామున సందు మొగదల దింపాడు. మళ్ళా ఎదవ సలహా. “ఏరే ఏదైనా పని చూసుకోవచ్చు గా? ఈ పనెందుకు” అంట
ముండ నాయాలు. “నువ్విత్తావా పని?” అనడిగింది
జవాబు సెప్పలా! ఏం జెపుతాడు
“నా పేరు రాంబాబు ” అన్నాడు
“అయితే ఏందయ్యా? పో ఇంక. దింపినావు గద. మళ్ళా యాణ్ణో కలుస్తావు లే పో” అనేసి తూలుతూ ఇంటి కాడికి వొచ్చినాక, తన పక్క నుంచే స్లో గా బండి తీస్కపోతా నవ్వు మొహం పెట్టాడు
సంపాలనిపించింది.
ఒళ్ళంతా నొప్పులు. బలవంతంగా మింగించిన విస్కీ కి తోడు నిద్ర మాత్తర ఒకటేసుకోని పొణుకుంటే, ఇదిగో ఈడకి తెల్లారింది
సాంబయ్య కాస్త అక్కరతో ఏదైనా అడిగినా సెప్పాలనిపించదు.
ఎవరి మీదనో కోపంగా ఉంటది. ఒక్కతే ఉన్నపుడు ఊరికే ఏడుపొస్తది
“నువ్వు డాన్సులు జెయ్యమాక. నీకింత తిండి నేను పెట్టి సూస్కోలేనా?” అని ఎవురైనా అడిగితే బాగుండని ఉంటది. అట్టా అడిగినాక హాయిగా తిని నిద్ర పోవాలని ఉంటది
సాంబయ్య అట్టా అడగటం తనకిష్టం లేదు. ఆ మనిషి తన మనిషి గాదు
##############
ఫోన్ మోగింది. ఉలిక్కి పడి లేచి మత్తు కళ్ళతోనే తీసింది
“మాయ్, నేను”
“నేనంటే? నీకు పేర్లేదా?” విసుక్కుంది
“రాంబాబుని”
“ఏ ఊరి రాంబాబయ్యా ? ఏం గావాల?”
“అదే, నిన్న ఇంటికాడ దింపా గదా? నీతో మాట్టాడాల”
“డాన్సుందా యాడైనా? ఇయాలా రేపూ రాను . తర్వాత పెట్టుకోండి ఏదైనా ఉంటే”
“కాదు కాదు, డాన్సు కాదు, మాట్టాడాల”
ఫోన్ స్విచాఫ్ చేసి అటు తిరిగి పడుకుంది
డాన్స్ కాదంట, మాట్టాడాలంట. ఎదవ సొల్లు కబుర్లు ఇనేదానికంటే ఆ మూలన బట్టల మూట పడుంది. ఉతుక్కుంటే మంచిది
ఇక పడుకోలేక లేచింది. స్నానం చేసి కాఫీ తాగితే బాగుంది
తనతో పాటే డాన్స్ చేసే పుష్పలీలకి ఫోన్ చేసి కబుర్లు చెప్పింది
కొన్ని బట్టలు ఉతికింది. “ఎవడో ఆ రాంబాబు ?” అనుకుంది ఉతుకుతూ
మధ్యాహ్నం కాంట్రాక్టర్ ఫోన్ చేశాడు
“మాయ్ సీతా…పార్టీ ఏదో ఉందంట పోవాల నువ్వు”
“ఇదిగో రామకిష్ణా, పార్టీలు గీర్టీలకి పిలవమాకండి.తిరణాల ఏదైనా ఉంటే సెప్పు. సాలు. మొన్న చానా గోలయ్యింది. ఇంకా లేవలా నేను. ”
అటుపక్క ఒక్క క్షణం నిశ్శబ్దం
“ఏందీ? ఏసాలెయ్యమాక. కాంట్రాక్టు పెకారం నేను రమ్మంటే రావాల. ఫోగ్రాం ఏదైనా పోవాల.
పిలిస్తే రాటానికి శానామందే ఉన్నారు. నువ్వే కావాలంట ఆళ్లకి
“నాకు ఒంటో బాగలేదు. వారమన్నా టయం గావాల?”
“యా? ఏ మాయరోగం నీకు?”
“మొన్న నువ్వు పంపిత్తేనే గా పొయ్యాను. పార్టీ అన్నారు గానీ అక్కడేం లేదు. ఒక్కడు గూడ కాదు, ముగ్గురు.. . నరకం సూపిచ్చారు” రాంబాబు ని తీసేసి చెప్పింది
“అయితే?”
“అయితే ఏంది అయితే? నాకు బాగలేదు. ఎవురినైనా పంపిచ్చు”
“ఇదిగో, ఇట్టా సుకుమారం కబుర్లు సెప్పబాక. ఇందులోకి దిగినప్పుడే ఇట్టాంటియ్యన్నీ ఉంటయ్యని తెలీదా? నా కాడ ఇయ్యన్నీ కుదరవ్. సాయంత్రం బండి పంపిత్తా, రెడీ గా ఉండు” ఫోన్ కట్టయింది. ఐదు నిమిషాలు అలాగే కూచుంది
మౌనంగా లేచి చెంకీలు కుట్టిన ఎర్ర చీర తీసింది
“యాడికమ్మా?” సాంబయ్య అడుగుతుంటే గుండెలో ఏదో గుచ్చుకున్నట్టయింది
“సావటానికి పోతన్నా. నువ్వు పొయ్యి కొట్లో కూసో”
సాంబయ్య ఒక్క నిమిషం ఆగి అన్నాడు “నువ్వు ఇయ్యన్నీ సెయ్యొద్దని నీకు ఎప్పుడనగా సెప్పాను? నువ్వు ఇంట్లో కూసో, బంగారంగా సూసుకుంటా”
“సూసుకుంటావా? ఎన్నాళ్ళు సూస్తా?” మాచింగ్ గాజులు పెట్లో సర్దుతూ అంది చిరాగ్గా
“నేను ఎన్నాళ్లుంటే అన్నాళ్ళు” బలహీనంగా ధ్వనించింది సాంబయ్య గొంతు
నవ్వింది సీత
“సర్లే పా. ఇయ్యన్నీ జరిగేయి కాదు లే”
####################రాంబాబు ని నమ్మడానికి సీత ఆర్నెల్లు తీసుకుంది . ఆర్నెల్లూ డాన్సులకు పోతూనే ఉంది”ఇదిగో మా ఇంటో ఒప్పుకోరమ్మాయ్ . అది తెలిసిందే. వాళ్లతో నాకనవసరం.మనం పెళ్ళి జేసుకున్నాక ఇజీవాడలోనే ఉందాం నీ కోరిక ప్రెకారమే.ఏం బయంలా, నాకు గవర్నమెంటుజ్జోగం . పెళ్ళి రిజిస్టర్ చేపిస్తా. నీకు బయం లేకుండా ఉంటది” రాంబాబు చెప్తుంటే కలో నిజమో తెలీట్లేదు సీతకిప్రేమగా అతని భుజం మీద తల వాల్చాలనో,దగ్గరికి జరిగి కూచోవాలనో అనిపించట్లేదు. నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయింది.
###################
“రాంబాబనీ, పెళ్ళి చేసుకుంటున్నా. కలెక్టరాఫీసులో రికార్డ్ అసిస్టెంట్ పని. బట్టలు ఆరేసి చేతులు తుడుచుకుంది
సాంబయ్య వెంటనే మాట్లాడలేక పోయాడు. గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఆగిపోయాడు
వెంటనే తేరుకుని “అట్టాగామ్మా?”అన్నాడు. పైకి చూసి దణ్ణం పెట్టుకుని కొట్లో అటేపు తిరిగి కూచుంటే దుఃఖం తెరలు తెరలు గా వచ్చింది
ఏ నాడు తనని నానా అని పిలవలేదు. అయినా ఇద్దరూ ఆ ఇంట్లో ఇరవై యేళ్ళు గా కలిసున్నారు. పెళ్ళి తర్వాత మొగుడితో వెళ్ళి పోతుంది. ఇది పుట్టిల్లు కింద లెక్క గాదు ఆ పిల్లకి. తిరిగి చూడదు. తనొక్కడే ఈ గూట్లో గుడ్డి దీపంలా మిగిలిపోతాడు
రాంబాబుతో గుంటూరు కొత్త పేట కి పోయి పెళ్ళి చీర, పెళ్ళి తర్వాత రోజువారీ చీరెలు కొనుక్కుంది.
ఇప్పుడున్న చీరలేవీ తనతో తీసుకోపోగూడదని నిర్ణయం
ఈ చీరెలన్నీ బోలెడన్ని హింస రచనల్ని చూశాయి. అవన్నీ తనతో ఉండటానికి వీల్లేదు
ఎక్స్ ప్రెస్ బస్సెక్కి ఇల్లు చేరే సరికి తొమ్మిదైంది. ఇంటి ముందు ఆటో దిగి చూస్తే కరెంట్ లేదు.
“నువ్వీణ్ణే ఉండు.నేను పోయి లాంతరు ముట్టిచ్చి తెస్తా. జాగర్త. ఈడ బురదగా ఉంది” రాంబాబుని చెట్టుకింద నిల్చోబెట్టి లోపలికి వెళ్ళింది
పక్క సందులోంచి మాటలు వినిపిస్తున్నాయి.
సాంబయ్య!! ఫోన్లో
చప్పున గుర్తొచ్చింది. తను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళింది గుంటూరు
ఎవరితో మాట్లాడుతున్నాడు? నిశ్శబ్దంగా కిటికీ దగ్గర నిలబడింది
“ఆ పిల్ల మొహాన ఇంత నవ్వు ఏనాడూ జూళ్ళా నేను. పెళ్ళి జేస్తానని కూడా అనుకోలా నేను. సంతోసంగా పెళ్ళి చేసుకుంటంది. ఇంగ డాన్సులు జెయ్యదు.. అంటే చెయ్యదనే అర్దం….” ఆగాడు
అవతల ఉన్నది కాంట్రాక్టర్ రామకృష్ణ అని అర్థమైంది
ఒక్క నిమిషం పాటు అవతలి మనిషి చెప్పేది విన్నాడు
క్షణంలో సాంబయ్య గొంతు మారి పోయింది. తనెపుడూ ఎరగని చూడని కాఠిన్యం చోటు చేసుకుంది
“ఏందిరా ముండా, నీకు మామూలుగా సెబుతుంటే ఎక్కదట్టుగుందే? నువ్వూ నీ కాంట్రాట్టూ సాగర్ లోనో సత్రశాల్లోనో దూకండి. ఇట్టాంటి దొంగ నా కాంట్రాట్టులు శానా జూశాం లే. డాన్సుకని దీసక పోయి ఎవుడి దగ్గరకు బడితే ఆడి దగ్గరకు పంపిచ్చే కాంట్రాట్టు కాయితాలు పట్టక రా పో.. కానాలో తోపిస్తా ఎదవ నాయాలా
రేయ్, సాంబయ్య బడ్డీ కొట్టు బెట్టుకోని అతకలు సచ్చి ఉన్నాడని అనుకోబాక. ఈ కాలు యాక్సిడెంట్ లో పోలా. నాటు
బాంబులేత్తంటే పేలి, తెగి పోయింది.
నా పెళ్ళాన్ని తెచ్చుకోడానికి కూడా నీలాంటోడే ఒకడు అడ్డం బడితే ఏసి పార్నూకా! మూడో కంటికి తెలవలా. అట్టా పోవాలనుందా? చెప్పు నరికి పారేస్తా
పొయ్యి జైల్లో కూకున్నా నాకు పొయ్యేదేం లేదు నా కొడకా
సీతమ్మ కి ఎవురూ లేరని నువ్వనుకుంటండావేమో , ఆ పిల్ల ఇష్టానికి వొదిలేశా గదాని, నీలాటోళ్ళు ఎదవేసాలు ఎయ్యాలని చూస్తే, గొంతుకోసి గోడవతలేస్తా
వో.. తెగ బెదిరిస్తన్నావే? సోడా బుడ్లు గాల్లో ఎగరేసి పేల్చిన సేతులియ్యి. నిన్ను సంపటానికి ఎక్కువ కట్టపడే పని గూడ లేదు. అర్బకం నాయాలా, ఒక్క దెబ్బకి పోతావ్
నీకు దిక్కున్న సోట సెప్పుకో పో! ఎవుణ్ణి తెస్తావో తీసక రా, నిన్నూ ఆణ్ణీ కలిపి నాగులేరులో పాతిపెడతా”
సంభ్రమంతో వణికి పోయింది సీత.కళ్ళలోంచి సంతోషంతో నీళ్ళు దూకాయి
గబ గబా లాంతరు వెలిగించి బయటికి వచ్చి వరండాలో స్టూలు మీద పెడతుండగానే కరెంట్ వచ్చింది
సాంబయ్య సందులోంచి తిరిగి వచ్చాడు
“ఫోను మర్చిపోయావేమ్మా? రామ కిష్ణంట, నీ కోసం చేశాడు. ఇంక రాదులేయ్యా, వేరే వోళ్ళని చూసుకో “అని బతిమిలాడి చెప్పాను”
సాంబయ్య మొహంలోకి చూస్తుంటే నవ్వొచ్చింది సీతకి
“అక్కణ్ణే నిలబడ్డావేంది? రా లోపలికి” అంది రాంబాబుని చూస్తూ
రాంబాబు వరండాలోకి రాగానే సాంబయ్య వైపు చూస్తూ అంది “ఇదిగో ఈనే.. మా నాన, సాంబయ్య”
“ఇజీవాడలో ఇంటి కాడే బడ్డీ కొట్టు పెడితే నడిసిద్దిగా?”
బాగుందండీ… మంచి శైలి.. అరుదుగా ఎంచుకునే ప్లాట్.. అభినందనలు..
మనుషుల మనసులలోకి తొంగిచూసి రాసిన కథ.. చాలాబాగుంది..