సాయంత్రం పువ్వు

రాకపోకల అనుభూతిలా

సుతిమెత్తని అరుణిమ

లోకపు కోపాన్నంతా జారవిడిచి

తేటగయ్యింది.

కొరికేస్తే మిగిలిపోయిన

ఓ చందమామ

మిగుల్చుకున్న నిశ్శబ్దాన్ని

పంచిపెడుతుంది.

అమాయక పసి ఆకాశాన్ని

పక్షి రెక్కలతో నిమురుతోంది.

నవ్వులన్నీ ముద్దులైతే

మనసొక సాయంత్రం పువ్వు.

*

2

సముద్ర ఓటమి

 

ఎక్కడి నుంచి పుట్టుకొనొస్తాయి

ఆనందమయినా,విషాదమయినా..

బహుశా ఒక ఉధృతి నుంచి కావొచ్చు..

 

కడలి కదలికల మీద నువు తేలడానికి

కడలే నిన్నెత్తుకొని ఎగరేయడానికీ  మధ్య

ఆధిపత్య పోరులో పుట్టిన

సంఘర్షణలోంచి కావొచ్చు..

 

కాలికిందే తొక్కేసినా,కాసేపే నలిగి

ఆ తరువాత చైతన్యమయిన ఉప్పెన

ఆత్మగౌరవం కావొచ్చు..

 

ఓ చిన్నపాటి దూరం..

ఉదయానికీ రాతిరికీ ఉన్నట్టు

వేడి శరీరానికి,చల్లబడిన మాంసానికీ

ఉన్న కాస్తంత దూరం..

 

ఏదో అడగాలనుకొని చేతులు చాచి

సమయం లేక ఆగిపోయిన గుండె పక్కన

రెండు అరచేతుల మధ్య ఉన్న దూరం..

 

ఏడుపెక్కువై ప్రేమగా మారి అతిపెద్ద నవ్వులో

ఆఖరి జీవం ఆకాశాన్ని చూస్తూనే ఉన్నప్పుడు

డేగ ఆకలి తీరడాన్ని ,నిశ్చల ఆకాశం

కళ్ళారా చూసినంత దూరం..

 

పరిచయమైన దేహాన్ని చూసిన ఆనందం

ఆ ప్రాణం నీలో దాక్కున్న విషాదం.

చావుబతుకులకి  మాటల మాధ్యమం.

 

కనులు మూత పడినప్పుడే లోపల చీకటయి

చెవుల్లో..రాళ్ళని తాకిపోతున్న నీటి సవ్వడి

తప్పిపోయిన నవ్వులో, బతికితే దొరికిన దుఃఖమో..

 

ఇప్పుడేదయినా ఓ తగిలే తడే..

ఒళ్ళంతా దాహం పుడుతున్నప్పుడు

ఆబగా మహాసముద్రాన్నయినా నింపుకోగల   బతుకు తడి..

 

ఇద్దరి చేతుల మధ్య యుధ్ధమై వచ్చి

ప్రేమను బలవంతంగా చీల్చి పారేసి

ఒక సజీవ,మరొక నిర్జీవ దేహాలుగా విడగొట్టినా..

 

ఓ సముద్రమా నువ్వోడిపోయావ్

నీ దగ్గరుంది నిర్జీవ దేహాలే..కానీ

ఒడ్డున ఏడుస్తున్నవి సజీవ మనసులు..

ఆ కంటి తడిని కనీసం తాకగలవా..??

*

పెయింటింగ్: సత్యా బిరుదరాజు 

స్వేచ్ఛ

స్వేచ్ఛ

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అద్భుతమైన కవితలు.. especially.. ఆకాశాన్ని రెక్కలతో నిమురుతోన్న పక్షి ముద్రించుకుపోయింది.. wonderful.

 • కవితలు చాల బాగున్నాయి.సత్యా బిరుదరాజు పెయింటింగ్ బాగుంది.

 • స్వేచ్ఛ అంటే
  అమాయక పసి ఆకాశంలో
  ఓ చందమామ.. అని తెలుసు..
  కానీ.. ఆబగా మహాసముద్రాన్నయినా నింపుకోగల బతుకు తడి.. అని తెలీదు..
  మంచి కవిత్వం.. ????

 • చుట్టూ కంచెలేని… కవిత
  సాయుధ కవాతుకు లొంగని.. సాహిత్యం
  బందూకుల బరిలో లేని… బంధాలు
  రక్షణ కోసం ఎదురుచూడని… రచన

  ఎంత స్వేచ్ఛగా ఉంటాయో…
  అంత స్వేచ్ఛగా ఉన్నాయి స్వేచ్ఛ.మీ కవితలు
  మీ మట్టిపూల గాలి… జీవం లేని మనుషులు మొలకెత్తేలా చేయాలని ఆశిస్తూ…

 • Swecha samudra otami kavitha సూపర్
  Ika mundhukuda inka enno kavithalu nee kalamu nundi jaaruvaalaalani aashisthoo

 • “రాళ్ళని తాకిపోతున్న నీటి సవ్వడి తప్పిపోయిన నవ్వులో ”
  Wonderful poems.

 • ” ఏదో అడగాలనుకొని చేతులు చాచి / సమయం లేక ఆగిపోయిన గుండె పక్కన / రెండు అరచేతుల మధ్య ఉన్న దూరం..” పెయిన్ ని కొత్తగా వ్యక్తీకరించారు … రెండో కవిత బాగుంది … రాస్తూ వుండండి …. రాయడానికి మించిన విముక్తి లేదు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు