సమాధానం

చెట్టుమీద ఉన్న

శవాన్ని భుజాన వేసుకొని

నడుస్తున్నాను

 

శవం కథ చెప్పటం మొదలెట్టింది

మొదట లో గొంతుకతో

క్రమక్రమంగా

భీకర అరుపులతో, ఊళలతో

 

గంటలు రోజులు సంవత్సరాలు

కథ సాగుతోంది అనంతంగా

ఎన్నో దృశ్యాలు కళ్ళముందు

లిప్తపాటు మెరిసి మాయమవుతున్నాయి

 

పాయింటు బ్లాంకులో పుస్తకాల్ని కాల్చటం

పాలిచ్చే జంతువుతో కేబరే డాన్స్ చేయించటం

నరమాంసభక్షణ చేస్తోన్న ఆటవిక మూకలు

పొడవాటి క్యూలో కుప్పకూలిన చమటనోటు

లాంటి దృశ్యాలు గగుర్పొడుస్తున్నాయి.. పదే పదే

 

బాటపైని గులకరాళ్ళు, ముళ్ళు గుచ్చుకొని

రక్తమోడుతున్నాయి పాదాలు

 

చివరగా

“తెలిసీ సమాధానం చెప్పలేదో

నీ తల వేయి వ్రక్కలవుతుంది జాగ్రత” అంది శవం

 

సమాధానం చెప్పాను

 

శవం తల వేయి వ్రక్కలయింది!

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

బొల్లోజు బాబా

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు