సంయుక్తా మాయా సమకాలీన తమిళ కవయిత్రి. ఆమె వివిధ సాహిత్య పత్రికల్లో గత ఇరవై ఏళ్ళుగా కవితలు, కథలు రాస్తున్నారు. అసలు పేరు ఉమా మహేశ్వరి. మే 17, 1982న తమిళనాడులోని తేని జిల్లా, బోడినాయకనూర్‌లో గోపాలకృష్ణన్, శాంతిమతి దంపతులకు జన్మించారు.
బోడినాయకనూర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, మధురై అగ్రికల్చరల్ కాలేజీ నుండి అగ్రికల్చర్‌లో బీఎస్సీ, కోయంబత్తూర్ అగ్రికల్చరల్ కాలేజీ నుండి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పట్టా పొందారు.
ఆమె జూన్ 7, 2015 న ఆనంద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె పేరు ‘అమేయ్రా నివృతి’.
ఆమె మొదటి కవిత 2008లో ప్రచురితమైంది. ఆ తర్వాత ఆమె రచనలు ఉయిరెళుత్తు, ఉయిర్మై, ఆనంద వికటన్, కణైయాళి వంటి ప్రముఖ తమిళ పత్రికలలో వచ్చాయి.
వెలువడిన పుస్తకాలు:
డల్హౌసీయిన్ ఆరెంజ్ ఇరవు (Dalhousie’s Orange Night) – 2016
తీ నిండ్ర పాదం – 2023
పురస్కారాలు:
ఆమె కవిత్వానికి 2026 విష్ణుపురం – కుమరగురుబరన్ అవార్డు లభించింది. ఆమె కవిత్వం సరళమైన పదాలతో గొప్ప అనుభూతిని ఇస్తుందని, విరహం, ఏకాంతం, ప్రేమ కోసం ఆరాటాన్ని ఆత్మన్యూనత లేకుండా, ఎంతో గంభీరంగా వ్యక్తపరుస్తుందని ప్రముఖ తమిళ రచయిత ఎస్. రామకృష్ణన్ వంటి వారు ప్రశంసించారు.
- ఒకటేనా, వేరువేరా?
ఈ దీపకళిక కొసల్లో
నిలిచి వెలిగాను
ఎన్నో సార్లు!
నిరంతరం నూనె పోస్తూ,
వత్తిని మాత్రం అప్పుడప్పుడు మారుస్తూ…
ప్రతిసారీ
కొత్త వత్తిలో వెలిగే కళిక
ఒకటేనా? వేరువేరా?
మూలం: ఒండ్రా… వేఱా?
***
- మూడవ నీడ
నా ప్రియుడి
మరణించిన మాజీ ప్రేయసి
తన ఉనికిని
తెలియజేస్తూనే ఉంది
ఆహారంలో అధికంగా కలిసిపోయి
వేరుచేయలేని ఉప్పులాగా!
నల్లతుమ్మ పూవుల్లో – ఆమె
ఒక సీతాకోకచిలుకలా వాలి
ఎగిరిపోతున్నప్పుడు
ఆమేనని తెలియకుండానే
పట్టుకోవడానికి చేయి చాస్తాడు.
ఒక తెల్లవారుజాము కలయికలో
పైకప్పుమీద మసకగా కనిపిస్తున్న
ఆ మూడవ నీడ ఎవరిదీ?
’సెనెవిల్’ పియానో సంగీతం
మనస్సుని పారవశ్య స్థాయికి తీసుకెళ్ళి
నెమ్మదిగా సహజస్థితికి చేర్చేవేళ
అతడ్ని కౌగిలించుకుంటాను
అప్పుడు –
ఆమెను కూడా కలిపే కౌగిలించుకుంటాను.
మూలం: మూండ్రావదు నిళల్
***
- వెయ్యి కాళ్ళ ఒంటరితనం
రాతిరి తోటలో
నల్లటి కంకర్రాళ్ళ మధ్య
వెయ్యి కాళ్ళతో పాకుతూ వెళ్ళే
రోకలి పురుగులా
కదులుతోంది ఈ ఒంటరితనం.
మూలం: ఆయిరంగాల్ తనిమై
***
- అంగీకరించడం హేయమా…?!
ఎవరూ చూడని వాటన్నిటినీ
చూడగలుగుతుంది ఆమె
అయినప్పటికీ-
అందరూ సులభంగా చూడగలదాన్ని మాత్రం
తేలిగ్గా వదిలేస్తుంది.
ఇలాగే –
3డి దృశ్య చిత్రాల్లా
జీవితపు తెరమీద
ముందుకు పొడుచుకు వచ్చే నిజాలను
ఎడంచేత్తో పక్కకు నెట్టివేస్తుంది.
దోషంలేని మేలు చేకూరుతుందంటే
ఎన్ని అబద్ధాలతో రాజీపడొచ్చు…?
ఎదిగిన తన పిల్లల్లో
పొడవైన తోకున్నది కోకిల పిల్ల అని
తెలిసిన మరుక్షణం
గూటినుండి తరిమేసే
కాకుల మధ్యన,
పొదిగి పిల్లలు చేసిన వాటిలో
చేట లాంటి ముక్కున్న
బాతు పిల్లను సైతం – ఏ అభ్యంతరమూ లేకుండా
రెక్కల చాటున పొదువుకుంటుంది
ఆ అమాయకపు తల్లికోడి.
మూలం: ఏఱ్పదు ఇకళ్చి…?!
***
- గమ్యం
కాస్త కిందికి వంగిన కొమ్మకున్న పువ్వు చుట్టూ
చక్కర్లు కొడుతోంది
ఓ పసుపుపచ్చ సీతాకోకచిలుక.
చెట్టు మొదలును
గట్టిగా పట్టుకుని
సీతాకోకచిలుకను పట్టుకోవాలని
పైపైకి ఎగిరి గెంతుతోందో పిల్లి.
బాహ్య ప్రపంచం గురించి
ఎలాంటి ధ్యాసా లేకుండా
ఎండలోకి ఎగురుకుంటూ
మాయమైపోతుంది సీతాకోకచిలుక.
ఇప్పుడు…..
ఎగరని ఆ ఎర్రటి పువ్వును
తెంచేయడానికి
ఎగసి ఎగసి పడుతోంది ఆ పిల్లి!
మూలం: ఇలక్కు
***
- బాధ్యతారహితంగా ఎగిరే తూనిగలు
పాలుపట్టిన వరికంకుల సువాసనను
నా గదిలోకి నువ్వే తీసుకొస్తుంటావు.
వచ్చేసారికి నువ్వు
వసంతఋతువు పూలపరిమళాన్ని
తీసుకువస్తావని కూడా ఊహించుకుంటున్నాను.
కోతల అదునుకై ఎదురుచూస్తూ
ముంగిట్లో వేచివున్నాయి
తుప్పుపడుతున్న కొడవళ్ళు.
పంట పొలాలు ఉన్న దిశలో
గట్లు తెంచే పెనువాన
గర్జనధ్వనులు వినబడుతున్నాయి…
అకాలవర్షాలు కురిపించడానికే అన్నట్టు
పద్దాకా నా పంటచేళ్ళో
బాధ్యతారహితంగా ఎగురుతుంటాయి తూనీగలు.
మూలం: పొరుప్పట్రు పఱక్కుం తట్టాన్‌గళ్
***
- నిప్పుని నిలుపుకున్న పాదం
ఊనిన పాదం నొప్పి పుట్టిస్తూ
పైకెత్తిన పాదం బొబ్బలుపోతూ
నడిచే నేలంతా కాలి బూడిదైపోతూ
అంతిమ సత్యమనే పరమార్థాన్ని వెతుకుతూ
అల్లాడిపోయే దారులన్నిటా
క్షణమైనా ఎక్కడా నన్ను నిలవనీయని
నిప్పుని నిలుపుకున్న పాదం నాది.
తీగెలా పాదాలను చుట్టుకుని
పైపైకి పాకుతూ శిరస్సు చేరాలని
తన్ను తాను దహింపజేసే నిప్పును
తానే మోస్తూ ముందుకు సాగే
ఉన్మత్తుల సమూహం వెంబడించే
చల్లదనాన్ని నిలుపుకున్న పాదాలు గల ఈశ్వరా…
నిన్ను తెలుసుకున్నప్పటికీ ఆరిపోని
నిప్పుని నిలుపుకున్న పాదం నాది.
మూలం: తీ నిండ్ర పాదం
***
- కాశీ – దహించే నగరం
వృద్ధాప్యంలో అంధుడైన తండ్రికి
తాము వెళ్ళే ప్రదేశాలన్నిట్నీ వివరిస్తూ
నగరంలోకి ప్రవేశిస్తున్న కొడుకు
చుట్టుపక్కల చూస్తూ జరిగేవి చెబుతున్నాడు –
రక్తమోడుతున్న బలిపశువు గిలగిలా కొట్టుకుంటూ
అన్ని చోట్లా తిరిగినట్టు
ఎక్కడ చూసినా
రక్తపు ఎరుపు రంగే ఈ నగరమంతటా అని!
ఆ అంధుడు కంగారుగా ‘అవును’ అంటున్నాడు
అంధకారమైన తన ప్రపంచంలో
ఉగ్రత నిండిన ఈ నగరపు ఆత్మ
ఎర్రటి కాంతిని ప్రజ్వరిల్లి
దహింపజేయడాన్ని గమనిస్తూ…
గబగబా నదిలోకి దూకి
మెడలోతు నీళ్ళల్లో నిలబడి
చేతులెత్తి అరుస్తున్నాడు –
ఓ భాగీరథీ…!
ఈ శ్రావణ మాసంలో
నీ ఒడ్డునున్న
మోదుగు చెట్లను పూయించకు
ఇప్పటికే భరించలేకపోతున్నాను
ఈ నగరపు వేడిని…! అని.
మూలం: ఎరియుం నగరం
***
- డమరుకం
త్రిశూలపు వాడి మొనల మీద నిలుచున్న ఈ నగరం –
సదా కంపించిపోతూ ఉండటం
రక్తాన్ని మరిగించే ఆ ఒక్క ఆదిమ సంగీతానికే కదా!
భం భం భం భం భం ఢమ ఢమ ఢం ఢమ ఢమ ఢం
బ్రహ్మాండాలు ఉద్భవించి ఢీకొనే
ఈ మహాధ్వని తాళానికి
ఎడతెరిపి లేకుండా స్పందిస్తున్న ఈ శరీరాన్ని
ఇప్పుడే త్యజించివేయడం శ్రేష్ఠం కదా?
అంటూ ఏదేదో ప్రేలుతున్నావు
మొగలి పువ్వా… కేతకీ పుష్పమా…
నాకేమీ తెలియదు.
నేనైతే…
శివుని బలమైన హస్తంలో
గట్టిగా ఇరుక్కున్న పరమానందంలో
ఏదీ ఎరుగక మైమరచియున్న
నడుము చిక్కిన చిన్న డమరుకాన్ని కదా…!
మూలం: డమరు
***
- మణికర్ణిక – 1 అఘోరీ గాథ
అడ్డంగా కోసిన వంజరం చేప ముక్కల్లా
తేలుతున్నాయి గంగమీద పడవలు అన్నాను నేను;
విరిగిన పడవల్లా తేలుతున్నాయి
శవాలు అన్నాడు అఘోరీ.
తాళలేని ఈ శీతాకాల సాయంత్రపు చలికి
కట్టెలు రగిల్చి చలి కాచుకుందామన్నాను నేను;
ఇది దీర్ఘకాలం మండగల మేలిమి కట్టె అంటూ – బిగుసుకుపోయిన
ఒక శవాన్ని తీసి నిప్పుల్లో పడేశాడు అఘోరీ.
చీలిన చితాభస్మ నాలుకల్లా
దాహంతో గాల్లో అల్లల్లాడుతున్నవి
కాలుతున్న దేహం తాలూకు తీరని కోరికలా అని అడిగాను నేను;
అవి ఆ దేహంమీది ఉన్మత్తంతో తాండవించే శివుడి
ఎర్రటి జటాజూటాలు కదా అన్నాడు అఘోరీ.
కపాల పాత్రలో అతను ఒంపి ఇచ్చినదాన్ని చవిచూస్తూ
ఈ పాత కల్లు కంటే ప్రాచీనమైన సురాపానం ఏముందని అడిగాను నేను;
రాత్రివేళ శ్మశానంలో సోమశేఖరుడి శిరస్సునుండి కురిసే వెన్నెలను మించిన
నిషా ఇచ్చే పానీయం ఏదీ లేదు అన్నాడు అఘోరీ.
నీలా నేను మారడానికిగల మార్గమేంటని అడిగాను నేను;
అతడు నా చేతికున్న బంగారు గాజును తీసి
అప్పుడే అక్కడికి వచ్చిన ఒక శవం ముందు ఉంచాడు
కళ్ళు తెరవకుండానే పళ్ళికిలించి పెద్దగా నవ్వింది శవం.
నీకూ దీనికీ అది ఎప్పటికీ సాధ్యం కాదు అంటూ
పడి పడి నవ్వాడు అఘోరీ.
కచ్చితంగా గమ్యాన్ని చేరే వరకు
ఎక్కడా ఆగబోను అన్నాను నేను;
ఈ గమనానికి గమ్యం ఏంటో తెలియదన్న
ఆ అజ్ఞానాన్ని అంగీకరించడమే
దాన్ని చేరుకోవడానికి ఏకైక మార్గం అన్నాడు అఘోరీ.
మాటల్లేకుండా నిలబడ్డ నన్ను మరిచిపోయినవాడిలా
కాలుతున్న శవాల పొగనీ, గంజాయి పొగనీ
కలిపి పీల్చుకుంటున్న మత్తులో
ఎడతెరిపి లేకుండా ఊళపెడుతున్న ఒక నక్కను
ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దాడుతూ
బూడిదలో దొర్లుతున్నాడు
అనిత్యత్వాన్ని గెలిచే సూత్రాన్ని
ఒక మాయతాడులా కట్టుకున్న అఘోరీ.
మూలం: మణికర్ణిక – అఘోరి గాథ – 1
***
- మణికర్ణిక – 2
(ఎడబాటు వేదనతో రోదించేవాళ్ళను దెయ్యం ఓదార్చే ఘట్టం)
దేన్నుండి నన్ను రక్షించడానికి ఏడుస్తున్నావు?
చెరసాలనుండి విడుదలైన వాడికోసం
నవ్వడం కదా ధర్మం?
తొమ్మిది ద్వారాలనూ
బయట గడియ పెట్టి గట్టిగా మూసేశారు
లేని తాళంచెవికోసం నువ్వు మొరపెట్టుకుని ఏం లాభం?
నేను అయిపోయిన శవాన్ని
నువ్వు కాబోయే శవానివి
మధ్యలోనున్న కాలమనే మాయ తెరను
కన్నీళ్ళు తుడుచుకుని చూడు.
కారిపోతున్న నీ చిల్లు కుండలోనూ
ఓ చివరి చుక్కైనా
మిగలబోదు కదా?
ఎప్పటికీ ఎండిపోదు పుట్టుక అనే మహానది
అంతా సముద్రంలో కలిసి – మళ్ళీ
వేరు వేరు నదులుగా మారుతుంది.
బురద అంటుకున్న అడవిదున్న మీద కూర్చుని
కొంత దూరం ప్రయాణించే పక్షిలా
మరణం వీపు మీద
వెలిగి మాయమయ్యే జీవితం.
సుదీర్ఘ జీవనయానమంతటా
పేలుడు మందు రాసిన వత్తిలా
కణకణలాడుతూ సాగే మరణపు నిప్పుకణికలు
దారి ముగియగానే పేలి ముక్కలవ్వాలి కదా!
పొయ్యిలో పాత బూడిదను తీసేసి
కొత్త కట్టెల్ని రగిల్చినట్టు
మిగిలున్న కాలాన్ని గడపడానికి – ఎప్పట్లాగే
వేరే కష్టాలను తగలబెట్టడం మొదలుపెట్టు.
మూలం: పడగు – కాట్చి – 2
***
- ఏమివ్వను?
నీకు ఇవ్వడానికి
అత్యంత అపురూపమైనదాని కోసం వెతుకుతున్నాను
వెలకట్టలేనిది
ప్రపంచం ఇంతవరకు ఎరుగనిది
నువ్వు అస్సలు ఊహించనిది.
కానీ – ఏదైనా సరే
చేతికి దొరగ్గానే
నీటి ప్రవాహంలో గులకరాయిలా
చల్లబడిపోతోంది.
ఏడు కొండలకవతల…
ఏడు సముద్రాలకవతల…
చీకటి గుహలో
తలుపులు లేని పంజరంలో కొట్టుమిట్టాడే
బంగారు చిలుకా….
గులకరాళ్ళను పోగుచేస్తూ
వీరగల్లుగా మారిపోయినవారెవరైనా
తెలుసా నీకు…?!
మూలం: ఎదైత్ తరువదు…?
***
- నేను అంటే…
నా హృదయాన్ని
అందరూ చూసేలా
నా చొక్కా జేబుపై కుట్టుకున్నాను.
పడమటి ఆకాశంలో
ఎర్రగా పండిన
సంజెసూర్యుడిలా.
నా గురించిన వివరాలను
అలవోకగా ప్రకటిస్తున్నాను.
ఆకురాలుకాలంలో ఎండిన ఆకుల్లా
అవి – దారి పక్కన
చప్పుడు చేస్తూ తిరుగాడేలా.
ఏమిటో…
ఇప్పుడల్లా – నేను, నాది
అని మాట్లాడటమే
కాస్త అసహ్యంగా అనిపిస్తోంది.
సమాధి భూమిలోపల
తడి మట్టిలో ఎదురుచూస్తున్న
చిన్ని చిన్ని పురుగుల్లారా…
మీకు నైవేద్యం కానున్న
ఏ రహస్యాల్లేని దేహాన్ని
ఎంత ఆబగా తింటారూ?
మూలం: నాన్ ఎన్బదు…
***








Add comment