శ్రీ ఏడు కొండలు 16. ఎం ఎం సినిమా కంపెనీ

ది గోడలకు నాలుగు వైపులా  పదడుగుల ఎత్తులో సినిమా యాక్టర్ల ఫొటోలు రంగు రంగులు గా. ఎన్ టీ ఆరూ, నాగేస్రావూ, సోబన బాబూ, కిష్ణా,  సావిత్రీ, వాణిశ్రీ, ఇంకా ఎవరెవురో.. అంతెత్తున ఉంటాడే, రాచ్చసుడల్లే.. కీచకుడు…ఆయన బొమ్మ కూడా ఉందక్కడ

ఏడుకొండలు తలుపు దగ్గర నిలబడి తల కొంచె లోపలికి పెట్టి చూశాడు. ఆ గదిలో ఎవరో ఇద్దరు పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడుకుంటూ గుండ్రంగా ఉన్న రేకు బాక్సుల్ని సంచుల్లో సర్దుతున్నారు.

ఒక మూల ఒకతను కూచుని ఒక మిషన్ కి రేకు బాక్సు రీలు తగిలించి, దాన్నుంచి తెగి పోయిన ఫిల్ము ముక్కలన్నీ తీసి చెత్త డబ్బాలో పడేస్తున్నాడు.

కొండలు వచ్చింది ఆ ముక్కల కోసమే. ఆ ముక్కలు చూస్తుంటే నోరూరి పోతోంది.

అది ఎన్ టీ ఆరు  సినిమా అయితేనా? అసలు ఎంత మర్యాద దక్కిద్ది ఇయ్యాళ బళ్ళో? పోయిన సారి వాళ్ళు బయట పారేసిన ముక్కల్లో రాజబాబూ,రమా ప్రబా ఉన్నారు. ఆ ముక్కలన్నీ కళ్ళకి దగ్గరగా పెట్టి సూస్తే, అచ్చం సినిమా సూసినట్టే ఉంటది

ఆ ముక్కలు కత్తిరించే ఆయన రీలుని బాక్స్ లో పెట్టేసి, లేచి ఒళ్ళు విరుచుకుంటూ “రేయ్ నేను అన్నానికి పోవాల.  ఈ  బాక్స్ పైన పెట్టేయ్. రేపు రెంటసింతల లో ఎయ్యాల ఈ బొమ్మ” అన్నాడు

“ఏం బొమ్మ?” లోపలి గదిలోంచి ఎవరో అడిగారు

“ఇచిత్ర కుటుంబం, రామారావూ, సావిత్రీ” చెప్తూనే గబ గబా బయటికి వచ్చి చెప్పులేసుకుంటూ ఏడుకొండల్ని చూసి “ఎవుర్రా నువ్వు? ఈడేం చేత్తన్నా?”

భయం వేసింది

ధైర్యం కూడదీసుకుని పెద్దరికంతో వరస కలుపుతూ “బాబాయ్, ఆ కత్తిరించిన ఫిలిం ముక్కలియ్యి ఎన్ టీ ఆరంటే  బో ఇష్టం నాకు. ఇంటర్బెల్లు లో వచ్చా బాబాయ్”అన్నాడు దీనంగా మొహం పెట్టి

అతను పెద్దగా నవ్వాడు

“తీసుకో పో, ఆ మూల ఎర్ర డబ్బాలో ఉన్నయి”

అసలు ఆ ఆఫీసులో అడుగు పెడతానని ఎప్పుడూ అనుకోలా కొండలు.

తన చెవుల్ని తనే నమ్మలేక పోయాడు

వణికే కాళ్లతో లోపలికి వెళ్ళి ఎర్ర డబ్బాలోంచి కత్తిరించిన ముక్కలన్నీ అపురూపంగా జేబులో నింపుకుని,తనివి తీరా ఆఫీసు మొత్తం కలియ చూస్తూ బయటికి వచ్చాడు.సందు చివర ఆగి ఆ ఫిల్మ్ ముక్కలు తీసి కళ్ళకి దగ్గర గా పెట్టుకుని చూశాడు

రామారావూ, సాయిత్రీ ఏదో పాట పాడుతున్నట్టున్నారు. ఒకటే సీన్ లాగ కనపడుతున్న ఫిల్మ్ లు చాలా ఉన్నాయి

రామారావు బొమ్మ దొరికింది పో.. ఇయ్యాల కొండల్ని కొట్టే మొగోడే లేడు

సంతోషం పొర్లిపోయే మొహంతో స్కూలు వైపు నడుస్తూ వెనక్కి గిరిగి చూశాడు

“శ్రీ త్రికోటేశ్వర 16 ఎం ఎం సినిమా కంపెనీ”

ఎంత బాగుందో ఆ బోర్డు, సుట్టూ బల్బులు పెట్టుకోని !రేత్తిరి కాడ ఆ బల్బులన్నీ ఎలుగుతై నా సామిరంగా.. అప్పుడు సూడాల

########

“ఏరా నా కొడకా? బడి కి పోవంట్రా? ఈణ్ణే తచ్చాడతావు? ఏ కలాసు?” బాలయ్య ఫిలిం ముక్కలన్నీ ఏడు కొండలు చేతిలో పోశాడు

“తొమ్మిది” భక్తి గా ఆ ముక్కలన్నీ జేబుల్లో దోపుకున్నాడు గోడల నిండా అంటించి ఉన్న సినిమా బొమ్మలు చూస్తూ

“అంజమ్మ కొట్టు కాణ్ణించి అందరికీ టీ దీస్క రా పో! ఎమ్మణ్ణే రావాల” ఐదు రూపాయలిచ్చాడు బాలయ్య

“ఇక్కడున్నట్టే వొత్తా అన్నా” పరిగెత్తుకుంటూ పోయి టీ తెచ్చాడు

“రే కొండలా , ఈ ఫిలిం బాక్సు లు ఆ జీబులో పెట్టు పో. రెండ్రూపాయలిస్తా”

ఎంతదృష్టం ఆ బాక్సులు ముట్టుకోడం!

బాక్సులు జీపుల్లో సర్దటం, టీలు తిఫిన్లు తీసుకురావడం, గదులు వూడ్చి, ఫిలిం ముక్కలు ఏరుకోవడం, ప్రొజెక్టర్ ని గుడ్డతో తుడిచి భక్తి గా దాన్ని తడమటం, చూస్తుండగానే కొండలు త్రికోటేశ్వర సినిమా కంపెనీ లో పనోడయ్యాడు

పది తర్వాత ఎలాగూ కాలేజీకి పంపే స్థోమత లేదు కాబట్టి ఏడుకొండలు ఏదో ఒక పని చేసి నాలుగు డబ్బులు తేవడం తప్పనిసరే ఇంట్లో

కానీ ఈ సినిమా పిచ్చి పని చెయ్యడం నారయ్యకు నచ్చలేదు.

“మాబూ సుబానీ స్కూటర్ గారేజీ లో జేరుస్తా పద. రెండేళ్ళు పని చేస్తే నీ సొంత కొట్టు నువ్వు పెట్టుకోవచ్చు. ఆ సినిమా కంపెనీ ఇయాలుండిద్ది, రేపు సంక నాకి పోయిద్ది. మాటిను. మెకానిజం పని వొద్దంటే రైస్ మిల్లు లో పని కి పో” ఎన్ని చెప్పినా ఏడు కొండలు చెవిలో వేసుకుంటేగా

ఫిలిం బాక్సులు మొయ్యడంలో హాయి, తృప్తి, ఎట్టా వొస్తయి మిగతా పనుల్లో! ఎన్ టీ ఆరు నీ, నాగేస్రావు నీ, కిష్ణా నీ బుజాల మీద మోసే ఆంజినేయులు ఈ ఏడుకొండలు

ఫిలిం బాక్సుల్ని జాగ్రత్తగా టార్పాలిన్ సంచుల్లో సర్దటం, దించేటపుడు నేల మీద పెట్టకుండా గట్టో అరుగో చూసుకుని అక్కడ దింపటం, సినిమా వేసేటపుడు పిల్లలెవర్నీ ప్రొజెక్టర్ దగ్గరగా రానివ్వకుండా కాపలా ఉండటం, తెగిపోయిన ఫిలిం ముక్కలన్నీ చుట్టూ చేరే పిల్లలకు పంచడం, “అనా, అనా, నాకు రెండే ఇచ్చావనా.. వాడికి నాలుగిచ్చావ్” అని గొడవ పడే పిల్ల కాయల తగాదాలు తీర్చడమూ.. వీటితో ఏడుకొండలు బిజీ

నిద్ర లో కూడా “యోవ్, బాక్సు.. బాక్సు జాగర్త, అందరూ పక్కకు జరగాల, రామారావు వొచ్చేత్తన్నాడు.., ఇటు సోటు లేనోళ్ళు స్కీన్ కి అటు పోయి కూసోండి. బొమ్మ తిరగబడి కనపడిద్ది, అంతే, ఇంకేం తేడా లా ! అదే కత…” ఇవే కలవరింతలు

రెండేళ్లలో ఏడుకొండలు కి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యత అప్పగించారు.

బాలయ్య చనిపోవడంతో ప్రొజెక్టర్ ఏడు కొండలు చేతిలోకి వచ్చింది.

ఆ రోజు కొండలు కోటప్ప కొండకి పోయి, బొచ్చు కోటయ్య కొండ దాకా ఎక్కి జుట్టు ఇచ్చి వచ్చాడు భక్తి తో

పొజెట్రు తన చేతికి రావడం కోటయ్య మహిమ కాక మరేంది ?

ఏ సినిమాలో ఎక్కడ కట్ అయిందీ, దాన్నెట్టా కవర్ చెయ్యాలీ, ఏ పాట రెండు సార్లేస్తే, జనం రూపాయలు జల్లుతారు, ఎప్పుడు సినిమాలకి డిమాండ్ ఉంటుందీ, పంటలు లేని కాలంలో ఏ వూరోళ్ళు ఎక్కువ సినిమాలు చూస్తారు, ఈ వూర్లో ఏ హీరో సినిమాలెయ్యాలి, ఆడోళ్ళ కి నచ్చే సినిమాలేంటి.. ఇవన్నీ కొండలు కి కొట్టిన పిండి.

రాయిపాడు లో దసరా బుల్లోడు సినిమా యేస్తే రెండు గ్రూపుల మజ్జెన తగాదాలవుతై.

దేసారంలో రామారావంటే పడి సత్తారు. కళ్లకుంటలో లవకుశ కి తిరుగులేదు

నాగేశ్రావ్, వాణిశ్రీ ఉంటే ఆడోళ్ళు ఒడ్లు అమ్మి అయినా సినిమాకొస్తారు

శోబనబాబుంటే సెప్పే పనే లేదు. ఇద్దరాడోళ్ల మజ్జెన ఆయబ్బాయి ఎన్ని కష్టాలు పడతాడో పాపం అని యాడవటానికైనా వొస్తారు.

ప్రొజెక్టర్ ఆపరేటర్ ఉజ్జోగం వచ్చాక కొండలు బాగా గొప్పోడై పోయాడు. ఏ పల్లెటూరు పోయినా, అందరూ ఆరాధన గా చూడ్డం.

పిల్లకాయలు, పడుచు పిల్లలు మాట్టాడ్డానికి ట్రై చేసే వాళ్ళు. ఇంట్లో పూసిన చామంతులూ, సన్నజాజులూ మాల కట్టి జడల్లో పెట్టుకుని కొత్త వోణీలేసుకుని ఆడపిల్లలు కొండలు ని పలకరించడానికి పోటీలు పడేవాళ్ళు

ఆడోళ్ళు “అబ్బాయ్, ఈ సారి ఫాలానా సినిమా ఎయ్యాలి, మర్చిపోబాక” అని ఇంట్లో చేసిన అరిసెలూ,చక్కరాలూ, లడ్లూ సంచుల్లో పెట్టి తెచ్చిచ్చే వాళ్ళు.

డబ్బులు బాగానే వచ్చేవి. ఒక్కోసారి, వరసగా సినిమాలేసి  నాలుగు డబ్బులు ఎక్కువే సంపాదించేవాడు.

చుట్టు పక్క వూళ్ళలో అందరికీ తెలిసిన మొహం కావడంతో పెళ్ళి సంబంధాలు బాగానే వచ్చాయి. వాళ్లలో సరస్వతి నచ్చింది.

ఉన్నంతలో కట్నం బాగానే ఇచ్చారు. ప్రొజెక్టర్ కొన్నాడు కొండలు.

“శ్రీ ఏడుకొండలు 16 ఎం ఎం  ఫిలిం కంపెనీ ” మొదలైంది

తిరిగి చూడకుండా సంపాదించాడు. ఒళ్ళు తెలీకుండా వూళ్ళన్నీ తిరిగాడు. నిద్ర లేకుండా ప్రతి సందర్భానికీ సినిమాలు వేశాడు. కొత్త కొత్త తెరలు కొన్నాడు. మచ్చలూ , గీతలూ లేని తెల్లని తెరలు, ముసలోళ్ళ కోసం ప్లాస్టిక్ కుర్చీలు లాంటివి పెట్టడంతో కొండలు సినిమా లకు డిమాండ్ పెరిగిపోయింది. ఐదారు ప్రొజెక్టర్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటే, కొండలు ఆఫీసులో కూచునే వాడు

ఏళ్ళు గడిచాయి. ప్రతి ఇంట్లోకీ టీవీలు చేరడంతో 16 ఎం ఎం సినిమాల ప్రభ మసకేసింది. జాగర్త పడ్డ కొండలు నెమ్మదిగా సినిమాల డిస్ట్రిబ్యూషన్ లోకి దిగాడు

పిల్లలు బాగా చదువుకున్నారు. అమెరికా లో సెటిల్ అయ్యేంతగా

ఇదిగో, ఇట్లా బలవంత పెట్టి తీసుకొచ్చి ఈ దేశంలో కట్టి పడేస్తారు. చూట్టానికి అంతా బాగానే ఉన్నా, ఊపిరాడదు తనకి. సరస్వతికి బాగానే ఇష్టం. అందరితో కలిసి పోయి ఫాన్ క్లబ్ ని సంపాదించుకుంటుంది. కోడల్నీ కూతుర్నీ కూచోబెట్టి వంద రకాలు వండి పెడుతుంది. తను మాత్రం ఈడ ఒంటరి

#########
చేతిలో గ్లాసు పక్కన పెట్టి కాఫీ టేబుల్ మీదకి కాళ్ళు చాపుకున్నాడు కొండలు

షికాగో వేసవి , హాయిగా ప్రశాంతంగా

బాక్ యార్డ్ లో పడక్కుర్చీ లో చంద్రుడిని చూస్తూ కూచోటం. ఎన్నడైనా ఊహించాడా ఇక్కడకొస్తానని?

ఇందాకే కొడుకు వచ్చి “నానా, అయిందా? ఇదిగో ఇంకా కావాలంటే పోసుకో,” అని గ్లాస్ నింపి, సీసా ఇచ్చి వెళ్ళాడు

వాడి ఫ్రెండ్స్ తో పార్టీ  జరుగుతోంది ఇంట్లో.తను కలవలేక వచ్చి దొడ్లో..అదేలే , బాక్ యార్డ్ లో కూచున్నాడు

సరస్వతి మాత్రం అందరికీ వడ్డిస్తూ బిజీగా ఉంది లోపల

బాగుంది, ప్రొజెక్టర్ రోజులన్నీ తల్చుకుంటూ పన్లేకుండా ఇట్లా ఒక్కడే కూచోడం.

ఒకసారి పెద్ద మోతుబరి కి కాలిరిగి మంచంలో ఉండి, నర్తన శాల సినిమా చూడాలనుందంటే వెళ్ళాడు తను. పెద్ద ఇల్లు,ఇంటి నిండా మనుషులు. ఉమ్మడి కుటుంబం.

నాపరాళ్ళు పరిచిన విశాలమైన పెరట్లో తెర కట్టి సినిమా వేశాడు తను. పెద్దాయన్ని మంచం పరుపూ వేసి కూచోబెట్టారు

ఈ బాక్ యార్డ్ చూస్తుంటే అది గుర్తొస్తోంది. ఇంత పెద్ద పెరట్లో తెరగట్టి సినిమా  యేస్తేనా? నా సామి రంగ అద్దిరి పోదూ ?

పెద్దాయన సంతోషించి, తనకి ఉంగరం ఇచ్చాడు వేలిది తీసి.

శివరాత్రి జాగారానికి అసలు టైము చిక్కేదా? మా వూరు రావాలంటే మా వూరు రావాలని గోల గదూ

నాలుగు పొజెట్రు లు ఉన్నా సరిపొయ్యేవి కావు. కారంపూడి నాయుడు గారి కూతురు పెళ్ళికి మూడు రోజులు ఆణ్ణే ఉండి రోజూ సినిమాలేశాడు

గురజాల్లో రెడ్డి గారి పిల్ల పెద్ద మడిసైనపుడు ఆ పిల్లకిష్టమని కిష్ణా సినిమాలు. బయట తెరగట్టి అందరినీ కూసోబెట్టారు. ఆ పిల్ల లోపల కిటికీ కాడ కూసుంది

ఆ పిల్ల ఒంటి మీద నగలు సూసి “నాగ్గానీ కూతురు పుడితే ఇన్ని నగలు కొనాల” అనుకున్నాడు

కూతురు పెద్దయ్యే టైముకి నిజంగానే అన్ని డబ్బులొచ్చినై కూడా

ఇంట్లోకి టీవీలొచ్చినాక బతుకులన్నీ పాడై పోయినై. ఎవరుకి వాళ్ళు గా అయిపొయ్యారు. ఎవురితోనూ కబుర్లు లేవు, పాడూ లేవు

అరుగుల మీద జనాలే లేక బోసిపోయినై గాదూ

నవ్వొచ్చింది ఏడు కొండలుకి. ఇప్పుడు పొయ్యి తెర గట్టి సినిమా యేస్తే ఎవురన్నా సూత్తారా?

అంతేలే . రోజులన్నాక మారకుండా ఎట్టుంటై ?

“నానా, లోపలికి రా ఇంక. పదకొండైంది. అందరూ ఎళ్ళిపోయార్లే, పడుకో వచ్చి” కొడుకు వచ్చాడు

“రేయ్, పెకాషూ, ఈడ తెర గట్టి సినిమాలేస్తారా?
సిక్ష్టీన్ ఎం ఎం సినిమాలు?”

ప్రకాష్ వింతగా చూశాడు ఒక్క నిమిషం. పెద్ద గా నవ్వుతూ “ఏంది నానా నువ్వూ? 16 ఎం ఎం సినిమాలు ఈడెందుకేస్తారు. ఇండియాలోనే లేక పోతుండె  గదా”

“అంతేలే, ఏం లా వూరకే అడిగా” లేచాడు

కిందనే బెడ్ రూం

సరస్వతి వంటిల్లు సర్దుతోంది కోడల్తో కబుర్లు చెప్తూ

కిటీకీ లోంచి చంద్రుడిని చూస్తూ పడుకున్నాడు.

##########

“నానా, దిగు” కారాపాడు

“ఏందిరా? ఈ జనమేంది? యాడికి తెచ్చా?”

“నువ్వు దిగు చెప్తా”

కాస్త విశాలమైన మైదానం లా ఉంది. కార్లు పార్కింగ్ లో పెట్టినట్టు కాక, విసిరేసినట్టు అక్కడక్కడా ఉన్నాయి

ఎవరో హాట్ డాగ్స్ అమ్ముతున్నాడు

కొంతమంది తెచ్చుకున్న బర్గర్లూ, శాండ్ విచ్ లూ తింటున్నారు.

“అటు జూడు”

జనానికి ముందు వైపు తెల్లటి స్క్రీన్. దాని ముందు కొంతమంది ఇళ్ళ నుంచి తెచ్చుకున్న ఫోల్డింగ్ కుర్చీలు వేసుకుని కూచున్నారు ఎడా పెడ గా

మెదడు లో మనసులో చెళ్ళున ఏదో మెరుపు

“ఏంది రా అదీ” సంభ్రమం

“నువ్వడిగావు గా, సినిమాలేస్తారా అనీ? అదే ఇది. డ్రైవిన్ మూవీ అంటారు ఇక్కడ”

“ఏందదీ?””

“ఏదో ఒకట్లే నానా, దా, ఏదో ఇంగ్లీష్ బొమ్మేస్తున్నారు. వూరకే నీకు చూపిచ్చే దానికి తీసకొచ్చా”

“పొజెట్రు ఉందా? సూడొచ్చా?” ఆత్రంగా అడిగాడు

“లేదు నానా, ఇప్పుడంతా డిజిటలేగా?”

అందరూ వేసవి రాత్రి హాయిని అనుభవిస్తూ తిండి తింటూ ఆరుబయట సినిమా చూస్తున్నారు డ్రైవిన్ థియేటర్ లో

కొండలు కి చాలా గుర్తొచ్చాయి. పంటలు అయిపోయాక జనం ఖాళీగా ఉండే వేసవి రాత్రుల వెన్నెలలు ఎన్నో తన సినిమాలతోనే గడిచిపోయాయి. కొన్ని సార్లు వరసగా తెల్లారేదాకా చూసే వాళ్ళు.

గొప్పగా మాసం వండి భోజనాలు తెచ్చేవాళ్ళు తన కోసం.వాళ్ళ జీవితాల్లో వినోదాన్ని తెచ్చిన తనంటే వాళ్లందరికీ ఇంట్లో మనిషే..

16 ఎం ఎం కంటే డిస్ట్రిబ్యూషన్ లో చాలా డబ్బులు సంపాదించాడు తను. అయినా వూళ్ళెంబడి తిరిగి కష్టపడిన ఆ రోజులే గొప్పగా ఉంటాయి.కష్టపడి సంపాదించిన ఆ డబ్బులే గొప్పవి తనకి

చూపు మసకేసింది. పక్కకు చూశాడు
కొడుకు బడ్ వైజర్ సీసా పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు

సంతోషం వేసింది. కళ్ళార్పకుండా కొడుకు వైపే చూశాడు

సినిమా తనకు అర్థం కాక పోయినా, చూస్తూ కూచున్నాడు

మనో ఫలకం మీద,ఇరవయ్యేళ్ళ ఏడుకొండలు ప్రొజెక్టర్ ముందు కూఛుని,రీల్ బాక్సులు మారుస్తూ “ఎవరూ ముట్టుకోగూడదు, జరగండి జరగండి. సినిమా అయ్యాక నే సూపిత్తాగా! ఫిలిం ముక్కలు ఈడ దొరకవ్, ఈ సారి వొచ్చేటప్పుడు తెస్తాగా…! సీతమ్మక్కాయ్, నువ్వు పొట్టి గదా, ముందుకొచ్చి కూసో! రాజ్యం పిన్నాం, నువ్వు ఈ మూలకి జరుగు, బాబాయ్ కి సోటియ్యి…” అని అందరినీ కలేసి మాట్లాడుతున్నాడు

సినిమా అయిపోయింది

రాత్రి పడుకోబోతూ తన బట్టల మధ్య దాచిన చిన్న లెదర్ బాగ్ తీసి అందులోంచి మరో చిన్న పర్సు తీశాడు ఏడు కొండలు

అందులోని బయటికి తీసి ప్రేమగా తడిమాడు,

తొమ్మిదో తరగతి లో తను త్రికోటేశ్వర సినిమా కంపెనీ నుంచి తెచ్చుకున్న మాయా బజార్ సినిమా ఫిలిం ముక్కలు..

సావిత్రి, నాగేస్రావ్ “నీవేనా నను తలచినది”పాడుతున్నారు.

*
సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా బాగుంది సుజాతా .నోస్టాల్జియా .కానీ చాలా నమ్మగలిగేలా ఉంది .టెంట్ సినిమాలు కూడా చూడలేదు .నాకు తెలిసిన మొదటి సినిమా భక్త కణ్ణప్ప ,రెండోది అనార్కలి.

 • చాలా బాగుందండి… ఒక్కసారి ఆ రోజుల కి తీసుకెళ్లారు….

 • కథ హృద్యంగా ఉంది. దీన్ని చదివితే ఆరుబయట 16 ఎంఎం సినిమాలు చూసిన వారందరూ తమ పాతరోజులను గుర్తు చేసుకుంటారు.

  టైటిల్ చాలా బాగుంది. ఏడుకొండలు పాత్రచిత్రణ వాస్తవికంగా, గొప్పగా ఉంది.

  ‘16 ఎం ఎం కంటే డిస్ట్రిబ్యూషన్ లో చాలా డబ్బులు సంపాదించాడు తను. అయినా వూళ్ళెంబడి తిరిగి కష్టపడిన ఆ రోజులే గొప్పగా ఉంటాయి. కష్టపడి సంపాదించిన ఆ డబ్బులే గొప్పవి తనకి’- ఎంత బాగున్నాయో ీ ఈ వాక్యాలు.

  ముగింపు మనసుకు హత్తుకునేలా ఉంది.

 • నాకు తెగ నచ్చేసింది. ఆ ..రోజుల్లో అని కాదు. అవి మన చిన్నతనపు గుర్తులు. ఎన్ని సినిమాలు చూశామో ఆరుబయట పెద్ద సినిమాలు అయితే తెల్లారి పోయేది. దసరా కి వెళితే బేతాళ సంబరం, వినాయక పందిళ్లు, శ్రీరామనవమిపందిళ్లు ఇళ్ల చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది.. సుజాతగారు చాలా బాగా వ్రాసారు మనసుకి హత్తుకునేలా కాదుఅమెరికా లోను ఆరు బయట సినిమా చూసాను. అదే ఆనందం

 • శ్రీరమణ గారి సోడా నాయుడు గుర్తొచ్చింది.. అంత బాగా కూడా ఉంది..అభినందనలు సుజాత గారు

 • బాగుంది. నోస్టాలజియా. మిగిలేది అదే చివరికి. చి న
  కాశీపట్నం చూడరా బాబు కూడా గుర్తొచ్చింది.

 • మళ్ళీ చిన్నప్పటి రోజులు, అమలాపురం వినాయక చవితి పందిళ్ళలో చూసిన 16mm సినిమాలు గుర్తుచేసారు,చాలా సంతోషం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు