శిశిరానికి చోటు లేదు 

ఆ రాత్రి నాకు మోహం అంటే ఏమిటో చెప్పిన రాత్రి. మైకంలో ములిగిపోవడం అనుభవంలోకి తెచ్చిన రాత్రి.

దయం పదకొండు గంటల వేళప్పుడు ఈ చెట్ల కింద, సిమెంట్ బెంచీ మీద కూర్చుని కాఫీ తాగుతుంటే చల్లని నీడ వేడి వేడి కాఫీకి మరింత రుచిని అదనంగా చేర్చుతుంది.

చాలా పెందరాళే  లేవడం వల్ల నా ఉదయపు పనులన్నీ చురుగ్గానే అయిపోతాయి. రెండో కాఫీ చిన్న ఫ్లాస్క్ లో పోసుకుని ఇన్నేళ్ళుగా నన్ను వదలకుండా ఉన్న చిన్నప్పటి పింగాణీ కప్పును పౌచ్ లో వేసుకుని, రెండు పుస్తకాలు వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తాను.

ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా పెద్దది. దాదాపు వెయ్యి కుటుంబాల నివాసం. కొంచెం పాతది కూడాను. ఇందులో బి బ్లాక్ లోని అయిదో అంతస్థులో ఉన్న నా ఇంటినుంచి రోజూ కిందకి దిగి ఈ చెట్ల కిందకి చేరడం నా హాబీ.

చెట్లని పలకరించి, నా అలవాటైన చోటుకి చేరి పుస్తకం తెరుస్తాను. పుస్తకం మీద కాస్త మనసు ఉంటుంది. మరి కాస్త ఎక్కువ మనసు చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటుంది.

ఆ సమయంలో కొందరు అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న నడకదారి మీద నడుస్తూ ఉంటారు. పసిపిల్లల్ని ట్రాలర్ ల్లోనూ, ప్రేమ్ లలోనూ వేసుకుని ఈశాన్య భారతం నుంచి వచ్చిన పనిపిల్లలు తిప్పుతుంటారు. కొందరు చిన్న పిల్లలు సైకిళ్ళ మీద రౌండ్లు వేస్తూ ఉంటారు.

నాకు చదువుకోవడం తప్ప మరో పని లేదు.

ఇలా చుట్టూ ఉన్న వీళ్ళందరినీ గమనిస్తూ ఉండడం కూడా నా చదువులో భాగమే.

అలాగే ఇవాళ నా కాఫీ, పుస్తకాలూ, నేనూ చెట్ల కింద సిమెంట్ బెంచీ మీదకి చేరేం.నేను కూచునే నీడ ఉన్న చెట్టు చాలా పురాతనమైనది అనుకుంటాను. దాని కాండాన్ని నా రెండుచేతులతో చుట్టినా ఇంకా అటువైపు అంత చోటు మిగిలిపోతుంది.అంత పెద్ద ట్రంక్ ఉన్న చెట్టు.అప్పుడప్పుడు పైనుంచి తెల్లని పూలు రాలుతుంటాయి. ఈ నగరంలో పేరు తెలియని చెట్టు.

ఒక్కొక్కసారి నేను అలవాటుగా కూచునే ఈ స్థలంలో మరొకరో, ఇద్దరో కూచుని ఉంటారు. ఆరోజు మరోచోట కూచున్నా నాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది.

అలవాట్లు మనుషుల్ని ఎలా లోబరుచుకుంటాయో అనిపిస్తుంది. కానీ ఎన్ని అలవాట్లు కలిస్తే ఒక జీవితం!

ఈ వేళ అదృష్టవశాత్తూ నా చోట్లో ఎవరూ లేరు. నా పౌచ్ పక్కన పెట్టుకుని నా కూడా తెచ్చుకున్న శరత్ ‘శేష ప్రశ్న’ నవల తీసాను. దాదాపు ముప్ఫై ఏళ్ళుగా చదువుతూనే వున్నాను. మూడు, నాలుగేళ్ళకొకసారి నాతోపాటు అదీ ఎదుగుతోంది. కమల వేసిన ప్రశ్నలు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటాయి.

సీరియస్ గా చదవాల్సిన నవల కానీ నా కుతూహలం నన్ను అక్షరాల వెంట వెళ్ళనివ్వడం లేదు. మధ్య మధ్యలో తలెత్తి చూస్తూనే వున్నాను.

నేను కూచున్న చోటు నుంచి దూరంగా ఒక మలుపు కనిపిస్తుంది. ఆ మలుపు తిరిగి ఇటు వచ్చేవాళ్ళు అంత దూరం నుంచీ కనిపిస్తారు. అందుకే నా కళ్ళు మధ్య మధ్య పుస్తకం మీంచి అటు తిరుగుతున్నాయి.
ఒక అరగంట సేపటికి ఆ మలుపు మధ్యనుంచి ఆ జంట, నేను ఎదురు చూస్తున్న జంట ఇటు తిరిగింది.

నా ఎదురుచూపు ఆగింది. కాసేపు పుస్తకంలోకి దూరేను. వాళ్ళు కాస్త దగ్గరికి వచ్చాక తలెత్తేను. ఆమె ఆకుపచ్చ కాటన్ కుర్తా, నల్లరంగు పాటియాలాలో ఉంది. దాని మీద తెల్లని గీతలున్న నల్ల చున్నీ వేసుకుంది. నలుపు తెలుపుల జుట్టు పైకి మడిచి క్లిప్పు పెట్టుకుంది. ఆయన  తెల్ల లాల్చీ , నల్ల పేంట్ లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఇద్దరూ చెయ్యీ చెయ్యీ పట్టుకుని నడుస్తున్నారు. ‘ముఖ్యంగా ఆమె చెయ్యి వదలకుండా అతను’ అని నాకు అనిపించింది.

నేనిక్కడికి వచ్చి నాలుగేళ్ళయింది. వచ్చేక మూడేళ్ళుగా ఈ చెట్ల కింద ఉదయమప్పుడు ఇలా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాను. ఎందరో యువ జంటలు సాయంత్రం పూట నడుస్తూ ఉంటారు. కానీ ఈ మలి ఉదయపు వేళలో ఇలా నడిచే జంటల్లో యువత తక్కువ. వృద్ధ జంటలే ఉంటారు.నాకు వాళ్ళని గమనించడం మీద పెద్ద ఆసక్తి ఉండదు.

కానీ రెండు నెలలుగా వీళ్ళు అంటే ఈ జంట ఈ అపార్ట్మెంట్ చుట్టూ కాక నా చుట్టూ తిరుగుతున్నారు.
ఇక్కడికి కొత్తగా వచ్చినట్టున్నారు. రోజూ ఇదే టైంలో వాకింగ్ కి వస్తున్నారు. ఇన్నిరోజులుగా వాళ్ళు నన్ను వదలకుండా ఆకర్షించడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య పైకే కనిపించే వదలలేని తనం. ఒక్కరోజు కూడా చేతులు వదిలిపెట్టి నడవడం లేదు. ఒక్కొక్కసారి అతను ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నడుస్తాడు. మరొకసారి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి నడుస్తాడు.

అతను, ఆమె అని నాకు తెలియకుండానే అంటున్నాను. నిజానికి వాళ్ళిద్దరూ ఆయనా, ఆవిడాను. ఆవిడకు అరవై ఏళ్ళు దాటి ఉంటాయి. ఆయన కూడా అరవై అయిదు దాకా ఉండొచ్చు.

మొదట్లో ఆమె నడవలేకపోతోందేమో అందుకని ఆయన అలా పొదవి పట్టుకుని నడిపిస్తున్నాడేమో అనుకున్నాను. రెండోరోజే కాదని తెలిసిపోయింది. ఆయన ఇంచుమించు ఆరడుగుల పొడుగు ఉంటాడు. ఆమె ఆయన భుజాల దాకా వస్తుంది. నడుస్తున్నంత సేపూ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు.

నా కుతూహలం ఆగక ఒకటి రెండుసార్లు కాస్త ఎడంగా వాళ్ళ వెనక నడిచి చుట్టూ తిరిగేను. దారంతా వాళ్ళది అదే విడవలేనితనం.

మళ్ళీ ఇవాళ కూడా నాకు చెట్ల కింద వేడి కాఫీతో పాటు ఈ ఆనందాస్వాదన కూడా దొరికింది.
ఈ వయసులో కూడా ఇద్దరూ అందంగా ఉన్నారు. కలిసి ఉండడంలోని సంతోషం వల్ల కూడా కావచ్చునేమో.

-2-

విడిపోయినా  కూడా నేనేమోగాని అతను ఇప్పటికీ అందంగానే ఉంటాడు. హేండ్సమ్ అనాలేమో! లేదా నాకు ఇష్టం కాబట్టి అలా అనిపిస్తాడేమో!!

రామ్ తో నా ప్రేమ మూడు పువ్వులు ఆరు ఎండుటాకులుగా గడిచింది. పాల కోసం రాళ్ళు మోసినట్టు ఈ ముచ్చటగా పూసే మూడు పూల కోసం జీవితంలో సగం రోజులు శిశిరమే అయింది.ప్రేమల మీద నమ్మకమే పోయింది.

అయినా ఈ జంట మధ్య నేను చూస్తున్న అన్యోన్యత నన్ను ముగ్ధురాలిని చేస్తోనే వుంటుంది.
మొదటిసారి నేను రామ్ ని చూసినప్పుడు ఇతనే నేను వెతుక్కుంటున్న మనిషి అనిపించింది.
ఆ రోజు సాయంత్రం ఒక స్నేహితురాలి ఇంటి టెర్రస్ మీద జరిగిన చిన్న సమావేశంలో రామ్ పరిచయమయ్యాడు, ఆ స్నేహితురాలి కజిన్ గా.

నన్ను పరిచయం చెయ్యగానే నా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ లో స్నాక్స్ నిదానంగా తింటూ నా వివరాలు అంత నిదానంగానూ ఒక్కొక్కటీ అడిగాడు. అదయ్యాక లేచి వెళ్ళి రెండు కాఫీ కప్పులు రెండు టిష్యూ పేపర్లూ తెచ్చి నాకు కూడా ఇచ్చి పక్క కుర్చీలోనే కూర్చున్నాడు.

కొంచెంసేపు సంకోచంగా ఉన్న నాకు మరికాసేపట్లో సంకోచం పోయి నేనూ అతన్ని ప్రశ్నలడిగేలా అయ్యేను.
ఎదుటి మనిషిని అలా మార్చే చనువు అతనిలోని ఆకర్షణ. అది కంఠస్వరంలో, మాట తీరులో, సంబోధనలో, పలకరింపులో, ఒప్పుకోలులో అన్నింటా వుంది.

కాఫీలు తాగేం. వివరాలలోంచి కబుర్లలోకి వచ్చేం. చదువులూ, ఉద్యోగాలూ మాటాడుకున్నాం. ఇంకా మాటాడుకుంటూ ఉండగా ఆ స్నేహితురాలు రామ్ ఇప్పుడు మనకి ఒక లలిత గీతం వినిపించబోతున్నాడు అని ప్రకటించింది. నేను ఆశ్చర్యంగా చూసాను.

అతను నాకేసి చూసి నవ్వి మళ్ళీ కలుద్దాం అని అక్కడే ఉన్న చిన్న డయాస్ మీదకి వెళ్ళి పాట పాడేడు.
తిరిగి అదే స్వరం. ఎదుటి మనిషిని దగ్గర చేసుకునే స్వరం. మరో పాట, మరో పాట. అందరూ అడిగి మరీ చాలా పాటలు పాడించుకున్నారు.

అంతా అయ్యేసరికి చాలా ఆలస్యం అయింది. ఐనా నేను అతనికి చెప్పి వీడ్కోలు తీసుకోకుండా రాలేననిపించింది. వచ్చేసే ముందు చెయ్యి చాపేను. అతను ఏ భావమూ లేకుండా నా చెయ్యి మృదువుగా పట్టుకుని వదిలేసాడు.

ఆ రాత్రి నాకు మోహం అంటే ఏమిటో చెప్పిన రాత్రి. మైకంలో ములిగిపోవడం అనుభవంలోకి తెచ్చిన రాత్రి.

-3-

రామ్  కూడా నన్ను ఇష్టపడ్డాడు. ఆ కలిసిన మొదటిరోజే రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవాలని అనిపించిందని తర్వాత రోజుల్లో చెప్పాడు. నన్ను తొందరగా మనుషులు ఇష్టపడతారు ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా. ఆ సంగతి నా అనుభవంలో ఉంది. అలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఇష్టపడ్డాడు.

రోజులు మనసులు పంచుకోవడాలతోనూ, సాయంత్రాలు పాటలుగా మార్చుకోవడాలతోనూ గడిచాయి.
పెళ్ళి, సంసారమూ ఏర్పాటు చేసుకోవడం ఎంత సేపు!! చిన్నప్పటి నా కల నిజమయింది, ప్రేమించిన మనిషితోనే పెళ్ళి జరగాలని.

– 4 –

అవును. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ నా మీద అలాంటి ముద్ర వేశారు. మోహనరావు గారు, జ్యోతి గారూను. మోహనరావు గారు మా స్కూల్ లో డ్రాయింగ్ మాష్టారు. అంతేకాక మంచి చిత్రకారుడు. హాయిగా పాటలు రాసేవాడు, ఇంకా హాయిగా పాటలు పాడేవాడు. ఆ ఇల్లంతా ఆయన వేసిన చిత్రాలతో, చేతితో చేసిన కళాకృతులతో ఎంతో మనోహరంగా ఉండేది. ఆయన కాస్త పొట్టిగా ఉన్నా సూదిముక్కుతో, విశాలమైన కళ్ళతో, పసిమి రంగుతో చాలా అందంగా ఉండేవాడు. ఆమె కొంచెం నలుపు కానీ, పొడుగాటి జడతో, కళైన మొహంతో, కాస్త బొంగురు గొంతు అయినా బాగానే ఉండేది.

ఆయన ఆవిడను కూచోపెట్టి వేసిన చిత్రాలు చూపించినప్పుడు ఆ పదిహేనేళ్ళ వయసులో అసూయ పడ్డాను. ఎందుకో అర్థం కాలేదు. మాష్టారిని నేనూ ప్రేమిస్తున్నానా అని సందేహం వచ్చింది. దానిమాట ఎలా ఉన్నా జ్యోతిగారు ఆయనకి తగిన భార్య కాదని నా ఉద్దేశ్యం.

వాళ్ళ ముగ్గురు పిల్లలూ, ఆయనా కలిపి పాటలు పాడుకుంటూ ఉండే సాయంత్రాల కోసం నేను మా స్నేహితులతో కలిసి వాళ్ళింటికి పోయేదాన్ని. వాళ్ళ రెండో అబ్బాయి కంజిరా వాయిస్తుంటే ఆయన పాటలు పాడుతుంటే ఆవిడ మల్లెపూలు పెట్టుకుని ఆయనను ఆనుకునే కూర్చునేది.

తర్వాత కాలంలో తెలిసింది వాళ్ళది ప్రేమ వివాహం, కులాంతరం కూడా అని. ఆ లేత యవ్వనంలో నా మనసులో అదొక ముద్ర.

ప్రేమ వివాహంలో ఇంత ఆనందం ఉంటుందని.

తర్వాత జీవితంలో విఫలమైన ప్రేమ పెళ్ళిళ్ళు చూడకపోలేదు.

మా అన్న సహోద్యోగి, ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో ఇంజనీర్. ఆయనా, ఆయన భార్యా నా చిన్నప్పటి నుంచీ మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఆరడుల పొడుగు, పసిమి ఛాయ. ఆమె అప్ టు డేట్ గా ఉండే ఆధునికమైన అలంకరణను సింపుల్ గా చేసుకునేది. నా చిన్న వయసులో ఆమె అలంకరణే నాకు పెద్ద ఆకర్షణ.
నెత్తి మీదకి వేసుకున్న ముడి, సన్న జరీ వెంటగిరి చీరలు, లేదా లేత రంగుల ఆర్దండీ చీరలు, నాజూగ్గా చేయించుకున్న నగలు.

వారిద్దరూ మా ఇంటికి కార్ లో వచ్చేవారు. రెండు మూడు గంటలు, మా డ్రాయింగ్ రూమ్ కబుర్లతో, నవ్వులతో నిండిపోయేది. ఇద్దరూ సరదా మనుషులు. భోజనాలు చేసే వెళ్ళేవారు.

వాళ్ళు వచ్చి వెళ్ళేక మా అన్న వదినలే కాక ఇల్లంతా ఉత్సాహంతో పొంగిపొరలినట్టుండేది. వాళ్ళది లవ్ మేరేజ్ అని మా వదిన ఎవరికో చెప్పగా విన్నాను. ఇప్పటికీ ఆ రాహుల్ నీ, అపర్ణనీ మరిచిపోను. మరిచిపోలేకపోవడానికి కారణం వాళ్ళ అన్యోన్యత కాదు.

పదేళ్ళ తర్వాత పిల్లలు పుట్టలేదని రాహుల్ అపర్ణ నుంచి డైవోర్స్ తీసుకున్నాడన్నది.

ఇది వినగానే నేను షాక్ అయ్యేను. వాళ్ళని కలిపి చూసినవాళ్ళూ ఎవరైనా సరే ఈ వార్తను అరాయించుకోలేరు.

ఇదంతా నా పాతికేళ్ళలోపే జరిగింది. ఐనా ప్రేమించకుండా నా జీవితంలో పెళ్ళే లేదని నేను చేసుకున్న తీర్మానం అలానే ఉంది.

చదువుకునే చోట ఎవరూ నచ్చేవారు కాదు. ప్రపోజల్స్ ఉండేవి కాని పక్కన పెట్టేదాన్ని. ‘లవ్ ఎట్ ఫస్ట్’ అని కదా నమ్మకం. మంచి ఉద్యోగంలో కుదురుకున్నా కూడా కావలసినవాళ్ళు దొరకలేదు.

ఇలా అనుకోకుండా ఇప్పుడు మొదటి చూపులోనే రామ్ నావాడు అయ్యాడు. ఇంత కాకపోయినా తనూ ఇలాగే పడిపోయానని చాలాసార్లు చెప్పేడు.

పెళ్ళి అన్న మాట దగ్గరే ఏదో ఉంది. అంతదాకా స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి వేరే సంబంధంలోకి మారతారనుకుంటాను.

కొంతకాల జీవితం పూలపడవ లా  సాగింది. క్రమంగా పడవలోకి నీళ్ళు రావడం మొదలయి ఒకవేపుకే ఒరిగిపోతూ వచ్చింది.

రామ్ సాధారణమైన మగవాడు కాదు. సమానత్వం గురించి తెలిసినవాడే. కానీ ఎన్ని తెలిసినా మనుషుల విసుగులూ, చిరాకులూ, అసహనాలూ ఎక్కడికి పోతాయి.అంతకన్న పెద్దవి అహాలు. నిజం ఒప్పుకోవాలంటే అవి మా ఇద్దరిలోనూ ఎక్కువే. రెండేళ్ళలో పంధొమ్మిది సార్లు దెబ్బలాడుకున్నాం. చివరకు విడిపోదాం అనుకున్నాం. తన సామాను తీసుకుని ఇంట్లోంచి, ఊర్లోంచి కూడా వెళ్ళిపోయాడు.

నాకు జీవితంలో ఏమీ మిగలలేదనిపించింది. దీన్ని కష్టపడైనా సరే మింగితీరాలని పట్టుదలగా రోజులు గడిపేసేగాని నేను నేనుగా లేను.

-5-

ఏడాది గడిచింది. ఒకనాటి పోస్ట్ లో ఉత్తరం. “ఒక్కసారి చూసి వెళ్ళాలని వుంది. ఇంటికి రాను. బయట ఫలానా చోటకి రా. ప్లీజ్” అని.

నా సమస్తేంద్రియాలూ నిద్రలేచాయి.మేలుకునే ఉన్నాయేమో. నాకు ఇష్టమైన చీర కట్టుకుని అందంగా తయారయేనని నమ్మకం కుదుర్చుకుని కాస్త ముందుగానే వెళ్ళేను అప్పటికే వచ్చి వున్నాడు. ఇన్ షర్టూ తనూను. కలిసిన మొదటిరోజు గుర్తొచ్చింది.

కార్ లో కూచుని మాటాడుకుందాం అన్నాడు. మళ్ళీ అదే కంఠస్వరం, అదే లాలన. చీకటి పడింది. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి కలిసి తిందాం తర్వాత వెళ్ళిపోతాను అన్నాడు.

నేను ఏదీ కాదనే పరిస్థితిలో లేను.

రెస్టారెంట్ లో పల్చని వెలుగులో తనకిష్టమైనది నేను, నాకిష్టమైనది తనూ తిన్నాం. బయటికి వచ్చేస్తూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని థాంక్యూ అన్నాడు. నాకు ఏమయిందో గాని “ఇంటికొచ్చి వెళ్ళు” అన్నాను. అతని మొహంలో వెలుగు.

ఇంటికొచ్చాం. బెడ్ రూం లో పక్క మీద దుప్పటి మార్చి వెయ్యబోతోంటే  దుప్పటి చివర్లు పట్టుకుని అలవాటుగా అటువైపు సరిచేసాడు. దగ్గరగా కుర్చీ లాగి నేను మంచం మీద దిండునానుకుని కూర్చున్నాను.

అదే బెడ్ రూం, అదే రాకింగ్ ఛైర్

‘‘ఏదీ ఒక పాట పాడు’’ అన్నాను.

“పాటలు పాడడం లేదు. మానేశాను” అన్నాడు. అతని మొహం లో దిగులు. మంచం మీద పక్కన కూర్చోమని సైగ చేశాను. వచ్చి కూర్చుని నా చేతుల్లో మొహం దాచుకున్నాడు. చేతులు తడిసిపోయాయి.
నా మనసు ఆగలేదు.

మళ్ళీ కథ మొదలయింది.

తెల్లవారుజాము నాలుగు దాకా మేలుకునే వున్నాం. నేను లేచి ఫిల్టర్ లో డికాక్షన్ వేసి, పాల పేకెట్ తీసి పాలు కాచి, తాజాగా కాఫీ కలిపాను. రెండు పెద్ద కప్పులతో బాల్కనీ లో ఎప్పుడూ కూర్చునే కుర్చీల ఆహ్వానం మన్నించాం.

అప్పుడు పాడాడు. ‘‘ఆజ్ ఫిర్ జీనేకీ తమన్నా హై..’’ అంటూ.

రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. మోహాల నుంచి బయటపడలేదు కానీ సద్దుకునే స్వభావాలు కాదు. జీవితంలో కొంత భాగం పూలతోట లాగా, ఎక్కువ భాగం రణరంగంలాగ ఉండేది.

మొదటి రోజుల్లో సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఒకరోజు ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెడదాం రమ్మన్నాడు. నాకు ఆఫీసులో ఏదో గొడవయ్యి మనసు చికాకుగా ఉంది. అదే చెప్పి రాలేనన్నాను. సినిమాకి వస్తే బాగుంటుంది అన్నాడు. సారీ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాను. అంతే కోపం వచ్చి అప్పటినుంచి తను సినిమాలు మానేశాడు. తర్వాత నేను ఎన్నిసార్లు రమ్మన్నా రాలేదు. అంత మొండి పట్టుదల. అయితే ఒకసారి  నా ఫ్రెండ్ మంచి సినిమా వచ్చింది వెడదాం రమ్మంటే వెళ్లేనని ఇంటికి వచ్చాక పెద్ద గొడవ చేశాడు. నీ మూలాన నేను మానేస్తే నీకు నా లక్ష్యం లేదు అంటూ సాధించేడు.  చాలా రోజులు దాని ప్రభావం మా మీద ఉంది.

నా బ్యాంక్ అకౌంట్ తరచుగా చెక్ చేస్తూ ఉండేవాడు. తర్వాత రోజుల్లో వచ్చిన నా ఏటీఎం కార్డు తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. నీ మంచి నీకు తెలియదు నీకు ఏది మంచో నాకు తెలుసు అనేవాడు. ఆఫ్ కోర్స్ తను నా డబ్బు ఏమీ వాడుకునే వాడు కాదు కానీ నా మంచిని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి కదా. చిన్నపిల్లను కాదు కదా.

అయిన దానికి కాని దానికి గొడవలు పడుతూ ఉండడం, చినుకు చినుకు గాలి వానలు కావడం జరుగుతూనే ఉండేది. ఇది కాక ప్రతిదానికి  నా మీద నీకు ఇష్టం పోయింది అని సాధిస్తూ ఉండేవాడు.

సుధ పుట్టింది. పెద్దదయింది. అర్థం చేసుకుంది. ఇద్దరినీ ప్రేమించింది కానీ మా మధ్య స్నేహం కుదరదు అని తేల్చేసింది. చదువులకూ, ఉద్యోగాలకూ దూరదేశాలకు వెళ్ళిపోయింది.

చివరకు నా అరవయ్యేళ్ళ వయసులో తెగించి బయటకు వచ్చేసాను. ఉద్యోగంలోనే కాక, మోహ జీవితంలోంచి కూడా రిటైర్ అయ్యాను.స్నేహం లేని మోహం కష్టం.

ఒక రకంగా వయసు మమ్మల్ని మార్చాలి. కానీ మార్చలేదు.

మా మధ్య కెమిస్ట్రీ అలానే ఉంది.ఎదురుపడితే కొద్దిసేపు అంతా మర్చిపోతాం. మళ్లీ మామూలే.
ఆ మోహం ఉంటే ఉండనివ్వు. దాన్ని పెడచెవిని పెడతాను, దూరంగా ఉండి. అని నాలుగేళ్ళుగా ఇలా దూరంగా ప్రశాంతంగా ఉన్నాను.

భూకంపాల లాంటి మోహాలు, అగ్ని పర్వతాల లాంటి గొడవలూ లేకుండా.

నా ఇల్లు, నా పాటలు, నా పుస్తకాలూ, నా కాఫీ, నా స్వేచ్ఛ, నా స్పేస్.

ఇదిగో మళ్ళీ ఈ మలివయసు జంట నన్ను కాస్త అలజడికి గురి చేస్తున్నారు. వాళ్ళు ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఇటు వస్తున్నారు. నేను కాఫీ తాగుతూ వాళ్ళవేపు చూస్తుండగా ఫోన్ మోగింది.

సుధకి ఇప్పుడు రాత్రి. వర్క్ పూర్తి చేసుకుని పలకరిస్తుంది రోజూ ఇంచుమించు ఇదే టైంకి.

‘‘ఎలా వున్నావు రాణీ’’ అంది. నా పేరు ఉషారాణి. అది ముద్దుగా రామ్ లాగే నన్ను రాణీ అని పిలుస్తుంది.

‘‘దిల్ మె అబ్ కోయీ ఖయాల్ భీ నహీ హై’’ అన్నాను. పాడకుండా వచనంలాగ. నేను పాడితే అది ఫోన్ ఆపేస్తుంది.

“ఇంకేం! అలాగే ఉండు.” అంది.

“ఈ జంట మాత్రం నాకు పెద్ద పజిల్ లా ఉన్నారనుకో. ఈ వయసులో ఇంత అన్యోన్యత, ప్రేమా, చుట్టూ ఉన్నవాళ్ళని పట్టించుకోనంత ఇష్టం.”…. అంటూంటే సుధ

‘‘అమ్మా ఒక్కసారి వాళ్ళని ఫాలో అయి చూడు. వాళ్ళు ఇద్దరూ వేరే వేరే ఇళ్ళలోంచి బయటకు వస్తున్నారు. తిరిగి ఎవరిళ్ళకు వాళ్లు వెడతారు. కావాలంటే పందెం’’ అంది.

“నిజం కూడా అవ్వొచ్చు. కానీ ఆ ఆలోచన రాలేదు సుమా!” అని నవ్వాను.

ఇంకేవో మాటాడుకున్నాం.

నిజమే వీళ్ళు పెళ్ళి అనే పీటముడిలో బంధించబడలేదేమో! అందుకే వీళ్ళ కెమిస్ట్రీ ఇంకా నడుస్తోందేమో!
అయినా వాళ్ళకి తెలీకుండా ఒక్కసారి వాళ్ళని ఇంటిదాకా వెంబడిద్దామా అని కొంటె ఆలోచన గట్టిగానే కలిగింది.

ఎవరి జీవితాలలోకేనా తొంగిచూసే హక్కు మనకేం వుందీ, వాళ్ళని ఎక్కడయినా ఉండనివ్వు. ఇలా ఈ శీతాకాల ఉదయపు వెచ్చని ఎండలో నా ఎదురుగా నడిచి వచ్చే ఈ కావ్యాన్ని అపశబ్దాలు లేకుండా ఆస్వాదించగలిగితే చాలు.

ఇందాక నా పల్లవి అందుకుని సుధ పాడిన చివరి చరణం గుర్తొచ్చింది. సుధ కూడా రామ్ లాగే పాటలు పాడుతుంది.

‘‘జీత్ గయా తుఝె భూల్ కే, మై ఐసీ జైసీ’’

అవును. నేను రామ్ ని మర్చిపోయి జీవితంలో గెలిచాను. జీవితంలో ఎక్కడా ఓడిపోనట్టుగానే గెలిచాను. కానీ నిజంగా ఇది గెలుపా!!

*

చిత్రం: సృజన్  రాజ్ 

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బావుంది మేడం. గెలుపా, ఓటమా అనే వాక్యం కథను మరో ఆలోచనలోకి తెచ్చింది. అభినందనలు మేడం.💐

  • బాగుందండి . నిజమే – ఈ మోహం , స్నేహం — రెండూ కలిస్తనే అందంగా వుంటుంది జీవితం .

  • చాలా బాగా రాసారు 👌🏼👌🏼
    పెళ్ళి అనేది ప్రేమకి ముగింపులా అనిపిస్తుంది ఒకోసారి. మరొకసారి ఈ పెళ్ళి వలనే కదా మనుషులు అనుబంధాల బందీలవుతారు అనిపిస్తుంది. మంచి కథ 👌🏼👌🏼

  • కొన్ని పోరాటాల్లో గెలుపులూ, ఓటములూ తేల్చడం కష్టం. జంటలో ఇద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నా భాగస్వామిని కన్న తననే ఎక్కువ ప్రేమించుకునే జంటల్లో కొంత కాలానికి ఒకరకమైన గేప్ చోటు చేసుకుంటుంది.
    రచయిత్రి భావమేదైనా కాని నాకు ఇలా అర్థమయింది.

  • భార్య భర్తల మధ్య గెలుపు ఓటమి రెండూ సమానమే! మనసుకు నచ్చిన స్వేచ్ఛ ఇరువురు కోరుకున్నారు. విడిపోయారు, మళ్ళీ కలసి నడవవచ్చు. కథ బాగుంది. ప్రేమలో వున్న మాధుర్యం పెళ్ళిలో కూడా వుంటుంది. టామ్ అండ్ జెర్రీ ఆటలాగా వుంటుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.