శిక్కోలు లెక్క

వోబ్బో…మాకాడ దమ్మిడీకి కొరగానోడల్లా ఈడ కొచ్చి సానా పెద్ద మడుసు లయిపోతిరే?

అయిద్రాబాద్ నించి రెయిల్లో వస్తన్నాను. నా పక్కన ఒకాయన కూకున్నాడు. సేనా సేపు అతగాను పోన్ లో మాటాడతానే ఉన్నాడు. ఒక పక్క హల్జీరాం మసాలా చిప్సు తింటూ!ఫోన్ మాటాడ్డం అయిపోయింది. చిప్సు తిండం అయిపోయింది. ఒక సిటం అటూఇటూ సూసేడు. తరాత కాళు మీద కాలేసుకున్నాడు. నా వేపో సారి సూసేడు. అతగాని మెడలో గొలుసుంది,అది బంగారందే! సేతికి వాచీ ఉంది,అది బంగారమ్ కంటా ఖరీదయిందే! యెడమ సేతి యేళ్ళలో మూడింటికి మూడు ఉంగరాలున్నాయి. అవి మెరస్తన్నాయి.

నా ప్రయాణం యెంత వరకో అని అడిగి తెలుసుకున్నాడు. తరాత ఒక చిరు దగ్గు దగ్గి ,కిన్లే వాటర్ తాగి   – మీ శ్రీకాకుళం బాగా డెవలప్ అయిపోయిందండీ? అబ్బో…క్రిష్ణా, గోదావర్లు చాలవండీ…అనన్నాడు. నా భుజాలు గజాలయిపోనాయి.

అప్పుడతగాను – తన ప్రాంతానికీ, శికాకుళంకీ తేడాలు యెత్తుకున్నాడు.

ఆళ్ళ ప్రాంత భూములుకి శికాకుళం భూములంత ధరల్లేవట!

ఆళ్ళ ప్రాంతాన ఇన్ని వనరులు లేవట! అడవులూ…అక్కడి కలప, ఔషదమొక్కలు! కొండలు…ఆట్లోని గ్రానేటు..!సముద్రం…దానిలోని సేపలు..!మీ భూములో – బంగారం పండెస్తాయి! మాకు ఇవేవీ లేవు గానీ…ఉంటేనా? అని దవడలు చప్పరించేడు.

ఇన్ని ఉన్నా…అవన్నీ యెవుళెవులో పర ప్రాంతమోళ్ళు చప్పరించెస్తన్నారండీ బాబూ – అని అనబోయేను. గానీ అతగానూ పరప్రాంతమోడే కదా? శికాకుళమే వొస్తండు కదా? ఇతగానేటి చప్పరించడంకి వొస్తండో…అని అనుమానమేసి ఆగిపోనాను, ఆగిపోనాను గాని మనసు దువ్వేస్తంది – అతగాను యెందుకు శికాకోళమొస్తండా అని? ఆ ముక్కే అడిగినాను – నాగావళీ,వంశధార నదుల అనుసంధానం వర్క్ కాంట్రాక్టు మాదే అనన్నాడు. మూడేళ్ళుగా శ్రీకాకుళానికీ మా వూరికీ మధ్యన తిరుగుతున్నానన్నాడు. కాసేపాగి – మీ వోళ్తోటి సానా కష్టిమేనండో – అనన్నాడు. యేమిటా కష్టిమటా – మా వొళ్ళు భూములివ్వరట ఒకంతట!   కలక్టర్ల కాగితాలకి కసిగందరట! మినిష్టిర్లు మాటల్ని ఇనిపించుకోరట!! చట్టమంటే లెక్కజెయ్యరట!!! సానా కష్టిమే సుమా మీ వోల్తోటి – అనన్నాడు మళ్ళా. ముందు తెలీలేదట!

వోబ్బో…మాకాడ దమ్మిడీకి కొరగానోడల్లా ఈడ కొచ్చి సానా పెద్ద మడుసు లయిపోతిరే? బొచ్చు మందిని సూస్తినే? మీ ఇసుక తీసకొస్తండ్రు. మీ కలప తీసకొస్తండ్రు. మీ భూములు కొని పడేస్తండ్రు. అబ్బా! యేమి రేట్లు మీ భూములుకి? మాకింత లేవు. అమరావతిలో లేవబ్బా ఆ రేట్లు…అని మధ్యలో భూముల రేట్లకి ఆశ్చర్యపోయాడు. దానికి ఆయనే కారణం చెప్పాడు – మీ భూముల్ని కొనేడానికి మీ ప్రాంతంలో మూటలున్నోళ్ళు, క్రిష్ణా,గోదావరీ,లెక్క బాగున్న రాయలసీమోళ్ళు వొస్తారు. యెవురెవురో మీ ప్రాంతం భూములు కొనడానికొస్తారు. మీ వోళ్ళు అలగ ఉంకో ప్రాంతం పోయి భూములు కొన్రు. మీకు కొనే వోరు యెక్కువ…అని చెప్పాడు. తరాత మళ్ళా అందుకున్నాడు…తనకంటా ముందర ఇటు వొచ్కినోళ్ళ గురించి-

వోళ్ళు, మా వోళ్ళేనే? యెట్లా సాధ్యమయ్యింది మరీ – కొశ్చిన్ మార్క్ మొహం పెట్టేడు. ఆళ్ళంతా ఇటొచ్చి బాగుపడగా నేనెందుకు బాగుపడలేనూ అని టెండరేసా! మూడు యేళ్ళాయె. ముందుకెళ్ళదు వర్క్. నదుల అనుసంధానానికీ భూములివ్వకపోతే…యెలా అభివ్రుధ్ధి అవుద్దండీ? నాకు ఖర్చులయిపోతున్నాయి. పోనీ యెస్టిమేషన్ పెంచుతారా అంటే చెప్పలేమ్! కలక్టర్లనీ,పొలిటీషియన్లనీ కాదు పోలీసువోళ్ళను పట్టుకోవయ్యా అని సలహా ఇచ్చాడు ఓ ఫ్రెండు…యేదో చెయ్యాల! యెలక్షన్ కోడ్ గానీ వొస్తే ఇంతే సంగతులు. తరాత…యెవురు గద్దె మీదకి వొస్తారో,యేమో?యేమంటారు అనడిగాడు. నేనేమంటాను?

తర్వాత కాసేపు ఆగి ఆయనే – మీ వోళ్ళు అమాయకులనీ, మీ వోళ్ళకి మాట తీరు తెలియదూ, కట్టూబొట్టూ తెలియదూ, ఆడవాళ్ళు జాకెట్లేసుకోరు, సుట్టలు కాలుస్తారూ… అబ్బబ్బా …గొప్ప వెనకబడ్డ వోళ్ళూ అని విన్నానే! అసలకు మీ వోళ్ళకు లెక్కలు రావనీ, వందకీ,వెయ్యికీ, లక్షకీ తేడా తెలియదనీ అంటారే…మరి ఇదేమిటీ? అని ప్రశ్నించేడు. జవాబు చెబితేగానీ వొదిలేట్టు లేడు. అప్పుడు నాకొకనాటి సంఘటన గుర్తొచ్చింది. మావాళ్ళకు యే లెక్కలు వచ్చో తెలియజేసే సంఘటన అది –

నాలుగు దశాబ్దాల కిందట. ఒక వూరిలో జనకళామండళి బ్రుందం వాళ్ళం ప్రదర్శన వేయడానికి వెళ్ళాం. మేకప్ లు అయినాయి, స్టేజి మీదకి వచ్చాం. ఇక ప్రదర్శన ఆరంభిస్తామనగా పోలీసులొచ్చారు. ప్రదర్శన వేయడానికి వీళ్ళేదన్నారు. యెందుకు వీళ్ళేదు? ఇదేమీ నిషేదించలేదు కదా అని వాదించేమ్. అపుడు …మైక్ పర్మిషన్ లేదు అని మైక్ పీకేసి పట్టుకుపోయి స్టేజికి దూరంగా వేన్ దగ్గర నిల్చొని గమనిస్తున్నారు.

మేము వీరావేశంగా పోలీసుల వైఖర్ని ఖండిస్తూ – ఈ వూరిలో ఇప్పటిదాకా జరిగిన యే ప్రదర్శనకూ మైక్ పర్మిషన్ పెట్టలేదు, పోలీసులూ అభ్యంతరం పెట్టలేదు.(అవి దసరా నవరాత్రుల సందర్భం)ప్రజలను నిద్ర పుచ్చే కళలకు అభ్యంత రాలుండవు, ప్రజలను చైతన్యం చేసే కళారూపాలకే రాజ్యం అభ్యంతరం! ఇది ప్రజావ్యతిరేక రాజ్యం. ఇది పోలీస్ రాజ్యం ‌-ఇలా ఉపన్యాసాలు, కాకిబట్టలోడా..కాంగ్రేసు గులాపోడా పాట, ఇలా రెండు గంటలు ప్రదర్శన ఇచ్చినాం…మైక్ లేకుండానే!

ప్రదర్శన అయిపోయాక నిర్వాహకులు పోలీసులను మైక్ ఇమ్మని అడిగేరు.    పోలీసులు…రేపు స్టెషన్ కి వొచ్చి తీసుకోమ్ డి అని వేన్ కదపి వెళ్ళబోతే నిర్వాహకులు వొప్పుకోలేదు. మైక్ పర్మిషన్ లేదన్నారు, మైక్ లేకుండా జరిగింది కదా, మరింకేమ్?. మా మైక్ మాకు ఇచ్చి వెళ్ళండి అన్నారు.

పోలీసులు రేపు రండి అంటారు, నిర్వాహకులు ఇప్పుడివ్వండి అంటారు. మొత్తానికి ఘర్షణ అయ్యింది. పోలీసుల నుంచి మైక్ లాక్కున్నారు నిర్వాహకులు. పోలీసులు తక్కువ మంది గనక నిర్వాహకులదే పై చేయి అయ్యింది.

అవమానకరంగా వెళిపోయిన పోలీసులు తెల్లవారి అదనపు బలగంతో, ఆయుధాలతో వచ్చి వూరి మీద పడ్డారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకొని కొట్టారు. పేద,ధనిక అని తేడా చూడలేదు. పెద్ద రైతులు – బాబూ మేము పెద్ద రైతులం, కూలీలం కాము, మమ్మళ్ళి కొట్టకండి అన్నా దరువులు పడిపోయాయి. కొట్టికొట్టి అరెస్టులు చేసారు. వూరిలో వీరంగం వేసి కొడుతున్నారు.

ఒకటి, రెండు, మూడు,నాలుగు – ఇలా లెక్క బెడుతున్నాడు,తన వీపు మీద పడిన లాఠీ దెబ్బలను భీసెట్టి చిన్నోడు.

కొడుతోన్న పోలీసు – దెబ్బలకు అబ్బా,అమ్మా అనకుండా లెక్కబెడుతున్నాడేమిటా అని ప్రశ్న కలిగింది. కొట్టడం ఆపి – యెందుకురా లెక్క బెడుతున్నావని అడిగాడు. అప్పుడు ఆ చిన్నోడు – బాగుంది. లెక్కబెట్టకపోతే యెలాగ? ఈ పొద్దు మీ రాజ్యం ఉంది. నువ్వు కొడతన్నావు. రేపు మా రాజ్యం వొస్తాది. వొచ్చినపుడు…నీను బాకీ తీర్సుకోవాల గదా? ఒకటి యెక్కువా, ఒకటి తక్కువా అవగూడదు కదా? లెక్క సరిపోవాల కదా – అందుకు లెక్క బెడతన్నానన్నాడు. ( సరే, ఆ జవాబుకి ఆ పోలీసు రియాక్షన్ యేమిటి ఇక్కడ చెప్పక్కర్లేదు)

ఈ సంఘటన చెప్పి – ఇదండీ శికాకుళం వోళ్ళకి తెలిసిన లెక్కలు అనన్నాను అతగానితో.

అతగాను యేమనునో గానీ – అతగానూ,నేనూ దిగాల్సిన శ్రీకాకుళం రోడ్ స్టేశన్ వచ్చేసింది. యెవరి లగేజీ వాళ్ళం వెదుకులాటలో పడిపోయాం.

*

అట్టాడ అప్పల్నాయుడు

అట్టాడ అప్పల్నాయుడు

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దబ్బలం దిగబడిపోనాది.లెక్కయిన్నాక.బతుకుమీద ఆశ వున్నోడెవుడూ మరింక సంచులు లెగేసుకు పోడానికి యీ దరిదాపులికి రాడు.

  • ఏటో మరి !లెక్కలప్పజెప్పెరోజెప్పుడొ త్తుదో..

  • మనమంటే లెక్కే లేనోళ్ళకి ఈ లెక్కతో తిక్క కుదురుతుంది.

  • సిక్కోలు లెక్కంటే లెక్క.
    మనమంటే లెక్కలేనోళ్ళకి బాగా బుధ్ధి చెప్పారు.

  • ‘ఈ పొద్దు మీ రాజ్యం ఉంది. నువ్వు కొడతన్నావు. రేపు మా రాజ్యం వొస్తాది. వొచ్చినపుడు…నీను బాకీ తీర్సుకోవాల గదా? ఒకటి యెక్కువా, ఒకటి తక్కువా అవగూడదు కదా? లెక్క సరిపోవాల కదా ‘ – ఇదీ లెక్క.
    తయారుగా ఉండండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు