శకలము

శీతాకాలం వచ్చినా, మూసిన కిటికి రెక్కల మధ్య నుంచి, తలుపుల మధ్య సందులనుంచి, డ్రైనేజ్ గొట్టాల లోపలి నుంచి వస్తున్నాయి.

దోమలు.
పనులు చేసుకోనివ్వవు. నిద్రపోనివ్వవు. కాయిల్స్ పొగతో చంపేస్తుంటే, వేపర్ లు పనిచేయ్యడంలేదు. ఒకొక్కసారి ఆ దోమలు వాటి మీదే విశ్రాంతి తీసుకుంటున్నాయి.

ఆ మధ్య ఎక్కడో చూసాడు…వాసన కడ్డీలట…దోమల నుండి బాగానే కాపాడుతున్నాయని విన్నాడతను. శీతాకాలం వచ్చినా, మూసిన కిటికి రెక్కల మధ్య నుంచి, తలుపుల మధ్య సందులనుంచి, డ్రైనేజ్ గొట్టాల లోపలి నుంచి వస్తున్నాయి. ఇక లాభం లేదని బయలుదేరాడు.

మహాగురు కిరాణా అండ్ జెనరల్ స్టోర్స్. ఎర్రటి అక్షరాలతో ఉంది పెద్ద బోర్దు. ఇక్కడుంటాయేమో, చూద్దామనుకుని రోడ్డు క్రాస్ చేసాడు. రెండు షట్టర్లు. ఒకొక్క షట్టరు పది అడుగుల వెడల్పు. ఎడం చేతివైపు షటర్ లోపల బస్తాలు, పెద్ద పెద్ద అట్టపెట్టెలు. బస్తాలలో బహుశ బియ్యం, గోధుమలు ఇంకేవో ధాన్యాలుండి ఉంటాయి. పెట్టెల్లో ఇతర వస్తువులుండి ఉంటాయి. ఆ గది నిండుగా ఉంది.

కుడి చేతి వేపు షటర్^కి, నడుం ఎత్తు కౌంటరు అడ్డంగా ఉంది. మిగతా దుకాణాలలాగ లోపలికి వెళ్ళడానికి లేదు. బయటే నిలబడి కావాల్సింది అడిగితే డబ్బులు తీసుకుని ఇచ్చే దుకాణం అది. కుడి చేతి వైపు కౌంటర్ వెనక ఒక మధ్యవయస్సు స్త్రీ కూర్చునుంది. సన్నగా, నాజుకుగా ఉంది. దట్టని కనుబొమల మధ్య గుండ్రని, ఎర్రటి స్టిక్కర్ బొట్టు. దాని మీద సన్నగా అడ్డంగా ఒక చిన్న గీత. కొంతమంది పూజ చేసుకున్న తరువాత అలాంటి బొట్టు కూడా పెట్టుకుంటారు. పెదవులకి ఎర్రని లిప్ స్టిక్. మెడలో తమాషాగా మెరుస్తున్న గొలుసు. దానికి వెలాడుతున్న చిన్న పతకం మీద అస్పష్టంగా ఒక బాబా బొమ్మ. గులాబీ రంగు సిల్కు చీర, దానికి మాచింగ్ కొంచెం ముదురు గులాబీ రంగు జాకెట్టు. కాళ్లు కుర్చీ మీదకి తెచ్చుకుని, కాష్ కౌంటర్ కి పాదాలు ఆనించి, మోకాళ్ల మీద సెల్ ఫోను పెట్టుకుని అందులోకి చూస్తూ విరగబడి నవ్వుతూ మాట్లాడుతోంది. ఆమె వెనుక గోడ మీద మూడు దేవతల బొమ్మలు ఫ్రేం చేసిన ఒక చెక్క పీట మీదున్నాయి. మధ్యలో ఉన్నది లక్షీదేవి దేవత బొమ్మ లాగుంది. వాటి ముందున్న ఒక ప్లాస్టిక్ ప్రమిద లో ఎల్ యి డి ఆరిపోతు వెలుగుతోంది. దాని పక్కనే ఒక సాంబ్రాణీ కడ్డీల గుత్తి. ఆ గుత్తిలో ఒక కడ్డీ కాలుతోంది. దాని పరిమళం దుకాణాన్ని పూర్తిగా ఆవహించినట్టుంది. అవన్నీ ఉన్న ఆ పీటకి ఒక స్టాండ్ అమర్చారు. ఆ స్టాండ్ ఆమె నెత్తిమీద నుండి సుమారు ఒక రెండు అడుగుల ఎత్తుమీద గోడకి తగిలించి ఉంది.

దుకాణం లోపల నీలం రంగు జీన్స్ , దాని మీద నల్ల రంగు మీద పసుపు రంగులో అడ్డంగా వెడల్పాటి చారలున్న టీ షర్ట్ వేసుకున్న మగ మనిషి అటు వేపు తిరిగి అరలలో ఏవో సర్దుకుంటున్నాడు. ఏదో అలికిడికి వెనక్కి తిరిగి చూసాడు. చూసినప్పుడు కౌంటర్ బయట రోడ్డు మీద నిలబడ్డ ఇద్దర్ని చూసాడు. జుత్తుకి నల్లరంగు వేసాడేమో, తళ తళలాడుతోంది, పైన ట్యూబ్ లైటు వెలుతురులో. చిరు చెమటకి, నుదుటి మధ్య నిలువుగా, వెడల్పుగా, ఇంత మందానా పూసుకున్న ఎర్రని సింధూరం కరిగి ముక్కు మీదుగా జారుతోంది. చేతిలో ఉన్నవి కింద పెట్టి, ఎడం చెయ్యి చూపుడువేలితో, లావుగా నల్ల రంగు కళ్ళజోడు ఫ్రేం ని పైకి తోస్తూ, కౌంటర్ వైపుకి కదిలాడు. అతనికన్నా ముందు అతని పొట్ట కొంత ఆయాసంతో కదులుతోంది.

కౌంటర్^కి ఇవతలున్నతను అప్పటికే కొంత వేచిఉన్నట్టున్నాడు, అసహనంగా కదులుతున్నాడు. ముప్పైలలో ఉండి ఉంటాడు. నైకి షూస్, సాక్స్, ఖాకీ షార్ట్^స్ మీదకి ఎరుపు రంగు టీ షర్టు. నడుం కిందకి జారిపోతున్న ఖాకిని రెండు చేతులలో పైకి లాగుతూ సర్దుకుంటున్నాడు. ఎడం చేతికి ఫాసిల్ రిస్ట్ వాచ్ ఉంది. సాయంత్రం పూట నడక నుంచి దుకాణానికి వచ్చినట్టున్నాడు. అతన్ని చూస్తూ, కౌంటర్ దగ్గిరకు చేరుకున్నాడు లోపల దుకాణం లో ఉన్న మనిషి. ఈ లోపు కాష్ కౌంటర్ దగ్గిరున్న స్త్రీ ఫోనులో గల గల మంటూ మాట్లాడుతూ, పెద్దగా నవ్వుతుండడం అతన్ని ఆకర్షించింది. కౌంటరు దగ్గిరకు రావాల్సిన వాడు ఆ ఫోనులోకి దూరిపొయ్యాడు. నైకీ షూస్ మనిషి అసహనంగా కాళ్ళు మీద బరువుని అటూ, ఇటూ మార్చుకుంటున్నాడు. రెండు, మూడు నిముషాల తరువాత బయట పడ్డ దుకాణం మనిషి, “ఇస్తాను సాబ్, ఒక్క రెండు నిముషాలు,” అంటూ కౌంటరు దగ్గిర నిలబడ్డ రెండో మనిషిని, “మీకేం కావాలి?” అన్నట్టు చూసాడు.

“దోమలు…వాసన కడ్డీ,” అంటుండగానే, “ఉన్నాయి,” అన్నాడు.
“ఎంత?”
“ట్వెంటీ రుపీస్.”
పాంటు జేబులోనుంచి పర్సు తీసి, ఇరవై రూపాయలు ఇవ్వబోతుండగా, దుకాణం మనిషి వెనక్కి తిరిగి, అక్కడ అలమరకి తగిలించిన ప్లాస్టిక్ సంచి నుంచి ఒక పెకెట్ ని అందుకుని కౌంటర్ మీదకి విసిరాడు. కాష్ కౌంటర్ లో కూర్చున్న ఆ ఆడమనిషి ఇవేమి పట్టనట్టే తన ఫోనులో మునిగిపోయి ఉంది.

నున్నగా ఉన్న ఆ కౌంటర్ మీదనుండి సర్రున జారి ఆ సాంబ్రాణి కడ్డీల పెకెట్, కౌంటర్^కి ఇవతల, అతని పక్కనే నుంచున్న నైకీ షూస్ అతని కాళ్ళ దగ్గిర పడింది. కిందకి వంగి ఆ పెకెట్ ని అందుకుని లేచి పక్కనున్న ఆయనకి ఇవ్వబోతుండగా, అతను దాన్ని గుర్తించకుండా, దుకాణంలో ఉన్న ఆ మగ మనిషి పైపు చూసాడు. దుకాణం వ్యక్తి, “సారీ,” అంటుంటే, దోమలను చెదరగొట్టే ఆ సాంబ్రాణీ కడ్డీల పెకెట్ ని కొనుక్కోవడానికి అడిగిన అతను, తన చేతిలో ఉన్న ఇరవై రూపాయల నోటు ని ఎడం చేత్తో కాష్ కౌంటర్ మీదకి విసిరేసి, వెనక్కి తిరిగి నింపాదిగా నడుస్తూ వెళ్ళిపొయ్యాడు.

దుకాణంలోని మగ మనిషి, ఒక్క ఉదుటున ముందుకు దూకి దాన్ని అందుకుని కాష్ కౌంటర్ వెనుకున్నామెకు అందించాడు. ఆమె దాన్ని అందుకుని, అరమోడ్పు కళ్లకి అద్దుకుని, కాష్ కౌంటర్ సొరుగు లాగి, అందులో చిల్లర నాణేలున్న అరని వెనక్కి నెట్టి, దానికిందున్న నోట్లపొత్తికి దానిని జతచేసింది. సొరుగును వెనక్కి నెట్టి,
కాళ్లు కుర్చీ మీదకి తెచ్చుకుని, కాష్ కౌంటర్ కి పాదాలు ఆనించి, ఫోనందుకుని మోకాళ్ల మీద దాన్ని పెట్టుకుని మళ్ళీ అందులో మునిగిపోయింది.

దుకాణం కౌంటరుకి ఇవతలున్న నైకీ షూసతను ఇదంతా గమనిస్తునే ఉన్నాడు. అతని కళ్లల్లో ఒక చిన్న చిరు నవ్వు .

*

అనిల్ అట్లూరి

అనిల్ వున్నచోట ఉత్సాహం. సాహిత్య ఉత్సవం. తక్కువ రాసినా వాసికి పెద్ద పీట. అభ్యుదయానికి ఇవాళ్టి బాట.

4 comments

Leave a Reply to సతీష్ బాబు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత నిక్కచ్చిగా చెప్పాడు రచయిత. అస్సలు మొహమాటాల్లేనట్టే ఉంది. నేడున్న రాజకీయ నేపథ్యంలో చదవకూడనివారు చదివితే దాడి గ్యారంటీ.

    • విచారించాల్సిన అవసరంలేదు. రాజకీయ లక్ష్యం, నేపథ్యం లేనిదెవ్వరికి? మన నిబంధతను బట్టి మనం చూస్తుంటా, వ్రాస్తుంటాం. మనమొక్కరమే సమగ్రంగా విషయాన్ని చూస్తున్నామని, వ్రాస్తున్నామని అనుకోవడమే భ్రాంతి. దాడిచేయడం మనకొక్కరికే కాపీరైట్ వున్న విషయమేమీకాదు. లవ్ జిహాద్ తీసినందుకు సుదీప్తో సేన్ పైన, బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ తీసినందుకు, అర్బన్ నక్సల్స్ వ్రాసినందుకు వివేక్ అగ్రిహోత్రి పైన జరిగిన, జరుగుతున్న భౌతిక దాడులు, *ఆవరణ* నవల వ్రాసినందుకు మరియు ఇంటోలరెన్స్ గురించి, అవార్డ్ వాప్సీ తొట్టిగ్యాంగ్ గురించి Literary secularists need to learn from Taslima: అని, writers have a political agenda and the time has come to distinguish between “political litterateurs” and “pure litterateurs” అని అన్నందుకు ఎస్. ఎల్. బైరప్ప పైన అమానుష వ్యాఖ్యాదాడులు చేసిన గిరీష్ కర్నాడ్, అనంతమూర్తికి కూడా దాడి కాపీరైట్ పుష్కలంగానేవుంది.
      ఒకవైపే చూస్తే ఇలాంటి రచనల అంతర్గత లక్ష్యం బోధపడే అవకాశం లేదు. రెండోవైపు కూడా చూడాలనుకునే ఆసక్తివున్నవారు కోరుకున్న విషయంపైన ఎడమ, ఎడమేతర, హేటువాదేతర కోణాన్ని కూడా చదవాలనుకునేవారు వారు కోరుకున్న విషయంపైన సాధికారత కలిగిన వ్యక్తులు వ్రాసిన సమాచారం యివ్వగలను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు