వూరూ వాడా లేని వాళ్ళు…

సంచార జాతులది యిప్పుడు గుర్తింపు సమస్య మాత్రమే కాదు, జీవన్మరణ సమస్య. కాలికింద నేల అమాంతంగా కత్తిరించుకుపోతున్న అభద్రతా భావం.

1960 వ దశకం వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశంలోని ఆదివాసులను వృక్ష, జంతు రాసులలో(flora, fauna)భాగంగా గుర్తించిందని, అక్కడ వారికి అప్పటిదాకా కనీసపు మనిషి గుర్తింపే లేదని యెక్కడో చదివి నివ్వెర పోయాను.

ఆస్ట్రేలియా దేశంలోనే కాదు, భారత దేశంలో కూడా యిక్కడి మూలవాసులను దేశపౌరులుగా భావించని పరిస్థితి కనబడుతూనే వుంది.  ఆదిమ జాతులు మానవ నాగరికతా పరిణామ క్రమంలో పక్కకు నెట్టబడి అభివృద్ధికి ఆమడ దూరంలో విసిరేయబడిన అభాగ్య మానవులు.  సాధారణంగా వారిని తమ జీవన విధానం, నివాస ప్రాంతాల దృష్ట్యా ఆటవిక గిరిజన జాతులు, మైదాన ప్రాంతపు గిరిజనులు, సంచార, అర్థ సంచార జాతులుగా విభజిస్తారు.

బ్రిటీష్ ప్రభుత్వం 1871 లో వీరిని మూకుమ్మడిగా ‘నేరస్థ జాతులు’ గా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది.  జీవనోపాధిని పొందే క్రమంలో బతకడానికి యేమీ దొరకని స్థితిలో వీరు అరుదుగా దొంగతనాలకు పాల్పడడం వలన వారందరినీ ‘నేరస్థ జాతులు’ గా గుర్తించి చట్టం తీసుకు రావడం అర్ధం లేనిది.  బ్రిటీష్ ప్రభుత్వ చర్యపై అప్పటికే విమర్శలు రావడంతో స్వాతంత్రయానంతరం  భారత ప్రభుత్వం 1948 లో ‘నేరస్థ జాతులు’ గా చెప్పబడే వారి గురించి అధ్యయనం చెయ్యవల్సిందిగా అనంత శయనం అయ్యంగార్ కమిషన్ ను నియమించింది.

ఆ కమిషన్ ‘నేరస్థ జాతుల’ చట్టంలోని ‘నేరస్థ’ అనే పదాన్ని తొలగించి వారి అభివృద్ధి కొరకు కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలు కృషి చెయ్యాలని 1949 లో కోరింది.  కానీ ప్రభుత్వం కమిషన్ సూచనలను పట్టించుకోలేదు.  ఆ తర్వాత 1961-62 లో వెన్నెలకంటి రాఘవయ్య ఆధ్వర్యంలో యేర్పాటైన కమిషన్ 22 ఆదివాసీ తెగలను షెడ్యూలు ట్రైబ్స్ జాబితాలో చేర్చాలని సూచిస్తే ప్రభుత్వం చెంచు, యానాది, యెరుకల, లంబాడీ వంటి కేవలం నాలుగు తెగల్ని మాత్రమే షెడ్యూలు తెగల జాబితాలో చేర్చింది.  సంచార జాతులలో యెక్కువ మందిని ప్రభుత్వం వెనుక బడిన కులాల జాబితాలో చేర్చడం విశేషం.

సంచార జాతులది యిప్పుడు గుర్తింపు సమస్య మాత్రమే కాదు, జీవన్మరణ సమస్య.  కాలికింద నేల అమాంతంగా కత్తిరించుకుపోతున్న అభద్రతా భావం… ఆధునిక అభివృద్ధి వ్యూహంలో వారు యెక్కడో తప్పిపోయారనవచ్చు.  అటవీ పరిసరాలలో  వున్న వారిని మైనింగ్, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో తమ పరిసరాల నుంచి తరలించడం వారికి నరక యాతనతో సమానం.

బుడగ జంగమ, కాటికాపరి, మందుల, షికారి, నక్కల వంటి మరికొన్ని  సంచార జాతులు తమకంటూ స్థిర నివాసం లేక యింకా పరాయితనం లోనే ఆరు బయట జీవిస్తూ యీ దేశపు కడగొట్టు బిడ్డలుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు.  ‘దేశదిమ్మరి’ సంచార జాతుల వారి జీవితం, సంస్కృతి, సంప్రదాయాలు, స్త్రీలు, కుటుంబ నిర్మాణం, మనుగడ కోసం వారు చేస్తున్న పోరాటం వంటి అంశాలను చిత్రిస్తుంది .

  (మే 15 సంచిక  నుంచి ఈ శీర్షిక ప్రారంభం)

చల్లపల్లి స్వరూప రాణి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు