వివాహ వ్యవస్థపై స్మైల్‌ విసిరిన ‘వల’

 స్మైల్‌ రాసిన కథలు గుప్పెడు మాత్రమే! ఒక్కోటి ఒక్కో శరాఘాతం.

స్మైల్‌గారి వల కథని ‘అనగనగా ఒక మంచి కథ’గా పరిచయం చేయాలని దాదాపు ఏడాదిగా మదనపడుతూనే ఉన్నా. కాని .. ఏదో బెరుకు! ఈ కథాంశం నచ్చని ‘సంప్రదాయ’వీరులు మూకుమ్మడిగా నాపై దాడి చేస్తారేమో, శాపనార్థాలతో దుమ్మెత్తిపోస్తారేమో .. ఇలాంటి భయాలన్నీ చుట్టుముట్టి నన్ను ముందుకు సాగనివ్వలేదు. అనుకోకుండా ఈమధ్య మరోసారి కథ చదివాల్సి వచ్చింది. అంతే, పరిచయం చేయకుండా ఉండలేనితనం నన్ను జయించింది!
సరిగ్గా 53 ఏళ్ల క్రితం ‘వల’ ప్రచురించబడింది. అదీ సంప్రదాయ పత్రికైన ‘భారతి’లో! అదొక మిరకిల్‌. అప్పట్లో ఆ కథ రేపిన సంచలనం ఇంతా అంతా కాదని నాతో భరాగో, రామడుగు రాధాకృష్ణమూర్తిగార్లు చెప్పడం నేనింకా మర్చిపోలేదు. ఇప్పుడున్న ఏ పత్రికా ఈ కథను ప్రచురించగల సాహసం చేస్తుందని నేననుకోను!
ఐదు దశాబ్దాల క్రితం ఈ కథ వచ్చిందంటేనే నమ్మడం కష్టం! కథ మొత్తంలో నాలుగే పాత్రలు. రాణి, ఆమె ప్రియుడు రహీం, ఆమె తండ్రి, ‘కొత్త ఎర’ రవి .. ఆరు పేజీలు కథ వెనక, అరవై అడుగుల లోతైన వేదన! ఎవరూ పట్టాలు తప్పి ప్రవర్తించరు. కప్పదాటుడు వ్యవహారం అసలే ఉండదు. ఆయా పాత్రల్లో మనల్ని మనం ప్రతిక్షేపించుకున్నా సరిగ్గా అట్లాగే ప్రవర్తిస్తాం తప్ప, మరోలా ఆస్కారం లేదు.
లూప్స్‌, కండోమ్స్‌, ఎఫ్పెల్స్‌, పిల్స్‌ వంటి గర్భనిరోధక సాధనాల గురించి అర్ధ శతాబ్దం క్రితమే బాహాటంగా కథలో చర్చించారు. సెక్స్‌ని రొమాంటిక్‌గా రాయడంలో స్మైల్‌దొక ప్రత్యేక శైలి.
మొదటిసారి ‘వల’ చదివినప్పుడు తుపాను తాకిడికి ఆమూలాగ్రం చిగురుటాకులా కంపించిపోయా! ఏమాట కామాటే చెప్పుకోవాలి. కథలు ఇంత నిజాయితీ గా రాస్తారా అని విస్మయం కలిగింది. ఆపై అనిపించిందొక్కటే, ఇలా Inhibitions  తోసిరాజనడానికి దమ్ముండాలి. అప్పట్లో స్మైల్‌తో పాటు పతంజలి, రావిశాస్త్రి, అల్లం శేషగిరిరావు వంటి రచయితల్లో ఆ తెగింపు కనిపిస్తే, ఈ మధ్య కాలంలో వంశీధర్‌ రెడ్డి, మెహర్‌ లాంటి ఒకరిద్దరిలో కొంత కనిపించింది.
వివాహ వ్యవస్థలో మార్పురానంత వరకూ ఈ కథాంశం ఏ కాలానికైనా సమకాలీనమే! ఇదే అంశాన్ని ‘వల’లో కుండబద్దలు కొట్టారు. కథను టూకీగా చెప్పడం కూడా నాకిష్టం లేదు. నేనెంత విపులంగా వివరించినా ప్రధాన పాత్ర ‘రాణి’ అంతర్మథనం మీవరకు చేరదనే బెరుకు. ఒక ఆడపిల్ల తండ్రి మానసిక ధైన్యస్థితి సైతం మీకర్థమయ్యేలా చెప్పలేనన్న అపనమ్మకం. జలజల పారే అందమైన కవితాత్మక శైలితో ఎక్కడా ఉపన్యాసాలు గుప్పించకుండా, జీవితాన్ని పారదర్శకంగా.. చచ్చిన ఎలుక తోకని ఊపుతూ ‘ఇదిరా అబ్బాయ్‌ జీవితమంటే..’ అంటూ మనలో ఉండచుట్టుకుపోయిన కుళ్లు ముళ్లు విప్పుతాడు స్మైల్‌.
‘ఆడపిల్ల తండ్రి అసలు డబ్బు సమస్యను పట్టించుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మనది ఫ్రీ సొసైటీ అయితే అబ్బాయిలకీ, అమ్మాయిలకీ స్వేచ్ఛ ఉండేది. వాళ్లు ప్రేమించుకోడానికి, పెళ్లి చేసుకోడానికీ అవకాశం ఉండేది. భగ్న ప్రేమికులుగాని, అక్రమ సంబంధాల వల్ల పుట్టిన పిల్లలుగాని ఉండేవాళ్లు కాదు. కట్నాల సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే పెళ్లిళ్లు .. స్వేచ్ఛగా ఉన్న యువతీ యువకుల స్వచ్ఛంద నిర్ణయంతో జరగడం వల్ల కుటుంబం స్త్రీ పురుషుల మధ్య స్వచ్ఛందమైన, సమానమైన మైత్రిగా మారుతుంది. నైతికమైన విషయాల్లో, స్త్రీ శీలం విషయంలో ప్రస్తుతం ఉన్న దురభిప్రాయాలు మారాలి. పారిశ్రామిక విప్లవం పూర్తిగా జరిగినప్పుడు ఈ మార్పులు వస్తాయి. ఫ్రీ సొసైటీలో ఆడది ప్రేమిస్తుంది. పరస్పర రక్షణ కోసం, అనురాగం కోసం పెళ్లి. అందువల్ల వివాహబంధంలో కొన్ని నైతిక విలువలు అవసరం!’ – అంటారు స్మైల్‌. అప్పుడీ దిక్కుమాలిన కులమతాల వల్లకాడు ఉండదు కాబట్టి ‘నరకడాలు’ కూడా తగ్గవచ్చు అనేది స్మైల్‌ ఆవేదన.
 స్మైల్‌ రాసిన కథలు గుప్పెడు మాత్రమే! ఒక్కోటి ఒక్కో శరాఘాతం. వలతో పాటు ఖాళీ సీసాలు, సముద్రం, సిగరెట్‌, పృథ్వి,  అ ఆ …! చుగ్తాయ్‌ ‘లిహాఫ్‌’ కథని ‘కంబళి’గా తర్జూమా చేశారు. అందరూ ఆయన్ని ఖాళీసీసాల స్మైల్‌ అంటారు కానీ, నేనైతే ‘వల’స్మైల్‌గా, ‘సముద్రం’ స్మైల్‌ గా గుర్తుపెట్టుకుంటాను.
ఉత్తమాభిరుచిగల సాహిత్య లోకానికి స్మైల్‌ని నేను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కవిగా కవులకూ, కథకుడిగా కథకులకూ, నాటకం రచయితగా రంగస్థలానికీ సుపరిచితుడే. ‘తూనీగ’, ‘రమించేసుకున్నాం కదా’ వంటి గొప్ప కవిత్వం ఎవర్రాయగల్రు?! ఔను! స్మైల్‌ ‘ఒఖడే’!
నిజాయితీగా కథను అర్థం చేసుకోండి. స్మైల్‌ని కౌగిలించుకోపోతే అడగండి!
వల కథ ఈ కింది లింక్ లో చదవండి

గొరుసు

కథల ఆనుపానులన్నీ తెలిసి, కలం మాత్రం విప్పని పిసినిగొట్టు గొరుసు. తెలుగు కథా సాహిత్యానికి walking encyclopedia.

24 comments

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ ఎంత గొప్పగా ఉందో మీ పరిచయం కూడా అంతే గొప్పగా ఉంది సర్..

  • కథలు రాయకుండా ఎలాగూ పిసినారి లా మారిపోయారు‌‌. ఈ పరిచయమైనా
    ఇంకో రెండు ముక్కలు రాయొచ్చు కదా గొరుసన్నా…

    • అతిగా తింటే అజీర్తి చేసిద్దని ఆ మధ్య ఒకాయన చెప్పాడు తమ్మీ .. అందుకని 🙂

  • భిన్నమైనకధను ను ఎంచుకొని ఒకరకంగా సాహసమే చేసి,ఆ కథ ను చక్కగా విశ్లేషణ చేయటం కత్తిమీద సామే. ఆ ప్రక్రియను చాలా బాలన్స్డ్ గా చేసిన తెలుగు కథా సాహిత్యానికి ఎన్సైక్లోపీడియా వంటి గొరుసు జగదీశ్వరరెడ్డి గారికి అభినందనలు.

    • ధన్యవాదాలు రమణారెడ్డి గారూ. ఆ భిన్న కథాంశం వెనకున్న వేదన అర్థం చేసుకుంటే నా ప్రయత్నం ఫలించినట్లే. ఎన్సైక్లోపీడియా మాట అదేదో తిట్టులా ఉంది సామీ 🙂

  • స్త్రీ, పురుష సంబంధాల‌పై ఎన్నో క‌థ‌లు, సినిమాలు వ‌చ్చాయి. కానీ వాటిలో అధికం వాస్త‌విక‌త‌ను ప్ర‌తిబింబించ‌లేక‌, అధివాస్త‌విక‌త‌ను నెత్తికెత్తుకోలేక సందిగ్ధంలో కొట్టుమిట్టాడాయి. కానీ స్మైల్ గారి క‌థ వ‌ల మాత్రం ఏమాత్రం మోమాటం లేకుండా న‌గ్న‌స‌త్యాన్ని ఆవిష్క‌రించింది. మాది సంప్ర‌దాయ స‌మాజం అని గ‌ర్వంగా చెప్పుకునే మ‌నం ఆరేళ్ల ప‌సిపాప నుంచి అర‌వ‌య్యేళ్ల అవ్వ దాకా- స్త్రీలపై జ‌రిగే అత్యాచారాల‌కు ఏమ‌ని స‌మాధానం చెప్ప‌గ‌లం. కుల‌మ‌తాలు, ఆర్థిక అంత‌రాలు లేని ఒక స్వేచ్ఛాయుత స‌మాజ‌పు స్త్రీ, పురుషులు ఎలాంటి అద్భుత జీవితాన్ని ఆనందించ‌గ‌ల‌రో… రాహుల్ సాంకృత్యాయ‌న్ స్వ‌ప్న‌లోకంలో చ‌దివాను. అది జ‌రిగితే బాగుండున‌నే స్మైల్ గారి వాంఛ‌ను ఈ క‌థ ద్వారా అర్థం చేసుకున్నాను. ష‌రా మామూలుగానే ఈ క‌థ‌లోని ఆత్మ‌ను త‌న విశ్లేష‌లో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు గొరుసు గారు. క‌థా ప‌రిచ‌యానికో వేయి, విశ్లేష‌ణ‌కు మ‌రో వేయి కృత‌జ్ఞ‌త‌లు.

    • ధన్యవాదాలు మురళీ. నీ కామెంట్ చాలా సంతోషం కలిగించింది. అవును రాహుల్ సాంకృత్యాయ‌న్ ఫిలాసఫీనే స్మైల్ తన బాణీలో మరోవిధంగా తెలిపారు.

  • గొరుసు గారికి , సారంగ కు వేల వేల వందనాలు .

    వల ఇంతటి గొప్ప కథ ఇన్నాళ్ళు గా చాల మందికి తెలియదేమో ,,,తెలిసిన ఎక్కడ ఎవరు ప్రస్తావించలేదు . మా అదృష్టం బాగున్నట్టుంది మీరు లింక్ పెట్టి పుణ్యం కట్టుకున్నారు .గొరుసు గారికే కాకుండా మిగత రచయితలకు నా మనవి మీరు కూడా ఇలా ఒరిజినల్ కథ లింకులు పెట్టండి దయచేసి . మాలాంటి వారికి పాత పాత కథలు చదేవే అవకాసం కల్పించినవారవుతారు.
    చాల అద్భుతమైన కథను మాకు అందించినందులకు మీకు మరియొకసారి కృతఙ్ఞతలు .మీ విశ్లేషణ చాల బాగుంది . అరుదైన కథ ఎవరు ఇంతటి సాహసం చేసి వుండరు అది స్మైల్ గారికి మాత్రమే సాధ్యమైంది . వాస్తవాలు చెప్పడానికి దైర్యం కావలి .

    • ధన్యవాదాలు ఏలియా గారూ. మీ స్పందన ఒక ఉత్పేరకం.

  • రెడ్డి గారూ! మీ ఒక్కో పరిచయం ఒక్కో శరా ఘతం.ఈ కధ నేను చదవ లేదు. “నేను ఇకపై. కధలు రాయను”అని ప్రకట న చే యండి. మీ కధ కోసం ఎదురు చూసే బాధ తప్పుతుంది.

    • వెంకట్రావు గారు .. మీరు ఈ కథ చదవకపోవడమే మంచిది 🙂 కథ రాసినా, పరిచయం చేసినా ఒకటే అనుకుంటున్నాను. మీ స్పందనకు నెనర్లు.

  • చలాన్ని చాలా వాటికి క్షమించాలని చెప్పుకున్నాడు. స్మైల్ అన్ని కథలు

    చదవని వాళ్లను కూడా గొరుసు గారు క్షమించాలి. ఖాళీసీసాలు చదివి

    స్మైల్ కు ఫ్యాన్ గా మారిన నాలాంటి వాళ్లు ఇంకా ఇంకా ఎంతో

    తెలుసుకోవాలని ఉందని, చదవాల్సింది చాలా ఉందని తెలుసుకున్నాం.

    పదానికి పదానికి మధ్య అంతుచిక్కని భావాన్ని నింపి, ఆలోచింప చేసిని

    గొరుసుగారికి ధన్యవాదాలు చెప్పడం కంటే ఇంకేం చేయగలం. స్మైల్

    కథలు అన్నింటిని చదివి ఆనందిస్తూ లోతుల తలుపులు తీయడం

    తప్ప. కథను కథగా కాకుండా అందులోని సమాజాన్ని, ఆ సమాజ మూల

    స్వభావాన్ని పట్టిచూపించిన మీకు మరోసారి కృతజ్ఞతలు. స్మైల్ ప్లీజ్ మా

    ఆంతరంగిక జగత్తులో బాధాతప్త ఆనందానివై అలాగా నిలిచిపో…

    • థాంక్యూ రవీంద్రా .. స్మైల్ నిజంగా అందరికీ కొరుకుడు పడరు. మీరు ఆస్వాదించినందుకు సంతోషంగా ఉంది.

  • గోరుసు గారికి ఈ మావా నమసుమాంజలులు. చలం మైదానమే గొప్ప సాహిత్య, సామాజిక విప్లవం అని విశ్వసించే నాకు స్మైల్ గారి వల నవల breifing నాకొక అద్భుత అనుభూతి. గొరుసు గారిని ఆ నవల కాపీ ఎక్కడ దొరుకుతుందో చెప్పి పుణ్యం కట్టుకోమని మిక్కిలి వేడుకుంటున్నాను

    • నమస్తే మావా .. మామిడాల వాసుదేవ్ 🙂 స్పందించినందుకు ధన్యవాదాలు. స్మైల్ గారి వల నవల కాదు. కథ. నా ఇంట్రో చివరలో కథ పిడిఎఫ్ ఇచ్చారు. దానిపై క్లిక్ చేయండి.

  • తెలుగు కథానిధి గొరుసు జగదీశ్వర్‌రెడ్డి మరో గొప్ప కథని సారంగ పాఠకులకి పరిచయం చేశాడు. తెలుగులో అత్యంత అరుదైన కథకుల్లో స్మైల్‌ ఒకరు. “ఖాళీసీసాలు స్మైల్‌”గా ఆయన సుపరిచితుడైనా.. ఆయన ప్రతి కథా ఆణిముత్యమే. ఒక్కసారి చదివితే ఆజన్మాంతం వెంటాడతాయి ఆయన కథలు. ఆ కోవకి చెందిన కథే “వల”. ఇందులోని వస్తువు, ఎత్తుగడ, నిర్మాణం, కొనసాగింపు, కొసమెరుపు, వాడిన భాష వంటి ప్రతి అంశమూ మనల్ని అబ్బురపరుస్తాయి. ఆయన ఆవిష్కరించే కథాచిత్రాన్ని ఆస్వాదించిన తర్వాత ఎంతటివారైనా చలించిపోక తప్పదు. పైగా ప్రతి వాక్యామూ తనదిగా ఉండాలన్న దీక్షతో ఆయన చెక్కుతారు. ఆ శైలి వర్ణనాతీతం. స్మైల్‌ని సహ రచయితలకంటే విలక్షణంగా నిలిపిన రహస్యం అదే. కాలాతీతమైన ఈ కథని ఎంచుకుని పరిచయం చేసిన గొరుసుకి ధన్యవాదాలు. ఆయన నిధి నుంచి మరో మంచి కథ త్వరలోనే ఇదే కాలమ్‌లో చూడాలని ఆశిస్తున్నాను…

  • గొరుసు,

    ఇది వొక కథా పరిచయమే కాని, చదువుతున్నప్పుడు స్మైల్ కళ్ళ ముందు నిలచారు. కాదు, నీ శైలీ విశేషంతో కొద్ది మాటల లోతైన ! చూపుతో కళ్ళ ఎదుట నిలిపావు ఆయననీ, ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని!

    • ధన్యవాదాలు అఫ్సర్, స్మైల్ తో నీకున్న జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేయడానికి నా రచన దోహదం చేసినందుకు సంతోషంగా ఉంది 🙂

  • అన్నేళ్ళ కిందట స్మైల్ అంత నిర్భయంగా రాయటం గొప్ప విషయమే. అయితే స్త్రీల లైంగిక ఇష్టాయిష్టాల గురించి పురుషులు వారి మనసులో తొంగిచూసినట్లు రాసే రచనల్లో ఏదో సాధికారత లోపించినట్లు కనిపిస్తుంది.

    • మీరన్నది కొంత నిజమే కావచ్చు భవానీ గారూ. గతంలో చలం, బుచ్చిబాబు గార్లు కూడా స్త్రీ మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేశారు. ఒక్కోసారి స్త్రీలు చెప్పలేని భావాలను (లోపల చెప్పాలని ఉన్నా సరే ) సైతం రచయితలు చెప్పగలరేమో కూడా !
      స్పందించినందుకు ధన్యవాదాలు.

  • ” అర్థ స్వప్నాలు, అర్థ సత్యాలు
    చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు ”

    చిన్న ఇస్మాయిల్ స్మైల్ గారి సాహితీ సృతులకు వినమ్రపూర్వక వొందనాలతో

    తమ్మీ చందు తులసి, సిన్నప్పుడు తెలుగయ్యోరు మాకు నేర్పింది “ గంగిగోవు పాలు గరిటడైనను చాలు “. అందుకే ఓపిక పడదాం.

    నవంబర్ 2008 న ఈమాట అంతర్జాల పత్రికలో ఖాళీసీసాల స్మైల్ గారి మీద వేలూరి వేంకటేశ్వర రావు గారి నివాళి, అందులో గొరుసన్న చెప్పింది యీ క్రింది లింకులో చూడబ్బా

    http://eemaata.com/em/issues/200811/1382.html

    వెంకట్రావు గారు గోరండీ! సీనియర్ కధా రచయిత గొరుసు జగదీస్పర రెడ్డి గారితో సంవాదనకు దిగి మా గంజిలో మన్నెయ్యకండి ( గద్దరన్న మాటల్లో ).

    మావా .. మామిడాల వాసుదేవ్ స్మైల్ గారి వల కథ. పిడిఎఫ్ స్కానింగ్ కుంచెం అస్తవ్యస్తం గా కనిపిస్తే ఓర్చుకోండి సామే.

    చలం, బుచ్చిబాబు గార్లు కూడా స్త్రీ మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేశారు అంటున్న గొరుసు దొరా! మరి కామ్రేడ్ రంగాజి, బెజవాడ పి. సత్యవతి అక్కయ్య, ఓల్గా . . . నుండి పింగళి చైతన్యల వరకూ అట్టాంటోళ్లు సానా మండి ఉన్నారనుకుంటా నండి.

    ~ ఇట్లు గొరుసన్న గారి తంపులమారి రావయ్య

    • రామయ్య గారూ .. ఆడవాళ్ళ గురించి రచయిత్రులు రాయడం గురించి కాదు నేను చెప్పింది. ఆడవాళ్ళ మనసుతో మగవాళ్ళు రాయడం గురించి. భవానీ గారి కామెంట్ మరోసారి చదవండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు