‘విపుల’ విలసితంగా  కథాకథన ‘చతుర’త!

స్వీయ కథనమూ, జ్ఞాపకాలూ  అయినా  ఇదంతా  కేవలం  మోనోలాగ్  కాదు.   పాత్ర  అంతరాలోచనలూ, భావనలూ, అంతస్సంఘర్షణలూ  తెలిపే  soliloquy తో  పోల్చవచ్చు.

విషయంతో పాటు  కథన కౌశలాన్ని ప్రత్యేకంగా గమనిస్తూ  ఈమధ్య నేను చాలా  ఆసక్తిగా చదివిన  జంట పుస్తకాలు… ‘విపుల-చతుర- నేను’;  ‘ఒక నేను- ఒక కెనడా’.  మొదటిదానికి  సీక్వెల్-  రెండోది.  అజు పబ్లికేషన్స్ ప్రచురణ.  రచయిత యార్లగడ్ఢ రాఘవేంద్రరావు.  కవిగా  సుప్రసిద్ధుడు.

ఆ  కవి  అనుకోకుండా పత్రికా  రచయితై, ఆపై  ‘ఈనాడు’ ప్రాంగణంలోని   సాహిత్య మాసపత్రికలకు  పేరు లేని సంపాదకుడై, మెరుగైన బతుకుదెరువు కోసం కెనడాకు పయనమై వెళ్లి మళ్లీ  స్వదేశానికి తిరిగొచ్చేశారు.

తెలుగునాట విలువైన, విలక్షణ  పత్రికలుగా గౌరవం దక్కించుకున్న కవల పత్రికలు- విపుల, చతుర.  వీటి  సంపాదక బాధ్యతల వధ్యశిలపై  రెండేళ్ళ  పాటు  స్వీయ కవితా రచనను  పణంగా పెట్టిన  ఈ  కవి  ఆత్మకథనాత్మక కాల్పనికేతర  వచన రచన  ఇది.  ‘నా కైతల లోకాన్ని  సైతం కాలదన్నేసుకుని లీనమైన ఉద్యోగం’ అనీ, ‘ ఆ బాధ్యతలు మోసిన రెండేళ్ళు  నేనో కవినన్న సంగతే మరిచిపోయాను’ అనీ అంటారు రచయిత.

ఈ వాస్తవిక  గాథలో అపరిమితమైన వ్యథలూ, సొదలతో  పాటు పరిమితంగానైనా  సంతోషపు సుధలున్నాయి. ప్రతికూల పరిస్థితులను ధీమాగానో, దైన్యంగానో  ఎదుర్కోవడానికి  పరోక్షంగా ప్రేరణనిస్తాయి.  హైస్కూలు దశలో వేదికపై నుంచి ఒక్క ముక్క మాట్లాడటానికి కూడా గొంతు పెగలని..  ‘సభా భీతి’  పాతుకుపోయిన  విద్యార్థి రాఘవేంద్రరావు .  ఉపాధి వేటలో  కావాలనే లెక్చరర్ గా ఉండటానికి ఇష్టపడలేదు.   ఆయనే చివరికి  ‘ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్ ’గా  విద్యార్థులకు అనర్గళంగా  పాత్రికేయ పాఠాలు చెప్పే వృత్తిలో  స్థిరపడటం… ఓ విరోధాభాస.

శ్రీశ్రీ… యార్లగడ్డ

కవి రాసిన  స్వీయ  చరిత్ర  అనగానే  చాలామందికి    శ్రీశ్రీ  ‘అనంతం’  గుర్తొస్తుంది .  దీన్ని ‘ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవల’గా   శ్రీశ్రీ అభివర్ణించుకున్నారు.  1975లో  ‘ప్రజా తంత్ర ’ వారపత్రికలో  ప్రచురితమవుతున్న  కాలంలోనే  ‘ అనంతం’  సెక్సు సరదాలు లాంటి కొన్ని రాతలపై  విమర్శలకు గురై  సంచలనం  సృష్టించింది.

యార్లగడ్డ రాఘవేంద్రరావు 2023- 24లో  రాసిన ఈ  రచన కూడా  ఫేస్ బుక్ లో వరస పోస్టులుగా వస్తున్నపుడు  విమర్శలూ,  వాద ప్రతివాదాలతో   పాఠకులను ఆకర్షించింది.

ఎంతటి  మహాకవి అయినా  శ్రీశ్రీ  రాసిన వచనం  కవితా ధోరణికి  దూరం.  అది  నిరలంకారంగా, సూటిగా  ఉంటుంది.  కానీ  రాఘవేంద్రరావు  వచన రచన  తీరు వేరు.  ఇది  పదగుంఫనతో  అలరారే,  సమాసాలు జాలువారే  ఆలంకారిక  శైలీ సమన్వితం.

ఉక్కరిబిక్కిరి చేసే  వర్ణనలు

రేపటిపై అనిశ్చితీ, భయమూ ఆందోళనా ముప్పిరిగొన్నపుడు  రచయిత  తీవ్ర స్పందనలు సహానుభూతితో పఠితలను కదిలిస్తాయి.  వివిధ సందర్భాల్లో  ఉపమలూ,  ఉత్ప్రేక్షలూ, రూపకాలూ  మణి ప్రవాళాలై  అల్లుకుపోతాయి. వ్యక్తీకరణలు సుదీర్ఘమై వాక్యాలు పేరాలై  వెల్లువగా   పొంగుతాయి.  గుక్కతిప్పుకోనీకుండా ఉద్వేగాల ఉరవడితో  ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.

స్వీయ కథనమూ, జ్ఞాపకాలూ  అయినా  ఇదంతా  కేవలం  మోనోలాగ్  కాదు.   పాత్ర  అంతరాలోచనలూ, భావనలూ, అంతస్సంఘర్షణలూ  తెలిపే  soliloquy తో  పోల్చవచ్చు.  సంగతులన్నీ  ఏకపక్షంగా ఏకరవు పెడుతూ పోకుండా  వాటిని పాఠకుల కోణంలోనూ  గమనించే పరిశీలన  కనిపిస్తుంది.  తాను చెప్పిన  విషయాల వాస్తవికతపై  కొంత  సందేహం  రావొచ్చనుకున్నచోట  ‘ అర్థాంతర న్యాసాలంకారం’లా  తన కోణంలో సమర్థింపు వాదనలు ముందుపెట్టడం  ఓ  విశేషం.

పదజాల ఇంద్రజాలం

ఈ రెండు పుస్తకాల్లోనూ రచయిత ఎంచుకుని ప్రయోగించిన  కథన రీతీ, భాషా శైలీ  ప్రత్యేకం. చెప్పదల్చిన  విషయాన్ని  ఇవి ఆసక్తికరమూ, ఆకర్షవంతమూ  చేశాయి.

ఆనందమైనా,  విషాదమైనా రచయిత  తాపీగా,  తనివి తీరా వర్ణిస్తారు.  తాను పాత్రగా అనుభవించిన చేదు  ఘట్టాలను కూడా  ఒక స్పెక్టేటర్ లాగా దర్శించి  చెపుతారు.  కొంత హాస్యస్పర్శను మేళవించి  లీలావినోదంగా  చెపుతారు.

ఒక పోలికనో, విశేషణంతోనో చెప్పగల విషయాన్ని మూడు.. నాలుగైదు విశేషణాలు గుప్పించి రాస్తే కానీ రాఘవేంద్రరావు కలానికి  తృప్తి  ఉండదనిపిస్తుంది.

తన ఆధ్వర్యంలోకి వచ్చాక  విపుల, చతుర పత్రికల సర్క్యులేషన్ రెట్టింపు  పెరిగిందని తెలిశాక ఆయన సంతోషాతిరేకం –  ‘… ఛాతీ విప్పారి , మనసు మీద ఏదో మలయ సమీరం నర్తనం చేసినట్లనిపించింది. నీలినీలి పాలపిట్టనై రెక్క చాచుకుని ఆకాశాన్ని కాస్తకాస్తగా తుంచుకుని తురాయిగా తురుముకుని ఊరేగింపులు పోయినట్టనిపించింది’

ఈ  పుస్తకాల్లో   హౌరా స్టేషన్ వర్ణన  ముగ్ధుల్ని చేస్తుంది.   కెనడాను పరిపరి విధాల పోలికలతో పరిచయం చేస్తారు.

భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన సందర్భంలో  దుస్సహమైన వియోగ వేదనను అశ్రువులతో ముంచి  రాస్తారు.  సంపాదక బాధ్యతల నుంచి తప్పుకుని,  నిశ్శబ్దంగా.. ఒంటరిగా  సంస్థ  ప్రాంగణం  వదిలి, బయటకు  నిష్క్రమించే  సందర్భాన్ని హృదయ విదారకంగా వర్ణిస్తారు.  పసివయసులో పెను మంటల్లో చిక్కుకున్న తనను  తల్లి ప్రాణాలకు తెగించి ఎలా బయటపడేసిందీ  రెండో పుస్తకంలోని  ‘మళ్లీ జన్మనిచ్చిన అమ్మ’  అధ్యాయంలో  ఉద్వేగభరితంగా చెప్పుకొస్తారు.

‘‘ఈనాడు’ వ్యక్తుల మీద ఆధారపడిన పని విధానాన్ని కాకుండా నిర్దిష్ట ప్రమాణాలతో వ్యవస్థ మీద ఆధారపడిన పనితీరునాశ్రయించింది.  ఆ వ్యవస్థలో నిబంధనకు లేదా విధానానికి ఉన్న  స్వాతంత్ర్యం వ్యక్తికి లేదా ఉద్యోగికి ఉండదు’ అంటూ చేసే  పరిశీలనలు ఆసక్తికరంగా ఉంటాయి.

పద చిత్రాల పరిమళం

సంపాదకత్వ కాలంలో  ప్రస్తావనకు వచ్చిన  కొందరి రచనా  స్వభావాన్ని పదచిత్రాలతో  రూపుకట్టి  మరీ వర్ణించి చెపుతారు.

* యద్దనపూడి సులోచనారాణిని ‘అక్షర క్లియోపాత్ర’  అని ప్రశంసిస్తారు.

* కాశీభట్ల వేణుగోపాల్ ను ‘ఘనీభవించి జడలు కట్టిన వాస్తవపు జుగుప్సకు, పెను దు:ఖానికి ఎలాంటి వలువలూ కట్టబెట్టకుండా కాళ్ళు ఎడం చాపి నిలబెట్టించి ఎంత నగ్నంగా  చూపించాలో అంతగానూ మహా పతితం గా, మహా జ్వలితంగా, మహా క్రోధంగా, మహా అసహ్యంగా చూపించిన మహా విలయ సృష్టి కారుడు’  అని శ్లాఘిస్తారు.

* కేశవరెడ్డిని  ‘చిత్తూరు జిల్లా మండలికానికి ఉట్టికట్టి జాతరలు జరిపే’ రచయితగా సంభావిస్తారు.

వాక్య విన్యాసాలు

ఉక్తి  వైచిత్రి, చమత్కృతి, అక్షర మైత్రి లతో   రాఘవేంద్రరావు  వాక్యాలు  మిరుమిట్లు  గొలుపుతాయి.

‘భేషజాలకు పోతే బ్రెడ్డు కూడా కరువే అన్న సంగతి వాళ్ళ బుర్రకు ఇట్టే పట్టేస్తుంది’

‘ఎద  సంసిద్ధం కాకపోతే ఎదరంతా ఎడారి సదృశమేగా’

‘పొగడ్తల పున్నాగ పూల తేరులో నన్నూరేగించినవాళ్లు, దీవించిన వాళ్ళు మరెందరో’

‘ (కెనడాలో) బస్సుల్లో ఎంత రద్దీగా ఉన్నా ఒకరికొకరు చచ్చినా తగలరు.  తగలకుండా ఉండటానికే నానా చావులు చస్తుంటారు’

రచయితలకు  ‘సిరా శిల్పులు’ అనీ, చిత్రకారులకు  ‘కుంచెకారులు’ అనీ  పేర్లు  పెట్టారు.  గ్రీన్ సిగ్నల్ ను ‘ఆకుపచ్చ వెలుగు బుగ్గ’ అనీ, ‘పచ్చ బుగ్గ’ అనీ  అనువదిస్తారు.   బార్ ను ‘సురా మందిరం’  అనీ,  సాహిత్య గోష్టుల తర్వాత జరిగే  లిక్కర్ పార్టీని  ‘సభానంతర సభ’ అనీ చమత్కరిస్తారు.  కెనడాను  ‘ శ్వేత సోయగాల శీతల భువనం’ అనీ,  ‘మంచు వాకిలి’ అనీ  అభివర్ణిస్తారు.

బతుకుబాటలో  అనూహ్య, అనివార్య  ప్రతికూలపు మలుపులను వివరించేటప్పుడు చాలామంది  దైవాన్నో,  విధినో నిందిస్తుంటారు. కానీ  కాలం గురించీ, దాని జాలం గురించీ వ్యంగ్యంగా,  ముద్దుగా,  సొగసుగా చెప్పటం ఈ రచయిత పద్ధతి.  జంట సాహితీ పత్రికలతో ముడిపడిన స్వీయానుభవాలన్నీ చెప్పాక  ‘జీవితాన్నంతటినీ జల్లెడ పట్టుకుంటే  మిగిలేవి ఒక ఐరనీ, ఒక పారడాక్స్ మాత్రమే’నంటూ  ముక్తాయిస్తారు.

రెండు పుస్తకాల కథ

మొదటి పుస్తకమైన ‘విపుల- చతుర- నేను’ లో  46 అధ్యాయాలున్నాయి. ‘అక్షరాల మర్రి నీడలోకి తొలి అడుగు’ అంటూ జంట మాసపత్రికల పుట్టుక వివరాలతో ఆరంభించి… ‘ఆత్మ నలిగిన ఆ వేళ’ అధ్యాయంలో తన సంపాదకత్వ  భూమికకు తెరపడినప్పటి  నిర్వేదంతో ముగిస్తారు.  మరి తర్వాత కెనడాకు వెళ్ళినపుడు ఏం జరిగింది? చెప్పాల్సిందేనంటూ మిత్రులూ, పాఠకులూ నిలదీయటంతో కొనసాగింపుగా ‘ఒక నేను- ఒక కెనడా’  రూపుదిద్దుకుంది.

ఉపాధి కోసం కెనడాకు వెళ్లి  స్థిరపడదామని చాలామంది యువతకూ, వృత్తి నిపుణులకూ  కోరిక  ఉంటుంది. శాశ్వత నివాస హోదా కోసం వెంపర్లాట కూడా  పెరిగింది.  అలాంటివాళ్ళు  గమనించాల్సిన  కీలక  విషయాలను  స్వానుభవంతో ఈ రెండో పుస్తకంలో రచయిత  సవివరంగా చెప్పుకొచ్చారు. కెనడా నుంచి తిరిగి వచ్చాక తన ఉద్యోగ ప్రయత్నాల వైఫల్య పరంపరనూ, విసిగి వేసారిన దశలో  వరించిన సాఫల్యాన్నీ అక్షరబద్ధం చేశారు.

కొండను అద్దంలో చూపిన  కె. శ్రీనివాస్

ఈ రెండు పుస్తకాల్లోని  రూపాన్ని విశ్లేషిస్తూ, సారాన్ని సంక్షేపిస్తూ  చక్కని  ముందుమాట రాశారు  కె. శ్రీనివాస్ –‘ సున్నితుడు, సంభ్రముడు, సంపాదకుడు’ అనే శీర్షికతో.   ‘జీవిత ప్రయాణంలోని ఒక ఘట్టాన్నో, అధ్యాయాన్నో చెప్పడం లాంటిదే ఇది.   కానీ ఈ పరిధిలోనే  తన సారాంశ ఆత్మకథను , తన జీవిత దృక్పథంతో సహా రచయిత సర్దుబాటు చేయగలిగారు.  కొన్ని శకలాల్లో విస్తారంగా ప్రతిబింబించిన జీవితం’  అంటారాయన.  ‘ ఇదేమీ విషాద గాథ కాదు. విజయ గాథా కాదు.  చీకటి వెలుగుల , సదసత్సంశయాల జీవితం’  అంటూ  శ్రీనివాస్  సముచితంగా వ్యాఖ్యానించారు.

*

సీహెచ్. వేణు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా వ్రాశారు వేణుగారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.