విధ్వంసక అభివృద్ధిని అన్ ఫ్రెండ్ చేస్తున్న ప్రభు

మాతరం పిల్లలు చదవట్లేదన్నది అటుంచితే, మా తరం చదివేలా చేయడంలో మీరు ఫెయిలవుతున్నారనేది నా కంప్లైంట్.

మొదటిదే కొంత సొంతడబ్బా మొట్టాల్సిన పేరా చదవడానికి విసుక్కోకండి. హైద్రాబాద్ ఉజ్జోగం వల్ల యాక్సిడెంటల్ గా పుస్తకాలు రాసేవాళ్లతో తిరిగి, కొద్దిగా రాయడం,చదవడం అలవాటు చేసుకున్నాను. అకడమిక్ గా అబ్బిన రీడింగూ రైటింగూ హాబీలుగా నేననుకోను. ఎవరూ అవి చెప్పుకోరు కూడా. అకడమిక్ రీడింగూ, రైటింగూ నేర్పినదేదన్నా ఉంటే అది కొంత వరకే అనుకుంటాను. దానికి భిన్నంగా అంతే గొప్పగా సాహిత్యానికి సంబంధించిన రీడింగూ,రైటింగూ ఎంతో నేర్పుతుంది. రాసేవాళ్లతో మాత్రమే తిరిగి రాయడం కొద్దిగా నేర్చుకుని కొద్దిగా చదివాను. చాపకింద నీరులా సావాసలాభం చేకూరింది. రాసేవాళ్ల తర్వాత చదివేవాళ్లు వచ్చిపడ్డారు. వాళ్ల అలవాట్లూ, జీవితానుభవాలూ, జీవితమూ నచ్చుతావున్నాయి. వాళ్ల ఇళ్ళలో సూడ్డంవల్లో, వాళ్ల చంకలనున్న సంచుల్లో సూడ్డంవల్లో కొన్ని పుస్తకాలు దగ్గరయ్యాయి. ఇంతకుముందుకంటే ఇంకొంచెం చదివాను. ఇది బాగుందనిపించింది.

చదివినాట్లో ఒకట్రెండు నా దగ్గరుండి తీరాలనిపించి కొనుక్కున్నాను. కొన్ని ఒకరిద్దరికిచ్చాను. ఒక్కోటి చదివిన దాన్ని కనబడేలా ఉంచుకుని మళ్లీ చదివాను. నేనెరిగిన బతుక్కి దగ్గరగా ఉండి, నా బతుక్కి సూటైనవి మెచ్చడం తెలుస్తావుంటే కొన్ని కొత్తగా వినిపించినవి చదివాను. కొత్తగా అనిపించాక ఆనందపడ్డాను. అలా చేయడం మళ్ళీ బాగుంది.

ఇక విషయానికొస్తాను. అద్దేపల్లి ప్రభుది బతికీ, తిరిగీ, సూసీవున్న ఊళ్లచుట్టూ అల్లుకొచ్చిన కథల సంపుటి “సీమెన్” చదివాను. ఆ తర్వాత ఎక్కడో కొన్ని కాపీలు కొని ఒకరిద్దరికిచ్చాను. నాకు పూర్తిగా తెలుసున్న వాతావరణంలో బాగా పరిచయమున్నట్టనిపించే మనుషులందరూ పాత్రలుగా ఉన్న కథలన్నీ అందులో ఉన్నాయి. అనడానికి వీళ్లేనంత సానుభూతితో ఎంతో కరుణామయమైన ఒక ఆక్రందన సమాజంపట్ల చూపడం తెలిసీ అలజడి రేపి అశాంతికి గురిచేసిన ఇతని రచనలు ఇంకేమున్నాయి అని తెలుసుకునే క్రమంలోకి వెళ్లాను. వీళైనకాడకి ఆయన్ని చదివాను. “అర్బన్ మేన్ చెంపమీద ఫాట్ మని పీకి అతనికి ఏది అభివృద్ధి కాదో చెప్పి స్వస్థత చేకూర్చుతుంది మాయ్యా”  ఎగ్జాట్లీ ఇవి సీమెన్ చదివాక ఓ ఐటీ పిల్లాడి మాటలు. చదవడం ఎన్నడూ అలవాటులేనొకడు, ఇచ్చిన పుస్తకాన్ని చదివి,ఇలా అన్నాడంటే ఎంత ముచ్చటేస్తుందసలు. దాదాపు ఇంటర్ తర్వాత తెలుగు అక్షరం రాయడం, చదవడం అవసరం పడనంటి ఎన్విరాన్మెంట్ మాది. ఇప్పుడు మాలో ఒకడు కధ చదివి చెప్పిన మాట ఇలా ఉందంటే చదివేవాడికి ఎవడైనా చేరే ప్రయత్నం చేస్తున్నాడ్రా అనిపించింది. మనోళ్లు తెలుగు వొకాబులరీ తెలీదనికాదుగానీ ఇలాంటి పుస్తకాలు చదూతారు మామా. నువ్వాన్నావని కొన్న పుస్తకాల్లో ఏది నచ్చలేదన్నాడు ఇత్తప్ప అన్నాడు.

ఇంకోడు ఈ కథల్లో డెమోగ్రాఫిక్స్ కి ఏమాత్రం సంబంధంలేనోడు “ థాట్ నీ, హార్ట్ నీ కుదురుగా ఉండనియ్యట్లేదు భయ్యా” అదే బుద్ధినీ, హృదయాన్నీ అని తర్వాత తెలుగులో అన్నాడు. నవ్వుకున్నాను చాలా. చాలా సంతోషంగా నవ్వుకున్నాను. పుస్తకాలను చదవమని ఒక ఎసైన్మెంట్ లా ఇవ్వడం భలే బాగుంది. ఇవ్వడంతో కాదసలు మళ్లీ దాని ప్రస్తావన తేకుండానే దాని గురించి మాట్టాడుకోవడం  బాగుంది. ఇక్కడ ప్రభు కథలొక్కటే ఇచ్చానని కాదు. మిగిలిన పుస్తకాల మీదా మంచి స్పందనొచ్చింది.

ఇష్టమైన చేపల పులుసును ఆవురావురుమంటూ తినేటప్పుడు చాలాసార్లు తల్లోనుంచి నాకు చెమటకారుతుంది. కారంరుచిని తెలిపే “వొర్రగా” అనే ఆ, మా గోదారోళ్ల మాట అన్నగాటం విలువని ఎంతగా గుర్తుచేసిందంటే ఇదే శీతాకాలాల్లో పనికెళ్లొచ్చే అమ్మకి సాయంగా చిన్నప్పుడు పొయ్యిలో తూరికి ఎత్తిపోసిందీ, బియ్యం ఏరేసి ఎసరు మరగబెట్టిందీ గుర్తొచ్చి నా యధావిది ఏడుపైన ఉనికి కంట్లోనించి ఉన్నట్టుండి వొచ్చేసిందంతే. మగపిల్లాన్ని, అక్కలు అత్తారిల్లలో ఉన్నప్పుడు అమ్మకి నా సాయం తప్పేదికాదు. అందరూ ఆడుకుంటుంటే నేను ఏదో పని చేయాల్సొచ్చేది. సందామాట్ల ఆరైతే సాలు ఆకలేసే నా చిన్నప్పుడు ఇలాగే, ఈ కధల్లో ఉన్నట్టే వొర్రగా ఉన్న చేపల పులుసు ఊదుకుని ఊదుకుని తిన్నాన్నేను. నిండా ఆకలవ్వడం తెలిసిన నాలాంటోళ్లు నోస్టాల్జియా ఎలాగూ చదూతారూ. రాస్తారు. కానీ కళ్లు నగ్నమయ్యే సంధర్భాలలాగ ప్రభురాసినట్టు రాస్తే బాగుంటుంది.

తెలిసీ, తిరిగీ ఎరిగిన వాళ్ళ గురించే రాస్తున్నారు అనడం విన్నాన్నేను. అంత తీరిక ఎవ్వడికీ ఉంటంలేదు. ఎవడిబతుకు వాణ్ని న్ని ఎడతెరిపి లేకుండా అన్నివిధాల కాల్చుకు తింటూ ఉంటే ఇంకోడి పొయ్యి గొడవ ఎందుకు  చెప్పండి. ఈ నెలలో ఏం చదివాం, ఏం బాగుందీ అని దృష్టిలో ఉన్నదీ, నా తరం పిల్లలు అన్నదీ ఇక్కడ రాస్తున్నాను. ఎక్కడన్నా కలిసినపుడు, కుదిరినపుడు మేం కూడా ఏం చదివేవూ, ఏం చదువుతున్నావని మాట్టాడుకుంటాము.  బాగుంటే ముసలోడేగానీ మహేనుభావుడనీ, బాలేకపోతే ఏస్సాడ్రా కొడుకు అని ఇంటి ఓనర్లు జడుసుకు సచ్చేలా పైకి నవ్వుకుంటాం. మాతరం పిల్లలు చదవట్లేదన్నది అటుంచితే, మా తరం చదివేలా చేయడంలో మీరు ఫెయిలవుతున్నారనేది నా కంప్లైంట్. బాగున్నవి చదూతున్నాం. మేం చదివేవాటికి సమాధానంగా ఇక్కడ ఇంకా ఇంకా రాసే అవకాశం ఇస్తూ ఉండండి. చదివిన ప్రతికథలోనూ, కవితల్లోనూ విషయాలను ఓపిగ్గా రాసేయడం బాగోదుగానీ  నచ్చిన వాటిని ఖచ్చితంగా చదవమని సలహా ఇస్తాను. తర్వాత మీకు అది నచ్చాలని లేకున్నా పుస్తకంమ్మీద మాకున్న ప్రేమతో ఎలాగూ తిట్టేపని పెట్టుకోరని తెలుసు నాకు. కనీసం కొందరు పిలకాయలు నామాట విని, కొన్ని, కొనీ ఇకపై చదుతారు. ఇక పెదకాయలు కెన్ దబాంగ్ మీ ఇన్ మై ఇన్ బాక్స్. ఈ నెల ఇక్కడ సీమెన్ కథల గురించి అద్దేపల్లి ప్రభు గురించి రాసానంటే నాకున్న ఇన్పుట్స్ అలాంటివి మరి. తర్వాత నెల ఏదో గాలి ఈ తూరుపుగోదారోన్ని తాక్కమానదు. అందాకా మీరు చదివిన వాటి గురించి కూడా ఇక్కడ ముచ్చటిస్తే భలే ముద్దొస్తారు.

*

కాశిరాజు

10 comments

Leave a Reply to Gouthamaraju Chekuri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సుపర్బ్ కాశీరాజూ
    జనరేషన్ గ్యాపే కాదు
    కథల జనరేషన్ ఎలా ఉండాలో చెప్పేవు
    ఎలా ఉంటే చదువుతారో చెప్పావు…
    నైస్ ఆఫ్ యూ

    • Thank you master. మీరూ కొన్ని చదివిన వాటి గురించి ఎట్లీస్ట్ టైటిల్స్ చెప్పికూడా మాక్కావల్సిన ఇన్పుట్స్ ఇస్తారని ఆశిస్తాను.

  • కొత్తగా నేను నీకు ముద్దోచ్చేదేముంది గానీ….. చదవటానికి ముందు “చదివిన్చుకునేది” ఉండాలన్నది ఇంట క్లియర్గా చెప్పేసావ్. ఇదీ చదివిన్చేలాగానే ఉంది మరి. ఆ బుక్ కొని చదివి మళ్ళీ మాట్లాడతా…

    • అవునొరేయ్… మన గురించి చెప్పుకోడం అనికాదు, చదివేవాళ్లున్నార్రా కొందరు పెద్దమనుషులేమో మరీ ఇజ్జతీస్తుంటే భాదేస్తుందిరా. ఎతుక్కుని మరీ మనం కొనుకున్న టైటిల్స్ ప్రతీ ఏడాది కొంటాం ఉన్నాం కదా… అవి మిస్సయిపోవడం గురించి మనం రాద్దాంరా..

  • “కళ్ళు నగ్నమయ్యే సందర్భాలలాగా ”
    ఈ వాక్యామ్ చాలు..కాశీ.. నువ్వెంత కరిగినీరయ్యావో ఈ కధలు చదివి..
    తప్పకుండా చదవాల్సిందే..

  • బావుంది … వొర్ర వొర్రగా …😊

    👌👌😊👏👏👏👏

  • కాశీ రాజు గారు
    మీ విశ్లేషణ, పరిశీలన బాగుంది

  • చాలా సింపుల్ గా మనసుకి అనిపించింది రాశారు కాశిరాజూ.. మీ రాత బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు