1
అక్షరాల బరువు
మసిబారిన కాగితంపై
ఒక నల్లటి సిరా చుక్క
నిశ్శబ్దంగా ఒలికి
అనంతమైన అర్థాన్నిచ్చే ‘అక్షర’మై నిలిచింది.
కంటికి కనిపించని కాంతి రేఖ అది
కానీ, విశ్వమంతటి బరువును మోస్తోంది
ఒక్కో అక్షరం – ఒక ఆలోచన
ఒక్కో అక్షరం – ఒక ఆశల వనం.
హృదయపు లోతుల్లోంచి పెల్లుబికిన వేదన
కలమై ప్రవహించి అక్షరమై అచ్చుపడితే
ఆ మౌన రోదన మోసే బరువు
గిరి శిఖరాల కన్నా ఘనం.
గతించిన కాలపు గాయాల గాథలను
రాబోయే తరాల కలల సౌధాలను
తన చిరు కౌగిలిలో బంధించి మోసే శక్తి
ఒక్క అక్షరానికే సొంతం.
పదమైతే అది పర్వతమంత ధైర్యం
వాక్యమైతే అది సముద్రమంత గాంభీర్యం
అక్షరాల బరువు
భావాన్ని మోసే ఒక ‘తేలికైన’ భారం.
భాష లేని చోట అవి మాట్లాడుతాయి
దిశ లేని చోట అవి దారి చూపుతాయి
కాలం చెరిపేయలేని చారిత్రక వారసత్వాన్ని
అక్షరాలే భుజాలపై మోస్తుంటాయి.
నిజమే.. అక్షరం మోసే బరువు
కంటికి కనబడదు
కానీ దాని ప్రభావం, కాలం ఆగిపోయినా
తరతరాలకీ చెరిగిపోదు.
2
అదృశ్య వరుస : అంతిమ సత్యం
అలికిడి లేని అడుగుల సవ్వడి
కనిపించని నిశ్శబ్ద ప్రయాణపు సామూహిక బారులు
నేను, నువ్వు, ఈ సమస్త లోకం
ఆ వరుసలో నిలుచున్న బాటసారులమే.
అక్కడ వయసుకి తూకం లేదు, హోదాకి తావు లేదు
కాలం పిలిచిన వేళ.. పేదరికం, ప్రాభవం రెండూ ఒక్కటే.
ఎందరి వెనుక మనమో.. ఎవరికీ ఎరుక లేదు
ఏ క్షణం మన వంతు వస్తుందో.. తెలిసే వీలే లేదు.
కానీ.. ఈ రెప్పపాటు ప్రయాణంలో ఎన్ని పంతాలు?
రేపు మట్టిలో విలీనమయ్యే ఈ తనువుకెన్ని అహంకారాలు?
నీవు గీసుకున్న సరిహద్దులు,కూడబెట్టిన సామ్రాజ్యాలు
ప్రాణం నిష్క్రమించాక తోడు రాని కలే కదా!
ద్వేషాన్ని మోయడం ఆత్మకు భారమే
క్షమించడంలోనే మనిషి గెలుపు దాగుంది.
భూమి కోసం నీ ఆరాటమా?
రేపు అదే మట్టి నిన్ను తన ఒడిలో దాచుకుంటుంది.
నీవు నిర్మించిన మానవత్వపు వంతెనలు
నీవు పంచిన అనురాగపు జల్లులే
నీ నిష్క్రమణ తర్వాత నిలిచే శాశ్వత సాక్ష్యాలు.
వరుస కదులుతోంది.. సమయం కరిగిపోతోంది.
నీ వంతు పిలుపు రాకముందే..
ఒక చిరునవ్వును మిగలనివ్వు
ఒక తోటి ప్రాణానికి నీడగా నిలిచిపో.
మమకారాన్నే నీ అసలైన వారసత్వంగా
ఈ లోకానికి వదిలి వెళ్లు
అదే నీ జీవితానికి పరిపూర్ణమైన సార్థకత.
*








‘అక్షరం’ గొప్పతనాన్ని ,
జీవిత క్షణభంగురాన్ని ,ద్భుతంగా ఆవిష్కరించారు.
రెండు కవితలు దేనికదే అద్భుతం.
అభినందనలు 💐💐💐