వాన తుంపర

ర్షాకాలపు సాయంత్రాలు ఎంత హాయిగా ఉంటాయో. అలా నా గ్రీన్ టీ కప్పును ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేతిని నా వైపు కురుస్తున్న చిలిపి జల్లుని తాకడానికి ముందుకు చాచాను. వర్షపు చినుకులతో పాటు పిట్టలు పాడుకుంటున్న ప్రేమ పాటలను కూడా తోడుగా తీసుకువచ్చింది ఈ తుంటరి గాలి. ప్రశాంతంగా, ఆహ్లాదంగా, చిలిపిగా ఒక ఐస్ పుల్ల తింటున్న చిన్నబాబు సంబంరంలాగా ఉంది ఈ గాలి, బహుశా ఐస్ పుల్ల లాంటి వర్షం దొరికినందుకు కాబోలు. కొంచెం దూరంలో బర్రెలు కొన్ని గడ్డి మేస్తున్నాయి. అవి ఏం ఆలోచిస్తున్నాయో కదా.

ప్రక్కనే కొంగలు ఈగళ్లా ముసురుతున్నాయి వాటిని  పాపం. బర్రెలంటే ఇష్టం కాబోలు మాటిమాటికి వాటి మీద వాలడం పక్క పక్కన టింగు టింగు అనుకుంటూ నడవడం చూడటానికి భలే సరదాగా ఉంటుంది నాకు. బర్రెలేమో వాటిని అస్సలు పట్టించుకోవు, నాకు నువ్వెంత అన్నట్టు. అలా నా కళ్ళు ఆకాశం మీదికి మరిలాయి.  ఆ మేఘాలు- అవి వాటి సన్నిహితులతో దూర ప్రయాణానికి కాలుదువ్వాయి కాబోలు. అదే పనిగా సంచరిస్తూ ఉంటాయి. వాటికి అసలు మనమెంత. మనకు చీమలెంతో వాటికి మనమలాగా అనిపిస్తుంటుంది. ఎంత హొయలు పోతాయి అసలు అవి అబ్బా ఆ రంగు, కదలిక ఎంత మధురానుభవంగా ఉంటాయి. వాటి వర్ణన మన బోటి వాళ్ల తరం కాదు.

మన చుట్టూ ఉన్న అద్భుతాన్ని ఒదిలేసి ఏడు అద్భుతాలని తిరుగుతాం, అవి కూడా మనం కట్టుకున్నవి! మనిషి ఎంత స్వార్థపరుడో కదా.. వాడు చేసినది వాడికే అద్భుతం. అలా పాదాల వేళ్లని చిన్నగా లయబద్ధంగా ఊపుతూ ఎక్కడో అంతరించడానికి దగ్గర్లో ఉన్న ఒక పక్షి మాటలు వినడానికి ప్రయత్నిస్తున్నా.. అంతలోనే నా చెల్లెలు వచ్చింది ఫోను పట్టుకుని “అబ్బా వర్షం ఎంత బాగుందో ఒక ఫొటో తీస్తా” అని. పిచ్చిది ఆ ఫోటో వల్ల ఏం ఉపయోగం? ఈ క్షణంలో జీవించలేని నువ్వు మరలా రేపటి రోజు గడిచిన కాలాన్ని చూసి మురిసిపోతే ఏం లాభం? అది చెప్పినా అర్థం కాదు. “ఏంటీ ఏం చూస్తున్నావ్ ఒక ఫోటో తీస్కుందాం రా” అంటూ దగ్గరకొచ్చింది. “గాలి చూడు ఎంత బాగా వీస్తుందో!” అని నేను అన్నదానికి” హా అవును చలిగా ఉంది. నేను లోపలికి వెళతాను” అని వెళ్ళిపోయింది. ఒకసారి నవ్వువచ్చింది.

ముచ్చట్లు అనేవి ఒకరిమీద ఒకరు చెప్పుకునే చాడీలుగా మారాయి. కథలు, అసలు ఎవరు చెప్తున్నారు కథలు? మా అమ్మమ్మ చెప్పేది ఏమీ తోచక ఉన్నప్పుడే ఇంచుమించు హ్యారీపోటర్ లాంటి విభిన్న కథలు, ఇవి వింటుంటే కుతూహలంతో ,ఆతృతతో కళ్లలో ఆనందపు నీళ్లు వచ్చేవి. మెదడులో తను చెప్పిన ఒక్కొక్క పదంని ఒక దృశ్యంగా మలుచుకుని వింటున్నపుడు  ఆ కథ ఒక సినిమా అంతటి అనుభవాన్ని ఇచ్చేదే.

ఎందుకు అలాంటి అనుభవాలు చిన్ననాటికే పరిమితమవ్వాలి? ఎందుకు ఇంత అమూల్యమైన అనుభవాన్ని మనం దూరం చేసుకోవాలి?

నా చిన్ననాటి రోజులు ఇంకా గుర్తున్నాయి. బామ్మ చెప్పే సోది, తాతయ్య చెప్పే “మా కాలంలో..” ఇవన్నీ అసలు తప్పేవి కావు. నా చెల్లి అయితే మెల్లగా జారుకుంటుంది వాళ్లనుంచి, లేదా ఫోన్ పట్టుకుని కూర్చుంటుంది.

ఈ ఫోన్ వల్లా మేము తప్పక విన్న సంభాషణలు వీళ్లు వినలేకపోతున్నారు. దానికి మనస్సులో అసూయగా ఉన్నా ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎంతో నవ్వు వస్తుంది. ఆ పళ్లక్లిప్పు పెట్టుకుని సరిగ్గా స్పష్టంగా మాటలు రాకపోయినా తాతమ్మ కష్టపడి మాట్లాడటం, కనుచూపు మసకబారి ఉన్నా కూడా మన చేతుల్ని వెతికి పట్టుకుని కూర్చుని ఏదో చెప్పడం, అబ్బా ఎప్పుడు వదులుతుందిరా బాబో అని తప్పించుకోలేకా అక్కడ కూర్చోలేక ఎన్ని అవస్థలు పడేవాళ్లం. అది ఒక సాహసఘట్టం అనుకోవాల్సిందే మరి.

నా పన్ను ఊడిపోయింది అని ఏడ్చి కాసేపటికి ఎవ్వరికీ తెలియకుండా ఒక చెట్టు కుండీ కింద పెట్టి వచ్చేదాన్ని. అది పొద్దునకి ఒక రూపాయిగా మారడం  భలే చమత్కారంగా అనిపించేది.. ఆ రోజంతా ఎవరిని చూసినా అబ్బా వీళ్ల పళ్లు ఎప్పుడు ఊడుతాయో…ఊడితే నాకే ఇవ్వండి అని అనడం భలే హాస్యాస్పదంగా ఉండేది. నేను ఏమీ 1950లో పుట్టినదాన్నేమీ కాదు. నేను పుట్టి పందొమ్మిది యేళ్లే అయింది.

పద్నాలుగేళ్లు ఈ ‘‘నా’’ హాగ్ వర్డ్స్ లో గడిపాను. కానీ ఈ ఫోన్ల వల్ల భూమి పైకి తిరిగి రావలసి వచ్చింది. “నీకు చలి పెట్టట్లేదా?” అంటూ మళ్ళీ వచ్చింది నా చెల్లి.  “లేదు బావుంది ఇలాగే” అన్నాను. విచిత్రంగా దాని పేరు ప్ర్రకృతి అని పెట్టారు అమ్మానాన్న. ఇక దానికెందుకు ప్ర్రకృతి అనుకుందో ఏమో ఫోను పట్టుకునే ఉంటుంది. ప్ర్రకృతి వింత మార్పులకు గురి అవుతుంది అంటే ఇదేనేమో! మనస్సు తేలిగ్గా ఉంది. ఎటువంటి బాధలు లేవు ఈ గాలిలా మారి అక్కడ కనిపిస్తున్న పొడవాటి పచ్చని చెట్టు మీదిగా ప్రయాణించాలని ఉంది. అలా మేఘాలలో కలిసిపోవాలని ఉంది. పరిగెత్తాలని ఉంది. చిన్ననాటి పరుగుపందాలలోని హాహా ధ్వనులు చెవులలో మారుమోగుతుంది. ఆనందంతో ఏదో సాధించిన ఉత్సాహం, అందరి నవ్వులు సంగీతంలాగా తీయగా చెవిలో తేనె పోసినట్టుగా అనిపిస్తుంది.

ఒక్కసారి కళ్లు మూసుకున్నాను. గాలి మరలా తాకింది. ఈ సారి ఇక చాలు నన్ను పొగిడింది అన్నట్టు. భోజనానికి రా అంటూ ప్ర్రకృతి వచ్చింది. ఈ ప్ర్రకృతిని విడిచి ఆ ప్ర్రకృతితో చిన్న చిరునవ్వు నవ్వి భూమి వద్దకు అడుగేసాను.

*

సెలవు కందుకూరి

సెలవు కందుకూరి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బంగారు తల్లి సెలవు ఎంత బాగా రాశావు తల్లి. పార్శీ గుట్టలో ఉండగా చూశాను. మా రమణ, నేను వచ్చి ఓసారి ఏడిపించాడు.అభినందనలు. గొప్ప రచయిత గ ఎదగాలని ఆకాంక్ష.

    • ఆల్ ది బెస్ట్ సెలవు.

  • సూపర్ సెలవు. నీ ఈ రచన చాలా బాగా వుంది, ఆల్ ది బెస్ట్ మా.

    • ఎక్కడికి పోతుంది నాన్న వారసత్వం. కందుకూరి వంశంలో మరో ఆణి ముత్యం. మంచి భవిష్యత్తు ఉంది ఇలాగే కంటిన్యూ చెయ్…అల్ ద బెస్ట్…

      సెలవు!👍

  • కథ బావుంది . మంచి కథకురాలిగ ఎదగాలని కోరుతూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు