వాడు రాజబాబునే నవ్వించాడు!

ఆరోజు రాజబాబు ఆర్టిస్ట్‌గా ఫెయిలైనా, మనిషిగా పాసైపోయాడు.

మైసూరు సత్రం పిట్టగోడమీద నుంచి తొంగిచూసింది అన్నమ్మ.  ఆమె మొఖం సంతోషంతో వెలిగిపోతూ వుంది. పట్టరానంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది.  తనలో తానే నవ్వుకుంటూ వుంది.

మా ఇడ్లీఅవ్వ (మా అమ్మమ్మ) ఆమెను చూసింది.  ‘‘ఏమైంది అన్నమ్మా? పిచ్చిదానిలా నీలో నువ్వే నవ్వుకుంటావుండావు?’’ అని అడిగింది.

అన్నమ్మ చేతిలోని టిఫిన్‌ బాక్స్‌ తీసుకుంది.  ఆ బాక్స్‌లో రూపాయి బిళ్ళ వుంది.  ఆ డబ్బుని తీసుకుని, ఆ బాక్స్‌ నిండా పది ఇడ్లీలు పెట్టి, పక్కన గట్టి చట్నీ పెట్టి, ఇంకో బాక్స్‌ నిండా సాంబారు పోసి, మళ్ళీ అన్నమ్మకు ఇచ్చింది.

‘‘అకా.. మద్రాసు నుంచి సినిమా యాక్టరు రాజబాబు వచ్చినాడు.  తొమ్మిదో నెంబర్‌ కాటేజీలో దిగుండాడు.  ఆయన్ని చూస్తావుంటే చక్కలిగింతలు  పెట్టినట్టు ఒకటే నవ్వు.  నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చేసింది’’ అనింది. మళ్ళీ రాజబాబుని తలచుకుని నవ్వుతూ…

అన్నమ్మ మైసూరు సత్రం కాటేజీల్లో స్వీపర్‌గా పనిచేస్తూ వుంది.  అవి ఖరీదైన కాటేజీ. అప్పుడప్పుడూ సినిమా యాక్టర్లు మద్రాసు నుంచి వచ్చి ఆ కాటేజీల్లో దిగుతుంటారు.

సినిమా యాక్టర్‌ రాజబాబు పేరు చెప్పగానే మా ఇడ్లీ అవ్వ ముఖం భూచక్రంలా గిర్రున వెలిగిపోయింది.  మా ఇడ్లీఅవ్వకు భలే సినిమా పిచ్చి! నన్ను తోడుపెట్టుకొని, కిందికి దిగింది అంటే, మార్నింగ్‌షో, మ్యాట్నీ, ఫస్ట్‌ షో వరుసగా మూడు సినిమాలు  చూసుకుని, ఆఖరి బస్సెక్కి మళ్ళీ కొండెక్కుతాము.  మా ఇడ్లీ అవ్వ సినిమాపిచ్చి నాకు పట్టుకుంది.

సినిమా యాక్టర్లు మాకొండకు వస్తే, ఎలా తెలిసిపోతుందో తెలిసిపోతుంది.  ఇళ్ళకు బీగాలేసుకుని కాటేజీ ముందు హాజరైపోతారు.

మా ఇడ్లీ అవ్వ చేస్తున్న పనిని చేస్తున్నట్టే వదిలేసి, నన్ను తీసుకొని రాజబాబుని చూడటానికి వెళ్ళిపోయింది.  నాకు అప్పుడు ఆరేడేళ్ళు వుంటాయి.  అప్పుడప్పుడే సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తున్నాను.  మేము వెళ్ళేసరికి మైసూరుసత్రం కాటేజీ ముందు జనం గుమికూడి వున్నారు.  ఇసుకవేస్తే కింద రాలనంత జనం.  వాళ్ళల్లో ఉండూరోళ్ళున్నారు (స్థానికులు ), యాత్రికులు వున్నారు.

రాజబాబు ఎప్పుడెప్పుడూ బయటకు వస్తాడా, చూద్దామా అని కళ్ళని ఇంతింత పెద్దవి చేసుకొని చూస్తున్నారు.

ఎంత సినిమా యాక్టర్‌ అయినా, రాజబాబు కూడా మనిషేకదా!  పొద్దున్నే మద్రాసు నుంచి వచ్చినట్టువుండాడు. కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చెయ్యాలి, టిఫిన్‌ చెయ్యాలి.  దేవుడి దర్శనానికి వెళ్ళాలి. పాపం ఆయన ఆ హడావిడిలో వున్నాడు లోపల.  బయట జనం గోలగోల చేస్తున్నారు.  కేకలు, ఈలలు, అరుపులు, రచ్చరచ్చ చేస్తున్నారు.

సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ని, ఆయన మాడ్యులేషన్‌లో చెపుతూ బయటకు రమ్మని పిలుస్తున్నారు.  ‘‘తీతా.. తీతా… ఎప్పుడు బయటకు వస్తావమ్మా తీతా!’’ అని అందాలరాముడు సినిమాలో అల్లురామలింగయ్యను ఆటపట్టిస్తూ చెప్పే డైలాగ్‌ చెప్పాడు ఒకడు.  అందరూ గొల్లున నవ్వేసారు.

‘‘రేయ్‌… నువ్వు బయటకు వస్తావా? రావా? లేదంటే నిన్ను సెంటర్‌ చూసి పొడిచేస్తారోయ్‌!’’ అని ఇంకొకడు అసహనాన్ని ప్రదర్శిస్తూ, మనుషులంతా  ఒక్కటే సినిమాలోని డైలాగ్‌ చెప్పాడు.

ఆ డైలాగ్‌కి అందరూ బయటకు రమ్మన్నట్టు అరిచారు.

‘‘సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర,శని ఆది… పుట్టేవాడికి పేరేది? వుండే దానికి ఇల్లేది?’’ అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ మీద తాతామనవడు సినిమాలోని పాటని పేరడిచేస్తూ పాడాడు ఇంకొకడు.

‘‘ఒకటి రెండూ మూడు, నాలుగు అయిదూ ఆరు ఏడు.. ఏడు అంకె ఎంచేలోపు, నువ్వు బయటకు రాకపోతే, నీకు కుటుంబ నియంత్రణ ఆపరేషనేగతి’ అని పేరడీపాట పాడేడు.

పిలకయలంతా అతనితోపాటూ కోరస్‌గా పాడారు.  ఈ గోను తట్టుకోలేక లోపలినుంచి వాళ్ళ మేనేజర్‌ బయటకు వచ్చాడు.

‘‘ఏమండి… గోలచెయ్యకండి ప్లీజ్‌..! సర్‌.. స్వామి వారి కళ్యాణ ఉత్సవానికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు.  బయటకు వస్తారు.  తప్పకుండా మిమ్మల్ని విష్‌ చేస్తారు’’ అని తూర్పుగోదావరి జిల్లా యాసలో చెప్పాడు.

ఆ మాటకి జనం కొంచెం ఆగారు.

అన్నమ్మ మా ఇడ్లీఅవ్వ భుజం గోకి ‘‘అకా… నాది ఓ ధర్మసందేహం! రాజబాబు గోడు కూడా దొడ్డికి పోతాడా? అకా…’’ అని అడిగింది.

అన్నమ్మవైపు మా ఇడ్లీ అవ్వ విచిత్రంగా చూసింది. ‘ ‘ఏమ్మే… రాజబాబుగోడు ఏమన్నాదేవుడా! దొడ్డికి పోకుండా వుండటానికి.. మనలాంటి మనిషే! తినేది కూడిచేత్తోనే తింటాడు.  దొడ్డికిపోతే ఎడం చేత్తోనే కడుక్కుంటాడు’’ అని తిట్టింది. అన్నమ్మ అమాయకత్వానికి అందరూ నవ్వుకొన్నారు.

ఇంతలో రాజబాబు సీరియస్‌గా బయటకు వచ్చాడు.  అందర్నీ చూస్తూ గాల్లో చేతిని ఊపాడు. నమస్కారం పెట్టాడు. రాజబాబుని చూసి, జనం ఒక్కక్షణం తన్మయత్వం చెందారు.  తెల్లని జుబ్బా, పైజామాలో మల్లెపువ్వులా వున్నాడు. ‘‘రాజుబాబుగోడురా… రాజబాబుగోడు’’ అని చూస్తూవుండిపోయారు.

‘‘రాజబాబుగోడు ఏందిరా? మొు కిందికిదిగినట్టు మొహం అంత సీరియస్‌గా పెట్టాడు’’ అని పక్కన్ను ఫ్రెండ్‌ని అడిగాడు ఓ పిలగాడు.

‘‘సినిమా యాక్టర్లు అంతా అంతే మచ్చా! ఫేక్‌ ఫేసు, ఫేక్‌ నవ్వు’’ అన్నాడు.

‘‘ఒరేయ్‌ రాజబాబుగా… అడివిరాముడు సినిమాలో డైలాగ్‌ చెప్పు… ఉప్మా పోయే, ముద్దుపోయే, పులి పోయే’’ అని అడిగారు ఎవరో.

ఆ మాటకి అందరూ ‘‘డైలాగ్‌ చెప్పాలి.. డైలాగ్‌ చెప్పాలి’’ అని అరిచారు.

వాళ్ళ అరుపుల్ని పట్టించుకోకుండా, అక్కడనుంచి సీరియస్‌గా స్వామి దర్శనానికి వెళ్ళిపోయాడు రాజబాబు.  సినిమాలో చిచ్చుబుడ్డిలా నవ్వుల్ని రువ్వే రాజబాబు ఇప్పుడు ఎందుకంత సీరియస్‌గా వున్నాడో ఎవరికీ అర్ధంకాలేదు.  జనమంతా నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయారు.  మళ్ళీ ఆరోజు సాయంత్రం వెళ్ళాము.  రాజబాబుని చూడటానికి జనం గుమికూడి ఉన్నారు.  రాజబాబు బయటకు వస్తానే డైలాగ్‌ చెప్పమని గోలచేసారు.  రాజబాబు డైలాగ్‌ చెప్పకుండా, చేతిని గాల్లో ఊపి, నమస్కారం పెట్టి, సీరియస్‌గా వెళ్ళిపోయాడు.

మళ్ళీ రాత్రి తొమ్మిదిగంటలకు వెళ్ళాము.  అదేజనం అలాగే గుమికూడి వున్నారు.  వాళ్ళ మేనేజర్‌ బయటకు వచ్చాడు.

‘‘సార్‌… బాగా అలిసిపోయి నిద్రపోతున్నారు. రేపురండి.. వెళ్ళండి ప్లీజ్‌’’ అని వేడుకున్నాడు.  అందరూ వెళ్ళిపోయారు. మరుసటిరోజు వెళ్ళాము.  అదే జనం అలాగే గుమికూడి వున్నారు.  రాజబాబు మద్రాసుకి తిరిగి వెళ్ళిపోయే మూడ్‌లో వున్నాడు.

జనం అలాగే అరుస్తున్నారు.  కేకలు  పెడుతున్నారు.  రాజబాబు బయటకు వచ్చాడు.  చేతిని గాల్లో ఊపాడు.  నమస్కారం పెట్టాడు.  అడివిరాముడు సినిమాలో డైలాగ్‌ చెప్పమని ఎవరో అడిగారు.

‘‘నీ సొమ్మేమిపోదు చెప్పరా! మా సొమ్ము తీసుకొనే కదా! నువ్వు యాక్టింగ్‌ చేసేది’’ అని అరిచారు ఎవరో.  ఆ మాటని రాజబాబు సరదాగా తీసుకున్నాడు.

వెంటనే ‘‘వినరా సూరమ్మా కూతురు మొగుడా? విషయము చెపుతాను’’ అని పాటని అందుకున్నాడు.  మధ్యలో ‘కాకాకా…’ అని కాకిలా అరుస్తూ, ‘ఆహా.. ఆహా.. ఏం జలిగింది?’ అని ఆశ్చర్యపోతూ, కుటా! లాక్షసి! అని తిడుతూ, ఆ వచ్చినవాడు మా తాతయ్య అని చెప్పగానే.. ఓ.. మీ తాతయ్యా! తాతయ్యా! తాతయ్యా, తాతయ్యా అని అభినయిస్తూ పాడేడు.

జనం ఒకటే నవ్వు, కడుపు పట్టుకుని నవ్వారు.  పొట్ట చెక్కయ్యేలా నవ్వారు.  వొళ్ళు మరిచిపోయి నవ్వారు.  కళ్ళల్లో నీళ్ళువచ్చేలా నవ్వారు.

అందరూ నవ్వుతూవుంటే, కడుపు నిండిపోయినట్టు చూస్తూ నిలబడ్డాడు రాజబాబు.

అందరూ నవ్వుతున్నారు కాని, ఆ జనం వెనుక దూరంగా నిలబడివున్న తల్లీకొడుకు మాత్రం నవ్వటం లేదు. దీనంగా రాజబాబు వైపే చూస్తూ నిలబడి వున్నారు. అది గమనించి రాజబాబు వాళ్ళ దగ్గరకి వెళ్ళాడు.

‘‘అందరూ విరగబడి నవ్వుతుంటే, మీరెందుకు నవ్వటంలేదు, వందమందిలో ఒక్కరు నవ్వకపోయినా నేను ఆర్టిస్ట్‌గా ఫెయిలైనట్టే’’ అన్నాడు రాజబాబు.  ఆమె తన బాధని చెప్పింది.

ఆమె కొడుక్కి హార్ట్‌ ప్రాబ్లం వుంది. ఆపరేషన్‌కి చాలా డబ్బుకావాలి. ఆపరేషన్‌ చేయకపోతే కొడుకు చనిపోతాడు అని చెప్పింది. అది విని రాజబాబు ఏడ్చేసాడు.  వాడ్ని దగ్గరకు తీసుకున్నాడు.

వాళ్ళది గోగర్భ డ్యామ్‌ దగ్గరున్న సూరాపురంతోట!  వాళ్ళ నాన్న కోనేటి కట్టమీద యాత్రికులకు నామాలు  పెడతాడు. కొండకు వచ్చిన యాత్రికులు  కళ్యాణ కట్టలో తలనీలాలు  సమర్పించి, స్వామివారి కోనేటిలో స్నానం చేస్తారు.  గుండుకి చల్లగా చందనం రాసుకుంటారు.  తర్వాత వాళ్ళ నాన్న ఆ యాత్రికులకు నామం పెడతాడు. నామానికి ఐదుపైసలు  చొప్పున తీసుకుంటాడు. పాపం..! అలా ఎన్ని పైసలు  సంపాయిస్తే వాడి గుండెకి ఆపరేషన్‌ చేయించగలడు? వాడి గుండె జబ్బు నయమవుతుంది? రాజబాబు వాడి గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాడు.

‘‘ఎంత డబ్బు అయినా పరవాలేదు, నేను ఆపరేషన్‌ చేయిస్తాను, మీరు ధైర్యంగా వుండండి’’ అని చెప్పాడు.

ఆమె ముఖంలో నవ్వు చిగురించింది. రెండు చేతు జోడించి నమస్కరించింది.

మేనేజర్‌ని పిలిచి ఆమె అడ్రస్‌ తీసుకోమన్నాడు.

తల్లి సంతోషంగా వుండటం చూసి, ఆ పసివాడు నవ్వాడు.  వాడ్ని చూసి రాజబాబు మనసు నిండా నవ్వుకున్నాడు. అందరిని నవ్వించే రాజబాబునే వాడు నవ్వించాడు.

ఆరోజు రాజబాబు ఆర్టిస్ట్‌గా ఫెయిలైనా, మనిషిగా పాసైపోయాడు.

గోపిని కరుణాకర్

గోపిని కరుణాకర్

తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరు రాసిన వాడు రాజబాబు నే నవ్వించాడు . చాలా టచింగ్ గ ఉండింది. రాయల సీమ మాండలికాన్ని ఇప్పడిప్పుడే తెలుసుకుంటున్నాను . నామిని గారి రచనలు చదువుతూ .బాగుంది కరుణాకర్ గారు

  • బాగుందిలా తెలుసుకోవడం గొప్ప మనసుల గురించి. మనసుకు హత్తుకునేలా రాశారు.

      • నమస్తే అన్న గారు . కథల మాంత్రికుడు మా అన్న గోపీని కరునన్న…సూపర్ కథ…మీ తమ్ముడు తిరుపతి చిట్టి ముని ప్రసాద్ … దయచేసి ఫోన్ చేయండి 9441332519

  • చాలా బావుంది కరుణాకర్.. ముగింపు అద్భుతం.. పిల్లాడు రాజబాబుని నవ్వించాడేమో కానీ, మీరు చదివేవాళ్ళ పెదవిపై నవ్వుతో పాటు కళ్ళల్లో తడిని నింపారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో మీ చిన్నప్పటి అనుభూతిని కూడా కథ చెయ్యండి. మళ్ళీ సాహిత్యంతో అనుబంధం పెంచుకుంటున్నందుకు అభినందనలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు