వాళ్ళిప్పుడు గొంతెత్తగలరు
ఒక అడుగు ముందుకేసి పాడనూగలరు

దేశభక్తి పొంగిపొర్లుతుంటే
ఆ భారాన్ని
గుండెల మీద మోయలేని
సున్నిత మనస్కులు..

వాళ్ళిప్పుడు మాట్లాడగలరు
సల్వాజుడుం పేరుతో
అడవిబిడ్డల జీవితాలు
క్యాంపుల్లో బందీలయినప్పుడు..
తల్లీబిడ్డలు వేరుచేయబడి
బాలింతలు సైన్యంతో చెరచబడ్డప్పుడు..
నేలతల్లిని వదలలేని గూడెపోళ్ళు
గుడిసెల్లోనే తగలబెట్టబడినప్పుడు..
తల్లి కడుపులో ఉన్న ఐదు నెలల పిండం
గర్భం చీల్చి పెకలించబడి
మంటల్లో కాల్చబడినప్పుడు..
అయ్యో పాపం అని కూడా అనుకోలేనివాళ్ళు
ఇప్పుడు మాట్లాడగలరు..

పుట్టించిన అమ్మానాన్నలే
కులం ముఖ్యమైపోయి
ఒకరు కాళ్లు పట్టుకొని
ఇంకొకరు గొంతు నులిమేసి
ప్రాణాలు తీసినప్పుడు..
మధుకర్ లు, ప్రణయ్ లు
శవాలుగా మిగల్చబడ్డప్పుడు
కిక్కురుమమనివాళ్ళు..

పసిపిల్లల జననాంగాలను
కన్నతండ్రులే రక్తమోడ్చినప్పుడు..
మదమెక్కిన పురుషాంగాలు
యోనులతో పాటు గుండెలనూ చీల్చితే
దళిత ఆడబిడ్డలు
అడవుల్లో, చెరువుల్లో,
ఊరిచివరో, ఉరివేయబడో
మనుషులుగా ఛిద్రమైపోయినప్పుడు
కన్నెత్తయినా చూడలేనివాళ్ళు
ఇప్పుడు స్పందించగలరు..

పాలిచ్చే తల్లి శవమైపోయిందని తెలియక
రొమ్మును పిలుస్తున్న పసిబిడ్డను చూసినప్పుడు..
అగ్రరాజ్య అహంకారం బుసల్లో
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన
పసిపిల్లల మృతదేహాలు కంటపడినప్పుడు..
అడుగడుగునా అభద్రతలో
అమాయకత్వాన్ని కోల్పోవలసొచ్చి
మరణప్రాయమయిన బాల్యమంతా
మృతదేహాల కుప్పలయినప్పుడు..
కనికరమయినా కలగనివాళ్ళు
ఇప్పుడు వెక్కి వెక్కి ఏడవగలరు..

ఆడదనిపిస్తే చాలు కామించేవాళ్ళు
మేలిముసుగులేసుకొని వేధించేవాళ్ళు
బ్రాహ్మణులకు మాత్రమే- అద్దె బోర్డులు పెట్టె వాళ్ళు
పశువుల మాంసం, చర్మం విదేశాలకు అమ్ముకుంటూ
పెద్దకూర తింటారంటూ దాడులు చేసేవాళ్ళు..
లాగులు విప్పించి సున్తీ అయిందేమో చూసి
కత్తులతో నరికేసేవాళ్ళు
దేవుడి పేరుతో విగ్రహాలు పెట్టి
వాటి ముందు తాగి దొర్లి అల్లరి చేసి
భక్తిని చాటుకొనే మహానుభావులు
ఇవాళ దేశ రక్షకులు కాగలరు..

మూఢనమ్మకాల్లో మురిగిపోయేవాళ్ళు
మానవత్వాన్ని మరిచినవాళ్ళు
అణిచివేయడానికి ముందుండేవాళ్ళు
హక్కులంటే భయపడేవాళ్ళు
తమ మీద తమకే నమ్మకం లేనివాళ్ళు..
యే మేరే వతన్ కే లోగో…అంటూ
నాటకానికి తెరలేపగలరు..

ఎందుకంటే ఇక్కడ
వతన్ ఒక హిందుత్వం
వతన్ ఒక అగ్ర కులం
వతన్ ఒక అహంకారం
వతన్ ఒక బ్రహ్మణిజం
వతన్ ఒక నిరంకుశత్వం..
వతన్ ఒక అణిచివేత
వతన్ ఒక దుర్మార్గం
వతన్ ఒక ఆధిపత్యం..

వీటన్నింటినీ జారిపోకుండా కాపాడుకోటానికి
దేశభక్తిని పొంగించుకుంటూ
వాళ్ళిప్పుడు గొంతెత్తగలరు
ఒక అడుగు ముందుకేసి పాడనూగలరు..

యే మేరే వతన్ కే లోగో…

*