లింగారెడ్డి చేను

తన రక్తంలో రక్తమై, జీవితంలో భాగమై, పెళ్లయి అడుగు పెట్టింది మొదలు, తనకింత అన్నం పెట్టిన సేను.. ఇక తనది కాదు

“ఆ సేను మీద ఇంగా మనకేమొచ్చిద్దని ఇంత మొండికేస్తన్నావు సామ్రాజ్యం? ఒకసారి రొండు సార్లు గాదు, వంద సార్లు చెప్పినా ఇనక పోతుంటివే? బాగాలు పానూ ఎంత మిగిలిందని? దాని మీద రెక్కలు ముక్కలు జేసుకుంటే మనకి ఏం మిగిలింది?  బరెగొడ్ల పాడి జేసి, పిడకలు జేసి ఇట్టా ఎంత కష్టపడ్డావు నువ్వు?  , వొడ్లు ,మిరగాయలు పండించాం శాతనైనంత కాలం, ఇప్పుడు పిల్లోడు డబ్బులు గావాలంటే లేవంటామా ”

పొగాకు పాయలు విడదీస్తున్నాడు లింగా రెడ్డి

సామ్రాజ్యం పొయ్యి కింద కంది కంప పెడుతూ పొంతలో నీళ్ళు కాగాయా  లేదా ఒకసారి కుండ లో  చెయ్యి పెట్టి చూసింది.

మొగుడి మాటలకు జవాబు చెప్పకుండా “ఉడుకు నీళ్ళు పోసుకో” అంది గోంగూర కట్ట ముందేసుకుని

“పిలగాడు కావాలంటన్నాడు గదా! మనకీ ఓపికల్లేకపాయె, ఇంత వొయిసు మీద బడ్డాక శాకిరీ సెయ్యగలమా? మడుసుల్ని బెట్టి మాత్రం సెయ్యించగల సత్తవుందా? నాకైతే లేదమ్మోవ్” లేచాడు తువ్వాలు దణ్ణెం మీద నుంచి అందుకుంటూ

గొంగూర పొయ్యి లో విసిరి కొట్టాలనిపించింది ఉక్రోషం తో .

స్నానాల గదిలోంచి నీళ్ళ చప్పుడు. చుట్టూ పేరుకుంటున్న చీకటి. పొలాలమీద నుంచి కమ్ముకొస్తున్న చల్లగాలి

కొత్తగా వేసిన పై  అంతస్థులో అద్దెకి దిగిన పోస్టాఫీసు క్లర్క్ పిల్లాడిని అరుస్తున్నాడెందుకో !

విశాలమైన పెరట్లో చెట్లన్నీ పీకేయించి బండలు పరిపించాడు రెడ్డి. అదేమంటే “నువ్వు శాకిరీ సెయ్యలేవే ఇంగ ” అంటాడు ఎదవ మొహమోడు, నా శాకిరీ తెలీనట్టే

పచ్చగా చెట్లు, అల్లుకుపోయిన కూర పాదులు, పొలం కాడినుంచి వచ్చినాక వాటి మధ్య తిరుగుతూ, చీడ పట్టిన ఆకులు తీసేస్తూ, పాదులు చేస్తూ, మల్లె పొదకీ జాజి తీగకీ ఆకులు దూసేస్తూ.. ఎంత సేపు గడిపినా విసుగు పుట్టేది కాదు.

అదిగో ఆ మూలేగా  రాధామనోహరం ఇంటి కప్పు మీదికి పోయి గుత్తులు గుత్తులు గా పూలు పూసేది ? ఆ మజ్జెన రమేషు   వచ్చినపుడు “ఆ మూలన అంత స్థలం ఎందుకమా మొక్కలు పెట్టి పాడు జేసేది?” అని అది తీసేయించి గదులేయించి, సిమెంట్ గోడౌన్ కి ఎరువుల షాపుకీ అద్దెకిచ్చాడు షట్టర్లు సందులోకి పెట్టించి.

 దొడ్లో చెట్లన్నీ పీకిచ్చింది ఈ కోట్లు కట్టిపిచ్చే దానికే అని తనకు తెలీదనుకుంటారు అబ్బా కొడుకులు !
 గురజాల లో నాలుగో క్లాసు వరకూ సదివింది తను . ఆ మాత్తరం తెలివి లేదంటనా తనకి ??
వాయబ్బా!!
అద్దె రమేషు బాంక్ లో  ఏస్తారంట  షాపోళ్ళు
“అద్దేదయ్యా? రెణ్ణెల్లయినా ఇయ్యరేంది?” అనడిగితే రెడ్డి నవ్వాడు.

“ఏ కాలం మడిసివే నువ్వూ? అద్దె అబ్బాయి బాంక్ లో యాస్తారు “”మన సేతికియ్యచ్చుగా? మనయ్యే గదా కొట్లూ”

నవ్వాడు “మనయ్యైతే ఏంది? అబ్బాయి వి అయితే ఏంది? అట్టా సూసుకుంటామా?”

అదంతా పోనీ గానీ, చెట్లు లేకుండా దొడ్లో,బయటా ఈ నాపరాళ్ళూ, గచ్చూ, ఆ కొట్లూ..ఇయ్యన్నీ ఏం బాగలా తనకి

పచ్చగా కళ్ళాపు కొట్టి తెల్లగా ముగ్గు పెడితే ఎంత బాగుండేది వాకిలి?

ఇపుడు కొత్తగా కట్టి తెల్లగా రంగులేసిన సమాదుల మజ్జెన కూచున్నట్టుంది

మొబైల్ ఫోన్ మోగింది. అదెట్టా తీయాలో సామ్ర్యాజ్యానికి తెలీదు. లాండ్ లైనైతే రిసీవరు తీసి మాట్లాడేది

లింగారెడ్డి  టవల్ ఆరేసి వచ్చి ఫోన్ తీశాడు

కొడుకు అటువైపు, బెంగుళూరు నుంచి

“నానా, వాళ్ళు వచ్చే బేస్తవారం (గురు వారం) కాక ఆ పై వొచ్చే బేస్తవారం పెట్టుకుందాం అంటున్నారు. సాయి బాబా రోజంట”

“సరేరా, వాళ్ళిష్టం. మనకి డబ్బులు మొత్తం ఆ రోజే ఇత్తారు గా”

“వాళ్లకి ఆ డబ్బులు ఒక్క లెక్కలోయి గూడా కాదు నానా! అంతకు ముందే ఇమ్మన్నా ఇస్తారు. పనై పోతే ఇంక ఆ ఇల్లు కూడా అద్దెకు పారేసి మీరు కూడా బెంగుళూరు రావచ్చు. హాయిగా కూచోని కాస్త తిని రెస్ట్ తీసుకోండి ఇక్కడ . పని పని పని ! ఎన్నాళ్ళు చేస్తారింకా ?”

“అట్టాగే లేయ్యా””అమ్మకి చెప్పు నానా ! తర్వాత ఫోన్ చేస్తాలే. ఈడ చండాలంగా ఉంటది ట్రాఫిక్. డ్రైవింగ్ లో ఉన్నా. ఇల్లు కొద్ది  దూరమే గానీ ఇంటికి బొయ్యే సరికి గంటైనా పట్టిద్ది”

ప్రహరీ గోడ లోపల పరచిన నాపరాళ్ళ మీద సాయంత్రం సుబ్బయ్య పెళ్లాం పేరమ్మ  నీళ్లు పోసి కడిగి, లింగారెడ్డి కి అలవాటని మడత మంచం వాల్చి పోయింది

తెల్లగా చల్లగా చందమామ పైకొచ్చాడు. మడత మంచం మీద దిండు వేసుకుని చందమామను చూస్తూ పడుకుంటే హాయిగా ఉంది.
ఇది వరకు ఆ మూల ఉన్న పారిజాతం చెట్టు మీదనుంచి కమ్మని గాలి వచ్చేది. మత్తుగా నిద్ర పట్టేసేది

ఇప్పుడైతే మాత్రమేం లే, శేషయ్య వాళ్ళింట్లోని యాప చెట్టు గాలి  ఈ ఇంట్లోకి రానందా ఏంది ? బానే వస్తంది గా

“అన్నం పెట్టాను, రా ” పెళ్ళాం పిలుపు తో లేచి లోపలికెళ్లాడు. చిన్నదై పోయిన దొడ్లో వేసున్న పీట మీద కూచోబోతుంటే మోకాలు కలుక్కుమంది

“ఇంకెన్నాళ్ళు లే, చేనమ్మినాక, కొడుకు గడపలో పడుంటాం గదా, అక్కడ బల్ల మీదే కూడు తినేది, నీకీ నొప్పులూ పాడు యాడుంటై  ఇంగ ?” కఠినంగా అంది సామ్రాజ్యం

“సామ్రాజ్యం.. ఊరికే గోల చెయ్యబాక. సేనమ్ముతున్నాం గానీ ఇల్లు గాదు గదే అమ్మేది? మనం యాడికీ బొయ్యే పన్లా! వాడికి డబ్బులు గావాలంటే మరి యాణ్ణుంచొత్తై ? యాపారం పెట్టుకుంటా నానా అనడిగితే లేదని ఎట్టా జెప్తాం? ఒక్కానొక్క పిలగాడు పైకొత్తానంటే ఒద్దంటామా?

ఆడు ఈడికొచ్చి ఒరి పండిత్తాడా? మిరగాయలు కాయిచ్చి సేను జూసుకుంటాడా? ఇయ్యన్నీ ఒద్దనే గదా ఆడిని సదువుకి పంపిచ్చింది? నీకూ నాకూ సత్తవ సచ్చినాక ఇంగ సేను మీద పనేం జేత్తాం?

కౌలు కిత్తే మాత్రం, ఏ మాత్రం వొచ్చిద్దనీ? పెతీ యాడాదీ ఏదో ఒక పురుగు బడి , మొత్తం సేతికి రాకనే పాతండె

ఇంగా ఆ కష్టాలన్నీ పడాలా  మనం గానీ , ఎవురైనా గానీ? ఏదో ఆ కోటయ్య సావి దయ జూసి రోడ్డు పక్కనే ఉండబట్టి కాత్త రేటు బలికింది సేను . మన తరవాత చూసే వోళ్ళు లేనప్పుడు ఎందుకీ ఆరాటాలు” పండు మిరపకాయల పచ్చడి ఒత్తుగా కలుపుకుని గాఢంగా ఆఘ్రాణించాడు నోరూరించే ఆ వాసన ని

సామ్రాజ్యం కేసి దీర్ఘం గా చూస్తూ “పల్నాడొదిలి యాడికీ పోం మనం, సరేనా? ఇంగ తిను, పిచ్చి మొకమేసుకోని సూట్టం ఆపు, సస్తన్నాం సూళ్ళేక”

**********                                                                                           *********
చేను అమ్మడం లింగా రెడ్డికి అంత తేలిగ్గా ఎలా ఉందో అర్థం కావట్లేదు సామ్రాజ్యానికి. అంట్లు తోముతూ దీర్ఘాలోచనలో మునిగి పోయింది. కంచాల్లోని కూరలు కుడితి  గాబు లో  పోసి అక్కడే నిలబడి పోయింది.

సేను అమ్మినాక ఈ రెండు బరెగొడ్లని యాడ మేపాల? గడ్డి కొంటే మాత్రం? బయట తిప్పుకోని రాపోతే ఎట్ట? సొంత సేనమ్ముకోని ఎవరెవురి పొలం లోనో  గెనాల  మీద తిప్పి ఇంటికి తోలక రావాల్నా?

సేనుకి పోతానే ఒక పాత చీర, లిక్కి (కొడవలి) దీస్కోని పోతుండెనే. ఎవరి సేలో గడ్డి కోసుకుంటే మాత్రం ఎవరూ ఒద్దనేది? సరోజమ్మ పిన్నాం, ఈరయ్య  బాబాయ్, ఎంకట్రావ్ మావయ్య.. ఎవరూ ఒద్దన్రు గదా

గెనాల మీద బర్రెల్ని ఒదిలి పది నిమిషాలు లిక్కి తో పర పరా గడ్డి కోస్తే మూటెడు గడ్డి.  ఒత్తుగా పెరిగిన పిల్లి పెసర తిని ఎన్నెన్ని పాలిస్తయ్ ఈ రెండు గొడ్లూ..రేపు సేను పొయినాక అలవాటు గా అటు బడి పోతయ్యి… ”

తల్చుకుంటుంటే సామ్రాజ్యం గుండె పగిలి పోయింది. పరిగెత్తినట్టు పాక లోకి వెళ్ళి తెల్ల మచ్చ బర్రె, కొమ్ముల బర్రె రెంటినీ నీళ్ళు నిండిన కళ్లతో చూస్తూ నిలబడి పోయింది.
జరుగుతున్నదేమీ పట్టని ఆ రెండూ సగం కళ్ళు మూసి నెమరేస్తూ, ఒంటి మీద వాలిన దోమల్ని తోకతో  బ్రహ్మానందంతో తోలుకుంటున్నాయి

తెల్ల మచ్చ బర్రె కి పచ్చ గడ్డి లేక పోతే దిగదు. ఎండు గడ్డి మూ జూడదు, పాలియ్యదు

కొమ్ముల బర్రె పాలిచ్చే రోజులు ఎప్పుడో పోయినట్టే! ముసల్దైనా ప్రేమ కొద్దీ ఉంచుకోటమే

సామ్రాజ్యం రాకను చూశానని చెప్తూ తెల్ల మచ్చ బర్రె గట్టిగా నిట్టూర్పు విడిచింది.

నిశ్శబ్దంగా ఏడుస్తూ వాటిని నిమురుతూ అక్కడే కూలబడి పోయింది సామ్రాజ్యం. దూడలు గా తనింట్లో పుట్టి, తన ముందే పెరిగిన తన పిల్లలు అవి.

*****                                                     ********                                           **********

“కొలతలకు నేనెందుకు,నువ్వు బో “, కర్కశంగా ధ్వనించింది సామ్రాజ్యం

“ఎక్కువ మాట్లాడినావంటే దవడకు బెట్టి రెండు నూకుతా! అక్కడ పెద్ద మడుసులుండారు, రా! అందరం సంతకాలు బెట్టాల రేపు రిజిస్టేషన్ కాడ, నువ్వు కూడా  వొస్తే బాగుంటది. సర్వేరు గారొచ్చారు. పాసు బుక్కు తే బో ”

చురుకెక్కుతున్న ఎండలో  మూడెకరాల ఏక చెక్క… నిండా పెరిగిన పిల్లి పెసర తో పచ్చ పచ్చగా ఉంది.  రోడ్డవతల మిరప చేను

మాగాణి మధ్యలో ఒక చోట గట్టు మీదుగా రెండు వైపులా  మడుల్లోకి విస్తరించిన చింత చెట్టు దాని కింద వెడల్పాటి బేతంచెర్ల నాపరాయి అరుగు. ఆరేడుగురు కూచోని కబుర్లు చెప్పుకోవచ్చు . ముగ్గురు మనుషులు పడుకొని నిద్ర పోవచ్చు కావలి రోజుల్లో

చింతచెట్టు  చల్లగా పరుచుకుంది అరుగు మీదా,దాని చుట్టూ , రక రకాలుగా  నీడ ముగ్గులు పెడుతూ

సామ్రాజ్యంలో కొంచెం కొంచెం గా దుఖం వూరుతోంది. ఆ అరుగు మీద ఎన్నెన్ని భోజనాలు చేశారు తనూ,మొగుడూ! సెలవుల్లో పిల్లల ఆటలన్నీ ఈ చెట్టుక్కట్టిన ఉయ్యాల కే కదూ.

అప్పట్లో శేషయ్య చేలో దిగుడు బావిలో కాసిని నీళ్ళుండేయి.  ఆడి ఆడి ఆ చాలీ చాలని నీళ్లలోనే దిగి స్నానాలు చేసే వాళ్ళు

పొద్దున్నే చేనుకొచ్చిన పిల్లలు అన్నాలకు కూడా రాకపోతే నాలుగు గిన్నెల కారేజీ తీసుకుని వెళ్ళేది తను. అక్కా తమ్ముడి తో పాటు మిగతా  పిల్లలు కూడా ఉంటారని. వాళ్లందరికీ పట్టుకెళ్ళి తలా కాస్త పెట్టేది. తనూ అక్కడే అరుగు మీద కునుకు తీసి,  తర్వాత కేకలేసి మరీ ఇంటికి లాక్కొచ్చేది పిల్లల్ని

పంటలు లేని కాలంలో  చేలో బర్రెల్ని వదిలి శేషయ్య పెళ్ళాం తనూ ఇక్కడే పేలు చూసుకుంటూ ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళో! కూలికొచ్చిన ఆడోళ్లు కూడా వాళ్లకు తెల్సిన మరి నాలుగు మసాలా కబుర్లు చేర్చే వాళ్ళు

ప్రకాశం పెళ్ళాం సుబద్ర గుళ్ళో పొంతుల్ని చూడ్డానికే రంగు రంగుల సీర్లు గట్టి గుడికి పోయిద్ద్దనీ, అందరూ ఇళ్ళకు పొయ్యేదాక ఉండి, పొంతులు ప్రసాదమంతా దానికే ఇస్తాడనీ, కాపరానికి పోయిన సుబ్బారావు  కూతురు వాళ్ళ జీతగాడిని మరిగిందనీ, మొగుడి దగ్గర పస లేదనీ, … అవన్నీ తల్చుకుంటుంటే సామ్రాజ్యం మొహంలోకి నవ్వూ, ఏడుపూ రెండూ తోసుకు వచ్చాయి.

“ఇక ఈ గెనాల మీద నేను తిరగను, నా బరెగొడ్లు ఎవురి దగ్గరో కొన్న గడ్డి దినాల. తెల్లారగానే నాకిక సేనుకొచ్చే పన్లేదు. ఇక నేను నా చేలో మిరగాయలు కొయ్యను. కాయలు కొయ్యటానికొచ్చే ఆడోళ్లకి గోంగూర నూరి పట్టక పోను. ఇక నా రోజులన్నీ నా వొంటింట్లో, నా వాకిట్లో జరిగి పోవాల్సిందే, ఇంగ ఈ సేను నాది గాదమ్మో… ఇంగ ఈ సేను.. ఈ సేను..”సామ్రాజ్యం గడ్డి లో కూలబడి పోయింది

గుండె పగిలి పోయింది . ఎడారిలో ఎవరూ లేని చోట దారి తప్పి మిగిలి పోయిన దానిలా గోలు గోలున ఏడ్చింది సామ్రాజ్యం.

కొలతలు వేసుకుంటూ సర్వేయర్ తో కల్సి చాలా దూరమే వెళ్ళిపోయిన లింగారెడ్డి దగ్గర్లో లేడు

ఎంత ఏడ్చినా తీరనిదిలా తోస్తోంది ఈ దుఖం! తన రక్తంలో రక్తమై, జీవితంలో భాగమై,  పెళ్లయి అడుగు పెట్టింది మొదలు, తన చేత చాకిరీ చేయించుకుని, తనకింత అన్నం పెట్టిన సేను.. ఇక తనది కాదు

కాపరానికొచ్చే సరికి వాటాల్లో వచ్చిన ఒక్క ఎకరమే ఉన్న పొలాన్ని రెడ్డి నానా కష్టాలూ పడి,  తినీ తినక, పిల్లల్ని సాకుతూ, చదువులు చెప్పిస్తూ, ధాన్యం, మిరగాయలు, అమ్మి… ఇన్నాళ్లకు అయిదెకరాలు మాత్రమే చేయగలిగాడు. అంతకంటే బలం లేక పోయింది.

డెబ్బై  దాటాక , రెండేళ్ళ నుంచి ఓపిక లేక  కౌలుకిచ్చారు.   కొడుకు ఉజ్జోగస్తుడు
వాడు కంపెనీ బెట్టాలి డబ్బులు గావాలనగానే, పెద రెడ్డి పొలం అమ్మటానికి ఒప్పుకున్నాడు.

అదేవంటే “వాడికి గాక పోతే ఎవరికే? ఇంగ మనం సెయ్యలేం!వాడన్నా సుకంగా ఇష్టమైంది జేసి సుకంగా బతుకుతాడు” అంటాడు ఏం మడిసి, తిక్కలోడు, దొంగ నా బట్ట .

ఎవురైనా సేనమ్ముతారా? మళ్ళీ ఏడుపొచ్చింది

“అమ్మక ఏం జేస్తారు? వాడికి డబ్బులు గావాల! మనకి సేసే ఓపిక లేదు. రెండు ముద్దలు తిని, ఒక మూలన పొణుకోవాల్సిన వొయిసు లో బూవి మీద ఇంతింత ఆశ వుండకూడదేమో”

అవును, అదే నిజం! దేని మీదైనా ఇంత ప్రేవ పనికి రాదు. కొడుకూ కూతురూ ప్రేమగా ఉంటారు. అది చాలు. ఆళ్ళ కంటే కోడలూ అల్లుడూ మంచోళ్ళు. అక్కడికి పోతే కాలు కింద పెట్టకుండా జూసుకుంటారు .  ఇక్కడికొత్తే ఇంటెడు చాకిరీ చేత్తారు.

ఒంట్లో కాత్త సత్తవ ఉన్నన్నాళ్ళూ ఒకరి సేత సేయించుకోకుండా బతికి, దాటి పోవాల

సేలూ, ఇళ్ళూ, బంగారం అంటా ఈటి మీద ప్రేవ పెంచుకునేదెందుకు?

శాకిరీ సెయ్యలేనప్పుడు, దాని మీద ఇంత మవకారం పనికి రాదు

తనకి తానే నచ్చజెప్పుకుంటూ ,అరగంట సేపు నిరామయంగా అట్టాగే కూచుంది సామ్రాజ్యం, అంతసేపూ నీళ్లు జారుతూనే ఉన్నాయి చెంపలమీద

లేచి నిల్చుని చెంగుతో మొహం తుడుచుకుంది.  చుట్టూ చూసింది. ఇక పొలం తనది అనే భ్రమ పటాపంచలు అయినట్టు తోచింది.

ఆరి పొయ్యే దీపాల్లాగ చావు కోసం ఎదురు జూసే వొయిసు లో ఇంగ కోరికలుండకూడదు.

నా సేను, నా ఇల్లు, ఏందిదీ?

వైరాగ్యమా ? నిరాశా? తప్పక తెచ్చుకున్న అంగీకారమా ?

“ఏందీడ కూసున్నావ్? పా, పా, అయిపోయింది పని” లింగారెడ్డి గొంతు వినపడే దాకా అలాగే ఆలోచిస్తూ కూచుంది ఏడ్చి ఏడ్చి వాచిపోయిన మొహంతో

***

సామ్రాజ్యం మొహం కళ కళ్లాడి పోతోంది. కొడుకూ కోడలు, కూతురు, అల్లుడూ, మనవలూ..

వంటింట్లో ఒకటే హడావుడి పడి పోతోంది.  అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దిగులే మర్చిపోయింది. “పోన్లే, పిల్లల సంతోషం కోసమేగా చేను అమ్మాడు రెడ్డి?  వాళ్ళు చల్లగా ఉంటే చాలు. మాదేముంది? వాలి పోయే పొద్దు . ఎన్నాళ్ళింకా?

ఉన్న రెండు బరెగొడ్లనూ జీతగాడికి అప్పగిచ్చి  ఇంట్లో నే కూసుంటే మాత్రం చాల్దా? తిండికి లోట్లేదు కదా, ఇప్పుడా బూవి మీద మనం సెయ్యబోయే శాకిరీ ఎవుడిక్కావాల? మనం మిరప సేనెయ్యక పోతే ఎవురూ ఎయ్యరా? ఎవురూ కారాలు తిన్రా? మన సేలో మిరగాయలంటే ఎగబడి కొనే వాళ్లే, నిజవే!

కానీ మరి పిల్లగాడు అడిగినాక..

పోన్లే, అంతా చక్కంగా జరిగి పిల్లగాడి సేతికి నాలుగు డబ్బులొచ్చినై. వాడింక కంపెనీయో బెట్టుకుంటాడో, స్థలాలే కొంటాడో ఆడిష్టం.

సామ్రాజ్యం మనసంతా సంతోషంతో నిండి పోయింది. ఏ చీకూ చింతా లేని సంతోషం మొహమంతా పర్చుకుంది.

కొడుకు తో బళ్ళో సదువుకున్న పిల్లగాళ్ళెవరో వొచ్చినట్టుంది. ఆరుబయట  కానగ సెట్టు కింద నుంచి బూతు మాటలూ, నవ్వులూ ఇనబడతన్నై

“రేయ్ ముండ నాయాలా, అక్కడ ఆడోళ్ళున్నారు, నెమ్మది ” ఎవరో అంటున్నారు

“ఈ నాయాళ్లు ఎంత సదువుకోనీ, బూతులు లేకుండా మాట్టాడుకోరు,” క్షమించేసింది

“బ్బాయ్, అన్నానికి రాండయ్యా! అక్కాయ్ యాడుందీ, ఎవువో ఫ్రెండ్స్ వొచ్చినట్టున్నారే” వరండా లోకి వచ్చి కేకేసింది

“ఏవయ్యో రెడ్డీ” మొగుడిని పిలుస్తూ సందులోకెళ్ళి చూసింది

వరండాలోకొస్తూ “రమేషూ , నాన యాడుండాడో సూడ్రా, అన్నానికి రమ్మను” అంటూ శేషయ్య పెళ్ళాన్ని సహాయనికి పిలవడానికి  వెళ్ళింది

రమేష్  రెడ్డి వెనక వాకింట్లోంచి వస్తూ”ఈడ కూడా లేడే నాన! ఎక్కడికెళ్ళాడో చూడండి, ఎండ మండి పోతుంటే ఈ టైమప్పుడు ఎక్కడికి పొయ్యాడీ మనిషి”

___________               ______________________                                   _

చింత చెట్టు కింద అరుగు మీద పక్కకు తిరిగి పడుకున్నాడు లింగా రెడ్డి

తల కింద గోనె సంచీ సగానికి నింపి పురికొసతో ముడేసిన మూట

దూరం నుంచి తండ్రిని చూసిన రమేష్  రెడ్డి కి గుండె కుదుట పడింది. మరు క్షణంలో నల్లని మేఘంలా అపరాథ భావన, మరో పక్క చెప్పలేని భయం నిలువెల్లా కమ్మేశాయి

“సేను అమ్మొద్దు రా ” ఒక్క మాటయినా అన్లా నాన! అడగ్గానే ఒప్పుకున్నాడు . పైగా ” ఇంగ దానికి శాకిరీ సెయ్లేను లేరా సూరీ , నీకేగా తీస్కబో! అమ్మి పార్నూకు. ఇంగ సత్తవ లేదు” అని సపోర్ట్ చేశాడు

ఎంతయినా నలభై ఏళ్ళు చాకిరీ చేసి చూసుకున్న చేను కదా, అడుగులు గబ గబా వేశాడు చింత చెట్టు వైపు

“నానా, ఓ నానా” చెట్టు సమీపిస్తుండగానే పెద్దగా పిలుస్తూ దగ్గరికి వెళ్లాడు

చలనం లేని లింగారెడ్డి దేహం ఎంత పిలిచినా కదలని తీరం చేరి చాలా సేపైంది

అనుమానంగా దగ్గరికెళ్ళిన రమేష్  కి నిర్థారణ అయ్యాక, ఒక్క క్షణం ఏం చేయాలో, ఏం ఆలోచించాలో, ఏమీ తెలీలా

చింత చెట్టు వెయ్యి చేతులతో తన మీద కూలుతూ కమ్మేస్తున్నట్టు నీడలు చాస్తోందిపరుగున అక్కడికి చేరిన నారాయణ , లింగారెడ్డి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు

అతను తల అడ్డంగా వూపుతాడని సురేష్ రెడ్డి కి చెప్పకుండానే అర్థమయింది.

లింగారెడ్డి రెండు చేతుల నిండా బురద మట్టి అంటి ఉంది . మట్టి పట్టుకుని ఏడిచాడా నాన ?

గుండె అంతా గడ్డ కట్టినట్టు, మెదడు పూర్తిగా చితికి పోయినట్టు, నిల్చున్న భూమి చీలి పోతున్నట్టు, కళ్ళలో సర్వి కట్టెలు మండుతున్నట్టు, ఒళ్లంతా మంటలు రేగుతున్నాయి. ఊపిరి తిత్తుల మీద ఎవరో బరువు పెట్టి నొక్కుతున్నట్టు,  మొరాయించి గాలి తీసుకోవటల్లేదు

చెమట్లు పట్టేస్తున్నాయి . చచ్చి పోతున్నట్టు ఉంది

ఒక్కసారిగా చీకట్లో దెయ్యాన్ని చూసి చిన్నప్పుడు దడుచుకున్నట్టు చాలా భయం వేసింది. చుట్టూ అంతా మాయమై పోయి తనొక్కడే ఒంటరిగా మిగిలినట్టూ, తననెవరూ తరుముతున్నట్టూ , కళ్ల ముందు గిర గిరా చక్రాలు

రయ్యిన కొట్టిన వడగాలి చింతచెట్టు మీద వికృతంగా శబ్దించింది.

ఇంటి దగ్గర నుంచీ ఒక్కొక్కరే పొలం వైపు పరిగెత్తుకు రావడం మసగ్గా కనిపిస్తోంది.

పెదాలు బిగించి ఎటో చూస్తూ నిలబడ్డాడు ఒక్క నిమిషం. నాన్న వైపు చూడలేదు.

సడన్ గా గుండెల్లోంచి భయం,  గొప్ప భయం, చీకటి గదిలో ఒక్కడే మిగిలిపోయిన చిన్నప్పటి భయం  తోసుకొచ్చింది. నాన లేక పోతే ఎలా? ఎలా? ఎలా ?అన్న భయం లక్ష చేతుల భూతమై  మీద పడింది

దుఃఖం పగిలిన శబ్దం గాలి లో రమేష్  కేక గా వెలువడింది “నానా……”

లింగా రెడ్డి తలని ఎత్తి గుండెకు అదుముకుంటూ “నానా, నానా, నానా” పిచ్చెత్తినట్టు  అరుస్తున్నాడు

అది ఏడుపో, పిచ్చి కేకలో ఎవరికీ అర్థం కావటల్లేదు లింగా రెడ్డి తల కింద ఉన్న మూట జారి కదిలి పోయింది

దాంట్లోంచి అరుగు మీదుగా కిందిగా ధారగా జారి పడుతున్నాయి

తర్వాత పంట నారు కోసం ఉంచిన వడ్లు….

***

రమేష్ రెడ్డి కి ఇప్పుడు పదే పదే ఒక కల వస్తుంది. నాన నడుచుకుంటూ పోయి పోయి పోయి… చూస్తుండగానే చేను గా , చింతచెట్టు గా , మట్టిగా , మిరప పంట గా మారి పోతూ మళ్ళీ నాన మారి మారి పోతుంటాడు

ఎవరు లేకుండా చూసి రమేష్ ఒక్కడే కూచుని ఏడుస్తాడు  “చేనంటే నువ్వే అని తెలీలేదు నానా”
*
సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

27 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా బావుంది కథ ఆఖరి మలుపు ఊహించనది. లింగరెడ్డే చేను, చింతచెట్టు….

 • చాలా బాగుంది కథ, కథనం! కానీ థ్యాంక్సండీ మీకు! మీ కథ అయి ఉండీ, ఒక్క బ్రాహ్మణ విలను/చెడ్డబ్రాహ్మడు లేకుండా కథ సాగుతుందేంటా అని కాసేపు బెంగపడిపోయాను. జంధ్యాలకులపోళ్ళ character assassination వీలయినంత గా చేయకుండానే ముగిస్తారేమో అనీ భయపడుండాను. పొంతులు దూరాడు కదా, ప్రసాదాలు ‘దానికోసమని’ దాచే పంతులు! భలే! సూపర్ మీరు! మీ మార్క్ మిస్సవనీయరు! అస్సలు డిజప్పాయింటు చేయరు!

  • Dear Amused soul, Thanks for getting amused 🙂
   కథ నచ్చినందుకు చాలా థాంక్స్. “ఫలానా వాళ్ల” మీద అంటూ ప్రత్యేక కోణం ఏమీ లేదు. చీకటి కోణాలు ఎక్కడ ఉన్నా, ఎవరిలో ఉన్న అవి విమర్శను తప్పించుకోలేవు. నేను కాక పోతే మరొకరు. నా వరకూ, వాటికి కులంతో పని లేదు

   పల్లెల్లో జరిగే విషయాల గురించి మీకు బహుశా అవగాహన ఉండే ఉండాలి. అసలు పేరు వాడి ఉంటే, కొంత ఫెయిర్ చర్చ నడిచేదేమో

   నా కథల్లో బ్రాహ్మల విలన్లు ఉంటారని ఎన్ని చోట్ల చదివారు? పైగా కారెక్టర్ అసాసినేషన్ అనే పెద్ద పేరు కూడానా?

 • భలే ఉంది కథ సుజాత గారు. చేను మీద రైతుకి ఉండే మమకారాన్ని, విడదీయలేని సంబంధాన్ని బాగా రాశారు. ఏక బిగిన చదివించింది

 • చాలా బాగుందండి…మీ ఇతర కధల లింకులు ఉంటే పంపండి ప్లీస్

 • మీ కథలు ఒక సారి చదివితే సరిపోదు సుజాతగారు.
  మళ్లీ మళ్లీ చదవాల్సినవి.

  ‘చేనంటే నువ్వేనని తెలీలేదు నానా! ‘
  ఇలాంటి వాక్యాలని మరింత తడుముకోవాలని.

 • అబ్బా..ఏడిపించేశావు సుజాతా..
  బాగుంది లాంటి ఒట్టి మాటలు చెప్పలేను.
  కొంచం సేపు ఇంకించుకుంటాను కథని..

  వసంత..

  • వసంత గారూ
   ప్రతి కథా లీనమై చదువుతారు మీరు❤️❤️

   థాంక్యూ కథ నచ్చినందుకు

 • అనూహ్యమైన మలుపుతో కథ ఆకట్టుకుంది.

  పతాక ఘట్టం.. సూచనప్రాయంగా కూడా చివరివరకూ రివీల్ చేయకపోవటం ఉత్కంఠ కోసం మాత్రమే కాకుండా.. రెడ్డి అంతర్గత సంఘర్షణ కోణంలోనూ ప్రత్యేకం. చేను అమ్మకం గురించి అతడు తన భార్యను మందలిస్తూ చెప్పిన ప్రతి మాటా తనలో పొంగే బాధను అణచుకుంటూ చెప్పిందేనన్నమాట!

  కథా వాతావరణ కల్పనా, సంభాషణలూ బాగున్నాయి.

 • Excellent సుజాత గారు ఇటీవల విత్తన సదస్సులో పాల్గొన్నాను..పంట, విత్తనాలపై పలు కథల సంకలనం అక్షరయాన్ ద్వారా రూపుదిద్దుకుంటుంది..ఆ క్రమంలో అదే ధ్యాసలో ఉన్న నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది మీ కథ కథనం..అభినందనలు మనసారా..🤝

  • విజయ గారూ, చాలా చాలా ధన్య వాదాలండీ కథ నచ్చినందుకు

 • మనసుని తాకే కథ .చేననే కాదు ,మనతోటి జీవితకాలం బ్రతికినదాన్ని ,ఇక మనది కాదు అని వదులుకునే క్షణం ఎప్పుడూ జీవితానికి ఆఖరి క్షణమే .

  • కల్యాణి గారూ, అవును నిజం

   మనదనుకున్నదాన్ని వదులుకునే క్షణం అలాంటిదే

   థాంక్ యూ, కథ నచ్చినందుకు 🙏🏻

 • అదిగో ఆ మూలేగా రాధామనోహరం ఇంటి కప్పు మీదికి పోయి గుత్తులు గుత్తులు గా పూలు పూసేది ?

  అదంతా పోనీ గానీ, చెట్లు లేకుండా దొడ్లో,బయటా ఈ నాపరాళ్ళూ, గచ్చూ, ఆ కొట్లూ..ఇయ్యన్నీ ఏం బాగలా తనకి.

  పచ్చగా కళ్ళాపు కొట్టి తెల్లగా ముగ్గు పెడితే ఎంత బాగుండేది వాకిలి?

  ఇపుడు కొత్తగా కట్టి తెల్లగా రంగులేసిన సమాదుల మజ్జెన కూచున్నట్టుంది.

  ఇవన్నీ చూసి, అనుభవిస్తే కాని రావు అనడం సరి కాదు. వాటికి స్పందించే హృదయం ఉండాలి. ఉంది కాబట్టే లింగారెడ్డి మట్టి పట్టుకు పొయ్యాడు.

  హృదయం ఉండాలి.
  ఉంది కాబట్టే కొడుకు ‘కల’ లు కంటున్నాడు.

  హృదయం ఉండాలి.
  ఉన్న సామ్రాజ్యం గుండె పగిలిపోయ్యుండాలి.
  పగిలిపోయింద కాబట్టి మర్రిచెట్టు దగ్గిర కనపడలేదనుకుంటా.

  చివరికి దుఖఃం మిగిలింది.
  బాగుంది.

  * * *
  పల్లెటూళ్లలో చేనే కాదు, పట్నాలలో, నగరాలలో ఇళ్లు, ఫ్లాట్లు, షాపులు, బళ్ళూ, భవనాలు వదులుకోవలసినప్పుడు కూడా హృదయం ముక్కలవుతుంది. గుండె పగిలిపోతుంది.

  • Anil garu, Thank you so much
   అవును, సరిగ్గా చెప్పారు. జీవితంలో భాగం అనుకున్నదేదైనా, అది
   ప్రాణం లేనిదైనా సరే, పోగొట్టుకున్నపుడు గుండె పగిలి పోవడం ఖాయమే

   చాలా చక్కని వ్యాఖ్య రాశారు, శ్రద్ధ గా చదివినందుకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు