రోజూ కనిపించే యాక్టివిస్ట్ మామయ్య!

అనేక విధాలుగా మా జీవితాలతో పెనవేసుకున్న ఆయన ఇప్పుడు మాకొక జ్ఞాపకంగా మిగిలిపోయారు.

కొంతమంది జీవితకాలం నిశ్శబ్దంగా తమదైన విలువలతో పనిచేసుకుంటూ వెళతారు. ఉద్యమ శ్రేయోభిలాషులుగా  అజ్ఞాతంగానే ఉంటారు. పుస్తకాల షాపుల కెళ్ళి ఆ సాహిత్యాన్ని బాధ్యతగా కొనుక్కుని మాత్రమే చదువుతారు. నాలాంటివాళ్లం మేమేసిన పుస్తకాలని తీసికెళ్లి బహుకరించినాగానీ ఏదో రూపంలో వాటికి వున్న ధర కంటే ఎక్కువే అందచేస్తారు. నిజాయితీగా వుండటం, అతి సాధారణంగా బతకటం, ఆడంబరాలకి పోకపోవటం, వున్నంతలోనే సర్దుకుపోవడం ఒక జీవన విధానంగా మార్చుకుంటారు.  ఎల్లవేళలా ఖద్దరు ధరించడం ద్వారా చేనేత రంగాన్ని బతికించుకోవాలని తాపత్రయ పడతారు. కాంక్రీట్ నిర్మాణాలకన్నా అపురూపమైన వృక్ష జాతులను పసిపిల్లలుగా సాకుతారు. ఇంటి మందం కూరగాయలు పండించుకోవటం, చెట్లను పెంచడం ద్వారా పర్యావరణానికి అనేక విధాలుగా తోడ్పాటుని అందిస్తారు.

కుటుంబం లోని ముందుతరం వారిని ఒక్క పొల్లు మాట లేకుండా జీవితకాలం చూసుకుని, అత్యంత గౌరవ ప్రదంగా వారిని సాగనంపుతారు. అనుకోని పరిస్థితుల్లో అపార్ట్మెంట్లలో నివసించాల్సి వచ్చినా గానీ అతికొద్ది స్థలంలోనే చిన్నపాటి తోటను సృష్టించు కుంటారు.  బంధువులు, స్నేహితులకు ఒక భరోసాగా వుంటారు. వుండాల్సిన చోట నిక్కచ్చిగా వుంటారు. ఎక్కడా కానీ, మేము ఇది చేస్తున్నాము అని చెప్పుకోకపోవటంలోనే వారి వ్యక్తిత్వం దాగి వుంటుంది. నడుస్తున్న రాజకీయాల మీద పదునైన విశ్లేషణ వుంటుంది. కులాభిమానమో, మతాభిమానమో, ప్రాంతాభిమానమో గీటురాయి కాకుండా నడుస్తున్న రాజకీయాలను విశ్లేషించగలుగుతారు. రోజువారీ జీవితంలో హేతుబద్ధతే కొలమానంగా జీవిస్తారు. మూఢ నమ్మకాల పేరిట, జాతకాల పేరిట, రంగురాళ్ల పేరిట, మతం పేరిట పెరుగుతున్న మౌఢ్యాన్ని, వీటన్నిటినీ పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులను, వారి విధానాలను పదునైన ప్రశ్నల రూపంలో విమర్శిస్తారు. తమ ఇంటిలోకే చొచ్చుకువస్తున్న ఈ ధోరణుల పట్ల కలవరపడతారు! భవిష్యత్ తరం గురించి ఆందోళన పడుతూనే, వారి భవిష్యత్తుకు ఆసరాగా చేయగలిగినంతా చేస్తారు. చదువు ప్రాముఖ్యతను వివరిస్తారు. అంతా సంభాషణే. మనిషికి మనిషి కి మధ్య వుండాల్సిన మానవ సంబంధాల పట్ల, అనుబంధాల పట్ల అరుదైన గౌరవం కలిగి, పైన వివరించిన జీవిత విధానంతో జీవిస్తూ, ఆరోగ్యంగా తిరుగుతూనే హటాత్తుగా జీవన చక్రం నుంచి తప్పుకున్న ఒక (అ)సామాన్యవ్యక్తి గురించి ఇప్పుడు మీకు చెప్పాలి!

పోటీ ప్రపంచపు ద్వంద విలువల్ని, వినియోగ మనస్థత్వాన్ని అంటించుకోకుండా, మతపరమైన సంకుచిత ఆచారాలకు తావివ్వకుండా, చనిపోయిన తర్వాత కూడా అంత్య క్రియలను అతి సాధారణంగా నిర్వహించమని చెప్పిమరీ మా చేతుల్లోనే 2019 మార్చి 19 న కన్నుమూసిన ఆ వ్యక్తి మా మామ నండూరి లక్ష్మినారాయణ (మా మేనత్త డాక్టర్ టాన్య భర్త). అందరూ ‘నండూరి’ అనే పిలిచేవారు. అదేరోజు నా పుట్టినరోజు కూడా కావటం కేవలం యాదృచ్చికమే అయినప్పటికీ ఆయన నిష్క్రమణ ఆరోజే అవుతుందని మేమెవరమూ వూహించలేదు. నిజానికి ఆరోజు వాళ్ళిద్దరూ మా కొత్త ఇంటికి (అది కూడా మాకోసం వాళ్ళు కొన్నదే!) వచ్చి భోజనం చేద్దామనుకున్నారు! మార్కెట్ వరకూ రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి కూరగాయలు తీసుకువచ్చిన వచ్చిన మనిషి కళ్ళముందే మాయమైపోతాడని ఎలా అనుకుంటాం?

ఉధృతంగా వచ్చే గుండెపోటులతో క్షణాల మీద చనిపోవటం గురించి వినివున్నాం! అప్పుడు కనిపించే లక్షణాల గురించీ, అలాంటి పరిస్థితి ఎదురైతే తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించీ తెలుసుకున్నాం, కానీ  నిశ్శబ్దంగా ఏ రకమైన సూచనలు ఇవ్వకుండానే గుండె కండరాలను నిర్వీర్యం చేసి మనిషిని అతి కొద్దిరోజుల్లోనే మృత్యుముఖంలోకి నెట్టేయగలుగుతుందని ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తే గానీ అర్ధం కాలేదు. మా మామ ఈ ఒక్క కారణంతోనే తన 82 సంవత్సరాల వయసులో ఆరోగ్యరీత్యా ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా(డయాబెటిస్, బీపీ ఇంకా ఇతరత్రా సమస్యలు) చనిపోయారు. ఈ సమస్య రాకపోతే ఇంకా పదేళ్లు ఉండేవారే! మార్చి9 అర్ధరాత్రి, ‘మామకు బాలేదు కొంచం రండి’ అంటే వాళ్ళింటికి ఐదు నిముషాల దూరంలో వుండే మేము (నేను, రమేష్, వాళ్ళ అమ్మాయి మైత్రి, అల్లుడు శ్యాంప్రసాద్, మనవరాలు క్రాంతి ప్రియ) వెంటనే  వెళ్ళాం. ‘భోజనం అరిగినట్లుగా లేదు, ఆయాసంగా వుంది, పడుకోవటం ఇబ్బందిగా వుంది’ అని చెప్పారు.  ఆయాసం పెరగటంతో వెంటనే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాము.

అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయమేమంటే, ఆయనకు అంతకుముందు నాలుగు రోజుల క్రితమే నిశ్శబ్దంగా గుండెపోటు వచ్చిందని! పరీక్షల్లో తేలిన అంశం అది. దానివల్ల కుడివైపు గుండె కండరం పూర్తిగా ధ్వంసమయ్యింది. దానిని బాగు చేయటం అసాధ్యం. మూడు రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడ్డాయి. దీనితో రక్తం బయటకు వెళ్ళే మార్గం లేక వూపిరితిత్తుల్లోకి వెళ్ళి అవి స్పాంజీ లో తడిసిపోయినట్లుగా అయిపోయి ఆయాసం వస్తోంది. దీనికి ఒక పరిష్కారం, భరోసా లేని ఓపెన్ హార్ట్ సర్జరీ. చాలా హై రిస్క్ వుంటుంది. దానికి తోడు ఆయన వయసు సహకరించకపోవచ్చు. ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణం పోవచ్చు, పోకపోవచ్చు. ప్రాణాలతో చెలగాటం ఆడాలి!

రెండో పరిష్కారం, ఏ విధమైన ఆపరేషన్ లేకుండా వుంచేస్తే, రోజుల్లో ఒక్కోసారి గంటల్లో చనిపోతారు. మేము ఏది నిర్ణయించుకోవటానికైనా కేవలం గంట మాత్రమే సమయం! ఎందుకంటే ఆయన పరిస్థితి బాలేదు. డాక్టర్లు ఇదే విధంగా మాకు చెప్పారు. అంటే ఆయన జీవిత కాలం కొద్ది గంటల్లోకి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు ఆపరేషన్ వద్దని మా అత్త చెప్పేసింది. అయినాగానీ, పరిస్థితి తీవ్రత గురించి ఆయనకు చూచాయగా చెప్పి, ‘ఆపరేషన్ చేయించుకుంటారా’ అని ఆయన్ని అడిగింది. వద్దని చెప్పారు. ఇదే విషయాన్ని మేము చెప్పినప్పుడు ‘వైజ్ డెసిషన్’ అని చెప్పిన డాక్టర్లే వెంటనే ఇంటికి తీసుకెళ్తామన్నప్పుడు వాళ్ల కళ్ళల్లో ఒక సెకనుపాటు కనిపించిన విస్మయాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియదు. ఇంట్లో అయితే మీరు ఆయన బాధ చూడలేరు, హాస్పిటల్ లో అయితే వెంటిలేటర్ మీద వుంచుతాం అన్నారు. కానీ, నిర్భంధ పూరిత ఆ హాస్పిటల్ వాతావరణంలో వుండటానికి ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు. మేము కూడా ఆయన్ని అలా ఎవరూ లేకుండా వుంచాలని అనుకోలేదు.

ఇంటికి తీసుకువచ్చిన ఆరు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో చనిపోవడం, వెనువెంటనే ఆయన కళ్లను వాసన్ ఐ కేర్ వాళ్ళకు డొనేట్ చెయ్యటమే మాకందరికీ సంతృప్తిని కలిగించిన విషయం. ముందు శరీరదానమే అనుకోవడం జరిగింది కానీ, దానిమీద కుటుంబ సభ్యులందరిలో వెంటనే ఏకాభిప్రాయం రాకపోవడంతో విరమించుకున్నాం.

నేను 9వ తరగతి నుంచి వాళ్ల దగ్గర వుండి చదువుకున్నాను. అంతకు ముందు కూడా ఏదోఒక  సంధర్భంలో వచ్చివెళుతూనే వుండేవాళ్లం. చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసి పెరగటంతో మాకు ఆయనతో అనుబంధం ఎక్కువ. ‘పెద్దవాళ్లమవుతున్నాం మాకు దగ్గరగా మీరు వుంటే బావుంటుంది’ అని అడిగితే 2018 ఆగస్ట్ లోనే నేను, రమేశ్ గాంధీనగర్ నుంచి శివరాంపల్లి ఆరంఘర్ చౌరస్తా దగ్గరకు మారాము. హైదరాబాద్ నగరం లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిలో వున్న అతిపెద్ద కూడలి ఈ ఆరంఘర్ చౌరస్తా! అక్కడ మెహదీపట్నం వైపు వెళ్లే బస్ స్టాప్ లో ఒకే ఒక కొబ్బరిచెట్టు వుంటుంది. అది మా మామ పెంచిన చెట్టు. బస్ స్టాప్ లో చెట్టు నాటలేదు! ఇల్లే బస్ స్టాప్ అయ్యింది. ఫ్లై ఓవర్లు, రోడ్లే అత్యాధునికమనుకునే చోట ఆ భూసేకరణల బాధితుల్లో మా అత్తా మామలు కూడా వున్నారు. ఇంటితో పాటు నలభై ఏళ్ల శ్రమతో పెంచుకున్న అపురూపమైన, అరుదైన 85 రకాల వృక్షాలు కూడా ఆ ఫ్లై ఓవర్ కింద నేలమట్టమైపోయాయి. బహుశా ‘అభివృద్ధి’ ముఖ్యమా చెట్లు ముఖ్యమా అనేవాళ్ళకు వాటిని కోల్పోవటం ఎంత బాధాకరమో అర్ధం కాకపోవచ్చు. ఆ విధ్వంసం తర్వాత మిగిలిన ఏకైక సాక్షీభూతం గా ఆ కొబ్బరి చెట్టు ఇప్పటికీ మమ్మల్ని పలకరిస్తున్నట్లే వుంటుంది. ప్రతిరోజూ దాన్ని చూస్తున్నప్పుడల్లా చిన్నతనం నుంచి ఆడి పాడిన ఆ ఇల్లే తలపులోకి వస్తుంది.

మామ 1938 సెప్టెంబర్ 7న తూర్పు గోదావరి జిల్లా కుజులూరు మండలం తనుమళ్ళ గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు నండూరి రమణమ్మ, వెంకట్రావులు. నలుగురు పిల్లలు. ఇద్దరు మొగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. తండ్రి హిందీ మాస్టర్ గా వున్నప్పటికీ భజనలు, గుళ్లు గోపురాలకు దానధర్మాలతో పాతిక ఎకరాల పొలం కాస్తా ఐదు ఎకరాలకు దిగిపోయింది. సమయానికి డబ్బు అందక పోవటంతో చెల్లి అపెండిసైటిస్ తో ఐదేళ్ల వయసులోనే చనిపోయింది. మామ కి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటివరకూ గుట్టుగా సంసారాన్ని లాగిన తల్లి అనారోగ్యంతో  చనిపోయింది. ఆ తర్వాత తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు ముగ్గురూ బాలాంత్రంలో వున్న అమ్మమ్మవద్దకు చేరారు. చదివించే శక్తి ఆ వృద్ధురాలికి లేకపోవటంతో ఒక్కో సంవత్సరం ఒక్కో బంధువు ఇంట్లో వుండి  8,9,10 తరగతులు అతి కష్టం  మీద పూర్తి చేశారు. అప్పుడు కేవలం రెండంటే రెండే జతల బట్టలు వుండేవట! అవి చిరుగులు పడినాగానీ మళ్ళీ మళ్ళీ కుట్టుకుని వేసుకునే పరిస్థితే కానీ ఇంకో జతకు ఆస్కారమే లేదు. అమ్మమ్మ అడగటంతో బంధువులు పూనుకుని అక్క  పెళ్లిచేశారు. పట్టించుకునేవాళ్లు లేకపోవటంతో తమ్ముడికి పెద్దగా చదువబ్బలేదు. పది చదివిన తర్వాత నేర్చుకున్న టైప్ హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఒక తాత్కాలిక టైపిస్ట్ ఉద్యోగాన్ని అందించింది. హిందీ నేర్చుకోవటం ప్రారంబించారు. అక్కడే సర్వోదయ భావజాలం తో వున్న రాజు అనే స్నేహితుడు కలిశారు. ఆయనది కూడా మామ లాంటి నేపధ్యమే. బహుశా అదే వారిద్దరి మధ్యా స్నేహం ఏర్పడటానికి కారణం అయివుండవచ్చు.

అయితే, టైపు చేసినప్పుడు ఒక అక్షరం తప్పు పడిన కారణంగా మొహం మీదికి పేపర్ విసిరి కొట్టిన ఒక ఆఫీసర్ అహంభావాన్ని భరించలేక అప్పటికప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. నిజానికి, ఉద్యోగం లేకపోతే ఎలా బతకాలో, ఎక్కడ వుండాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో రాజు, తను కలిసి ఇంకో స్నేహితుడి దగ్గర కొంత డబ్బు తీసుకుని ఇండోర్ లోని సర్వోదయ ట్రస్ట్ కి వెళ్లారు. సర్వోదయ ట్రస్ట్ ఆ ఇద్దరు యువకులకు ఆశ్రయం ఇచ్చింది. అక్కడే అనేక పనులను నేర్చుకున్నారు. శ్రమ విలువను, గౌరవాన్ని తెలుసుకున్నారు. బహుశా తల్లి వున్నప్పుడు ఆమే ఇంట్లో పనంత చేసేది. ఆ తర్వాత నుంచి బంధువుల ఇళ్లల్లో వుండటంతో దాదాపు అన్నీ పనులూ చేయడం అలవాటు అయినప్పటికీ, సర్వోదయ ట్రస్ట్ కి వెళ్ళిన తర్వాత పనుల పట్ల తన ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చిందని మాకు చిన్నప్పుడు చాలా సార్లు చెప్పేవారు.

ఇండోర్ లోనే చాలాకాలం వుండిపోయారు. ఆగిపోయిన చదువుని కొనసాగించి అక్కడే ఏం.ఏ వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత సర్వోదయ ట్రస్ట్ నడిపే ఒక పత్రికలో పనిచేయటం కోసం ఢిల్లీ వెళ్లారు. అప్పుడు ఆయనకు వచ్చిన జీతం కేవలం వంద రూపాయలు. స్నేహితుడు రాజు హైదరాబాద్ వచ్చి స్థిర పడ్డారు. ఆయనే మా మేనత్తకు (మా నాన్నకు పిన్ని కూతురు) ఈ సంబంధాన్ని సిఫార్సు చేశారు. ఉమ్మడి కమ్మ్యునిస్ట్ ఉద్యమంలో పనిచేసిన మా చిన్నతాత(మా అత్త తండ్రి) కు గాంధీజీ అనుచరుడు ప్రభాకర్ జీ మంచి స్నేహితుడు. మా అత్త హోమియో డాక్టర్. నిర్బంధాలు, తీవ్రమైన ఆర్ధిక ఒడిదుడుకులను తట్టుకుంటూ చదువు పూర్తి చేసుకుంది. 1965 ఆగస్ట్ లో హైదరాబాద్ మోతీగల్లీ లోనీ ప్రభుత్వ హోమియో హాస్పిటల్లో ఉద్యోగం వచ్చింది. రాజు గారు, ప్రభాకర్ జీ లు మధ్యవర్తులుగా 1967 జనవరి 1న ఆర్య సమాజ్  పద్ధతి లో శివరాంపల్లి లోని కస్తూర్బ గాంధీ మెమోరియల్ కేంద్రం లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. మా కుటుంబంలో మొదటి కులాంతర వివాహం! పెళ్లి ఫొటోల్లో మేమంతా వున్నాంగానీ అది వూహ తెలిసిన వయసు కాదు. పెళ్లి అయిన తర్వాత మామ నాగపూర్ వెళ్ళి ఎమ్మెస్ డబ్ల్యూ చేశారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ ఈ యాభైరెండు సంవత్సరాల అనుబంధంలో ఇద్దరూ ఒకే మాటగా బతికారు. ఒకరికొకరు ఆసరాగా, మాకందరికీ భరోసాగా నిలబడ్డారు.

మామ స్వతహాగా చాలా మితబాషి అయినప్పటికీ బంధువులందరితో చాలా స్నేహపూర్వక సంబంధాల్లో వుండేవారు. తన వైపు నుంచి బంధువులు తక్కువే. మా అత్త వైపు నుంచి బంధుగణం చాలా ఎక్కువ. అందరితోనూ ఒకేవిధమైన సామరస్యం తో వుండేవారు. నిరంతరం పని చేస్తూనే వుండేవారు. చాలా కాలం పాటు టోకర్శిలాల్ కపాడియా గారి తో పనిచేశారు. వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో తల్లీ తండ్రి లేని పిల్లల కోసం ఏర్పాటు చేసిన హోమ్ ల నిర్వహణా బాధ్యతలను చూసుకున్నారు. ఇప్పటికీ ఆ హోమ్ నడుస్తూనే వుంది. ఎంతో మంది పిల్లలు అక్కడ రక్షణ, విద్య అందుకోగలిగారు. ఇప్పటికీ అందుకుంటున్నారు. అలానే నేత్రదానం చేయాలని ఒక బాధ్యతగా ఎన్నో క్యాంపులను నిర్వహించి అవగాహన కల్పించేవారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కస్తూర్బా ప్రకృతి చికిత్సా వైద్య కేంద్రం నిర్వహణలో ఎన్నో సంవత్సరాలు బాధ్యత వహించారు. వ్యవసాయమన్నా, మొక్కలన్నా వాటికి పనిచేయటం అన్నా ఎంతో ఇష్టం. సర్వోదయ ట్రస్ట్ లో గాంధియన్ భావజాలంతో నేర్చుకున్న అనేక పనుల వలన ఇంట్లో ఏ చిన్న పనైనా ఆయనే చేసేసేవారు తప్పించి బయటనుంచి పనివాళ్లను పిలిపించడం అనేది చాలా అరుదుగా చూశాం మేం. అది కూడా తనకు సాధ్యంకాని, నైపుణ్యం లేని పనుల కోసమే వేరే వారి మీద ఆధారపడేవారు. ఇంట్లో దాదాపు అందరూ పనిచేయవల్సిందే. తను తిన్న పళ్ళెం తానే కడగటం అనేది మామ గురించిన నా మొదటి జ్నాపకం. అప్పటివరకూ ఇళ్లల్లో మగవాళ్ళు తాము  తిన్న పళ్ళెం కడగటం అనేది నేను మా ఇంట్లో గానీ, చుట్టుపక్కల గానీ చూడలేదు. (అవటానికి కమ్మ్యూనిస్ట్ కుటుంబమే!) అలానే, ఇంకో ముఖ్యమైన విషయం లెట్రిన్ లను కడగటం. అది కూడా నాకు ఆశ్యర్యమే! ఈ పనులన్నీ ఇళ్లల్లో ఆడవారు చేస్తారు, లేదా పనివాళ్లు(వాళ్ళు ఆడవాళ్లైనా, మగవాళ్లైనా) చేసేవిగానే మాకు అర్ధమవుతూ వస్తున్న సమయంలో వాటికి పూర్తి భిన్నంగా ఒక మగ మనిషిని మా ఇంట్లోనే చూడటం అనేది కచ్చితంగా మా ఆలోచనారీతుల్లో, దృక్పధాల్లో మార్పు తీసుకు వచ్చిందనేది మాత్రం చెప్పగలను. ముఖ్యంగా నాకు, మా అక్క విజయకు.

మామ చాలా ఎక్కువ పుస్తకాలు చదివేవారు. నేను 9వ తరగతిలో వున్నప్పుడు ఆయన పుస్తకాల్లోనుంచే గాంధీ బయోగ్రఫి చదివాను. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, దిగజారుతున్న రాజకీయ విలువలను గమనిస్తూ వచ్చిన మామ ఎమర్జెన్సీ తర్వాత అనుకుంటా విప్లవ ప్రజాఉద్యమాలకు నిశ్శబ్ద అభిమానిగా మారారు. క్రమం తప్పకుండా వివిధ పత్రికలు తెచ్చి చదివేవారు. అలానే కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర సాహిత్యం అధ్యయనం చేసారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం వుంది. కాలేజి రోజులనుంచే ప్రతిరోజూ డైరీ రాసేవారు. ఆయన స్పూర్తితో ఒకసమయంలో నేనూ రాద్దామని ప్రయత్నించాను కానీ, అది ఎంత కష్టసాధ్యమైన పనో తొందరలోనే తెలిసివచ్చి విరమించుకున్నాను.

బహుశా ఆరంఘర్ లోని ఆ ఇల్లు అనేక మందికి అశ్రయ మివ్వగలిగిందంటే ‘అది ఆయనలో నలుగురూ కావాలనుకునే ఆ స్నేహ స్వభావమే’ అని గుర్తు చేసుకుంది మా అత్త. బంధువులు, స్నేహితులే కాదు, అత్త దగ్గరకు మందు కోసం వచ్చెవాళ్ల సంఖ్య కూడా ఎక్కువే వుండేది. చాలా కష్ట నష్టాల కోర్చి, పరిమితమైన ఆర్ధిక వనరులతో ఆ ఇంటిని నిర్వహించింది మా పెదనాయనమ్మ కాంతమ్మ. ఆమె తర్వాత ఇంటి నిర్వహణ బాధ్యతను ఆయనే తీసుకున్నారు. మా నాయనమ్మ వాళ్ళు వున్నప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో పదిమందికి తక్కువ ఎప్పుడూ వుండేవారు కాదు. మా అక్క విజయ అయితే వారికి పెద్దకూతురు లెక్క. తను ఆయుర్వేదిక్ మెడిసిన్ అక్కడే వుండి చదువుకుంది. ఆ ఇల్లు పోయిన తర్వాత అపార్ట్ మెంట్లోకి మారాల్సి వచ్చి ఆ ఇరుకులో, ఆ మనస్థత్వాలతో వుండలేక చాలా ఇబ్బంది పడ్డారు.

జంగారెడ్డిగూడెం దగ్గర తాడువాయి కి (అక్కడ కొంచం భూమి, చిన్న ఇల్లు వున్నాయి) వెల్లిపోదామనుకున్నారు కానీ, అత్తకు అక్కడ ఏమీ పని వుండదు కాబట్టి ఆయనే ఇక్కడ ఉండటానికి సర్దుకుపోయారు. ఇద్దరు పిల్లల్లో చిన్నకూతురు క్రాంతి తొమ్మిదేళ్ల వయసులో వీధిలో వెళ్తున్న కుక్క కరవటంతో రేబిస్ వ్యాధితో చనిపోవటం వారికి తగిలిన మొదటి దెబ్బ. మిగిలిన ఒక్క కూతురు మైత్రి ని  హోమియో వైద్యం చదివించారు. రెండో దెబ్బ, ఆమె వైవాహిక జీవితం ఆటుపోట్లకు గురై ఒంటరిగా బిడ్డతో నిలబడటం. అప్పుడు ఎంతో బాసటగా నిలబడ్డారు. ఆమె కుంగిపోకుండా, తిరిగి మరో పెళ్లి ద్వారా జీవితంలో కుదురుకోవటానికి బాధ్యత తీసుకున్నారు. జీవితపు చివరి క్షణాలలో కూడా ఆయన తన మనవరాలికి చెప్పిన మాట ‘బుద్ధిగా చదువుకో’ అనే! యాభైరెండేళ్ల సాహచర్యంలో ప్రతి ఆటుపోటులను అత్తా మామ కలిసే  పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిష్క్రమణ దెబ్బను అత్త ఒక్కతే కాచుకోవాలి. ‘మీ అత్తకు వైద్యం చేయటం, పేషంట్లను ప్రేమగా చూడటం తప్పించి బయట వ్యవహారాలు పెద్దగా ఏమీ తెలియదు, మీరే తనని జాగ్రత్తగా  చూసుకోవాలి’ అని మాకు అప్పగింతలు పెట్టేసి వెళ్ళిపోయారు! అనేక విధాలుగా మా జీవితాలతో పెనవేసుకున్న ఆయన ఇప్పుడు మాకొక జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఆయన భౌతికంగా లేకపోయినా గానీ, ఆయన కళ్ళు మరో ఇద్దరికీ చూపుని అందిస్తాయన్న ఆలోచనే  ఒక స్వాంతన.

*

 

 

సజయ. కె

16 comments

Leave a Reply to Dr. Lakshmi Raghava. Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Chaala hrudyangaa vokanindina Jeevitaanni kallakukattinattu aavishkarinchaaru talli aa taran manaku nadaka nadata nepaaru bhavishyttu taraalaku adimanam andina galigithe ade vaallku manam aripinchagaligina nivaali

    • నండూరి గారు ఎంత మితభాషి యో బెజవాడలో కలుసుకున్నప్పుడు అనుభవం. అయితే అప్పుడే నాకు ఆయన విప్లవ రాజకీయాల అభిమాని అని తెలిసింది.ఆయన బహుముఖీన వ్యక్తిత్వాన్ని చక్కగా చెప్పావు సజ యా!

    • అవును Pavan Kondapalli గారు. ఒకతరం నుంచి. ఇంకో తరం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో వుంటాయి. ఘర్షణ లు కూడా వుంటాయి. వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయటానికి ఇరువైపులా ప్రయత్నాలు జరగాలి. కానీ, అన్ని సందర్భాల్లో నూ ఇది సాధ్యం కాకపోవచ్చు.

  • నండూరి గారు ఎంత మితభాషి యో బెజవాడలో కలుసుకున్నప్పుడు అనుభవం. అయితే అప్పుడే నాకు ఆయన విప్లవ రాజకీయాల అభిమాని అని తెలిసింది.ఆయన బహుముఖీన వ్యక్తిత్వాన్ని చక్కగా చెప్పావు సజ యా!

  • గుండె గొంతుకలోకి వచ్చింది.

    జీవితం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్ని మలుపులు ఎలా ఎప్పుడు తిరుగుతుందో ఊహించలేం.

    ఒక్కో సంవత్సరం ఒక్కో బంధువు ఇంట్లో వుండి 8,9,10 తరగతులు అతి కష్టం మీద పూర్తి చేయడం చదివినప్పుడు.. వారానికొకరి దాతల ఇంట్లో అన్నము తిని చదువుకున్న మా నాన్న గుర్తొచ్చాడు.

    సర్వోదయ ట్రస్ట్ ఒకటి ఉండటం, అది తెలిసి అక్కడకు చేరడం, శ్రమ విలువ గుర్తెరగడం
    గొప్ప మలుపే.

    ఇంటర్మీడియట్ రోజుల్లో తెలిస్తే నేనూ వెళ్లి ఉండేవాడిని..

    కొబ్బరి చెట్టు వక్రమైన అభివృద్ధికి ఆనవాలుగా మిగలటం..

    ఆర్ద్రమైన జీవనాన్ని అంతే ఆర్ద్రంగా అక్షరాల్లోకి నింపిన సజయ గారికి అభినందనలు.. కృతజ్ఞతలు..

    ఒక నవల రాయాల్సినంత విషయ విస్తృతి ఉందనిపించింది..

    • మీ విలువైన అభిప్రాయానికి ధన్యవాదాలు రాంబాబు గారు. గతించిన ఆ తరం అనుభవాలు , విలువలు మళ్లీ చెప్పుకోవడం ద్వారా మన వర్తమాన గమనాన్ని మన చేతుల్లో కొంతమేరకైనా ఉంచుకోగలుగుతాం అనిపిస్తుంది. అయితే మనం రెండు తరాల మధ్య వారధిగా వుండే స్థితిలో వున్నాం. ఆ సంఘర్షణ భరించాలి. ప్రపంచీకరణ తర్వాత వచ్చిన తరానికి కొన్ని అంశాలు పాత చాదస్తం గా అనిపిస్తుంది. ఓపిగ్గా వివరించడమే.

  • 1980ల్లో కాటెదాన్ లో మాకు ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉండేది… అక్కడికి రోజూ 94నుంబర్ బస్ లో వెళ్లేది..అందుకు ఆరాంఘర్ లోనే బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళేది..ఈ ఫోటోలో ఉన్న సార్ ని చాలా సార్లు అక్కడే చూసిన.. ఇప్పుడు తెలుసుకున్న.. ధన్యవాదాలు..

    • సంతోషం శ్రీనివాస్ గారూ. కొన్నేళ్ల క్రితం వరకూ ఆరంఘర్ దగ్గర మా ఇల్లు అని చెబితే అసలు ఎవరూ ఆ place తెలిసినట్లుగా చెప్పేవారు కాదు. ఎవరో కొద్దిమంది తప్పించి. చిన్నప్పటి నుండీ వున్న ప్లేస్ కదా, ఎన్ని సమస్యలతో వున్నా గానీ నాకు చాలా అభిమానం ఆ ఏరియా అంటే.

  • Chadivi nerchukovalsina enno vishayalu teliparu. Maa mamayya, Bari thaalooku meeru Dhansukhbhai.🙏🏼🙏🏼

  • Chadivi nerchukovalsina enno vishayalu teliparu. Maa mamayya, Bari thaalooku meeru Dhansukhbhai.🙏🏼🙏🏼
    Spl mistakes . ‘ dhanyulu’ sorry

  • మీ రాతలు చదివించి,ఆలోచింపజేసి,ఆచరణలోకి వెళ్ళమంటాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు