రాయలసీమ కవులు, రచయితలు, విమర్శకులు తమ రచనల్లో స్థానిక జీవిత చైతన్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చాలా చేశారు. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతీయ స్పృహను సాహిత్యంలో స్థాపించాలనే ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవి ఆశించిన స్థాయికి చేరుకోలేదనే అభిప్రాయం ఉంది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలో లభించినా అస్తిత్వవాద స్పృహమాత్రం ఆలస్యంగానే ప్రారంభమైంది.
ఈ క్రమంలో ప్రాంతీయతకు స్పష్టమైన రూపం ఇచ్చిన రచయితగా 18వ శతాబ్దంలోని అనంతపురం జిల్లాకు చెందిన పాలవేకరి కదిరీపతి ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాయలసీమ సాహిత్యం ఆధునిక కాలంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య చెప్పినట్లుగా, సాహిత్యం సామాజిక చైతన్యానికి ప్రతిరూపమనే అవగాహనతోనే ప్రాంతీయ సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఇప్పటివరకు రాయలసీమ ప్రాంతం నుండి విస్తృతమైన రచనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రసిద్ధ ప్రముఖ సాహితీవేత్త శాంతి నారాయణ సాధన అనే నవలను 2022 ఆగస్టులో తీసుకొచ్చారు. రాయలసీమ అస్తిత్వవాద స్పృహను ప్రతిబింబించిన ముఖ్యమైన నవలగా ఇది నిలుస్తుంది. రాయలసీమ సాహిత్య చరిత్రలో ప్రాంతీయ అస్తిత్వాన్ని కేంద్రంగా చేసుకుని రచించబడిన అరుదైన నవలల్లో ఇది ఒకటి.
ఈ నవలలో రామప్ప, అతని రెండో కుమార్తె సాధన, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దుర్గారావు ప్రధాన పాత్రలు. తొంభై ఏళ్లు దాటిన రైతు రామప్ప పాత్ర ద్వారా రచయిత రాయలసీమ రైతు జీవితం, కరవు, సాగునీటి సమస్యలు, ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని ప్రతిబింబించారు. రామప్ప భావజాలాన్ని వారసత్వంగా స్వీకరించిన సాధన, తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న కోస్తా ప్రాంతానికి చెందిన సతీష్‌ను ప్రేమిస్తుంది. ఈ ప్రేమకథ నేపథ్యంలో రాయలసీమపై జరిగిన వివక్ష, కోస్తా ఆధిపత్య భావన, ప్రాంతీయ అసమానతలను రచయిత చర్చించారు. సాధన బావ చంద్రశేఖర్ పాత్ర ద్వారా రాయలసీమ ఉద్యమ భావజాలానికి కూడా స్థానం కల్పించారు.
నవలలో సాగునీటి సమస్యలు, రాజకీయాలు, సామాజిక అసమానతలపై రచయితకు ఉన్న లోతైన అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవికతతో కూడిన పాత్ర చిత్రణ, సామాజిక–రాజకీయ విశ్లేషణ ఈ నవలకు ప్రత్యేకతను తెచ్చాయి. అయితే కొన్ని రాజకీయ అభిప్రాయాలు ఏకపక్షంగా అనిపించడం, సతీష్ పాత్ర ద్వారా కోస్తా సమాజాన్ని చిత్రీకరించిన విధానం కొంత వివాదాస్పదంగా కనిపిస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకునే పాఠకులకు ఈ అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.
శాంతి నారాయణ నిబద్ధత కలిగిన రచయితగా గుర్తింపు పొందారు. ఆయన నమ్మిన భావజాలాన్ని రాజీ లేకుండా ప్రతిపాదిస్తూ, అదే సమయంలో సాహిత్య గుణాన్ని కూడా కాపాడారు. విమర్శకుడు రారా చెప్పినట్లుగా, భావజాలం మాత్రమే కాదు, రచన సాహిత్యంగా నిలబడాలి. శిల్పం, వాస్తవికత కలిసినప్పుడే అది పాఠకుడిని ప్రభావితం చేస్తుంది. శాంతి నారాయణ రచనల్లో రెండు కళ్ళుగా ఉంటాయి. ఒక రామప్ప పాత్ర ద్వారానే శతాబ్దకాల రాయలసీమ చరిత్రను ఆవిష్కరించిన తీరు కొంత సినిమాటిక్‌గా అనిపించినా, ప్రాంతీయ వాస్తవాలను ధైర్యంగా ప్రతిపాదించిన రచనగా సాధన నవల తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. రాయలసీమ అస్తిత్వవాద స్పృహను బలంగా ప్రతిబింబించిన ఈ నవల విశిష్టమైన స్థానం సంపాదించుకున్నది.
*








శాంతి నారాయణ గారి సాధన నవలను సమీక్షించిన విధానం బాగున్నది. నవల యొక్క నేపథ్యమును మరియు సామాజిక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ కోస్తా రాయలసీమలో ఉనికిని కూడా పరిగణలోకి తీసుకొని క్లుప్తంగా చెప్పిన విధానం మెచ్చుకో తగిన విధంగా ఉన్నది