రష్యా దాకా తీసుకెళ్ళే కథ!

ఒక జీవితకాలంలో మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన కథ!

సంస్కృత నాటక కవీంద్రుడు భవభూతివి రెండు శ్లోకాలు ఎప్పటికీ మరపురావు. రానివ్వను కూడా. నాకే కాదు, ఎంతోమంది భావుకులైన పండిత కవులు కూడా మరవలేక మాటిమాటికీ స్మరించుకుంటూ ఉంటారు.

అందులో “అద్వైతం సుఖ దుఃఖయో రనుగతం” అన్న శ్లోకం దాంపత్యం తాలూకు విలువనీ, ఆ విలువను నిలబెట్టుకోడానికి మనుషులకు అవసరమైన లేదా అవసరంగా సంపాదించుకోవలసిన సంస్కారాన్ని గురించి చెప్తుంది. దాన్ని గురించి ‘విశ్రామో హృదయస్య’ అంటుంది. హృదయానికి సేద దీరే చోటు అని.

రెండోది భర్త  ఉత్తమురాలు, అనురాగవతి అయిన భార్యను ఎలా ప్రేమించాలో చెప్తుంది.  “ఇయం గేహే లక్ష్మీ ఇయం అమృత వర్తిర్నయనయోః” అనేది ఆ రెండో శ్లోకం. రాముడు సీత గురించి భావించుకుంటాడు’ ఆమెతో అన్నీ ఇష్టమే ఒక్క వియోగం తప్ప ‘ అంటూ.

ఇవి చాలా ఏళ్ళుగా నాతో ప్రయాణిస్తూ ఉన్నాయి.

ఆమధ్యలో అప్పుడెప్పుడో నా నలభయి ఏళ్ళ వయసులో  మధ్యలో వచ్చి కనిపించి, వాటి తో చేరింది టాల్ స్టాయ్ రాసిన ఫేమిలీ హేపీనెస్ అనే పెద్ద కథ.

అనువాదం పేరు సంసార సుఖం. పేరు ఇంకా చక్కగా తెలుగు చెయ్యచ్చు కానీ కథలోకి వెళ్ళాక ఆ సంగతి మరచిపోతాం. విషాద సంగీతం పేరుతో వచ్చిన టాల్ స్టాయ్ ‘అతి’ విలువైన ఏడు కథల సంకలనంలో ఇది ఒకటి. ఈ అతి అన్నమాట ఇక్కడ ప్రయోగించక తప్పదు. ఇది మామూలు అతి కాదు. అప్రమేయానందాన్ని ఇచ్చే అతి.

“రాదుగ” ప్రచురణాలయంలో కొన్ని ఏళ్ళపాటు అనువాదాలు చెయ్యడానికి మాస్కోలో ఉండిపోయిన ఆర్వీయార్ అనే నర్సాపురం పెద్ద మనిషి రష్యా భాష నుంచి తిన్నగా తెలుగు చేసిన అనువాదం ఇది.

ఈ కథలు నన్ను భవభూతి సరసన టాల్ స్టాయ్ కి సమానాసనం వేసి కూచోబెట్టేలా చేశాయి. ముఖ్యంగా సంసార సుఖం కథ.

ఈ పాతికేళ్ళలో ఆ కథ ఎన్నిమాట్లో చదివాను. 132 పేజీల కథ. ఇది రాయడానికి నిన్నా మొన్నా మళ్ళీ చదివాను. చదువుతూ మధ్య మధ్య తప్పని పనులు చేస్తూ, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా…నేను ఇక్కడ కాకినాడలో మా ఇంట్లో లేను. రష్యాలోని ఒక పల్లెలోని పెద్ద తోట మధ్యలో ఉన్న పాతకాలపు ఇంట్లోనే ఉన్నాను. నేనే కాదు, మీరెవరు ఆ కథ చదివినా ఆ ఇల్లు, అందులో మోగుతూ ఉండే పియానో సంగీతం, పెద్ద పెద్ద కిటికీలకు కట్టిన తెరల పక్కనించి కనిపించే మంచుతో తడుస్తున్న తోటా ఆవహించక మానవు.

అయితే వీటన్నిటికీ కదలిక తెచ్చి ప్రాణం పోసినది అక్కడ ఆ ఇంటి వాతావరణంలో మొదలైన కథ. ప్రేమ కథ. అద్భుతం అనను. అపురూపమైన ప్రేమకథ అంటాను.

గ్రామంలో ప్రకృతిలో పెరిగిన, ప్రకృతితో కలిసిపోయినట్టున్న మనసుతో ఉండే పద్ధెనిమిదేళ్ళ నవయవ్వన బాలిక ప్రేమకథ. తనకన్న రెట్టింపు వయసున్న, తండ్రి మిత్రుడు, తమ సంరక్షకుడు అయిన పరిణత పురుషునితో కలిగిన ప్రేమానుభవం అది.

ఆకురాలు కాలంలో చనిపోయిన వాళ్ళమ్మ కోసం దుఃఖపడుతూ కథానాయిక ‘మాషా’ తన చెల్లెలితోనూ, పెంపుడు తల్లితోనూ ఆ పాతకాలపు ఇంట్లో దిగులు మూటగట్టుకుంటూ శీతకట్టు గడిపింది, అత్యంత నిరుత్సాహంతో. ఆ చలికాలపు చివరి రోజుల్లో తమ సంరక్షకుడు వస్తున్నాడన్న వార్తతో వెనువెంటనే ఒక మేరుశిఖరమే కదిలివచ్చినట్లు ఆయన వచ్చాడు. కథమొదలైంది.

నేను ఈ కథంతా తిరిగి చెప్పలేను. ప్రయత్నించినా పూర్తి విఫలప్రయత్నమే అవుతుంది. కాబట్టి టాల్ స్టాయ్ మాటలే ఉపయోగిస్తూ ముందుకు తీసుకువెడతాను.

“ఆయన దాపరికం లేని ధోరణి, పెద్ద కనుముక్కు తీరు, తెలివైన ప్రకాశవంతమైన నేత్రాలు, దయాన్వితమైన, అమాయకమైన చిరునవ్వు ఉన్న విస్ఫారిత నిష్కపట వదనం ఆమె చిన్నప్పుడు చూసినట్టే ఉన్నాయి”

ఆమె విచారాన్ని గమనించి ఇలా అన్నాడు ఆయన “ఏకాంతాన్ని భరించలేకపోవడం మంచిది కాదు. మీరు నిజంగా అంత సామాన్యమైన ఆడవారా? గారం చేసిన అమ్మాయేమో! బహుశా పొగుడుతున్నప్పుడు మాత్రమే ఉల్లాసంగా ఉంటూ, ఒంటరిగా వదిలేసినప్పుడు జీవితంలో ఏ సంతోషాన్నీ చూడలేక వాడిపోయే బాపతన్నమాట” అని సరదాగా వేళాకోళం చేస్తాడు. కానీ “మీలో ఏదో ఉంది” అనీ ఒప్పుకుంటాడు.

అతని మొదటి అభిప్రాయమే నిజమని తర్వాత కథ ఋజువు చేస్తుంది.

కానీ అతను ఆమె విసుగును పోగొడతాడు. “మీకు సంగీతమంటే అభిరుచి వుంది. పుస్తకాలు ఉన్నాయి. చదువులు ఉన్నాయి. జీవితమంతా ముందే ఉంది.” ఇలా అనడమే కాదు, ఆమె లోపల ఆ దాహం కలిగిస్తాడు. ప్రేమ రుచి కూడా చూపిస్తాడు.

మళ్ళీ వసంతంలో తిరిగి వస్తాడు. ఈలోపు అతనిమీది ఇష్టంతోఆమె పుస్తకాలలోకీ, సంగీతంలో కీ  ప్రయాణిస్తుంది. పియానో వదలదు.

రెండవ సమాగమంలో ఆమె అతనికి తన సమస్తాన్నీ నివేదించుకోడానికి ఉద్విగ్నపడుతుంది. ప్రేమ అగరు పొగలాగ ఆమె లోపలనుండి ఉక్కిరిబిక్కిరి చేస్తూ బయటికి సుడులు తిరుగుతూన్న క్షణాలు.

ఆ రాత్రి తమ పాత ఇంటి వరండాలో కూర్చుని ఉండగా “దగ్గర్లో ఉన్న ఒక లైలాక్ పొదలోని నైటింగేల్ కూయడం మొదలుపెట్టి మాటలు విని ఆగిపోయింది. నక్షత్రాలు నిండిన ఆకాశం మా మీదికి కిందుగా వంగినట్టయింది”.

నక్షత్ర ఖచిత ఆకారం ఆ ప్రేమికుల మీదకీ వంగడానికి కిందకీ దిగిందీ అంటే అదెంత మోహనమైన ప్రేమ. లైలాక్ పక్షి పాట ఆపి వారి ప్రేమ సంగీతం వినడానికి మౌనం వహించిందీ  అంటే టాగూర్ గుర్తొస్తాడు. ప్రకృతి వారికి చేరువగా తనంత తనే వచ్చింది

ఆమె అతనితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యపు ఔన్నత్యం గురించి ఇలా చెప్తుంది, “నేనేదో అభిమానపాత్రమైన చిన్న నేస్తం అయినట్లు నన్ను చూసి ప్రశ్నలు అడిగేవారు. రహస్యాలు చెప్పుకోనిచ్చేవారు, సలహాలిచ్చేవారు, ప్రోత్సహించేవారు. ఒక్కొకపుడు కేకలు వేసి నా తప్పుడు ప్రేరణలు అదుపు చేసేవారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన్ని గురించి తెలిసిన దానికన్నా తెలియని ప్రపంచం ఆయనకేసి నన్ను ఎంతగానో ఆకర్షించి, గౌరవించేట్టు చేసింది” అంటుంది మాషా.

ఆయన రాక ఆమెపట్ల ఆయన ప్రేమ వల్ల అసంఖ్యాక ఆనందాలు విశదమయ్యాయంటుంది.

“ఈ వస్తువులు చిన్నప్పటినుంచీ పరివేష్టించి ఉన్నాయి. కానీ అవి మూగగా ఉన్నాయి. ఆయన వచ్చీరాగానే అవన్నీ మాటాడడం, నా హృదయాన్ని ఆనందంతో నింపేస్తూ అందులో ప్రవేశించడం మొదలుపెట్టాయి”.

“మరో విషయం. మొదట్లో నాకు నచ్చనిదీ, కానీ తర్వాత నాకు ఇష్టం కలిగించినదీ ఏమిటంటే నా అందం పట్ల కూడా పైకి కనిపించే ఆయన శుద్ధ ఉదాశీనత. దాని వెనక ఆయన ప్రపంచంలో అద్వితీయమైన యువతిగా నన్ను పరిగణించారని అర్ధమయ్యేసరికి సాదాతనపు పారదర్శకత అర్ధమయింది నాకు”

“ఆ సమయంలో నా ఆలోచనలు కానీ, నా అనుభూతులు కానీ ఏవీ నా సొంతం కావు. అన్నీ ఆయనవే. కానీ ఉన్నట్టుండి నావి అయిపోయాయి. అవి నా జీవితంలో ప్రవేశించి దాన్ని తేజోవంతం చేశాయి”

ఇలా మునిగిపోయింది మాషా ఆ ప్రేమతో. ఆమె ప్రేమతో మెత్తనయిపోయిన తన హృదయంతో అందరినీ ప్రేమిస్తూ దయగా కరుణార్ధ్రంగా మారిపోయింది.

“ఇతరుల కోసం జీవించడంలోనే ఆనందం ఉందనే ఆయన మాట అర్థమయింది. పల్లెటూళ్ళో ప్రశాంతమైన వివాహ జీవితం గురించీ, నిరంతర ఆత్మత్యాగం, ఒకళ్ళపట్ల ఒకళ్ళకి ఉండే జీవితం గురించీ కలగన్నాను. విదేశీ యాత్రల గురించీ, విందులు వేడుకలు గురించిగానీ నే కలగనలేదు” అంటుంది.

ఇంతటి ఆనందంతో ఉన్న సమయంలో ఆమె పియానో వాయించబోతే ఆయన ఆపేవాడు. నీ లోపలనుంచి వినిపిస్తున్న సంగీతాన్ని విననివ్వు అనేవాడు.

వివాహం నిరాడంబరంగా వారు కోరుకున్నట్టే జరిగింది. రెండు నెలల కాలం ఒక జీవితకాలానికి సరిపోయేలా గడిచింది. చుట్టూ ప్రకృతి, మరో పల్లెటూరు, అత్తగారి మరో పాతకాలపు ఇల్లు, పుస్తకాలు, సంగీతం, ప్రేమ మాధుర్యం.

ఆమెకు మార్పు లేని దినచర్య. కొంతకాలానికి ఆ జీవితంలో రుచి పోయింది ఆమెకు. అతను వివరింపజూశాడు. “ఇతరులను లొంగదీసుకోవడం కంటె దారి ఇవ్వడమే సులభం” అన్నది అతని నమ్మిక.  కానీ జీవితం గురించి బాగా అర్థం చేసుకున్న అతను ఇలా అంటాడు, “గంట మోగినప్పుడు, ఓ ఉత్తరం వచ్చినప్పుడు, లేదా పొద్దున్నే లేవగానే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే జీవితం మారుతోంది, పరిస్థితులు మారి తీరాలి – కానీ ఇప్పుడున్నదానికంటే మరి ఏదీ మంచిది కాదు”

అలాంటి ప్రేమా, దాంపత్య జీవితమూ అది.

కానీ ఆమె ఇంతకంటె గొప్పది కాదుగానీ, భిన్నమైన ఆనందం ఉందని నమ్మింది. ఎక్కువ కదలిక కోరుకుంది. ప్రమాదం, ఉద్వేగం కావాలనుకుంది. ఈ ప్రశాంత జీవనంలో తనలో దాగిన పుష్కలమైన శక్తులు బయటపడలేవనుకుంది. అదుపు లేని మార్దవం, ఉల్లాసం కలగడాన్ని ఇష్టపడింది. ఒకరికి మంచి చెయ్యాలనే భావం నుంచి ఉద్వేగపడడమే ముఖ్యమనుకుంది. కానీ ఈ పల్లె లో అవేవీ లేవు.

ఇది ఆమె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది.

అతను ఆమెను అర్థం చేసుకున్నాడు. కొంతకాలం సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ఉండడానికి ఏర్పాటు చేసి తీసుకువెళ్లాడు. మన దగ్గరున్న డబ్బుతో మనం ఇక్కడ కొంతకాలమే ఉండగలం అని చెప్తే ఒప్పుకుంది.

కానీ ఆ నగరం ఆమెను మోహపెట్టింది. అక్కడి ధనికవర్గాల విందు నాట్యాలలో ఆమెకు లభించిన ఆధిక్యత, గుర్తింపూ ఆమెకు మత్తెక్కించాయి. అక్కణ్ణించి వెనక్కి తమ గ్రామానికి రావాలన్న విషయమే మర్చిపోయింది. ఒక పిల్లవాడికి తల్లి అయినా ఆమె నగరంలో అందరి ఆకర్షణకూ కేంద్రం అయిన అద్భుత మహిళ అనే మోహంలోనే ఉండిపోయింది.

అతను ఆమెను హెచ్చరించాడు తప్ప, దారికి అడ్డు రాలేదు.

మూడేళ్లు గడిచాయి. క్రమంగా ఆ నగర జీవితపు కుహనా ఆనందపు తెరలు నెమ్మదిగా జారిపోవడం ఆమెకే అర్ధమయింది.ప్రజల ప్రాధాన్యతలు మారాయని మారతాయని గ్రహించింది.

రెండవ పిల్లవాడు కూడా పుట్టాడు. ఆమె పూర్తిగా ఆ పొగడ్తల పొగలోంచి బయటకు వచ్చింది. తిరిగి గ్రామానికి వచ్చేసారు ఆమె పట్టు మీద.

కానీ నగరానికి వెళ్ళేముందు ఆయన ఒక మాటంటాడు “సమాజం చెడ్డది కాదు, తీరని ఐహిక కోరికలున్నాయే, అవీ చెడ్డవీ, అసహ్యమైనవీనూ” అని.

ఆమెకు అవి అర్ధమవగానే వెనక్కి వెడదాం అంది.

వెనక్కి వచ్చేక ఆయన ఇలా అన్నాడు, “అందమైన ప్రతీదీ నీలో సంతృప్తితోపాటు విచారం కూడా కలిగిస్తుంది. కానీ అది ఒకప్పుడు నాలోనూ వుంది. ఏదో ముందు ఉందని ఎదురు చూడడం. కానీ ఇప్పుడు ప్రతీదీ వెనక్కి పోయింది. ఉన్నదానితోటే తృప్తి పడ్డాను.”

“వానవల్ల ఆకులూ, గడ్డీ తడిసిపోవడం అంటే నీకు అసూయ. నువ్వే ఆకులూ, గడ్డీ, వానా అయిపోవాలనుకుంటావ్. అది నీకిష్టం. కానీ నాకు వాటిని ఊరికే చూడడమే తృప్తి” అని గడిచిన జీవితం పట్ల సమన్వయంతో చెప్తాడు.

కానీ అతను పూర్వపు మనిషి కాదని, ఆ పూర్వపు ప్రేమ అతనిలోంచి రాదనీ ఆమెకు తెలిసిపోతుంది. కానీ అతనిలా అంటాడు, “ఆ నేరం కాలానిదీ – మనదీనూ, ప్రతి కాలానికీ తన ప్రేమ రూపం ఉంటుంది. పీటర్స్ బర్గ్ లో ఉన్నప్పుడు కూడా నేను నా ప్రేమను విధ్వంసం చెయ్యలేదు. దాన్ని చిత్రహింస పెట్టినదాన్ని విధ్వంసం చేశా. తద్వారా నాకు శాంతి లభించింది. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను.”

“పోయినదాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నించవద్దు. మనకి కలిగిన ఆనందం తక్కువదేమీ కాదు. ఆ పాత ఆతృత, ఆవేశమూ లేకపోతే పోనీలే. అంతేచాలు అనుకుందాం. మనం పక్కన నుంచుని పిల్లలకి దారి ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు” అని వంగి ఆమె తలమీద ముద్దు పెట్టుకున్నాడు.

అది ప్రేమికుడి ముద్దులాగ లేదు. పాత మిత్రుడి ముద్దులాగ ఉంది అనుకుంటుంది ఆమె.

ఆ రోజుతో నా భర్తతో అద్భుత ప్రేమ జీవనం ముగిసింది కానీ నా పిల్లలతో పిల్లల తండ్రితో మరొక నూతన ప్రేమానుభూతి మొదలయిందనుకుంటుంది.

ఇంత పరిణతి చెందిన పురుషుడైతే తప్ప సంసార జీవనాన్ని తిరిగి సంతోషప్రదం చేసుకోలేడన్నది ఒక సూచనేమో!

ప్రశాంత జీవనం ఒక సుదూర ఆదర్శం. దాన్ని నిలబడి అనుభవించగలగడానికి చాలా పోరాటమే చెయ్యాలి. కేవలం ప్రకృతి, పుస్తకాలూ, సంగీతమూ ఇచ్చే ఆనందం ఎంతటివాళ్ళకూ చాలదు.

చాలు, అనుకోగలగడానికి ఎంతో  ప్రపంచం చూసి, జీవితం తాలూకు చేదు అనుభవించి, అక్కడ ఏమీ లేదని గానీ, అంతే ఉన్నదని గానీ నిర్ధారణకు రాగలగాలి.

ఇందులో నాయకుడికి ఆ పరిణతి ఉంది. నాయిక దాని కోసం పెనుగులాడింది. తెలిసేటప్పటికి విలువైనది జారిపోయింది. కానీ మిగిలిన జ్ఞాపకమేమీ సామాన్యమైనది కాదు.

దాంపత్యం ఒక జీవితకాలపు ఎగుడుదిగుళ్లు లేని ప్రేమ కావ్యం కాదు. తెలుసుకోవడానికి, నేర్చుకోడానికీ, మారడానికీ అవకాశాన్ని ఇచ్చే స్థితి. ఇద్దరూ కలిసి సాధించవలసిన సుమానుషం అనే  రష్యన్ లో అయినా సంస్కృతం లో ఐనా వాళ్ళు చెప్పారు

ఒక జీవితకాలంలో మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన కథ అందుకే ఇది.

 

*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • (ఇతరులను లొంగదీసుకోవడం కంటె దారి ఇవ్వడమే సులభం” … )
  మాటలు రావడం లేదండీ ..ఎలా కృతజ్ఞతలు చెప్పాలో!!
  మీలాంటి పెద్దలద్వారా ఎన్నో తెలుసుకుంటున్నాం.
  ఇంత మంచి కథను పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.💐💐💐

  • థాంక్యూ వెరీమచ్ పద్మజ గారూ

 • “ప్రశాంత జీవనం ఒక సుదూర ఆదర్శం. దాన్ని నిలబడి అనుభవించగలగడానికి చాలా పోరాటమే చెయ్యాలి. కేవలం ప్రకృతి, పుస్తకాలూ, సంగీతమూ ఇచ్చే ఆనందం ఎంతటివాళ్ళకూ చాలదు.

  చాలు, అనుకోగలగడానికి ఎంతో ప్రపంచం చూసి, జీవితం తాలూకు చేదు అనుభవించి, అక్కడ ఏమీ లేదని గానీ, అంతే ఉన్నదని గానీ నిర్ధారణకు రాగలగాలి.

  ఇందులో నాయకుడికి ఆ పరిణతి ఉంది. నాయిక దాని కోసం పెనుగులాడింది. తెలిసేటప్పటికి విలువైనది జారిపోయింది. కానీ మిగిలిన జ్ఞాపకమేమీ సామాన్యమైనది కాదు.” ఎప్పటి లాగే చాలా మంచి పుస్తక పరిచయం. మీ పరిచయం చదివాక పుస్తకం చదవాలనిపిస్తుంది . కానీ ఎలా?

  • నా వాక్యలే కోట్ చెయ్యడం చాలా సంతోషం కలిగించింది. థాంక్యూ వెరీమచ్
   మంచి పుస్తకాల కోసం వెతుక్కోవాలి మరి

 • ఏంతో గొప్ప కథను అంతే మాధుర్యంగా మాకు పరిచయం చేసారు. తప్పకుండా చదువుతాను.

  • థాంక్యూవెరీమచ్ నిత్యా జీ

 • లక్ష్మీ! సువాసనలు వెదజల్లుతూ మీ శేఫాలికలు మా ముందు విరబూశాయి. ఆ సువాసన మత్తెక్కించింది. మైమరపించింది! ఏవో లోకాలలో విహరింపజేసింది.మీరు ప్రస్తావించిన సంస్కృత నాటక కవీంద్రుడు భవభూతి శ్లోకాల గురించి నాకు తెలియదు. దాంపత్యపు విలువను ,ఆ విలువను నిలబెట్టుకోవడానికి మనం సంపాదించుకోవాల్సిన సంస్కారం గురించీ, అనురాగవతియైన భార్యను ఎలా ప్రేమించాలో! అంటూ ఆ శ్లోకాలను వివరించారు. ఈ శ్లోకాల అర్దం మీనుంచి ఇప్పుడు మమ్మూ ఆవరించాయి.ఈ పీఠికతో పాటకులను కట్టిపడేశారు!
  సంస్కృత నాటకకారుడు భవభూతినుంచి అన్ని కాలాలోను గొప్ప రచయిత గా పేరుగాంచిన లియో టాల్ ష్టాయ్ కథ Happy Family కు వచ్చారు!ఎంత చక్కగా ఇద్దరి మద్య వారిధి నిర్మించారో !👌.
  ఆ కథలోని ఆయువును మా ముందుంచారు.వెండి దారంలా మెరిసే ఆ సునిశితమైన భావాలు, బంధాలు, ప్రేమలు మా ముందుంచారు. ఇది చదువుతున్నంత సేపు మేమూ రష్యాలోని ఆ పల్లెలో ఆ పాత ఇంట్లో తిరిగాము. పియానో సంగీతమూ చెవుల్లొ! ఆ అపురూపమైన ప్రేమలో లీనమైపోయాము.తనకన్నా రెట్టింపు వయస్సున్న ఆ వ్యక్తి రాకతో ఆ అమ్మాయిలో జీవితేచ్ఛ!. తక్షణం నాకు “The Thorn Birds” by Colleen Mc Cullough రాసిన novel గుర్తుకొచ్చింది. TV serial చూచిన తరువాత novel చదివాను. ఇప్పటికీ ఆ నవల నన్ను వెంటాడుతూనే ఉంది!.
  ఒక్కొక్కసారి నిజమైన విలువలను తెలుసుకోవడంలో జీవితమే కోల్పోతాము..ఆ అమ్మాయి జీవితంలో అతని ప్రవేశం అపూర్వమైన ప్రేమ, అప్రమేయమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ మోహనమైన ప్రేమకు నక్షత్రాలువంగాయి, ఆ ప్రేమ సంగీతాన్ని వినడానికి లైలాక్ పక్షి సంగీతం ఆపింది అని టాగూర్ ను గుర్తుచేశారు. “లాహిరి లాహిరిలో ఓహొ జగమే ఊగెనుగా సాగెనుగా పాటలా సాగిపోతున్న ఆ దాంపత్య జీవితంలో ఒక చీలిక.”ఇతరులను లొంగదీసుకోవటంకన్నా దారి ఇవ్వడం ఉత్తమం” “ఇతరులకోసం జీవించటంలో ఆనందం.”మనం పక్కన నిల్చుని పిల్లలకు దారి ఇవ్వాలి”.ఎన్ని జీవన సత్యాలను విప్పుతూ సాగిపోయింది కథ. మీరు కథను చెప్పిన తీరు మనసును ఆకట్టుకొంది.
  ఆ రోజుతో నా భర్తతో అద్భుత ప్రేమ జీవనం ముగిసింది కానీ నా పిల్లలతో పిల్లల తండ్రితో మరొక నూతన ప్రేమానుభూతి మొదలయిందనుకుంటుంది.
  ఇంత పరిణతి చెందిన పురుషుడైతే తప్ప సంసార జీవనాన్ని తిరిగి సంతోషప్రదం చేసుకోలేడన్నది ఒక సూచనేమో!👌👌👌

  ప్రశాంత జీవనం ఒక సుదూర ఆదర్శం. దాన్ని నిలబడి అనుభవించగలగడానికి చాలా పోరాటమే చెయ్యాలి. కేవలం ప్రకృతి, పుస్తకాలూ, సంగీతమూ ఇచ్చే ఆనందం ఎంతటివాళ్ళకూ చాలదు.
  కథ మాటలు మనస్సును హత్తుకొన్నాయి. గింగురుమంటూ తిరుగుతున్నాయి. శాశ్వతముద్రవేశాయి! లక్ష్మీ మీకు ఇవే నా 🙏🙏🙏!

  • సుశీల గారూ ఒక్కమాట లో చెప్పాలంటే మీ లాంటి ఒక్కరి ఆనందం కోసమేనా నేను రాయాలి అనిపించింది. అంత గా లోపలికి తీసుకున్నారు
   సాహిత్యం మనం ఎంత తీసుకోగలిగితే అంతా ఇస్తుంది. తీసుకోవడం లోనే ఉంది అంతా. మీరు అందుకే పుట్టేరు
   కానివ్వండి మరి
   ధన్యవాదసహస్రాలు

   • జీవితమే సఫలమూ! రాగ సుధాభరితము ప్రేమకదా మధురమూ!

 • జీవితమే సఫలమూ! రాగ సుధాభరితము ప్రేమకదా మధురమూ!

 • జీవితమే సఫలమూ! రాగసుధా భరితము! ప్రేమకదా మధురమూ!

 • కాకినాడ అక్కయ్య గారూ!

  భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకంలోని “అద్వైతం సుఖ దుఃఖయో రనుగతం” అన్న శ్లోకం గురించి డా. రామడుగు వేంకటేశ్వరశర్మ
  గారు రాసిన వివరాలు క్రింద పొందుపరుస్తున్నాను. “ఇయం గేహే లక్ష్మీ ఇయం అమృత వర్తిర్నయనయోః” శ్లోకం గురించి మీ సోదరి డా. తుమ్మలపల్లి వాణీకుమారి గారిని అడిగి తెలుసుకుని రాస్తాను.

  అద్వైతం సుఖదుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసుయత్
  విశ్రామో హృదయస్యయత్ర జరసా యస్మిన్నహార్యోరసః
  కాలేనావరణాత్యయా పరిణతేయత్ ప్రేమ సారే స్థితం
  భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హితత్ ప్రార్థ్యతే

  దాంపత్య వైశిష్ట్యాన్ని చెప్పిన ఈ శ్లోకం భవభూతి మహాకవి రచించిన ఉత్తర రామచరిత్ర నాటకంలోనిది. సుఖదుఃఖాలు రెండింటిలోనూ ఎడబాయకుండేదీ, మనస్సు విశ్రాంతి తీసుకునేదీ, ముసలితనం వచ్చినా రుచి తగ్గనిదీ దాంపత్యం. ఉత్తమ సాహిత్యం కూడా అటువంటిదే! దాంపత్యం వలే అట్టి సాహిత్యం కూడా వర్ధిల్లుగాక! ఎన్ని కష్టాలు వచ్చినా దానినే కోరతాను. భద్రం తస్య సుమానుషస్య అనడానికి బదులుగా, భద్రం తస్య సుపుస్తకస్య అనబుద్ధి పుడుతుంది. రామచంద్రుడికి సీత ఎంత ప్రియురాలో రసజ్ఞుడికి మంచి పుస్తకం అంత ప్రియురాలు ఎందుకు కాదు? మంచి పుస్తకం ఇష్టమైన భార్యలాగు పాణిగ్రహణం మొదలు హృదయం పట్టుకు విడవదు. ఇలా సుప్రసిద్ధ భవభూతి శ్లోకాన్ని ఉత్తమ పుస్తకానికీ, సహృదయునికీ అనుసంధానిస్తూ అపూర్వంగా సమన్వయించడాన్ని ఎక్కువమంది వినివుండరు. ఈ సమన్వయం ఏది ఉత్తమ సాహిత్యం? అన్న వ్యాసంలోనిది. ఇది 1954 జాగృతి పత్రికలో ప్రచురితం. అలా కొత్తకోణంతో సమన్వయించినవారు సాహితీవేత్త ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. వీరి కుమారులు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇటీవల ప్రచురించిన సాహిత్య సంచారం గ్రంథంలో ఈ వ్యాసాన్ని కూడా చేర్చారు.

  ~ డా. రామడుగు వేంకటేశ్వరశర్మ

  • రామయ్య గారూ
   థాంక్యూ,ఈ శ్లోకాలు అర్ధాలు నాకు మా గురువులు చెప్పేరు .తెలుసు. ఇక్కడ వివరణ అవసరం లేదని రాయలేదు
   సుపుస్తకస్య అనడం బావుంది. ముఖే ముఖే సరస్వతీ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు