రణగొణ నాగరికత మీద ధర్మాగ్రహం!

పుస్తకానికి రంధ్రాలు ఉంటాయి. లక్షణాలు ఉంటాయి. దాన్ని మైక్రోస్కోప్ కింద  పెడితే – జీవితం కనిపిస్తుంది…పరవళ్ళు తొక్కే జీవితం !!

తివేగంగా  మాత్రమే ప్రయాణించి తీరాలి.

 దూసుకుపోతూన్న కారు కిటికీల  లోంచి అస్పష్టపు గులాబిరంగుగా  రోజాపూవులు మిగిలిపోతాయి.

 మసకబడిన ఆకుపచ్చ –  పచ్చిగడ్డి, మట్టిరంగులోవి ఆవులు, తెల్లవి బహుశా ఇళ్ళూ …కావచ్చు. అయితేనేం కాకపోతేనేం – ఏమీ తేడా లేదు, ఎవరికీ వాటితో పనీ లేదు.

అంత హడావిడిగా వెళ్ళి చేయవలసినదేమిటి ?

ఏమీ లేదు. ఉండదు.

తీరికగా పుస్తకాలు పట్టుకు చదువుకునే కాలం, దిక్కులు చూస్తూ నడిచే కాలం -ఏనాడో దాటిపోయింది.  ఏదైనా అప్పటికప్పుడు తేలిపోవాలి.  అందుకు మార్గాలు కనిపెట్టేశారు.  పరుగులు పెట్టాక మిగిలే కాలాన్ని బుర్ర తక్కువతనాలతో నింపేశారు.

మనుషులంతా అన్నింటా సమానం గా పుట్టకపోవటం సృష్టిలోని అపరాధం – సరిచేసేశారు దాన్ని – తలకొట్టి కొలవటంగా.

 1953 లో – అమెరికాలో అప్పటికి పూర్తయిన రేడియో విప్లవం, పుంజుకుంటూ ఉన్న టెలివిజన్ దుమారం – వీటి మధ్యన, ద్రష్ట అయిన  రచయిత Ray Bradbury రాసి ఇచ్చిన హెచ్చరిక Fahrenheit 451 నవల.  మేధావి అనే మాట ఒక తిట్టు వంటిది అయిపోయాక – పరుగెత్తగలవారూ బాగా గంతులేయగలవారూ ముఖ్యమైపోతున్న సంస్కృతి పట్ల రచయితది ఎల్లలు లేని ధర్మాగ్రహం.  ఆయన శక్తి మొత్తమూ వ్యంగ్యపు వాహికలలో ప్రవహించి ఘనీభవించిన దాఖలా ఈ పుస్తకం.

ఈ నవలను జోస్యం చెప్పటం గా రాయలేదనీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకేననీ ఆయన చెప్పుకున్నారు. కాలం నిర్ణయించింది  చాలా జరిగింది – కొంత జరగలేదు.  ఎంత జరగకుండా ఉంటే ఆయనకు అంత తృప్తి.  పెద్ద పెద్ద వాల్ పానల్ ల టెలివిజన్ సెట్ లనీ, చెవుల్లో దూర్చేసుకుంటే పరిసరాలకు బధిరులను చేసే ఇయర్ సెట్ లనీ యాభై అరవై  ఏళ్ళ నాడు రచయిత ఊహించారు.  డిజిటలైజ్ అయిన పుస్తకాల గ్రంథాలయమంతా అర చేతిలో ఇమడటాన్ని దర్శించలేదు.  మరణించే రాత లేని అక్షరం అలాగ, మరింకొకలాగ – బతికే ఉంది.  ఆయనవీ Roald Dahl వంటి మరికొందరివీ ప్రమాదఘంటికలు ఠంగున మారుమ్రోగాక ఆమాత్రం బుద్ధి మిగిలింది – నిలుస్తుందా? ఇది ఇంకా ఇరవై ఒకటే, ఈ కథది  ఇరవైమూడో శతాబ్ది.

 నవల రాసిన కొన్నేళ్ళకి – 1950 ల చివరలలో, ఒక పార్క్ లో తాను చూసిన సంఘటనను వేదనతో వివరించారు.  ఒక జంట వాళ్ళ కుక్క తో నడుస్తూ ఉన్నారట – ఆ స్త్రీ చెవి లో ఇయర్ ఫోన్- దానికి సంధించబడి ట్రాన్సిస్టర్.  ఆవిడ భౌతికం గా మాత్రమే అక్కడుంది- ఎక్కడో దూరాన ఉన్న ‘ఇతరులు’ చెప్పేదే వింటోందిట.  భర్త మీదా కుక్క మీదా దృష్టి లేదు. ఇది ఇవాళ మనకి మూడు నాలుగింతల  సాధారణం.  ఇద్దరికీ రెండు చెవులలోనూ ఇయర్ ఫోన్ లు ఉంటాయి – కుక్క ఉండకపోవచ్చు …అసలు వాళ్ళు షికారుకే రాకపోవచ్చు.

 

 దాదాపు ప్రతి వాక్యాన్నీ ఉదహరించి చెప్పవలసిన పుస్తకాలు ఎన్నో ఉండవు, ఇది ఖచ్చితంగా అవును. నిద్రపోయేవాళ్ళనీ పోవాలనుకునేవాళ్ళనీ నిద్ర నటించేవాళ్ళనీ ఒక్క ఊపు ఊపుతారు.

“మన పాటికి మనల్ని వదిలేయటం కాదు – అప్పుడప్పుడైనా మనం చికాకు పడాలి.  ఎన్నాళ్ళైంది నువు చికాకు పడి – నిజంగా ముఖ్యమైన విషయం గురించి ? ’’

     Fahrenheit 451 అనే ఉష్ణోగ్రత ని పుస్తకాలు వాటంతట అవి అంటుకుని తగలబడిపోగలదిగా రచయిత చెబుతారు. (అది 424-475 మధ్యలో ఉంటుందని శాస్త్రం అంటుంది.)

ఆ అస్తవ్యస్తపు భవిష్యత్తు లో,  firemen  బాధ్యత పుస్తకాలని వెతికి తగలబెట్టటం.  మనం అగ్నిమాపక కార్మికులు గా పిలుచుకుంటాము గాని ఇంగ్లీష్ లో firemen  అని మాత్రమే అంటారు.  కథాకాలానికి,  అసలొకప్పుడు వాళ్ళు మంటలని ఆర్పుతూండేవారనే సంగతే ఎవరికీ తెలియదు – ఇళ్ళన్నీ fireproof గా కట్టటం మొదలై ఎంతకాలమో అయిపోయింది. వాళ్ళ లక్ష్యానికి అనుగుణం గా చరిత్రనూ మార్చి ప్రచారం చేస్తారు.  Benzamin Franklin అమెరికన్ స్వాతంత్ర్య  సమరం  లో భాగం గా బ్రిటిష్ పుస్తకాలని తగలబెట్టించాడని.  ఇలా ఏవేవో.

  శతాబ్దాల వెనుక  అలెక్జాండ్రియా గ్రంథాలయాన్ని తగలబెట్టారు – మనకి లాగే రచయిత ఆ విషయాన్ని తలచుకుని భరించుకోలేరు.  ఎప్పటికీ.  ఆ తర్వాత నాజీ లు పుస్తకాలు తగలబెట్టారు.  ఇంకా తర్వాత యు ఎస్ ఎస్ ఆర్ లో స్టాలిన్ అధ్వర్యం లో.  హిరోషిమా నాగసాకి ల పైన వేసిన ఆటమ్ బాంబు లు రచయితను భీతికి గురి చేశాయి.  ఒక ఎదురు లేని రాజ్యం గా తన దేశం తయారయితే, అది మానవ అహంకారాన్ని ఎన్నో రెట్లు హెచ్చవేస్తే – ఆ అన్యాపదేశపునియంత్రణ, conditioning   ఎంత దూరం పోతుంది? ఆ పైన ఏమవుతుంది?

అర్థం లేని, శుద్ధ అనవసరమైన పరుగును  అందరికీ విధించటం. చవకరకం వినోదాన్నే సర్వత్రా అందించటం.  అధికమైన ,విభిన్నమైన – అన్నిటినీ చెరిపివేయటం.  కళారూపాలలో నిండుగా  నీళ్ళు కలపటం.  వాటి ఒకప్పటి ఆకృతులను పూర్తిగా నాశనం చేయటం.

  

“ఇళ్ళముందు  ఇప్పుడు వసారాలు లేవు. ఒకప్పుడు ఉండేవట …. రాత్రుళ్ళు , నిద్రపోక మునుపు, జనం అక్కడ కూర్చునేవాళ్ళట.  మాటాడుకుంటూనో ఊరికే ఉండేందుకో.  వసారాలు అందం గా ఉండవని కట్టటం మానేశారంటారు గాని విషయం అది కాదు.  అలా ఏ పనీ చెయ్యకుండా – కబుర్లాడుకుంటూనో ఆలోచించుకుంటూనో ఉయ్యాలలు ఊగుతూనో …అది ‘ సరైన ‘సంఘ జీవనం కాదూ అని తీర్మానించినందువల్ల.  అంతెక్కువ మాట్లాడటమా…అంతంత ఖాళీ సమయమా !!

గుండీలకి బదులుగా జిప్లు.  దుస్తులు వేసుకునేప్పటి ఆ కాస్తపు నిదానమూ అంతమైంది. ఏమైనా తలచుకోగలిగే ఆ కొంచెపు తీరికా మాయమైంది.

 ఇవాళ జనం దేని గురించి మాట్లాడుకుంటారు …దేని గురించీ కాదు. దుస్తులూ కార్ లూ ఈతకొలనులూ – వాటిపేర్లూ వివరాలూ, అవి ఎం- తెంత బావుంటాయో…ప్రతి వారూ వాటి గురించే.  వీసమెత్తు తేడా ఉండదు.’’

   ”పుస్తకాలు మనం ఎంత వెర్రి వాళ్ళమో, ఎటువంటి గాడిదలమో చెప్పేస్తాయి. సీజర్ ను కూడా ‘నువ్వేదో ఒకనాటికి చస్తావోయ్ ‘ అనగల శక్తి వాటికి ఉంటుంది . …. పుస్తకమొక తుపాకీ, దట్టించి ఉంచింది,  పక్క ఇంట్లోది –   చదువుకున్నవాడి గురి ఏ వైపో  ఎందుకనో ఎవరు చెప్పగలరు అసలు? ఎందుకు risk ?” 

”ఏ మనిషీ political గా బాధ పడకూడదనేది నీ ధ్యేయమనుకో – నాణానికి రెండో వైపుని వాళ్ళకి చూపెట్టకు.  అసలే వైపునీ చూపించకపోతే మరీ మంచిది.  యుద్ధం అనేది ఒకటి ఉంటుందని వాళ్ళకి తట్టనే కూడదు.  ప్రభుత్వపు అసమర్థత, పన్నులు ఎక్కువవటం – ఇట్లాంటివాటి గురించి కాస్త కాస్త బాధ పడచ్చు, పర్వాలేదు గాని, అంత మాత్రమే.  వాళ్ళు తేలికగా గెలవగలిగే పోటీ లు పెట్టండి – ప్రఖ్యాత గీతాలలో పదాల గురించో, రాష్ట్రాల రాజధానుల పేర్లో, కిందటేడు ఫలానా రాష్ట్రం లో మొక్కజొన్న ఎంత పండిందో – ఇలా.

ఎప్పటికీ తగలబడని సమాచారాన్ని ఇవ్వాలి, ‘నిజాల’ తో వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చెయాలి –  కొం- చెం అసౌకర్యమైతే అవచ్చు గానీ ఎంతో విజ్ఞానం సంపాదించుకున్నామని అనుకుంటారు – చాలు.  వాళ్ళు ఆలోచిస్తున్నామని అనుకుంటారు, కదలకుండానే కదులుతున్నామనేసుకుంటారు …”  

     90 ల చివరల్లో టీవీ వ్యాఖ్యాత లకి ప్రేక్షకులు  ఫోన్ చేసే కార్యక్రమాలు మొదలైనప్పుడు చాలా ఆశ్చర్యమనిపించేది. ముక్కూ మొహం తెలియని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఏ విషయం గురించి ??

‘ ఏమైనా’ మాట్లాడుకోవచ్చునని నిరూపించబడింది.  ఆ పోచుకోళ్ళ నుంచే పట్టు చీరలూ బహుమతులూ…క్షణం లో అర భాగం ఆగని ఎఫ్ ఎం రేడియో ల  వాగుడూ ఆ తర్వాత మొదలయాయి. ఇదంతా ఈ గొప్ప రచయిత కాలజ్ఞానం గా రాసిపెట్టారు.

ఆహా- ఏమి నియంతృత్వం, మెజారిటీ మనుషులది !!! అందరి చేతిలో వాద్యాలు ఉంటాయి, ఏ చెవితో వినాలన్నది నువే తేల్చుకోవచ్చు.

”ఆ రణగొణధ్వనులలో నీ మాట ఎవరికీ వినబడదు, ఆ ప్రశ్నే లేదు- అరుపులే జీవనశైలి.”

  1940 ల టాకీ ల బాధనే  పడలేక, ఆ noise ను భరించలేక, ”ఎక్కడన్నా subtle  గా ఒక్క చూపు, ఒక్క మాట ..” అని చలం గారు దిగులుపడ్డారు.  

   

     కథాకాలానికి ముందు రెండు అణుయుద్ధాలు జరిగిపోయి ఉంటాయి, అందులో ఆ దేశమే గెలిచి ఉంటుంది.  మనుషులందరి పైనా సమానత్వం రుద్దటం మొదలై ఉంటుంది.  పుస్తకాలలో జ్ఞానం ఉంటుంది, చదివినవాళ్ళకి అది వస్తుంది – వాళ్ళుతక్కినవారికన్నా అధికులనిపిస్తారు …అలాఉండకూడదు.  ‘అన్నీ అందరికీ అందాలి. ‘  అందుకు పెద్ద గ్రంథాలని సంక్షిప్తం చేయాలి – ‘చదివేసిన’ అనుభూతిని అందజేయాలి.  ఆ కాలపు Abridged editions  నీ Condensed books నీ రచయిత ఉద్దేశిస్తారు.  క్రమేపీ వాటి అవసరమూ తగ్గిపోయి – కామిక్ లూ అతి తేలికపాటి పుస్తకాలూ శృంగార పత్రికలూ మాత్రం మిగులుతాయి.  ఆ తర్వాత అవీ అంతరించి ఆ స్థానాన్ని టెలివిజన్ భర్తీ చేస్తుంది.

కథానాయకుడి పేరు Guy Montag .. Montag  అనే పేరుతో కాయితం తయారీదారులు ఉన్నారు.  అది రచయిత వ్యంగ్యం. ఎ క్కడెక్కడ ఎవరు చట్టవిరుద్ధం గా పుస్తకాలు దాచిపెట్టారో వెతికి వాటిని తగలబెట్టే బృందంలో అతను సభ్యుడు.  Phoenix  పక్షి నీ Salamander నీ చిహ్నాలుగా అతను ధరించి ఉంటాడు.  రెండూ నిప్పు కి గుర్తులు. Salamander కి ఒక అర్థం కొరివి దయ్యం – ఒకభ్రాంతి.  లేని చోట మంట ఉందనిపించేది.  Phoenix తన చితిలోంచి తానే కొత్తగా తిరిగి తిరిగి పుడుతూంటుంది.

‘’అది క్రీస్తుకి ముందరి కాలం నుంచీ అలా చేస్తూనే ఉంది” అని రచయిత అంటారు.  సాహిత్యపు హితం మతానికి మించి అవతల.  నిరవధికంగా.

ఒక రోజు- చాలా పుస్తకాలతో ఒక పెద్దావిడ పట్టుబడుతుంది.  వాటితోబాటు తగలబడిపోతానని అలాగే అయిపోతుంది. అప్పటిదాకా మామూలుగానే ఉన్న Montag  మనసులో ఏదో కలవరం.  ఏమిటి ఆవిడ తీవ్రత ? ఎందుకు? ఏముంటుంది పుస్తకాలలో ??

ఇంట్లో అతని భార్య Mildred ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగేసి ఉంటుంది.  ఏమాత్రం హృదయం కనికరం కనిపించని వైద్య సిబ్బంది వచ్చి ఆమెని బతికిస్తారు – చాలా యాంత్రికం గా.  అవును, ఒక పెద్ద పాము లాంటి యంత్రం సహాయం తో.  ఖర్మేమిటంటే ఆ మాత్రలు కావాలని మింగిందో పొరబాటున మింగిందో ఆమెకే తెలియదు.  నిర్లిప్తంగా ,  Parlor లో మూడు గోడల పైనా నిరంతరం గా కొనసాగే టెలివిజన్ ప్రదర్శనలు చూస్తూ ఉంటుంది.  నాలుగో గోడకి కూడా పెట్టించమని భర్తని అడుగుతుంది …ఖర్చైనా సరే.

  వాన చినుకులని ఇష్టం గా చప్పరించే పదిహేడేళ్ళ పిల్ల Clarisse  కథ లోకి వస్తుంది.  బడికి వెళ్ళటం విసుగుపుట్టి ఆరుబయట తిరుగుతూంటుంది.  Montag, ఆమె – స్నేహితులవుతారు.  ”నువ్వు నాకు ఎప్పటినుంచో తెలుసనిపిస్తోందేమిటి ?” అని అతను అడుగుతాడు.  ”నువ్వంటే నాకు ఇష్టం. నీ నుంచి నాకేమీ అక్కర్లేదు – అందుకేమో ” అని జవాబు చెబుతుంది.  ఆమె ఒక దర్పణం లా అనిపిస్తుంది.  మనల్ని మనకే వెలిగించి చూపించటం ఎంతమంది చేయగలరని !  అతనిలోపల తెలియకుండా ఉండిపోయినవి, బహుశా తనవీ కాని పురాస్మృతులు , ఒకానొక రమ్యమైన ఎరుక – కలిపి ఆ పిల్ల.  ఆమె అతనిలో దేన్నో గుర్తు పడుతుంది.  నువ్వు అందరిలా కాదూ అంటుంది. ‘చూడటాన్ని’ నేర్పిస్తుంది.  ఆ సమాజం లో ఆమె ఎలా బ్రతికి ఉందా అని అతనికి ఆశ్చర్యం.  ఉండదు, ఎంతో కాలం.

తన ఒక దాడిలో దొరికిన పుస్తకాన్ని దాచుకుంటాడు.  భార్యా ఆమె స్నేహితురాళ్ళూ టీవీ చూస్తున్నప్పుడు కవిత్వం చదువుతాడు.  వాళ్ళు కంగారు పడిపోతారు.  టెలివిజన్ లో వాళ్ళే తన ‘కుటుంబం’ అని భార్య వచ్చి కలవమంటుంది.” వాళ్ళకి నీ మీద ప్రేమ ఉందా ?” – అతను అడుగుతాడు.

 ఇంకా ఇంకా , దొరికిన పుస్తకాలు తెచ్చి దాచుకుంటాడు. ఎప్పుడో పరిచయం ఉన్న ప్రొఫెసర్ Faber  తో మాటలు కలుపుతాడు. ( Faber Castell అనేది పెన్సిల్స్ తయారు చేసే సంస్థ, ఇది ఇంకొక ప్రతీక ). Faber  అతనికి చాలా చెబుతాడు. ”నువ్వు వెతికేది పుస్తకాలని కాదు, ఇంక దేన్నో.  ఎక్కడ దొరుకుతుందో చూడు – పాత సినిమాలు, పాత రికార్డ్ లు, పాత స్నేహితులు…ప్రకృతి…నువ్వు- ఎక్కడోక్కడ.  మనం మరచిపోతామేమో అనిపించేదాన్ని దాచుకున్న కోశాలు పుస్తకాలు.  వాటిలో గొప్పేమీ లేదు – అవి చెప్పేదానిలో ఉంది.  విశ్వపు ఆ ముక్కలన్నిటినీ అతుకు వేసి కుట్టి ఒకే వస్త్రం గా మనకి ఇవ్వటం లో ఉంది.  నీకిదంతా తెలియదు, నేను చెబుతూన్నా అర్థం అవదు – పోయేదేం లేదు. నీ స్ఫురణ సరైనది – సరిపోతుంది….ఖచ్చితం గా అవుతుందా అని అడగకు. మనిషీ యంత్రం లైబ్రరీ – వేటివల్లా ‘ రక్షించబడాలని’  కోరుకోకు.  నీ రక్షణ కి నువే ప్రయత్నించు – ఒకవేళ మునిగినా ఒడ్డు వైపుకి ఈదుతున్నాననే స్పృహ తోనే మునిగిపో.”

భార్య అతని రహస్యాన్ని పట్టి ఇస్తుంది…అతని పై అధికారి వస్తాడు. Beatty.   అతని మాటలు చాలా జాగ్రత్తగా చెప్పుకొస్తారు రచయిత.  ఆ పరిస్థితి పట్ల అసహనం, అసహ్యం – పుస్తకాల మీది ఒకప్పటి ప్రేమ, దాన్ని అణచుకోవలసి రావటం …ఇదంతా అతని విధి నిర్వహణా సంభాషణ తో మేళవించి రాయటం గాఢంగా ఉంటుంది.

“నువ్వూ నేనూ మనందరం సంతోష కార్మికులం Montag !  సిద్ధాంతాలలోనూ ఆలోచనలలోనూ వైరుధ్యాలు చూపెట్టి వ్యాకులతకు గురిచేసే ఎటువంటి తరంగాలనైనా అడ్డుకుందుకే మనం ఉన్నాం.  తెలుసుకో..’’

“టెలివిజన్ అన్నది ‘నిజం.’  దానిది తక్షణమైన చేరువ.  కొలవగలిగే తీరు.  నువ్వు ఏమి ఆలోచించాలో నిర్ణయించి నూరిపోస్తుంది.  అది సరైనదే అయిఉండాలి.  సరిగానే అనిపిస్తుంది.  దాని నిర్ణయాలవైపు నిన్ను తోసుకు పదమంటుంది..’ ఏమిటి ఈ చెత్తంతా ‘ అనుకుందుకు వీలే ఉండదు.

“అరే, ఏమిటి ఈ నవలలు అన్నీ? ఎవరెవరో నిజం గా లేని మనుషుల వేదనలన్నీ మనమెందుకు మీదేసుకోవటం? కొన్ని పుస్తకాలు మెజారిటీ కి నచ్చవు, ఇంకొన్ని మైనారిటీ కి పడవు. ఎందుకొచ్చిన తంటా ఇది? తగలబెట్టండి.  ప్రతివారూ పక్కవారికి లాగే ఉండాలి.  అప్పుడిక ఎక్కవలసిన కొండలు ఉండవు, ఎక్కలేని బెంగా ఉండదు.’’

“ఇదంతా ప్రభుత్వం చేసిందనలేం. నిర్ణయాలూ తీర్మానాలూ కత్తిరింపులూ …అలా ఏం కాదు. సాంకేతిక పరిజ్ఞానం, మూక ఎత్తు లాభాపేక్ష , అల్పసంఖ్యాకుల ఒత్తిడి – అంతే. జరిగిపోయింది.  అసలుపుస్తకాలు తగలెట్టటం అవసరమయే పరిస్థితి లేదు…జనం వాటిని చదవటం ఎప్పుడో మానేశారు.

 కాస్త ఎక్కువ జాగ్రత్తపడుతున్నాం -ఇలా.”

ఇంచుమించు స్వచ్ఛందం గా ఆ పై అధికారి Montag  చేతిలో మరణిస్తాడు.  అరాచకం సృష్టించేవాళ్ళని పట్టుకు కరిచి చంపే ‘లోహ శ్వానం’ ఒకటి ఉంటుంది – దానికి తన పొడ అందకుండా Montag దుస్తులు మార్చుకుని నదిలో పడి ఈదుకుని అతను అవతలిగట్టు చేరతాడు.

  రచయిత ఆశ, విశ్వాసం ఆ ముగింపు లో ఉంటాయి.  ప్రభుత్వవ్యతిరేకులైన మేధావులు చాలా మంది చేరి ఉంటారు అక్కడ.  ఒక్కొక్కరూ ఒక్క పుస్తకాన్ని కంఠస్థం చేసి ఉంటారు…బైబిల్ సువార్త ల తో సహా.  మంచి కాలం వస్తుంది, మళ్ళీ మొత్తం నిర్మితమవుతుంది – అప్పటిదాకా ఆ జ్ఞానాన్ని నిలిపి ఉంచటం వాళ్ళ పని.  ఆశ్చర్యకరం గా, Montag  కి కూడా ఒక పుస్తకం నోటికి వచ్చేసి ఉంటుంది- అప్పజెప్పుకుంటాడు.  అట్లా ‘సంత’ లు చెప్పుకుంటూ ‘చింతన’ చేసుకుంటూ శృతమైన దాన్నంతా వాళ్ళు సజీవం గా ఉంచుకుంటారు.

పునఃప్రారంభం అనంతరం దర్పణాలని ముందు తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

అవును. తామేమిటో ముందు తెలిశాక – తర్వాత.

ఆఖర్న, నగరం మీద బాంబుల దాడి.  అంతా నాశనం.

అప్పుడిక నిశ్శబ్దం, శబ్దం జన్మించేవరకూ.

                                        

” ఇలాంటి పుస్తకాలు ఎందుకు ముఖ్యమో తెలుసా ? వీటిలో ‘ నాణ్యత ‘ ఉంటుంది.  అంటే ఏమిటంటావు ? నాకైతే అది ‘ అల్లిక.’ పుస్తకానికి రంధ్రాలు ఉంటాయి. లక్షణాలు ఉంటాయి.  దాన్ని మైక్రోస్కోప్ కింద  పెడితే – జీవితం కనిపిస్తుంది…పరవళ్ళు తొక్కే జీవితం!!  ఎన్ని ఎక్కువ రంధ్రాలు ఉంటే – చదరపు అంగుళం కాయితంలో ఎంత జీవన వైవిధ్యం నిజం గా నిక్షిప్తమయితే,  ఆ పుస్తకానికి  సాహిత్యపు విలువ అంత ఎక్కువ…నాదైతే ఇది, నిర్వచనం.  వివరం …నలగని వాడని వివరం !!! ….

పుస్తకమంటే ఎందుకంత భయమో తెలిసిందా?  జీవితపు రంధ్రాలన్నీ అందులో కనిపించేస్తాయి.  సౌకర్యవంతం గా ఉండాలనుకునేవారికి రంధ్రాలు ఉండకూడదు …మైనం లాగో నిండు చందమామమ లాగో నున్న- గా ఉండాలి అంతా.’’

  అసలైన వివేకం , వైశాల్యం ఈ మాటల్లో ఉన్నాయి    – ”పుస్తకాలలో ఏవైతే ఉన్నాయో – ఆ సూక్ష్మమైన వివరం,  ఆ స్పృహ..వాటిని ఈ కొత్త మాధ్యమాల ద్వారా కూడా ప్రకటించే వీలు ఉంది …’’

కాని అలా ఎందుకు జరగటం లేదు? అదీ ఆయనే ఊహించారు…”Attention span ఉండదు ..సత్వరం గా, తక్షణమే , సమాచారాన్ని రవాణా చేయటం జరిగిపోతుంది. ఆ సంచలనాన్ని ఎవరూ తిరస్కరించరు, అలవాటైపోతుంది,అవసరమైపోతుంది.”

ఈ నవల ఒక జాగ్రత్త.   తార్కికమైన శుభాకాంక్ష కూడా.

“మన నాగరికత దాన్ని అదే  చిలికి ఛిద్రం చేసేసుకుంటోంది – దాని కేంద్రం నుంచీ వీలైనంత దూరంగా నిలుచో.’’

“ మనుషులకి నువేమీ వినిపించలేవు – వాళ్ళే వినదలచుకోవాలి… ఏమైందో తమ చుట్టూ ప్రపంచం ఎందుకు పేలిపోయిందో వాళ్ళకే ప్రశ్నించాలనిపించాలి – అనిపిస్తుంది.”

 

 

మైథిలీ అబ్బరాజు

మైథిలీ అబ్బరాజు

ఈకాలానికి దక్కిన కడిమిచెట్టు మైథిలి సాహిత్యం! కథ రాసినా, విమర్శ రాసినా తన చుట్టూరా నిమగ్న ఆవరణని సృష్టించే సహృదయి.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అట్లాస్ Shrugged తరువాత అంత బలమైన కాన్సెప్ట్… ThankYou Mam నైస్ రివ్యూ

  • బాగుంది మైథిలి గారూ ఒక సారి చదివాను మళ్ళీ చదవాలనిపించేలా చెప్పారు.

  • Wow , నా అభిమాన రచయిత ఈయన.

    ఈయన గురించి మీరొక్కరే ఇంత బాగా పరిచయం చెయ్యగలరు. Thank you so much for this article

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు