ముళ్ల గోరింట

“ఈ మడిసి శానా దిగులు పడతా ఉండాడత్తమ్మా! సేతికొచ్చిన పంట నిష్కారణంగా బూడిదై పాయె . మడిసి సూడబోతే కాలు ఇరగ్గొట్టుకోని ఇంట్లో కూసుండాడు. తొందరగానే తగ్గి పోయిద్ది లే అని ఎంత సెప్పినా ఇనక పాతుండె! నువ్వో మావయ్యో దైర్నం సెప్పాల.మొన్న పురుగు మందు డబ్బా పట్టుకోని కుసోనుండాడు. గుండెల్లో రాయి బడి పాయె ” జయమ్మని కావిలించుకుని ఏడ్చింది సావిత్రి

రెణ్ణెల్లు  గా వీరయ్య ఇంట్లో పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇంట్లో పిల్లగా పెరిగిన వీరయ్య మరదలు పధ్నాలుగేళ్ళ పద్మని వీరుల పండగ రోజు అందరూ తిరణాల్లో మునిగి ఉండగా, సుబ్బారెడ్డి వాళ్ళ చేలోకి లాక్కు పోయి రేప్ చేసి  చంపేశారు.

సావిత్రి తల్లి చచ్చి పోయాక ఒంటరై పోయిన పదేళ్ల  పద్మ ను  సావిత్రి కంటే ముందే వీరయ్య చేరదీసి గుండెల్లో దాచుకున్నాడు. మనతో పాటే ఒక ముద్ద తిని పడుంటది లే అని ఇంటికి తెచ్చాడు.
పోయేనాటికి  పద్మ తల్లి దగ్గర ఆస్తి ఏమీ లేదు.   కూలికి పోతేనే తిండి
“పద్మని మనింటికి తెచ్చుకోవాల్సిందే, లేదంటే గొంతు పిసికి చంపనన్నా చంపాల” అని మొగుడితో చెప్పడానికి సర్వ శక్తులూ కూడదీసుకుంటున్న సావిత్రికి వీరయ్యే పద్మని ఇంటికి తీసుకెళ్దామనడంతో సంతోషంతో మతి పోయింది.
తండ్రి అంటే తెలీని పద్మ వీరయ్య గారాబానికి నిలువునా పడి పోయింది.

ఊ అంటే బావ! ఆ అంటే బావ! సావిత్రి మాట కూడా వినేది కాదు. ఏమైనా అంటే వీరయ్యకి ఫిర్యాదు.  “పసి పిల్ల, దానికేం దెల్చు? ఏమనబాక! దాన్ని అరిచావంటే దవడ పగల్నూకుతా” అని సావిత్రికి తిట్లు

సావిత్రి అత్తా మావా వేరే ఇంట్లో ఉన్నా, పద్మ అక్కడికి కూడా పోయి పనంతా చేసి పెట్టేది. మావ కి కూడా ఆ పిల్లంటే గారాబమే! “ఇది ఏ గడప లో ముగ్గు పెట్టుద్దో గానీ , ఆ ఇంట్లో ఇంగ దీపాలెందుకే. మట్టసమైన పిల్ల” అనేవాడు మురిపెంగా

అట్టాంటి పిల్ల అర్థాంతరంగా అన్యాయంగా చచ్చిపోతే సావిత్రి కంటే వీరయ్యే ఎక్కువ దిగులు పడి సగమై పోయాడు. వూర్లో అడుక్కుంటూ తిరిగే బట్టల పిచ్చోడిని, తాగుబోతు సుబ్బయ్యనీ, మాచర్ల రోడ్లో మొక్క జొన్న కండెలు అమ్మే సైదాని ఇంకా నలుగురైదుగుర్ని పట్టుకోని తర్వాత వదిలేశారు.

 పిల్లను ఎవరు పొట్టన బెట్టుకున్నారో మాత్రం తేల్లా వీరయ్యను కాపాడుకోవడం కష్టమై పోయింది సావిత్రికి. “నా కడుపులో చిచ్చు పెట్టి పొయ్యావే పద్నా” అని ఒకటే ఏడుపు.  రోజు కాస్తయినా తాగి ఇంటికొచ్చే మడిసి ఆ ఊసే మర్చిపోయాడు. పొలంలో దిగులుగా కూచుంటాడు. ఇంటికొస్తే మాట్టాడ్డు.

పద్మ స్కూలు కాడికి పోయి, అది అన్నం తినే చెట్టు కింద మజ్జానం కూచోని వొస్తాడు.

పద్మ ఫొటో కాడ రోజూ తనే దీపం పెడతాడు. “నిన్ను రచ్చించుకోలేక పోతిమే నా తల్లీ, ఎవుడి మొహానో పెట్టి నీళ్ళు పోశామే పద్నా” అని చీకట్లో కూచుని ఒక్కడే మాట్టాడుకుంటూ కుసుంటాడు

ఈ దిగులు మర్చిపోక ముందే పిల్ల పోయిన  నెలకి  కుప్ప నూర్చిన ధాన్యం ఇంటికి రాకుండానే పొలంలోనే తగలబడి పోయింది రాత్రికి రాత్రే . ఎట్టా జరిగిందో ఎవురికీ తెలీక పాయె, అయిదెకరాల వొడ్లు ఇంకో వారానికి కోడె దూడని ఎవురో దొంగతనం చేసి ఎత్తక పోయారు. దూడ లేక బర్రె పాలియ్యడం మానేసింది. చేట పెయ్య కిటుకు దాని కాడ పారలా

పేట లో మల్లమ్మ సెంటర్లో పనుందని పోయి రాత్రేళ లాస్టు బస్సు దిగి వొస్తా ఉంటే, ఎవురో దొంగ నాయాలు కర్రతో కాలి మీద కొట్టి కింద పడేసి జేబులో అయిదేలూ  లాక్కోని పొయ్యాడు. మోకాలు కింద గా ఇరిగింది బొమిక ఇప్పుడిప్పుడే కాస్త అడుగులు వేస్తా నడుస్తున్నాడు

ఇవన్నీ తట్టుకోలేక సావిత్రి అత్త కి చెప్పుకుని ఏడ్చింది

“ఏమోనే, నువ్వు అంటా వుంటే నాగ్గూడ బయ్యంగానే ఉంది. పురుగు మందు సంగతి మీ మావకు చెప్పమాక! బయపడతాడు” జయమ్మ గాభరా పడింది

###
కళ్ళ్లలో నీళ్ళు ఇంకి పోయేదాకా ఏడ్చి, మౌనంగా మెట్ల మీద కూచుంది  సావిత్రి

కళ్ళు మూసినా తెరిచినా పద్మ మొహమే కళ్ళముందు మెదులుతోంది. మాయిటేళ పాలు తీద్దామని పోతే ముళ్లగోరింట పొద కాడ పూలు కోస్తా ఉంది. దడుచుకోలేదు తను. “పద్నా, మేయ్ పద్నా, నా తల్లే ఈడుండావా ” అని ఏడుస్తూ పాల గిన్నె అవతల పారేసి అదాటున లేచి ముళ్ల గోరింట వైపు పరిగెత్తింది. మొగుడు  వచ్చి, ఇంట్లోకి లాక్కొచ్చే దాకా అక్కడే పడి ఉండి పోయింది.

మొన్నొక రోజు గూడ అట్టనే అయింది. బరెగొడ్లు జీతగాడు ఇంటికి తోలకొచ్చే టయానికి, ముగ్గు డబ్బా తీసుకోని సందులోంచి తిరిగొస్తా కనపడింది. ఎర్ర పూల పరికిణీ  యేసుకోనుంది ఆ రోజు. తెల్ల కాలర్ చొక్కా. గబాల్న పోయి సూస్తే, .. లేదు

కుర్చీల ముగ్గు, తాబేళ్ల ముగ్గు, తామర పూల ముగ్గు, ఎన్ని ముగ్గులొచ్చో నా తల్లికి! కళ్ళు మళ్ళీ ఊటబావుల్లాగా నిండి పోతున్నాయి.

సాయంత్రపు మసక చీకట్లో బర్రెల పాక లోంచి దోమలు జుమ్మంటూ మూగుతున్నాయి. విచ్చుకుంటున్న చంద్రకాంత పూల ఘాటు సువాసన గాల్లో వ్యాపిస్తూ, సావిత్రిని కూడా పలకరించింది

గోడవతల నుంచి సరోజిని పిన్ని మాటలు వినిపిస్తున్నాయి “ఇంగ నీళ్ళు పోసుకోని సావండి. పెందలాడే తిని పొణుకుందామని లేదు. ఆ టీవీ ముందే తెల్లవారి పొయ్యేట్టున్నై బతుకులు. నే బోతన్నా! తలకాయి ఒకటే నెప్పి గా ఉంది మజ్జానాల నించి, పొణుకోవాల”

వరండా స్థంభానికి చేరగిలబడి కూచున్న సావిత్రి ఇంట్లోకి తొంగి చూసింది. హాల్లో టీవీ మూగ గా కూచుని ఉంది. ఈ టయానికి పద్మ టివి కాడ  కూసోనుండేది

ఉన్నట్టుండి పెద్ద అధైర్యం  ఆవహించింది. కడుపులో ఏదో ఖాళీ తనం. వేల కొద్దీ పక్షులు రెక్కలు విదులుస్తూ గుండెలోనుంచి ఎగిరి పోతున్నట్టు, గుండె అంతా కెలికిన బాధ

“వామ్మో, పద్నా ….” ఆ సంధ్య వేళ శబ్దం బయటికి రాకుండా, నోట్లో చెంగు కుక్కుకుని ఒళ్ళంతా కదిలి పోఉండగా, తీవ్రమైన దుఖాన్ని కౌగిలించుకుని పొగిలి పొగిలి ఏడుస్తూ ఎవరూ కనపడకుండా ఉండేందుకు, వడ్ల బస్తాల చాటుకు ఒరిగి పోయింది

###

చామన చాయ తో బలమైన రెండు జడలతో, కంటికి దిట్టంగా పెట్టిన కాటుక తో.. పోలేరమ్మ లంగా జాకెట్టేసుకోని వస్తే ఇట్టనే ఉంటదేమో అనిపించే నిండైన అందం
బడికి వెళ్ళే ముందు, బడి నుంచి వచ్చాక ఇంట్లో పనంతా చక చకా అవలీల గా చేసి పడేసే బలమైన పిల్ల. సెలవులిస్తే చాలు, ఇంట్లో పని గబ గబా కానిచ్చేసి మిరగాయలు కొయ్యటానికో, ఇటుక బట్టీ కాడికో పొయ్యి నాలుగు డబ్బులు తెచ్చేది. వీరయ్య బాగా తిట్టేవాడు

“ఇప్పుడు నువ్వు డబ్బులు తెత్తే తప్ప మాయిటేళ కి అన్నం తినం గదూ! ఆ ఎండలో పడి అట్ట బొయ్యేది దేనికమాయ్? పక్కలిరగ్గొడతా నీకు ఇంగ . మేయ్ సాయిత్రీ, సెప్పవేందే? వొయిసులో ఉన్న పిల్ల అట్ట పనులు జెయ్యటానికి  బోవాల్నా? ఇంటో పనంతా మీదేసుకోని జేత్తంది గదా! ఇంగ జాల్లే ఒద్ద్దని జెప్పు ” అని ఇద్దరినీ కలేసి తిట్టడం మామూలే

“అది గాదకా ! కాసిని డబ్బులు దాపెట్టుకుంటే గదా, మనం ఎప్పుడనా పేటకి బొయి సినిమాలు జూసేది? బావ కి అట్టాంటియ్యి ఇస్టముండవు గా? ఆయన్ని డబ్బులడిగితే ఏం బాగుండిద్ది? ఈ సారి కోటప్ప కొండ తిరణాల్లో లేదనుకోకుండా కర్చు పెట్టుకోవాలకా మనం! గాజులు, రిబ్బన్లు, అన్నీ కొనుక్కోవాల. రికార్డింగ్  డాన్స్ ఎప్పుడూ జూళ్ళా! ఈ సారి అది గూడా చూసే వొద్దాం లే. మనూరి ప్రబ తో పాటు పోతే మనోళ్లంతా వుంటారు గా. మనకేం బయ్యం?”

“మేయ్, అయి మనం జూసే డాన్సులు గాదే! మీ బావ ఇన్నాడంటే ఇద్దర్నీ ఇరగనూకుతాడు  బట్టలిప్పి సేత్తారంట అయ్యి ఆళ్లు”

“వాయమ్మో! బట్టలిప్పేదెందుకమోయ్ డాన్సు జెయ్టానికీ?”

“ఒసేయ్, నువ్వు ముయ్! నీకర్దం కాదు గానీ”

ఇల్లంతా నిశ్శబంగా , స్మశానం లాగుంది.  క్షణ క్షణం పద్మ మాటలూ, తగాదాలూ, పని చేస్తూ పాడే సినిమా పాటలూ.. గదుల నిండా గాలితో పాటు పరిగెత్తుతున్నాయ్.

మల్లెపందిరి ఉన్నా, ఆ పూలు పెట్టుకునేది కాదు. మూల బాయి కాడ పడి మొలిచి బాయి నీళ్ల తడికి గుబురు పొదల్లే పెరిగిన ముళ్ల గోరింట మీదే పద్మ ప్రాణమంతా.

సన్నగా బుల్లి శంఖుల్లాగా బంగారు రంగులో ఉబ్బే ఆ మొగ్గల్ని ముందు రోజు సాయంత్రమే కోసి నీళ్లు జల్లి ఉంచేది. పొద్దున్నే బడికి వెళ్ళే లోపు కళ్ళాపి , అంట్లూ ,బర్రెల పనీ చూసేసి, ఏడింటికల్లా ఆ విచ్చుకుంటున్న ఆ మొగ్గలన్నీ చాప మీద పోసి దారపుండ తెచ్చుక్కూచునేది. రెండు జడలూ వెయ్యడం సావిత్రి పూర్తి చేసే సరికి బంగారు పూలు గుది గుచ్చి మాల కట్టేసేది.

రెండు జడలనీ కలుపుతూ వెనుక తోరణంలాగా పెట్టుకునేది.  పది పూలను విడిగా అట్టేపెట్టుకుని, వాటి రేకుల్ని నాలుక మీద పెట్టుకుని లోపలికి పీలుస్తూ బుడగలు చేసి టప టపా నుదురు కేసి కొట్టుకుంటూ పుస్తకాల సంచీ  వూపుకుంటూ బడికి వెళ్ళే దృశ్యం మరపు రాకుండా ఉంది

పద్మ ఎర్ర పూల పరికిణీ దణ్ణెం మీద నుంచి తీసేసింది సావిత్రి. వీరయ్య మంచం మీద జారగిల బడి కాలు మంచం కాళ్ల కట్ట మీద చాపుకున్నాడు. కట్టు విప్పాలంటే ఇంకా నెల పట్టిద్దన్నాడు పిండి కట్టేసిన డాక్టరు.

“పిల్లతోనే మొత్తం సంతోసమంతా పోయింది. ఇంటికి ఎలుగు దెచ్చిన నా బిడ్డా  ఒలుకుల్లో కల్సి పొయినావే ” గొణుక్కుంటూ గుండె మీద రాసుకుంటూ మంచినీళ్ల రాగి చెంబు అందుకున్నాడు వీరయ్య.

నీళ్ళు నిండిన కళ్లతో వీరయ్య వంకే చూస్తూ నిర్జీవంగా కూచుంది సావిత్రి

ఆ కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు

###

రాత్రి బాగా పొద్దు పోయింది, వూరంతా  ఎప్పుడో మాటు మణిగింది. పక్కిళ్ళ వాళ్ళు దేవరం పాడు తిరణాలకు వెళ్లారు. సావిత్రి పరిస్థితి తెలుసు కాబట్టి రమ్మని వాళ్ళూ అడగలేదుకిళ్ళీ కొట్టు  వెంకటేశ్వర్లు  కొడుకుని పంపి మొగుడి కోసం సారా తెప్పించింది సావిత్రి. కాలు బాధ, పద్మ పోయిందనే బాధ కాస్త మరపుకొస్తాయనేమో

“నేను తాగను” మొండికేశాడు వీరయ్య

“సచ్చావు లే, మూసుకోని తాగు. కాస్త నిమ్మళంగా పడుకుంటావు” గ్లాసు లో పోసి అందించింది.

రెండు గ్లాసులు దిగాయి లోపలికి.

మూడో గ్లాసు తాగలేక పోయాడు. ఎందుకో దుఖం వస్తోంది. మింగుడు పడట్లేదు. ఎర్ర పూల పరికిణి లో పద్మ “బావా, ఆదివారం చర్చి కాడ బోజనాలంట, నేను పోతా, ఈరుల పండగై పొయినాక” అంటోంది

“ఇదిగో ఈ గళాసు తాగు, ఇంగ తాగొద్దులే! ఈ ఒక్కటీ తాగు ” గ్లాసు అందించింది సావిత్రి.

“ఏడవమాకే, ఇక తేరుకోవాల మనం” నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు

“పద్మ దెయ్యమై పట్టుకుంది ఈ కొంపని” సావిత్రి మాటలకు విస్తుపోయాడు

“పద్నా? దెయ్యమా? ఏం వాగుతున్నావే ఎర్రి ముండా ! ”

“మరి? వూరికే సేతికొచ్చిన వొడ్లన్నీ కాలి పొయినయ్యా? దూడనెత్తక పొయ్యారా? నీ కాలిరిగిందా? ”
అదీ గాక అదేమైనా వూరక జొరమో గిరమో వొచ్చి సచ్చి పోయిందా? ఎవురో చెరిచి గొంతులో గుడ్డలు గుక్కి బురదలో ఏసి తొక్కారు.  నిలువులా ఉసురు దీశారు . వూరుకుంటదా మరి?”

“నోర్ముయ్యెశె ! ఎవురో సంపేత్తే  మనమీదెందుకే దెయ్యమై పడుద్ది, మతి సెడిందా?”

“నువ్వూ, మీ అయ్యేగా దాన్ని సెరిచి సంపి బురదలో  తొక్కింది? మిమ్మల్ని ఎట్ట వొదులుద్ది?”

వీరయ్య నిలువునా జలదరించి, వొణికి పోయాడు

“సాయిత్రీ, ఏందే.. ఏందే నువ్వసల…”

“ఎక్కువ మాట్ట్లాడబాక. పంపు సెట్టు గదిలో  నీ సొక్కా, మీ నాన పై గుడ్డా అన్నీ బురదా, రక్తమూ పట్టుకోని బద్రంగా ఉన్నై! నీ సొక్కా జేబు లో దాని కాలి పట్టా , రిబ్బనూ జాగర్తగా దాచావెందుకు ? గుర్తు పెట్టుకోవాలనుకున్నావా నా చెల్లెల్ని ?

జాగర్త గానే దాశావు సూర్లో గడ్డి మూట లో తొక్కి! నేను పొడుగు పిడి లిక్కి అవుపడట్లేదని ఆ చూరులో ఎతక్క పోయుంటే, ఎప్పటికీ ఇట్ట ఏడుస్తానే ఉండేవాడివి, నా కూతురా, నా బిడ్డా అని”

సావిత్రి ఎలాటి దుఃఖమూ లేని గొంతు తో అంది

వీరయ్య కి చూపు నిలబడి పోయింది

“ఇంట్లో కళ్ల ముందు పెరిగిన పావురాయి లాంటి పిల్లని చెరిచి ,బురదలో ఏసి తొక్కి తొక్కి ..”

“సాయిత్రీ..”అరిచాడు వీరయ్య. మాట తడబడి పోతోంది

“తప్పే! తప్పే సేశాం. తాగాం బాగా. ఆ మైకంలో తెలీలా.. తాగి ”

“వొంక తాగుడు మీద నెట్టినంత మాత్రాన, నా చెల్లెలు ఇంగ నాకు తిరిగి రాదు. నన్ను అక్కా అని పిలవదు.  నువ్వు వొంటి మీద స్రుహ ఉండే సేశావా,  లేక సేశ్నావా నాకొద్దు. నా పిల్లని అబ్బా గొడుకులు సంపి వొలుకులకి పంపిచ్చారు. తాగితే పొరపాట్న సెప్పేత్తావేమో అని తాగుడుకూడా మానేశావ్ …. ”

కూలబడి పోయాడు వీరయ్య. రొప్పు వస్తోంది. కడుపు లో కలవరం

“సాయిత్రీ..నేను తప్పే సేశానే! నాకే సిచ్చ యేసినా పడతా” ఏడుస్తున్నాడు

నిశ్చలంగా చూసింది సావిత్రి

“సావుకి సావే పరిస్కారం. నీకా సిచ్చే యేశా!నీ సారా లో పురుగు మందు కలిపే ఇచ్చా నీకు . ఎక్కువ సేపు బతకవ్. ఎవుర్నీ పిలవాలని సూడమాక. ఎవరూ లేరీడ. అందరూ తిర్నాలకు పొయ్యారు.వొడ్లు తగలబెట్టేటపుడు, దూడని పక్కూర్లో ఆంజనేయులుకి ఇచ్చేటపుడు మనసు కి నచ్చలా! అయినా చేశా

నీ కాలు ఇరగ్గొట్టిచ్చినపుడు మాత్రం ఏమీ బాదనిపిచ్చలా.

సాల్దు అది నీకు. సచ్చి పోవాల మీరిద్దరూ! ఆబం సుబం తెలియని పిల్లని నిలువునా సంపేశారు

మిమ్మల్ని బురదలో పడేసి  తొక్కలేనేమో గానీ, మీరు  శవాలై తగలబడతా వుంటే మాత్రం యాడవను. సూస్తా కూకుంటా.
ఆ గుడ్డలు దొరికినాక మీ మాటల మీద కన్నేశా! నేను తామస్ రాజు గారి పొలం లో కలుపు తీయటానికి పోయిన రోజు, మీ ఇద్దరూ బయపడతా మాట్టాడుకోవటం కూడా ఇన్నా .  ఆ రోజు నించీ రగిలి పోతా ఉంది గుండె. ఎంత సర్దుకుందామన్నా నావల్ల గాలా

ఇంగ ఎక్కువ టయం లేదు నీకు. ఈ కాచేపట్లో  పద్నా నన్ను సెమించమని ఏడుత్తావేమో తెలవదు .  సచ్చి పైకి పొయినాక మాత్రం దాని జోలికి పోమాక” తలుపు దగ్గరకేసి గబ గబా ముందుకు నడిచింది

మళ్ళీ వెనక్కి వచ్చి తలుపు కొంచెం తీసి అంది ” నెల రోజుల నుంచీ కాచుకున్నా ఈ రోజు కోసం .  వొయిసు లో ఉన్న ముండ నాయాలువి కాబట్టి నీకింత టయం పట్టింది. మీ నానకి… ఇంత పట్టదు !  నేను దొరకను. దొరికి జైల్లో కూసోమన్నా, ఆయి గా కూసుంటా. నాకిక్కడ పెద్ద పన్లేమీ లేవు గదా? పిల్లా జెల్లా? ”

బయటికి పరిగెత్తి బావి పక్కన ముళ్ళ గోరింట పొదను గట్టిగా కౌగిలించుకుని కూచుంది . ముళ్ళు చేతుల్లో, ఒంట్లో గుచ్చుకు పోతున్నాయి. పదునుగా కోసేస్తున్నాయి. అయినా వదల్లేదు. ముళ్ళు ఒంట్లో దిగుతున్న బాధ హాయి గా ఉంది

###

ఇంట్లో పెరిగిన ముత్యం లాంటి పిల్ల అర్థాంతరం గా పోయింది. కూతురు కంటే ఎక్కువ గా పెంచాడాయె! ఈ లోపు సేతికొచ్చిన పంట బూడిదై పోయింది. ఎవుడో దొంగ నాయాలు కాలిరగ్గొట్టాడు
పాపం వీరయ్య తట్టుకోలేక పొయ్యాడు.  సాయిత్రి దైర్నం గా ఉండాల ” అన్నారు పురుగు మందు డబ్బా చూసి వూళ్ళో జనం .
*
సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కడుపు మెలిపెట్టేసిందండీ కథ చదువుతుంటే ..నిజంగా ఎలాగూ శిక్షలు త్వరగా పడవు..కంచే చేనును మేసే సంఘటనలు కంటికి కనిపించనివి ఎన్నో..మీకు వందనం

 • ఇలాటి వాటికి శిక్ష లు వెంటనే పడాలి ఆలస్యం కాకూడదు నిర్భయ లాగా.ముగింపు చాలా బావుంది.

 • మనస్సు కదిలించేలా రాసరండి. చాలావరకు ఇలాంటి ఘోరాలు ఇంట్లోవాళ్లే చేస్తారు.

  కధ ముగింపు కూడా బగరాశారు సుజాత గారు.

  • సుబ్రహ్మణ్యం గారూ , అవునండీ
   ఇలాటివి ఇంట్లో వాళ్లు చేస్తారు కాబట్టే బయటకు రాకుండా సప్రెస్ అయి పోతాయి

   థాంక్ యూ

 • కధాంశం కొత్తది కాదుగాని చెప్పిన విధానం బాగుంది. కాలు విరగ్గొట్టి, మంచం మీదకి చేర్చి, మందు పోసి చంపాలన్న కిరాతకమైన ఆలోచన సాయిత్రిలో పుట్టడం, తన చెల్లెలు పద్న మీద ప్రేమే కాదు మానవ సహజమైన ‘నాయం జరగాలా’ అన్న ఆటవిక న్యాయం.

  మొన్న దిశ విషయంలో సజ్జనార్ న్యాయమే – instant justice కావలనుకుంటున్నవారు నిర్బయ విషయంలో జరుగుతున్న ఆలస్యానికి సజ్జనార్ ని దిల్లీ వెళ్లమంటున్నారు.

  న్యాయ వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకం సడలిపోతున్నది.

  పద్మ లాగా ఎంతమందో! వీరయ్యలు ఎంతమందో! బయటకి రాని ఇలాంటి కధలెన్నో!

  మాండలికంలో రాసేటప్పుడు, పాఠకులకు కొత్త పదాలవుతాయి అనుకున్న వాటికన్నా అర్ధాలిస్తే బాగుంటుంది.

  ఉదాః లిక్కి…వొలుకు . ఈ పదాలకి నాకు అర్ధం తెలీదు. ఆ పదాలు వాడిన నేపధ్యాన్ని బట్టి అర్ధం ఇది అయివుంటుందని ఊహించుకోవలసి వచ్చింది. చి న

  • Anil garu న్యాయం జరగడం ఆలస్యమైన కొద్దీ నమ్మకం సడలి పోవటం సహజమే కదా.

   బయటకు రాక పూడి పోయిన పద్మలు ఎంతో మంది

   మాండలికం పదాలకు అర్థాలు ఇవ్వటంలో జాగర్త వహిస్తాను

   Thank you

 • న్యాయాన్యాయాల గురించి అస్సలు మాట్లాడను ,సాయిత్రి ,మంచిపని చేసింది అనికూడా అనను .మీరు చాలా controlled గా రాశారు .మనసులో కోపాన్ని మాటల్లో చెప్పకుండా పాఠకులతో చెప్పించడం కూడా ఒక కళే .మీరు కథలు రాయడం మానకండి.

 • మాబాగా చేసింది సావిత్రీ అంటూ ఆమె ని కావలించుకున్నాను
  సుజాతా..ఐ లవ్ యూ సుజాతా.

  వసంత లక్ష్మి

 • Well done, Sujatha garu!! Congrats on this uninterrupted flow! ఈ కథ మొదట్లోనే ముగింపు ఎందుకో నాకు నేను ఊహించినప్పటికీ కథకురాలు మీరు కావటం మూలాన అది మీ నుంచి రాదేమోననుకున్నాను. మీరు కొన్ని బలహీనతలని అధిగమించి, చక్కని కథని అందించారు. కొన్ని “పాపులర్ మీటర్” భ్రమలు మిమ్మల్ని తరచూ మీ ప్రయత్నం లేకుండానే నియంత్రిస్తూ ఉండటంతో మీరు ఒకటి రెండూ పాత్రలను కృతకంగా చొప్పిస్తారు- అని బాధగా ఉండేది. మీలో రచయిత్రి పై ఇష్టంతో మీ బలం తెలిసి ఉండటం వల్ల, ఆ బలహీనత నన్ను ఇబ్బంది పెట్టేది. కథకు పెద్ద సంబంధం లేని తామస్ (థామస్) రాజుని ఏదో రకంగా గొప్పవాడిగా చిత్రించే ప్రయత్నం చేయకపోవటం, చివరలో మీరు రప్పిస్తారనుకున్న విలన్లు రాకపోవటం… మీలో ఉన్న ఒక మంచి రచయిత్రి ని కళ్ళముందు నిలిపింది. పెద్ద బలహీనతని అధిగమించారు మీరు. చక్కటి కథలని అందించండి.

  • Dear just a reader , పాపులర్ మీటర్ భ్రమలు నిజంగానే నన్ను నియంత్రిస్తున్నాయా అనేది వేసుకోవలసిన ప్రశ్నే

   అది నిజమైన పక్షంలో అందులోంచి బయటపడవలసిన అవసరం కూడా ఉంది. ఏ నీడలూ, స్పెసిఫిక్ కాంటెంపరీ టాపిక్సూ లేకుండా రాయగలగాలని అనుకుంటానుృ
   మీ అభిప్రాయం నిక్కచ్చి గా రాసినందుకు థాంక్యూ
   ఇవే, ఉపయోగ పడేవి

 • కథ చివరలో తిరిగిన మలుపును ఊహించలేకపోయా. ఎంతో బాగుంది. కథనం, శీర్షిక… అన్నీ బాగున్నాయి.

  సావిత్రి దుఃఖాన్ని వర్ణించిన తీరు కదిలించేలా ఉంది.

  లిక్కి, ఒలుకులు.. ఈ మాటలు మా కృష్ణా జిల్లా పల్లెల్లోనూ బాగా వాదుకే!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు