‘మురళివూదే పాపడు’ దాదాహయత్

‘మురళివూదే పాపడు’ దాదాహయత్

దాదాహయత్ 1980-2000 సంవత్సరాల మధ్యా, భారత సమాజ పరిణామాలను కథలుగా రాసాడు.

      దాదాహయత్ రాయలసీమ కు చెందిన అభ్యుదయ రచయిత. పంతొమ్మిది వందల యెనభైల కాలం నుంచి కథారచనలో వున్నవాడు. 85 కు పైగా కథలు రాసినా వాటిని పుస్తకం రూపంలో ప్రపంచానికి చూపడానికి అంత చొరవను చూపినవాడు కాదు. ధీరగంభీరంగా నిశ్శబ్దంగా రాయలసీమలోని ప్రొద్దుటూరు లో తనదైన ముస్లిం జీవితంలో,  జీవిక కోసం న్యాయవాద వృత్తిలో వుంటున్న వాడు.ఎట్టికేలకు ఆ నిశ్శబ్ధాన్ని ఛేదించి 2017 లో ఎన్నిక చేసిన తన కథలతో ‘మురళి వూదే పాపడు’ సంపుటిని ప్రకటించాడు.
          మురళి వూదే పాపడు కథా సంపుటి లో 22కథలున్నాయి.దాదాహయత్ ను కథకుడిగా ఆలోచనాపరుడిగా అంచనా వేయడానికి వీలైనంత వైవిధ్యంగా వుందీ సంపుటి. ప్రముఖ విమర్శకులు రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు దాదాహయత్ ను రెండవ దశ అభ్యుదయ రచయితగా పేర్కొన్నారు. హయత్ ఎమర్జెన్సీ తర్వాత భారత సామాజిక పరిణామాలను చిత్రించిన కళాకారుడైనందున దాన్ని రెండవ దశగా పేర్కొన్నారు. దాదాహయత్ 1980-2000 సంవత్సరాల మధ్యా,  భారత సమాజ పరిణామాలను  కథలుగా రాసాడు. దేశంలో వేళ్లూనుకుంటుండిన ప్రజాస్వామ్యం, ఓట్ల రాజకీయాలు, భూసమస్యలూ, పేదరికం, మధ్య తరగతి ప్రజలు లోనవుతుండిన సందిగ్ధతలూ, నగరీకరణ దుష్ప్రభావం, ఆడవారి పట్ల వివక్ష, పిల్లల పెంపకం, వృద్ధుల సమస్య యివీ యిట్లాంటివీ ప్రధానంగా  దాదాహయత్ చేత కథలుగా మలచబడ్డాయి.
        ‘సెగమంటలు’, ‘ప్రదర్శన ‘,’ చరిత్ర ‘కథలు భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పొందుతున్న విపరీత పోకడలను చిత్రించిన కథలు. ఓట్ల కోసం డబ్బులు పంచడమనే ప్రక్రియను తొంభైల కాలానికే రికార్డు చేయబడిన కథలివి. ఆ పేరుతో అణగారిన కులాల ప్రజలను కీలుబొమ్మలుగా చేసుకోవడం, భయంకరమైన అణిచివేతను రుద్దడం, దళితులను(దాదాహయత్ ప్రతిసారీ వాళ్ళని హరిజనులు గానే పేర్కొన్నాడు) నిర్ధాక్షిణ్యంగా హింసించడం లాంటి సంఘటనలు యీ కథల్లో   కనిపిస్తాయి.
        అణగారిన కులాలను భూనిర్వాసితులను చేయడం, భూమిని వారినుండి గుంజుకోవడానికి యెంత దారుణమైనా చేయడం, ‘ఎల్లువ’, ‘ప్రదర్శన ‘,’ ఏటివొడ్డు చేపలు’కథల్లో  చిత్రితమై వుంది. ఒక నగరం విస్తరించే క్రమంలో “హరిజనులు” నివసిస్తున్న ప్రాంతం ముఖ్య కేంద్రంగా మారి ఆధిపత్య వర్గానికి ఆ ప్రాంతంపై కన్ను పడుతుంది. అక్కడి నుంచి “హరిజనులను” ఖాళీ చేయించడానికి ఆ నగర మేయర్ కు గాంధీ విగ్రహం దాని చుట్టూ వెలసే పార్కు వుపయోగపడుతుంది. గాంధీ విగ్రహం యేర్పాటు పేరుతో ఆ దిక్కులేని జనాన్ని ప్రదర్శన కథలో హింసను ప్రయోగించి నిర్వాసితులను చేసేస్తారు. ఓట్ల కాలంలో “హరిజనులు” పొందిన యింటి స్థలాలూ, భూములూ కూడా తర్వాత రాజకీయ నాయకుల లబ్ధి మేరకు వెనక్కితీసుకోవడంలోని వేదనలు కూడా (ఎల్లువ) కథగా చూస్తాము.
         భారత వుపఖండంలో రాజకీయాలను శాసించిన ప్రజాస్వామ్య, సామ్యవాద, మతతత్వ భావనలను సమాజాభివృద్ధి కోణంలో పరిశీలించడానికి ‘చరిత్ర’ అనే కథ రాసారు దాదాహయత్. మూడు దేశాలకు చెందిన ముగ్గురు మిత్రుల అనుభవంగా రాసిన కథది. ఆ మూడు దేశాల పేర్లు చెప్పనప్పటికీ, అవి ప్రజాస్వామ్యానికి భారత దేశం, సామ్యవాదానికి రష్యా, మతతత్వానికి పాకిస్తాన్లుగా పాఠకులకు అర్థమవుతుంది. మూడు దేశాల్లో ఆయా వ్యవస్థలు ఆ కథలోని ముగ్గురు మిత్రులు నిర్ధేసించుకున్న యాభైయేళ్లలో సమాజాన్ని పతనం చేశాయని నిరూపించబడమే కథ. జటిలమైన విషయాన్ని కథగా మలచడం కత్తి మీద సాము. కథ కొంచెం పొడిగా వున్నా ఆలోచనాపరుడిగా రచయిత అంతర్జాతీయతను పట్టిస్తుంది యీ కథ. పై కథల్లో అభ్యుదయ వాదిగా జాతీయ అంతర్జాతీయ విషయాలను చిత్రించే క్రమంలో దాదాహయత్, జాతీయంగా భారతీయ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతూ సగటు పౌరులను మరీ ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి ప్రజలను నలిపేసిందనీ, యిక మతతత్వం కూడా ప్రబలి మానవత్వాన్ని (మసీదు పావురం కథ) హత్య చేసిందనీ, సామ్యవాదం కలగా మిగిలిపోయి విఫల ప్రయోగమైందని చెప్తాడు.
     సమాజ అంతర్గత చలనాల పట్ల యీ రచయితకు సునిశితమైన దృష్టి వుంది. మధ్యతరగతి ప్రజల ఆదర్శాలను ఆచరించడం లోని హిపోక్రసీ ని ‘ఆశీర్వాదం’ కథలో చిత్రించాడు. ‘వ్యర్థజీవి’ కథలో రాజకీయ నాయకులు, రచయితలూ ఆదర్శాల గురించి యెంత డొల్లగా ఆలోచిస్తారో చెప్తాడు.
         స్త్రీలూ పిల్లలూ వృధ్ధుల పట్ల చాలా అపేక్ష యీ రచయితకు. మధ్యతరగతి ప్రజల్లోని ఆడపిల్లల పట్ల వుండే వివక్షను చాలా ముందే గమనించాడు. దాన్ని చర్చిస్తూ ‘ప్రసూతి వార్డు’ కథ రాసాడు. ఇదే విషయాన్ని యింకో కోణంలో చూపుతూ, మధ్య తరగతి సంసారంలోకి ఒక అదనపు కొత్త ప్రాణి వస్తుందన్నప్పుడు యజమాని ఆర్థిక స్థతినుంచీ  పొందే నిస్సహాయత యెంత పరాధీనతకు గురిచేస్తుందో ‘భవితవ్యం’ కథలో చెప్తాడు. మధ్య తరగతి దుర్మార్గం వృద్ధాప్యం లో వున్న తల్లిని కూడా సంపదవైపు నుండే అనాదరణకు గురిచేయడాన్ని ‘రెండణాల గుగ్గిల్లు’ కథ వివరిస్తుంది. స్త్రీలు ఒక మనిషిని నమ్మితే కడదాకా యెంత దుఖ్ఖాన్నైని భరిస్తారని చెప్పే విషాద కథలు ‘జడ్జిమెంట్’ , ‘విషాదగాత్రి’.
      పిల్లల సంబంధించిన మంచి కథలు రాసారు దాదాహయత్. ఈ ధనస్వామ్య వ్యవస్థ లో పేద పిల్లలు యెట్లా చిన్నపాటి ఆనందాల్ని వెతుక్కోగలరో ‘పేదవాళ్లదీపావళి’ కథలో చెప్తాడు. ఒక అవ్వ కోసం ఆమె కోరిన గుక్కెడు నీటి కోసం, ఒక పాప, యెంత దూరం ప్రయాణం చేస్తుందో యెన్ని చూసి యెలా విషాధంగా అంతమవుతుందో చిత్రించిన కథ ‘గుక్కెడు నీళ్లు’.  పిల్లల పెంపకమూ చదువూ యెంతో సంస్కరణ వంతంగా వుండాలని దాదాహయత్  కోరుకుంటాడు. ‘దోబూచి’ కథలో బుజ్జిపాప, జాబిల్లి యిద్దరే పాత్రలు. బుజ్జిపాప వైపు నుండి కథ చెప్పడం ద్వారా  రచయితలో యెంత పసితనముందో తెలియవస్తుంది. పిల్లవాడు బడికి పోకుంటే దాన్ని అంగీకరించడం వల్ల తర్వాత రోజు బడికి వెళ్లడానికి వాడిలోనే వుత్సాహం వస్తుందని చెప్పిన కథ ‘అహింస’.  పిల్లల వైపు నుంచీనే ప్రయోగాత్మకంగా రాసిన పర్యావరణ విధ్వంసాన్ని చిత్రించిన కథ ‘మురళివూదే పాపడు’. ఇవి మూడూ ప్రయోగాత్మక కథలు. గొప్ప శిల్పవిశేషమున్న కథలు.
        ఈ కథలన్నింటిలో ఒక్క దోబూచి ని వదిలేస్తే మిగిలిన  అన్నింటిలో బాల్యం నుంచి జీవితపు ప్రతిదశా పేదలకు విషాదకరంగానే వుంటోందని రచయిత తెలియజేస్తున్నాడు.
           దాదాహయత్ కథలలో సర్వసాధారణీకరించబడ్డ సమాజ జీవితం ప్రధానంగా కన్పిస్తోంది. అది అతనిలోని అభ్యుదయ భావజాల ఆధిపత్యాన్ని చెబుతుంది. నిర్ధిష్టమైన ప్రాంతం, పాత్రలూ, భాషా సంస్కృతి సంప్రదాయాలను కాకుండా సాధారణ తెలుగు జీవితం కన్పిస్తోంది. అయితే యీ వొరవడిని దాటి కనీసం నాలుగైదు కథల్లో నన్నా నిర్దిష్ట రాయలసీమ సమాజ జీవితాన్ని చిత్రించకుండా వుండలేకపోయాడు. రాయలసీమ ఒక ప్రాంతంగా యే రచయిత మీదనైనా ఆ ప్రభావం వేసి తీరుతుంది. రాయలసీమ లో రాజ్యమేలుతున్న ఆధిపత్య కుల స్వభావం తన కథల్లోకి రాకుండా వుండలేకపోయింది. రాయలసీమను పట్టిపీడిస్తున్న ఫ్యాక్షన్ ను దాదాహయత్ ‘వారసత్వం’ కథలో చూపించాడు. బాంబుల సంస్కృతి తండ్రి నుంచి కొడుకు యెలా తీసుకోవాల్సి వచ్చిందో యీ కథలో చిత్రించాడు. కథా వస్తువు పాతదే అయినా, యిప్పుడు ప్రాసంగికతను కోల్పోయివున్నా, ఇరవైయేళ్ల క్రితం చాలా గ్రామాల్లో నడచిన కథే యిది. ‘ఏటివొడ్డు చేపలు’, ‘ఎడారిసేద్యం’కథలు కేవలం రాయలసీమ లాంటి భౌగోళిక ప్రాంతంలో మాత్రమే జరిగే కథలు. రెండు కథలూ పెన్నేటివొడ్డున బతుకు చితికే బలహీన వర్గాల కుటుంబాల కథలు. చేనేతవృత్తితో కష్టంగా బతుకీడ్చే మనిషి చిన్న యింటిజాగా (అదీ ఏటివొడ్డు పోరంబోకు) నిలుపుకోవడం కోసం ముఠాతగాదాల్లో అనివార్యంగా నలిగిపోవడం,’ఏటివొడ్డు చేపలు’కథ. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో భూమిపై అజమాయిషీ యెంతగా వుంటుందంటే, యేటి యిసక లో గుడిసె వేసుకోవాలన్నా స్థానిక ఫాక్షనిస్టు కు కప్పం చెల్లించాల్సి వుండేంత. బేల్దారు వృత్తితో బతికే ఎల్లప్ప, మెరుగైన ఆదాయం కోసం ఏటి యిసకలో కర్బూజా పంట వేసుకునేందుకు కేశవరెడ్డి చేతిలో అప్పులు పాలవడం. అకాలంలో వచ్చిన వరద కారణంగా పంటనష్టపోవడం ‘ఎడారిసేద్యం’కథ.
        ఇట్లా అంతో యింతో నిర్ధిష్టమైన కుల, ప్రాంత, సమూహాల కథలు రాసిన దాదాహయత్, తన స్వంత అస్తిత్వమైన ముస్లిం సమూహపు జీవితాన్ని చెబుతూ ఒక్క కథ కూడా రాయలేదు. మసీదు పావురం కథ అనిర్ధుష్టమైన కథ. మతకల్లోలం గురించి కథ మాట్లాడుతూంది గానీ ఆ కథలో మనుషులు లేరు. మరీముఖ్యంగా వుండవలసిన ముస్లిం మానవుడు లేడు. ఒకవేళ దాన్ని ముస్లిం కథగా పరిగణనలోకి తీసుకున్నా, దాదాహయత్ లాంటి ముస్లిం సమూహానికి చెందిన కథకుడు అంతటితో ఆగడం న్యాయం కాదు. అప్పటికే అతని యెదురుగా షేక్ హుస్సేన్ సత్యాగ్ని వుదాహరణగా వున్నాడు. తర్వాత కాలంలోప్రతిభావంతులైన  ఖదీరూ, అఫ్సర్ స్కై తదితర వతన్ కథక పరంపర యేదీ   దాదాహయత్ అభ్యుదయ  అనిర్ధుష్ట కథా సంవిధానాన్ని మార్చలేకపోయింది.  ప్రాంతీయుడిగా రాయలసీమ, సంస్కృతి రీత్యా ముస్లిం సముదాయపు చరిత్రకు తను పూరించాల్సి వుండిన కొన్ని ఖాళీలనైనా దాదాహయత్ తన ఏకాగ్ర మౌనంను బద్దలుకొట్టి పూరించాల్సి వున్నింది, అనిపిస్తుంది. అట్లా అస్తిత్వం సోకని అభ్యుదయ కథకుడిగా మిగిలిపోయాడు ప్రతిభావంతుడైన  దాదాహయత్.
*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

2 comments

Leave a Reply to G.venkatakrishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎట్టకేలకు ఒక సంతృప్తికరమైన సమీక్ష. మంచి కథలు రాసి పేరు కోసం పాకులాడని రచయిత దాదాహయాత్. బాగా సమీక్షించావు. షుక్రియా..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు