మా నాయణపాట

తాగొచ్చిన రాత్రి

మా నాయన ఒక పాట పాడేవాడు

అందులో

పారే  నీటి గొంతు ఉండేది

 

పాట

పాడుతూ పాడుతూ

ఎండుతున్న వరిగడ్డి స్వరం తో

కన్నీళ్లు పెట్టుకునే వాడు

 

భూమి నీరు గాలి ఆకాశం అగ్ని

ఎవరివి అని అడిగే వాడు

హఠాత్తుగా పాట నిలిపి

కథ అందుకునే వాడు

 

గూడును కోల్పోయిన పిట్ట కథ చెప్పే వాడు

గుడ్లను మింగేసిన పాము కథ చెప్పే వాడు

అప్పుడు ఆ స్వరం లో

ఉచ్చులో చిక్కు కున్న

ఉడత పిల్ల భయం ఉండేది

 

ఒరే నాయనా

అడవి తగలబడి పోతోంది

మనుషులు కూడా మండిపోతున్నారు అంటూ

ఓ సాకీ తీసే వాడు

 

ఎన్కౌంటర్ లో  మరణిస్తూ

అరచిన ఉద్యమ కారుని కేక లా ఉండేది

రావే వర్షమా

పింఛం విప్పవే మేఘమా

వడ్లు దంచవే మేఘమా అంటూ

ఒక జానపద గేయం ఎత్తుకునే వాడు

పాట వృత్తాలు వృత్తాలు గా అల్లుకునేది

 

ఒరే చిన్నోడా

యుద్దాల్ చేయాలంటే

గద లక్కర్లేదు

గడ్డి పరక చాలనేవాడు

ఆ మాటల్లో ఎంటు లాంటి గట్టిదనం ఉండేది

 

ఆ పూట కూటి మాట లేదు

నిప్పు లాంటి స్వరపేటికతో

వేడి గా  నిట్టూరుస్తూ కలవరం కలవరంగా

నిద్రపోయేవాడు.

*

 

 

సుంకర గోపాలయ్య

పిఠాపురం రాజా డిగ్రీ కళాశాల లో తెలుగు అధ్యాపకులు. సొంత ఊరు నెల్లూరు.
సంపాదకుడిగా పిల్లల కవిత్వం రెండు పుస్తకాలు తెచ్చారు.రంజని కుందుర్తి,తానా, ఎక్సరే ,పాటూరి మాణిక్యమ్మ మొదలైన పురస్కారాలు అందుకున్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాకులలో ఒకరు.

24 comments

Leave a Reply to Krishna Vamsi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇ పాట చాలా బాగుంది సర్ .పల్లెల్లో చాలామంది తగొచ్చి రాత్రిపూట మాత్రమే గాయకులు.. గా మరి కచేరి చేస్తారు .కానీ వారి పాటలో దాగిన నిగూడ అర్ధలు తెలియచేశారు…..సూపర్ సర్…

  • తాగొచ్చిన అనే సరదా మాటతో లోతైన సమాజ అంశాలను ఎంత చక్కగా చెప్పారు సార్, పదునైన మాటలతో భావాన్ని సరళంగా పలికించారు , సార్. ధన్యవాదములు ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి మంచి కవితలు రాయాలి. సార్

  • మిత్రమా నాన్న ను గుర్తు చేశావు.
    కవితా ఆసాంతం నాన్న జ్ఙాపకాలే..

  • చాలా బావుంది సర్…అందరి నాయనల పాటల్లా…
    శుభాకాంక్షలు

  • కవిత నడిపించిన తీరు చక్కగా ఉంది……మీదైన స్టైల్ కనిపించింది….అభినందనలు మిత్రమా

  • మిత్రమా.. చాలా బాగుంది.. సామాజిక స్థితి పై మానసిక సంఘర్షణకు అద్దం పడుతుంది మీ కవిత..

  • సామాజిక అంశాన్ని అద్భుతమయిన బావుకథలో మనసుని హత్తకునేలా ఉంది ఈ కవిత

  • పంచభూతాల విశిష్టతను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ సాగిన మిత్రుడు సుంకర గోపాలయ్యగారి కవిత రెక్కాడినా డొక్కాడని శ్రామికుని మనోవేదనను , అన్నదాతల దయనీయ స్థితిని , పాముల కంటే ప్రమాదకరమైన ప్రజానేతల , ప్రభుత్వ ఉన్నతాధికారుల స్వార్థపూరిత పోకడలను సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో
    తెలియజెప్పుటలో సఫలీకృతమైంది.

    ‘కలవరం కలవరంగా నిద్రపోయేవాడు’ అని కవితను ముగిస్తూ అడుగడుగునా దోపిడీకి గురయ్యే సగటుమనిషి సుఖపడుట కల్లయని … రాత్రివేళ కలలు కంటూ ముల్లోకాలకు తానే రాజుగా భావించి ఆనందించే అవకాశం సగటుమనిషికి దేవుడిచ్చిన వరమని (కలవరం) తనదైన శైలిలో చెప్పకనే చెప్పిన మిత్రుడు సుంకర గోపాలయ్యగారికి హృదయపూర్వక అభినందనలు

  • రావే వర్షమా…. పింఛం విప్పవే మేఘమా…
    చదూతుంటే చక్కని వర్షం పడిందండీ

  • నాయనపాట బాగుంది. సర్!కూటి మాట లేకపోతే ఎవరుడిగేవారు. కదా సర్?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు