మా దక్షిణాఫ్రికా యాత్ర

కష్టంలో ఆ దేశం, ఈ దేశం అని లేదు, ఎవరైనా అప్పటికప్పుడే చుట్టాలైపోతారనిపించింది.

2017 లో మా బాబు “రిపబ్లిక్ ఆఫ్ కాంగో” దేశంలో ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి “Congo Peace Keeping Force” లో ఏవియేషన్ పైలట్  గా పనిచేశాడు. వాడు అక్కడ పనిచేస్తున్నసమయంలో United Nations working Staff కోటాలో మా కుటుంబ సభ్యుల వీసా (Visa on arrival) సులభ మవుతుంది గనుక సౌతాఫ్రికా టూర్ ప్లాన్ చేశాడు.

2017, డిసెంబర్ 22 న మేమిద్దరం  హైదరాబాద్ నుంచి ముంబై ఎక్స్ ప్రెస్ లో ముంబై వెళ్ళాం . అక్కడ మా మనవడు శయన్, కోడలు హిమాన్షి కలిశారు. 23 రాత్రి బయల్దేరి రువాండ్ ఎయిర్ (Rwanda Air) విమానంలో కిగాలి కి 24 న తెల్లవారుజాముకి చేరుకున్నాం. కిగాలి నుంచి మళ్ళీ  ఇంకో రువాండ్ ఎయిర్ విమానంలో జొహాన్నెస్ బర్గ్ కి 24 న మధ్యాహ్నం ఒకటింపావుకి చేరాం. కాంగో లోని లుముంబాషి లో పనిచేస్తున్న మాబాబు లుముంబాషి నుంచి కెన్యా ఎయిర్ వేస్ లో నైరోబి వచ్చి, నైరోబి నుంచి నుంచి మళ్ళీ ప్రయాణించి జొహాన్నెస్ బర్గ్ లో మమ్మల్ని కలిశాడు. ఇక అందరం జొహాన్నెస్ బర్గ్ నుంచి డొమిస్టిక్ ఫ్లైట్ లో పోర్ట్ ఎలిజబెత్ కి ప్రయాణించాం. అప్పటికి బాగా అలిసిపోయి ఉండడంతో, అంతకుముందే బుక్ చేసుకున్న టయోట కొరొల్లా కార్ పోర్ట్ ఎలిజబెత్ విమానాశ్రయం దగ్గర సిద్ధంగా ఉండడంతో, ఆ కార్ లో పోర్ట్ ఏలిజబెత్ లోని King Guest House చేరుకుని, రాత్రి భోజనం  చేసి విశ్రాంతి తీసుకున్నాం.

25 న అంటే క్రిస్మస్ ఉదయం పోర్ట్ ఏలిజబెత్ నుండి రెంట్ కి తీసుకున్న కారులోనే ఉదయం ఎనిమిది గంటలకు  బయల్దేరాం. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేశాం. Jeffery Bay, Storms, Tsitsikamma Park, Paul Sauer Bridge (Longest suspension bridge in southern hemisphere), Bloukrans Bridge (World’s highest bungee jump), Natures Valley, Birds of Eden, Monkey Land, Elephant Sanctury Plettenburg Bay – ఇవన్నీ ఉన్న దారిని గార్డెన్ రూట్ అంటారు. దీన్ని South Africa Jewel Route అని కూడా పిలుస్తారు. ఈ దారిగుండా ప్రయాణిస్తూ ఒక్కొక్కదాన్నీ చూస్తూ Plettenburg Bay లోని “Fat Fish” హోటల్ లో లంచ్ చేశాం. అసలొకచోట ఆగి చూడడం కాదు. ఆ దారి మొదలయ్యేదగ్గరే “Welcome to Nature’s Heaven” అనే స్వాగతం కనిపిస్తుంది.  నిజంగా భూతల స్వర్గమే!ఎటుచూస్తే అటు అతి సుందరమైన ప్రకృతిదృశ్యాలే! దారి పొడవునా ఎక్కడంటే అక్కడ కారాపి ఆగిపొయి ఆ దేశపు సంపన్నమైన ప్రకృతి సౌందర్యానికి, అందాలకు పరవశించిపోతూ దిగిపోయి ఫొటోలు తీసుకునేవాళ్ళం! అతి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఎంజాయ్ చేశాం.ప్రపంచంలో కెల్లా ఎత్తైన బంగీ జంప్ ని చూశాం. అమ్మో అని భయమేసింది.మా బాబు ట్రై చెయ్యబోయాడు  గానీ టైం లేదు.  Kynsna (స్థానికంగా నైస్నా అంటారు) నైస్నా పట్టణంలో తిరిగి చూస్తూ లంచ్ “East Side café ” లో డిన్నర్ “Indian Raasoi” లో చేశాం. చివరికి Kynsna లో అంతకు  ముందే బుక్ చేసుకున్న Aha, the Rex Hotel లో దిగిపోయాం. తర్వాత “Brenton on Beach” కి వెళ్ళి, తీరం వెంబడి నడిచి సూర్యాస్తమయాన్ని ఆనందంగా తిలకించాం. దారంతా క్రిస్మస్ ఆనందోత్సాహాలు కనిపించాయి.  అవి చూస్తూ ఉండడంతో ఆరోజు ముగిసింది.

ఆ రాత్రి ఆహా హోటెల్ లో గడిపి, 26 ఉదయాన్నే సుష్థు గా ఫలహారాలు లాగించి “Brenton on Beach” కి వెళ్ళి, తీరం వెంబడి నడిచి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూశాం. 12 గంటలకు హోటెల్ ఖాళీ చేసి మళ్ళీ మాకారులో కూర్చున్నాం. Kynsna నుండి George వరకూ వెళ్ళి అక్కడున్న Buffels Bay, Sedgefield & Myoli Beach, Wilderness View Point, Kaaiman’s River Crossing మొదలైనవి చూసుకుంటూ Victoria Bay Beach దగ్గర ఫొటోస్ కోసం ఆగాం.George నుండి Mossel Bay కి ప్రయాణించి Santos Beach, Diaz Museum Complex లో ఉన్న మ్యూజియం నీ , పోస్టాఫీస్ ట్రీ నీ చూశాం.ఈ పోస్టాఫీస్ ట్రీ కి చాలా పెద్ద కథే ఉంది.1501 సంవత్సరంలో ‘పోరో డి అటాడే’ అనే పోర్చుగీస్ సముద్ర కెప్టెన్ దక్షిణ ఆఫ్రికా కేప్ వద్ద తుఫానులో తన ఓడ చిక్కుకుందనీ, తనకు జరిగిన ఘోరమైన  నష్టాన్ని గురించి ఒక ఉత్తరం రాసి చెట్టు మొదట్లో ఉన్న తెల్లని పోస్ట్ డబ్బా లాంటి దాన్లో పెట్టాడట. అది ఎవరికి చేరాలో వారికి చేరిందట. దాన్ని ఆధునీకరించి ఈనాటికీ వాడుతున్నారట!

Mossel Bay నుంచి Robinson Pass & R328, Ostrich Farm Highgate, Cango Caves మీదుగా Oudtshoorn లోని “Eldorado Private Collection Apartment” కి 27 న చేరుకున్నాం. Mossel Bay లోని పంజాబీ కిచెన్ లో లంచ్ చేశాం. Eldorado అనేదొక ఇల్లే!  అన్ని మౌలికమైన సౌకర్యాలతోపాటు, వైభోగాలు కూడా అమర్చి ఉంచుతారు. కాఫీ, టీ లుంటాయి. వంటచేసుకోవడానికి గిన్నెలు, కుక్కర్లే కాదు అధునాతనమైన బార్బెక్యూ గ్రిల్స్, మైక్రోవేవ్, రెఫ్రిజిరేటర్ నిండా అవసరమైన ఎన్నో వస్తువుల్ని పెడతారు. పిల్లల చాక్లెట్లుంటాయి.పెద్దవాళ్ళకు పుస్తకాలుంటాయి. ఇంటి ఓనర్ ని హోస్ట్ అంటారు.ఆమె పేరు విల్మా.మా వాడి సామాను పోర్ట్ ఎలిజబెత్ ఎయిర్ పొర్ట్ లో హెల్డ్ అప్ అయి విల్మా ఆఫీస్ కి చేరింది. దాన్ని ఆమె మోసుకొచ్చింది.అన్నిటికంటే నాకు నచ్చిన విషయం ముందుగదిలో పుస్తకాలను అందంగా అమర్చారు. ఏపుస్తకమైనా నచ్చితే తీసుకోవచ్చు. దానికి బదులుగా మీ తర్వాత వచ్చేవారికోసం మీపుస్తకాన్నొకదాన్ని వదిలి పెట్టాలి అని విల్మా చెప్పారు. ఇల్లు దొరికిందే చాలని బజారుకి వెళ్ళి చేపలు, కూరగాయలు తెచ్చి ఎంచక్కా బార్బెక్యూ చేసుకుని తిన్నాం. ఆరాత్రికి ఆ ఇంట్లో హాయిగా ఉన్నాం.ఉదయాన్నే మంచి కాఫీ తాగి మళ్ళీ మా సాగుతున్న యాత్రని మొదలెట్టాం.

డిసెంబర్ 28 న ఉదయాన్నే బయల్దేరితే Oudtshoorn నుండి Struisbaai 330 కిలోమీటర్లు.నాలుగు గంటలు పడుతుందని  గూగులమ్మ చెప్పింది. Cape Agulhas, Gansbaai, Cango Ranch – Animal interaction, – R62 (Scenic inland) till Barrydale, – Boplaas Wine Calitzdrop & Shop, Barrydale R324 over Tradoupass మొదలైన వాటిని దారిలో చూసుకుంటూ R319 to Struibaai Harbour కి చేరుకున్నాం. కేప్ అగాలస్ లైట్ హౌస్ నుండి ఆఫ్రికా ఖండం యొక్క దక్షిణ కొనపు చిట్ట చివరి పాయింట్ ని చూశాం! ఈ దగ్గరే ఉన్న  ఇండియన్, అట్లాంటిక్ మహా సముద్రాలు కలిసే చోటుని ఒక అద్భుతంగా తిలకించాం. రెండింటియొక్క నీళ్ళ రంగులు స్పష్టంగా ఒకటి తెలుపులో,ఒకటి నీలం రంగులో కనిపించాయి.

తర్వాత Gansbaai లోని మరో ఇల్లు Come and enjoy “222” లో దిగాం. ఈ ఇంటి హోస్ట్ బెట్టీ. చాలా ప్రేమగా,ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది.ఇంట్లో బ్రేక్ ఫాస్ట్, లంచ్ “Cape Agulhas” లో, డిన్నర్ మళ్ళీ ఇంట్లో బార్బెక్యూ! రాత్రి బస బెట్టీ ఇంట్లో. ప్రతి ఇంటి పైనా చిలక ఆకారంలో రేకు డబ్బా లాంటిదాన్ని చూశాను. నాకర్ధం కాక బెట్టీ నడిగాను.సౌతాఫ్రికా ప్రజలందరికీ బార్బెక్యూ చాలా ఇష్టమట! అందుకని ప్రతి ఇంటి పైనా దాని వెంటి లేటర్లుంటాయి. “How can one take delight in the world unless one flees to it for refuge?” అని అంటారు Franz Kafka.  కొంచెం టైం దొరికితే చాలు మా వాళ్ళు బజారుకి పోయి అన్నీ తెచ్చుకోవడం, బార్బెక్యూ చేసుకొని తినడం బాగా ఎంజాయ్ చేశాం.”ఒక సమూహాన్ని అంచనా వెయ్యాలంటే వారి ఆహారపుటలవాట్లు, ఆచార నియమాలూ తెలుసుకోవాలంటారు డి.డి.కొశాంబి. నాకైతే బార్బెక్యూ చేసిన ఆలూ,కేప్సికం,బేబీ కార్న్స్ లాంటివి బాగా నచ్చేవి. మంచి సీ ఫుడ్, తాజా కాయగూరలు దొరికాయి. కానీ ఖరీదెక్కువే! మేము ఉప్పూ, కారం, నూనె లాంటి కొన్ని అవసరమైన వస్తువులు తీసికెళ్ళాం. కొన్నిసార్లు వంట చేశాను. మొత్తానికి సౌతాఫ్రికాలో అలవాటైన బార్బెక్యూని మర్చిపోలేక మా వాళ్ళు ఇప్పుడేకంగా గ్రిల్ కొని తెచ్చి,హైదరాబాద్ లో చెయ్యడం మొదలెట్టారు.

Stellenbosch–Wine yards & Giraffe House మొదలైన వాటిలో కొన్ని మాత్రమే చూశాం. జంతుప్రదర్శనశాలలేమీ చూడలేదు.టికెట్ ధరలు మండిపోతున్నాయి.మా షయన్ గాడికీ, హిమాన్షీ కీ జంతు ప్రేమ చాలా ఎక్కువ.వాళ్ళీద్దరినీ పంపి కొన్నిసార్లు మిగిలిన ముగ్గురం ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళం. 29 సాయంత్రానికి మా కలల తీరం కేప్ టౌన్ కి చేరుకున్నాం. జనవరి ఫస్ట్ న నూతన సంవత్సరం మొదటి రోజు తెల్ల జాతీయులందరూ ఆర్భాటంగా వేడుకలు చేసుకుంటారు. మాకు ఆ వేడుకల మీదంత ఇష్టం లేదు. అందుకని మేము జనవరి ఫస్ట్ న టేబిల్ మౌంటెన్ చూడాలనుకున్నాం. జనవరి 2nd న నల్లజాతీయుల కార్నివాల్ చూడాలనుకున్నాం.అందుకని కార్నివాల్ ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే ఖరీదెక్కువైనప్పటికీ ఇల్లు తీసుకున్నాం. Central Cape Town లో “11 on Buiten”

అనే ఇల్లు (చాలా పెద్దది) మూడు నెలల ముందే బుక్ చేశాడు. దాని హోస్ట్ “Rudi Van Rooyen”. ఈ రూడీ భలే స్నేహంగా ఉన్నాడు.వాళ్ళావిడ రైటర్ అట. కూతురు ఆర్టిస్ట్.ఆమె చిత్రాలన్నిటినీ రూముల్లో అందంగా అమర్చారు.. ఒక వారం రోజులపాటు ఈ ఇంట్లో ఉన్నాం.ప్రతిరోజూ వచ్చి మా బాగోగుల గురించి అడిగి  తెలుసుకునేవాడు.ఏది కావాలన్నా క్షణాల్లో అమర్చేవాడు.

30 వ తేదీ వచ్చేసింది. ఇంటి పక్కనే లైబ్రరీ ఉంది. ఆయనా,పిల్లలూ బజారుకెళ్ళారు.నేను లైబ్రరీ కెళ్ళాను.చూద్దును కదా అక్కడెవరూ లేరు.పుస్తకాలు కూడా అంతగా లేవు. అక్కడున్న వాళ్ళనడిగితే ఒక నిర్ణీత సమయంలో రిసర్చ్ చేసేవాళ్ళైనా రచయితలైనా, ఏ విషయం గురించైనా సంగ్రహ సమాచారం కావాలంటే ఈ లైబ్రరీ కొస్తారట. వాళ్ళకి బోధించడానికి, వాళ్ళ సందేహాలు నివృత్తి చెయ్యడానికీ ఆయా విషయాల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్స్ ని, మేధావుల్నీ ఆ సమయానికి ప్రభుత్వం పిలిపిస్తుందట. ఎంత బాగుంది కదా? ఆ పక్కనే లైబ్రరీ ఉందని చెప్పారు. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. Nigerian author Chimamanda Ngozi Adichie (చిమమండ ఎన్జిజి ఆదిచి) రాసిన “Things around your Neck” (Short Stories) లోంచి “Cell One“అనే మొదటి కథ వెనక టైం తంతుండడంతో హడావుడిగా  చదివాను. ఆ పుస్తకం కొనుక్కోవా లనుకున్నాను. నాకు క్లాస్ రూం వాతావరణమన్నా, లైబ్రరీలన్నా చాలా ఇష్టం. ఎక్కడికెళ్ళినా లైబ్రరీలు చూస్తా!  అమెరికా లైబ్రరీ లంటే మరీ మరీ ఇష్టం. మన లైబ్రరీలకు వెళ్ళాలనిపించదు

ఆరోజే Red Route City Tour బస్ తీసుకుని 81 Long Street నుండి బయల్దేరిన బస్ Table Mountain, Camps bay, Clifton Beach to Bantry Bay, Sea point beach, St John Road, Winchester Mansion Hotel, V&A Water Front, Two Oceans Aquarium, Cape Wheel, Battery Museum, Rugby Museum, Harbour Cruise & Canal Cruise మీదగా వెళ్ళింది. బస్సులు వెంట వెంటనే వస్తూ, పోతూ ఉంటాయి. మనం దిగదల్చుకున్నచోట దిగి తర్వాత అదే బస్ లో వచ్చిన చోట దిగిపోవచ్చు. Table Mountain ఒకరోజంతా పడు తుంది గనక దాన్ని వదిలేశాం. Battery Museum, Rugby Museum చూడలేదు. తక్కినవాటిని చూసి Sea point beach దగ్గర ఎక్కువ సమయం గడిపాం. ఇక కేఫ్ టౌన్ ఇంట్లో వంట మొదలెట్టి హాయిగా ఇంటి తిండి తిన్నాం.

31 న Yellow Route Downtown Tour టికెట్స్ తీసుకున్నాం.BO Kaap, St Georges Cathedral, The Company Garden, SA Museum, Mount Nelson Hotel, SA Jewish Museum, District Six Museum, Castle of Good Hope, Green Market Square – ఈ దారిలో వెళ్ళింది బస్. SA Museum, Mount Nelson Hotel, SA Jewish Museum – ఈ మూడూ వదిలేసి మిగిలినవి చూశాం.

తర్వాత Blue Route తీసుకున్నాం. ఈ బస్సులన్నీ కూడా మేమున్న 81 Long Street నుంచే మొదలవుతాయి. అందుకని మాకు చాలా సులభమైంది. Kirstenbosch Botanical Garden – Constantia Nek Shop, Groot Constantia (Oldest wine estate), Mariner’s Wharf and Harbour, Duiker Seal Island మొదలైనవి ఈ రూట్లో ఉన్నాయి. మా ఆయనకు వైన్ అనే మాట వినబడితే చాలు కాళ్ళు అక్కడికక్కడ ఆగిపోతాయి. ఆయనకోసం గొణుక్కుంటూ Groot Constantia (Oldest wine estate) వెళ్ళాం కానీ దాని చరిత్రని రోజంతా చదివినా తెమలలేదు. Constantia షాప్ లో వైన్ కొనుక్కుని అక్కడున్న గ్రేప్ గార్డెన్స్ లో ఆనందంగా విహరించాం. సాయంత్రం Harbour & Canal క్రూయిజ్ లో మైమరచి పోతుండగానే “New Year’s Eve” మొదలైంది. 31రాత్రి బాబూ-డాలీ (మేము కోడల్ని డాలీ అని అంటాం) బయటికెళ్ళారు. మేము మంచి వంట చేసి, షయన్ తో నూతన సంవత్సర సంబరాలు చూస్తూ రోడ్లన్నీ చుట్టేశాం!

2018 జనవరి ఫస్ట్ : ముందుగా అనుకున్న ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున ఉత్సాహంగా టేబిల్ మౌంటెన్ కి బయల్దేరాం.  ఇది ప్రపంచంలోనే అతి పురాతన పర్వతాలలో ఒకటిగా భావించబడుతుంది. పర్వత శిలలకు సుమారు 600 మిలియన్ సంవత్సరాల వయస్సుంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. టేబుల్ మౌంటైన్ చరిత్ర గురించి చదివితే మొదట ఖోయ్, సాన్ తెగల స్థానిక ఆదివాసీలు దీనికి “సముద్రం లోని పర్వతం” అని పేరు పెట్టుకున్నారు. పోర్చుగీస్ నావిగేటర్ “అడ్మిరల్ అంటోనియో డి సల్దాన్హా” మొట్టమొదటగా 1503 లో ఈ పర్వత శిఖరాన్నధిరోహించాడు! ఆయన దీని పేరును కేప్ టౌన్ లోని టేబుల్ మౌంటెన్ అని అర్థం వచ్చేలాగా కేప్ టేబుల్ అనేపేరుపెట్టారు. అతను టేబుల్ మౌంటెన్ను ఎక్కిన మొట్టమొదటి తెల్లజాతి వ్యక్తిగా పేరు గాంచాడు.

దక్షిణాఫ్రికాదేశాన్ని తల్చుకోగానే లోని తమ తమ జాతుల ఆత్మగౌరవం కోసం పోరాటాలు చేసిన గాంధీజీ, నెల్సన్ మండేలా గురొస్తారు. వాటితో పాటు కేప్ టౌన్ లోని టేబిల్ మౌంటెన్ గుర్తొస్తుంది. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సూర్య చంద్రులు మనవెంట వచ్చినట్లే కేప్ టౌన్ లోని ఏ మూలకు వెళ్ళినా ఈ టేబిల్ మౌంటెన్ దక్షిణాఫ్రికాకు మాత్రమే చెందిన ఒక ఐకానిక్ చిహ్నం లాగా మన వంక చూస్తూనే ఉంటుంది! కేప్ టౌన్ లో అడుగు పెట్టగానే అన్నిటికంటే మమ్మల్ని మొదట ఆకర్షించింది టేబిల్ మౌంటెన్. ఇది మన  హిమాలయాల కంటే 6 రెట్లు పెద్దది!

డచ్ పర్వతారోహకుడు జోరిస్ వాన్ స్పిల్బెర్గెన్ 1601 లో ఈ పర్వతం యొక్క పాదాల వద్ద ప్రాంతానికి బే అని పేరు పె ట్టాడు.  అతను కొండ బాగా ఎత్తుగా, సమంగా, దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నందున దీన్ని ఒక నూతన ఆవిష్కరణ అనుకొని ఆయనకు తెలియకుండానే టేబుల్ మౌంటైన్ పేరును ప్రతిపాదించాడు. 1652 నాటి డచ్ యూరోపియన్ వలసవాదులు కేప్ వద్ద స్థిరపడడంతో టేబుల్ మౌంటైన్ గా పేరు ధ్రువీకరించబడి, ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. 1929 లో నిర్మించిన కేబుల్ దారిలో వెళ్తున్న కారు 360 డిగ్రీల యాంగిల్ లో రొటేట్ అవుతూ శిఖరాగ్రానికెళ్తుందట. దీనిలోనుంచి కేప్ నగరాన్ని విహంగ వీక్షణం చెయ్యొచ్చట! ఇదంతా రూడీ చెప్పగా విని ఉన్నాం.  కాబట్టి ఎంచక్కా నూతన సంవత్సరం మొదటి రోజున టేబుల్ మౌంటైన్ మీదికి వెళ్ళబోతున్నందుకు చాలా థ్రిల్లింగ్ గా ఫీలయ్యాం!

10 గంటలకు బయల్దేరినప్పుడు చాలా వేడిగా ఉంది.  కేబుల్ కార్ లో వెళ్ళాం. కొండ మీదున్న అపురూపంగా ఉండే రకరకాల పువ్వుల్నీ, అద్భుతమైన నగర దృశ్యాల్నీ పైనుంచి చూస్తూ పులకించిపోయాం. ఆ సౌందర్యాన్ని  అనుభూతించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. తిరిగి తిరిగి ఆకలేస్తే, కేఫ్ లోని పిజ్జా తిన్నాం. ఇక మొదలైంది వెన్నులోంచి వణికించే చలి. అకస్మాత్తుగా వాతావరణం మారిపోనారంభించింది. దురదృష్టవశాత్తూ మేము చలికి పనికొచ్చే బట్టలు తీసికెళ్ళలేదు. నాకు చలి అసలు పడదు కాబట్టి నేను లైట్ గా ఉండే ఒక స్వెట్టర్, ఒక జీన్స్ టాప్ తీసికెళ్ళాను. మావాడు కూడా ఇక్కడ వేసవి చాలా వేడిగా ఉందని చెప్పాడు. మామూలుగా అయితే కేబుల్ కార్ 5 గంటలకి కిందికి రావాలి. మేము కూడా సాయంత్రానికి వచ్చెయ్యా లనుకుని, వేరే ప్రోగ్రాం వేసుకున్నాం!

అప్పుడు జరిగిందొక ప్రమాదం! ఇద్దరు పురుషులు,ఒక మహిళ  పర్వతారోహణ చేస్తుండగా  శిఖరాగ్రానికి 150 కిలోమీటర్ల  దూరంలో చిక్కుకుని వేళ్ళాడుతున్నారట! నూతన సంవత్సరం రోజున అయ్యో పాపం అనిపించిందందరికీ! Wilderness Search and Rescue (WSAR) టీం వెంటనే రంగంలోకి దిగింది. ఇక ఆతర్వాత 800 మంది టూరిస్టులు గంటల తరబడి ఒక చిన్న గదిలాంటి స్థలంలో చిక్కుకుపోయారు. చలి అంతకంతకూ పెరిగిపోతుంది. గంటలు గడిచిపోతున్నాయి. అక్కడున్న కేఫ్ లోని పిజ్జా,బర్గర్లూ,కూల్ డ్రింక్స్ ఎప్పుడో అయిపోయాయి. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు.జనాలు ఒకరిమీదొకరు కూర్చున్నట్లే కూర్చున్నారు. ఇక మా సంగతైతే చెప్పక్కర్లేదు.వచ్చేటప్పుడున్న వేడికి బాబు షాట్స్,డాలీ ఫ్రాక్ వేసుకున్నారు.వాళ్ళ కాళ్ళు ఫ్రీజ్ అవుతున్నాయి.మా ఆయన బాబునీ, నేనూ-షయన్ డాలీని కప్పి కూర్చున్నాం. ఎప్పటికి ఇల్లు చేరతామో తెలియదు.  అన్ని దేశాల నుండి, ప్రపంచంలోని మూల మూలలనుండి, రక రకాల సంసృతుల నుండి క్రొత్త వ్యక్తులను కలిశాం. కానీ అందరి ముఖాల్లో నూ ఏదో తెలియని భయం, ఆందోళన క్షణ క్షణానికీ పెరిగిపోతూ ఉన్నాయి. మా పక్కనే కూర్చున్న ఒక ఇటలీ మహిళ పిల్లలందర్నీ కూర్చోబెట్టి,కథలు చెప్తూ ఆటలాడించింది. మా బాధ చూసి డాలీకొక షాల్ ఇచ్చింది. అది మా పిల్లకు బోలెడంత రిలీఫ్! కష్టంలో ఆ దేశం, ఈ దేశం అని లేదు, ఎవరైనా అప్పటికప్పుడే చుట్టాలైపోతారనిపించింది.

ఈ కష్ట కాలంలో సౌతాఫ్రికా ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధా,బాధ్యతా  మర్చిపోలేనివి. మనసు చెదిరిపోతున్న ప్రయాణీకులకి ప్రతి పది నిమిషాలకీ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయనీ, ఆలస్యానికి క్షమించమనీ చెప్తూనే ఉన్నారు. రక్షణ గురించి అభయహస్తం ఇస్తూనే ఉన్నారు. టేబుల్ మౌంటైన్ సిబ్బంది చెదరని చిరునవ్వుతో ఎక్కడ,ఎవరికేం కావాలో చిటికెలో అందిస్తున్నారు. గ్రీస్ కి చెందిన ఒక ఆటగాడికి ఫ్రాక్చర్ వల్ల కింద కూర్చోలేకపోతే ఆ ఇరుకు స్థలం లోనే చిన్న టేబుల్ వేశారు. చివరికి షుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో నుంచి Wilderness Search and Rescue TEAM నుంచి “జోహన్ మారాస్” అనే ఆయన పురుషులిద్దరూ చనిపోయారనీ,మహిళను వైద్యం నిమిత్తం తరలించాలనీ, ఆ ముగ్గురినీ కిందికి దించాక మాత్రమే పర్యాటకుల్ని కిందికి చేర్చడానికి కేబుల్ కార్లు వస్తాయనీ చెప్పారు. ముందు మరణీంచింది ఇద్దరు పురుషులని చెప్పారు గానీ తర్వాత ఒక స్థానికుడు, ఒక విదేశీ మహిళ  చనిపోయారని చెప్పారు. ఎంతో నిబద్దతతో గాయపడ్డ పురుషుణ్ణీ ముందు ఎమర్జెన్సీకి తరలించారు. కొండల మధ్యలో చిక్కి చనిపోయి వేలాడుతున్న ఇద్దర్నీ దించాక మాత్రమే దాదాపు 12 గంటల ప్రాంతంలో మాకు కేబుల్ కార్లు అందుబాటులో కొచ్చాయి.కిందికి దిగాక మాకోసం బస్సులూ, అవసరమనుకున్న అన్ని డిపార్ట్ మెంట్స్ నీ అక్కడ మోహరించారు.ప్రతి ఒక్కరినీ సురక్షితంగా వారి వారి స్థలాల్లో దింపారు.మమ్మల్ని మాఇంట్లో దింపారు.మా కొత్త సంవత్సరం అలా ఆనందంగా, రకరకాల ఉద్వేగాల మధ్య గదిచింది.జీవితానికిదొక అనుభవం !

చూపరులకు కలర్ ఫుల్ గా కనిపించే నగర జీవితమే కాక ప్రజల పేదరికం, తరతరాల అణచివేత చరిత్ర కూడా అర్ధమవుతుంది. దక్షిణాఫ్రికా లో నెల్సన్ మండేలా జైలు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆకర్షణలలో ఒకటి. జనవరి 2 న కేప్ మినిస్ట్రెల్ కార్నివాల్ పేరిట జరిగే నల్లజాతీయుల వేడుకలు కూడా ముఖ్యమైనవి.  మేము రెండు వారాలున్నాం మొత్తం. ఇంకా చెప్పవలసినవి ఉన్నాయి.మళ్ళీ చెప్పుకుందాం1

తర్వాత ఎవరైనా వెళ్ళదలచుకుంటే పనికొస్తాయని ఒక్కో రూట్ వివరాలను వాళ్ళిచ్చినట్లే ఇచ్చాను.

*

 

 

 

 

Avatar

శివలక్ష్మి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్లారు ప్రతి చోటుకు మీ అక్షరాలతో. ఆ హైకర్స్ గురించి తలుచుకుంటే బాధేసింది. మీ ట్రావెలాగ్స్ ఇంకా కొన్ని సారంగలో చదవాలని కోరుకుంటున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు