మల్లె పూల జడ

“ఇంతింత జుట్లు మన బోటోళ్ళకెందుకు సెప్పే నాగమణా? ఎంతెంత నూనె గావాల? ఎక్కడ దెచ్చి సస్తారు? కటింగు సేపీ దీనికి” దువ్వెనకి లొంగని మనవరాలి బారెడు జుట్టుని వేళ్లతో చిక్కు తీస్తూ విసుక్కుంది నాగేంద్రం

నాయనమ్మ చేతిలోంచి జుట్టు లాక్కుని తెగబారెడు కోపంగా చూసింది ఎనిమిదేళ్ల శ్రీదేవి

“మరి సూడు, నీ జుట్టు ఎట్టుందో? నూన్రాసుకోపోతే ఎండి పోయిద్దమ్మా” నచ్చజెప్ప బోయింది
“నూనె తెత్తానన్నాడు మా నాన. మొన్న రేత్తిరి అమ్మ జెప్పింది నానకి. ”

పనికి పోయి అప్పుడే తిరిగొచ్చి నులక మంచం మీద కూలబడి జుట్టు విదిలించి ముడేసుకుంటూ
“ఇయ్యాల సాయిత్రి గారింట్లో సుట్టాలున్నారు. మోపెడు బట్టలు పడ్డయి. రెక్కలిరిగి పొయినై ” అంది నాగమణి

“ఇంగ పొయ్యే పన్లేదుగా? పొణుకో కాచేపు. అన్నం నేనొండేశా. పచ్చడేసుకోని తిందాం లే! యశోదమ్మ గారింటికి బొయ్యి మజ్జిగ అడిగి తెత్తా”

“నువ్వెందుకొండావ్ ? నేనొత్తా గదా ? తల తిరిగి పొయ్యి మీద పడితే? మూసుకోని పడుకోలేవా ?” అత్తను విసుక్కుంది

“రోజూ పచ్చడేనా?” ఏడుపు లంకించుకుంది శ్రీదేవి

“మేయ్, అరవగాక . అదే ఉంది ఇంట్లో. ఏసుకోని తిను. లాపోతే మాడు” దిగ్గున లేచి చెప్పులేసుకుంది

“యాడికే మళ్ళా బోతన్నా? అన్నం దిని పో” నాగేంద్రం అరిచింది లోపల్నుంచి

“ఇప్పుడు గాదులే నువ్వు, పిల్లా తినండి. జయమ్మ గారి కూతురు సీమంతం అంట రేపు. చలిమిడి సేత్తారంట, పిండి కొట్టాలి రమ్మన్నారు” అంది రోడ్డు మీదికి నడుస్తూ

అన్నంలో పచ్చడేసి లేతగా కలిపి మనవరాలికి కంచం ఇచ్చి”తిను, మజ్జిగ తెత్తా” చిన్న చెంబు పట్టుకుని నాగేంద్రమూ వీధిన పడింది.
ఎవరింట్లోనో అడిగి కాసిన్ని మజిగ తెచ్చి నీళ్లు కలిపి మనవరాలి కంచంలో పోసింది

మరో గంటకి తిరిగొస్తూనే ,”జయమ్మ గారింట్లో అన్నం పెట్టార్లే! మల్లె తోటకు పోతన్నా, మొగ్గల కోతకి” అంది నాగమణి మంచి నీళ్ళు తాగుతూ

నాగేంద్రానికి ఏడుపొచ్చింది. ఎంత తాపత్రయమో ఈ పిల్లకి

కొడుకు పేకాటకి పొయ్యి, ఎక్కడ తిరిగి ఎప్పుడు వొస్తాడో వాడికే తెలీదు .
తనకేమో రోగం. ఆ రోగానికి మందులనీ, పిల్లల కోసమనీ ఎంత కష్టపడతందో కోడలు

“ఇప్పుడేగా వొచ్చావు. ఎమ్మట్నే పోవాలా? కాసేపు పొణుకో”అందామనుకుంది

కానీ అన్లేదు. మొగ్గ కోసే టైమిదే! మజ్జానం అవుతుండగానే కోసెయ్యాల. కోశాకనే పెరిగిద్ది మొగ్గ

సాయంత్రానికి బొండు గా తయారైద్ది

“నాకు పూల్జడ (పూల జడ) ఎప్పుడేపిత్తా?” మట్టి గురిగలు పెట్టి ఆడుకుంటున్న శ్రీదేవి అవొదిలి పెట్టి పరుగున వాళ్లమ్మ దగ్గరికి వచ్చింది.

దొరికి పోయింది నాగమణి.
రోజూ ఇదే గోల శ్రీదేవి తో. దాని తోటి పిల్లలంతా ఈ సీజన్లో పూల జడలేసుకుంటారు. మల్లె తోటల నుంచి డైరెక్ట్ గా మొగ్గలు తెప్పించి, పెద్ద జుట్టు లేక పోయినా, సవరాల సపోర్ట్ తో పూల జడలేసుకుని స్టూడియోలకు పోయి జడ వెనుక అద్దం పెట్టించి ఫొటోలు దిగుతారు

పోయినేడాది శ్రీదేవి తోటి దే పక్క బజారు పిల్ల కుమారి, పూల జడ వేసుకుంది మల్లె మొగ్గలతో. వాళ్లమ్మ, పాయ పాయకీ పూలు గుచ్చి వంకీల జడ వేసింది.వంకీల జడ వెయ్యడానికి ఎక్కువ మొగ్గలు పట్టవు. కానీ పాయల్లో మొగ్గలు గట్టిగా గుచ్చి, అవి వూడకుండా జడ పిన్నులు గుచ్చుతూ జడ వెయ్యడం చాలా కష్టం. జడ మొత్తం వేశాక జడ మొదట్లో పెట్టడానికి ఒత్తుగా మల్లె మొగ్గలు దండ కట్టి గుత్తగా అమర్చి మధ్యలో గులాబీ పూవ్వు పిన్నుతో గుచ్చి పెట్టింది. దానికసలు జుట్టే లేదు. కొబ్బరి పీచు లాంటి జుట్టికి సవరం పెట్టి వాళ్ళమ్మ దాన్ని పెద్ద జడ గా రూపొందించింది. అది స్టూడియో కి వెళ్లి ఫోటో తీయించుకుని ఆ ఫోటో బజారంతా తిప్పి చూపించింది

“సెప్పూ? నా పూల్జడ ఎప్పుడేపిత్తా?” పోలీసు లాగా వాకిలి అడ్డంగా నిలబడింది

“ఏపిత్తా నానా! తోటలో పూలు సరీంగ రావట్లా. వచ్చే వారం బాగా పూత్తాయి. అప్పుడేపిత్తా” అర్జెంట్ గా తప్పించుకోవాలంటే తప్పలేదు అబద్ధం

“మొన్న గూడా ఇదే సెప్పావ్.”
నవ్వింది నాగమణి “ఏపిస్తాగా , పో, పొయ్ ఆడుకో బో” తెగిన చెప్పుకి పిన్నీసు పెట్టుకుని గబ గబా నడిచింది ముందుకు

తల మీదుగా కట్టుకున్న జోలె లాంటి సంచీ లో మొగ్గలు ఒడుపు గా కోసి వేస్తోంది నాగమణి. పొద్దుటి నుంచీ చాకిరీ తో నడుం విరిగి పోయినట్టు ఉంది. మల్లె తోట కంచె పక్కనే ఉన్న వేప చెట్లు నాగమణి మీద దయతో నీడలు పంపాయి. వేడికి తట్టుకోలేక, ఆ చెట్లున్న వైపే మొగ్గలు కోస్తోంది. గోనె పట్టా చుట్టిన ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు కాసిని తాగి కాసిని మొహాన చల్లుకుని మొగ్గలు కోయడం లో పడింది.

“మాయ్, తొందరగా కావాల. మీరు పొయినాక ఎమ్మటే ఇంటికి పొయ్యి పెళ్ళికి బొయ్యేదుంది. మేయ్, మరియమ్మా, కబుర్లాపి మొగ్గ కొయ్యి. లాపోతే కాలవలోకి నూకుతా ” షావుకారు పెళ్ళాం గౌరమ్మ అరిచింది ఇంటి నుంచి తెచ్చిన ఫ్రిజ్ నీళ్ళు తాగుతూ

షావుకారు కి మాచర్ల రోడ్లో ఇంకో మల్లె తోట ఉంది. కానీ ఈ తోటలో మొగ్గ భలే ఇష్టం నాగమణికి. మొగ్గ ఒత్తుగా పొడుగ్గా బలంగా ఉంటది. అందుకే ఈ తోట మొగ్గకి డిమాండెక్కువ

మూరెడు మల్లె పూలు కొని పెట్టుకునే ఉత్తేజకరమైన, సంతోష క్షణాలేమీ ఆమె జీవితంలో లేవు

రోజంతా పని పని చేసి “రేపెలాగ?” మంత్రం జపిస్తే గానీ దినం పూర్తి గాదు

పేకాడే మొగుడు ఏ రోడ్లో ఉంటాడో తెలవదు. అందులో డబ్బులు పోతయ్యో వస్తయ్యో తెలీదు. సిమెంట్ బస్తాలు డెలివరీ చేసే ఆటో ఏస్తాడు. ఇష్టమైతే పనికి పోతాడు. డబ్బులు రాగానే ఎక్కడో పేకాడతా ఉంటాడు. ఎపుడో దలిచి కాసిని డబ్బులిస్తాడు

తగాదాలు తన్నులూ అన్నీ ముగిసి పోయాయి. పుస్తెలూ, పట్టాలూ, ఇత్తడి బిందెలూ మొత్తం పేకాటకు ఖర్చయి పోయాయి.

ఇక మాట్లాడే ఒపిక, పోట్లాడే ఆసక్తి రెండూ లేవు. మూడిళ్ళలో పని. సాయంత్రం తిఫిన్ సెంటర్ దగ్గర ప్లేట్లు కడుగుతుంది . టిఫిన్ సెంటర్ రాములమ్మ రాత్రి తినడానికి తిండి పెడుతుంది . అది కొంతలో నయం

అత్తకి వారానికోసారి మందులు కావాలి.

ఇట్టా యేసం కాలం వస్తే మల్లె మొగ్గ కోసే పని, పచ్చళ్లకి కారాలు కొట్టే పని చూసుకుంటుంది

మొగ్గ నలక్కుండా ఒడుపు గా కోస్తుందని షావుకారు పెళ్ళాం నాగమణిని తప్పకుండా పిలుస్తుంది ప్రతేటా

రోగిష్టి అత్త, ఎనిమిదేళ్ల పిల్ల

ఎంత చాకిరీ చేసినా, ఏ రోజూ ఒక రూపాయి దాచుకోడానికి మిగల్దు

మబ్బేస్తోంది ఎందుకో! వేప చెట్టు మీద నుంచి వీచిన చల్లగాలి నాగమణి ఒళ్ళంతా తడిమింది.

“కానియ్యాల కానియ్యాల” గౌరమ్మ కేకేసింది

కోసిన మొగ్గలన్నీ బుట్టలో పరిచిన బాదం ఆకుల మీద పోసింది.

గౌరమ్మని అడిగితే మొగ్గలు? ఆశగా అనిపించింది. కానీ గౌరమ్మ ఇచ్చే రకం కాదు. నోరు జారితే తను పడదు

కానీ శ్రీదేవి, పిచ్చి మొహం , పసి పిల్ల … ఎంత ఆశో దానికి పూల జడ వేసుకోవాలని

పోయిన సారి కూడా ఏవో కబుర్లు చెప్పి తప్పించుకుంది

గట్టిగా ఊపిరి తీసుకుంది “షావుకారమ్మా, కాస్త పెద్ద మనసు జేసుకోని రెండు కిలోలు మొగ్గలిప్పించమ్మా , పిల్లది జడ కావాలని ఏడుస్తుంది. పెద్ద జుట్టమ్మా దానిది ”

మాటలు కక్కేసి చూస్తూ నిల్చుంది

బుట్టలు ఆటోలో ఎక్కిస్తున్న రాములు తో మాటలాపి గౌరమ్మ నాగమణికేసి వింతగా చూసింది

“ఏమే? రెండు కిలోల మొగ్గలెంతో తెల్చు గా ? చెతుర్లాడే దానికి నేనే దొరికానా నీకు? ఈ తోట మొగ్గకెంత మార్కెట్టో తెలుసుగా నీకు? ఏందే? మాచర్ల షావుకారు తోట మొగ్గల్తో జడేసుకుంటదా నీ కూతురు? మన బతుకెంతో సూస్కోవాల. వూరక నోటికొచ్చింది అడిగెయ్యమాక .
జడేసుద్దంట జడ.. కూల్డబ్బులు దీసుకోని పో ఆమైన. జళ్ళేదు, గిళ్ళేదు ”

ఒక్కొక్క మాటా చెళ్ళు చెళ్ళున తగిలింది.
అడక్కూడదనుకుంటూనే అడిగింది. జరగాల్సిందే తనకి

ఇలాటి వాటికి ఏడుపు రావడం మానేసి చాలా రోజులైంది. ఏడుపొచ్చే బాధ కల్గినపుడు మొగుడిని తల్చుకుంటే చాలు, ఏడుపు ఆగి పోయి రాయి లా తయారై పోతుంది

“ఏందే నామణీ? అట్టుందేంది మొహం?” బైకు స్టాండేసి తోటలోకొస్తున్న షావుకారు అడిగాడు

“ఏం లేదు షావుకారూ, బానే ఉండా. మొగ్గల పనై పోయింది. ఇంటికి పోతున్నా” అంది పైట చెంగుతో మొహం తుడుచుకుంటూ

“ఎంగటేస్ర సావి గుళ్ళో ఐదు కిలోల మొగ్గలు గావాలంట రేపట్నుంచి రెండు వారాలు . ఎవురో పూజలు సేపిచ్చుకుంటన్నారంట. ఆ సిన్న బుట్ట తీసి అందులో సర్దు రోజూ , మిగతా వాటితో కలపమాక. పక్కన బెట్టు” అరిచినట్టు చెప్పాడు గౌరమ్మతో

“ఎవురిదంట పూజ?” అడిగింది చిన్న తాటాకు బుట్టలో మొగ్గలు తూచి పోస్తూ

“తెలవదే, పూజారి పంతులు సెప్పాడు ఫోన్ చేసి” అంటూనే మరో పక్క నాగమణీ వైపు చూసి “ఏందే? అట్టున్నావేందంటే సెప్పి సావ్వే?” విసుక్కున్నాడు షావుకారు

“దాని కూతురికి తెగబారెడు జుట్టంట. ఆ ఈరోయిను పూల జడేసుకోక పోతే సచ్చి పోద్దంట. ఈ తోటలో మొగ్గలు రెండు కిలోలు గావాలంట… వూరకే. కొనేదానికి కాదు” వెటకారం గొంతులో

కోపం మండి పోయింది నాగమణికి.

“ఇయ్యక పోతే ఇయ్యక పోయారమ్మా. నా బిడ్డని అంటే నేనూరుకోను. నన్ను తిట్టు కావాలంటే. మొగ్గలడిగింది నేను గాబట్టి”

“ఓయబ్బో, ఎంత లావు ఒచ్చిందే కోపం? నా నోరు మంచిదేలే! సచ్చి పోయిద్దంటే నిజంగా పోదులేవే. ఆయుషు పెరిగిద్ది లే”

మళ్ళీ వెటకారం

“ఒక కిలో ఇయ్యక పొయ్యావా ? పసి ముండ జడేసుకుంటదంటగా?” షావుకారు నెమ్మదిగా అన్నాడు

గయ్యిమని లేచింది గౌరమ్మ
గౌరమ్మ మాటలు వినడం ఇష్టం లేనట్టు గేటు దాటి గబ గబా బయటకి వచ్చి పడింది

తోట బయటే పున్నాగ పూల చెట్టు కింద నీడలో కూచుని గోనె పట్టా మీద మల్లె మొగ్గలూ కనకాంబరాలూ, మరువం వేసుకుని చక చకా మాలలు కట్టేస్తోంది అలివేలు

“ఏందే? ఈడే మాలే కట్టేస్తున్నావ్ ?” బండి మీద కడతావు గా ?”

“ఇయ్యి ఆర్డరొచ్చిన మాలలు. కేతారపు సుబ్బారావు గారి చిన్న పిల్ల పెద్ద మడిసయిందంట. ఇయాల ఎగస్ట్రా కావాలన్నారు మాల కట్టినై. వంద మూరలన్నా కావాలన్నారే. కట్టేసి అటు పంపిత్తే, ఇంగ బండి మీద దండలు బండి మీన కడతాలే”

చూస్తూ నిల్చుంది. మల్లెలు ఒక జత, కనకాంబరాలు ఒక జత, మరువం ఒక జత, మార్చి మార్చి , ఎడంగా పెట్టి కడుతోంది. చూపుడు వేలు, బొటన వేలు కలిపి దారంతో పెద్ద లూప్ తీసుకుని , తిరగా మరగా పెట్టిన మొగ్గలను అందులో దూర్చేసి దారం లాగేస్తోంది

“సేయ్, అంతంత ఎడంగా కడతన్నావేందే? అన్నాయం గాదూ”

“ఎవురిదే అన్నాయం? ఈ గౌరమ్మ ముండ మొగ్గలకు తీసుకున్న రేటెంతో తెల్సా? మరి గుత్తంగా కడితే వూడ్చి ఉప్పు నీళ్ళు చల్లుకోని పోతాం. దా, కూకో! ఇంటికేగా పొయ్యేది?

కాస్త నువ్వు కూడా కట్టు, డబ్బులిత్తాలే, వూరకే ఏం వొద్దు”

“నేను కట్టను,” అనబోయి,”డబ్బులిత్తాలే” అన్న మాట వినపడగానే , కింద కూలబడి కాసిన్ని మొగ్గలు ముందు పోసుకుంది

####################

“తెచ్చావా మొగ్గలు” వాకిట్లో అడుగు పెడుతుండగానే ఎదురొచ్చింది శ్రీదేవి

ఎవరి మీదో చచ్చేంత కోపం వచ్చింది. తమాయించుకుని చెప్పింది

“గుళ్ళో పూజలంట. పూజయ్యేదాకా మొగ్గలు దేవుడికేనంట. అయ్యన్నీ అయిపోగానే ఇత్తాన్నారు సావుకారు గారు ”

కూలబడింది మంచం మీద.
“నానొచ్చి అన్నం తిని పొయ్యాడు”

“మళ్ళీ ఎప్పుడొత్తానన్నాడు?” కొద్దిపాటి ఆశ, డబ్బులేమైనా ఇస్తాడేమో అని

“సెప్పలా. పేటకి పోతానన్నాడు”

“పేటకా? ఐతే ఇంకేం వొత్తాడు. నిన్న సిమెంట్ బస్తాల లోడేస్తానన్నాడు. డబులొచ్చుంటై. తీస్కోని పేటకు పొయ్యాడు పేకాట కి”

అత్తని లేపి మందులిచ్చింది. “రాములమ్మ టిఫిన్ సెంటర్ కాడికి పోతన్నా అత్తమ్మా. వొచ్చేటపుడు టిపినీ కూడా తెత్తాలే. ఊరకనే ఇత్తారు వాళ్ళు.” పది నిమిషాలన్నా కూచోకుండానే లేచి మెయిన్ రోడ్డు కేసి నడిచింది

##########

పిల్లకి ఎట్టైనా పూల్జడేయించి పొటో తీయిచ్చాల” రాఘవమ్మ ఇచ్చిన డబ్బుని పర్సు లో పెట్టుకుని బయటకు వస్తూ అనుకుంది.

బగమంతుడు ఎంత కట్ట పడ్డా డబ్బులీడు గానీ తనకీ కూతురికీ తెగబారెడు జుట్టు మాత్రం ఇచ్చాడు. మాకెందుకు సావీ ఇంతింత జుట్లు? నూనె కర్చు దండగ ” స్వగతం గా

అనుకుంటూ ముందుకు నడుస్తుండగానే పర్సులో ఫోన్ మోగింది. ఆ పాత నోకియా ఫోన్ లో ఒక్కో బటనూ గట్టిగా నొక్కితే గానీ పని చేయదు.

“మేయ్ నామణా, మీ అత్త మంచం మీంచి పడ్డది, దబ్బునొచ్చెయ్ ”

కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి.

మంచం మీద నుంచి పడిందా? ఎట్టా ఇప్పుడు?
తెప్పరిల్లింది. గాభరా పడకుండా గబ గబ ఆలోచించింది. రాగవమ్మ గారిచ్చిన రెండు వేలున్నై, ఇంట్లో వెయ్యి రూపాయలున్నై, సాయిత్రమ్మనడిగితే తిట్టుద్ది గానీ రెండేలైనా ఇచ్చిద్ది . చేతులు పుస్తెల మీదికి పొయినై .

ఇయ్యే ఇంగ మిగిలిన ఆదారం.

పోతే పోనీ, మడిసి బతకాల గానీ ఇదొక లెక్కా? అత్తని వెవేటు ఆస్పత్రికే కే తీస్క పోతా”

“బ్బాయ్, ఆటో ”

“నువ్వొచ్చే దాకా ఆగినా బాగుండేదే నామణీ. మంచినీళ్ళు అయిపోయినై మంచం కాడ. లెగిశాను” విరిగిన కుడి చెయ్యి కట్టు చూసుకుంటూ వంద సార్లు సంజాయిషీ ఇచ్చింది. నాగమణికి జాలేసింది

“పడితే పడ్డావులేమోవ్, ఇంగాపెయ్ . ఎన్ని సార్లు జెప్తావు? ఏం గాదులే. తొందరగానే అతికిద్దంట”

“కొండలుకి ఫోన్ జెయ్యమ్మా”

ఒంట్లో నలతగా ఉండగానే కొడుకుని చూడాలనిపించింది

“ఫోను కలవట్లా, పేటకు పొయ్యాడు. ఇంగ ఎప్పుడొత్తాడో లే. నువ్వు పొణుకో. ఇంటికి పొయ్యి టిపినీ తెత్తా నీకు”

ఇంటికొచ్చేసరికి ఎదురొచ్చింది కూతురు “తెచ్చావా మల్లె మొగ్గలు? ఎప్పుడేపిత్తా జడ?”

నవ్వొచ్చింది నాగమణికి. “నాయనమ్మ పడింది కదా! లెగవగానే ఏపిత్తా”

“ఎప్పుడు లేసిద్ది?”
“పది రోజులు”

######
చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. కొండలు వచ్చి తల్లిని చూసి , నాగమణిని దగ్గరున్న డబ్బులు లాక్కుని వెళ్ళాడు

టిఫిన్ సెంటర్ రాములమ్మ సమయానికి ఆదుకోబట్టి అత్త బయట పడింది. ఇంకా ఎంతని అడుగుతుంది రాములమ్మని

సాయిత్రమ్మ గారు డబ్బులు లేవని చెప్పేసింది.

మాచర్ల షావుకారుని అడగాలని లేదు. ఏసం కాలంలో పొయి మొగ్గలు కొయ్యటమే తప్ప అంతకు మించి వాళ్ళ తో పెద్ద పరిచయం లేదు

చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా తనలాగే పన్లు చేసుకుని బతికే వాళ్ళే. ఎవరి దగ్గరుంటాయి
“మీ అత్తకి స్కానింగ్ చెయ్యాలి, వెయ్యి రూపాయలు పట్రా ” ఫైల్ చూసి నర్సు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి.
“అమా, పూల జడ ఎప్పుడేపిత్తా?” శ్రీదేవి జడ వూపుకుంటూ వచ్చింది

ఎట్టా చెప్తే తెలుసుద్ది ఈ పసి ముండకి

రాబోయిన ఏడుపుని వెనక్కి తోసింది

మాచర్ల షావుకారు తప్ప ఇంత డబ్బు ఇచ్చే వాళ్ళు లేరు. గౌరమ్మ ఉంటే ఇయ్యనియ్యదు. పైసాకీ గౌరమ్మ ప్రాణానికీ లంకె

మందులకీ పరీచ్చలకీ లేక చస్తంటే, ఇదేమో పూలజడ అని పట్టుకుంది.

“చెప్పూ” చెంగు లాగుతోంది

ఒక్క క్షణం కళ్ళు మూసుకుని కూచుంది నాగమణి

శ్రీదేవిని దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకుంది

“నాయనమ్మకి ఒంటో బాగ లేదు కదా! మనం దేవుడికి దణ్ణం పెట్టుకోని ఆయనకి ఇష్టమైంది ఏదైనా ఇస్తే తగ్గి పోయిద్దంట”

అర్థం కాలేదు దానికి

“ఏమిష్టం దేవుడికి. కోటయ్య సావికేనా ?ఇచ్చేద్దాం పా ”

“మరీ, మనం ఎంగటేస్ర సామి గుడి కాడ చూశాం గదా! జుట్టంటే ఆ దేవుడికి చానా ఇష్టమంట”

శ్రీదేవి తెల్లబోయింది “జుట్టా? దేముడు జుట్టేం చేసుకుంటాడు? ”

ఈ ప్రశ్నకు జవాబు తెలీదు నాగమణికి కూడా

“ఏమో నాగ్గూడ తెలీదు. ఇచ్చేద్దామా మనం?”

“నేనా? మరి నా జడా?”

“ఏం గాదు, ఆర్నేల్లలో వచ్చేసుద్ది జుట్టు. ఇంగా పెద్దగా వచ్చుద్ది. అప్పుడేసుకోవచ్చు పెద్ద పూల జడ”

“నేనియ్యను ” కాసేపు ఏడ్చి తరవాత ఆలోచిస్తూ కూచుంది శ్రీదేవి

“మనం జుట్టు ఇచ్చేస్తే నాయనమ్మ కి తొందరగా తగ్గి పోయిద్ది”

“మళ్ళీ లేచి తిరిగిద్దా? నన్ను బడి కాడ దింపుద్దా?” ఆశగా చూసింది

“ఆ.. సుబ్బరంగా దింపుద్ది”

పది నిమిషాలు ఏమీ తేల్చుకోలేక పోయింది శ్రీదేవి

“సరే, ఇచ్చేద్దాం. మళ్ళీ జుట్టు వచ్చిద్ది గా?”

“ఒచ్చిద్దమ్మా” ఎటో చూస్తూ చెప్పింది కూతురి మొహంలోకి చూసే ధైర్యం లేక

#########

చెట్టు కింద మంగలి నరసయ్య ముందు జుట్టు తడుపుకుని కూచుంది నాగమణి. కూతురు ఒక్కదానికే జుట్టు తీయిస్తే దానికి అనుమానం రావచ్చు. ఈ జుట్టుతో తనకొచ్చే అందమేం లేదులే!

ఇది లేకపోతే నూనె కర్చు తగ్గుద్ది అంతే

మూడు నెల్లు పోతే క్రాఫ్ దువ్వుకోని తిరగొచ్చు.

కనీసం మూడేళ్ళు ఈ మల్లె పూల జడ గోల ఉండదు. చేతిలోని బొమ్మతో ఆడుకుంటూ మధ్య మధ్య లో అమ్మ వైపే చూస్తొంది పిల్లది.

మంగలాయన జుట్టు తీసుకు పోయి ఎంగటేస్ర సావికి ఇస్తాడని ముందే చెప్పింది శ్రీదేవికి.

ఒత్తైన నల్లటి జుట్టు పాయలు పాయలు గా తెగి కుప్పలు గా పడింది . ఆ కుప్ప లో నాగమణి కళ్లలోంచి నీళ్ళు కూడా జారి పడ్డాయి.

“మాయ్, అయిపోయింది లెగు” నరసయ్య మాటలతో వంచిన తలెత్తింది

“అద్దం జూసుకుంటావా” మచ్చల అద్దం అందించ బోయాడు

“ఒద్దు నరసయ్యా, పిల్లదానికి కూడా తీ ” గట్టిగా చెప్పింది

“మోవ్ , కాస్త మా పిలగాడికి క్రాపేయించుకోని పోనీ , బస్సుకు పొయ్యేదుంది” పక్కన చెక్క బెంచీ మీద కూచున్న మనిషి, పన్నెండేళ్ళ పిల్లాడిని చూపిస్తూ అడిగాడు

శ్రీదేవి మూడ్ పోతుందేమో తన గుండు చూసి అని భయం.
“ఈ పిలగాడికి పది నిమిషాల్లో ఏసేస్తాలే నామణీ, ఆడ కూసో కాచేపు” నరసయ్య పిల్లాడిని చేత్తో సైగ చేస్తూ పిలిచాడు

తల మీద కొంగు కప్పుకుని దూరంగా పోయి చెట్టు కింద కూచుంది

“నువ్వు గుండు లో సెండాలంగున్నావ్” శ్రీదేవి

“దేవుడి గుండు, అట్ట మాట్టాడగూడదు” అదిరే గుండెను అదిమి పెట్టింది.ఇప్పుడు అది గుండు చేయించుకోనందంటే, తన శ్రమ అంతా వృధా

అడక్కుండానే పీచు మిఠాయి కొనిపెట్టింది శ్రీదేవికి. అది నాక్కుంటూ ఆ పిల్లాడికి నరసయ్య వేసే క్రాఫ్ చూస్తూ కూచుంది

మాచర్ల షావుకారికి ఫోన్ చేస్తే?

నెంబరు సరి చూసుకుని నొక్కింది

“ఎవురూ?”

“సావుకారూ, నేను నాగమణి”

“ఏందే, మొగ్గలు కొయ్ టానికి నిన్న, ఇయాల రాలేదే?”

“మాయత్తని ఆస్పత్రికి తీసక పొయ్యేదుండింది సావు కారు. ”

“ఏంది సంగతి? ఎందుకు జేసావ్?”

“సావుకారూ, మా యత్తకి చెయ్యి అతకలా. ఆపరేసన్ సెయ్యాలంట. డబ్బులు కాసిని తక్కువ పడ్డయి. మా ఆయన వూర్లో లేడు, రాగానే..”

“ఎంత?”

నమ్మలేక పోయింది చెవుల్ని

“ఎంతే?”

“పదేలు”

“పదేలా? అబ్బో, ఎక్కువేనే”

“ఎక్కువే. కానీ ఇచ్చేత్తా నేను. సాయంత్రాలు గూడా ఏదైనా పన్లోకి పోతా. మా యత్త తప్ప ఇంకెవురూ లేరు మాకు. ఆ మడిసి లేచి నడవాలయ్యా” గొంతు పూడుకు పోయింది

అటువైపు నుంచి నిశ్శబ్దం, గుండెని కోసేస్తూ

“సరే రా, ఆ ముసలి ముండ మీద ఎంత ప్రేవే నీకు?”

“ముసల్ది కాబట్టే జాగర్త గా చూస్తన్నానయ్యా. ఒంట్లో సత్తవ ఉన్నన్నాళ్ళూ పని చేసిందయ్యా. ఇంటికి పెద్ద దిక్కు. మంచీ సెబ్బరా సెప్పుకునే దానికి ఇంగెవురున్నారు నాకు మాయత్త దప్ప. నా మొగుడిని కన్న మడిసి గదా”

బయట పంచలో ఒక మూల మంచం మీద పడున్న తల్లి గుర్తొచ్చింది కాబోలు షావుకారు కి

కొంచెం ఆగి అన్నాడు “ముసలి ముండ అదృష్ట వంతురాలేనే. అత్త గదా అని వాకిట్లో పారెయ్యకుండా బాగా సూసుకుంటున్నావ్ .
నా కళ్ళ ముందు పుట్టి పెరిగావు, నా పెద్ద కూతురంత వొయిసు ఉంటదా నీకు? అదింకా సదువుకుంటానే ఉంది. నీ నెత్తిన ఇంత పెద్దరికం , ఇన్ని బాదలు.
ఏందోలే ఆ కోటయ్య సావి లీల, నేనింకా గంట సేపుంటా సాపు కాడ. దబ్బున రా మరి”

సావు కారు లో ఇంత మంచి మనసు ఉందని ఎప్పుడూ తెలీదు నాగమణికి. అసలు ఎక్కువ మాట్లాడనే లేదు. ఎప్పుడూ గౌరమ్మతోనే

ఏమనాలో తోచట్లేదు.

“వచ్చేస్తా సావు కారూ. దణ్ణాలయ్యా నీకు”

“సరేలే గానీ, ఇయాల గుళ్ళో ఎనకమాల పాకలో ఉండే ఆవు సచ్చి పోయిందంట. పూజల్లేవంట. మొన్న మల్లె మొగ్గలడిగితివే అమ్మగారిని. అట్టా పడుండై బుట్టలో. ఇందాకే కోశారు. అయి గూడా తీస్క పో”

గుండె ఎగదన్ని గొంతులోకి వచ్చినంత పనైంది. గుండెలో సడన్ గా వచ్చి పడ్డ ఖాళీ తనం

“ఏందయ్యా? మల్లె మొగ్గలా?”

“అవునే, రెండు మూడు కిలోలుంటై. పిల్ల దానికే గా! వొచ్చి తీసక పో. గౌరమ్మ కి తెలిస్తే బతకనీదు. దబ్బునొచ్చి తీసక పో”

ఏమనాలో తెలీలేదు. రాకెట్ లాగా తలతిప్పి చూసింది

మంగలాయన శ్రీదేవిని ముందుకు లాగి కూచోబెట్టి నీళ్లతో జుట్టు తడుపుతున్నాడు.

కత్తి తీసి చేతిలో అటూ ఇటూ రాస్తున్నాడు

గుండె ఆగి పోయింది

“నరసయ్యా” ఒక్క కేక తో నాలుగు అంగల్లో వంద మీటర్ల దూరానికి ఎలా దూకిందో నాగమణి కే తెలీయాలి

నరసయ్య చేతిలో కత్తి లాక్కుని విసిరేసి, శ్రీదేవిని ఒక్క ఉదుటున ఇవతలికి ఈడ్చేసింది

మట్టి లో పడింది శ్రీదేవి ఆ ఈడ్పు కి

“మొగ్గలు…సీదేవి కి జడ” అంది తడబడుతూ

“ఏందే” నరసయ్యకేమీ అర్థం కాలా

శ్రీదేవిని చంకనేసుకుని షావుకారు మల్లె తోట రోడ్లోకి పరిగెత్తింది శరవేగంతో

దార్లో “శ్రీ మహాలక్ష్మీ స్టూడియో” తెరిచే ఉంది.
రాత్రి తొమ్మిదింటి వరకూ తెరిచే ఉంటుంది.

*

సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

27 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సురభి గారూ, థాంక్ యూ …చిరునవ్వుతో కథ చదవడం ముగించినందుకు

 • This is the flow what I always wanted to see from you! Just an original story telling style without any artificial/forced coatings. good One! poorthigaa meevi kaani bhaavajaalaalu mostunnappudu … ika eppuDu dinchukunTaaraa anipinchedi. Nijangaa ee katha -o manchi kathalaa undippudu. Thanks!

  • Amused to Amazed,
   మీ వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కల్గిస్తాయి.

   ఏదో ఒక భావజాలం ప్రతి రచయితకూ ఉంటుంది. అయితే అది ప్రతి రచనలోనూ ప్రతిబింబించాల్సిన అవసరం లేదని నేననుకుంటాను. కథకు అవసరమైతేనే

   ఇదిగో, ఇలాటి కథలకు జీవితం తాలూకూ చీకటి నీడల పరిశీలన తప్ప ఏ భావజాలమూ అక్కర్లేదు.అంత మాత్రం చేత నా భావజాలాన్ని ప్రతిబింబించే కథలు “నావి కాని భావాలను మోసుకుంటూ తిరిగినట్టు” కాదు.

   నాది కాని భావజాలం అని మీరెలా చెప్పగలరు? నేను రాసిన భావజాలం లేని కథల ఆధారంగా నా భావజాలాన్ని మీరు గుర్తించడానికి తిరస్కరిస్తున్నారంతే

   బహుశా ఆ భావజాలం మీకు నచ్చక పోవడం వల్ల, అది ఎప్పుడు దిగి పోతుందా అనే మీ ఆలోచనను “ఎప్పుడు నేను దించుకుంటానా?” అని అనువదిస్తున్నారు మీరు

   కథ్త నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ

 • చదువుతున్నంతసేపు అయ్యో అనుకున్నాను. చివరికి హమ్మయ్యా అని నిట్టూర్చాను. శ్రీదేవికి అది జీవితకాలపు జ్ఞాపకం.

  • పరేష్ గారూ, కథ నచ్చినందుకు థాంక్యూ సర్

 • మీ కథలలో బ్రతుకుల్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. చదువుతున్నట్టుగా ఉండదు. ఆ చిన్న కథలో ఆకాశమంత ఆర్ద్రత, భూదేవి కున్నంత ఓపిక కనులముందు కదలాడింది. ముగింపు మహాద్భుతం. పాఠకులకు ఆనంద భాష్పాలు కలిగించేంత అద్భుతం.

  • వివేకానంద్ గారూ, కథను బాగా అనుభవించి చదివారు. నాగమణిని ఓన్ చేసుకున్నారు. థాంక్ యూ

 • ఆశల్ని చంపడానికి ,చంపుకోవడానికి ఎన్ని మార్గాలు ! చివరి నిమిషంలో శ్రీదేవి జుత్తు రక్షించబడడం సంతోషమే గాని వాస్తవానికి అలా జరగదు .కరోనా రోజుల్లో ఇంకొంచెం డిప్రెసివ్ ,కానీ కథ చాలా సహజంగా వుంది .

  • ఒక పూలజడ ఒక జీవితకాల జ్ఞాపకం ఆ తల్లికి, ఆ పిల్లకి. ముగింపు చాలా బావుంది సుజాత గారు. దేవుడు కనపడడు అంటారు. ఈ కథలో షావుకారు రూపంలో ఉన్నాడు. మరో దగ్గర మరో రూపం.

  • కల్యాణి గారూ, నిజమే. మెజారిటీ జీవితాల్లో ముగింపు అలా జరగక పోయే అవకాశమే ఎక్కువ. చిన్న ఆశలు నెరవేరడమే ఒక కల. వాటిని చంపుకోవడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ

   థాంక్ యూ

 • ఎంత బాగా అల్లారమ్మా ఈ కథని. ఒక్క పాత్రచుట్టూ శ్రద్ధగా. భావోద్వేగాలను కొంచెం కొంచెంగా విదిలించాడు. క్లైమాక్స్ కథకు ఓ గొప్ప ముగింపును ఇచ్చింది. మంచి కథ చదివించినందుకు అభినందనలు

  • శ్రీధర్ గారూ,

   చాలా థాంక్సండీ, కథ అల్లిక నచ్చినందుకు.

 • శ్రీదేవి లో బాల్యపు అమాయకత్వం,
  సమస్యలకు వెరవని నాగమణి స్త్రీతత్వం,
  మంచితనం ఇంకా మిగిలుందని చెప్పే షావుకారు మానవత్వం….
  గొప్పగా ఉండండి కథ.

 • చాలా బాగా రాసారు.షావుకారు లొ మానవత్వం వూహించ లేదు.

 • కథని నడిపించిన వైనం అమోఘం.
  పాత్ర ఔచిత్యాన్ని చివరి వరకూ కాపాడారు.
  చాలా బావుందండీ..
  అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు