మల్లీశ్వరి

మా వూరికి అప్పుడప్పుడూ కొత్త కుటుంబాలు రావడమూ, వున్న కుటుంబాలు పోవడమూ కూడా జరిగేది. వూరికి కొత్త కోడలు వస్తేనే అదో సంబరం, అలాంటిది కొత్త కుటుంబమే వస్తే అదో కులుకు. వాళ్లెవరో, ఎంతమందో మనకేమవుతారో తెలుసుకోవాలని మరీ ఉబలాటం వుంటుంది. అలా వచ్చిన కుటుంబం మన యింటి ఎదురుగానే దిగితేనో.. ఉత్సాహం రెట్టింపవదూ! అంతకంటే ఆ యింట్లో ఇంచుమించు మనీడువాళ్ళే ఇద్దరాడపిల్లలుంటే!! వాళ్ళమ్మ “అల్లుడా!” అని నోరారా పిలుస్తూ మనింటికి వస్తే!!! ఓబయ్య మామ, అత్తా, వాళ్ళిద్దరి కూతుళ్ళతో కొత్తగా మావూరొచ్చారు. మా యింటికి ఎదురుగా ఖాళీగా వున్న కంసలోళ్ళ యింట్లో దిగారు. నాకు వాళ్ళు కొత్తయినా వూరికి కాదంట. ఓబయ్య మామది ఆ వూరే అయితే జీవనార్థం ఎక్కడికో ప్రవాసం పోయి మళ్ళీ తన వూరికే వచ్చాడు కుటుంబంతో. వాళ్ళకు ఓ కొడుకు వున్నా అతనెప్పుడూ వూర్లో వుండేవాడు కాదు. ఎక్కడ వున్నాడు అని అడిగితే టౌనులో ఏదో పని చేసుకుంటున్నాడు అనేవాళ్ళు. ఏ పండగకో పబ్బానికో మాత్రమే వూరొచ్చేవాడు.

ఆ యిద్దరు ఆడపిల్లల్లో చిన్నది నా కంటే చిన్నది, పేరు మళ్ళీశ్వరి. పెద్దది నాకంటే పెద్దది, పేరు గంగ. గంగ ఎంత చురుకూ, చలాకీనో, చిన్నది అంత సిగ్గరి, నెమ్మదీ. నేను హైస్కూల్లో వుండగానే గంగ పెళ్ళయి మరో వూరు వెళ్ళిపోయింది. అత్తగారింటికి వెళ్ళేరోజు అందరి అమ్మాయిల్లా ఏడవకుండా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్ళిందని..”ఏమిటీ పిల్ల అత్తగారింటికి వెళుతోందా, తిరణాళకు వెళుతోందా..” అని మా అమ్మ ఆశ్చర్యపోవడం నాకు గుర్తు. ఆ తర్వాత కూడా పండగకో, వూర్లో జరిగే పెళ్ళికో ఆమె వచ్చినపుడు ఆమాటే గుర్తు చేసి మా అమ్మ నవ్వించేది.

నేను హైస్కూలు దాటేసి వూరికి అప్పుడప్పుడు వచ్చే చుట్టాన్ని అయ్యాక తెలిసింది, మల్లిశ్వరికీ పెళ్ళి అయిపోయిందని. ఏదో వూరికి ఇచ్చారని. వాళ్ళు నా చిన్నప్పుడు వున్న కంసలోళ్ళ యింట్లోంచి రామాలయం వెనుక తమ స్థలంలో ఇళ్ళు కట్టుకొని అక్కడకు మారిపోయారు.  నేనెప్పుడు వూరు వెళ్ళినా, నేను వచ్చానని తెలిస్తే తప్పక వచ్చి ప్రేమగా పలకరించేవాళ్లలో ఆ అత్త ముఖ్యమైంది. ఆమెను ఎదురుపడితే “అత్తా” అని పిలవడం, పరోక్షంగా “ఓబయ్య గారామె” అనడమే గానీ ఆమె పేరేంటో తెలియదు. ఏంటో ఈ ఆడవాళ్ళు! పట్టణాల్లో నగరాల్లో “మిసెస్”లుగా, పల్లెల్లో “గారామె”లుగా, “గాడి పెళ్ళాలు”గా పిలవబడతారేగానీ స్వంత వునికి వుండదు. తన యింటి పేరెలాగూ మారిపోతుంది, తన పేరుకూ విలువ కరిగిపోతుంది. అదో విషాదం.

నేను వూరు దాటొచ్చి, పట్టణాలు, నగరాలూ దాటి, చివరికి దేశాన్నీ వదిలి వచ్చాక వూరికెళ్లడం వారాల్నుంచీ, నెలలకూ, నెలల నుండీ సంవత్సరాలకూ పెరిగింది. ఆ మధ్య ఓ సారి వెళ్ళినప్పుడు ఓబయ్య మామ అప్పటికే చనిపొయ్యాడు. అత్త మంచం మీద వుందని తెలిసింది. చూద్దామని వెళ్ళి తనున్న నులక మంచం పట్టె మీద కూర్చున్నా. గట్టిగా నా చేయి పట్టుకుంది. ప్రాణం అంతా కళ్ళల్లో మాత్రమే వుందా అన్నట్లున్నాయి కళ్ళు. అలాంటప్పుడు నాకు నోట్లో మాట రాదు. నోరు తెరిస్తే ఏడ్చేస్తానని నాకు భయం. నేను వెళ్ళినందుకు సంతోషించింది. నేను చూసొచ్చిన కొన్నాళ్ళకు తనూ చనిపోయిందని తెలిసింది.

మళ్ళీశ్వరికి అప్పటికే తన అత్తగారింట్లో ఏవో సమస్యలు వచ్చినట్టున్నాయి. భర్త వదిలేశాడు. తను కూడా వూరికి వచ్చింది. అన్న వున్నా ఎక్కడున్నాడో తెలియదు. అక్క వున్నా, తనూ తన పిల్లలూ. అమ్మా, నాన్నా లేకున్నా పెరిగిన వూరుకదా, వూర్లోనే వుండింది. తన చిన్నప్పుడు తను ఎప్పుడూ కూలికి పోవడం చూడలేదు. ఆ యింట్లో ఈ యింట్లో ఎవరో చెప్పిన పని చేసి, పెట్టిందేదో తిని, ఇచ్చిందేదో కట్టుకొని, ఏదో పంచన పడుకోవడం. సరైన తిండిలేకో, మానసిక బలంలేకో నీరసించింది. అండలేని ఆడది కదా.. ఆ పిల్లకు ఎయిడ్స్ అంట అన్న వదంతిని లేపారెవరో! దాంతో తనను ఇంట్లోకి పిలవడం మానేశారు. తన వూర్లోనే తను బిచ్చగత్తె అయింది. పిచ్చిదయింది. యింటి అరుగు మీద కుర్చున్నా లేచి పొమ్మని మానాన్న కసిరేవాడు! తినడానికి పెడితే కుక్కలకూ, కాకులకూ వేసేది. ఎందుకలా వేస్తున్నావు అంటే “నాకూ పుణ్యం వద్దా” అనేది.

మా తమ్ముడు దిలీప్ మల్లీశ్వరిని కడపకు తీసుకెళ్ళి పరీక్షలు చేయించాడు. రక్తహీనతే గానీ ఏ ఎయిడ్సూ లేదన్నారు డాక్టర్లు. దిలీపు తన మిత్రుల సాయంతో రక్తాన్ని సేకరించి అమెకు వైద్యం చేయించాడు. కాసింత మెరుగై వూరికొచ్చినా మానసికంగా మెరుగ్గాలేదు. కట్టుకోమని బట్టలిస్తే ఎక్కడో పారేసుకోవడం, పొంతన లేకుండా ఏదో గొణుగుతూ వుండటం, కాసేపు వేదాంతం మాట్లాడటం..

పదేళ్ల క్రితం నేను వూరెళ్ళినపుడు నేనూ, దిలీప్ వూరిలో తిరుగుతుంటే ఓ చోట గోడను ఆనుకొని అటేటో చూస్తూ వుంది. “ఏమ్మ్యా ఎలా వున్నావ్? నేనెవరో గుర్తు పట్టావా?” అని పలకరించా. అప్పుడు మా వైపు తిరిగి “దిలీపు సామీ నువ్వా!” అని రెండు చేతులెత్తి దండం పెట్టింది. “దిలీపు సరేగానీ నేనెవరో చెప్పు” అన్నా. “ఎవరో సామీ.. నేనింకా దొగలేమోనని, ఎట్ట సేయాల బగవంతుడా అని, ఇట్ట మల్లుకోనున్నా..” అన్నది. దిలీపును గుర్తు పట్టావే, దిలీపు అన్నలెవరు అంటే చెప్పింది. ఆ ప్రసాదును నేనే అంటే “ఎన్నెన్ని రోజులకు చూస్తిని సామీ” అంటూ తెగ సంతోషం ప్రకటించింది. ఆ ముందురాత్రి పడిన వర్షంలో బట్టలన్నీ తడిసిపోయాయట. ఎవరూ తమ తమ పంచల్లో పడుకోనివ్వలేదట! రాముడి గుడిలో పడుకుంటోందని గుడికి తాళాలు వేశారట! తడిసిన బట్టల్తో రాత్రంతా అలానే వున్నానని చెబుతుంటే గుండె చెరువయింది. రాతి దేవుడికి గుడి కట్టాం కానీ ప్రాణాలున్న ఆడబిడ్డకు పంచను కూడా పంచలేకపోయాం. ఎప్పుడయినా సరే మా యింటికి వచ్చి తిను, అక్కడే పడుకో అని చెప్పి ఓ వందరూపాయలు చేతిలో పెట్టి అక్కడినుండీ కదిలా. నేను చేసిన తప్పేంటో ఆ మరుసటి రోజు కానీ తెలియలా. ఆ మరుసటి వుదయం అన్నం కోసం ఇంటికి వచ్చినపుడు చెబుతోంది, “సామీ దొంగలున్నారంటే మీరు ఇంటిరా.. రాత్రి నా తలమీద గుండేస్తానని వాడెవడో దొంగ వచ్చి నువ్విచ్చిన నూర్రూపాయాలూ లాక్కపాయె.” అని.

అదే ఆమెను నేను చివరిసారి చూడడం. ఏమయ్యిందని అడిగితే ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి వదిలేశారట! మనిషి సంఘజీవి. ఒక్కరికి కష్టం వస్తే తనచుట్టూ వున్నవారు ఆదుకుంటారని అనుకుంటాం. కానీ వూరే వల్లకాడైతే? తోటి మనుషులే మనసులేనివారైతే! అదే పిచ్చివాడైతే వూర్లో వుండనిచ్చి వుందురా! పిచ్చిది కనక తరిమేశారా! ఇందులో నా పాపం ఎంత?

ప్రసాద్ చరసాల

ప్రసాద్ చరసాల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు