వేల సంవత్సరాల క్రితం రెండు గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి.
ఒకటి తక్షశిల. రెండోది నలంద. వీటిని చదువుకోవడానికి చైనా నుండి, పర్షియా నుండి, గ్రీస్ నుండి విద్యార్థులు నడిచి వచ్చేవారు. ఎందుకు? ఎందుకంటే అక్కడ చదువు జీవితాన్ని నేర్పేది.
తక్షశిలలో పదివేల మంది విద్యార్థులు 64 విభిన్న విషయాలు చదివేవారు. ఆయుర్వేదం నుండి అర్థశాస్త్రం వరకు, సంగీతం నుండి సైనిక విద్య వరకు అన్నీ ఒకేచోట నేర్పించేవారు. ఒక్క విషయం మాత్రమే చదివి బయటికి వెళ్ళే అలవాటు అప్పట్లో లేదు. తర్కం, వైద్యం, ఖగోళ శాస్త్రం, గణితం, కళలు, నీతి శాస్త్రం అన్నింటినీ కలిపి చెప్పేవారు. చదువు అంటే కేవలం జ్ఞానం సంపాదించడం కాదు, మనిషిగా పరిపూర్ణంగా తయారవడం అని నమ్మేవారు.
నలంద విశ్వవిద్యాలయంలో చర్చ, వాదన, విమర్శనాత్మక ఆలోచన చాలా ముఖ్యమైనవి. విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని, అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ప్రోత్సహించేవారు. గురువు చెప్పింది తల ఊపడం కాదు, అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అది మన వారసత్వం.
కానీ ఆ తర్వాత ఏం జరిగింది?
తక్షశిల దాడుల వల్ల నాశనమైంది. నలందను 1193లో బక్తియార్ ఖిల్జీ తగులబెట్టాడు. ఆ గ్రంథాలయం నెలల తరబడి మండింది. వేల సంవత్సరాల జ్ఞానం మంటల్లో కాలిపోయింది. తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది. వారు మన చదువు పద్ధతిని మార్చారు. ఒక్క విషయంలో నిపుణత అనే అంశం ప్రవేశ పెట్టి, అప్పటి అవసరాలకు అణుగుణంగా గుమస్తాలను తయారు చేసే చదువు పెట్టారు. “వికాసం” అనే మాట పోయి “ఉద్యోగం” అనే మాట వచ్చింది అప్పుడే.
అప్పటి నుండి ఇప్పటి వరకు అదే నడుస్తోంది.
ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ఇంజినీరింగ్ విద్యార్థికి కమ్యూనికేషన్ తెలియదు. డాక్టర్‌కి ఆర్థిక అవగాహన ఉండదు. ఆర్ట్స్ విద్యార్థి సైన్స్ చదవడమే తప్పు అని అనుకుంటాడు. అన్ని రంగాల జ్ఞానాన్ని ఒక్క చోటికి చేర్చే దృష్టి ఉండాలని నలంద, తక్షశిల చాలా కాలం క్రితమే నిరూపించాయి. కానీ నేడు చదువు ఇరుకైన గదుల్లో బంధించబడింది.
ఇప్పుడు మారాల్సిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఇప్పుడు కృత్రిమ మేధస్సు మూలంగా మనిషి విద్య ఎలా మారబోతోంది, అసలు మనిషి ఏమి నేర్చుకోవాలి అనే అంశాల పై చాలా చర్చలు నడుస్తున్నాయి. ముందుగా మనిషి నేర్చుకోవటం ఎలాగో నేర్చుకోవలట. తరువాత నలందా తక్షశిల మాదిరి బహుముఖ విఙానాన్ని సంపాదించుకోవలట. ఎలా అంటే పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు సైన్స్ తో పాటు కళలు, చరిత్ర తో పాటు గణితం కలిపి చెప్పాలి. ఒక సమస్యను అన్ని కోణాల నుండి చూడడం నేర్పించాలి. ఉపాధ్యాయులు తమ విషయం మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాలు కూడా నేర్పించగలగాలి. అప్పటి విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని కాదు, విజ్ఞానాన్ని అందించాయి. అవి నీతి, ఆధ్యాత్మికత, మేధస్సు అన్నింటినీ కలిపాయి. ఈ కోణం నేటి పోటీ విద్యలో పూర్తిగా కనుమరుగైంది.
పరీక్షలు కేవలం వినటాన్ని కొలవకూడదు. ఆలోచించే తీరును కొలవాలి. ఉద్యోగం దొరకడం విజయం కాదు, సమస్యలను పరిష్కరించగలగడం నిజమైన చదువు.
తక్షశిల, నలంద పోయినా వాటి సందేశం పోలేదు. ఆ సందేశం ఒక్కటే: విద్య జీవితం అంతటినీ తాకాలి. అన్నింటినీ అర్థం చేసుకునే మనసు తయారు చేయడమే నిజమైన చదువు.
ఆ విద్య మళ్ళీ వస్తుందా? అది మన చేతుల్లోనే ఉంది.
*








Add comment