“మనుషులం కాదు, భక్తులం”

అయ్యప్ప స్వామికి నోట మాట రాలేదు. చెప్పడానికి జవాబూ లేదు. చెపితే ఆమె వినేలానూ లేదు.

మగదేముడు!

“అమ్మా దేముడు యెవరికైనా దేముడేనా?”

“దేవుడు అందరికీ దేవుడే!”

“దేముడు దృష్టిలో అందరూ సమానమేనా?”

“దేవుడి దృష్టిలో అందరూ సమానమే!”

“మరి మనల్ని చాన్నాళ్ళు దాక గుడిలోకి రానివ్వలేదని తాతయ్య చెప్పాడు”

“అప్పుడు అంటరాని వాళ్ళమని దూరంగా పెట్టారు”

“ఔనా… మరి యిప్పుడూ నువ్వు అంటరాని దానివా అమ్మా?”

“ఆ…?”

“నువ్వే కాదు, ఆడవాళ్ళందరూ అంటరానివాళ్ళే, నేను కూడా!”

“ఎవరు చెప్పారు?”

“అయ్యప్ప గుడిలోకి మనం అడుగు పెట్టకూడదట కదా?”

“లేదమ్మా.. యెవరైనా వెళ్ళొచ్చని పెద్ద కోర్టు తీర్పు చెప్పింది”

“కాని అలా వెళ్ళకూడదు తప్పన్నారు, వెళితే తంతామన్నారు”

“కోర్టు తీర్పిచ్చాక కాదనేదెవరు?”

“పోలీసులు”

“ఎక్కడి పోలీసులు?”

“మన ఇంట్లో మగ పోలీసులు… నాన్నా మావయ్యా తాతయ్యా అందరూ!”

భక్తులున్నారు జాగ్రత్త!

“ఆడవాళ్ళు అయ్యప్ప స్వామిని నిర్భయంగా దర్శించుకోవచ్చు, వారికి పూర్తి బందోబస్తు కల్పిస్తాం. అవసరమైతే పక్క రాష్ట్రాలనుండి మరింతమంది పోలీసుల్ని రప్పించి భద్రత కల్పిస్తాం. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కోర్టు తీర్పుని అమలుపరుస్తాం” కేరళ ముఖ్యమంత్రి భరోసా యిచ్చారు.

“దేవుడే వున్నాడు” నమ్మకంతో ధైర్యంగా అందో భక్తురాలు.

“భక్తులు వున్నారు” అంతే నమ్మకంతో భయంగా అంది మరో భక్తురాలు.

ఆత్మ కాదు శరీరమే భక్తికి మార్గం!

“బీ ఏ రోమన్ యిన్ రోమ్.. రోమ్ వెళ్ళినప్పుడు రోమన్లా ప్రవర్తించమని సామెత”

“అంటే యెక్కడికి వెళితే అక్కడకు తగినట్టు వుండాలి అనేగా?”

“యెస్… వెరీగుడ్… నైష్టిక బ్రహ్మచారిగా స్వామిని ప్రతిష్టించారు గనుక…”

“బ్రహ్మచారులే వెళ్ళాలి అంతేగా?”

“బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు కూడా వెళ్ళొచ్చు”

“ఆడవాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే వెళ్ళొచ్చునా?”

“వెళ్ళకూడదు.. కోర్టు వెళ్ళొచ్చన్నా వెళ్ళకూడదు”

“స్త్రీ పురుషులిద్దరూ చట్టం ముందూ దేవుని ముందూ సమానమే కదా?”

“పదేళ్ళలోపు యాభై యేళ్ళపైబడి వయసు వుంటే ఆడవాళ్ళు వెళ్ళొచ్చు”

“మగవాళ్ళకు లేని ఏజ్ రూల్ ఆడవాళ్ళకెందుకు?”

“ఆడవాళ్ళు సుకుమారులు కదా? కొండ ఎక్కలేరు”

“ఎవరు చెప్పారు? తొమ్మిదో తరగతి చదివిన పూర్ణ ఎవరెస్టు ఎక్కింది”

“నిజమే, కాని కొండెక్కి మళ్ళీ పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే కొన్ని నియమాలు పాటించాలి”

“తాగుబోతులు కూడా తాగుడు మానెయ్యడానికి నియమాలు పాటించగా లేంది, మన ఆడవాళ్ళు పాటించలేరా?”

“అంటే- నలభై రోజులు పాటించాలంటే- ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ దాక వున్న వయసు వాళ్ళకి అవకాశం లేదు. అది ప్రకృతి ధర్మం”

“ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసుకున్నది కాదుగా… మీరే అంటున్నారు ప్రకృతి ధర్మం అని”

“ఆ సమయంలో ఆడవాళ్ళు ప్రత్యుత్పత్తి అనే మహత్తరకార్యంలో వుంటారు గనుక అది కూడా పుణ్యమే, ప్రకృతి ధర్మమే”

“అంటే- పిల్లల్ని కనే పనే కాదు, పెంచే పని కూడా మనదే, మగాళ్ళు మాత్రం మాల వేసి ఎంచక్కా ఏటికేడూ మేరీడు బ్యాచులర్స్ అయిపోతున్నారు”

“ఏం రుతుక్రమం ఆగిపోయాక వెళ్ళొచ్చును కదా?”

“వయసుడిగాక వెళ్ళమంటారు.. కొండా మెట్లూ అప్పుడు ఎక్కమంటారు అంతేనా?”

“తప్పదు”

“దేవుని దర్శించడానికీ పూజించడానికీ శరీరం శుద్దిగా వుండాలని అంటారు”

“అంతేగా?”

“అరే… ఇన్నాళ్ళూ నేను మనసు శుద్దిగా బుద్దిగా వుంటే చాలనుకున్నాను”

మతమూ సమ్మతమూ!

“మమ్మల్ని ఆలయాలలోకి అనుమతించండి అని మహిళలు అడుగుతున్నారు”

“లేదు, మహిళలు అడగడం లేదు”

“మరెవరు అడుగుతున్నారు?”

“దేవునిమీద విశ్వాసం లేని నాస్తికులూ ఫెమినిస్టులూ కమ్యూనిస్టులూ అడుగుతున్నారు”

“ఎందుకు?”

“సమానత్వం సాధించడానికి!”

“దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా?”

“…………………………………………………”

“దేవునిమీద విశ్వాసం లేనివాళ్ళు వాళ్ళ విశ్వాసాల సాధన కోసమైనా ఆలయాలకు రావడం మంచిదే కదా?”

“మంచిదే కాని మన కట్టుబాట్లూ సంస్కృతీ సాంప్రదాయాలు నాశనం చేసేస్తారు”

“ఏ విధంగా?”

“అన్యకులస్తుల్ని ఆలయాల్లో పూజారులుగా నియమించమని పోరాడి యెంతో కొంత సాధించారు”

“ప్రభుత్వపరంగా యే కొద్దిగో రిజర్వేషన్లు వున్నా నియామకాల్లో యెక్కడ?”

“చొచ్చుకొచ్చేస్తారండీ బాబూ.. రేపు భగవంతుడికి బీఫ్ పెట్టమని అన్నా అంటారు, వీళ్ళ బీఫ్ ఫెస్టివల్స్ చూళ్ళేదా?”

“భగవంతుడే బీఫ్ తిన్నాడనికూడా ఆధారాలు చూపిస్తున్నారుగా?”

“మరేం?, అంచేత అర్చ‘కుల’ విషయంలోనే కాదు, ఆడవాళ్ళ విషయంలోనూ కొన్ని నియమాలు తప్పనిసరి, మత విశ్వాసాలను దెబ్బతీయకూడదు కదా? ఆర్టికల్ 26కు భంగం కలిగించకూడదు కదా?”

“అంటే కుల అసమానతలూ లింగ అసమానతలూ వుండాలంటారు. ఆర్టికల్ 14, 15 రద్దు చేయాలంటారు?”

“అక్కర్లేదు, ఆర్టికల్ 26ను కాపాడుకుంటే చాలు. అదే ఆర్టికల్ 14, 15లను ఆలయాల్లో గుడుల్లో రద్దు చేసేస్తుంది. చెసెయ్యాలి. మతపరిధిలో రద్దు చెసెయ్యాలి. మినహాయింపు యివ్వాలి”

“మనలో మనమాట… మతం రద్దుకానంత వరకూ కుల అసమానతలూ లింగ అసమానతలూ రద్దు కావు కదండీ?”

“అంచేతే గదా? మనం మతాన్నీ మతాచారాల్నీ కాపాడుకోవాలి?!, అవే మన ధర్మాన్నీ మను ధర్మాన్నీ కాపాడుతాయి!”

పొగరాని నిప్పు!

తెల్లారగట్లే అందరికన్నా ముందు స్నానం చేసేది నేను. మా ఆయన వేడినీళ్ళు లేకుండా స్నానం చేయడు. కాని నువ్వు శీతల స్నానం చెయ్యలేవు, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

నెలకి మూడు రోజుల పేరుతో ప్రతీ నెలా అయిదారు రోజుల వరకూ కటిక నేలమీద దశాబ్దాలుగా నిద్రపోయేది నేను. మా ఆయన మంచం లేకుండా వొక్కరోజు నిద్రపోడు. కాని నువ్వు భూతల నిద్ర చేయలేవు, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

ఇంటి పనులలో ఇరవైనాలుగ్గంటలూ రాట్నం తిరిగినట్టు తిరిగి యింటoదరికీ అన్నీఅమిర్చిపెట్టేది నేను. మా ఆయన తన పనికూడా తాను చేసుకోలేడు. కాని నువ్వు ఆ కొండా పద్దెనిమిది మెట్లూ ఎక్కలేవు, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

ఇంటిల్లిపాదికి వండి పెట్టేది నేను. మా ఆయన తనకి వంట రాదని, చెయ్యి కాల్చుకోలేకే నిన్ను పెళ్ళి చేసుకున్నానంటాడు. కాని నీ వంట నువ్వే వండుకు తినలేవు, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

పూజలూ నోములూ వ్రతాలూ అని అత్తవారింటి అడుగుజాడల్లో బ్రహ్మచర్యం పాటించేది నేను. మా ఆయన నడిరేత్రి నన్ను నిద్రలేపకుండా నిద్రపట్టదంటాడు. కాని బ్రహ్మచర్యం చాలా కష్టం, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

కఠిన నియమాలు ఆచరించడానికి నేను సిద్ధం అన్నాను. మా ఆయన కొండకు మీ ఆడవాళ్ళు వస్తే మనసు చెదిరిపోతుంది అన్నాడు. నాకే కాదు, మా భక్తుల్లో చాలా మందికి అన్నాడు. కాని మనసు చెదరకుండా వుండడం చాలా కష్టం, నువ్వే కాదు మీ ఆడవాళ్ళు ఈ కఠిన నియమాలు పాటించలేరు- అంటాడు.

వాట్టూడూ?

“భగవంతుడు నిరాకారుడు. నిర్గుణుడు. నిర్మలుడు. సర్వవ్యాపి. సర్వాంతర్యామి. ఎక్కడైనా వుంటాడు. లేని చోటు లేదు. అంచేత ఆడవాళ్ళు శబరిమలే వెళ్ళాల్సిన అవసరం లేదు”

“మరి వేరే గ్రహం మీదికి వెళ్ళనా?”

“దేనికి?”

“నాకు మెన్సెస్ డేట్ దగ్గరకొచ్చింది!”

పూజారి వరమివ్వాలి!

“పుష్కర్ లో మగాళ్ళకు బ్రహ్మ టెంపుల్లోకి వెళ్ళడానికి లేదట”

“ఔనా?”

“తమిళనాడ్లో పార్వతీ టెంపుల్లోకి వెళ్ళడానికి లేదట”

“అయితే మనం కూడా కోర్టుకు వెళ్ళి ఆలయప్రవేశానికి అనుమతి తెచ్చుకోవాలి”

“దేవుడు అనుమతిచ్చినా పూజారి అనుమతివ్వాలిగా?”

“పూజార్లెవరు?”

“భక్తులు!”

కారణ కారణము!

“నేను అయ్యప్ప ఆలయానికి రాను”

“కోర్టు అనుమతించిందిగా?”

“అయినా సరే, నేను రాను”

“ఆడవాళ్ళుగా అది మన హక్కు”

“నేను నా హక్కుని వదులుకుంటున్నాను”

“భక్తులకి భయపడుతున్నావా?”

“లేదు?!, నాకు అర్హత వుంది, యెవరూ అడ్డుకోలేరు”

“మరి దేనికి భయపడుతున్నావ్?”

“నా వయసు తెలిసిపోతుంది… అది నాకు యిష్టం లేదు”

నియమమే నిబంధనము అను రహస్యము!

“ఆలయాల్లో ఆచారాల్లో నియమాలు వొత్తినే పెట్టరు”

“అన్నీ మనం పెట్టుకున్నవే, అవసరమైతే మనమే మార్చుకోవచ్చు”

“అలాగనకు, ప్రతీ ఆచారం వెనుక వొక అర్థం పరమార్థం ప్రయోజనం వుంటుంది”

“ఒక్కటి చెప్పండి”

“ఇప్పుడూ- అయ్యప్ప మాల వేసుకుంటే మండలం రోజులు. అంటే నలభై రోజులు పాటు నియమనిష్టలు పాటించి ఒకరకమైన జీవిత విధానానికి అలవాటు పడ్డట్టే కదా?, అందువల్ల తాగుడు లాంటి వ్యసనాలు మానెయ్యడానికి అవకాశం వస్తుంది”

“నిజమే, చాలా మంది మాల వేసేది కూడా వ్యసనం పోగొట్టుకోవడానికే, కాని చాలా మంది కొండ దిగుతూనే పీపాలకు పీపాలూ డ్రమ్ములకు డ్రమ్ములూ తాగేస్తున్నారు, యాక్సిడెంటులు అయిపోతున్నారు… మన వూళ్ళోనే…”

“అది మానవ బలహీనత. దేవుడు కాదు, యెవరూ ఆపలేరు కాపాడలేరు”

“మరి అయ్యప్ప ఆలయ ప్రవేశానికి ఆడవాళ్ళని అనుమతించక పోవడంలో కూడా యేదో వొక కారణం వుండే వుంటుంది”

“ఒకటి కాదు, అనేక కారణాలు వుంటాయి. ముఖ్యంగా ఋతుచక్రం వొకటి. రెండోది కుటుంబం నడపడానికి పురుషుడు కన్నా స్త్రీ అవసరం. ఫిజికల్లీ కూడా యింటికింద చేసేవాళ్ళు అవసరం. అన్నన్ని రోజులు ఆడది వెళ్ళిపోతే వంట మర్చిపోతే యింకేమన్నా వుందా? కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోదూ?”

“నాకు యింకో ముఖ్య కారణం కనిపిస్తోంది”

“ఏమిటది?”

“నలభైరోజులు తాగుడుకి దూరంగా వుండి వుండలేక దీక్ష విరమిస్తూనే కొండ దిగీ దిగక ముందే తాగుతున్నారు కదా? మరి యిన్నాళ్ళు సంసార సుఖానికి దూరంగా వుండి ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళమీద యేమన్నా అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పి ఈ నియమం పెట్టివుండొచ్చు”

“ఆ… ఆడవాళ్ళ మాన ప్రాణాల్ని కాపాడడమే అంతిమ విధి”

“మీరన్నట్టు అది మానవ బలహీనత. దేవుడు కాదు, యెవరూ ఆపలేరు కాపాడలేరు”

“అందుకే నియమాల్ని ప్రశ్నించకూడదు. అతిక్రమించకూడదు. అనుసరించాలి!”

“కోర్టులకీ స్త్రీ పురుష సమానత్వం కోరేవారికీ యివన్నీ తెలీవంటారా?”

“తెలీకనే. స్త్రీ పురుషులిద్దరికీ శీలం వొకటి కాదు. శీలం కోల్పోవడమూ వొకటి కాదు. స్త్రీలను కాపాడుకోవడంలో యింటికి పరిమితం చేయడంలో మతం వుద్దేశమే అది!”

“దేవుడున్నాడు!”

“ఉన్నాడు. కాని అందుకే మతం లేని దేవుడు లేడు. ఉండడు”

“అంటే మనం మతాన్ని కాపాడుకుంటే?”

“దేవుణ్ణి కాపాడుకున్నట్టే!”

“దేవుణ్ణి కాపాడుకుంటే?”

“మనల్ని మనం కాపాడుకున్నట్టే!”

తీర్పానంతర వాణిజ్య ప్రకటన!

“అమ్మా.. నువ్వూ నేనూ వొదినా పండగలకూ నోములకూ వ్రతాలకూ డేట్ వస్తుందంటే ఏం చేస్తాం?”

“రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటాం”

“ఇప్పుడు అయ్యప్ప ఆలయంలోకి సుప్రీం అనుమతి యిచ్చిందిగా?”

“ఆ థర్టీ డేసుకు మరో టెన్ డేస్ ఎక్సుటెన్సన్ హాయిగా చేసుకోవచ్చు”

“వాడండి…       …టాబ్లెట్స్”

దెయ్యాలయాలు!

“మన భారతదేశంలో యిరవైయ్యయిదు లక్షల దేవాలయాలున్నాయి”

“ముక్కోటి దేవతలకి యిరవైయ్యయిదు లక్షల దేవాలయాలేనా? మరి మిగతా దేవుళ్ళు దారిద్ర్యరేఖకు దిగువన వున్నట్టేగా?”

“అదికాదు విషయం. ఇరవైయ్యయిదు లక్షల దేవాలయాల్లో ఆరు దేవాలయాల్లో మగవారికి ప్రవేశం లేదు, కేవలం అయిదు దేవాలయాల్లో ఆడవారికి ప్రవేశం లేదు”

“ఇక్కడ కూడా మన మగవాళ్ళదే పైచేయి…”

“అదికాదు విషయం. మూడులక్షల మసీదుల్లో ఒక్క మహిళకు కూడా ప్రవేశం లేదు”

“ఏ విషయంలో తేడాలున్నా ఆడవాళ్ళ విషయంలో మతాలన్నీ ఒకటే గదూ?”

“అదికాదు విషయం. ఈ అభ్యుదయ దెయ్యాలు మసీదుల విషయంలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదని అడగరేం?”

“మనం మన ఆలయాల్లోకి ఆడవాళ్ళని రానివ్వాలని పోరాడి మద్దతిచ్చాక అప్పుడు అక్కడా దాటిగా అడగొచ్చు”

“మన సంగతి వదలండి.. వాళ్ళ సంగతి ముందు మాట్లాడండి”

“మనం మన పెళ్ళాన్ని తంతూ- పక్కింటి పొరుగింటి వాళ్ళు పెళ్ళాలను తన్నడం తప్పూ నేరం అంటే వింటారా?”

“మీ వుద్దేశం?”

“మనం మన యింటిని చక్కదిద్దుకుంటే.. అది చూసి వాళ్ళూ వాళ్ళ యింటిని యివాళ కాకపోతే రేపు చక్కదిద్దుకుంటారు”

“అర్థమయ్యింది”

“ఏమిటి?”

“నువ్వు కూడా అభ్యుదయ దెయ్యానివని!”

జ్ఞానోదయం!

ఒకామె తీవ్రాతి తీవ్రంగా తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు తను కోరుకున్న అయ్యప్ప మూర్తియై అగుపించాడు.

“ఏమి నీకోరిక?” అడిగాడు అయ్యప్ప.

“మా ఆడవాళ్ళ జీవితాల్లో ఋతుచక్రం లేకుండా చూడు స్వామీ” అడిగిందామె.

“ఋతుచక్రం ఆగిపోతే కాలచక్రం ఆగిపోతుంది” చెప్పాడు అయ్యప్ప వులిక్కిపడుతూనే.

“ఎందుకు ఆగిపోతుంది? నీ పుట్టుకలానే యేదో వొక దారి దొరుకుతుంది. హరిహరాదులు నిన్ను కనలేదా?” సూటిగానే అడిగిందామె. “నీ దర్శనం కోరి మేం వచ్చినా భక్తులు మమ్మల్ని కొట్టి చంపేస్తారు” అంది చావెలాగూ తప్పదన్నట్టు.

అయ్యప్ప స్వామికి నోట మాట రాలేదు. చెప్పడానికి జవాబూ లేదు. చెపితే ఆమె వినేలానూ లేదు. చివరికి-

“తధాస్తు” అనేశాడు అయ్యప్ప.

అంతే, మానవజాతి అంతరించిపోయింది?!

–ఈ కథ విన్నాక “మరి మనం యెవరం?” అడిగాడు అజ్ఞాని!

“మనుషులం కాదు, భక్తులం” స్పష్టం చేశాడు జ్ఞాని!!

*

Avatar

బమ్మిడి జగదీశ్వరరావు

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అని గట్టిగా అనరాదు. వేరొకరు వినరాదు. ప్రపంచములో హిందూమతోన్మాదం తప్పితే మిగతా మతాల్లో ఉన్మాదం, అసమానత్వం లేనేలేవు. ఒకవేళ ఉన్పప్పటికీ మనదేశంలో మాత్రం మిగతా మతాలవారందరూ పరిశుద్ధాత్మలు, అభ్యుదయవాదులు, శాంతిస్వరూపులు, మహిళా ఉద్ధారకులు వసంత్ నారాయణప్ప గారూ. నిజానికి హిందూ అనేదానికి అబ్రహామిక్ లేదా ఇప్పుడు వీళ్లు చెబుతున్న మతం లక్షణాలు లేనేలేవు. సుప్రీంకోర్ట్ కూడా అదే చెప్పింది. ఇదొక జీవన విధానం అని. కానీ, అయ్యప్ప గుడిలో ఏం జరిగినా, లేదా మాధేషీలు దున్నపోతులని బలిచ్చినా అంతా హిందూమతం గానే పరిగణింపబడుతుంది. ‘మతం నల్లమందు వంటిది’ అని ఉద్బోధించిన మార్క్సు భక్తగణ మేధానుయాయులు, కొండకొచో ‘నెపోలియన్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అనే యానిమాల్ ఫామ్ తాత్త్వికులు ఏం చేస్తారంటే……… ఇదే అయ్యప్ప గుడికి గనక ఇదివరకే స్త్రీలు కూడా వెళుతూ వుండివున్నట్లయితే ఆ కోట్లమందిని మూఢభక్తి, హిందూ మతోన్మాదానికి ఊతమిస్తున్నవారు, మనువాద ఆరాధకులు అని ఇంతకంటే వంకరగా (సారీ, వ్యంగ్యంగా) ఓ సాహితీ ప్రక్రియని మనమీదక విసిరివుండేవారు. ఏ గాలికి ఆ గొడుగు పట్టడం అనేది మనదేశంలోని సిక్యులర్ మేధావుల ట్రేడ్ మార్క్. వ్యంగ్యం అనేది ఒక ప్రక్రియ, రూపం మాత్రమే. సారం అనేది మన రాగద్వేషాల లేదా భావోద్వేగాల, లేదా మనం గ్రుడ్డిగా నమ్మే సిద్ధాంతాన్ని బండగా ప్రాపగాండా చేయడంలోనే ిఇరుక్కున్నట్లయితే రూపం వలన ఏ ప్రయోజనం లేదు. సారం విషయంలో మనకు తెలిసింది సరిపోదు అనుకుని, తెలుసుకోడానికి ఆసక్తి మరియు సామర్థ్యం వుంటే నేరుగా చర్చించడానికి చాలామంది సిద్ధంగా వున్నారు. సంభాషణ మాత్రమే పరిష్కారం అనుకుంటే రావచ్చు.

 • ‘‘భక్తి అనే నల్లమందును పీల్చే విషయంలో మనుష్యలందరూ సమానమే. ఋతుక్రమ వయోవర్గంలో వున్న స్త్రీలు అనర్హులు కారు. వాళ్లకి కూడా ఆ నల్లమందు మరింతగా పీల్చే అవకాశం స్వామి సన్నిధిలోనే వుంటుంది గనక వాళ్లపై వివక్ష తగదు.
  ’’

  కానీ, ప్రతి నిషేధాన్నీ వివక్షగా చూడలేం.

  ఇక రెండోవైపు చూద్దాం. ‘స్త్రీ ఋతుక్రమ విషయంలో సనాతన ధర్మ దృక్పథం ఏమిటి?’ అనే విషయంలో ‘ఇండియా ఫ్యాక్ట్స్’ అంతర్జాల పత్రిక నితిన్ శ్రీధర్ ఓ ఆరు వ్యాసాలు వ్రాసారు. మొదటి వ్యాసం లంకె యిస్తున్నాను. ఆసక్తి వుంటే మిగతా వ్యాసాలు కూడా ఆ పత్రికలోనే లభిస్తాయి.

  1) Hindu View of Menstruation- I: Menstruation as Ashaucha

  http://indiafacts.org/hindu-view-menstruation-ii-
  menstruation-ashaucha/

  2) Hindu View of Menstruation- II: Menstruation as Austerity and Self-purification

  3) Hindu View of Menstruation- III: Menstruation as a period of Rest and Sacred Celebration

  4) Hindu View of Menstruation- IV: Menstruation from Yogic perspective

  5) Hindu View of Menstruation- V: Menstruation in Ayurveda

  6) Hindu View of Menstruation- VI: Menstruation Restrictions and Attitudes

  ‘‘ప్రపంచంలోని వివిధ మతాలు, సంస్కృతులలో స్త్రీల ఋతుక్రమాన్ని ఏ దృష్టితో చూసాయి?’’ అనే విషయంపై మరొక వ్యాసం. ఇది కూడా అదే అంతర్జాల పత్రిక India facts లో లభిస్తుంది.

  Views of Menstruation in Religions and Cultures around the world

  • సోదరాశ్రీనివాసా !! ఇవ్వన్నీ వీరికి అర్ధం అవుతాయా ? అయ్యిన్ది పో .
   అర్ధం అయినా , లాజిక్ ఉన్నా వారి ఐడియాలజీ కి అది పనికిరాక పొతే అవి పరిగణలోకి తీసుకుంటారా ? తీసుకోలేరు పో.

   కావున శంఖం ఊదటం మానెయ్యమని అంటాము అనుకున్నారా ? అనను. కీప్ ఆన్ ఎక్సపోసింగ్ థీజ్ మేధావిస్.

   ఇట్లు తిరుమల శ్రీనివాసుడిపై ప్రేమతో
   నీ చిన్న తమ్ముడు తిరుపతి గోవిందరాజులు

 • జస్టిస్ ఇందూ మల్హోత్రా ఈ వ్యాజ్యంపై వ్రాసిన తీర్పులోని ముఖ్యాంశాలు:

  మెజారిటీ తీర్పు వెలువరించిన జడ్జిలు సామాన్యులు కారు. ఒకరు సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి. మిగతా ముగ్గురూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి, న్యాయరంగంలో తల పండిన గండర గండలు. వారితో పోల్చితే ఇందూ మల్హోత్రా అనుభవం ఎందుకూ కొరగాదు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితమై కొద్ది నెలలే అయింది. అంతటి హేమాహేమీల ఉమ్మడి అభిప్రాయం ముందు సత్రకాయలాంటి జూనియర్‌ మోస్టు జడ్జి వెలిబుచ్చిన అసమ్మతికి విలువేమిటి అని తక్కువ చేయటం తప్పు. బెంచిలోని మిగతా జడ్జిల తీర్పుల కంటే జస్టిస్‌ ఇందూ మల్హోత్రా తీర్పు నిడివి తక్కువే. అయితేనేమి? మిగతా పెద్దలందరి వైఖరిలోని బోలుతనాన్ని ఆమె ఏ ఒక్క పాయింటునూ వదలకుండా, తిరుగులేని కేస్‌లా ఉటంకింపులతో ఎంతో చక్కగా బయటవేశారు. మచ్చుకు కొన్ని భాగాలు చూడండి:

  ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ 32వ అధికరణం కింద సుప్రీంకోర్టు ముందుకు వచ్చేటప్పుడు ఈ దేవాలయంలో పూజించేందుకు తమకున్న వ్యక్తిగత హక్కులు భగ్నమైనట్టు చూపించగలగాలి. శబరిమల ఆలయానికి తాము భక్తులమని పిటీషనర్లే క్లెయిము చేయడం లేదు.

  మత వ్యవహారాల్లో ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించడం వల్ల సంబంధిత మతంలోగాని, సంబంధిత పూజామందిరం మీదగాని ఎలాంటి విశ్వాసంలేని కజ్జాకొర్లకు ఆయా మత విశ్వాసాలను, విధానాలను సవాలు చేసేందుకు ఫ్లడ్‌ గేట్లను తెరిచినట్లు అవుతుంది.

  మరి భారత రాజ్యాంగం (14వ అధికరణం) పౌరులందరికీ సమానత్వ హక్కును ఇచ్చింది కదా? ఒక వర్గం మహిళలను శబరిమల గుడిలోనికి అనుమతించకపోవటం ఆ ప్రాథమిక హక్కుకు భంగకరం కాదా?

  ఔను. కచ్చితంగా భంగకరమే అని మెజారిటీ తీర్పు బల్లగుద్ది చెప్పింది. జస్టిస్‌ ఇందు మల్హోత్రా అది ఎంత మాత్రం భంగకరం కాదని సహేతుకంగా వివరించారు ఇలా :

  ”14వ అధికరణం సమానత్వ హక్కును ఇచ్చినట్టే 25, 26 అధికరణాలు మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కును ఇచ్చాయి. అది కూడా ప్రాథమిక హక్కు కిందికే వస్తుంది. మత విషయాలు, మతాచరణకు సంబంధించినంతవరకూ 14వ అధికరణం కింద సమానత్వ హక్కు ఆ ఫలానా మతానికి, విశ్వాసానికి మతశాఖకు చెందినవారికి మాత్రమే ఉంటుంది. తాము అయ్యప్పస్వామి భక్తులమనిగాని, శబరిమల ఆలయంలో పాటిస్తున్న పద్ధతులవల్ల తమకు అన్యాయం జరిగిందనిగాని పిటిషనర్లు చెప్పడం లేదు. అక్కడ అనుసరిస్తున్న పద్ధతి మహిళల పట్ల వివక్ష అని పిటిషనర్లు వాదిస్తున్నారు. కాదు; మా మతవిశ్వాసాల ప్రకారం మేము నడుస్తున్నామని ప్రతివాదులు అంటున్నారు. ఆ ఆలయానికి సంబంధించినంత వరకూ అది తప్పనిసరి అయిన మతాచారం (essential religious practice) అని వారి వాదన. మతాచరణ స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కే. కాబట్టి మత వ్యవహారాల్లో 14వ అధికరణపు సమానత్వ సూత్రాన్ని బయటివారి నిమిత్తం చొప్పించాలని చూస్తే ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా మత విశ్వాసాల, మతవిధానాల మంచి చెడ్డల హేతువులను న్యాయస్థానం సమీక్షించవలసి వస్తుంది.

  సతీసహగమనం వంటి నికృష్టమైన సామాజిక దురాచారాలను మినహాయిస్తే ఒక మతానికి చెందిన ఆచారాలలో వేటిని కొట్టివేయాలన్నది నిర్ణయించటం కోర్టుల పని కాదు…. ఏది అతి ముఖ్యమైన మతాచారం అన్నది ఆ మతంవారే నిర్ణయించుకోవాలి.

  **శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీలను రానివ్వకపోవటం దురాచారం కాదా? పైన పేర్కొన్న మినహాయింపు దానికి వర్తించదా? ఈ సందేహానికి జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఇచ్చిన జవాబు ఇది :**

  ”ఒక్క శబరిమలలో తప్ప అయ్యప్పస్వామి దేవాలయాలు వేటిలోనూ మహిళల ప్రవేశానికి పరిమితి లేదు. అన్ని వయసుల మహిళలందరూ ఆ గుళ్లకు వెళ్లి స్వేచ్ఛగా అర్చించవచ్చు. కాబట్టి లింగపరమైన సమానత్వానికి ఢోకా లేదు.

  ”కేవలం లింగ ప్రాతిపదికన వివక్ష చూపటం 15వ అధికరణం కింద నేరం. శబరిమలలో మొత్తంగా స్త్రీల ప్రవేశం మీద నిషేధం లేదు. అక్కడ ప్రవేశాన్ని రిస్ట్రిక్ట్‌ చేసింది కేవలం ఒక వయోవర్గానికి చెందిన మహిళల మీదనే. అదికూడా వివక్ష చూపాలని కాదు. అక్కడ దేవుడు ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసం వల్లనే అలాంటి పరిమితి పెట్టారు. అది కూడా రాజ్యాంగానికంటే ముందు నుంచే అమలులో ఉంది. ‘భూతనాథ గీత’ అనే స్థల పురాణంలో అనేక శతాబ్దాల కిందటే ఆ నిషేధం విధించబడింది.

  ”వయసు మళ్లిన స్త్రీలు, చిన్న అమ్మాయిలు ఈ గుడికి వెళ్లవచ్చు. కాని రజస్వల అయ్యాక ఒక వయసు వచ్చేంతవరకు మహిళల మీద నిషేధం ఉంది.” అని 1893,1901 సంవత్సరాల్లో ప్రచురించిన ”Memoir of the Travancore and cochin states” సర్వే రిపోర్టులో Lieuntenants ward and conner శబరిమల ఆలయ విషయంలో పేర్కొన్నారు.

  ”ఆచారం, వాడుక కూడా శాసనం కిందే పరిగణింపబడుతాయని రాజ్యాంగ 13(3)(ఎ) అధికరణం నిర్దేశిస్తున్నది. చెల్లుబాటయ్యే ఆచారానికి లక్షణమేమిటంటే అది పూర్వం నుంచీ చిరకాలంగా పాటింపబడాలి. సమంజసమైనదిగా ఉండాలి. అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉండాలి. పైన ప్రస్తావించిన ఆచారాలు, వాడుకలు శబరిమలలో అనేక శతాబ్దాలుగా అమలవుతున్నాయనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. దేవతామూర్తి ‘నైష్ఠిక బ్రహ్మచారి’ అన్న కారణంతో అక్కడ అనుమతించని ఒక వయోవర్గంవారు మినహా మిగతా, మహిళల మీద శబరిమలలో కూడా నిషేధం లేదు. దేవతామూర్తి పవిత్రతను, దేవతాతత్వాన్ని పరిరక్షించే ఉద్దేశంలో మాత్రమే ఆ పరిమితి ఆంక్షను విధించారు. దానిమీద అయ్యప్పను కొలిచే భక్తురాళ్లలో ఎవరికీ అభ్యంతరం ఉన్న దాఖలాలు లేవు. “

  • ఇందూ మల్హోత్రాగారి తీర్పును వివరంగా అందించినందుకు ధన్యవాదాలు. ఆమె వాదన బాగుంది. ఈ నిషేధాన్ని వివక్షగా చూసే అవకాశం లేదు.

   • హిందువుల ఆలయ ప్రవేశం గురించి హిందూ మహిళలకన్న ఒక ముస్లిం మహిళ ఆవేశపడి కేసు వెయ్యడం ఏంటో!అది గొప్ప సెక్యులర్ సమస్య అయినట్టు ఒక మైండు లేని జడ్జి తప్పుడు తీర్పు ఇవ్వడం ఏంటో!దాన్ని హైందవేతరులు ఆనందంగా స్వాగతించడం ఏంటో!

    మక్కా లోని కాబా ఫగ్గిర “Non Moslems are not allowed” అని పబ్లిక్ బోర్డు పెట్టి మరీ ముస్లిమేతరుల్ని వెళ్ళనివ్వడం లేదు.నేను పోయి నా మనోభావాలు దెబ్బతిన్నాయి,ఇది మానవహక్కుల ఉల్లంఘన అని సౌదీ అరేబియా కోర్టుల్లో కేసు వస్తే నాకు అనుకూలమైన తీర్పు వస్తుందా?తీర్పు ఎట్లా ఉన్న ఐక్కడ ఆ ముస్లిం మహిళని సపోర్టు చేస్తున్న ఆదర్శవంతులు నాకు సపొర్టుగా నిల్బడతారా?

    “ర్రెర్రెబ్బెబ్బెడ్డెడ్డెడ్డే,అది మన దేశం కాదు,దేశాల మధ్యన గొడవలు వచ్చే సమస్య – మాకు సంబంధం లేదు!” అనకుండా గుండెల మీద చెయ్యేసుకుని జవాబు చెప్పండి.

    P.S:శుంఠలు శుంఠల్లా ఉంటే వాళ్ళతోఎట్లా ప్రవర్తించాలి అన్న విషయంలో కొంచెం క్లారిటీ ఉంటుంది.శుంఠలు మేధావుల వేషం కడితే ఎవరు శుంఠలో ఎవరు పండితులో తెలుసుకోవడం కష్టం అవుతుంది – మీరు నాకు జవాబు చెప్పే ముందు మాకు మీ గురించి కంఫ్యూజన్ తగ్గించరూ – ప్లీజ్!

 • హిందువుల ఆలయ ప్రవేశం గురించి హిందూ మహిళలకన్న ఒక ముస్లిం మహిళ ఆవేశపడి కేసు వెయ్యడం ఏంటో!అది గొప్ప సెక్యులర్ సమస్య అయినట్టు ఒక మైండు లేని జడ్జి తప్పుడు తీర్పు ఇవ్వడం ఏంటో!దాన్ని హైందవేతరులు ఆనందంగా స్వాగతించడం ఏంటో!

  మక్కా లోని కాబా ఫగ్గిర “Non Moslems are not allowed” అని పబ్లిక్ బోర్డు పెట్టి మరీ ముస్లిమేతరుల్ని వెళ్ళనివ్వడం లేదు.నేను పోయి నా మనోభావాలు దెబ్బతిన్నాయి,ఇది మానవహక్కుల ఉల్లంఘన అని సౌదీ అరేబియా కోర్టుల్లో కేసు వస్తే నాకు అనుకూలమైన తీర్పు వస్తుందా?తీర్పు ఎట్లా ఉన్న ఐక్కడ ఆ ముస్లిం మహిళని సపోర్టు చేస్తున్న ఆదర్శవంతులు నాకు సపొర్టుగా నిల్బడతారా?

  “ర్రెర్రెబ్బెబ్బెడ్డెడ్డెడ్డే,అది మన దేశం కాదు,దేశాల మధ్యన గొడవలు వచ్చే సమస్య – మాకు సంబంధం లేదు!” అనకుండా గుండెల మీద చెయ్యేసుకుని జవాబు చెప్పండి.

  P.S:శుంఠలు శుంఠల్లా ఉంటే వాళ్ళతోఎట్లా ప్రవర్తించాలి అన్న విషయంలో కొంచెం క్లారిటీ ఉంటుంది.శుంఠలు మేధావుల వేషం కడితే ఎవరు శుంఠలో ఎవరు పండితులో తెలుసుకోవడం కష్టం అవుతుంది – మీరు నాకు జవాబు చెప్పే ముందు మాకు మీ గురించి కంఫ్యూజన్ తగ్గించరూ – ప్లీజ్!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు