మనకొద్దు! మనకొద్దు ఈ చై.నా. చదువులు!!!!

అవకాశాలు పెరగకుండా కేవలం పోటీ పెరగటం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? 

ఇది నిజం.  విద్యార్ధులు హతులవుతున్నారు.  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  అక్కడక్కడా హంతకులవుతున్నారు.  విద్యార్ధుల నెత్తుటి మరకలతో విద్యాలయాల గోడలు నిండిపోతున్నాయి.  ఎవరో విద్యార్ధి కళాశాల పై అంతస్తు నుండి కిందకి దూకుతాడు.  నేల మీదకి నెత్తుటి పిడుగులా రాలి పడతాడు.  మరో విద్యార్ధిని చున్నీతో ఫ్యాన్ కి ఉరేసుకొని మరణిస్తుంది.   జూనియర్ కళాశాలల్లో అయితే మరింత హింస.  ఉక్కపోత. కట్టడి.  ఇంక హాస్టళ్ళైతే కబేళాల వాసన కొడుతుంటాయి.  ఐతే సమస్య జూనియర్ కళాశాల స్థాయి నుండే మొదలైందా?  ఈ నెత్తుటి మరకల జాడలు ఎక్కడికి తీసుకెళతాయి?

***

ఏ అభివృద్ధి చెందుతున్న దేశంలో అయినా నాణ్యమైన విద్యని ఉచితంగా అందించటం ప్రభుత్వాల బాధ్యత.  ఆరోగ్యంతో పాటు విద్యని మించిన సంక్షేమ బాధ్యత మరొకటి లేదు ప్రభుత్వాలకి.  మరీ ముఖ్యంగా సంక్షేమ, సామ్యవాద రాజ్యాంగాల్ని ప్రకటించుకున్న భారత్ వంటి దేశాలకు అది మరీ తిరస్కరించలేని, నిర్లక్ష్యం చేయలేని కర్తవ్యం.

మన దేశంలో విద్యా వ్యవస్థ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలుగా చీలిపోయింది.  ప్రభుత్వ విద్యకి, ప్రైవేటు విద్యకి మధ్య స్పష్టమైన విభజన రేఖ వుంది.  అది విద్యా బోధనలోని నాణ్యత కంటే బోధనా విధానం, కల్పించే ఆశలు, సృష్టించే భ్రమలు, ఆకాంక్షల వొత్తిడి, విద్యార్ధుల మీద పెట్టుకునే అంచనాలకి సంబంధించినది.    ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక లోపాలు వున్నాయి.  వాటన్ననింటికీ పూర్తిగా ఉపాధ్యాయుల్ని బలిపశువుల్ని చేసే ఆలోచనా విధానం మీద నాకు నమ్మకం లేదు.  ప్రభుత్వ విద్యా వ్యవస్థలో లోపాల్ని, బాధ్యతారహిత్యాల్ని ప్రైవేటు విద్యా వ్యవస్థలోని దోపిడీతో, హింసతో పోల్చలేము.  మార్కులు మాత్రమే నాణ్యతకి గీటురాళ్ళనే మోసపూరితమైన ప్రైవేటు విద్యా వ్యవస్థ మీదనే ఈ వ్యాసంలో ఎక్కువగా ఫోకస్ చేయదలుచుకున్నాను.   అంతేకాదు విద్యా వ్యవస్థలోని మూడు ముఖ్యమైన భాగాలైన, ప్రాధమిక పాఠశాల, హైస్కూల్, జూనియర్ కాలేజి వరకే పరిశీలిద్దాం.

****

ఇప్పుడు బతుకంతా ప్రయివేటు రంగం కౌగిట్లోకి చేరిపోయింది.  మన పబ్లిక్ లైఫ్ మొత్తం ప్రైవేటుపరం అయిపోయింది.  ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం, ప్రైవేటు  రవాణ…అంతా ప్రై’వేటే’.  మన చేత పన్నులు కట్టించుకునే ప్రభుత్వం కనబడాల్సిన చోట, నేనున్నానని భరోస ఇవ్వాల్సిన చోట ప్రైవేటు రంగం పళ్ళికిలిస్తూ సాక్షాత్కరిస్తున్నది.  జవాబుదారీతనం లేని అడ్డగోలు సేవలతో, పది రూపాయిలతో పోవాల్సిన చోట వేయి రూపాయిలు ఖర్చు పెట్టించే ప్రైవేటు సేవల కబంధ హస్తాల్లో మనం చిక్కుకొని వున్నాం.  విలవిల్లాడుతున్నాం. ప్రైవేటంటే పెట్టుబడే కదా!  పెట్టుబడి అంటే లాభాల కోసం చేసే వ్యాపారమే కదా!

అది స్కూలు కావొచ్చు. లేదా ఆస్పత్రి కావొచ్చు.   పెద్ద పెద్ద భవంతులు మన మతి పోకొడుతుంటాయి.  కార్పొరేట్ కల్చర్ మనల్ని కన్ను గీటి పిలుస్తుంటుంది.  మన జేబులు ఖాళీ చేయనిదే వారూరుకోరు.  మనకూ తృప్తి వుండదు.  ఆ రకంగా వాళ్ళ విష కౌగిళ్ళలోకి వెళ్ళిపోతుంటాం.  విద్య, వైద్యం రంగాల ప్రైవేటీకరణకు – పెట్టుబడికి వున్న సంబంధం అర్ధం అయితే కానీ ప్రత్యామ్నాయం కనబడనీయని మన దయనీయ స్థితి ఏమిటొ మనకు అర్ధం కాదు.

మూడో తరగతి నుండే ఐఐటీ కోచింగంట.  మనం చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టించుకునే కన్సూమరిస్టులం కదా.  ఒప్పేసుకుంటాం.  ఆ మూడో తరగతిలోనే మన బిడ్డ ఐఐటిలో జాయినయినట్లు సెల్ఫ్ హిప్నాటిజంలోకి మనల్ని మనమే బరబరా ఈడ్చుకెళ్ళేసి పారేసుకుంటాం.  అవును మరి, ఆ విద్యా పెట్టుబడిదారుడేమైనా తక్కువ ఇన్వెస్ట్ చేసాడా కలల్ని మించిన మన భ్రమల మీద,  భ్రమల్ని మించిన ఆశల మీద?  షాపింగ్ కాంప్లెక్సుల్లో ఈ కార్పొరేట్ చైన్ స్కూళ్ళేవిటని ఆలోచించం.  పదేళ్ళ పసి ప్రాణానికి ఐఐటీ ఏమిటనే ఇంగితాన్ని కూడా కోల్పోతాం.  పేరెంట్స్ గా మన కలల శిలువ మీదకి పిల్లల బాల్యాన్నెక్కించేస్తాం.  మరి మనకేమో వాళ్ళ భవిష్యత్తుకి ఇంతకు మించిన ప్రత్యామ్నాయం కనబడదు.

టెక్నో స్కూళ్ళంట. టెక్నో స్కూళ్ళు!!  మన డబ్బుల్ని, మన పిల్లల బాల్యాల్ని దోచుకోటానికి కొత్త టెక్నిక్.  ప్రత్యేకమైన క్యాంపస్లు. సహజ సిద్ధమైన ప్రతిభకి విలువ లేదు.  విద్యార్ధి సృజనాత్మకతకీ, నవ్య రీతి ఆలోచనలకి, ఆవిష్కరణలకీ ఆస్కారం లేదు.    పాఠశాల అంటే పిల్లలకి పాఠాలు చెప్పేది.  పాఠమంటే విద్యార్ధులకు బోధించే భూత, భవిష్యత్, వర్తమానాలకు చెందిన ఆచరణీయ జ్ఞానాన్ని పరిచయం చేసేది.  జ్ఞానమంటే వ్యక్తిగతంగానూ సామాజికంగానూ అభివృద్ధికి దోహదం చేసేది.  అయితే ఈ టెక్నో స్కూళ్ళు నిజంగా అలాంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయా?  ఈ ఎడ్యుకేషనల్ కేపిటలిస్ట్స్ కి అలాంటి నిబద్ధత వుంటుందా?  వున్నాయనుకోవటం మన దురాశ.

పిల్లలందరికీ ఒకే రకమైన మూసలో ఇష్టాయిష్టాలుండవనీ, అందరికీ లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్ధం కావనీ, వారిలో చాలామందికి పాటలంటే, నృత్యమంటే ఇష్టం కావొచ్చనీ, సానబెడితే వారి నుండి గొప్ప క్రీడాకారులు తయారవొచ్చనీ మనం ఆలోచిస్తామా?  వుహూ.  అబ్బే.  మనం ఎందుకాలోచిస్తాం?  మనం విద్యా పెట్టుబడిదారుల మిరుమిట్లు గొలిపే లేజర్ షోలో ఎక్కడో ఓ మూల శలభంలా చిక్కుకొని పోయున్నాం.  సాలెగూడులో పురుగులా ఇరుక్కుపోయి వున్నాం.  చై.నా.వాళ్ళ వందలకొద్దీ బ్రాంచుల్లోని ఏదో ఒక మందలో మన పిల్లలు గొర్రెల్లా చోటు దక్కించుకుంటే చాలు.

పాఠశాలంటే తరగతి గది మాత్రమే కాదనీ, పాఠశాలంటే ఆడుకునే మైదానమనీ,  సాయంకాలం పూట ఆడి ఆడి అలసిపోయి గ్రౌండులో ఓ మూలనున్న చెట్టు కింద సేద తీరటమని, ఓ మూల నిశ్శబ్దంగా కూర్చునే గ్రంధాలయమనీ, విద్యార్ధి-ఉపాధ్యాయుడి  మధ్య అవ్యాజానుబంధమనీ, పాఠశాలంటే చిన్న చిన్న ప్రయోగాల్ని ఉత్సుకతతో అబ్బురంగా చూసే అనుభవమనీ, అందమైన స్నేహమనీ, కోతికొమ్మచ్చితో సహా రకరకాల ఆటలనీ మర్చిపోయాం.  ఎంతమంది ఈ తరం పిల్లలకి క్రాఫ్ట్ క్లాసుల గురించి, డ్రాయింగ్ క్లాసుల గురించి తెలుసు?  ఎంతమంది పిల్లలు డ్రిల్ మాస్టారి విజిల్ కి అనుగుణంగా కవాతు చేయటం, కబడ్డీ, ఖో ఖో ఆడుకోవటం తెలుసు?  పదో తరగతిలో తొంభై ఐదు శాతం వచ్చిన పిల్లలు తమ మీద అంచనాల్ని అందుకోలేక పోయామని నిరాశతో భోరుమని ఏడవటానికి కారణం ఎవరు?

విద్యా కార్పోరేట్ల దోపిడీ, (మనకి తెలియదు కానీ) తల్లిదండ్రులుగా మన పిచ్చీ పీక్స్ కి చేరేది ప్లస్ టూలోనే.  ఐఐటి, ఎంసెట్, నిట్, జేఈఈలు తప్పితే మరో లక్ష్యం లేదిక్కడ.  ఏ చై.నా. బందులదొడ్డిల్లాంటి కాలేజీల్లోనో, కబేళాల్లాంటి హాస్టళ్ళలోనో తీసుకెళ్ళి పడేస్తాం.   పిల్లలింక చదువు కోసమే బతకాలి.  రోజుకి పదహారు, పద్దెనిమిది గంటలు చదువుతో గడపాలి.  ఆదివారం లేదు. పండగల్లేవు.  వొత్తిడి పెరగదూ?  ఆ వొత్తిడి డిప్రెషన్ కో లేదా హింసకో దారి తీయదూ?  ఈ వొత్తిడి తట్టుకోలేకనే కదా కళాశాల పై అంతస్తు నుండి దూకి మరీ చచ్చిపోతున్నారు!  నిజానికి రాంకులు కొట్టే పిల్లలు కేవలం తమ ఆసక్తితో మాత్రమే చదువుతారని, వారిని వారి తలిదండ్రులు ఏ వొత్తిడికీ గురి చేయాల్సిన అవసరం వుండదని, ఏ పోటీ లేకపోయినా ఇష్టంగానే చదివి సాధిస్తారని, అది వారి స్వాభావిక తత్వమని,  మిగతా పిల్లలు పోటీ సృష్టించే వొత్తిడికి బలై పోతారని,  తమ స్వలాభం కోసం  పోటీ అనేది కార్పొరేట్లు సృష్టించిన వాణిజ్య సూత్రమని, అది కృత్రిమమైనదని యావరేజి విద్యార్ధుల తల్లిదండ్రులు ఎప్పటికి గుర్తిస్తారో! గుర్తించి మాత్రం ఏం చేయగల స్థితిలో వున్నారు తల్లిదండ్రులు?  వాళ్ళ ముందు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయని అసలు.

తొంభయవ దశకం మొదట్లొ మొదలయిన ప్రపంచీకరణ ప్రైవేటురంగానికి ఊతమిచ్చినప్పటి నుండి పెట్టుబడి మరీ విజృంభించింది.  భారతదేశంలో ఉత్పత్తిరంగంలో కంటే సేవారంగం మీద పెట్టుబడిదారుల దృష్టి పడింది.  గ్లోబలైజేషన్ కి టెక్నాలజీ అనివార్యంగా గుర్రం వంటి వాహనమైంది.  సాఫ్ట్ వేర్ రంగం అన్ని డిసిప్లిన్స్ లోకి దూసుకొచ్చింది.  కంప్యూటర్స్ ఒక పెద్ద మేనియా సబ్జెక్టైపోయింది.  మెకానికల్ తో బీటెక్ చేసిన వారికంటే ఎం.సీ.ఏ. చేసిన వారికి అవకాశాలెక్కువైనాయి.  అమెరికా నుండి రారమ్మని పిలుపులు వినిపిస్తున్నట్లే వుండేది.  మొదట్లో చాలా మంచి పేకేజిలతో ఉద్యోగాలొచ్చేవి.  ఇరవై ఏళ్ళ సర్వీసున్న ప్రభుత్వోద్యోగులు 2000 మొదటి దశకంలో 15 వేలు కూడా సంపాదించని రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ముప్ఫై, నలభవేలతో కెరీర్ని మొదలెట్టేవారు.  ఇంకేముంది పోలోమని మాథ్స్ గ్రూపులకి పిచ్చ డిమాండ్ ఏర్పడింది.  ఈ ట్రెండ్ మొదలవక ముందు (1980/1990లలో)…. అంటే ఇంకా అప్పటికి చై.నా.వాళ్ళు విద్యారంగం మీద పెద్దెత్తున దాడి చేయకముందు ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలే ముఖ్యమైనవి.   అయితే ఆ కాలేజీలు అయిపోగానే అందులో పని చేసే లెక్చరర్లు సబ్జెక్టుల వారీ ట్యూషన్లు చెప్పేవారు.  వాళ్ళూ కష్టపడేవాళ్ళు.  బ్రహ్మాండంగా సంపాదించే వారు.  నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక్క తెలుగు, హిందీ, ఆర్ట్స్ సబ్జెక్టులు మినహాయించి అన్ని సబ్జెక్టులకి ట్యూషన్లకి వెళ్తుండేవాళ్ళు విద్యార్ధులు.  ట్యుషన్లు చెప్పించుకోగల స్తోమతు వున్నవారికి మార్కులు, రాంకులు, సీట్లు వచ్చేవి.  పేదవారికి వచ్చేవి కావు.  ఆ లెక్చరర్లు నిజానికి ట్యూషన్లు చెప్పకూడదు.  సరిగ్గా చై.నా. వాళ్ళకి ఇదే కలిసొచ్చిన విషయం అయింది.  మా కాలేజీలో చేరితే మీరింక వేరే ట్యూషన్లు చదవాల్సిన పనిలేదని ప్రచారం మొదలెట్టారు.  తల్లిదండ్రులు ఈ ప్రచారానికి ఆకర్షితులయ్యారు.  (కానీ ఈ చై.నా. క్లాస్ రూం వాతావరణం ఒకరకమైన ఉక్కపోతని కలిగించేది ట్యూషన్లతో పోలిస్తే.  ట్యూషన్ మాస్టార్లు చెప్పే నేరేటీవ్ విధానానికి, చై.నా.వాళ్ళ భట్టీయం పద్ధతికి చాలా వ్యత్యాసముంటుంది.  అది వేరే సంగతి అనుకోండి.)  ప్రభుత్వమే కనుక నిజంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లు ట్యూషన్లు చెప్పకూడదు అని కఠినంగా వ్యవహరించి వుంటే అసలు ప్లస్ టూ తరువాత ఎంట్రెన్సుల్లో పోటీయే మొదలయ్యేది కాదు.  పేదా, గొప్ప అన్న తేడా లేకుండా మెరిట్ వున్న వారికే సీట్లు వచ్చేవి.  ప్రభుత్వ అలసత్వాన్ని చై.నా. వంటివారు బ్రహ్మాండంగా అడ్వాంటేజి తీసుకొని వోల్ సేల్ పేకేజీలతో పదో తరగతి తరువాయి సన్నివేశాన్ని ఆక్రమించేసారు.  అయితే వీరి వలన అకడమిక్స్ అభివృద్ధి చెందలేదు.

ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందకుండా కేవలం సేవారంగం పెరిగిన నేపధ్యంలో మొదట్లో డిమాండు వున్న పరిస్తితులు సహజంగానే మారిపోయి అభ్యర్ధులు ఎక్కువైపోయి ఎంప్లాయర్స్ పరిస్తితి మీద నియంత్రణ సాధించగలిగారు.  మొదట్లో వున్న పాకేజీలు పోయి ఉద్యోగం రావటం కష్టం అయింది.  వున్నవారిని బెంచి మీదకి పంపించి రెసిషన్ పేరుతో నోరు మూయించగలిగారు కంపెనీల పెట్టుబడిదారులు.  ఇండియాలో కంపెనీలు, ఉత్పత్తులు తక్కువ.  మన చదువులేమో కేవలం ఉద్యోగుల్ని తయారు చేస్తాయి.  చదువుకున్న వారిని ఉత్పాదకత వైపు నడిపించే విజన్ పాలకులకు ఎలాగూ వుండదు.  దానితో ఇప్పుడు పూర్తిగా కేపిటలిస్టుల దయ మీద ఆధారపడే పరిస్తితి వచ్చేసింది.   వైయెస్సార్ టైంలో బీసీ స్కాలర్షిప్ ప్రయోజనం పొందటం కోసం అడ్డడిడ్డంగా ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతుల్నిచ్చి, వాటి నాణ్యత మీద పర్యవేక్షణ లేకపోవటంతో ఇప్పుడు ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకున్నవారి పరిస్తితి దయనీయంగా వుంది.  ఇంజినీరింగ్ బబుల్ పగిలిపోయింది.  డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ప్రకారం సప్లై పెరిగినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడదే జరుగుతున్నది.

నిజానికి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసేదల్లా పోటీని పెంచటమే.  వాళ్ళు సీట్లను పెంచలేరు.  అవకాశాల్ని పెంచలేరు.  అవకాశాలు పెరగకుండా కేవలం పోటీ పెరగటం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది?  లక్షమంది ఒకే తీరున కష్టపడితే లక్షమందికీ ఐఐటీ సీట్లు రావుగా?  ఇప్పుడు చై.నా.లు కొత్తగా ఇంటిగ్రేటెడ్ గా ఐఏఎస్ సిలబస్ కూడా చేర్చారు.  అంటే దోపిడీకి కొత్త మార్గాలు తెరుచుకుంటున్నారన్న మాట. ఈ చై.నా.లు విద్యా విలువల్ని ధ్వంసం చేయటమే కాదు లేనిపోని భ్రమల్ని కల్పించటం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ప్రజల్లో చిన్న చూపు కలిగేలా వ్యవహరిస్తున్నారు.   కొన్ని లక్షలమంది విద్యార్ధుల్లో కొద్దిమందిని ఎంపిక చేసి, వారిని ఎంపిక చేసిన అధ్యాపకులతో రుద్దించి, కొన్ని రాంకులు చూపిస్తూ, మన చెవుల్లోంచి రక్తం బొట్లు పడేలా ప్రచారం హోరెత్తించి చేసేది దోపిడీ కాదూ?  చై.నా. స్టాఫ్ లో క్వాలిఫైడ్ వాళ్ళెంతమంది?  వీళ్ళ ఫాకల్టిలో సింహభాగం సూపర్వైజర్లు, ట్యూటర్లుంటారు.  వీళ్ళ పని భట్టీ పట్టించటం, అప్పచెప్పించుకోవటం మాత్రమే.  ప్రభుత్వ జూనియర్ కాలేజి లెక్చరర్లలా వీళ్ళు క్వాలిఫైడ్ కాదు.  ప్రభుత్వ జూనియర్ కాలేజీలకుండే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏ కోశానా ఈ చై.నా.లకుండదు.  ఈ కార్పొరేట్ చై.నా.లు ప్రభుత్వ కళాశాలల్నే కాదు అకడమిక్ ఆశయాలతో స్థానికంగా స్కూళ్ళు, కాలేజీలు పెట్టుకునే ఔత్సాహికులైన వారికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తున్నారు.  తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో మినహా మిగతా నగరాలు, పట్టణాల్లోకి ఈ చైనాలు ప్రవేశించక పోవటం తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ఫలితమే.  హైదరాబాద్ నుండి కూడా ఈ చైనాల్ని తరిమేసిన్నాడు తెలంగాణకు గొప్ప సుదినంగా చెప్పుకోవచ్చు.  ప్రభుత్వాలకి భారీ ఫండింగ్ ఇవ్వటం, ప్రభుత్వంలో మంత్రులుగా భాగస్వామ్యం పొందటమనేది ఈ చైనాలు ఎంత బలపడ్డారనేది తెలియచేస్తుంది.  ఈ పాపంలో పాలకుల పాత్ర తిరుగులేనిది.

****

మార్కెట్లని ముంచేస్తున్న చైనా వస్తువుల కంటే ఈ విద్యా చైనాలు ప్రమాదకరమని గుర్తిద్దాం.   విద్యా వ్యవస్థ మీద మన పిల్లల నెత్తుటి సంతకాలు పడకుండా చూద్దాం.

 

*

అరణ్య కృష్ణ

24 comments

Leave a Reply to శిరీష్ ఆదిత్య Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగా చెప్పారు,sir!anni తెలిసి కూడా, చిక్కు పోతున్నాము. వత్తిడి, అన్ని వేపులా, తపటంలేదు!

  • ప్రతిదీ ప్రైవేటులోనే వుండాలనే పెట్టుబడిదారీ దేశం అమెరికాలోనే హైస్కూలు వరకు (మన ఇంటర్మీడియట్‌తో సమానం) విద్య అంతా వుచితం మరియు ప్రభుత్వం నిర్వహిస్తుంది.
    మనకేం రోగమో వున్నదంతా వూడగొట్టి ప్రైవేట్ మయం చేసేశాం.

  • గొప్ప ఆలోచనాత్మక మైన వ్యాసం. నిజానికి విద్యా వ్యవస్థ ఇలా ప్రవేటీకరణ వలన జరిగిన దారుణం ఇది.రేట్ రేష్ లో పడే లా చేసి తమపిల్లల భవిష్యత్తు ను తమే నాశనం చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. పరిణామాలు మనముందున్నాయి. సత్వర చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుంటే పరిస్థితి చేజారి పోతుంది.
    ఇప్పటి పరిస్థితి కి సరి అయిన రచన. బాధ్యత గా రాశారు . ధన్యవాదాలు .

  • చాల బాగా రాసావు అరణ్యా – అందరికీ తెలుసు చై. నా చదువులను ఎట్లా భ్రష్టు పట్టిచ్చిందో – అయినా ఎంత మంది వాటికీ దూరంగా ఉండగలిగారు – ప్రగతిశీల వాదులే చాల సార్లు తమ పిల్లలను చదువులకు సంబంధించి విపరీతమైన ఒత్తిడికి గురిచెయ్యక తప్పని పరిస్థితిలో ఇరుక్కుపోయారు – ఇక మామూలు వాళ్ళ సంగతి చెప్పాలా – ఇదో పెద్ద ప్రభుత్వ స్పాన్సర్డ్ విషవలయం

  • అన్నీ నిజాలే. మా చదువులప్పుడు వచ్చిన boom లో కొట్టుకుపోయాము. ఇప్పటి పిల్లలకైనా స్వేచ్ఛతో కూడిన చదువులు ఇవ్వాలనుకున్నా…కొంతమంది…ఇవ్వలేని స్థితిలో కొట్టుకుపోయారు…పోతూనే ఉన్నారు కూడా తామేం కోల్పోయామో తెలిసీ. అనివార్యమైన కారణాలెన్నో. మొత్తం విద్యావ్యవస్థని చైనా చదువుల మాఫీయా గుప్పిట్లో ఉంచిన ప్రభుత్వాన్ని నిలదీయలేని మధ్యతరగతి బ్రతుకులే ఎక్కువ. ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఉగ్రవాదం అంతటి భయంకరమైన విద్యా వ్యవస్థను పోషిస్తూన్న ఇటువంటి సంస్థలను నామరూపాల్లేకుండా చేసే ఒక్క రాజకీయ పార్టీ కోసం ఎదురుచూడడం తప్ప ఏ విధమైన చలనం లేని రాయిల్లాగే మిగిలిపోయాము. విద్య, వ్యవసాయం బాగుపడితే దేశం బాగుపడుతుంది…అందుకే మారనీయరు నాయకులు. ఎదిరించి నిలదీసే గట్టి సంస్థ ఏదీ? ఆ చైతన్యం ఏదీ. ఇలా చదివినప్పుడు ఆక్రోశించడం తప్ప.
    మంచి topic ఎన్నుకున్నారు.మరింత మంది దీన్ని చదవాలని ఆశిస్తున్నాను.

  • పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క విద్యార్థులు ఫలితంగా బాధపడుతున్నారు

  • చాలా బాధాకరం. అసలు విద్యార్థుల ఆత్మహత్యలకు మూలకారణం (root cause) ఏమిటి? కేవలం పరీక్షల్లో ఫెయిల్ అవడమేనా? మన విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి మానసికస్థితి ఆత్మహత్యలకు దారితీస్తుంది? చదువుల్లో ముందు జీవితం విలువ చెప్పగలగాలి, ఆ తరువాతే విషయపరిజ్ఞానం. ఈ విషయంపై నిపుణుల (experts) అభిప్రాయాలెలా ఉన్నాయి? తలితండ్రుల విధులేమిటి? నివారణోపాయమేమిటి? ఇవీ నా ఆలోచనకి తట్టిన ప్రశ్నలు.
    -వాసు-

  • డియర్ అరణ్య కృష్ణ గారు ప్రస్తుత విద్యా వ్యవస్థ పై లోతైన విశ్లేషణ చేశారు.అభినందనలు.
    ఇది vision లోపించిన ప్రభుత్వ నాయకత్వ లోపమే అనేందుకు ఏ మాత్రం సందేహ పడఖ్రర్లేదు.
    ఈ సందర్బంగా ఏనాడో కవి శేషప్ప చెప్పిన పద్యం ఉదహరిస్తాను..::
    తనయుండు దుష్టయిన తండ్రి తప్పు
    కూతురు చెడుగైన మాత తప్పు
    ప్రజలు దుర్జనులైన “ప్రభుని ” తప్పు”
    ఏనాడో చెప్పేగదా కవి శేషప్ప!!

    ప్రజలు దుర్జనులుగా మారేందుకు ప్రభుత్వమే.. వారి విధానాలే కారణం!!ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసిన నాడే..అసలైన ప్రగతి సాధించ గల్గుతామ్…. మరోసారి మీ సమగ్ర విశ్లేషణ కు ధన్యవాదాలు తెల్పుతూ శలవ్…నమస్కారం🙏🙏🙏🙏

  • చాలా మంచి వ్యాసం రాసిన అరణ్యకృష్ణ గారికి అభినందనలు. ఇదే విషయం మీద అమర్త్యసేన్ గారు గొంతు చించుకొని ఎన్నో సంవత్సరాలుగా పట్టు వదలని విక్రమార్కుడు లాగా , దేశం లో చదువు మీద ఆరోగ్యం మీద ప్రభుత్వం ఎక్కువ కేంద్రీకరిస్తేనే దేశం బాగుపడుతుందని చెపుతుంటే , ప్రభుత్వ భక్తులు అలిగి వారికిచ్చిన భారతరత్న వెనక్కు తీసుకోమని పోరాడుతున్నారు కానీ ఆయన ఎందుకలా చెప్పేరో ఆలోచించలేదు. వ్యాపార పన్ధాలో వొచ్చిన ఈ ఇంజినీరింగ్ కళాశాలలు కొన్ని వందలలో, చదువుకు సరి అయిన సదుపాయాలు లేక మ్సెయించడం జరిగింది. ప్రతీ ఏటా వార్షిక బడ్జెట్ లో విద్యా మీద, ఆరోగ్యం మీద ఖర్చు తగ్గిపోతోంది.

    మన పిచ్చి మధ్యతరగతి ఈ వెర్రి లోంచి బాటపడరు, ఈ వెర్రిని ప్రోత్సహిస్తున్న రాజ్యాన్ని ప్రశ్నించరు.

  • ప్రస్తుత పరిస్థితిని చాలా బాగా వివరించారండి.
    ఊబిలో పడిన పిచుక పిల్లలాగ అయిపోయింది ఇప్పటి విధ్యార్థుల పరిస్థితి. తాడు వేసిలాగాల్సిన ప్రభుత్వం, గట్టుమీద కూర్చుని వినోదించడం దగ్గరే ఆగిపోయింది. అతికష్టం మీద బయటకి వచ్చినా ఆ బురద తాలూకు మరకల్ని పోగొట్టడం ఎవరి తరం చెప్పండి.

  • దేనికైనా మొదటి కారణం తల్లి తండ్రులు .. ఎదుటివారితో నిత్యం పోల్చుతూ తమ బిడ్డల్ని తామే చంపుకుంటున్నాం. ప్రస్తుతం మనం నివసించే ప్రపంచం ఒక పెద్ద వ్యాపార రంగం. అది తెలిసి మనం మన బిడ్డల్ని ఆడుకోనివ్వకుండా, ఏమాత్రం విశ్రాంతి దొరకనీయకుండా చదువు చదువు అంటూ చంపేస్తున్నాం. చదివినంతవరకు సరే. ఒక్కోసారి ఇలాంటి దారుణమైన సంఘటన ఎదురైతే మాత్రం కాలేజీ యాజమాన్యం తప్పు అనీ, ప్రభుత్వ వైఫల్యమనీ విరుచుకు పడుతుంటాం. ఒకచోట నేను చూసాను. ముఖ్య మంత్రి దగ్గర తమ బిడ్డ అత్యంత తెలివైన వాడిగా గుర్తింపు పొందాలని మూడేళ్ళ పిల్లవాడిని రాత్రి పగలు తేడా లేకుండా దేశ నాయకుల పేర్లను బట్టి పట్టించడం. ఆ బిడ్డ అలసిపోయి రెప్ప వాలితే స్కేలుతో కాళ్లపై కొట్టడం చూసాను. తర్వాత కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కూడా. ఇలాంటి మూర్ఖులున్న ఈ సమాజానికి బిడ్డలు విగత జీవులుగా మారక ఏమి చేస్తారు? ఒక చోట ” అయ్యో ఫెయిల్ అయ్యావా ? నాన్న వస్తే అంతే .. నీ ప్రాణం తీసేస్తారు అని ఒక చోట, మేము ఏ పాపం చేసామురా నీలాంటి బిడ్డని కన్నాము ? నీలాంటి ఉంటె ఎంత లేకుంటే ఎంత అని తల్లి తండ్రులుగా మనమే బిడ్డల చావులకు కారణం అవుతున్నాము. అందుకు ప్రభుత్వం వైఖరి తోడైతే ఏముంది ఇలాగే సమాజం స్మశానం అవుతుంది. తల్లి తండ్రులూ ! ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి..

  • హితుడా..
    తప్పు మనదేనేమో..
    ఆశలకు రెక్కలిస్తున్నాం..
    కట్టుగోచీగాళ్ళుగా వొచ్చి కోట్లకు
    పడగలెత్తి ప్రభుత్వాలనే గుప్పిట చిక్కించుకున్న..
    ఈ…చై..నా..విధ్యా సంస్థలను నివలరించడంలో ఓడిపోతున్నాం..
    ఫలితం..
    చై..నా..లు.. ఇపుడు మరింత ధైర్యంగా..రాష్టాలకు రాష్టాలనే చుట్టబెట్టేస్తున్నారు…

    ఇపుడిదొక
    అనకొండ పాములా..
    విధ్యార్థుల జీవితాలను.తలిదండ్రుల ఆర్థికస్థితిని..ఆశలనూ..స్వాహాజేస్తూ..
    మరింతగా బలిసి మొత్తం దేశాన్నే మింగబోతోంది..ఇపుడు ఏ ఇంట బిడ్డ పుట్టినా..ఆ చై..నా..అనకొండకు పండగే..

    బంధూ.
    .సమస్యను కళ్ళముందుంచడంలో..మీరు కృతకృత్యులయ్యారు..అలానే..పరిష్కాంవేపంన అందరూ దృష్టి పెడతారనే ఆశిద్దాం..

    అభినందనలు…ధన్యవాదాలు..కామ్రేడ్

    • అవగాహన లేని తల్లిదండ్రులందరూ వీళ్ళకి బలిపశువులమేనేమో. ఇంకో ఆప్షన్ లేకుండా పోటీని పెంపుదల చేసే వాణిజ్య వ్యూహం చై.నా.ది.

  • విద్యారంగంలో పతనావస్థను గురించిన ఆర్తితో ఆద్యంతం చాలా బాగా వ్రాశారు. మన తెలుగు రాష్ట్రాలలో ఈ చై(తన్య) నా(శక) సంస్థల వాణిజ్యం వల్ల ఒక తరం తమ యువతను కోల్పోయింది.

    • చై.నా. వలన ఒక తరమేం కర్మ సార్. ఇప్పటికే రెండు తరాలు పోయినయ్. ఇంక ముందు ముందు ఇంకెన్ని తరాలు వీళ్ళ పాలన పడాల్నో.

  • మనుషుల..దురాశ ..అనే.రధ..చక్రాలక్రింద పడి..నలిగి ..పోతున్న..భవితవ్యపు..సుమాలు ..కన్నవారు ..పాలించేవారుఇద్దరు ..ఆలోచించేంత ..పరిస్థితులుకూడా ..ఎప్పుడో..దాటాయి …very useful artical…

  • Sir
    Will you permit me to reprint this article in our monthly UPADHYAYA DARSHINI

    K VENUGOPAL
    TPTF
    Chief Editor
    9866514577

  • నూటికి ఒక్కరో ఇద్దరో తప్ప్ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలపైన ప్రాణం పెడతారు. వారికీ తెలుసు వాళ్ళ పిల్లలు ఎంత అవస్త పడుతున్నారో, ఎంత ఒత్తిడికి గురౌతున్నారో. మరి ఎందుకు ఇలాంటి కాలేజీల్లో చేర్పిస్తారంటే:
    1. తప్పదు, కాలం అలా ఉంది. మంచి కాలెజిలో సీటు రావాలాంటే ఇలా కష్టపడాల్సిందే. మంచి కాలెజిలో సీటు రాకపోతే మంచి భవిష్యత్తు (అంటె సంపాదన, కేవలం సంపాదన) లేదు. 2. అన్ని కాలేజీలు ఇలానే ఉన్నాయి. ప్రత్యామ్న్యాయం లేదు.

    మొదటి వాదనలో కొంతవరకు నిజం లేక పోలేదు. టాప్ 10 కాలేజీల నుండి ఉత్తీర్ణులైన వారి పాకెజీలకి, వేరే ఇంజినీర్ల పాకేజీలకీ పొంతన లేదు. మంచి ఎం.బీ.ఎ, ఎం.ఎస్ కాలేజి సీట్లు కూడా చాలా మటుకు వీరికే వస్తాయి. ఆ కాలేజి బ్రాండ్, జీతాలకు తగ్గట్టు ఉద్యోగావకాశాలు, సమున్నతమైన్ పదవులు. అంటే ఒక పిల్ల/ పిల్లాడు ఈ ఇండస్ట్రీ లో పనిచేయాలంటే వాడి బ్రతుకు ఎలా ఉంటుందో ఈ ఒక్క జె.ఈ.ఈ పరీక్ష నిర్ణయిస్తుంది. సీటు రానంత మాత్రాన మిగితా పిల్లలందరూ తెలివి తక్కువ వారు అని కాదు, వారు ఎన్నుకున్న అంశంలో ప్రజ్ఞావంతుల్లవరేనీ కాదూ (ఇప్పుడున్న ఇంటర్నెట్ టెక్నాలజి పుణ్యమా అని ఆసక్తి ఉండలె కానీ ఏదన్నా నేర్చుకోవచ్చు). కానీ ఆ కాలేజీ బ్రాండ్, అలుమ్ని వలన ఇతరులతో పోలిస్తే పయనం సులభం అవుతుంది.

    ఇక్కడ ఒక గమ్మతేంటి అంటే చాలా మంది మధ్య తరగతి వాళ్ళెప్పుడూ తమ పిల్లలకి పెద్ద కంపనిలో ఉద్యోగం రావాలని కోరుకుంటారు కానీ తమ పిల్లలే సొంతంగా ఏది చేయాలని అనుకోరు. అంటే 1960స్,1970స్ లో పుట్టిన వాళ్ళు స్కెర్సిటి లో పెరిగారు, పెద్ద కుటుంబాలుండటం వలన త్వరగా సంపాదన మొదలెట్టాల్సిన అవసరం ఉండేది. అందుకని వారికి దొరికిన ఉద్యోగమే మహాప్రసాదం. అందుకని 1990స్, 2000స్ లో పుట్టిన తమ పిల్లలకి కూడా అదే అతి ఉన్నతమైన బ్రతుకుగా ప్రణాలికలు వేసుకుంటారేమో.

    రెండో వాదన మన తెలుగు రాష్ట్రాల్లో నిజమె. బయట రాష్ట్రాల్లో ఇంత భయంకరంగా లేదు పరిస్థితి. ఇంత ఐ.ఐ.టె, మెడిసిన్ పిచ్చున్న వాళ్ళు తమ పిల్లలను కోట (రాజస్థాన్) కు పంపుతారు.

    మనం వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాసాలు చదువుకొని అయ్యో అనుకోగలమేమో కానీ సమాజంలో మార్పు రావాలంటే చెట్ట పరంగా మార్పులు రావాల్సిందే- కాలెజీలు నాలుగు తరవాత నడిపే వీళ్ళేదు, ఆటల పీరియడ్ తప్పనిసరి. అట్లాగే సిలబస్, కరెక్షన్ విధానాల్లో మార్పులు రావాలి. ప్రతి వాడికీ 97% వచ్చెస్తోంటే మార్కులకు అర్థం లేకుండా పోయింది.

    ఇంకాస్త ఆలోచిస్తె ఏమనిపిస్తోందంటే ప్రభుత్వాలు ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసాయి. ఫస్ట్-వల్డ్ లో మనం చూస్తున్న resenmentకు చాలా కారణాలున్నా, అది tipping point చేరుకున్నది manufacturing రంగంలో ఉద్యోగాలు పోవటం వలన. మన అర్బన్ ఎకానమీ చాలా మటుకు outsourced IT ఉద్యోగాల మీద ఆధారపడి ఉంది. Artificial Intelligence, Software Automation వలన ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతాయి. Outsourcing కూడా తగ్గే సూచనలున్నాయి. మంచి కాలేజీలో నుండి ఉత్తీర్ణులైన వారికే విరివిగా అవకాశాలు, ఇతరులకు ఏమి మిగలదు. మన ఇంజినీరింగ్ చదువులకు ఈ ఉద్యోగాలు రావు, సొంత వ్యాపారాలు పెట్టే సామర్థ్యం చాలా మందిలో లేదు. ఈ మధ్య ఇంజినీరింగ్ వ్యామోహం తగ్గినా, గత 15-20 ఏళ్ళుగా ఉత్పత్తి అయిన ఎందరో నాసి రకం ఇంజినీర్ల ఉద్యోగాలు పోతాయి.

    ఈ రాబోయే మార్పుల వలన మంచి కాలేజి లో సీటు ఇంకా విలువైనది అవుతుంది. అందుకని పిల్లలపైన ఇంకా వత్తిడి పెరుగుతుంది రాన్రాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు