మట్టిలో పుట్టే పాట ఆత్మను ఒడిసిపట్టి… ఆధునిక కవిత్వపు అంతర్ముఖీనతను శాస్త్రీయంగా విశ్లేషించిన విమర్శన శీలి, బాలల తొలి అక్షరం నుండి అంతర్జాతీయ ‘ప్రకాశిక’ల వరకు పాఠ్యప్రణాళికలను తీర్చిదిద్దిన విద్యా శిల్పి డాక్టర్ ఎస్. రఘు గారు. ఆయన కేవలం ఒక విద్యావేత్త మాత్రమే కాదు; ‘జీవన లిపి’తో నానీల వైభవాన్ని చాటి, ‘వెంటాడే పాట’ ద్వారా ప్రజా హృదయాల సిగ్నేచర్ గీతాల ఆంతర్యాన్ని ఆవిష్కరించిన సృజనశీలి.
తన విశిష్ట విమర్శ గ్రంథం ‘సమన్వయ’ ద్వారా రెండు ప్రముఖ అవార్డులను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిష్టాత్మక ‘కీర్తి పురస్కారాన్ని’ అందుకొని విమర్శనా రంగంలో తన ముద్రను ఘనంగా చాటుకున్న సృజనశీలి. కేంద్ర సాహిత్య అకాడమీ (తెలుగు విభాగం) సలహాదారుగా, వందలాది పీఠికల పాండిత్య ప్రకర్షతో తెలుగు సాహిత్య వికాసానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి నిశిత విమర్శనాత్మక దృక్పథం, సామాజిక చైతన్యం… “జీవయాత్ర” కవితా విశ్లేషణకు అత్యున్నత ప్రాతిపదిక, గౌరవప్రదమైన భూమిక. ఇది ‘సారంగ’ పాఠకులకు ప్రత్యేకం.
జీవ యాత్ర
నాలుగు గోడల నిశ్శబ్దాన్ని
బద్దలు కొడుతూ
భూగోళం తలుపులు తెరవడమే యాత్ర!
పాదాలు అరిగిపోతున్నా
ప్రకృతిలో లీనమైపోవడమే యాత్ర!
గిరి శిఖరాలు
ఆకాశంతో రహస్యంగా మాట్లాడే ముచ్చట్లు
వినడమే యాత్ర!
జలపాతాల హోరులో
సప్త స్వరాలను సాధన చేయడమే యాత్ర!
రాతి విగ్రహాల్లో దాగున్న
దివ్య తత్వాన్ని దర్శించడమే యాత్ర!
నీవే ఒక వెలుగు దివ్వెగా మారి
అంతరంగ జ్యోతికి హారతివ్వడమే యాత్ర!
యాత్రలంటే ప్రదేశాల్ని చూడడం కాదు
కాల గమనపు సాక్షిగా
మన ఉనికిని మనమే కొత్తగా
పునఃసృష్టించుకోవడం!
శిథిల శిల్పాల్లో
దాగున్న పూర్వీకుల సృజన వైభవాన్ని
దర్శించుకోవడం!
నిలువ నీరు కాదు జీవితం
నిరంతరం పారే సెలయేరు!
మనము కాలం మలిచిన సాలగ్రామాలం!!
ఈ ప్రయాణంలో
ప్రతి మైలురాయి ఒక పాఠం!
ప్రతి ప్రదేశం అధ్యయన గ్రంథం!
కాలికి తగిలే రాళ్లు
కారే చెమట చుక్కలు
ఆవరించే అలసటలు
అన్నీ తాత్కాలికమే…
ప్రయాణంలోని పరీక్షలివి
సహనాన్ని
కాలానికి ఎదురునిలిచే
సాహసాన్ని అందిస్తాయి!
ప్రపంచాన్ని హృదయంలో
నింపుకునే అపురూపక్రియ!
అలసట కూడా మధురానుభూతి
ఇంతవరకు మోసిన బరువులు
దారిలోనే మాయమైపోతాయి.
నవ్యోత్సాహాన్ని నింపుకున్న
హృదయం జ్ఞాపకాల చెట్టై
నిత్యం పరిమళాల పూలను
పూయిస్తుంటుంది!!
– డా. ఎస్. రఘు
కవిత్వంలో ఏం రాయాలో తెలియడం ఒక ఎత్తైతే, ఏం రాయకూడదో, ఎక్కడ ఆపాలో తెలియడం అంతకంటే పెద్ద ఎత్తు అనే సూత్రాన్ని డాక్టర్ ఎస్. రఘు పై కవితలో అక్షరాలా పాటించారని చెప్పవచ్చు.
సాధారణంగా యాత్రల గురించి రాసేటప్పుడు క్షేత్రాల పేర్లు, తిలకించిన ప్రదేశాల వివరాలు రాసి కవిత్వాన్ని కాస్తా ‘ట్రావెలాగ్’ (ప్రయాణ వివరణ) గా మార్చే ప్రమాదం ఉంటుంది. కానీ, కవి ఆ ప్రదేశాల స్థూల భౌతికత్వాన్ని వదిలేసి, వాటి ఆత్మను మాత్రమే స్వీకరించారు. వాక్య విరామాన్ని పాటిస్తూ, ఎక్కడా అనవసరమైన వర్ణనలకు లోనుకాకుండా, కేవలం అనుభూతిని మాత్రమే అక్షరబద్ధం చేస్తూ సరైన తాత్విక బిందువు వద్ద కవితను ఆపారు. ఇది వారి కవితా శిల్ప పరిణతికి నిదర్శనం.
ఇందులోని వస్తువు కేవలం భౌగోళిక ప్రయాణం కాదు; జీవన పర్యటనలోని తాత్విక అనుభూతి. శీర్షికలోని ‘జీవ’ అనే పదం ప్రాణానికి, జీవితానికి అన్వయించుకుంటూ వస్తువుతో అద్భుత సమన్వయాన్ని సాధించింది. బాహ్య యాత్రలోని దృశ్య శబ్దాలను క్రమ పద్ధతిలో అమరుస్తూ, ‘యాత్రలంటే ప్రదేశాల్ని చూడడం కాదు’ అంటూ కవి తీసుకున్న తాత్విక మలుపు (Turning Point) చరణాల మధ్య బలమైన అంతర్గత బంధాన్ని (Transition), నదీ ప్రవాహంలాంటి సహజమైన భావ లయను (Flow) ఆవిష్కరించింది. బాహ్య ప్రపంచం నుండి అంతర్గత అధ్యయనం వైపు సాగిన ఈ క్రమ పరిణామం పాఠకుడిని ఏకబిగిన ముగింపు వరకు నడిపిస్తుంది. ‘ప్రతి మైలురాయి ఒక పాఠం, ప్రతి ప్రదేశం అధ్యయన గ్రంథం’ అనడంలో కవి విస్తృత అధ్యయన పరిణతి కనిపిస్తుంది. యాత్ర ముగిసినా ఆ అనుభవాలు గుండెల్లో ‘పరిమళాల పూలు పూయించే జ్ఞాపకాల చెట్టు’గా మారిపోతాయనడం కవితా వస్తువుకు అత్యంత సముచితమైన, అద్భుతమైన తాత్విక ముగింపునిచ్చింది.
రూపము-సారముల (Form and Content) పరంగా చూస్తే, ఈ కవిత బాహ్య ప్రయాణంగా నడుస్తూనే అంతఃప్రయాణంగా సాగిన విశిష్ట శైలీ విన్యాసం. ‘భూగోళం తలుపులు’, ‘అంతరంగ జ్యోతి’, ‘సాలగ్రామాలు’ వంటి పదబంధాలు కవితకు క్లాసికల్ టచ్ ఇవ్వడమే కాకుండా, వాచ్యానికి తావులేకుండా రూపానికి-సారానికి నడుమ సమతూకాన్ని నిలిపాయి.
ఇందులో వాడిన ‘నాలుగు గోడలు’ పదం సంకుచితత్వానికి, ‘సెలయేరు’ పదం చలనశీలతకు, ‘సాలగ్రామాలు’ పదం కాలం మలిచిన అనుభవాల నిశ్చలత్వానికి శక్తివంతమైన ప్రతీకలు. బాహ్య ప్రపంచంలోని గిరి శిఖరాలు, జలపాతాల వర్ణన నుండి అంతరంగ జ్యోతి వైపు సాగిన ఈ శిల్ప సంవిధానం శాంత, అద్భుత రసాల సమ్మేళనంగా మారి పాఠకుడికి లోతైన తాత్విక ఆనందాన్ని ఇస్తుంది. ఈ రస స్ఫూర్తి వల్లే శీర్షికకు, కవితా వస్తువుకు మధ్య అద్భుత సమన్వయం కుదిరింది.
ఈ కవితలోని శక్తివంతమైన కొన్ని కవితాత్మక వాక్యాలను చూస్తే, కవి ప్రతిభ మరింత స్పష్టమవుతుంది.
నాలుగు గోడల నిశ్శబ్దాన్ని
బద్దలు కొడుతూ
భూగోళం తలుపులు తెరవడమే యాత్ర!
ఈ ప్రారంభ వాక్యాలే సంకుచితత్వపు గిరి గీసుకున్న మనిషిని విశ్వజనీనత వైపు నడిపించే చైతన్య స్ఫూర్తిని రగిలిస్తాయి.
అలాగే:
“మనము కాలం మలిచిన సాలగ్రామాలం!!”
అనే వాక్యం ఈ కవితకే మకుటాయమానమైన అద్భుత ప్రతీక. సాలగ్రామం అనేది నదీ ప్రవాహంలో, కాల గమనంలో రాపిడికి గురై పవిత్ర రూపాన్ని సంతరించుకునే రాయి. మనిషి కూడా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల ఘర్షణలో, కాలం చేతిలో పడి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంగా, పవిత్ర సాలగ్రామంగా మారుతాడనే తాత్విక సత్యాన్ని ఈ ఒక్క వాక్యంలో కవి అద్భుతంగా ఆవిష్కరించారు..
మూడవది:
నవ్యోత్సాహాన్ని నింపుకున్న
హృదయం జ్ఞాపకాల చెట్టై
నిత్యం పరిమళాల పూలను
పూయిస్తుంటుంది!!
అనే చరణంలో హృదయాన్ని ‘జ్ఞాపకాల చెట్టు’గా, అనుభూతులను ‘పరిమళాల పూలు’గా మార్చడం కవి శైలీ వైభవానికి, అభివ్యక్తి నైపుణ్యానికి పరాకాష్ఠ.
ఇందులో మొదటి ఆరు చరణాల చివర ‘యాత్ర’ గమనించారు కదా. ఈ పదం మకుటంలా పునరావృతం కావడం కవితా వస్తువును స్థిరీకరించే ఒక విశిష్టమైన శిల్ప నైపుణ్యం. ప్రతి చరణంలోని విభిన్న అనుభూతులను ఈ కేంద్ర బిందువుతో ముడిపెట్టడం వల్ల పాఠకుడికి భావం గాఢంగా ముద్రితమవుతుంది. సంగీతంలోని పల్లవి లాగా, వచన కవిత్వంలో ఈ పద పునరావృతి ఒక అంతర్గత శబ్ద లయను, నడక సొగసును తెచ్చిపెట్టింది. బాహ్య క్రియలన్నింటికీ ‘యాత్ర’ అనే పదమే ముగింపుగా మారి, తదుపరి చరణాలలో రాబోయే తాత్విక మలుపుకు ఇదొక బలమైన లయాత్మక ప్రవాహంగా ఉపకరించింది.
ఆచార్య ఎస్. రఘు గారి కవిత ‘జీవ యాత్ర’ ప్రయాణపు అలసట మాయమై, నవ్యోత్సాహం మిగలడమే జీవన యాత్ర పరమార్థం అనే సందేశం ముగింపులో స్పష్టమైంది. ఇది కేవలం ప్రకృతి పర్యటన కాదు; అది మనిషి తనను తాను తెలుసుకునే ఒక ఆత్మ విమర్శనాత్మక అంతఃప్రయాణం. వచన కవితా ప్రమాణాలకు లోబడి, శిల్ప సౌందర్యాన్ని కాపాడుకుంటూ సాగిన ఒక ఉన్నతమైన కవిత్వం ఇది.
అభినందనలు రఘు గారు.
*








కవితలో ప్రతీ వాక్యం కోట్ చేసుకోదగ్గదిగా ఉంది. ఉదాహరణకు
‘నిలువ నీరు కాదు జీవితం
నిరంతరం పారే సెలయేరు!’ .
ఎక్సలెంట్ వాక్యాలివి. జీవన తాత్వికతను నింపుకున్న వాక్యాలు.
శిల్పమున్న కవితా- భావమున్న కవిత- పదచిత్రమున్న కవిత-దాచుకోదగ్గ కవిత ఏదైనా చెప్పని ఈ కాలపు కవులడిగితే వెంటనే ఈ కవితను సూచిస్తా…!!
అన్నట్లు, విల్సన్ రావు గారి విశ్లేషణ బంగారానికి తావి అద్దిన విధమైంది. ఇలాంటి విశ్లేషణల వల్ల కవులకు నేర్పు, పరిశోధకులకు చేర్పు (footnotes) చేరుతాయి..
– డా. నర్రా
భౌతికతను దాటి జీవన తాత్వికత,
ప్రకృతి అంతర సౌందర్య దర్శనం
తద్వారా అంతర్ముఖ ఆత్మ సందర్శన దిశగా సాగే
ప్రయాణమే ఈ జీవ యాత్ర అనే సారాంశాన్ని
అద్భుతమైన రూప విన్యాసంతో రఘు సర్ నిర్మించిన కవితా శిల్పానికి విల్సన్ అన్న విశ్లేషణ ఒక అద్భుతం
– – రహీమొద్దీన్