మగనాలిమెట్ట!

‘తను చేస్తున్న పని సరైనదే. ఇది తప్పనిచ్చి తనకు మరో దారెక్కడిది.’ అదేపనిగా అనుకుంటోంది సీకరి.

‘తప్పదు. తప్పదు. ఇప్పటికే ఆలస్యమైంది. మరి నోరుమూసుకుని కూర్చోవడం కుదరదు.’ ఇలా కూడా ఒకసారికి పలుమార్లు తలపోస్తోంది.

అది బొమ్మెత్తువేళ. ముఖంఎత్తి పొద్దు చూసుకోగలవేళ. ఉదయం తొమ్మిదవుతోంది. చలిపులి మాత్రం తగ్గలేదు. మెట్టమీద పడే భానుకిరణాలను పూర్వపక్షం చేస్తూ, రివ్వునవీచే రివటలతో కలిసి అగ్గితీస్తూనే ఉంది. మగనాలిమెట్టకు సీకరి చేరి అప్పటికి నాలుగో ఐదో గంటలైంది. ఇరుగుపొరుగుకు సంగతంతా చెప్పే వచ్చింది.

సూదిలాంటి శీతగాలులు ఒకపక్క, శూలాల్లా పొడుస్తున్న ఆలోచనలు మరోపక్క సీకరిని కల్లోపరుస్తున్నాయి. చాలీచాలని కట్టుడుగుడ్డల్ని శరీరంమీదికి లాక్కుంటోంది. ఎంతగా ముణగదీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఎండపొడ తగిలేలా మెట్టపైనున్న పణుకురాళ్లమీద మార్చిమార్చి కూర్చుంటోంది. అయినా చిన్నపాటి వణుకు తప్పడం లేదు. సూరీడు మటుకు ఎడగీతవేళ దాటేందుకు నడిమింటివైపు వడివడిగా అడుగు వేస్తున్నాడు.

‘తను మెట్టదారిపట్టిన సంగతి ఈ పాటికి ఊరంతా పాకిపోయే ఉంటుంది. అత్తబోడి నోరు పెద్దది. ఆ బోడిది అందరికీ ఔజం వాయించి మరీ అంతా చెప్పేస్తుంది. నాగసొరకాయ ఊది మరీ ముట్టగిస్తుంది. కచ్చలోది రచ్చలో పెట్టడంలో దాన్ని మించిన జమీందారీ మన్నెంలో మరెక్కడా ఉండదు. తనకీ పాటికి రంకు కట్టే ఉంటుంది. మావ మటుకు చప్పన. తెత్తెత్తె. నెన్నెన్నె. మొగుడాడికైతే అసలేం పట్టదు. ఏ జీలుగుచెట్టు దగ్గర దేవుళ్లాడుతాడో ఏమో. చూద్దాం. ఆ మోదమ్మలేదా. రక్షించకపోదా.’ మనసులో గట్టిగానే అనుకుంది సీకరి. మరుక్షణంలోనే పసిబిడ్డ బేరి గుర్తుకొచ్చాడు. నీరసపడినట్టయిపోయింది.

‘వాడు పాలకోసం ఏడుస్తూ ఉంటాడు. తన కోసం కింకలు పెడుతూ ఉంటాడు. మా.. మా.. అని అల్లాడిపోతుంటాడు.’ ఈ ఆలోచనలు తాకగానే నీరయిపోయింది సీకరి. నేత్రాలు ధారాపాతమయ్యాయి. అంతలోనే ఏమనుకుందో,

‘కుదరదు. కుదరదు. ఇదంతా జరగవలసిందే. ఆ గుంటడి కోసమే కదూ తనకీ పట్టుదల.’ స్థిరచిత్తాన్ని సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

…………..

ఆ చలికాపు ఉదయం రేకలబంద గ్రామంలో చిత్రాచిత్రంగా నిప్పుల్ని రాజేసింది. చల్లని పలకం మాసంలోనూ పల్లెజనంలో వేడి పుట్టించింది. ఊరి ఆడమలారమంతా ఒక్కచోట చేరి కర్ణాలు దద్దరిల్లిపోయేలా ఏదేదో అరుస్తూ చెప్పుకుంటున్నారు. అందరికంటే పెద్దనోరు పెట్టి సీకరి అత్త సువ్వారి చెలరేగిపోతోంది.

‘‘దానికంత మదం తగునా? ఏవుందని దానికా రాలుబాటు. బాలపాపని కూడా లెక్కవెయ్యలేదు కదా ఆ దరిద్రగొట్టు.’’ ఎగసి ఎగసి వస్తున్న ఆయాసాన్ని ఆపుకుంటూ కోడల్ని శాపనార్థాలు పెడుతోంది. మధ్యమధ్య చెప్పనలవికాని బండబూతుల్ని ప్రయోగిస్తోంది.

‘‘నీ కోడలు మగనాలిమెట్ట ఎక్కుతుందని నేనెప్పుడూ అనుకోలేదే సువ్వా. దానికంత ధైర్యం ఎలా వచ్చిందే. మొత్తానికి అది నీ ఇంటి పరువుతీసి పాతరవేసినట్టేను. ఈ వూళ్లో నువ్వూ నీ మొగుడూ నీ కొడుకూ ఆఖరికి నీ మనవడూ బతికి ఉన్నా ఇంక చచ్చినట్టేను. మీరందరూ ఏ మత్స్యగెడ్డలోనే పడిపోవడమే మెరుగు.’’ అమ్మలక్క ఎవరో ఎడాపెడా తగులుకుంది.

‘‘తప్పు సీకరిదేనంటే నేనొప్పుకోను. దాని మొగుడు సరైనవాడు కాడు. వాడెప్పుడయినా ఇంటిబాధ్యత ఎరిగి మసిలాడా. ఎప్పుడూ తాగడం. తూగడం. ఒళ్లు గుల్ల చేసుకోవడం. విసిగిపోయిన ఆడది మెట్టపట్టక ఏం చేస్తుంది. మెట్టినింటి గౌరవం కాపాడుతూ కూర్చుంటే దాని గతేంకాను.’’ మరో అమ్మలక్క ఎవరో మొదటి అమ్మలక్కని వారిస్తున్నట్టుగా మాట్లాడింది. ఈ మాటకు సువ్వారి మరింతగా నెత్తికొట్టుకుంటూ,

‘‘గుమ్మలగొంది పోవొద్దురా. ఆవూరి పిల్లలికి సిగ్గూబొగ్గూ ఉండదురా. వాళ్లకిచ్చే ఓలి మొత్తం వట్టమేనురా. వాళ్లని ఇంట్లోకి తేవొద్దురా అని చెబితే విన్నాడా నా కొడుకు. ఇప్పుడిలా అందరిచేతా మాటలు పడుతున్నాడు. ఈ కొండల్లో నా కొడుకొక్కడే తాగుతున్నట్టు చెబుతున్నారమ్మా మీరంతాను. అవునుమరి. ఆ జీలుగుచెట్లన్నీ వాడు మింగడానికే పుట్టాయి. వాడే వాటిని రోజూ నీళ్లుపోసి పెంచుతున్నాడు.’’ ముక్కుచీదుకుంటూ అమ్మలక్కలమీద లగ్గకెత్తింది. ముక్కుతుడుచుకుని అదే మళ్లీ అంది కదా,

‘‘పోనీలెండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోతుందిలెండి. మీ అందరి బాధా తీరిపోతుంది. పొద్దున్న పోయిన పొల్లుముండ ఇప్పటికీ మెట్టదిగలేదంటే మనల్నే అక్కడికి రమ్మనమని కదూ దాని ఉద్దేశం. ఇంక మీరూ తయారైతే కలిసే పంచాయితీకి పోదాం. ఆఖరికి ఇన్నేళ్లకి రేకలబంద మెట్ట ఎక్కవసిన ఖర్మ నాకు పట్టించింది ఆ జాకరమ్మదేవత.’’ తీవ్రస్వరంతో అంటూనే ఊరి ఆడవాళ్లందరినీ మగనాలిమెట్టకు దారితీసేలా అదిలించింది.

‘‘వస్తాంలే. ముందుగా నీ కొడుకు నీ మొగుడు చేవడిబసనుంచి రానీ. అప్పుడందరం పోదాం.’’ అమ్మలక్కల్లో ఎవరో నింపాదిగా పలికారు.

‘‘అలాగే అలాగే. నా సొమ్మంతా కల్లుతాగించడానికే ఖర్చయిందిలే. తగవు తీర్చడానికే పాడయిందిలే. కొడుకు తాగుతాడు. మొగుడు తాగుతాడు. గుమ్మడికాయలు, పసుపు, పిప్పలి అమ్మి సంపాదించిన నా వస్తుమారుగిళ్లన్నీ ఈవేళ ఊరిమొగుళ్లు చేవడిబసలో చేరి తాగుతున్నారు. ఈ పెద్దకాకులన్నీ నాకిప్పుడు నీతినియమాలు బోధిస్తాయి. తప్పుకట్టమంటూ చెప్పినా చెబుతాయి. గూడెం మొత్తం బాగానే ఉంది. నా ఇల్లే గుండవైపోయింది.’’ సన్నాయినొక్కులు నొక్కుతూ మెటికలు విరిచింది సువ్వారి. ఆవెంటనే పక్కనే ఉన్న తన పూరింట్లోకి పోయింది. బుర్రబాధ క్షణక్షణానికీ పెరిగిపోతుండటాన ఆకలీదాహమూ అస్తవ్యస్తంగా దానిమీదపడినట్టయింది. పరిష్కారం తోచని వేళ అన్యమనస్కంగానే అంబలికుండకి ఎగబడింది. డోకితో చోడంబలి తీసి కుండపెంకులో వేసుకుని తాగేదల్లా కుండే ఎత్తిపెట్టి గటగటమనిపించేసింది. పక్కనే ఉయ్యాల్లో మనవడు నిద్రపోతూ కనిపించాడు. చొంగచారికలు కట్టిన వాడి చెంపలమీద ఈగలు దాడి చేసినట్టుగా వాలుతున్నాయి. ఇంత గట్టి సువ్వారీ మనవణ్ణిచూడగానే నీరసప్రాణిలా అయింది.

‘తల్లి మగనాలిమెట్టకు పోయిందని వీడికేం తెలుసును. పాపం ఎలా నిద్రపోతున్నాడో. లేచాక వీడికి ఏదన్నా ఇంత తాగబొయ్యాలి.’ మనసులోనే అనుకుంది.

………….

విశాఖపట్నం జిల్లా ఎగువ సీలేరు ప్రాంతాన్ని జాడి దేశమని పిలుస్తారు. దీనిపైన ఉండే శాంబరికొండల్లోని లమ్మసింగి, చింతపల్లి, రంపోలు, గొలుగొండ, అమ్మవారి దారకొండ, గూడెంకొత్తవీధి తదితరప్రాంతాలను కలిపి చలిగూడెం- పులిగూడెం అని పిలుస్తుంటారు. ఇక్కడ చలి ఎక్కువే. పులిభయమూ ఎక్కువే. దీనికి కాసింత పక్కగా పాడేరు దారిలో గంగరాజుమాడుగుల దిగువకున్న ప్రదేశాన్ని పసిబయలు అంటారు.

ఆ పసిబయలులోదే రేకలబంద. ఊళ్లో పదిహేనువందల మంది జనాభా ఉంటారు. పల్లె ఎగువన కొండలు పోడుభూములతో బోడిగా కనిపిస్తాయి. కిందన గరువు, పల్లపు మాగాణులు విస్తరించి ఉంటాయి. గ్రామం మధ్యన గద్దెరాళ్లు అగుపిస్తాయి. సత్యాన్ని నిరూపించడానికి పనికివచ్చే సిమ్మాలగద్దె పలకరాళ్ల నడుమ అమరి ఉంటుంది. మరోవైపు గ్రామదేవతలు సంకులమ్మ, జాకరమ్మల పాషాణ ప్రతిమలు పసుపుకుంకాలతో దర్శనమిస్తాయి. వాటి పక్కనే ఆనందం ముప్పిరిగొనగా థింసా నృత్యం చేయడానికి వీలయిన ఆటబస కొలువై ఉంటుంది. ఊరికి కాసింత మీదన వేటకు వెళ్లేముందు మగాళ్లందరూ కూడుకునే వేలంబస వేటబయలు నెలకొంది. దానికి కొంచెం దూరంలో మేపడానికి తోలే ముందు పసువులన్నింటినీ ఒక్కచోట చేర్చే గొట్నబయలూ దడికట్టుకుంది.

గ్రామంలో అత్యధికంగా ఉండేవి పూరికొంపలే అయినా పద్ధతిగా కళాత్మకంగా దిద్దితీరుస్తారు వనవాసులు. అన్ని ఇళ్లకూ గట్టి ద్వారబంధాలు, లోతాళాలూ తప్పనిసరి. ఎర్రమన్నులో పిడకలమసి కలిపి నున్నగా నిలిపిన మట్టిగోడలు చూపుతిప్పనివ్వనంత అందంగా కానవస్తాయి. కోపరిగడ్డిని తిరగేసి ఇళ్లమీద పరుస్తారు. తడపలతో లోపలికి ముడివేస్తారు. దీంతో ముడిమంచు, బుగ్గిమంచు, పొగమంచు ఇలా ఏ రకపు మంచు అయినా చుక్కనీటినీ ఇళ్లల్లోకి రాల్చలేవు. కోపిరిగడ్డి కొసనుంచి జారి ముంజూరు ముందు బిందువులై కురిసిపోవలసిందే తప్ప వాటికి వేరే దారే ఉండదు. రేకలబందకు ఆ చివరన మగాళ్లందరూ కలిసి పంచాయితీవేళ కల్లుసారాలు తాగే చేవడిబస కనిపిస్తుంది. ఇటువైపున కూతవేటు దూరంలో మగనాలిమెట్ట కుదురుకుని ఉంటుంది.

తూరుపుకోనల్లో మగనాలిమెట్టలు ప్రత్యేకమైనవి. ఆడకూతుళ్ల ఆశలు తీర్చేందుకు ఊరుకొకటిగా వెలసినవి. పెళ్ళయిన గిరిజనస్త్రీలు సంసారాల్లో వచ్చిపడే చిక్కుల్ని వదిలించుకునేందుకు తుదిమజిలీ ఈ మెట్టలే. పెనిమిటి పెట్టే హింసకు స్వస్తి పలికేదీ ఈ మెట్టమీదే. నచ్చినవాడితో వెళ్లిపోయేందుకు సావకాశం దొరికేదీ ఈ మెట్ట పైనే. తగుమనుషులుకూడి సమస్యలను పరిష్కరించేదీ ఈ మెట్టరాళ్ల సింహాసనామీదనే. అందుకే మగనాలిమెట్టలంటే ఇష్టంలేని మగాళ్లు కొందరు రంకులమెట్టలని వీటిని కసికసిగా పిలుస్తుంటారు. తప్పుకట్టిన పురుషపుంగవులైతే తప్పులమెట్టలనీ అంటుంటారు.

మెట్టకుచేరిన స్త్రీ అత్తవారికి ఊళ్లో గౌరవం మర్యాదా పోతుంది. కోడల్ని సక్రమంగా చూసుకోవడం లేదని తోటివారంతా అత్తకుటుంబాన్ని పలుచన చేస్తారు. తక్కువచేసి మాట్లాడుతుంటారు. మెట్టదారిపట్టిన అమ్మాయి మొగుణ్ణయితే చేతగాని ససవగా లెక్కవేస్తారు. అలా అనిచెప్పి చీటికీ మాటికీ మగనాలిమెట్టకు పోవాలని ఏ గిరికాంతా కోరుకోదు. తన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాకనే, తన బతుకు మామగారింట నాశనం కాకతప్పదని స్థిరపడ్డాకనే గడపదాటి వస్తుంది. అలాంటి పరిస్థితి రేకలబంద కోడలు సీకరికి ఇప్పుడు దాపురించింది. అంచేతనే బిడ్డను ఇంటనే వదిలిపెట్టి పొద్దున్నే ఆమె బయలుదేరవలసివచ్చింది.

……………….

‘‘ఓహోవ్‌. తగువు తీద్దాం పద.. పద.’’ ఊరంతనోరుపెట్టి మొగుడు బొజ్జయ్య ఇంటిబయటనుంచి అరవడంతో అంబలితాగి కొంపలో గోడకి మాగన్నుగా చేరబడిన సువ్వారి ఉలిక్కిపడిలేచింది. తాత అరుపుకి కుళ్లుగుడ్డ ఉయ్యాల్లో నిష్పూచీగా కునుకుతీస్తున్న మనవడు బేరి సైతం కేరుమన్నాడు. తనకెక్కడున్నానో అర్థంకానట్టుగా రెండు చేతులతోనూ చెవులు రాసుకుంటూ గగ్గోలు మొదలెట్టాడు.

‘‘వీడి నోరు పడిపోనూ. పెళ్లికి పోయినట్టు అంత గోలు ఎందుకు. పోయేది పరువుతీసే మగనాలిమెట్టకే కదూ.’’ రుసరుసలాడుతూ మనవణ్ణి చంకనేసుకుని పూరింటినుంచీ బయటకు వచ్చిపడింది సువ్వారి. వస్తూవస్తూ ఇంట్లోని పీనె అరుగు మీద చనిపోయిన పెద్దలకు గుర్తుగా ఉంచే మట్టిముంతకు దండాలు పెట్టి మరీ వచ్చింది. పూటుగా తాగిన మొగుణ్ణి కొరకొరా చూసింది. తన కష్టంతో చేవడిబసలో తెగతాగిన ఊరి తగుమనుషులనూ అంతే కోపంతో చూసింది. పక్కనే తనతో మెట్టకు రావడానికి జట్టుకట్టిన అమ్మలక్కలనూ చూసింది.

‘‘అరిచింది చాలు. నీ కొడుకేడి.’’ ఆవేశంగా మొగుణ్ణి నిలేసినట్టు అడిగింది. భార్య ఎంత ఆగ్రహించినా, మరెంత రోషంగా మీదపడినా పట్టించుకునే పరిస్థితిలో లేడు బొజ్జయ్య. కడుపులో కదుతున్న మడ్డికల్లువాడిని ఆ నిమిషాన మారాజును చేసింది. మిగిలిన మగాళ్లూ సువ్వారి మాటను పట్టించుకోలేదు. గబగబా తగవు తీర్చి చేవడిబసకు వడివడిగా పోవాలన్నట్టున్నారు వాళ్లంతాను.

‘‘నీకొడుకుని నేనేం దాచానేంటి. పక్కనే ఉన్నాడు చూడు.’’ అంటూ తన దిబ్బ శరీరాన్ని కదపలేక కదపలేక పక్కకి కదిల్చాడు బొజ్జయ్య. వెనగ్గా నక్కిన కొడుకు ఎలాగైతేనేం కంటపడటంతో సువ్వారి రాజుకుపోయింది.

‘‘చేసిందంతా చేసి, పీకలవరకూ తాగి, ఏమీ తెలియని అమాయకుడిలా వెనగ్గా ఉంటావేంరా పీసిరీ. ముందుకు తగలడు. పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన పెంటడా ఇలా రారా. దొబ్బి దొబ్బి కన్న కొడుకుని ఎత్తుకో. ఎత్తుకుని మా వెనకాలే మెట్టకు చావు.’’ చంకలో ఉన్న బేరిగాణ్ణి వాడి తండ్రి చిమటయ్యకు విసిరేసినట్టుగా అప్పగించింది. పిల్లాడు హోరుమన్నాడు. తండ్రి చంకకు మారాడు. చిమటయ్య కిక్కురుమనలేదు. తప్పంతా తనదే అన్నట్టుగా బుర్రకిందికి వేలేసుకున్నాడు. వాడి వాలకం చూసి, వాళ్ల అమ్మ వాడిని తిట్టిన తీరు చూసి ఆడమలారం కిచకిచమంది. ఆ మీదట సువ్వారి దారి తీయగా ఏవేవో వల్లించుకుంటూ మెట్టవైపు అంతా పయనమయ్యారు.

ఊరినుంచి బయలుదేరితే మగనాలిమెట్ట పెద్దదూరమేమీ కాదు. మెట్ట అన్నందుకు అది పెద్ద ఎత్తూ కాదు. కాకపోతే దారి బొత్తిగా నిర్ణయించలేని పరిస్థితి. మట్టి గోర్జిపట్టుకుని అంచనాగా ముందుకుపోవాలి. నిత్యమూ తొక్కనిదారి గనక గోర్జి పక్కంట తుప్పలూ డొంకలూ పెరిగి నడిచేవారి మీద పడిపోతున్నాయి. గొబ్బిపొదలు, గురివింద జీమూతాలూ చిక్కనయ్యాయి. బలుసురొడ్డ బలిసిపోయి ముళ్లు ముళ్లుగా అల్లుకుపోయింది. వాటివెనగ్గా సీతాఫలం చెట్లు, పనసమానులు, జీలుగులు వరసావాడీలేకుండా ఎదిగాయి. వెదురుగుబురులైతే చెప్పక్కరలేదు. ఇష్టారాజ్యంగా ఎగిశాయి. ‘భూమికి బొడ్డు.. ఆకాసానికి అడ్డు..’ అని గిరివాసులు చెప్పుకునే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా దూరాన ఉన్న చిత్తడిసీమల్లో చిన్నచిన్న గొడుగులెత్తి వాలుగా చేమాకులు కనిపిస్తున్నాయి.

కుంకుపిట్ట చప్పుడు, చెమరకాకుల అరుపు, పెద్దతుమ్మెద గీగీల మధ్య ఊరిపెద్దలు గోర్జిలో సాగిపోతున్నారు. వారిలో బాగా తాగి ఉన్నవారంతా గళం పెంచి ఎవేవో మాట్లాడుకుంటున్నారు. అందరిలోకీ నోరెత్తకుండా నడుస్తున్నది కొడుకును ఎత్తుకుని అడుగులేస్తున్న చిమటయ్య. వాడి తండ్రి బొజ్జయ్యే. అలా వెళుతున్న మగమందకు చాలావెనగ్గా నడుస్తున్న ఆడాళ్ల బృందమూ తక్కువేంకాదు. ఏవేవో హాస్యాలాడుకుంటూ సాగిపోతోంది. ఇంతలోనే బృందంలోని ఒకామె సువ్వారివైపు తిరిగి,

‘‘ఈ మయాన తప్పులమెట్టకి చేరిన రేకలబంద చిన్నది ఎవ్వరూ లేరనుకుంటా. దారిమొత్తం గందరగోళంగా ఉంది. అడుగుతీసి అడుగువెయ్యడానికే కష్టంగా ఉంది.’’ అదో రకంగా అంది. ఆ మాటల్లోని పెడర్థాన్ని గ్రహించలేనిదాన్ని కానన్నట్టుగా సువ్వారి అందుకుపోయింది.

‘‘అవునమ్మా. నా కోడలే మెట్ట ఎక్కింది. ఊళ్లో ఈ మధ్య ఏ ముండా ఏ మొగుడితోనూ తగువు పడిందే లేదు.   రంకుమొగుడి పుణ్యమాని చావుదెబ్బలు తిన్నదీ లేదు. మా ఖర్మే ఇలా కాలిపోయింది. అందుకే కదా! మీ పాదాలు పట్టుకుని తిరుగుతున్నాం.’’ గయ్‌మంది. మాటకలిపిన ఆడబొట్టె అనవసరంగా సువ్వారిని కదిపినట్టు భావించి మరి నోరువిప్పలేదు. వరసకి సువ్వారికి మేనకోడలయ్యే మరొకామె మాత్రం ఈసారి తనవంతు వచ్చినట్టుగా,

‘‘అత్తాయీ! నీ కోడలు రెండో మగాణ్ణి మరిగిందేమోనే.’’ అనాలనిపించిన మాట ఏదో ఠక్కున అనేసింది. ఆ మాటతో చిక్కితే నెత్తురులేకుండా అయిపోయింది సువ్వారి. కలవరపడింది. కొంచెంసేపు గడబిడపడిపోయింది. ఆనక తేరుకున్నట్టయి,

‘‘ఏమోనమ్మా ఈ గబ్బుగుంట నా కొంపమీదికి ఏం తెచ్చిపెడుతుందో ఇప్పుడు.’’ కన్నీరు ఉబికివస్తుండగా అనేసింది.

‘‘అబ్బెబ్బే. సీకరి అలాంటిది కాదు. మా గుమ్మలగొంది కొమ్మకి అంతపాటి మగదూల ఉండదు.’’ సీకరిమాదిరిగానే దాని ఊరినుంచి రేకలబందకు కాపరానికి వచ్చిన చకోరి తేల్చేసింది.

‘‘నీ కడుపు చల్లగా అదే అయితే నీకు చీరపెడతానే గుంటగలగర. నువ్వన్నట్టు అది దూల తక్కువదే. మొగుడు స్థిరుడు కాకపోవడం వల్లే ఇదంతాను. ఇందులో నా తప్పూ ఉంది. కొడుకుని సరైన బాట నడపలేకపోయాను.’’ అంతటి బాధలోనూ సక్రమంగానే స్పందించింది సువ్వారి. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే మగనాలిమెట్ట దగ్గరపడిపోయింది.

……………..

‘ఆ. ఆ. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. అదిగో ఊరిబాబు కబుర్లన్నీ ఇక్కడికి వినిపిస్తున్నాయి. పెద్దగెద్దలన్నీ ఇటే వస్తున్నాయి. సంకులమ్మ దయవల్ల అంతా సవ్యంగా జరిగితే వంటసారా నైవేద్యం పెడతాను.’ విశాలమైన మెట్టమీద మూలకు కూర్చున్న సీకరి నిలబడుతూనే అనుకుంది. మరికొన్ని నిమిషాలకే ఆమె కోరుకున్నట్టుగా రేకలబంద ఆడ, మగ ప్రముఖులందరూ బడబడలాడుకుంటూ ఆయాసపడుతూ మందగా మెట్టమీదికి వచ్చేవచ్చేశారు.

దూరంనుంచే సీకరి తన పెనిమిటినీ, అత్తమామల్నీ, బంధువుల్నీ, మిత్రగణాన్నీ చూసింది. అదే తడవుగా గబగబా నడుచుకుంటూ మందకు ఎదురేగింది. ముందుగా మొగుడిచంకలో ఉన్న కొడుకును చూసి ఘొల్లుపెట్టింది. మ్మే..మ్మే.. అంటూ తల్లిని చూడగానే బేరిగాడు చేతులందించేసి తండ్రిపట్టు తప్పించుకునేందుకు పెనుగులాడాడు. ఉత్తరక్షణంలోనే భర్తనుంచి బేరిని లాక్కుంది సీకరి. వాణ్ణి ముద్దుల్లో ముంచెత్తింది. వాడయితే ఆమెభుజాన్ని ఎవ్వరూ ఊడదీయలేనంత గట్టిగా పట్టేసుకున్నాడు. కళ్లుమూసుకునే ఉండిపోయాడు. సీకరి నేత్రాలు సజలమయ్యాయి. సువ్వారి కళ్లూ తడిసిపోయాయి.

‘‘అందరికీ జోర.’’ వినయంగా పలికింది. సువ్వారి కనుదోయి కోడలి మన్ననవర్తనతో ఆ క్షణాన మరింతగా తడిబారినట్టయింది.

గ్రామపెద్ద ఒకరు జోక్యం చేసుకుని వచ్చినవాళ్లను వచ్చినట్టుగా పణుకురాళ్ల మీద కూర్చోమన్నట్టుగా సైగలు చేశాడు. ఆడవాళ్లంతా ఒక పక్క, మగవాళ్లంతా మరోపక్క డొంకలు గీసుకోకుండా జాగ్రత్తపడుతూ రాళ్ల మీద ఆసనాలుంచి చతికిలబడ్డారు. అప్పుడక్కడ నిలిచి ఉన్నదల్లా పిల్లాణ్ణి ఎత్తుకున్న సీకరి మాత్రమే.

సూరీడు ఆ సమయానికి నడినెత్తి చేరిపోవడంతో ఎండ ఒకింత చుర్రుమనిపిస్తోంది. అయినప్పటికీ చల్లగాలి రివ్వున వీస్తుండటంతో మరీ అంతగా అది బాధించడం లేదు. అప్పుడిక మగమహారాజులు, ఆడసమూహం రంధిని త్వరగా తేల్చేయాన్నట్టుగా రంగంలోకి దిగిపోయారు.

‘‘మరెందుకు జాగు. మొదలెట్టండి. మా పాపాలేంటో చెప్పమనండి.’’ సువ్వారి మళ్లీ కాస్తంత పాతమనిషిలా మారిపోయి పెటేపకాయలా పేలింది. అత్త సంగతి సీకరికి తెలియంది కాదు. తాడోపేడో అన్నట్టుగా బతకాలని అప్పటికే గట్టిగా అనుకోవడం వల్ల సువ్వారి మాటకు పెద్దగా చెదరలేదు. పెళ్లాం నోరు పెట్టడంతో బొజ్జయ్యకూడా గోదాలోకి దిగిపోయాడు.

‘‘చెప్పమనండి పెద్దలూ. మేం చేసిన తప్పులేంటో.’’ గణగణమన్నాడు. తల్లిదండ్రులు ఇంతగా మాట్లాడుతున్నా సీకరి మొగుడు మాత్రం పణుకురాయిమీద బెల్లంకొట్టినరాయిలా ముఖం వాల్చుకునే కూర్చుండిపోయాడు. సిగ్గుకొంత. తాగిన మైకం మరికొంత. రెండూ మిళితమై వాణ్ణి బుర్ర ఎత్తనివ్వకుండా చేస్తున్నాయి. చాలా సార్లు సీకరి బుద్ధులు నేర్పబోయినా నేర్చుకోలేదన్న యాతనా వాణ్ణి ఆ సమయంలో కొంతలో కొంత పట్టిపీడిస్తోంది. ఈ లోగానే,

‘‘చెప్పవమ్మా నువ్వు. మగనాలిమెట్టకు ఎందుకు వచ్చావో చెప్పు. నీ కష్టం ఏమిటో గబగబా చెప్పు. మేమంతా ఏం చెయ్యాలో అదీ చెప్పు. ఇప్పటికే ఊళ్లో మీ అత్తవారి మర్యాదా పోయింది. నువ్వింకా నోరెత్తకపోతే పక్కవూళ్లోనూ వాళ్లు బుర్ర ఎత్తుకోలేరు.’’ బుర్రమీసాల ఊరిపెద్ద ఫెళఫెళలాడాడు. సరిగ్గా అదే వేళ,

‘చెప్పవలసిందేదో చెప్పితగలడు.’ అన్నట్టుగా సువ్వారి సైతం కోడలి వైపు తీక్షణంగా చూసింది. తనవంతు వచ్చినట్టుగా భావించిన సీకరి,

‘‘ఎవ్వరితోనూ నాకు తగూ లేదు. నా మొగుడితోనే నాకు గొడబ.’’ స్వరతంత్రులు ధాటిగా కదిలించిమరీ చెప్పవలసింది మెట్ట మార్మోగిపోయేటట్టుగా చెప్పేసింది. ఒక్కసారిగా అటు బొజ్జయ్య ఇటు సువ్వారీ తెరిపినపడ్డట్టయ్యారు. తమతో తగువుందని కోడలు చెప్పకపోవడమే చాలన్నట్టుగా అయ్యారు. అయినప్పటికీ సువ్వారి పూర్తిగా శాంతపడలేదు.

‘‘నీ మొగుడితో నీకేం పేచీ.’’ సోరంటాలు పెట్టినట్టుగా అనేసింది. అంతటితో ఊరుకోకుండా పౌరుషమేదో అప్పటికప్పుడే పొడుచుకురాగా,

‘‘నాకొడుకు నీకు చాలడం లేదేం.’’ ఎకసెక్కంగానూ నోరుపెంచింది. అత్తగారి పోతరాన్ని ప్రదర్శిస్తున్నట్టుగానూ పలికింది. దెబ్బకి సీకరి దెబ్బతినిపోయినట్టుగా అయింది.

‘ఎంతమాట అనేసింది ముదనష్టపు అత్త.’ లోపల్లోపలే అనుకుంటూ,

‘‘నాకు నీలాగ ఎచ్చు దూల లేదులే. నీ కొడుకు చాలులే.’’ ఏదయితే అదే అవుతుందని విస్సాటంగా మాట విసిరేసింది.

‘నీ కొడుకు చాలులే.’ అనే మాట వరకూ ఫరవాలేదుగానీ, ‘నీలాగ ఎచ్చు దూల లేదులే.’ అనే మాట మాత్రం సువ్వారిని నాడెంగా కూర్చోనివ్వలేదు. అది కొంచెం కించపడింది. అయినా నోటివట్టాన్ని వీలయినంతగా తగ్గించుకుంటూనే,

‘‘మరేంటయితే నీ బాధ.’’ విసురుగా పేలింది. ఇదే అదనుగా సీకరి మొదలెట్టింది.

‘‘నీ కొడుక్కి కల్లుకావాలో ఇల్లుకావాలో తేల్చుకోమను. సారా కావాలో నేను కావాలో చెప్పమను. నిషాయే కావాలనుకుంటే దాంతోనే సంసారం చెయ్యమను. పగలూ రాత్రీ అదే పని మీద ఉంటే గనుక ఇకమీదట నేను ఒప్పనంటే ఒప్పను.’’ భీకరంగా గీ పెట్టింది.

ఆ మాటకు అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకోసమా ఇది మెట్ట ఎక్కిందనీ సీకరిని గురించి అనుకున్నారు. ఈ సమయంలో తనేం తగ్గనన్నట్టుగా సువ్వారీ ఎగసిపడింది.

‘‘కొండమీద కల్లుతాగని వాడెవడున్నాడు. సారా మింగని వాడెవడున్నాడు. మీ నాన్న తాగడంలేదా. మీ అమ్మ తాగలేదా.’’ రంధికి దిగిపోయింది. సీకరీ వెనుదిరగలేదు. అదీ నోరుపెట్టేసింది.

‘‘వాళ్లంతా తాగారు. తాగుతున్నారు. కానీ, ఒళ్లు వంచుతున్నారు. వ్యవసాయం చేస్తున్నారు. బంగారం పండిస్తున్నారు.పిల్లల్నీ, మనవల్నీ బంగారంలా చూసుకుంటున్నారు. నీ కొడుకేం చేస్తున్నాడు. ఎప్పుడయినా పండుకోశాడా? వేట చేశాడా? తేనె తీశాడా? పనసపిక్క పాతరేశాడా? కొండమావిళ్లు కోసుకొచ్చాడా?’’ కసికసిగా కణకణమంటూ చెలరేగిపోయింది. సీకరి ప్రశ్నకి మగాళ్లంతా మొగమొగాలు చూసుకున్నారు. చిమటయ్య అయితే మత్తుదిగిపోయినవాడిలా అయిపోయి పెళ్లాంవైపే పిచ్చిచూపు పారించాడు.

‘నిజమే. తాగితే తాగవచ్చు. ఎల్లవేళలా అదేనా. తాగుడు సరదా ఇవ్వాలి. దాంతో మనం సంబరాలు చెయ్యాలి. ఆడాలి. పాడాలి. అంతేగానీ చిమటుడిలాగ ఎప్పుడూ దాని జోలేనా. ఇలా అయితే మనిషి జన్మకి అర్థం ఏంటి.’ అచ్చం ఇలాగే అనుకున్నారు అక్కడచేరిన అందరూను. కానీ, ఒక్కరూ బయటపడలేదు. ఏం చెబితే ఏమవుతుందో అన్నట్టుగా టక్కులేసేశారు. ఆ సమయంలో తప్పదన్నట్టుగా బుర్రమీసాల పెద్దయ్య కలుగజేసుకున్నాడు.

‘‘అమ్మా! నేనూ తాగుతాను కదా. అందులో తప్పేంటి. అంత మాత్రానికి సంసారాన్ని వీధులో పెట్టుకుంటావా? ఏదో నువ్వే సర్దుకుపోవాలి కాదూ.’’ తగుమనిషి తరహాలో అన్నాడు.

‘‘సరైన మాట చెప్పావు. మన వాళ్లలో తాగడం వారసత్వం. దాన్ని కాదనడానికి ఇదెవర్తి. అయినా నా కొడుకు మంచివాడు కాకపోతే పోయె. అత్తామావలం మేం చచ్చావేంటి. ఉన్నాం కదా. మనవలని చూసుకుంటాం కదా.’’ బుర్రమీసాలతో జత కలిసినట్టుగా సువ్వారి గర్వంగా మాట్లాడింది. వెర్రివెధవలా తగవు వింటున్న చిమటయ్యగాడూ అమ్మమాటకు చల్లదనం పొంది పణుకురాయిమీద నిలకడయ్యాడు.

అత్తమాటలు సీకరికి అస్సలు నచ్చలేదు. ఉన్నపళంగా భద్రకాళిలా మారిపోయింది. చంకన ఉన్న కొడుకును చప్పున తెచ్చి అత్తకాళ్లముందు కుదేసింది. దీంతో పిల్లాడు గోలుపెట్టాడు. వాణ్ణి పట్టించుకోకుండానే,

‘‘నీ కొడుక్కి పోడు కొట్టడం రాదు. నాలోకి దూరిపోవడం వచ్చును. చెట్టు నరకడం చేతకాదు. నా కడుపులో బిడ్డని పెట్టడం చేతవును. పొలానికి పనికిరాడు. పడుక్కోవడానికి ముందుంటాడు. విత్తనాలు జల్లలేడు. నాలో ఎన్ని విత్తనాలయినా నాటగలడు. థింసా ఆడలేడు. నా లోపల ఏవేవో పెట్టి ఆడించగలడు. ఈ లెక్కన ప్రతీ ఏటా ఒక బిడ్డ చొప్పున మరో పదిమందినో పాతికమందినో వాడితో కలిసి నేను తియ్యాలా? పడిపడితాగే మొగుడు మంచిపిల్లల్ని పెట్టగలడా? ఆ జబ్బు గుంటలందర్నీ నువ్వూ నీ మొగుడే పెంచుతారుటే పెడముండా. పెద్దమాటలు ఎందుకు పలుకుతున్నావే ఎద్దుబుర్ర పెద్దలంజా.’’ సువ్వారి మీద ఒంటికాలిన లేచిపోయింది.

సీకరి మాట్లాడిన మాటలన్నీ ఒప్పులే అన్నట్టుగా సమర్థింపు ధోరణిలోకి అక్కడి ఆడవాళ్లందెరో చేరిపోయారు. అందుకే వాళ్లెవ్వరూ మారు పలకలేదు. మగగుంపు కూడా చిమటుడి వాటాన్ని సీకరి విప్పిచెప్పేసిన దరిమిలా నోటిమీద వేలేసుకుని కూర్చున్నట్టుగా అయిపోయారు. బొజ్జయ్య ఏదో మాట్లాడాలని గొంతు సవరించుకోబోయాడు. అయినా కోడలు పడనివ్వలేదు.

‘‘మనం కొండదేవర పిల్లలం. చుట్టూ ఉన్న భూదేవి మనదే. దున్నితేనే గదా పంట. కూర్చుని తాగుతూ పోతుంటే నాకెవరు దిక్కు. నా పిల్లలకెవరు రక్ష. ఎంతసేపూ నేలతో నేనే సాము చేస్తే సరిపోతుందా. పోతుమొగుడూ నాతో కలిసి బరకమెరకల్లోకి దిగొద్దా.’’ మరోసారి మావగారివైపు తిరిగి సలసలా కాగిపోయింది. అంతటితో ఊరుకోకుండా మొగుడి దగ్గరసా వెళ్లి వాడి ముఖాన మెటికలు విరుస్తూ,

‘‘పనికొల్లవు పాటు కొల్లవు ` పగలు పొద్దున తిందెనందువు

వేటకొల్లవు వెట్టికొల్లవు ` వేగిన పొద్దున తిందేనందువు.

కూలికొల్లవు నాలికొల్లవు ` కుగుడుండి తిందేనందువు.’’

తన కోపాన్ని పదంగా పాడి మరీ వినిపించేసింది. దీంతో బుర్రమీసాలాయన కాస్తంత బెదిరినట్టయ్యాడు. మాట్లాడక తప్పనట్టూ అయ్యాడు. బొజ్జయ్య కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ,

‘‘తాగుడు వద్దని చెప్పడం లేదు నీ కోడలు. సమయం సందర్భం ఉండాలంటోంది. అది చెప్పినట్టు ఎప్పుడూ

నిషాలోనే ఉండిఛస్తే చెత్తపిల్లలు పుట్టక ఏం చేస్తారు. అప్పుడూ మీకే కదూ బాధ. అయినా మీ మొగుడూ పెళ్లాలు ఎంతకాం ఉట్టికట్టుకుని ఉంటారయ్యా. మీ ఇంటికి రాబోయేరోజుల్లో అదే కదా పెద్ద దిక్కు.’’ కర్రవిరక్కుండా పాము చావకుండా ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పాడు. అయినా సీకరికి మనసు కుదుట పడలేదు. బుర్రమీసాల దగ్గరసా వచ్చింది. అందరికీ వినబడేలాగ ఎలుగు పెంచింది.

‘‘ఇలాంటి సంసారం చెయ్యడం కంటే చెయ్యకపోవడమే మంచిది. నా మొగుడు వ్యవసాయం చేస్తేనే వాడితో ఉండేది. పంటతీస్తేనే వాడికి వండిపెట్టేది. లేకపోతే గుమ్మలగొంది పోతాను. మరో పనికొచ్చే మొగాడితో లేచిపోతాను. నా బతుకే బుగ్గయ్యాక ఎవడి పరువు ఎలా పోతే నాకేం.’’ నిప్పురవ్వలా రవరవలాడిపోయింది.

కోడలు అన్నంతపనీ చేయగలదని దాని మాటనుబట్టీ, దాని తీరువాను బట్టి, మగనాలిమెట్టకు అది చేరడంబట్టీ అప్పటికే సువ్వారికి బాగా అర్థమైపోయింది. అన్నింటికీమించి నదరయిన మరొకణ్ణి అది తగులుకుపోతే తమ అయివేజు మంటగలవక తప్పదన్న ఆవేదనా దానికి పెరిగిపోయింది. తాగుబోతు పిల్లలు ఎందుకూ పనికిరాకుండా పోతారన్న కోడలి వాదనతో డస్సిపోయినట్టుగానూ అయిపోయింది. ఏమనుకుందో ఏమో. కూర్చున్న చోటునుంచి విడిపోయింది. ధుమధుమలాడిపోయింది. విసవిసలాడుతూ పుత్రరత్నం కూర్చున్న చోటుకు వచ్చేసింది. వచ్చీరాగానే తీసిపెట్టి కొడుకు గూబమీద ఫడేలని లెంపకాయ కొట్టేసింది. హఠాత్తుగా అమ్మ కొట్టిన దెబ్బకు వాడు బిత్తరపోయినట్టయ్యాడు. పేలిన ఎడమ గూబని కుడిచేత్తో పట్టుccకుని అయోమయంగా ఉండిపోయాడు. కొట్టిన సువ్వారి కొట్టినట్టుగా ఉండకుండా,

‘‘చూడరా నా బెండుడా. నువ్వు సరిగ్గా లేకపోతే నీ పెళ్లాం ఎవడితోనే పోతానంటోందిరా బండడా. సిగ్గులేదురా నీకు. లజ్జ ఉండదురా నీకు.’’ అంటూనే వాడి రెండో చెంపా ఛెళ్లుమనిపించింది. రెండు దెబ్బలు కొట్టినా అక్కసు తీరకపోవడంతో కొడుకు గూబలు గబగబా ఫడఫడా వత్తేసింది. వాడి వీపు వంచి బొటబొటా కన్నీరు కారుస్తూనే మరో నాలుగు పడేసింది. తల్లిమాటకి, కొట్టినదెబ్బకి పూర్తిగా తెలివితెచ్చుకున్నాడు చిమటయ్య. ఊరందరిముందూ తీవ్రమైన అవమానమూ పడినట్టయ్యాడు. సిగ్గుపడ్డట్టూ అయ్యాడు. ఇకను తప్పదన్నట్టుగా రాయిమీంచి మెల్లగా లేచి నిలబడ్డాడు. తవంచుకున్నాడు. రెండు చేతులూ కట్టుకున్నాడు. ఏదో నిర్ణయించుకున్నవాడిలా అయ్యాడు. చేసేదేమీలేనట్టుగా జడ్డిజడ్డిగా వల్లింపు మొదలుపెట్టాడు.

‘‘ఒట్టు. మీ అందరిముందూ ప్రమాణం చేస్తున్నాను. నామాట నమ్మండి. ఇక మీదట నా పెళ్లాం ఏం చెబితే అది చేస్తాను. అలా చెయ్యకపోతే దాని చిత్తం వచ్చినట్టుగా అది చెయ్యొచ్చును. మరో అయ్యతో అది పోవచ్చును. నాకో చివరిదారి ఇచ్చి చూడమనండి. బాగుపడతాను.’’ కట్టిన చేతులను మగమంద ముందు జోడించి అదోరకంగా మొహం పెట్టి కన్నీరుకారుస్తూ నిస్సత్తువగా చెప్పాడు. ఆ మాటలు అక్కడున్నవారిని కదిలించాయి. ‘పాపం ఎలా అయిపోయాడో, ఎంత బేలగా తయారయ్యాడో, వీడికి మరో అవకాశం ఇస్తే మంచిదే.’ అన్నట్టుగా ఏదేదో తలపోశారు.

అప్పటివరకూ కరుగ్గానే ఉన్న సీకరి, మొగుడి ఏడుపు ఎప్పుడయితే చూసిందో కరిగిపోయినట్టయింది. కన్నీరుమున్నీరూ అయింది. భోరుభోరుమంటూ భర్తని చేరి అతగాణ్ణి నిలువునా చుట్టుకుపోయింది. అత్త కాళ్ల దగ్గరున్న పసికందును ఎవరో తెచ్చి ఇవ్వగా చేతుల్లోకి తీసుకుని గగ్గోలుగా ఏడవడం మొదలెట్టింది. చూసినవారంతా ఆ సమయాన అదోలాంటి ఆర్ద్రతలో చిక్కుబడిపోయారు. ముందుగా తనే తేరుకున్నట్టుగా అయ్యాడు బుర్రమీసాలాయన. తగువంతా చిటికెలో సమసిపోయిందన్నంత ఆనందమేదో ముప్పిరిగొనగా గొంతు సవరించేశాడు.

‘‘ఇప్పటికి జరిగింది చాలు. గొడబ తీరిపోయింది. కోడలు చెప్పినట్టు కొడుకు వినాలి. మగాడు మగాడిలా వ్యవసాయం చెయ్యాలి. సంసారమూ చెయ్యాలి. ఊరిపరువు నిలబెట్టాలి. ఈ ఊసు ఇక్కడితో మరిచిపోండి. ఎవరింటికి వాళ్లు పొండి. రేపటినుంచీ పోడుభూముల్లో చిమటయ్యగాడూ కనిపిస్తాడు. పిల్లాపాపల్తో సీకరీ కళకళల్లాడుతుంటుంది. సంకులమ్మే అందరి క్షేమం చూసుకుంటుంది.’’ తీర్పు ఏదో చెప్పేసినట్టుగా పలికేసి పణుకురాయి వదిలిపెట్టేశాడు. మెట్ట దిగడం మొదలెట్టాడు. వెనువెంటనే మరెవరూ మారుమాట్లాడకుండా అతగాడిని అనుసరించారు. కొద్దిసేపట్లోనే మెట్ట వీడి దిగువకు వచ్చిన మగాళ్లు వంకాటొంకా లేకుండా తిన్నగా చేవడిబసకు చేరిపోయారు. సువ్వారి సహా ఆడంగులందరూ ఎవరి ఇళ్లకు వాళ్లుపోనేపోయారు.

ఒకచేత మొగుణ్ణి మరో భుజాన పిల్లణ్ణి పట్టుకుని మెట్టనుంచి ఊళ్లోకి వచ్చిన సీకరి సరాసరి సిమ్మాలగద్దెకే చేరింది. చిమటయ్య నుదుటన పెద్దబొట్టు పెట్టింది. గద్దె చుట్టూ వాడి చేత ప్రదక్షిణలు చేయించింది. దగ్గరుండి వాడి చేత ఏదో పూజ కూడా జరిపించింది. మధ్యమధ్యన దూరంగా కానవస్తున్న మగనాలిమెట్టవైపు తిరిగి భక్తిగా రెండుచేతులూ నుదుటకు చేర్చి దానికి జోతలూ చెల్లించింది.

…………….

Avatar

చింతకింది శ్రీనినాసరావు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • <"అందరికీ వినపడేలాగు ఎలుగు పెంచింది."

    చాన్నాలతర్వాత అసలైన తెలుగులో మంచి గొట్టి కళ్ళకు కట్టినట్లు గొప్పఅవకాశం కలిగింది. ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు