బోన్సాయ్ మొక్కలు కాదు, వాళ్ళు మహావృక్షాలు!

వనజ కవిత్వంలో ముప్పావు వంతు పైగా స్త్రీ సంబంధమైనవిగానే కవితలున్నాయి . బతుకు రంగ స్థలం మీద ఎవరెవరో యిచ్చిన పాత్రలలో నటిస్తూ జీవిస్తున్నట్లుగా ఉన్న వేల వేల స్త్రీల ముఖాలని పరిచయం చేసింది.

మంచి కథలు వ్రాసే వ్యక్తిగా గుర్తింపు పొందిన వనజ కవిత్వంలోనూ తన పత్యేకత వెతుక్కుంటోంది. భూమికలోనూ, వెబ్ మాగజైన్స్ లోనూ, పత్రికలలోనూ,కవి సంగమం లోనూ అడపాదడపా తన కవితలు చదువుతూనే వున్నాను. పుస్తక రూపంలోకి వచ్చేసరికి రాణించే కవితలే ఎక్కువగా కనిపించాయి. రాన్రాను భాషలో మార్పు కవితా శీర్షికలలో మార్పు,  వ్యక్తీకరణలో మార్పు, వస్తు ఎన్నికలో, కవిత్వ చిక్కదనంలో మార్పు స్పష్టంగా  కనిపిస్తున్నాయి.

స్త్రీలు రచయిత్రులుగా మారాలంటే ఇల్లు,  వంటిల్లు ఆమెపై యెంత వొత్తిడిని తీసుకొస్తాయో “చెక్కేసిన వాక్యం ” కవితలో వ్యక్తీకరించింది. వాక్యాన్ని చెక్కుతుండగానే పెన్సిల్ ముక్క విరిగినట్లుగా అధికారాల మధ్య నిసృహగా వాక్యమెక్కడో జారిపోతుంది అంటుంది. “పాకశాలలో చిక్కబడిందే స్త్రీల జీవితమనేది యెప్పటికీ మారని నిర్వచనమే  దానిని  చెరిపేయాల్సింది కూడా మనమే అంటుంది. ఈ కవిత చదువుతుంటే వసంతా కన్నాభిరామన్ గుర్తొచ్చారు .   స్త్రీల నైటీలకి కానీ, దుస్తులకి గానీ వొక జేబు వుండాలి.అందులో ఓ పేపర్ పెన్నూ వుంటే ఎంతపనిలో వున్నా క్షణంపాటు వెలిగే భావాలని రికార్డ్ చేసుకుని తర్వాత రాసుకోవచ్చు అన్నారు.

వనజ హృదయ అత్యంత సున్నితం. ఒక పువ్వు పూయగానే తానే వొక రేకై విరిసినట్లుగా అనుభూతి చెందటం కనిపిస్తుంది.

తనని తానూ అన్వేషిస్తున్న క్రమంలో రాసుకున్న కవిత “జీవితాన్వేషణ ” ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి ,ఎక్కడ  పారేసుకున్నానో  ఎంతకీ గుర్తుకురావడంలేదు/ దీపమూ నాచేతిలోనే వుంది దారమూ నాచేతిలోనే వుంది  అనే సృహని వెలిబుచ్చింది. వనజ కథకురాలవ్వడం వల్ల కథన రీతిలో కొన్ని కవితలున్నాయి. విషయం పట్ల వొక స్పష్టత వున్న కవయిత్రి. బతుకు పట్ల భరోసా వున్న కవయిత్రి. స్త్రీలని గురించిన ఆలోచనా వేదనల కలబోతల చిత్రాలుగా అనేక కవితలని మలిచింది.

వనజ కవిత్వంలో కూడా అంతర్లీనంగా ప్రవహిస్తూండే రచనా గుణం అనేక కవితల్లో ఆవిష్కారమైంది. దేహక్రీడలో తెగిన సగం కవితలో .. దేహం నదిలో / ఎత్తు పల్లాలు వొంపుసొంపుల సొగసులను /ఆబగా కొలుచుకునే కామచిత్తులకు/ ప్రవహించినంత మేరా పచ్చదనాన్ని నింపే /ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎప్పుడు? ..అని సూటిగా ప్రశ్నిస్తుంది.

“గాయం వేల సందర్భాలు ” కవితలో ఇలా అంటుంది . :గాయానికి తెలుసు, మాను ఎండినా తీగకు  ఆధారమైనట్లు తనని తాను నిలబెట్టుకోవాల్సిందే. ఆత్మని ఆశ్రయించాల్సిందే / అందుకే గాయం నడుస్తూనే వుంది,వేలసంధర్భాలని తనలో దాచేసుకుని /.

గతంలో చాలా మంది రైతుల జీవితాల గురించి, వ్యవసాయ కష్టాలు గురించి, రైతుల ఆత్మహత్యల గురించి యెన్నెన్నో కవితలు వ్రాసారు. వోల్గా రైతు ఆత్మహత్య చేసుకున్నాక వొంటరిగా మిగిలిపోయిన అతని భార్య గురించి వ్రాసింది. ఇది మొదటి కవిత అయితే వనజ వ్రాసినది రెండో కవిత . “నువ్వు వొదిలేసిన కాడితో ” నేను సాయంగా వుండానన్న సంగతి మరిచేసి / నిన్ను కన్నోళ్ళకి మనం కన్నోళ్ళకి నన్నే వొంటి నితాడిని చేసి పోయాక /నన్ను గాలికి వొగ్గేసి నువ్వు గాలిలో కలిసి పోయాక / నేను రోజూ  దైర్యమనే మందు తాగుతూనే వున్నాను /.. నా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి /మా చూపులకి అగ్గి రగిలించుకుని / ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి / నువ్వు వొదిలేసిన కాడితో బ్రతుకు సేద్యం చేస్తూనే వుందాల /బ్రతుకుతూనే వుండాల.

వర్తమానంలో స్త్రీల స్థితిని గురించి, పిల్లలు, కుటుంబం ఆమెనెలా “ఖాళీ సంచి “లాగా మిగిల్చేస్తారో చెప్పిన కవిత. కాస్త నాలుగు గోడలు దాటి / మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఆలోచనల తావున / పావురంలా స్వేచ్ఛగా , శాంతిగా మసలాలనుకుంటే / జీవితం జీవితాన్నే ఒక ఖాళీసంచి గా మార్చి / బిడ్డలెప్పుడో చేతికి తగిలించుకుని / వెళ్లిపోయారని గుర్తుకు వచ్చినప్పుడు / జీవితమంటే అర్ధం కాని సంవేదన / ఎందుకయ్యిందో ఎరుక పడతారు.  ఈ ఎరుకను అన్ని సందర్భాలలోనూ తెలిసిన వ్యక్తి కాబట్టి  మెచ్యూరిటీ సాధించిన కవిత్వామీమెది.

భార్యా భార్తలైపోయాక గతంలోని ప్రేమలు గుర్తొచ్చినా వివేకంతో ఎలా ప్రవర్తించాలో “మూడో మనిషి ” ఎంత క్షోభకి గురవుతుందో తెలిపిన కవిత ఇది. అలాగే “రూపకశ్రేణి” కవితలో .. ఇప్పుదీపుదె అన్నింట్లో కాకపోయినా కొన్నిట్లో అయినా మిమ్మల్ని దాటేసిన వాళ్ళం/ ఆఫీసు ,వంటిల్లు , మాతృత్వం అన్నీ మీకేనా అని మా అధిక సామర్ధ్య౦ చూసి/ లోలోపల దుఃఖిస్తూ మాకేం లేవా ? మేము ద్వితీయ శ్రేణీ నా అంటూ ఘోషించే మీ ప్రశ్నకి మేము సంసిద్ధం / అంటూ దృఢ౦గా పలికింది.

ప్రకృతిలో గాఢ అనుభూతిని పొందిన కవిత, ఆమె మృదుతత్వాన్ని అద్భుతమైన పోలికతో హృద్యంగా వెలువరించిన కవిత “రాత్రి ఓ అంతరంగ రహస్యం ”

చిన్నారి కవయిత్రి  “అంజన ” నీలి మేఘాలులో రాసిన కవిత ‘అమ్మను నేనే ,బొమ్మను నేనే అని మొదలవుతుంది. “నాల్గింట మగనాలి ” కవిత చదువుతుంటే అది గుర్తొచ్చింది. ఆడపిల్లని అరణంగా రాసిచ్చిన మానవ జాతికి / అమ్మవు నువ్వే బొమ్మవు నువ్వే !

తనువంతా కరిగించి మనసంతా కుదించి / ఓ పాత్రలో వొదిగేస్తావ్ / వీడ్కోలు యాత్రలో నీపై దండలై పూసేది ఈ త్యాగాలే / నీ జనం చరితార్ధం చేసిన గాధలని / తామ్ర పాత్ర లేకలపై భద్రపరిచి యుగయుగాలు పాఠాలు భోధిస్తారు / ఆకాశాన సగం మనం అయినా మనల్ని అణిచేసేది నిజం /  వేయి తలల ఆదిశేషునై  విలువల వ్యాకరణం నేర్పిస్తా /నీ ధీరత్వం, వీరత్వం అన్నీ కూకటి వేళ్ళతో పెకిలిస్తా / అనే ధోరణితో కవిత ప్రయాణిస్తుంది.

జీవితం “నీటి ప్రయాణం ” లాంటిది అంటుంది ఒక చోట . వేదాంత ధోరణితో తప్పిదాలన్ని పలక మీద రాసిన అక్షరాలైతే ఎంత బాగుందు అనుకుంటుంది. నీడలా వెంటాడే శాశనాలు ,ఊడల్లా విస్తరించే ఆత్మ నూన్యతలు, వెంటాడే నీడ వేటాడే నీడ నన్ను ప్రాణం లేని శిలని చేసింది అన్న జ్ఞాన స్పృహ ని వెల్లడించింది.

ఇంకొక మంచి కవిత ” ఆకాశాన సగం మనం ” – అవసరాల బానిసత్వ కొట్టంలో జీతంరాళ్ళ పాలిచ్చే పశురాళ్ళం మనం / జీవితపు రంగస్థలం మీద మనది కాని జీవితంలో నటిస్తున్న నట ఊర్వశిలం మనం / వ్యక్తిత్వపు పరిమళాలు విజ్ఞానపు పూలు సమర్ధతా నైపుణ్యాలు వున్న మనం / అయినా మనకన్నా బోన్సాయ్ మొక్కలే నయం / మనువు వొక లోహపు గది తనువు ఒక మోహపు నది / పురాణాల్లోలా  కాకుండా చరిత్రలో శోక పర్వాలు వనవాస ఘట్టాలు లేని/ మనకొక అధ్యాయాలు మిగిల్చుకుంటూ/ భవితలో మనలాంటి మనం లేకుండా మరింత చైతన్యశీలురుగా/ ఎదిగే దిశలో మనలో మనం మనతో మనం . ఈ కవితా వాక్యాలు చాలు . ఆమె ఎంత ఆశావాదో, భవిష్యత్ తీరాలవైపు యెంత నమ్మకంతో ప్రయాణం మొదలుపెడుతుందో తెలియడానికి.  ” ఆధునిక మహిళ ” కవితలో స్త్రీ సంపూర్ణ స్వరూపాన్ని చిత్రకారిణిలా చిత్రించింది.

వనజ కవిత్వంలో ముప్పావు వంతు పైగా స్త్రీ సంబంధమైనవిగానే కవితలున్నాయి . బతుకు రంగ స్థలం మీద ఎవరెవరో యిచ్చిన పాత్రలలో నటిస్తూ జీవిస్తున్నట్లుగా ఉన్న వేల వేల స్త్రీల ముఖాలని పరిచయం చేసింది. మహా వృక్షాలైన స్త్రీలు ఇళ్ళలో బోన్సాయ్ మొక్కలుగా పెరుగుతున్న వైనాన్ని వేదనతో వినిపించింది. రచనని వొక సామాజిక బాధ్యతగా  తీసుకుని రాస్తున్న వనజ కలం నుండి మరెన్నో కవితలు వెలుగు చూడాలని ఆశిస్తున్నాను .

*

శిలాలోలిత

శిలాలోలిత

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విహంగ వీక్షణం చేసిన రివ్యూ …. ధన్యవాదములు

  • డా .శిలాలోలిత గారి హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుమాట చదివిన అందరూ కవిత్వానికి తగ్గ ముందుమాట వ్రాసారని ప్రశంసలు ఇచ్చారు. స్త్రీల హృదయాన్ని వొకింత స్త్రీలే ఎక్కువ అర్ధం చేసుకోగలరనడానికి ఇదొక తార్కాణం. ధన్యవాదాలు మేడమ్.

  • అద్భుతమైన కవితా సంకలనానికి అంతే అద్బుతమైన సమీక్ష వ్రాసి ఎపుడెపుడు చదువుదామా అన్న ఆసక్తి ని కలిగించారు. ఇద్దరి కి

    అభినందలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు