బోనాలలో ఒకప్పటి వెలుగు వుందా?!

ఎంతో సన్నిహితమైన, నేలతో ముడిపడిన సంప్రదాయం క్రమంగా రద్దీ మధ్య తన నిశ్శబ్దాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ రద్దీలో భక్తి లేదని చెప్పలేం.

తెలంగాణ పల్లెల్లో ఎల్లమ్మ గుడి ఊరి చివర, పొలాలకు వెళ్లే దారి పక్కన, పెద్ద వేపచెట్టు నీడలో కనిపిస్తుంది. పసుపు పూసిన రాయి, ఎర్రని కుంకుమబొట్టు, గాలికి కదిలే వేపాకులు, ఆమెకు గోపురం కంటే నేలతో ఉన్న అనుబంధమే ఎక్కువగా అనిపిస్తుంది. ఎల్లమ్మ గుడి చాలాసార్లు ఊరి పొలిమేరలో ఉండటానికీ ఒక అర్థం ఉంది. ఊరికి, బయటి ప్రపంచానికి మధ్య నిలిచే రక్షకురాలిగా ప్రజలు ఆమెను ఆరాధించారు. వ్యాధులు, చీడపీడలు, పంటనష్టం, ఇతర అపాయాలు ఆ సరిహద్దును దాటి ఊరిలోకి రాకుండా కాపాడే తల్లిగా విశ్వసించారు. అందుకే గ్రామదేవత ఆరాధనలో భక్తితో పాటు భయం, కృతజ్ఞత, ప్రకృతిపై ఆధారపడిన జీవితం కూడా కనిపిస్తాయి.

ఏరువాకతో వ్యవసాయ సంవత్సరం మొదలయ్యేది. తొలకరి వానకు తడిసిన మట్టి వాసన గాలిలో నిండేది. కడిగిన నాగలికి పసుపు రాసి, ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి, రైతు మొదటి చాలు దున్నే ముందు భూమికి నమస్కరించేవాడు. కొత్త కుండలో వండిన అన్నాన్ని బోనంగా తీసుకెళ్లి గ్రామదేవతకు సమర్పించేవారు. అది కేవలం దేవతకు పెట్టిన భోజనం కాదు, “మా పొలాన్ని, పశువులను, పిల్లలను కాపాడు” ప్రకృతికి చేసే ప్రార్ధన.

ఏరువాక బోనాల నుంచే నేటి ఆషాఢ బోనాలు నేరుగా వచ్చాయని చెప్పడానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. అయినా రెండింటిలోనూ భూమి, ఆహారం, గ్రామదేవత, రక్షణ, కృతజ్ఞతల మధ్య ఉన్న అనుబంధం కనిపిస్తుంది. ఒక సమాజం తన భయాన్ని భక్తిగా, తాను పండించిన ఆహారాన్ని నైవేద్యంగా, తన కృతజ్ఞతను ఆచారంగా మార్చుకున్న తీరు అందులో ఉంది. ఆ పాత దృశ్యంలో డప్పు శబ్దం పొలాల మీదుగా వినిపించేది. నెత్తిమీద బోనం, దాని చుట్టూ వేపాకులు, పైన మిణుకుమిణుకుమనే దీపం, మహిళలు మట్టి దారిలో ఎల్లమ్మ గుడివైపు నడిచేవారు. పసుపునీటి చల్లదనం, కుంకుమ రంగు, వంట అన్నం పరిమళం, డప్పుల మోత, ఇవన్నీ కలిసి భక్తిని మాత్రమే కాకుండా, ఊరంతా పంచుకునే ఒక సజీవ సంబరంగా ఉండేది.

కాలం మారింది. పొలిమేరలో కనిపించిన అమ్మవారి ఆరాధన పట్టణ వీధుల్లో కొత్త రూపాన్ని పొందింది. మట్టి దారి తారు రోడ్డయింది; చిన్న ఊరేగింపు మహానగర జాతరయింది. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి గ్రామదేవతల చుట్టూ ఉన్న స్థానిక ఆరాధన, మహంకాళి బోనాల విస్తృత రూపంలో కొత్త గుర్తింపును పొందింది. అయినా బోనంలోని అన్నం, పసుపు, కుంకుమ, వేపాకు, దీపం, వాటి వెనుక ఉన్న మనిషి భావం, ఇంకా కొనసాగుతున్నాయి. రూపం మారినా మూలభావం నిలిచి ఉండటమే బోనాలలో నాకు కనిపించే సాంస్కృతిక నిరంతరత్వం.

బోనాలు 1813లో హైదరాబాద్–సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాపించినప్పుడు ప్రారంభమయ్యాయని విస్తృతంగా చెబుతారు. ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనికులు మహంకాళిని ప్రార్థించి, నగరానికి తిరిగివచ్చిన తరువాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారనేది తరతరాలుగా చెప్పుకునే ప్రజాస్మృతి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వివరణ కూడా ఈ కథనాన్నే నమోదు చేస్తోంది. (తెలంగాణ ప్రభుత్వం)

అయితే బోనాల చరిత్ర అక్కడితో మొదలై ఉండకపోవచ్చు. 1516 నాటి విజయనగర కాలపు తెలుగు శాసనంలో బోనాలు, రంగం వంటి ఆచారాల ప్రస్తావన ఉన్నట్లు భారత పురావస్తు సర్వేక్షణ విభాగానికి చెందిన అధికారులు ఇటీవల వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. ఈ శాసన ఆధారం బోనాల ఉనికిని 1813 ప్లేగు కథనం కంటే దాదాపు మూడు శతాబ్దాలు వెనక్కి తీసుకెళ్తోంది. అలా అయితే 1813 బోనాల పుట్టుక కాకపోవచ్చు; అప్పటికే కొనసాగుతున్న అమ్మవారి ఆరాధనకు హైదరాబాద్ నగరం తన అనుభవం నుంచి జోడించిన కొత్త చారిత్రక జ్ఞాపకం కావచ్చు.

బోనం అనే పదం “భోజనం” నుంచి వచ్చిందని భావిస్తారు. ఇళ్లలో అన్నం, పాలు లేదా బెల్లంతో నైవేద్యాన్ని వండి, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కుండలో మహిళలు అమ్మవారికి సమర్పిస్తారు. పోతరాజు, ఘటం, రంగం, డప్పుల ఊరేగింపు వ్యక్తిగత భక్తిని సామూహిక సంబరంగా మారుస్తాయి. మహిళలు బోనాన్ని ఆలయానికి మోసుకెళ్లి సమర్పించడమే కాకుండా, ఆ ఆచారాన్ని తరువాతి తరాలకు నేర్పుతూ కొనసాగిస్తారు.

ఒకప్పుడు బోనాలంటే మట్టి దారిలో నడుస్తూ అమ్మవారి దగ్గరకు చేరుకోవడం. ఇప్పుడు బారికేడ్ల మధ్య నుంచి, కెమెరాల ముందు నుంచి ఆలయంలోకి వెళ్లడం. అప్పుడు డప్పు ఊరిని పిలిచేది; ఇప్పుడు అదే డప్పు వీడియోలో కొద్ది క్షణాల ఆకర్షణగా కూడా మారుతోంది. అప్పుడు ఎవరు ఎంత అందంగా బోనం మోశారన్నది కాదు—ఊరంతా కలిసి అమ్మవారికి ఏమి సమర్పించిందన్నది ముఖ్యం. ఇప్పుడు భారీ ఊరేగింపు, పెద్ద ఘటం, పోతరాజు విన్యాసం, ప్రముఖుల సందర్శన ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇది చూస్తే నాకు కొంత బాధ కలుగుతుంది. ఎంతో సన్నిహితమైన, నేలతో ముడిపడిన సంప్రదాయం క్రమంగా రద్దీ మధ్య తన నిశ్శబ్దాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ రద్దీలో భక్తి లేదని చెప్పలేం. నెత్తిమీద బోనం మోసే మహిళ అడుగుల్లో, వేపాకుల మధ్య వెలిగే దీపంలో, అమ్మవారికి అన్నం సమర్పించే చేతుల్లో ఆ పాత భావం ఇప్పటికీ జీవించే ఉంది. సమస్య సంప్రదాయం మారడంలో కాదు. సంప్రదాయం మరుగున పడి, మిగితా హంగు హడావిడి మాత్రమే ప్రాధాన్యత పొందటం.

నేడు సంస్కృతికి గుర్తింపు ఇచ్చేది ప్రజలు మాత్రమే కాదు. ప్రభుత్వం ఏ ఆలయాలకు నిధులు కేటాయిస్తుంది, ఏ ఉత్సవాలకు అధికారిక ప్రాధాన్యం ఇస్తుంది అన్నది ప్రభావం చూపుతుంది. టెలివిజన్‌కు వైభవమైన ఊరేగింపు కావాలి. పర్యాటక సంస్థలకు రంగుల తెలంగాణ కావాలి. సాంస్కృతిక సంస్థలకు “ప్రామాణికమైన” ఆచారం కావాలి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లకు కొద్ది క్షణాల్లో ఆకట్టుకునే పోతరాజు నృత్యం, భారీ ఘటం లేదా ప్రముఖుల సందర్శన కావాలి.

అల్గోరిథం భక్తిని అర్థం చేసుకోదు. కానీ ఏ దృశ్యాన్ని ఎక్కువసేపు చూస్తున్నారు, దేనిని ఎక్కువగా పంచుకుంటున్నారు, ఏ వీడియోకు ఎక్కువ స్పందన వస్తోంది అన్నది లెక్కిస్తుంది. ఫలితంగా ఇంట్లో నిశ్శబ్దంగా బోనం వండే మహిళకంటే కెమెరాకు అనుకూలమైన ప్రదర్శనే ఎక్కువమందికి కనిపిస్తుంది. పదేపదే కనిపించే ఆ దృశ్యమే క్రమంగా “అసలైన బోనాలు” అనే మన జ్ఞాపకంగా మారే ప్రమాదం ఉంది.

ఇక్కడే నా ప్రశ్న మొదలవుతుంది: బోనాలు మారాయా అన్నది కాదు, ఆ మార్పుల్లో దేనికి ప్రభుత్వం, మీడియా, సాంస్కృతిక సంస్థలు, సోషల్ మీడియా ఎక్కువ గుర్తింపు ఇస్తున్నాయి? దేనిని నిజమైన సంప్రదాయంగా నిలుపుతున్నాయి? దేనిని ముందుకు తీసుకెళ్తున్నాయి? దేనిని మన చూపు నుంచి నెమ్మదిగా తొలగిస్తున్నాయి?

సాంస్కృతిక నిరంతరత్వం అంటే పాతదాన్ని మార్చకుండా ఉంచడం కాదు. మారుతున్న రూపాల మధ్య దాని మూలభావాన్ని కాపాడుకోవడం. బోనాలు కాలంతో మారవచ్చు; కానీ బోనం వెనుక ఉన్న కృతజ్ఞత, సామూహికత, నేలతో అనుబంధం రద్దీలో కనుమరుగవకుండా చూసుకోవాలి.

బోనాలు నిలిచాయి, అవి మారగలిగాయి కాబట్టి. కానీ ఆ మార్పును ప్రజలు నడిపిస్తున్నారా? లేక అధికారం, మీడియా, మార్కెట్, అల్గోరిథంలు మన తరఫున ఎంపిక చేస్తున్నాయా? మనం భవిష్యత్ తరాలకు అందించాలనుకుంటున్నది కేవలం రంగుల జాతరనా? లేక వేపాకుల మధ్య వెలిగే చిన్న దీపం వెనుక ఉన్న సామూహిక జ్ఞాపకమా? ఇదే మారుతున్న కాలంలో బోనాలు మన ముందుంచుతున్న అసలు ప్రశ్న.

*

విజయ నాదెళ్ళ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.