1908
తమ్మయ్య తయారుచేసిన బెల్లానికి చాలా గిరాకీ. నాణ్యమైన, రుచికరమైన బెల్లం తయారు చెయ్యడంలో అతడు గొప్ప అనుభవాన్ని గడించాడు. అతడి బెల్లం ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఆ రుచి కోసం అతడు ఎన్నో ఏళ్ళు ప్రయోగాలు చేశాడు. అతడు రుచి విషయంలో ఎంత ఖచ్చితంగా ఉండేవాడంటే, ఎప్పుడైనా అతనికి మాత్రమే సాధ్యమైన ఆ ప్రత్యేక రుచి అతడు తయారు చేసిన బెల్లానికి రాకపోతే, ఆ విడత తయారైన మొత్తం బెల్లాన్ని నదిలో పారవేసి, అది పూర్తిగా నీటిలో కరిగిపోయే వరకు అక్కడే ఉండేవాడు. ఎంత నష్టమైనా దానిని పూర్తిగా నాశనం చేసాకనే ఇంటికి వెళ్లేవాడు. తను తయారు చేసే బెల్లమంటే అతనికి చాలా ప్రేమ, గర్వం కూడా.
తమ్మయ్య తయారుచేసిన బెల్లం కొనడం కోసం సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తూ ఉంటే అతనికి చాలా గర్వంగా అనిపించేది. దూర ప్రాంతాల నుండి ధనవంతులు అతడి బెల్లాన్ని ప్రత్యేకంగా తెప్పించుకోవడం, ఆ బెల్లంతో తయారు చేయించిన మిఠాయిలను వివాహ వేడుకల్లో వడ్డించడం వారి హోదాకు చిహ్నంగా భావించేవారు.
ఎన్నో నెలల ప్రయోగాల తరువాత ఆరోజు తమ్మయ్య ఒక కొత్త పద్ధతిలో బెల్లాన్ని తయారు చేశాడు. అది అప్పటి వరకు అతడు చేస్తున్న బెల్లం కంటే ఎన్నో రెట్లు రుచికరంగా రూపొందింది. పెనాన్ని దించి, అచ్చులుగా చెయ్యడం కోసం మూసల్లో బెల్లం పాకం పోసి, ఆరాక ఆ బెల్లం దిమ్మల మీద నార గోనెలు పరిచి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రంతా తృప్తిగా నిద్రపోయాడు.
మరుసటి రోజు ఉదయమే వచ్చి ఆ గోనెలు తీస్తుండగా, బెల్లం దిమ్మల మీద ఒక పాము నిద్రపోతూ కనిపించింది. అది తన నూతన ఆవిష్కరణమైన కొత్త బెల్లం మీద పడుకోవడం వల్ల అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక కర్రను తీసుకునివచ్చి ఆ పామును విచక్షణారహితంగా కొట్టి చంపాడు. దాన్ని తీసుకెళ్లి బెల్లాన్ని వండే గొయ్యిలోకి విసిరేశాడు. ఆ పాము పడుకున్న మేర బెల్లం దిమ్మల్ని తీసుకెళ్లి నదిలో పారవేసి, అవి పూర్తిగా కరిగిపోయాయని నిర్ధారణకు వచ్చాక మిగిలిన బెల్లాన్ని ఎడ్ల బండి మీదకి ఎక్కించి అమ్ముకోవడానికి పట్టణానికి వెళ్ళిపోయాడు.
పట్టణంలో పెద్ద వ్యాపారులకు కొత్త బెల్లం మచ్చుకు రుచి చూపించాడు. వారంతా దాని రుచికి విస్మయం చెంది, అతడిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు. పెద్ద ఎత్తున సరుకు తయారుచేసి పంపించమని చెప్పి అతడికి భారీ మొత్తంలో బయానాలు ఇచ్చారు. తమ్మయ్య ఎంతో సంతోషంతోనూ, గర్వంతోనూ ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు.
మరుసటి రోజు ఉదయం లేవగానే పామును గోతిలో వేసిన విషయం అతనికి గుర్తుకొచ్చింది. విచక్షణ కోల్పోవడం మూలంగా గత దినం పామును బెల్లం బట్టీలోకి విసిరేసాడని అతనికి అర్థం అయింది. పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చే అతడు సాధారణ మానసిక స్థితిలో ఆ పని చేసి ఉండేవాడు కాదు. పాము కుళ్ళి దుర్వాసన వస్తుందని గ్రహించడంతో అతడు త్వరత్వరగా బెల్లం బట్టీ వద్దకు వెళ్లి, గోతిలోని పాముని కర్రతో బయటకు తీసి, దూరంగా విసిరేద్దామని తీసుకెళుతూ ఉండగా చనిపోయిందనుకున్న ఆ పాము హఠాత్తుగా అపస్మారక స్థితి నుండి బయటకు వచ్చి అతని కాలి బొటనవేలు మీద కాటు వేసింది.
పాము కాటు వెయ్యగానే భీతికి గురైన తమ్మయ్య తన కాలును చెక్క మొద్దు పై ఉంచి, గొడ్డలితో బొటనవేలును ఒక్క వేటుతో నరికేసుకున్నాడు. అప్పుడు అతడి మనసులో ఏ ఆలోచనా లేదు. అప్పటికప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్యగా అలా జరిగింది. బొటనవేలు దూరంగా ఎగిరి పడింది. అతడికి ఏ నొప్పీ కలగలేదు. నొప్పి కలుగకపోవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. సమయస్పూర్తిగా మంచి నిర్ణయం తీసుకున్నాడని అతనికి అనిపించింది. కానీ అది ఎంతోసేపు నిలువలేదు. రెండు గడియల తరువాత భయంకరమైన నొప్పి అతనికి అనుభవమయింది. అతడి ప్రాణం విలవిలలాడింది. “ఎంత తప్పు చేశాను!” అనుకొని పశ్చాత్తాప పడ్డాడు. నొప్పికి బిగ్గరగా ఆక్రందించాడు. పంటి బిగువున నొప్పిని అణచుకుంటూ రక్తం కారుతున్న కాలిపై బట్టీ గోతిలోని బూడిద వేసి గుడ్డతో బలంగా కట్టు కట్టుకున్నాడు.
కొన ప్రాణంతో ఉన్న ఆ పాము తలను అతడు ఆగ్రహంతో నుజ్జు నుజ్జు చేసి, దానిని ఒక గొయ్యి తీసి కప్పి పెట్టాడు.
అంత నొప్పితోనూ అతడు నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు. అతడి భార్య విభ్రాంతికి గురైంది. అయితే ప్రమాదం తప్పిందని గ్రహించిన తరువాత ఆమె ఆందోళన తగ్గింది. తన భర్త సాహసానికి, సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయింది. గ్రామమంతా క్షణాల్లో ఆ వార్త పాకింది. అందరూ అతడి సాహసాన్ని మెచ్చుకోవడం కోసం ఇంటికి వచ్చి పరామర్శ చేశారు. ప్రాణాలు దక్కినందుకు తమ్మయ్య ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతడు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. తమ్మయ్య భార్యకు తన భర్త చేసిన సాహసం పట్ల గర్వం, సంతృప్తి కలిగాయి. ఇంకెవరైనా అయితే ఇటువంటి తెగువతో కూడిన నిర్ణయాన్ని తీసుకొనగలిగి ఉండేవారు కాదని ఆమెకు అనిపించి ప్రశాంతంగా నిద్రపోతున్న భర్త ముఖాన్ని ఆరాధనతో ప్రేమగాచూస్తూ చాలా సేపు గడిపింది.
అర్ధరాత్రి తమ్మయ్యకు ఒక దుస్వప్నం వచ్చింది. గోతిలోని పాము మరలా బ్రతికి తనని వెతుక్కుంటూ ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తన బొటనవేలుపై కాటు వేసింది. అతడు హఠాత్తుగా లేచి దిగ్భ్రాంతితో తన బొటనవేలును తడుముకున్నాడు. అది అక్కడ లేకపోవడంతో వ్యాకులుడయ్యాడు. బొటనవేలు లేని జీవితాన్ని గురించిన ఆలోచనలు అతని మనసులో ముప్పిరిగొన్నాయి. అతనికి నిద్ర పట్టలేదు. అవే ఆలోచనలు నిరంతరంగా వెంటాడుతున్నాయి.
వేలు కోసుకొని పెద్ద తప్పు చేసినట్టు అతనికి అనిపించింది. తనను కాటు వేసిన పాము విష సర్పం కాకపోవచ్చునని అనిపించింది. నిజానికి అది విష సర్పమని అతనికి స్పష్టంగా తెలుసు. కోల్పోయిన తన వేలుని తలచుకుని అతడు బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడు. కోడికూసే వేళ అతడు ఒక ఉన్మత్త స్థితిలో పరిగెత్తుకుంటూ బెల్లం బట్టికి బయలుదేరాడు. అతడి వేలు తెగిపడిన చోటుకు వెళ్ళాడు. అక్కడ ఆ వేలు లేకపోవడంతో హతాశుడయ్యాడు. అతడు బిగ్గరగా ఆక్రందించాడు. పిచ్చిగా ఆ ప్రాంతమంతా వెతకాడు.
ఎక్కడా తన వేలు దొరుకక పోవడంతో నదిలోకి దూకి నీటి అడుగున వెతకడం మొదలు పెట్టాడు. అక్కడా దొరకకపోవడంతో చివరికి అడవిలో వెతకడం మొదలు పెట్టాడు. కొంతసేపటి తర్వాత ఒక నక్కపిల్ల నోటిలో ఆ వేలు ఉండడం గమనించాడు. ఉన్మాదంతో దానిని రాళ్ళు విసిరి బెదిరించాడు. అది భయంతో వేలుని వదిలి పారిపోయింది. ఆ వేలును తీసుకొని దానిని తెగ నరికిన చోట ఉంచి పసరు వేసి కట్టు కట్టుకున్నాడు.
అతడు నిజంగా ఆ వేలు అతుకుతుందని నమ్మాడా అంటే లేదనే చెప్పవచ్చు. కానీ ఆ వేలును వదులుకోవడానికి అతడు సిద్ధంగా లేడని మాత్రం ఈ రచయిత రూఢిపరచగలడు.
తమ్మయ్య సంతోషంగా నవ్వుకున్నాడు. పాటలు పాడుకున్నాడు. నాట్యం చేశాడు. ఆనందంతో గంతులు వేశాడు. అలాంటి పనులు అతడు గతంలో ఎన్నడూ చేసి ఎరుగడు. స్వభావ విరుద్ధంగా ప్రవర్తిస్తూ అతడు గ్రామం వైపు బయలుదేరారు. కానీ అడవి దాటగానే అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపట్లోనే అతడి దేహం నీలి వర్ణానికి మారింది.
రహస్యంగా నక్కినక్కి అనుసరిస్తూ వచ్చిన నక్కపిల్ల అతడిని చూస్తూ చాలా సేపు నిలబడి ఉండిపోయింది. చివరికి చనిపోయాడని నిర్ధారించుకొని అతని వేలు కోసం అతడి పక్కకు వచ్చి నిలబడింది. అయితే హఠాత్తుగా అది కూడా అతడి పక్కనే కూలబడి ఆఖరి శ్వాస విడిచింది. కొంతసేపటికి దాని దేహం కూడా నీలి వర్ణానికి మారింది.
*








చాలా బాగుంది బ్రదర్ 👌👌👌
Thank you andi 🤝
కధ చాలా బాగుంది శ్రీరామ్ సర్
థాంక్యూ వలీ గారు 🤝
రుచికి ప్రాముఖ్యత నిచ్చి ,అనేక ప్లయోగాలు చేసి రుచికరమైన బెల్లం తయారుచేసే తమ్మయ్యను నిర్దయగా చంపేశారు. పాము కుట్టిన చోట విషముందని బొటనవేలు తీసి. మళ్ళీ అతికించుకుని ప్రాణాలు కోల్పోయాడు. బెల్లం లొ బాగా డబ్బు సంపాదించి శ్రీమంతుడై హాయిగా ఉండేవాడు.
అవునండి. మనిషి యొక్క అవగాహనే జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది.
కథ చాలా బాగుంది శ్రీరామ్ గారూ.. చదవగానే మీతో మాట్లాడాలనిపించింది. కుదరలేదు. త్వరలో మాట్లాడదాం. 👌👌👌👏👏👏
Thank you pramod garu 🙏🏻
“బొటన వేలు’ కథ చాలా బాగుంది సర్.అభినందనలు
థాంక్యూ అండి
శ్రీరామ్ గారూ నమస్తే. ఈ కథ ద్వారా మీరేం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు నాకు. మీ కథను కించపరుస్తున్నాను అనుకోకండి. నిజంగానే నా బుర్రకు అర్థం కాక అడుగుతున్నాను. కొంచెం చెప్పగలరా!