“బాల్యం నాకు గొప్ప వరం”

మాట్లాడే గ్రంథాలయాలు వంటి మా నాయనమ్మ, మేనత్తలు, పెద్దమ్మలు మిగిలిన మా ఊరి శ్రామిక స్త్రీలు,కూలిపనుల్లో కలిసే గిరిజన స్త్రీలు, బహుజన కులాల స్త్రీలు వారి మాటల చాతుర్యం, శ్రమ సౌందర్యం అద్భుతం అనిపిస్తుంది.

‘పేరు కూడా సరిగ్గా లేని ఊరి నుంచి పుట్టి,ఎదిగి దేశరాజధాని చేరుకుని కేంద్ర సాహిత్య అకాడమీ వేదిక మీద మాట్లాడటం, కాళ్లకు సరైన చెప్పులు కూడా లేని బాల్యం నుంచి నడిచి చదువుకుని మొదటిసారి ఢిల్లీకి విమానంలో ప్రయాణం చేయడం, కేవలం అక్షరం వలన,

చదువుకు వలన మాత్రమే వచ్చిన గొప్ప అవకాశం కదా’ అనిపిస్తుంది. ఉపాధ్యాయుడిగా, సాహిత్యం రాస్తూ చదువుకుంటున్న వాడిగా ఎప్పుడూ నాకు నేను నడిచి వచ్చిన దారి మనసులో కదులుతూ వుంటుంది. నేను నడిచి వచ్చిన దారి,నడుస్తున్న దోవల్లోని అనుభవాల్లోంచి, వర్తమానాన్ని అర్ధం చేసుకుంటూ ఉంటాను. ఆ అవగాహన తోనే రాయడం,చదవడం నాకు చేతనైన పని.ఇష్టమైన పని కూడా. పాఠమైనా, రచనైనా జీవితాలనుభవాలోంచి పుడితే అది శక్తివంతంగా ఉంటుందని భావిస్తాను.

     మాది ఒకప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా, సత్యవేడు మండలం రంగనాధపురం పురం మిట్టిండ్లు.నా ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యి తిరుపతి ఎస్జీఎస్ డిగ్రీకాలేజీలో చేరేదాకా అక్కడే ఉన్నాం. తరువాత పక్కనే వుండే వెంకటాపురం కి వచ్చేసాం. వెంకటాపురంలోనే నా ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసింది ఇక్కడే.

ఇటు వెంకటాపురం నుంచి మా మిట్టిండ్లు దాకా,మిట్టిండ్లను ఆనుకుని ఉన్న మోదుగ అడివి దాకా చుట్టుపక్కల అడవులు,పల్లెలు, కాలవులు, బావులు,తోటలు, తాటి ,మామిడి తోపులు పొలాలు, గెనాలు నా బాల్యాన్ని మలచిన గురుక్షేత్రాలు. పశువులవెంట తిరిగిన కాలం, పొలాల పనుల్లో మెదిగిన కాలం,నాయనమ్మ వెంట అడవుల్లో ఆకులు కోసిన కాలం అపురూపం.

ఏ మాత్రం సాహిత్య వాతావరణం లేని కుటుంబం నుంచి సాహిత్యంలోకి రావడం వెనక మా నాయనమ్మ పల్లిపట్టు మంగమ్మ చెప్పిన ఊకుడు కథల ఊహాశాలిత్వం ఉంది. మా పెద్ద మేనత్త కొత్తపల్లి రాగమ్మ  చెప్పిన జానపద కథల,వీరగాథల నిపునత ఉంది. నా సాహిత్యంలో నెరేటివ్ స్టయిల్ కి బహుశా ఇవన్నీ కారణమేమో!  మా నాయిన, పెదనాయునలు, అన్నలతోపాటు, బంధువుల్లో వీధి బాగోతాలు(నాటకాలు) ఆడే కళాకారులు ఎక్కువ.మా మిట్టిల్లల్లో నెలల తరబడి వద్ధిక నేర్చి, ఉత్సవాలు, జాతరలు, శుభ కార్యాలు వంటి వివిధ సందర్భాలలో ప్రదర్శించే వారు. వారి నాటకాలను నిత్యం చూడటం వినడం గొప్ప అనుభవం. మరో వైపు నాయినా డప్పు కళాకారుడు కూడా, అమ్మవారి జాతరలో ,శుభకార్యాలలో ఆయన డప్పు దరువు  అద్భుతమైన కళా చాతుర్యం. ఒకరకంగా నేను గడిపిన బాల్యం నాకు గొప్ప వరం. దళిత జీవన సాంస్కృతిక వైభవం నుంచి,వ్యవసాయ జీవితం,వ్యవసాయ కూలీ బతుకు,వలస జీవన పోరాటం ఇవన్నీ నేర్చుకోవడం అనే నైపుణ్యం అద్దిన సందర్భాలు.

      మాట్లాడే గ్రంథాలయాలు వంటి మా నాయనమ్మ, మేనత్తలు, పెద్దమ్మలు మిగిలిన మా ఊరి శ్రామిక స్త్రీలు,కూలిపనుల్లో కలిసే గిరిజన స్త్రీలు, బహుజన కులాల స్త్రీలు వారి మాటల చాతుర్యం, శ్రమ సౌందర్యం అద్భుతం అనిపిస్తుంది. అవన్నీ చూస్తూ  పెరగడం నాకు లభించిన గొప్ప అవకాశాలు. తరువాత ఇవన్నీ నా కవిత్వంలో అలవోకగా చేరడానికి ఆస్కారం ఏర్పడింది.

 వీటన్నిటితోపాటు నేను చదువుకున్న పాఠ్యపుస్తకాలు, అందులోనూ తెలుగు వాచకాలు అందులోని కథలు, కవితలు,పద్యాలు నన్నెంతో ఆకర్షించాయి. అయితే అందులో మా కుటుంబాలు రోజూ మాట్లాడే భాష ఉండేది కాదు. నేను వెంకటాపురం బడిలో ఏడూ, ఎనిమిది తరగతులు చదువుతున్నపుడే పేరడీ పాటలు, కవితలు అని నేననుకునే కవితలు, అరకొర చందోజ్ఞానంతో పద్యాలు రాసేవాన్ని. మా ఉపాధ్యాయులకు చూపించే వాణ్ణి.వారి ప్రోత్సహించడం తో  ఉత్సాహం గా రాస్తూ, అలా రాయడమనే అలవాటును వదులుకోకుండా ఇంటర్మీడియట్ దాకా,అక్కడ నుంచి డిగ్రీ కొనసాగింది.

అయితే తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజిలో అభ్యుదయ సాహిత్యం పరిచయం అయ్యేదాక అంతవరకూ రాసినవన్నీ భావకవిత్వపు రీతిలో రాసినవే ఎక్కువ.సామాజిక స్పృహతో రాయడం అలవాటు అయింది మాత్రం డిగ్రీలోనే. డిగ్రీ అనంతరం కర్నూలు ఐ. ఏ.ఎస్. ఈ. లో తెలుగు పండిత శిక్షణ ముగుంచుకుని, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ,తెలుగు అధ్యయనశాఖలో ఎమ్మె తెలుగు పూర్తి చేసేదాక, నిరుద్యోగజీవితాన్ని, ప్రవేటు ఉపాధ్యాయ జీవితాన్ని మోసుకుంటూనే ,పుస్తకాలు విరివిగా కొనడం,గ్రంథాలయాల్లో గంటల తరబడి చదువుకోవడం వంటి సమయాలు సాహిత్య అధ్యయనం, అవగాహనకు బలంగా పునాదులు వేశాయి.

తెలుగు సాహిత్యపు వివిధ ధోరణులు, వాదాలు అర్థం చేసుకోవడంలో, సాహిత్య వేధికల్ని పంచుకోవడంలో నాదైన స్పష్టత అలవడింది. నన్ను నేను వ్యక్తీకరించుకునే క్రమంలో రాసుకుంటున్నదే నా కవిత్వం. ఎస్వీయులో పీజీ చదువు తువున్నపుడే ప్రసిద్ధ కవులు శివారెడ్డి గారు,సుగం బాబుగారు,ఆశారాజు,యాకూబ్ సారు వంటి వారితో పరిచయం నన్ను కవిసంగమం వేదిక దాకా నడిపింది. తిరుపతిలో సాంస్కృతిక, సాహిత్య సభలు ,వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం, విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్స్ స్టాల్స్ తరచుగా సందర్శించడం, ఎస్వీయూ సెంట్రల్ లైబ్రరీలో వివిధ అనువాదాలు ముఖ్యంగా మార్క్స్, పూలే, అంబేద్కర్ రచనలు, సైద్ధాంతిక నేపథ్యపు పుస్తకాలు చదవడం వలన నేను ఎటువైపు నిలబడి రాయాలో అవగాహన ఏర్పడింది. ఆ క్రమంలో ప్రసిద్ధ విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య గారి సూచనలు నాదైన వ్యక్తీకరణ, నాదైన భాష,నుడికారంతో రాయడానికి తొడ్పడ్డాయి.

   2016 జూన్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికై, ఉమ్మడి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 64 పెద్దూరు ఉన్నత పాఠశాలలో చేరే వరకు తిరుపతి నాకెన్నో బతుకు పాఠాలు నేర్పింది. పెద్దూర బడిలో ఉన్నపుడే అప్పటిదాకా రాసిన కవితల్లో యాభై రెండు కవితలతో యాలై పూడ్సింది (2020 డిసెంబర్) కవితా సంపుటి కవిసంగమం ద్వారా ప్రచురించాను. ఈ పుస్తకానికి ‘ఏ నేటివ్ పోయేట్’ అంటూ ప్రసిద్ధ కవి కె.శివారెడ్డి గారు, ‘మూలాల జల్లులో తడిసిన కవిత్వం’ అంటూ ప్రసిద్ధ విమర్శకులు జి.లక్ష్మీ నరసయ్య గారు విలువైన ముందుమాటలు అందించారు. యాలై పూడ్సింది కవితా సంపుటి వర్తమాన సమాజిక వాస్తవికతకు అద్దం పడుతూ విశేషమైన ఆదరణ పొందింది.

తెలుగురాష్ట్రాల్లో వివిధ సంస్థలు ఇచ్చే కవితా పురస్కారాలు, అవార్డులు ఈ పుస్తకాన్ని వరించాయి. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందింది. ఈ కొనసాగింపులో 2025 జనవరిలో రెండవ కవితా సంపుటి ‘నీలికళ్ళ నేల’ ఛాయా ప్రచురణ సంస్థ ప్రచురించింది. దీనికి ప్రసిద్ధ కవి ప్రసాదమూర్తి గారు బహుబాహువుల బహుజన కవి అనే ముందుమాటను రాశారు. కవిత్వమే కాక అప్పుడప్పుడు రాస్తున్న సాహిత్య వ్యాసాలను 2025 డిసెంబర్ లో ‘యిడమర్సి అనే వ్యాస సంపుటిని వెలువరించాను. ప్రసిద్ధ రచయిత డా.వి.ఆర్.రాసాని గారి ముందుమాటతో, మట్టి ముద్రణలు ప్రచురణ సంస్థ ప్రచురించింది.

   సమకాలీన సమాజిక,రాజకీయ వాస్తవికతను ప్రతిఫలింపజేస్తూ కవిత్వం రాస్తూనే, కవిసంగమం వేదికలో రెండు సంవత్సరాలు కవిచూపు కాలమ్ నిర్వహించడం గొప్ప అవకాశం.అనుభవం. కొలిమి అంతర్జాల సాహిత్య పత్రికలో సంవత్సరకాలం పాటు ‘కాలం గుండెసప్పుడు’ శీర్షికన సమకాలీన కవిత్వాన్ని పరిచయం చేయడం మరో సదవకాశం.

      నా తొలి కవితా సంపుటి యాలై పూడ్సింది సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం తెలుగు శాఖలో  గత విద్యాసంవత్సరం నుంచి ఎమ్మె విద్యార్థులకు పాఠంగా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తాను. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరదయ్యవపాలెం,తిరుపతి జిల్లా నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సాహిత్యంలో ఉంటూ, పాఠాలు చెప్పడం గొప్ప అవకాశం.

వర్తమాన ప్రపంచ యుద్ధ వాతావరణం నుంచి గతంలో ప్రసిద్ధ సారంగ పత్రికలో ప్రచురించిన ‘యుద్ధం@ యూస్ లెస్ పెలో డాట్ కమ్’ కవితను కొనసాగిస్తూ దీర్ఘ కవితను వెలువరించేపనిలో వున్నాను. సమకాలీన విద్వేషపు.రాజకీయ వాతావరణం నుంచి దళిత అస్తిత్వ గొంతుకగా ‘సర్వనామం’ దీర్ఘ కవిత ప్రచురణకు సిద్ధంగా ఉంది.త్వరలో వెలువడుతుంది. ఈ ప్రయాణంలో సారంగ అంతర్జాల సాహిత్య పత్రిక ప్రోత్సాహానికి హృదయ పూర్వక ధన్యవాదాలు చెబుతూ..

*

పల్లిపట్టు నాగరాజు

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • థాంక్యూ అన్న..
      ఇంకా కొనసాగుతూనే కదా😊

    • థాంక్యూ అన్న
      ఇంకా కొనసాగుతూనే కదా😊

  • నీ సాహిత్య ప్రయాణం బాగుంది తమ్ముడూ.అభినందనలు.

  • ఎవరికైనా మరపురాని జ్ఞాపకంగా చివరికి మిగిలేది బాల్యమే. రచయితలకైతే మరీనూ. రచనల్లో బాలుడు కాని రచయిత ఉండకపోవచ్చు. నాగరాజుగారూ మీ బాల్యం మాంచి వంతంగా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.