బాకీ

తాతకు భూమి వుంది, దున్నే సత్తువా వుంది, కావల్సిన ఎరువూ వుంది, పనిచేసే జీతగాడున్నాడు, జత ఎద్దులున్నాయి. కానీ విత్తనం మాత్రం లేదు.

ప్పట్లో మా వూరికి అందుకునేంత దూరంలో అడవి వుండేదంట. ఇప్పుడయితే ఆరేడు మైళ్ళ దూరానికి వెళ్ళిపోయింది. నా చిన్నప్పుడు కూడా పనుల్లేని ఎండాకాలంలో బండికట్టుకొని మూలపల్లె వైపు అడవికి వెళ్ళి బండినిండా కట్టెలు వేసుకొచ్చేవాళ్ళం. పశువులకు గడ్డి దొరకని కరువుకాలంలో అడవికి వెళ్ళి గడ్డి కోసుకొచ్చేవాళ్లం.

అలా అడవి దగ్గరున్నప్పుడు మా తాత కాస్తా చదునుగా వున్న నేల చూసి పోడుకొట్టి బాగుచేసి అందులో కందులో, అలసందలో, పెసలో, చెనక్కాయో పండించేవాడు.

అప్పట్లో ఎరువు అంటే పశువుల పేడే. లేదంటే చెరువు మట్టి. అదీ కాదంటే చేలో తడికలతో కంచెవేసి రాత్రిళ్ళు అందులో గొర్రెల మందను నిలేసేవాళ్ళు. వాటి పెంట, వుచ్చ నేలకు మంచి ఎరువట. ఆ విధంగా పల్లె తన కాళ్ళమీద తనే నిలబడ్డా… విత్తే సమయానికి విత్తనాలు మాత్రం దొరికేవి గావు. ముఖ్యంగా చెనక్కాయ (వేరుశనగ) వేయాలంటే దగ్గర్లోని నీలకంఠరావుపేటలోని కోమట్ల దగ్గర విత్తనం తెచ్చుకోవాల్సిందే. విత్తనానికి కావల్సిన డబ్బు ఎప్పుడూ రైతుల దగ్గర వుండేది కాదు. అసలప్పట్లో ఎవరి దగ్గరైనా డబ్బు వుండేదా అంటే అనుమానమే. వుండేదల్లా యింటినిండా రాగులూ, కొర్రలూ, వడ్లు, కందులూ..వగైరా. చాకలి బట్టలుతికిస్తాడు, కంసాలి కొరముట్లు చేసిస్తాడు, కుమ్మరి కుండలనిస్తాడు. ఎప్పుడన్నా వూరికి వచ్చిన ఐసుల బండోడు, గెనుసుగడ్డల బండోడూ కూడా డబ్బుకు బదులు ధాన్యమే తీసుకుంటారు. ఏ సంక్రాంతి పండగకో కొత్త బట్టలు కొనాలంటేనో, కడపకెళ్ళి సినిమా చూడాలంటేనో మాత్రమే డబ్బులు కావాలి.

తాతకు భూమి వుంది, దున్నే సత్తువా వుంది, కావల్సిన ఎరువూ వుంది, పనిచేసే జీతగాడున్నాడు, జత ఎద్దులున్నాయి. కానీ విత్తనం మాత్రం లేదు. అదేం ఖర్మో గానీ విత్తే సీజన్‌లో విత్తనం ఖరీదు భారీగా వుంటుంది. అదే పండిన సీజన్‌లో మాత్రం చాలా తక్కువ వుంటుంది.

మా తాత దగ్గర విత్తనం లేదు. ఆయన ఆ విత్తనం ఓ కోమటి దగ్గర తెచ్చుకున్నాడు. తనతోపాటే విత్తనం విప్పించమని ఓ మాదిగ అడిగితే తనకూ ఇప్పించాడు. ఆ మాదిగే కోమటిని డైరెక్టుగా అడిగుండవచ్చు కదా? అనే అనుమానం వచ్చింది నాకు. బహుశా కులదొంతరల వల్ల మాదిగలకు కోమట్ల దగ్గరకెళ్ళే వెసులుబాటు వుండివుండదు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ మామీద ఆధారపడితే, మేము కోమట్లమీద ఆధారపడడమే చూశాను. మాదిగలే స్వయంగా కోమట్లతో లావాదేవీలు చేయడం ఎరగను. కానీ ఆ ఏడాది వర్షాలు పడలేదు. వేసిన విత్తనం మళ్ళీ చేతికి రాలేదు. ఆ విత్తనానికి చేసిన బాకీ తీర్చలేక ఆ మాదిగ ఆ చేనును మా తాతకే అప్పజెప్పి వూరొదలి వెళ్ళిపోయాడు. అతని బాకీకీ, తనబాకీకి కలిపి మా తాత ఆ కోమటికి బాండు రాసిచ్చాడు. అప్పటికి మా అమ్మ పెళ్ళవలేదు, మా నాన్న యింటి పెత్తనం తీసుకోలేదు. ఆ అప్పు మాత్రం యింతై, వటుడింతై అని పెరుగుతూ వచ్చింది.

నేనప్పుడు ఆరులోనో ఏడులోనా వుండగా బాగా వడ్లు పండితే పండిన పధ్నాలుగు బస్తాలు ఒక్క గింజా మిగిల్చుకోకుండా ఆ శెట్టికి బాకీకింద కట్టేశాడు మా నాన్న. అయితే ధాన్యం ఇచ్చాడే కానీ బాండు తెచ్చుకోవడానికి రేపో మాపో అంటూ బద్దకించాడు. తీరా లెక్క చూసుకుందాం అని కూర్చుంటే.. ఒక బస్తా లెక్క తేడా వచ్చింది ఇద్దరి మధ్యా. నేను 14 బస్తాలు ఇచ్చానని ఈయన, కాదు 13 అని ఆయన. ఎవరూ వెనక్కి తగ్గలేదు. మొదటిసారి మా నాన్న కోర్టు మెట్లెక్కాడు. అక్కడి నుండీ హైకోర్టుకూ వెళ్ళింది. సుప్రీం కోర్టుకూ వెళతాను కానీ నా లెక్క ప్రకారం ప్రతిపైసా రాబట్టేవరకూ వదలనన్నాడు శెట్టి. కోర్టుకు వెళ్ళినవాడెవడు బాగుపడలేదంటూ మా తాత, అవ్వ, అమ్మా, ఇతర బంధువులూ మా నాన్నను ఒప్పించి రాజీ చేయించారు.

బ్యాంకుల జాతీయకరణ జరిగిన పన్నేండేళ్ళకు గానీ నీలకంఠరావుపేటకు బ్యాంకు రాలేదు. బ్యాంకు వచ్చినా వీపీసింగు వచ్చి 1990లో రైతుల ౠణమాఫీ చేశాక గానీ రైతులకు బ్యాంకు ఋణాల గురించి కొంతైనా అవగాహన రాలేదు. మళ్ళీ రద్దు కావచ్చు అనైతే నేమి, షావుకార్ల దగ్గర చక్రవడ్డీ బాధలు పడలేక అయితేనేమి..రైతులు కోమట్లను వదిలి బ్యాంకుల బాట పట్టారు. ఈ బాకీల దుర్మార్గం అప్పటిగ్గానీ చల్లారలేదు.

*

ప్రసాద్ చరసాల

1 comment

Leave a Reply to Subrahmanyam avula Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు