ప్రేమ కథ 11

“అతనిలో ఉన్నాయి అని నేననుకున్న గుణాలు, విలువలు లేవని తెలిసాక అతన్ని ఎలా ప్రేమించమంటావు?. నువ్వు చెప్పు”

 సరోజకు వినీల ధోరణి ఎంతకీ అంతపట్టకుండా ఉంది. ప్రేమించానంది. పెళ్లి చేసుకుంటానంది. శ్రీధర్‌ కి కూతురు అమెరికా వెళ్లి పిజి చెయ్యాలని ఎంత కోరిగ్గా ఉన్నా, సంతోష్ ఇక్కడే ఉంటాడు కనక తను అమెరికా వెళ్ళనంది. ఇంజనీరింగ్ చదువుకున్నంతకాలం ప్రేమించుకున్నారు. ఇద్దరికీ కాంపస్ సెలెక్షన్లు వచ్చాయి. అదృష్టవశాత్తు ఉన్న ఊర్లోనే వచ్చాయి. కులాలు కూడ ఒకటే. ఆర్థికహోదాల్లో కూడ పెద్దగా తేడాల్లేవు. ఎగువ మధ్యతరగతి కుటుంబాలే రెండూ. అత్తమామలూ ఎంతో స్నేహంగా ఉంటారు. అసలు ఇంత అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? ఇలా అన్నీ కుదిరే ప్రేమ వివాహాలు ఎక్కడుంటాయి?

వీళ్ల పెళ్లిలో కనిపించినంత ఆనందం, సంబరం, స్నేహం, అవగాహన మరెక్కడా చూడలేదని చుట్టాలు, స్నేహితులు మరీమరీ మెచ్చుకున్నారు.

పెళ్లయి ఏడాది కూడ కాలేదు. మొదటి వార్షికోత్సవానికి వినీలకు మంచి నెక్లెస్ కూడ ఇటీవలే కొని తెచ్చింది తను. పెళ్లిలో తక్కిన ఖర్చుల్లో తను పెట్టాలనుకున్నంత బంగారం పెట్టలేకపోవడం; అత్తగారు రెండు మంచి సెట్లు పెట్టడంతో అప్పటికి ఆనందించి, సర్దుకుపోవడం.. ఇప్పుడు శ్రీధర్‌ కి ఎప్పటివో అరియర్స్ రావడంతో కూతురికి తనుపెట్టాలనుకుంది పెట్టొచ్చని ఎంతో సంబరపడింది. కొనేసింది కూడా.

హటాత్తుగా ఇదేం విపరీతం? నిన్న సాయంత్రం ఎప్పుడూ వచ్చేలా సరదాగా వచ్చిందని అనుకుంది. వినీల సాయంత్రం ఆరున్నరకు రావడం, సంతోష్ 9 గంటలకు వచ్చి ఇద్దరూ ఇక్కడే భోంచేసి వెళ్లడం వారంలో ఒకసారైనా జరుగుతుంది. అలాగే అనుకుంది నిన్న కూడ. కానీ రాత్రి సంతోష్ రాలేదు. వినీల వెళ్తానని అనలేదు. ఎందుకని అడిగితే

‘ఒక్కరోజు పుట్టింట్లో పడుకుంటే తప్పా’ అంటూ నవ్వింది. ఆ మాటల్లో వింత లేదు కానీ అన్న పద్ధతిలో ఏదో అర్థం కానిది ఉందని సరోజకు అనిపించింది.

మరుసటిరోజు శనివారం. ఎలాగూ ఆఫీసు లేదు కనక వినీల త్వరగా నిద్రలేవదని ఊహించింది సరోజ. శ్రీధర్‌కు కాఫీ ఇచ్చి, తను కూడ కాఫీ కప్పు తెచ్చుకుని డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చుంది. ఇద్దరూ కొంతసేపు దేశరాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. సహజంగానే సంభాషణలో ఒక విరామం వచ్చింది. తర్వాత సరోజ అంది

“సంతోష్ ఎందుకు రాలేదంటారు?’

శ్రీధర్ పేపర్ పక్కన పడేశాడు. ‘నీకు చెప్పలేదా వినీల?’ అన్నాడు.

“ఏమిటి చెప్పేది?’

“అదే… తను సంతోష్‌తో కలిసి వుండలేనని…’ శ్రీధర్ ‘కాఫీలో చక్కెర తక్కువైంద’న్న స్వరంతో చెబుతున్నాడు.

సరోజకు అసలేమీ అర్థం కాలేదు.

“సంతోష్‌తో కలిసి వుండలేకపోవడమేమిటి? ప్రేమించి చేసుకుందికదా” అయోమయంగా అంది.

“అవును. కానీ అతని స్వభావం ఇలాంటదని అనుకోలేదట?’

“ఏమిటీ! అయిదేళ్లుగా ప్రేమిస్తున్న మనిషి ఎలాంటివాడో తెలీదా? అసలు మీకెలా తెలుసు? తను నాతో ఏమీ అనలేదే. మీకు చెప్పిందా?’

శ్రీధర్ కాఫీ కప్పు కింద పెడుతూ అన్నాడు.

“నిన్న రాత్రి నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. నాకు మెలకువ వచ్చి డైనింగ్ రూం లోకి వస్తే, తను ఇక్కడే కూర్చుని సెల్ లో మాట్లాడుతోంది. సంతోష్ తోనే..నన్ను చూడలేదు. కొన్ని మాటలు విన్నాను. “ఇది నీకు కొత్తగా వచ్చిన అలవాటైతే పోతుందని నేననుకోగలను సంతోష్. కానీ ఇది నీ సహజబుద్ధిలా ఉంది. నేనే తెలుసుకోలేకపోయాను’ అంటోంది. అతనేమన్నాడో తెలీదు. ఇది కట్ చేసేసింది ఫోన్. లేచేసరికి నేను కనిపించాను. ఇక తప్పలేదు. కానీ వివరంగా ఏమీ చెప్పలేదు. ‘ఏదో విన్నట్టున్నావు కదా నాన్నా. ఏం లేదు. నేనిక సంతోష్ తో కలిసి వుండలేను, అతనిలాంటి వాడని అనుకోలేదు’ అని లోపలికి వెళ్లిపోయింది. అదే నీకు అప్పజెప్పాను”

సరోజకు ఎవరి మీద కోపం తెచ్చుకోవాలో అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న శ్రీధర్ మీద కూడ పీకల దాకా ఉంది “ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నారు? ‘

“నేను తేలిగ్గా మాట్లాడుతున్నానేమో గానీ తేలిగ్గా తీసుకోవడం లేదు. పిచ్చి వేషాలు వెయ్యొద్దని చెప్తాను. లేవనీ ముందు”

__

వినీల నిద్రలేచి చాలా సేపయింది. అమ్మానాన్నలకు ఏం చెప్పాలో తెలియక పడుకున్నట్టు నటిస్తోంది. లేచిన క్షణం ఏం జరిగిందని అడుగుతారు. ఎలా చెప్పాలి? సంతోష్ తనని ఏనాడూ తిట్టలేదు. కొట్టలేదు. నిర్లక్ష్యం చెయ్యలేదు. పైగా, ఇంట్లో పనికి చాలా సహాయం చేస్తాడు. బయటి పనులు సగానికి సగం తనే చేస్తాడు. పనిమనిషి రాకపోతే అంట్లు తోముతాడు. ఆదివారాలు వంట కూడ చేస్తాడు. మనసా, వాచా, కర్మణా ప్రేమిస్తాడు. దాంపత్యసుఖానికి ఏ లోటూ లేదు. తన మనసును గానీ, దేహాన్ని గానీ ఎప్పుడూ గాయపరచలేదు.

మరి? తను ఎందుకు అతనితో కలిసి జీవించలేనంటుందో వాళ్లకెలా చెప్పాలి? ఒక మనిషి మీద ప్రేమ ఉండడమంటే, తన దృష్టిలో గౌరవం, స్నేహం. ఆ తర్వాతే ఆకర్షణ, మోహం. అవన్నీ సంతోష్ ని చూసి కలగబట్టే దాన్ని ప్రేమ అనుకుంది. పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ గౌరవమే పోతే….ఆ స్నేహమే లోపిస్తే….

__

ఆ రోజు సంతోష్ సహోద్యోగులు తన ఇంటికి భోజనానికి వచ్చారు. వాళ్లు భార్యాభర్తలు. ఆ అమ్మాయికి ప్రమోషన్ వచ్చిందంటే, మనింట్లో వాళ్లిద్దరికీ పార్టీ ఇద్దామన్నాడు సంతోష్. తను ఆనందించింది. మంచి స్నేహితులంటే అలాగే ఉండాలి కదా అనుకుంది. చాలా ఆనందంగా గడిచింది ఆ సాయంత్రం. వాళ్లిద్దరూ వెళ్లిపోయాక, తను ప్రశంసాపూర్వకంగా అంది.

“ మల్లిక ఇప్పటికీ టీనేజి అమ్మాయిలాగే ఉంది. కంపెనీకి వైస్ ఛైర్మన్ అంటే ఎవ్వరూ నమ్మరేమో’

“అవునవును. చాలా త్వరగా ప్రమోషన్ కొట్టేసింది’ అన్నాడు సంతోష్.

“కొట్టేయడమేమిటి? అదేం భాష సంతోష్. ఆ అమ్మాయితో మాట్లాడితే అనిపించదూ ఎంతో తెలివైందని?’ అంది తను.

‘సర్లే. తెలివితేటలతో ప్రమోషన్‌ రావడానికి తను అబ్బాయా? ఆడపిల్లలకు అవేమీ అవసరం లేదు. ఆ ఛైర్మన్ గాడితో కాంప్రమైజ్ అయిపోయివుంటుంది. లేకపోతే 32 ఏళ్లుకూడ లేకుండా ఎవరైనా వైస్ ఛైర్మన్ అవుతారా?’

వినీల నిర్ఘాంతపోయింది.

____

మరో వారం రోజులకు….

వినోద్, జోసెఫ్, అనిల్ ఆ రోజు తమ ఇంట్లో మందు పార్టీ పెట్టుకున్నారు. నెలకోసారి ఒక్కొక్కరి ఇంట్లో పార్టీ పెట్టుకోవాలన్నది ఆ నలుగురు స్నేహితుల నిర్ణయం. పెళ్లయ్యేవరకూ తనకు ఈ సంప్రదాయం గురించి అతను చెప్పలేదు కనక తెలీదు గానీ దానికి తను పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. తననెవ్వరూ వండమని అడగరు. స్విగ్గీలో తెప్పించుకుంటారు. లేదా ఎవరో ఒకరు వెళ్లి తీసుకొస్తారు. ఎంత తాగినా 10 గంటల వరకే. తర్వాత అన్నంతిని ఎవరింటికి వాళ్లు వెళ్తారు. కొంత క్రమశిక్షణతో కూడిన సంబరమే అది. తను కూడా కాస్సేపు వాళ్లతో కబుర్లు చెప్పి, తర్వాత లోపలికి వెళ్లి అమెజాన్ లోనో, నెట్‌ఫ్లిక్స్ లోనో తనకిష్టమైన సినిమా లేదా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటుంది. అదీ కాకపోతే సిడి ప్లేయర్‌లో పాటలు పెట్టుకునో, లేదా ఒక మంచి నవల పట్టుకునో కూర్చుంటుంది. వాళ్లు వెళ్లిపోయేవరకూ సాధారణంగా బయటకు రాదు.

ఆరోజు కూడా అలాగే లోపల కూర్చుని సోమర్సెట్ మామ్ ‘ఫార్ ఈస్టర్న్ టేల్స్’ చదువుకుంటోంది. బయటి నుంచి ఒకటే పగలబడి నవ్వులు. మరీ ఇంతగా నవ్వుతున్నారేంటని లేచి బయటకు రాబోయింది. తలుపు దగ్గర ఉండగానే సంతోష్ గొంతు వినిపించింది.

“ఈరోజు ఎవరి వంతు భోజనం?’ వినోద్ అడిగాడు.

సంతోష్ ‘ నాదే…”

“ఏం కాదు; పోయిన సారి కూడా నువ్వే ఇచ్చావ్’ అన్నాడు జోసెఫ్

“ఫర్లేదు. కొత్త కమిషన్ వచ్చిందిగా”

“రియల్లీ?”

“ఊ….”

“ఎలా మేనేజ్ చేశావు? నాకు తెలీనే లేదే?’ అనిల్ ఆశ్చర్యంగా అన్నాడు

“మన కంపెనీ ఈ పని నాకే ఎందుకు అప్పగిస్తుంది? ఇందుకేగా?’

‘ఎంత ఇచ్చాడేం?”

“కంపెనీకా? నాకా?’ నవ్వాడు సంతోష్

అందరూ నవ్వారు.

“కంపెనీతో మాకేం పనోయ్. నీకే”

“అంత వివరం మీకెందుకులే కానీ…. ఒకటో రెండో విదేశీ ట్రిప్పులు కొట్టొచ్చు”

“ఓహ్. బాగుంది. బాగుంది. అయితే ఈ పార్టీ నీదే’ వినోద్ అన్నాడు

 

“త్రీఛీర్స్ ఫర్ సంతోష్’ జోసెఫ్ అరిచాడు. మళ్లీ నవ్వులు.

ఎవరీ సంతోష్? తనెరిగిన సంతోషేనా? తను ప్రేమించిన వ్యక్తేనా? తల తిరుగుతున్నట్టు అనిపించింది వినీలకు.

ఆ రాత్రి సంతోష్ గదిలోకి వచ్చేసరికి తను నిద్రపోతున్నట్టు నటించింది. అతను కూడ డోస్ ఎక్కువైందేమో. తనని పలకరించకుండానే పడుకున్నాడు.

రెండు రోజుల తర్వాత. ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు. తను యథాలాపంగా అంది

“ఆ కార్తీక్ ను తలచుకుంటే ఆఫీసుకు వెళ్లబుద్ధి కాదు సంతోష్’

“ఎవడూ? ఆ జులపాలవాడేనా?

“ఊ…’
“ఎందుకు? నీకు సబార్డినేట్ కదూ వాడు? నువ్వు చెప్తే పని చెయ్యడా?’

“అబ్బే. అది కాదు. పని బాగానే చేస్తాడు. కానీ ఏదో కామెంట్ చేస్తూంటాడు. నా చీరె బాగుందనో, లేదా నాకు చీర కంటే జీన్స్ బాగుంటాయనో ఏదో అంటూంటాడు’ విసుగ్గా ముఖం పెట్టింది.

సంతోష్ కుర్చీ వెనక్క తన్ని లేచి నించున్నాడు. “ఇన్ని రోజులూ చెప్పలేదేం నాకు?’ కోపంగా అడిగాడు.

“ఇందులో ఏముంది చెప్పడానికి? మగవాళ్లన్నాక అలాగే అంటూంటారు కదా. కొత్తేముంది? ఆడపిల్ల కనిపిస్తే ఏదో ఒక కామెంట్. మొన్న మా బాస్ నన్ను పని మీద పిలిచాడు. లోపల ఓ పదిహేను నిమిషాలున్నాను. బయటకు రాగానే అడిగాడు ‘ఇంతసేపూ పనేనాండీ? ‘ అని. ‘

సంతోష్ పళ్లు పటపటలాడించాడు. ‘వాడి చెంప పగలగొట్టకపోయావా?’ అన్నాడు. వినీల భుజాలెగరేసింది.

“సరే. ఈ రోజు నేను అయిదున్నరకు పర్మిషన్ తీసుకుని నీ ఆఫీసుకు వస్తాను. వాణ్ని బయటకు తీసుకువెళ్తా… కాలో, చెయ్యో విరక్కొడితే తప్ప బుద్ధిరాదు వెధవకి”

వినీల లేచి ప్లేట్లు తీసికెళ్ళింది లోపలికి. “ఎందుకంత కోపం? నాకు ఇప్పటికి రెండు ప్రమోషన్లు వచ్చాయి కదా. ఆ కచ్చతో అలా అనుంటాడు. వాడూ నేనూ ఒకే బాచి ఇంజనీరింగ్ లో” అంది.

‘అయితే? నీకు ప్రతిభ ఉంది కనక ప్రమోషన్ వచ్చింది. నీలా వాడు కష్టపడి పనిచేశాడా ఎపుడైనా? పైగా మేనేజర్‌తో అంతసేపు ఏం మాట్లాడావంటాడా? నరికి పోగులు పెడతాను వాణ్ణి’

వినీల విచిత్రంగా చూసింది సంతోష్ కేసి “ఆడవాళ్లకు ప్రమోషన్లు కాంప్రమైజ్ అయితేనే వస్తాయేమో కదా సంతోష్?’ అంది.

సంతోష్ విరుచుకుపడ్డాడు “ఎవరి గురించి మాట్లాడుతున్నావ్ నువ్వు? నీ గురించి. అంటే నా భార్య గురించి. నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్న వినీల గురించి. నేను ప్రేమించిన అమ్మాయికీ మిగిలిన ఆడవాళ్లకూ సాపత్యమా? అలాంటి ఇలాంటి అమ్మాయైతే నేను ప్రేమిస్తానా?’

వినీలకి నోట మాట రాలేదు. అది తనకు ప్రశంసో, అతని స్వోత్కర్షో అర్థం కాలేదు.

__

వినీల చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు సరోజ, శ్రీధర్. వినీల ఆపగానే శ్రీధర్ అన్నాడు

“ఇంతకూ నీ అభ్యంతరం దేనికి? ఎవరో ఆడపిల్లను ఏదో అన్నాడనా? లేక లంచం తీసుకుంటున్నాడేమో అన్న అనుమానం వల్లనా?’

‘రెండూ. అవి రెండూ నాకు మింగుడుపడనివే”

శ్రీధర్ భుజాలెగరేశాడు. “ఆ అమ్మాయి విషయమైతే అనవసరం మాట్లాడ్డం. తను సంతోష్ కే ఫ్రెండు కదా. అతనికే తెలిసుంటుంది ఆమె ఎలాంటిదో… ఇక పోతే రెండోది. ఈరోజుల్లో అందరూ చేసే పనే తనూ చేస్తున్నాడు. లేకపోతే నెలజీతం పుచ్చుకునేవాళ్లు ఏడాదికోసారి విదేశాల్లో మేరేజ్ డే జరుపుకోగలరా?’ తామిద్దరూ మొదటి పెళ్లిరోజని వచ్చేవారం ఇటలీ ప్రయాణం పెట్టుకున్నట్టు అప్పటిదాకా తనకు గుర్తుకూడ రాలేదు. తన దగ్గర సేవింగ్స్ ఉన్నాయన్నాడు సంతోష్. సేవింగ్స్ అంటే కమిషనా?

వినీల తల్లి కేసి తిరిగింది

‘నువ్వేమంటావమ్మా..”

“ఇలాంటి కారణాలకు వేరయ్యేట్టుంటే ఈ దేశంలో ఏ కాపురమూ నిలబడదేమో వినీలా. నీ బాధను అర్థం చేసుకోగలను కానీ…”

“బాధంటే మామూలు బాధ కాదమ్మా. ఇన్నేళ్లుగా ఈ మనిషి తెలుసు నాకు. కానీ ఇతనిలో ఆడవాళ్ల పట్ల ఇంత చులకన ఉందని ఏరోజూ ఊహకు కూడ అందలేదు. ఇక ఆఫీసు విషయం…’ కంఠం వణికింది వినీలకు.

‘నువ్వు మరీ ఎక్కువ రియాక్టవుతున్నావు వినీ. ఎవరి అవసరాలను బట్టి వాళ్లు డబ్బులు ఖర్చు చేస్తారు. వాడికి కాంట్రాక్ట్ వచ్చి తీరాలి కాబట్టి సంతోష్ కి ఏదో ముట్టజెప్తే అది ఇతని తప్పన్నట్టు మాట్లాడతావేం?’ శ్రీధర్ కొంచెం కోపంగా అన్నాడు.

“అవి చిన్న విషయాలా నాన్నా? మనిషి శీలానికి సంబంధించినవి కావూ?’

‘ఏడ్శినట్టుంది. అతనేదో పది మంది ఆడపిల్లలతో తిరుగుతూంటే శీలమని ఏడవాలి గానీ ఈ కాస్త దానికా? పైగా నిన్ను అవమానించిన వాణ్ణి నరికి పోగులు పెడతానన్నాడంటే నీమీద ఎంత ప్రేమ?’

‘అదే మాట తను మరో అమ్మాయి గురించి అనలేదూ?’ వినీల నిలదీస్తున్నట్టు అంది.

ఒక్క క్షణం శ్రీధర్ జవాబు చెప్పలేకపోయాడు.

“అయినా ఆడపిల్లలతో తిరిగితేనే శీలం పోయినట్టా నాన్నా. అర్హతను పక్కన పెట్టి, ఎవరు లంచమిస్తే వాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం ఎలాంటివాళ్లు చేస్తారు? శీలం ఉన్నవాళ్లు చేసే పనేనా అది?

ఇద్దరూ వెంటనే మాట్లాడలేదు. సరోజ అంది

“లంచం తీసుకోవడం తప్పా ఒప్పా అంటే.. ఒక్కోసారి అందరూ చేసే పనే మనం చేయడం అంత పెద్ద తప్పేమీ కాదేమో… అంటే తను తీసుకోకపోయినా, కంపెనీలో మరొకరు అదే పని చెయ్యొచ్చు. అంటే సంతోష్ తీసుకోకపోయినా మరొకరికి ఇచ్చి అతను దొడ్డిదోవనే వస్తాడు ఎలాగూ.. సంతోష్ ఆ సంప్రదాయాన్నయితే ఆపలేడు కదా… అందుకే అదేదో తనే పుచ్చుకుంటే కనీసం మేనేజ్‌మెంట్ దగ్గర పనితనం ఉన్నట్టు చూపించుకోగలడు కదా”

వినీలకు ఏం మాట్లాడాలో తోచలేదు. తన తల్లిదండ్రులేనా ఇలా మాట్లాడుతున్నది? చిన్నప్పటినుంచీ క్రమశిక్షణ, దయ, ఔదార్యం, నిక్కచ్చితనం అన్నీ నేర్పారే… అవునుమరి. కూతురి కాపురం కదా… కొన్ని విలువల్ని త్యాగం చెయ్యకతప్పదు. అల్లుణ్ణి సమర్థించడానికి ఎంత తాపత్రయపడుతున్నారు ఇద్దరూ… మరి.. తనో? తమ ప్రేమకోసం ఈ విషయాన్ని చూసీ చూడనట్టు ఊరుకోలేదా?

శ్రీధర్ లేచాడు. “నేను సంతోష్ కి ఫోన్ చేస్తాను. భోజనానికి రమ్మని. ఇద్దరూ కలిసి ఏ సినిమాకో వెళ్లి ఇంటికెళ్లండి. మొన్న అతనికి స్నేహితులతో జరిగిన సంభాషణ విన్నట్టు కూడ అతనికి తెలియనివ్వకు”

సరోజ కూతురి కేసి చూసింది. ఆ ముఖంలో భావం అర్థం కాలేదు. వంటింట్లోకి వెళ్లిపోయింది.

వినీల తల్లి వెనకే వెళ్లింది.

‘చూడు వినీ….మగవాళ్లన్నాక వాళ్ల జీవితాల్లో చాలా కోణాలుంటాయి. మన పట్ల ప్రేమగా ఉన్నారా లేదా అన్నదొక్కటే మనం చూసుకోవాలి. మీ నాన్న తన ఆఫీసువాళ్లతో ఎంత దురుసుగా ఉంటారో తెలుసా? పనివాళ్లంటే ఎంత చులకనో ఆయనకి. నాకు బాధగా అనిపించేది. కానీ ఏంచెయ్యగలను? నాతో ప్రేమగా ఉంటారు. మరో ఆడపిల్లని కన్నెత్తి చూడరు. తిట్టడం, కొట్టడం ఎప్పుడూ లేదు. నువ్వు ఎప్పుడైనా చూసావా మేం పోట్లాడుకోవడం? అది చాలదా? వేరే వాళ్లతో ఎలా ఉంటే మనకెందుకు?’

వినీల తల్లికేసి జాలిగా చూసింది.

‘అమ్మా…. నేను సంతోష్ ని ప్రేమించి పెళ్లి చేసుడకున్నాను. ప్రేమించడానికి అతనిలో ఉన్న కొన్ని గుణాలు, అతనికి నా పట్ల ఉన్న గౌరవం, ప్రేమ కారణం. అవునా? వాటిలో నేనొక్కదాన్నే ఉండను. ఇతర స్త్రీలు, పురుషులు, సమాజం అన్నీ ఉంటాయి. అన్నిటి పట్లా అతని వైఖరి నాలాంటిది అని నమ్మాను కనకే ప్రేమించాను. అవునా? కానీ మౌలికమైన విలువలే ఇలా ఉంటే…” వినీలకు కళ్లలో నీళ్లు తిరిగాయి.

సరోజ మాట్లాడలేకపోయింది.

“అతనిలో ఉన్నాయి అని నేననుకున్న గుణాలు, విలువలు లేవని తెలిసాక అతన్ని ఎలా ప్రేమించమంటావు?. నువ్వు చెప్పు”

‘ప్రేమ దశ దాటిపోయింది కదే.. పెళ్లి కూడ చేసుకున్నావు’ వినీలకు నవ్వొచ్చింది. పెళ్లి చేసుకుంటే ఇక ప్రేమ అక్కర్లేదన్నమాట. కాలింగ్ బెల్ మోగింది.

“నేను నా గదిలో ఉంటాను. సంతోష్ వెళ్లాక నాకు చెప్పు. బయటికు వస్తాను” వినీల వెళ్లిపోయింది.

___

మృణాళిని

2 comments

Leave a Reply to Sailaja Kallakuri Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Intricate complexities….5 years and more is also insufficient—- Infact Humanbeing is such—- unpredictable… not preprogrammed— yet the story had a free flow of emotions —- good read Mam…

  • ప్రేమకథల్లో కలలూ-ఇష్టాలే కాదు, కల్లలూ-అయిష్టాలూ వుంటాయని చెప్పేసిన కథ. బావుందండి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు