జర్నలిస్టులను అర్ధరాత్రి అపరాత్రి ఇళ్ల నుంచి హింసాత్మకంగా మఫ్టీ పోలీసులు అపహరించడం, కేసుల మీద కేసులు మోపి పోలీస్ స్టేషన్లు మార్చి మార్చి తిప్పడం- తెలుగు రాష్ట్రాల్లోని పాలనా వాతావరణాన్ని, పౌరహక్కుల పరిస్థితిని సూచిస్తోంది. నోరుతెరిస్తే అసభ్య వీరాలాపాలతో రాజకీయ సంవాదాన్ని కలుషితం చేస్తున్న పాలకులు, జర్నలిస్టుల భాషను వేలెత్తి చూపించడం హాస్యాస్పదం. పెద్ద మీడియా సంస్థలను దాన దండోపాయాలతో లొంగదీసుకున్న అధికార పార్టీలు, తమకు విధేయంగా ఉండనందుకు స్వతంత్ర జర్నలిస్టుల మీద విరుచుకుపడుతున్నారు.
ఉత్తరాదిలో మొదలయిన ఈ దుర్మార్గాన్ని రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు దిగుమతి చేసుకున్నాయి. జర్నలిస్టులు ఇతర రాష్ట్రాల రాజకీయాలపై వ్యాఖ్యలు చేయకూడదని శాసిస్తున్నాయి. పక్కరాష్ట్రంలోకి జొరబడి జర్నలిస్టులను ఎత్తుకుపోతున్నాయి!
సామాజిక మాధ్యమాల ద్వారా, తమ వ్యాఖ్యలను ప్రకటిస్తున్న యూట్యూబర్లు, డిజిటల్ జర్నలిస్టులు అసలు పాత్రికేయులు కాదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగని, వారు ఆ మాధ్యమాలకు దూరంగా ఉన్నారా? తమ వైఖరులను ముందుకు తీసుకుపోవడానికి, ప్రత్యర్థులను దూషించడానికి అనేక యూట్యూబ్ ఛానెళ్లను ఏర్పాటు చేసి, నిధులు సమకూరుస్తున్నారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేయడంలో అటువంటి “అనుబంధ” వేదికలే ముందుండి, మీడియా ను మురికి చేస్తున్నాయి .
స్వతంత్ర మీడియా వ్యక్తీకరణలలో కొన్ని సమస్యలున్నాయి. నిజమే. ఆవేశకావేషాలను తీవ్రమైన భాషలో ప్రకటించే, నోరుజారి తూలనాడే ధోరణి చాలా మందిలో ఉంది. ఒక పక్షం మీద మొగ్గు చూపించినప్పటికీ, తటస్థ స్వరాన్ని, అన్ని వాదనల కవరేజ్ ను ప్రమాణాలుగా అంగీకరించే కాలం ఒకటి ఉండేది. ఆ విలువల నుంచి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా తప్పుకుని చాలా కాలమైంది. డిజిటల్ మీడియా మాత్రమే హద్దులు మీరుతోందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఫలానా వారు, గీత దాటి దూషణలు చేస్తున్నారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పే సమర్థనలు నిలబడవు. ఎంతో హుందాగా విమర్శలు చేసే వారిని కూడా పార్టీలు, ప్రభుత్వాలు- దాడులతో కేసుల్తో ట్రోల్ తో వేధిస్తున్నాయి. దౌర్జన్యాలకు కారణం, దుర్భాషలు కావు, విధానాలను నిలదీయడమే.
జనాకర్షక నాయకుల ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో చెలరేగి పోయి బీభత్సం సృష్టిస్తున్నారు. తమ నాయకుడిని రాజకీయంగా విమర్శించేవారిని బూతులతో బెదిరింపులతో వేధిస్తున్నారు. మహిళా జర్నలిస్టుల మీద చెప్పరాని భాషలో దాడి చేస్తున్నారు. అయినా వారి నాయకులు తమ అనుచరులను కనీసం మందలించరు. ప్రోత్సహిస్తారు.
ప్రజారంగం లో సంవాదాన్ని కొన్ని ప్రమాణాలతో తీర్చి దిద్దుకోవాల్సి ఉంది. రాజకీయ నేతల కంటే పాత్రికేయ సంస్కారం ఉన్నత స్థాయిలో ఉండాలి. రాజకీయధనంతో నడిచే మీడియా తన ధోరణికి తానే సిగ్గుపడేలా స్వతంత్ర మీడియా ఉన్నత స్థాయి ని ప్రదర్శించాలి. అదే సమయంలో తన సుగుణాలైన నిర్భీతిని, ప్రజాపక్షపాతాన్ని వదులుకోగూడదు!
సంప్రదాయ జర్నలిస్టులు తమ భేషజాలను వదిలి, డిజిటల్ తరం జర్నలిస్టులను వృత్తి సహచరులుగా గుర్తించాలి. ఇటువంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర దాడులు జరిగినప్పుడు సంఘీభావం చెప్పాలి. అప్పుడు, కొన్ని కనీస ప్రమాణాలు ఏర్పాటు చేయడానికి వారితో సంభాషించడం కుదురుతుంది. భావ స్వేచ్ఛ మీద ఇంతటి దాడి జరగకుండా ఆపవచ్చు.
*








Yes sir..True
ప్రబీర్ పుర్కాయస్త ఎవరిని తిట్టకుండానే ఉపా కేసు పెట్టీ దాదాపు 9 నెలల జైల్లో ఉంచారు. ఒక్క కేసు నిరూపించలేక పోయారు. చివరకు రెండేళ్ల వేధింపుల తరువాత కోర్ట్ కేసు కొట్టేసింది.అయిన అధికారంలో ఉన్న వాళ్లకు బుద్ధి రాలేదు. కేసు అప్పీల్ చేస్తాం అని ఈడి అంటున్నాడు.