ప్రణయ పరిమళం ఆ ఇద్దరు స్త్రీల కవిత్వం!

ముప్పై-ఒక్క అక్షరాల తంక కవితలో సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడం ఒక్కటే కాదు, ఆత్మపరిశీలనకు మాధ్యమంగా కూడా ఉపయోగించారు.

జపాన్ సాహిత్య చరిత్రలో సాహిత్యానికి స్వర్ణయుగంగా భావించిన హీయాన్ కాలం ( క్రీ.శ. 794 – 1185 ) లో ఇరువురు కవయిత్రులు ఆ రాజాస్థానంలో గొప్ప సృజనశీలురుగా, కీలకమయిన సౌశీల్యము గల వ్యక్తులుగా పేరు గడించారు. వారిలో ఒకరు ఒనో నో కొమచి (825 – 900) కాగా రెండవ వారు ఇజుమి షికిబు (974–1034 ). ఇరువురు కూడా హీయాన్ రాజ ఆస్థానాలలో కళలు, సంస్కృతి గొప్పగా వర్థిల్లుతున్న కాలంలో ఉజ్వలంగా ప్రకాశించారు.

హీయాన్ కాల రాజాస్థానంలోని కులీన సంస్కృతిలో అనేక కారణాల వల్ల, ప్రత్యేకంగా స్త్రీ రచయితలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. వారికి రోజువారీ జీవితంలో కళల పాత్ర అత్యంత ప్రధానమైనది. వారసత్వాలకు, హోదాలకు అతీతంగా ఆస్థానంలోని సభ్యుల మధ్య;  స్త్రీ,పురుషుల మధ్య వ్యత్యాసాన్ని మాపడానికి సౌందర్యాత్మక సునిశిత వ్యక్తీకరణలను విజయవంతంగా ప్రదర్శించడం ఒకటే మార్గం. సువాసన గల అగరబత్తులను సరైన నిష్పత్తిలో కలపడం, రకరకాల పద్దతులలో పట్టు అంగీలను దొంతరలుగా పేర్చడం, సంగీత ప్రదర్శన, చిత్రకళ, నాట్యం, అన్నింటికంటే మించి కవిత్వం రాయడం, చదవడం వంటి నైపుణ్యాలు మాత్రమే భావి శృంగార భాగస్వామిగా ఒక వ్యక్తి ఆకర్షణలో గొప్పగా కనిపిస్తాయి. అంతే గాక అధికారిక పురోగతి కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎటువంటి గాఢమైన అనుభవం అయినా కూడా ఆ అనుభవంతో జతకూడిన కవిత లేకుండా అది సంపూర్ణంగా భావించరు.

అయితే, పురుష రచయితలు వారి సహకార భాగస్వామ్యాన్ని చైనీయ భాషలో గొప్పగా అందించారు. ఎందుకంటే చైనీయ భాష జపాన్ మొదటి లిఖిత భాషగా క్రీ.శ. 4, 5 వ శతాబ్దంలో స్వీకరించబడి, ప్రభుత్వ లాంఛనాలలో అధికారిక భాషగా చలామణీ అయింది. మధ్య యూరప్ లో లాటిన్, ఐరోపా న్యాయస్థానాలలో లాటిన్ భాష పనిచేసిన విధంగా ప్రభుత్వం, పండితుల ఉపన్యాసాలలో, అధికారిక సమాచార పంపిణీ వ్యవస్థా రూపంగా చైనీయ భాష పనిచేసింది. సాధారణంగా చైనీస్ వాడకం పట్ల అవగాహన లేని స్త్రీలకు, ఎనిమిదవ శతాబ్దపు చివరలో వ్రాతపూర్వక సాహిత్యాన్ని సృష్టించే సాధనాలు మాత్రమే అందించబడ్డాయి. వాడుకలో మాట్లాడే జపనీస్‌ని లిప్యంతరీకరించడానికి చైనీస్ అక్షరాలను స్వరశబ్దాలుగా ఉపయోగించడం కోసం కొత్త వ్యవస్థను రూపొందించారు. విదేశీ కవితా నిర్మాణ పద్దతులను, కళాత్మక సున్నిత వ్యక్తీకరణల అవసరాలను తీర్చడానికి పురుష రచయితల అవసరం లేకుండా స్థానిక భాషపై దృష్టి కేంద్రీకరిస్తూ, తమ సాహిత్య సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి స్త్రీ రచయితలు పద్యాలు, డైరీలు, ‘గాథలు’ ద్వారా అభివృద్ధి చెందవచ్చు. కాబట్టి  వారు తమ జీవితంలోని అంతర్ బాహిర్ విషయాలను అత్యంత లోతుగా, గాఢంగా సాహిత్యంలో నమోదు చేశారు.

కొన్ని కవితా ఇతివృత్తాలు హీయన్ కాలం ( తరువాతి కాలాలలో కూడా) కవిత్వంపై ఆధిపత్యం చెలాయించాయి. వీటిలో ప్రతి ఒక్క కవిత మొదటి వాక్యం కి నో త్సురయుకి సంకలనం చేసిన, జపనీయ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ విమర్శనాత్మక వ్యాఖ్యానం అయిన కోకిన్షు (జపనీస్ కవుల ఉత్తమ రచనల ( పాత,కొత్త ) సంకలనాలలో మొదటిది. క్రీ. శ. 905 ) ముందుమాటలో ప్రస్తావించబడ్డాయి. జపనీయ కవిత్వం మానవ హృదయంలో విత్తబడి ఉంది. అది అనేకానేక పదాల ఆకులుగా  పెరుగుతుంది. ప్రజలు ఈ ప్రపంచంలో అనేక విభిన్న దృగ్విషయాలను అనుభవిస్తారు కాబట్టి, వారు చూసే, వినే విషయాల పరంగా వారు తమ హృదయాలలో ఏమనుకుంటున్నారో అదే అనుభూతి చెందుతారు. పువ్వుల మధ్య గానం చేసే కోకిల, చెరువులో నివసించే కప్ప బెకబెకల స్వరం – వీటిని విని, ఏ జీవి తన  కవితతో స్పందించకుండా ఉండగలదు ? అప్రయత్నంగా దివిని, భూమిని కదిలించేది; అదృశ్య ఆత్మల ప్రపంచాన్ని గాఢమైన అనుభూతిలోకి మేల్కొల్పేది, స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని సున్నితంగా మార్చేది, భీకరమయిన యోధుల హృదయాలను ఓదార్చేది ఒక్క కవిత్వమే.

హీయాన్ కాల జపనీయ ఆస్థానంలో కవిత్వ ప్రత్యేకత ఏమిటంటే, దాని ప్రాముఖ్యత ‘రచయితలు’ అని పిలువబడే కొద్దిమందికి మాత్రమే పరిమితం కాలేదు. ఆస్థానంలోని సభ్యులందరూ కవిత్వ అల్లికలో పాలు పంచుకుంటారు. వీరు తమ ప్రతి వ్యక్తిగత ఆచార వ్యవహారాలలో, ఆంతరంగిక వ్యవహారాలలో కవితలు కూర్చడమే కాకుండా, ఆ సమయంలో వాటిని పోలిన మునుపటి పాత కవితలను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. వసంతం రుతు ప్రారంభంలో అది వికసించే క్రమం , పిల్లల మరణం, ఒక్క క్షణం చంద్రుని తళుకు, మరచిపోయిన విసనకర్ర తిరిగి ఇవ్వడం – లాంటి విషయాలు ఏదీ కూడా ఒక కవిత జత లేకుండా పూర్తి కాదు. ‘ స్త్రీ పురుషుల మధ్య సంబంధాలను మృదువుగా చేసే’ ఉద్దేశ్యంతోనే కవిత్వం అక్కడ సర్వవ్యాప్తం అయింది.

సుమారు పదమూడు వందల సంవత్సరాల క్రితం హీయాన్-క్యో నగరం, ప్రపంచంలో అత్యున్నత నాగరికత కలిగిన అతికొద్ది నగర కేంద్రాలలో ఒక నగరం. యూరోపియన్ నగరాల కంటే కూడా ఇది ఎక్కువ జనాభా కలిగి ఉంది. కులీనుల పురుష సభ్యులు రాజకీయమైన సానుకూలత కోసం, అధికారిక పదవుల కోసం ఇక్కడ పోటీ పడ్డారు. కులీన కుటుంబాల కుమార్తెలు పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే రాజరిక గృహాలలో సభ్యులకు సహచరులుగా పనిచేయడానికి పంపబడ్డారు. రాజరిక సభ్యులతో కుమార్తెల వివాహం ద్వారా మాత్రమే కుటుంబ స్థితి, హోదా శాశ్వతంగా పెరుగుతాయి. రాజరిక పరివారంలో పనిచేస్తున్న స్త్రీలు అత్యంత సంస్కారవంతులు, వినయ విద్యావంతులు. వారు పురుషులచే సౌందర్య సమానులుగా పరిగణించబడ్డారు. వారి ప్రత్యేక నివాస గృహాలలోని స్త్రీలు కొన్ని అధికారిక విధులు చేయవలసి వుంటుంది. కానీ చాలా వరకు వారు వారి మానాన వదిలివేయబడ్డారు. వారు కవిత్వ సంకలనాలను పఠిస్తారు, ఒకరికొకరు ఇచ్చుకుంటారు. బయట ఉత్సాహంగా విహారయాత్రలు చేయడానికి తమ పనిమనిషుల సహాయం తీసుకుంటారు. సంగీత వాయిద్యాలు పలికిస్తారు, వేరొకరి కోసమో, తమ కోసమో కవిత్వం రాస్తారు. ముఖ్యంగా తమ మహరాజుని అలరించడానికి వారు ఇవన్నీ చేస్తారు. కానీ అవన్నీ ఎక్కువ భాగం హృదయగతమైన వ్యవహారాలకు చెందినవే. పెళ్లికాని స్త్రీలకు ప్రేమ వ్యవహారాలు అంగీకార యోగ్యమే. రాజ పురుషులకు బహుభార్యాత్వం సాధారణ విషయమే. అందువలన శృంగారం, ప్రేమ, దాని పరిణామాలు, పర్యవసానాలు వారి సాధారణ సాహిత్య అంశాలు అయ్యాయి.

హీయాన్ రాజాస్థానంలోని ఉన్నత-స్థాయి సభ్యునికి, స్త్రీల విషయంలో మిగతా సంస్కృతుల కన్నా మిన్నగా వ్యవహారిక సంబంధాలు పెట్టుకోవడానికి వీలు, సౌలభ్యం వుంది. కుటుంబాల చేత చిన్న వయస్సులోనే వివాహం చేసినప్పటికీ, ఒక వ్యక్తి తనకు కావలసినంత మంది రెండో భార్యలను లేదా అధికారిక ఉంపుడుగత్తెలను, అతను తన తాహతకు తగినంత మంది రహస్య ప్రేమికులను ఏర్పరుచుకోవచ్చు. ఒక వ్యక్తి తన ఇంటిలో అనేక మందిని రెండో భార్యలుగా స్వీకరించవచ్చు. చాలా హీయాన్ నివాసాలు అనేక విడి విడి సముదాయాలుగా, ఆవాస మందిరాలుగా ఉంటాయి కాబట్టి వారు వేర్వేరు ప్రదేశాలలో అనేక మంది భార్యలను కలిగి ఉండవచ్చు. అవివాహిత స్త్రీకి కూడా ఎక్కువ మంది ప్రేమికులు ఉండవచ్చు. కానీ వివాహం అయిన స్త్రీ తన భర్తకు విశ్వాసపాత్రంగా ఉండాలి. హీయాన్ స్త్రీలకు శృంగార విషయాలలో గొప్ప స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆమె ఆస్తికి యజమానురాలు కాగలదు. తన పేరు మీద ఆదాయాన్ని పొందగలదు. ప్రేమికుల అభ్యర్థనలను  తిరస్కరించగలదు. వివాహం లేదా అధికారికంగా ఆమె తన  ‘రెండవ భార్య’ స్థానం ఇకపై తనకు సరిపడదనుకున్నప్పుడు విడాకుల ద్వారా లేదంటే దూరంగా వెళ్లిపోవడం ద్వారా ఆమె ఆ సంబంధాన్ని పూర్తిగా తెంచుకోగలదు.

రాజాస్థానంలోని స్త్రీకి కొత్త ప్రణయ ఆహ్వానానికి సంబంధించిన తొలి అభ్యర్థన –  ఐదు పంక్తుల కవిత ( తంక )ను ఒక దూత, ఆమె నివాసం వద్దకు తీసుకువచ్చి ఇవ్వడంతో ప్రారంభం అవుతుంది. ఆ స్త్రీకి ఆ కవిత తగినంత ఆసక్తిని కలిగిస్తే, దానిలో రాసిన విషయం, గాఢానుభూతికి తగినట్టుగా ఆ కవిత వ్రాసి వుంటే, చేతి వ్రాత  కళాత్మకంగా, మనోహరంగా ఉంటే, ఆమె ఆమోదయోగ్యమైన సమాధానం – తిరిగి అదే కవితా ప్రత్యుత్తర రూపంలో ఇస్తుంది. ఇదంతా రాత్రుళ్ళు రహస్యంగా జరుగుతుంది. అప్పటి నుండి ఆ ప్రేమికుడు ఆమెను సందర్శించి, మొదటి రాత్రి కలిసి, మర్యాద పూర్వకంగా, నిద్ర లేకుండా, తెలతెలవారు జాము వెలుగులో అతను తిరిగి బయలుదేరే వరకు ప్రేమ, శృంగార వ్యవహారాల చర్చ విరామం లేకుండా కొనసాగుతుంది. తర్వాత రోజు అతను తన ఆలోచనలను అనుదిన విధుల మీదకు మళ్లించలేకపోతే, ఉదయం – ఒక కవిత వ్రాసి, సేవక దూత ద్వారా పంపవలసి ఉంటుంది. ఆ దూత ఆ స్త్రీ యొక్క సమాధాన కవితతో తిరిగి వస్తాడు. ఈ పరస్పర కవిత్వ మార్పిడి పూర్తయిన తర్వాత ఆ కవితలు ఉద్వేగభరితంగా, నైపుణ్యంగా, కవితాత్మకంగా ఉన్నాయా లేదా అనే దాని ద్వారా మాత్రమే ఆ రాత్రి విజయాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు. ఆ తదుపరి కలయికలు అదే రహస్య ప్రాతిపదికన, అదే పరిస్థితులలో అధికారికంగా వారి వివాహం జరిగేవరకు కొనసాగవచ్చు లేదా అర్థాంతరంగా ముగియవచ్చు. ఈ తంక కవితల

నజరానాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణి The Dairy of Izumi Shikibu గ్రంథంలో మరింత విపులంగా చూడవచ్చు. ఆమె ఒకసారి తన హృదయాన్ని ప్రేమికుడికి ఇచ్చిన తర్వాత, ఆ స్త్రీ తన ప్రేమికుడి కవితాలేఖల కోసం రాత్రిపూట, తన తలుపు దగ్గర ఎదురుచూడాల్సి వచ్చేది. ఎప్పుడైనా అతను రాలేకపోతే – రాత్రిపూట చీకటిగా వుందనీ, వాతావరణం బాగోలేదని,  అశుభ శకునాలని, ఇతర ఆసక్తులున్నాయని చాలా కారణాలు చెప్పవచ్చు. ఎన్నో నిద్రలేని రాత్రులు ఆశతో, ఊహాగానాలతో ఆ కవయిత్రులు గడిపారని ఈ పుస్తకంలోని చాలా కవితల సాదృశ్యాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రేమికుల ప్రణయ బాంధవ్యం మొత్తం, ఈ కవితల మార్పిడి వల్ల ప్రేమను భరోసాగా ఇవ్వడానికి, ప్రేమికుడి మానసిక స్థితి గురించి అవతలి వ్యక్తిలో ఆసక్తిని రేకెత్తించడానికి ఉపయోగపడుతుంది. కవిత్వం అనేది అనిశ్చితిని, ఆశలని, సందేహాలను వ్యక్తీకరించే సాధనం.

మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో మంది కవయిత్రులు రాజాస్థానాలలో వారి ప్రతిభా పాటవాల కారణంగా గౌరవాన్ని పొందారు. రామభద్రాంబ, మధురవాణి, పసుపులేటి రంగాజమ్మ, కృష్ణాజమ్మ, చంద్రరేఖ, ముద్దు పళని వంటి మేటి కవయిత్రులను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. రూపాలు, వస్తువులు, భాష, వాతావరణం వేరయినా కూడా స్వభావం, సౌందర్యం రీత్యా కొమచి, షికుబుల సాహిత్యం వీరు వెలయించిన సాహిత్యంతో సరిపోల్చవచ్చు.

కొమచి, షికిబు వారు ఎంచుకున్న కవితారూపంలో, ముప్పై-ఒక్క అక్షరాల తంక కవితలో సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడం ఒక్కటే కాదు, ఆత్మపరిశీలనకు మాధ్యమంగా కూడా ఉపయోగించారు. ప్రతి కవిత సూటిగా, నిజాయితీ గల అనుభవంతో నిండి, ఏ ప్రాయం వారికయినా అసాధ్యమయిన వ్యక్తీకరణలుగా అనిపిస్తాయి. ఫలితంగా, వెయ్యి సంవత్సరాల తరువాత కూడా, మన అత్యంత సాధారణ, అసాధారణ అనుభవాలను నమోదు చేసిన ఖచ్చితమైన, మనసు కదిలేంచే వర్ణనల కవిత్వాన్ని మనం చదవుకోగలము. ప్రేమ, వియోగం, వాస్తవ ప్రపంచ మనోహర, వికార అనుభవ ప్రతిఫలనాలను మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం. గతాన్ని నెమరువేసుకొనడానికే కాదు, వర్తమానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికీ మనం ఈ కవితలను ఆశ్రయిస్తాము. ఎందుకంటే ఈ కవిత్వం మన జీవితాల్లో ప్రణయ భావనలతో కూడిన ప్రకాశవంతమయిన పరిమళం నింపుతుంది.

*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు