పెద్ద బాలశిక్ష

”అలా ఊహిస్తూ ఉన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది. అలాగే అన్పిస్తుందా? డాక్టర్‌ గోకుల్‌రెడ్డి ఆత్రంగా తల మెడ కొంచెం ముందుకు వంచి, కళ్ళు కొద్దిగా చికిలిస్తూ అడిగాడు.

”అవును… కాదు… కాదు… అంటే… అలా అంటే… ఎలా? అలేఖ్య ఖంగారు పడుతూ బిక్కసచ్చిపోతూ భర్త ఆదిత్య వైపు చూసింది. అప్పటికే ఆదిత్య చిరాకుగా, కోపంగా చూస్తున్నాడు డాక్టరు వైపు.

”అదే… ఫీలింగ్స్‌ వస్తాయా… అంటే ఆనందంగా అన్పిస్తుందా… అంటే ఐమీన్‌ సెక్సువల్‌ ఫీలింగ్స్‌ కలుగుతాయా…” కళ్ళల్లో ఒక రకమైన వెటకారం సైకియాట్రిస్ట్‌ మొఖంలో. అలేఖ్య మొఖం ఎఱ్ఱబారింది. కోపమూ ఆవేశము దుఃఖం కలగలిసి అయోమయంగా ”అవును… కాదు… లేదు అసలే ఫీలింగ్స్‌ కలగవు భయం అనిపిస్తుంది… చమటలు పట్టేస్తాయి. కళ్ళు తిరుగుతుంటాయి” గబగబా అనేసి దుఃఖం ఆపుకొంటూ ఆదిత్యవైపు బేలగా చూసింది.

”డాక్టర్‌ ఆ టైంలో ఆమెకి ఆనందం కలుగుతోందా లేక సెక్సువల్‌ ఫీలింగ్స్‌ కలుగుతాయా అనేది తెల్సుకోవడం కోసం కాదు.. ఇక్కడికొచ్చింది. ఎందుకు అలా అనిపిస్తుంది ఆమెకు ఆ ఊహల వెనకాల కారణాలు తెల్సుకుని కౌన్సిలింగ్‌ ఇస్తారని వచ్చాం” ఆదిత్య కోపాన్ని ఆపుకుంటూ అన్నాడు. డాక్టర్‌ కొద్దిగా చిరాకు పడ్తూ ”అపార్థం చేస్కున్నారు. ఆమెకు దైహిక స్పందనలు కలుగుతున్నాయా లేదా ఆ సమయంలో తెల్సుకోవడం మా డయగ్నాసిస్‌కు బాగా పనికి వస్తుంది” అంటూ ”అలేఖ్యగారూ మీరు కాస్త ఒక ఐదు నిమిషాలు బయటకెళ్ళండి” అన్నాడు. తలుపు వైపు చూపిస్తూ అలేఖ్య ఒక్కుదుటన” బయటకు వెళ్ళిపోయింది.

డాక్టరు కొద్దిగా ముందుకు ఒంగుతూ… ”మీ దాంపత్య జీవితం ఎలా ఉంది… మీ భార్య మీతో సంతృప్తి చెందుతోందా?” కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రశ్నార్థకంగా అడిగాడు. ఆదిత్య మొఖం ఎర్రబడింది. ”అంటే ఆమె నాతో సెక్స్‌లో ఆనందం పొందలేక ఇలా ఊహిస్తూ తృప్తి పొందుతుందనా మీ ఉద్దేశ్యం? అదేం లేదు అసలామెకు సెక్స్‌పట్ల ఆశక్తే ఉండదు. ఆమెకి సెక్స్‌ అంటే విముఖత ఎక్కువగా ఉంది. నేనెంతో ప్రయత్నం చేస్తే పది రోజులకోసారి నా కోసం మాత్రమే ఒప్పుకుంటుంది” ఆదిత్య అసహనాన్ని అణుచుకొంటూ అన్నాడు. ”చాలాసార్లు అట్లా ఉండవు కోరికలు తీరక కూడా లేదా ఎక్కువై కూడా ఇలా చేస్తుంటారు. మీతో చెప్పలేకపోవచ్చు. కొన్ని రోజులు ఈ మందులు వాడండి” అంటూ ఒక ఆరు రకాల మందులు రాసిచ్చాడు. ఒక నెల తర్వాత రండి అన్నాడు. ఆదిత్య ప్రిస్క్రిప్షన్‌ అందుకున్నాడు. ‘నింఫోమానియా’ (లినిబీలిరీరీ రీలిని ఖిలిరీరిజీలి) అని ఉంది. ”ఏంటది డాక్టర్‌ నా భార్యకు సెక్స్‌ కోరికలు ఎక్కువ లేవు. మీ డయాగ్నోసిస్‌ సరైంది కాదు”  ఆదిత్య కోపంగా అంటుంటే ”మందులు వాడకపోతే సీరియస్‌ అయిపోతుంది జాగ్రత్త తర్వాత నన్ను బ్లేమ్‌ చేయద్దు” అన్నాడు డాక్టర్‌. ఆదిత్య నిస్సహాయంగా కన్సల్టేషన్‌ చాంబర్‌ బయటకు వచ్చాడు. బయట అలేఖ్య తలవంచుకొని సెల్‌ఫోన్లో ఏవో టైప్‌ చేస్తున్నది. ఆమె దాంట్లోని నోట్‌ బుక్‌ యాప్‌లో రోజూ ఏదో టైప్‌ చేస్తూ ఉంటుంది. ఆదిత్య వెళ్ళి మందులు కొని అలేఖ్య దగ్గరికి వచ్చి ‘పద అలా’ అన్నాడు. ”ఏమన్నాడు డాక్టర్‌ నాకు సెక్చ్‌ పిచ్చి అన్నాడా? అంతే అని ఉంటారు. ”ఆదీ నాకలా ఊహలు వచ్చినప్పుడు డాక్టర్‌ అడిగినట్లు సెక్స్‌ కోరిక కలగదు చిరాగ్గా, రోతగా దుఃఖంగా ఉంటుంది నన్ను నమ్ము” అలేఖ్య గొంతు ఒణుకుతున్నది. కార్‌ డ్రైవ్‌ చేస్తున్న ఆదిత్య అలేఖ్య చేతిని నొక్కుతూ ”నాకు తెలుసు కూల్‌గా ఉండు… డోంట్‌ వర్రీ ఇంకో డాక్టర్‌ దగ్గరకు వెళ్దాం” అన్నాడు ఆదిత్య. అలేఖ్య కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంది.

– – –

‘ఈలిజితిరీరిళిదీబిజి ఈరిరీళిజీఖిలిజీ’ ఒక రకమైన మానసిక వ్యాధి ఊహల్లో విహరించడం, దాన్ని వాస్తవమని నమ్మడం… భయపడ్డం, ఆందోళన చెందుతూ తప్పు చేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్‌తో పశ్చాత్తపడుతూ స్ట్రెస్‌కి గురవుతూ మానసికంగా చిత్రహింస అనుభవిస్తుంటారు. వంశ పారంపర్యంగా రావచ్చు లేదా బాల్యం నుంచీ ఎదుగుతున్న దశలో పెంపకం, వాతావరణం, కఠినమైన క్రమశిక్షణతో ఒత్తిడికి గురవడం వలన కూడా ఇలాంటి చిత్తభ్రాంతుల్లోకి, భ్రమాన్విత వాతావరణంలోకి వెళుతూంటారు. మందులు వాడాలి. లేకపోతే వీళ్ళల్లో ఆత్మాహత్య ఆలోచనలు కూడా ఉంటాయి. జాగ్రత్త…” డాక్టర్‌ చిరంజీవి ప్రిస్క్రిప్షన్‌ రాస్తూ అన్నాడు.

– – –

”నేనీ మందులు వాడలేను ఆదీ నిద్రొస్తుంది బాగా…” అలేఖ్య మత్తుగా అంది. ”చూద్దాం ‘అలా’ ఒక నెల వాడదాం తగ్గకపోతే అప్పుడు మానేద్దు గానీ నా మాట విను ప్లీస్‌ నా కోసం” ఆదిత్య బుజ్జగించి మందులు వేసి అలేఖ్యను పడుకోబెట్టాడు. ‘నా పక్కనే పడుకో ప్లీస్‌’ అంటూ అలేఖ్య మారాం చేస్తుంటే, పక్కనే పడుకుని గుండెల మీద తలపెట్టి తనను అల్లుకుని పడుకున్న అలేఖ్యను తలపై నిమిరుతూ చెమరించిన కళ్ళను తుడుచుకున్నాడు ఆదిత్య.

– – –

అలేఖ్యకు మెలకువ వచ్చేసరికి ఉదయం పదకొండు అయ్యింది. ఖంగారుగా లేచింది. ఎప్పటిలాగే ఆదిత్య లేడు తన ప్రేమ మాత్రం తనను లేపకపోవడంలో టేబుల్‌ మీద అమర్చిన టిఫినూ, లంచ్‌, మందులలో కనపడుతుంది. లేపి ఉంటే బాగుండేది ఎప్పుడో రాత్రికి వస్తాడు. అలేఖ్య లేచి ఫ్రెష్‌ అయ్యింది. పళ్ళు తోముకుని ఫ్లాస్క్‌లో టీ తాగింది. స్నానం చేసి టిఫిను తిన్నది. ఆదిత్య ఫోన్‌ వచ్చింది ”టాబ్లెట్స్‌ వేస్కున్నావా అలా” అని అడిగాడు. ఖంగారు పడుతూ ‘ఆఁ వేస్కున్నా ఆదీ’ అంది. ”నువ్వు వేస్కోలేదని అర్థం అవుతున్నది ప్లీస్‌ వేస్కో నాన్నా, డాక్టరు చెప్పిన హోంవర్కు చెయ్యి సరేనా?” అన్నాడు. అతని శ్రద్ధకీ, ప్రేమకీ అలేఖ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తెర్లుకుంటూ దుఃఖం వచ్చింది ‘సరె’ అంది రుద్ధకంఠంతో. కానీ మందులు వేస్కో బుద్ది కాలేదు. వేస్కుంటే మళ్ళీ రాత్రికి కానీ మెలకువ రానంత మత్తు నిద్రలోకెళ్ళిపోతుంది. ఆదిత్యను పూర్తిగా మిస్‌ అవుతున్నది. పైగా ఇంటి పనంతా ఆదిత్యే చేస్తున్నాడు. అలేఖ్య మందులు తీసి మెల్లగా సింక్‌లో పడేసి టాప్‌ తిప్పింది.

 

ఫ్లాస్క్‌లోంచి టీ పోస్కుని బెడ్‌రూం అవతలి బాల్కానీలోకి వచ్చి చెయిర్‌లో కూర్చుని టీ తాగసాగింది. పక్కింటి టెర్రస్‌ గార్డెన్‌లో ఇంటి ఓనరు మొక్కలకు పైపుతో నీళ్ళు పోస్తున్నాడు. అలేఖ్య అతన్ని చూడసాగింది. అతను మోకాళ్ళ దాకా హాఫ్‌ పాంటు వేస్కున్నాడు. పైన కట్‌ బనీను ఉంది. మోకాళ్ళ కింద నించి దృఢమైన అతని ఛామన ఛాయ కాళ్ళు, కట్‌ బనీను నుంచి అతని కండలు తిరిగిన భుజాలు, చేతులు… ఛాతీనిండా వెంట్రుకలతో ఉన్నాడు. అప్పుడప్పుడూ తలెత్తి అలేఖ్యను చూస్తున్నాడు. పెద్ద కళ్ళు, మిలట్రీ మీసాలు. నవ్వుతున్నాడా తనను చూసి…?

అలేఖ్య మెల్లగా లేచింది. బాల్కనీలోంచి హాల్లోకి వచ్చి తలుపు తీసింది. అతనింటి వైపు వెళ్ళి గేట్‌ తెరిచి ఇంటి బయట నించే ఉన్న మెట్ల మీదుగా డాబా మీదకు వెళ్ళింది. అతని వైపుకి వెళ్ళింది. అతను ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అలేఖ్య అతని చేతిలోంచి నీళ్ళ పైపు తీస్కుని పక్కన మొక్కల్లోకి విసిరేసింది. అతని వైపు తిరిగింది. తన నైటీ విప్పేసింది అతన్ని పెనవేస్కుంది, గడ్డిలోకి తోసింది. అతని మీద పడి ముద్దులతో ముంచెత్తింది. అతన్ని రెచ్చగొట్టి ఆ సూర్యకాంతిలో పట్ట పగలు డాబామీద అతనిలో ఐక్యమైంది.

అలేఖ్య ఉలిక్కిపడింది ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది. తను తన బాల్కనీలోనే కుర్చీలో కూర్చుంది. అతను మొక్కలకు నీళ్ళు పోస్తున్నాడు. మళ్ళీ ఆ ఊహల్లోకి వెళ్లిపోయిందా ఎప్పటిలాగా ఎంత నిజమైన అనుభవంలా ఉంది. ఛీ అతనితో ఊహల్లో సెక్స్‌ చేసింది. అలేఖ్యకి వెన్నులోంచి చలి పుట్టింది. అతను ఆదిత్యను కలవడానికి వస్తుంటాడు ఇంటికి మొఖమెలా చూస్తుంది. ఛీ ఏంటి తనకీ జబ్బు. మందు లేస్కోవాలి. అలేఖ్య ఒక్క ఉదుటున లేచి మందుల కోసం వెతికింది. దొరకలేదు ఆదిత్య దాచిపెట్టాడు. తనెక్కడ ఒకేసారి అన్నీ వేసేసుకుని ఆత్మహత్య చేస్కుంటుందేమో అని… అలేఖ్య నిస్సహాయంగా మంచం మీద వాలిపోయింది. కళ్ళనించి ధారగా నీళ్ళు కారుతుంటే నాన్నా ఎందుకిలా చేసావు? అని అనుకుంది. తను ఇలా మానసిక రోగిలా, అదీ సెక్స్‌ సమస్య ఉన్నదానిలా తయారవడానికి నాన్నేగా కారణం… ఎంత దారుణంగా ప్రవర్తించే వాడు నాన్న తనతో… అమ్మతో? అలేఖ్యకు ఒక్కో సంఘటన గుర్తుకు రాసాగింది.

– – –

”రాయి నోట్‌బుక్‌లో రాయి…” నిన్ను బాధ పెట్టిన అవమానపరచిన సంఘటనలన్నీ నోట్‌బుక్‌లో రాయి. తర్వాత అద్దం ముందు నిలబడి చదువు ఏడుపొస్తే ఏడ్చేయి. అరవాలనిపిస్తే అరిచెయ్యి కానీ రాయడం, చదవటం మాత్రం మానకు… ఈ ఒక వారం రోజులు అద్దం ముందు నిలబడి చదువు, ఏకాంతంగా. సైకోథెరపిస్ట్‌ డాక్టర్‌ సోఫియా ఇచ్చిన హోంవర్క్‌ గుర్తుకొచ్చింది. ”నీకున్నది జబ్బు కాదు. మీ నాన్న నీతో వ్యవహరించిన తీరు వలన వచ్చిన ఒక అసహజ లైంగిక ప్రవర్తన ఇది మారుతుంది. నీ ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రతిస్పందనలు మార్చే సీబీటి థెరపీ ఇస్తాను. నువ్వు కాదు నీ సమస్యకు కారణం మీ నాన్న… ఈ సిస్టం ఓకే. దీన్ని బలంగా నమ్మాలి…” డా|| సోఫియా చెబుతున్నది.

అలేఖ్య ఒణుకుతున్న చేతులలో నోట్‌బుక్కు పెన్‌ తీస్కుని రాయసాగింది.

నాకు ఊహ తెలిసినప్పటి నించి ఇంట్లో చాలా కఠినమైన వాతావరణం ఉండేది. నియోగి బ్రాహ్మణ కుటుంబం తమది. అమ్మ ఎప్పుడూ మడి, పూజలు, వ్రతాలు ఉపవాసాల్లో మునిగి తేలేది. నాన్నా అంతే. నాన్న ప్రైవేటు స్కూలు హెడ్మాష్టరు. పొద్దున్నే గుళ్ళో పూజారిగా కూడా చేసేవాడు. పెళ్ళిళ్ళకు, పూజలకు నిశ్చితార్థాలకు జోతిష్యం చెప్పించుకోవడానికి శని పూజలు చేయించుకోడానికి జనం పోటెత్తే వాళ్ళు. తనూ అన్నయ్య ఇద్దరమే. ఇల్లెప్పుడూ వచ్చిపోయే ఊరివాళ్ళతో సందడిగా ఉండేది. కానీ తనని, అమ్మనీ మాత్రం నాన్న వీధి చావిళ్ళల్లో, ఇంటి బయటి అరుగుల మీద కూర్చోనిచ్చేవాడు కాదు. అమ్మెప్పుడూ వంటిల్లూ, పెరడూ, తోట, పూజ గదికి పరిమితమయ్యేది. ప్రతి గదికీ, ఇంటి ముఖద్వారంతో సహా పరదాలే. మగాళ్ళతో అస్సలు మాట్లాడద్దు. అందరితో తనే మాట్లాడి పంపేసేవాడు. నాన్నెందుకూ అట్టా చేసేవాడో తనకు చిన్నప్పుడు అస్సలు అర్థం అయ్యేది కాదు. ఒకసారి నాన్న ఊరెల్లి రెండు రోజులయ్యాక వచ్చాడు. తనూ అమ్మా పంజరాల్లోంచి బయటపడ్డ పక్షుల్లా ఇళ్ళముందు అమ్మలక్కలతో చేరారు. పిల్లలతో చెట్లకింద, ఇసకల్లో, వాగుల్లో ఆడుకోడం ఎంత బాగుందో, ఇంకో పక్క నాన్నొస్తే అని బెంగ. నాన్నకి చెప్పద్దని అమ్మ అన్నయ్యకు పది రూపాయల లంచం ఇచ్చింది కూడా. వాడు ‘చెబుతా… చెబుతా’ అని ఎప్పుడూ బెదిరించడమే. నాన్న ఊరికి వెళ్ళేప్పుడు అమ్మకీ తనకీ అన్నయ్యని కాపలా పెట్టి వెళ్ళేవాడు. ఆ సాయంత్రం అన్నయ్య ఆడుకోడానికెళ్ళిపోయాడు. మరునాడు వస్తాడనుకొన్న నాన్న ఆ సాయంత్రమే వచ్చేసాడు. అంతే, ఆడుకుంటున్న తనూ… అరుగుమీద మల్లెపూలు అల్లుతూ హేమలత, చాముండేశ్వరీ, సరస్వతీ, లక్ష్మీ ఆంటీలతో ముచ్చట్లలో పరవశించిపోతున్న అమ్మ నాన్నను చూసి శిలావిగ్రహాలల్లే బిగుసుకు పోయారు. మొఖాల్లో రక్తం ఇంకిపోయి కళాకాంతీ పోయిన తమిద్దర్నీ అట్టా వీధిలో చూసిన నాన్న ముఖం కోపంతో జేవురించింది. ‘లోనికి తగలడండి’ అంటూ ‘లక్ష్మణా ఎక్కడ సచ్చావురా’ అని అన్నయ్యని పిలుస్తూ లోనికెళ్లిపోయాడు. అందరూ తమని జాలితో చూస్తుంటే బలికి వెళ్ళే మేక పిల్లల్లా తనూ అమ్మా లోనికెళ్ళారు.

అమ్మకీ తనకీ తొడలమీద అట్లకాడ కాల్చి వాతలు పెట్టి కానీ నాన్న చల్లబడలేదు. అన్నకి కూడా తమను కాపల కాసే డ్యూటీ మరిచినందుకు వాత పడ్డది. మంట నొప్పితో గావు కేకలేస్తూ, నేలమీద పడి దొర్లుతున్న తనని నోట్లో చీరకొంగు దోపుకొంటూ అమ్మ పెరట్లోకి లాక్కెళ్ళి వాతల మీద వెన్నపూస పూసింది.

ఎప్పుడన్నా తను అయినా, అమ్మైనా గుమ్మంలోనో, డాబా పిట్టగోడ పక్కనో నిలబడి కనపడ్డారూ… ఇక అంతే… ”ఏంటే వాకిట్లో అట్లా భోగం ముండల్లా నిలబడ్డారూ రంకు లం…ల్లారా లోపలికి తగలడండి” అంటూ వీపు వాయగొట్టేవాడు. ఒకసారి తనూ, అన్నయా ఇద్దరం ఒకే మంచంపైన పడుకున్నాం. తను ఇంకా ఫ్రాకులు, స్కర్టులూ వేస్తున్నది. నిద్రలో తన ఫ్రాకు పైకెళ్ళిపోయింది తనకెట్టా తెలుస్తుందీ? అన్నయ్య తన కాళ్ళమీద వాడి కాళ్ళేసాడు. ఇద్దరం ఆదమరచి నిద్రపోతున్నాం ఎట్టా తెలుస్తుందీ. తెలిసినా ఆ పది, పన్నెండేళ్ళ పసిపిల్లలం తనకట్టా నాన్నకొచ్చే ఆలోచనలు ఎట్టా వస్తాయనీ… దెబ్బలు ఒంటిమీద పేలిపోతుంటే మెలకువ వచ్చింది. ఎందుకట్టా కొడుతున్నాడో నాన్న అర్థం కాక దెబ్బలు తప్పించుకోటానికి అప్పటికే చెంపలు నాన్న దెబ్బలతో ఎర్రగా కమిలిపోయి ఒణికిపోతున్న అమ్మ వెనక చేరాం తనూ అన్నయ్యాను. ”పెరుగుతున్న పిల్లలు ఎట్టా పడుకొంటున్నారో తల్లిగా చూడని నీదేం బతుకే, సిగ్గులేని పుటక పుట్టావు కాదూ?”… అని అమ్మనీ, ”అన్నయ్య పక్కకెలా పడుకుంటావే” అంటూ తన మీద మీదకొచ్చాడు. ఇక అప్పట్నించీ తనకు పాదాల దాకా పరికిణీలు, పంజాబ్‌డ్రెస్సులే… ఫ్రాకులు, స్కర్టులూ లేవిక.

మగాళ్ళతో మాట్లాడద్దు, ఆడద్దు, కన్నెత్తి చూడద్దు. ఈ మూడిట్లో ఏది చేసినా తనకి మూడిందే. అమ్మని పుట్టింటికి అస్సలు పంపడు. అమ్మ తన అన్నదమ్ములతో కూడా పక్కన కూర్చొని మాట్లాడద్దు. పుట్టింటికెళ్ళ వల్సి వస్తే తను కాపలా కాస్తాడు. ఒంటికీ రెంటికీ వెళ్ళినా బయట కాపలా కాసే నాన్నని చూసి అమ్మ చీదర పడేది. తనది అనుమానం కాదుట జాగ్రత్తట. మగలోకం మహా పాపిష్టిదట తను మమ్మల్ని రక్షించుకోవాలిట. అమ్మ ఎంత అందంగా ఉంటుందనీ… పండు నిమ్మరంగులో మెరిసిపోయే అమ్మకి ఏ చీర కట్టినా చక్కగా సరిపోయేది. ముక్కున ఎర్రని ముక్కెర… నుదుటన పెద్ద ముత్యమంత ఎర్రని సింధూరం. ఆల్చిప్పల్లాంటి కళ్ళకి కాటుక, చెవులకు తెలుపు, పచ్చ, ఎరుపు రంగు రాళ్ళ దుద్దులతో చేతినిండా రంగురంగుల గాజులతో, కాళ్ళకి మట్టెలు, మువ్వలతో మోకాలు దాటిపోయే జుట్టుతో… అమ్మ గుత్తులు గుత్తులుగా విరగబూసిన నిలువెత్తు మాలతీ పూలతీగలా ఉండేది. శుక్రవారం పూట మొఖానికి, పాదాలకి పసుపు పూసుకొని అమ్మ తిరుగుతుంటే తనూ మారాం చేసేది. తన కాళ్ళకూ పసుపు రాయమని. అమ్మ అందమే తనకీ వచ్చింది. అమ్మందంగా ఉంటే అమ్మదా తప్పు? ”అందంగా ఉన్నా అని అలా వీధుల్లో కూచుంటే వచ్చిపోయే మగ కుక్కలు వాళ్ళదెంత పొడవుందో నీకు చూపిస్తారటే జెష్టముండా… లేక నా కొడుకులు నిన్ను చూసి చొంగ కార్చాలనా చంపేస్తాను” అనేవాడు. ‘అమ్మ ఛీఛీ ఏం మాటలు అవి ఆపండి’ అని చెవులు మూస్కుంటూ ఏడిచేది. నాన్న ఉంటే అమ్మ ముఖం దీపమారిపోయిన దివ్వెలా చిన్నబోయేది. అసలంత అందమైన అమ్మని, అమ్మమ్మ తాతయ్య ఎత్తు పళ్ళతో ఉన్న నాన్నారికెట్లా ఇచ్చి పెళ్ళి చేసారసలు మనసెలా ఒప్పింది?

బళ్ళో మధ్య మధ్యలో తన క్లాసులోకొచ్చి చూడ్డం తనెక్కడ కూర్చుందో, ఎవరితో మాట్లాడుతుందో, చెక్‌ చేయడం ఇదే పని నాన్నకి. ఆడపిల్లల బడి పదిహేను మైళ్ళ దూరాన ఉంది కాబట్టి కో ఎడ్‌ బళ్ళో వేసాడు, లేకపోతే దగ్గరుంటే ఆడపిల్లల బళ్ళనే వేసేవాడు. మగపిల్లలతో మాట్లాడావో, ఆడావో… పక్కన కూర్చున్నావో జాగ్రత్త చంపేస్తా చీరేస్తా అనేవాడు. తనకు క్రమక్రమంగా భయం పెరిగి పోయింది. తల భూమిలోకి గుచ్చి నడవాలి. తలెత్తద్దు, ఎవరైనా మగపిల్లలు, మాష్టార్లు, నాన్నైనా సరే, ఏమైనా అడిగితే తలొంచుకునే సమాధానం చెప్పాలి. అసలు పాఠాల్లో సందేహాలు ఆడ టీచర్లనే అడగాలి. లేదా పక్కకి చూస్తూ చెప్పాలి. అన్నయ్య పక్కన కూడా కూర్చోవద్దు. మగపిల్లలతో మాట్లాడాలన్నా, చూడాలన్నా భయం పెరిగి పోయింది. వాళ్ళు తనతో మాట్లాడ్డానికొచ్చినా గుండెలు దడదడలాడుతుంటే పారిపోయేది. పాముని చూసినా అంత భయం కలగదేమో? ఇంటికెవరైనా వచ్చినా పామునో, సింహాన్నో చూసినట్లు భయపడి పారిపోయేది. అమ్మా అంతే, కొంగు భుజాల చుట్టూ కప్పేస్కుని, తలొంచుకుని ‘ఆయన లేరండి’ అని చెప్పి లోపలికెళ్ళిపోవాలి లేదా అన్నయ్యను పంపి మాట్లాడించాలి. పాలవాడు, కేబుల్‌వాడు, పేపరువాడు, ఈ వాడు, వీడులతో, అతనూ, ఆయనలతో అస్సలు మాట్లాడొద్దు. ”అమ్మా ఎందుకిట్టా నాన్నారు… మగాళ్ళేం చేస్తారమ్మా నిన్నూ నన్నూ? అంతా మాట్లాడుతూనే ఉన్నారుగా మగాళ్ళతో…” అని తను అమ్మని వేధించుకు తినేది… ఆ రోజు తన జీవితం మారిపోయిన రోజు. తను పూర్తిగా చచ్చిపోయిన రోజు. ఒకసారి ఎనిమిదో తరగతిలో తనకు లెక్కలు అర్థం కావట్లేదనీ, చెప్పమని నెల రోజుల నించీ బతిమిలాడుతున్న తన క్లాస్‌మేట్‌ రమాకాంత్‌కి ఆ రోజు నాన్న రాని ధైర్యంతో లెక్కలు చెబుతోంది. చెబుతున్నా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, భయపడుతున్నది. ఇంతలో నాన్నెట్టా వచ్చాడో వచ్చాడక్కడికి. తను బిక్కసచ్చిపోయింది. నాన్న ఏం చెయ్యలేదు. తనను దీర్ఘంగా చూస్తూండి పోయాడు. తను పారిపోయి వచ్చేసింది. ఇంటికొచ్చిన నాన్న విచిత్రంగా, కొట్టలేదు. ఒక్క మాటా మాట్టాడకుండా వాలు కుర్చీలో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కనీసం అమ్మని కూడా ఏమనలేదు. తన ద్వారా జరిగింది తెలుసుకున్న అమ్మ ఒణికిపోయింది. నాన్న రాకముందే తనను ఒక్కటేసింది. ‘ఏం చేస్తాడో ఏమో ఇప్పుడు నిన్నెట్టా రక్షించుకోనని’ ఏడ్చింది. కానీ నాన్న నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒణికించింది. అన్నయ్య నాన్నకి కనపడకుండా దాక్కుండి పోయాడు. ‘రమాకాంతుతో ఎందుకు మాట్లాడావే’ అని వాడు కూడా రెండు దెబ్బలు వేసాడు.

మర్నాడు, నాన్నా తనూ అన్నయ్యా బడికెళ్ళారు. ఐదు వందల మంది ముందు మైకులో నాన్న తనతో ప్రేయర్‌ చెప్పించాడు. ‘ఆల్‌ ఆర్‌ మై సిస్టర్స్‌ అండ్‌ బ్రదర్స్‌’ గొంతు ఒణుకుతుంటే అలా చెప్తూ పోయింది.

తర్వాత నాన్న రమాకాంత్‌ను పిలిచాడు. రమాకాంత్‌ నాన్న దగ్గరికి వచ్చి భయంతో బిగుసుకు పోయి నిలబడ్డాడు.

”అలేఖ్య నిన్న నీతో మాట్టాడింది కదా. పాఠం చెప్పించుకున్నావు కదా. అందరూ వెళ్ళిపోయాక… నీకు అమ్మాయిలు పాఠం చెప్పాలిరా సిగ్గుందా నీకూ? బళ్ళో ఇట్టా క్రమశిక్షణ తప్పి అబ్బాయిలతో అమ్మాయిలు మాట్టడకూడదు. ఇదే ఆఖరు. నువ్వట్లా అమ్మాయితో మాట్టాడినందుకూ, మా అమ్మాయి నీతో మాట్టాడినందుకూ, ఇంకెవరూ భవిష్యత్తులో అబ్బాయిలతో మాట్టాడకుండా, కన్నెత్తి చూడకుండా ఉండేందుకూ… ఇదిగో ఇదీ శిక్ష…” అంటూ రమాకాంత్‌ వైపు తిరిగి ”ఏదీ నీ చెప్పట్టా అందుకో” అన్నాడు. బిత్తరపోయిన రమాకాంత్‌ చెంప పగలగొట్టాడు.” అందుకోరా చెప్పూ, అని అరిచాడు.

ఒంగి చెప్పు అందుకున్న రమాకాంత్‌ను… తన వైపుకి వెళ్ళమని చెప్పి ”కొట్టు… దాన్ని చెప్పుతో చెంపమీద కొట్టు ఇంకెపుడూ అబ్బాయిల వైపు కన్నెత్తి చూడకుండా” అన్నాడు బిగుసుకుపోయి బిత్తరపోయి నిల్చున్న రమాకాంతుని మళ్ళీ చెంప మీద కొట్టాడు. దెబ్బలు భరించలేక రమాకాంత్‌ తన చెంప మీద చెప్పుతో కొట్టాడు. ‘ఇంకో చెప్ప వదిలావేంట్రా’ అని నాన్న గద్దిస్తే, ఇంకో చెంప మీద కొట్టాడు. పెదవి చిట్లి రక్తం కారి, ఐదు వందల మంది పిల్లలు, మాష్టార్లు, టీచర్లు, ఆయమ్మలు చూస్తుంటే అవమానంతో చితికి పోయి, కళ్ళు తిరిగి పడిపోయింది తను. ఎవరో అంటున్నారు ‘హెడ్మాష్టరు అంటే ఇంత స్ట్రిక్ట్‌గా ఉండాలి’ అని. అప్పుడే వచ్చి రమాకాంత్‌ను వారించబోతున్న రమా టీచర్‌ను ”మేడం మీకిక్కడ ఉద్యోగం చేయాలని లేదా” అని నాన్న బెదిరించడం వినిపిస్తూనే ఉంది. క్లాసు రూంలో రమా టీచరు ఒళ్ళో స్పృహ వచ్చింది తనకి. ”మీ నాన్న ఇంట్లో కూడా ఇంతేనా ఎప్పుడూ చెప్పలేదేం” రమా టీచరు ప్రశ్నలకి తన దగ్గర మౌనమే సమాధానం. తను సచ్చిపోయింది అంతే, నాన్న చంపేసాడు. అన్నయ్య సైకిలు మీద ఇంటికి తీస్కెళ్ళాడు. అప్పటికే ఊరంతా పాకిపోయింది. ”మరేఁ ఆడపిల్లలు రెచ్చిపోతున్నారు. తరగతి గదుల్లో ప్రేమ పాఠాలు చెఁవుతూనే, కడుపులు తెచ్చేసుకుంటున్నారు. అయినా మోహన పంతులు మరీ కఠినం సుమీ… అయినా ఇలా ఉండకపోతే రెచ్చిపోరూ… మొన్న లేచిపోలేదూ.. ఫలానా కులం పిల్ల.. ఇట్టాగే ఉండాలి…” లాంటి మాటలు ముచ్చట్లలో ఊరి జనం రాక్షసానందం పొందారు. తను నెల రోజులు తిండీ నిద్రా అన్నీ మానేసింది, ఏం జరిగిందో అర్థం కాని అయోమయం, తెలియని ఒక భయం, అవమానం, ఆందోళనతో నిద్ర పట్ట లేదు. పీడ కలలు వెంటాడాయి. అన్నయ్య పలకరించినా ఉలిక్కి పడేది. తప్పుకొని లోనకెళ్ళి పోయేది. ఆ వారం రోజులు తనతో ”మగాళ్ళతో మాట్లాడను” అని 2000 సార్లు రాయించాడు. ఏడుస్తూనే రాసింది. ఒక్కోసారి నాన్న చేష్టలు విచిత్రంగా ఉండేవి.

ఒక రోజు నాన్న స్నానం చేసి, బాత్రూం అవతలకు రాబోతున్నాడు తనటుగా వెళ్ళింది అవసరమై. అంతే ‘వెధవ ముండదానా ఆగలేవూ… ఫో అటు ఫో’ అంటూ చటుక్కున ఒంటికి దండెం మీదున్న టవల్‌ చుట్టేసుకున్నాడు. తను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

కన్న తండ్రిని కూడా మగాడిగా చూడాలా?

ఇక తనని 15 మైళ్ళు దూరాన ఉన్న ఆడపిల్లల బడిలో చేర్చించాడు. తను కూడా నాన్న హెడ్మాష్టరుగా ఉన్న కోఎడ్‌ బళ్ళోకి వెళ్ళనంటే వెళ్ళనంది. నెల రోజులు బడికి వెళ్ళలేదు. ‘రోజూ మగాళ్ళతో మాట్లాడను, చూడను, వాళ్ల పక్కన కూర్చోను’ అని రాయించడమే. రోజూ రాత్రి చూపించాలి. నాన్న సంతకం చెయ్యాలి. ఒత్తిడి… ఒత్తిడి తల పగిలిపోయే ఒత్తిడి. సచ్చిపోతే… పారిపోతే…? నాన్నా ఎందుకిట్టా చేస్తున్నావు? అంటూ వినిపించుకోని నాన్నని ప్రశ్నస్తూ దుఃఖంతో నిద్రలేని రాత్రిళ్ళు గడిపేది.

పదవ తరగతి వరకూ ఆడపిల్లల బడిలో చదువుకుంది. హమ్మయ్య ఒక్క మగ పురుగు లేదు ఇక్కడ. మాష్టార్లతో అస్సలు మాట్లాడేది కాదు, కన్నెత్తి చూసేది కాదు ఒణికి పోయేది.

ఒకసారి పదవ తరగతిలో మాష్టారు పాఠం వింటున్న తన దగ్గరికి వచ్చారు. తనని ఏదో అడుగుతున్నారు. తను భయంతో బిగుసుకు పోయింది. మాష్టారి వైపు చూడలేక తల వంచుకున్న తనను ”ఏమ్మా ఒకసారిలా మొఖం వైపు చూస్తూ మాట్లాడు తల్లి ఏం కాదు, నేనేమీ పెద్ద పులిని కాదు” అన్నాడు మాష్టారు. తను మెల్లగా మొఖం వైపు చూసే ప్రయత్నం చేసింది కానీ, చూడలేక పోయింది. తన చూపు ఆయన టక్‌ చేసుకున్న బెల్టు కిందికి వెళ్ళి ఆగింది. రెండుసార్లు అలానే అక్కడికే పోయింది చూపు. ఆయన ఖంగారు పడి వెంఠనే తన తొక్కా అంచుల్ని బయటకు తీసేసి, వదిలేసాడు తనేమన్నా జిప్పుగానీ పెట్టుకోలేదా అని భయపడిపోయి ఎందుకన్నా మంచిదని. కానీ తనకు ఆ అలవాటు ఇంకా ఎక్కువై పోయింది. మగాళ్ళలో చిన్న పిల్లలైనా సరే మాట్లాడుతుంటే… లేదా వాళ్ళు తనతో మాట్లాడుతుంటే తన చూపు వాళ్ళ పొత్తి కడుపు కిందికి వెళ్ళిపోయి ఆగిపోయేది. భయం ఖంగారు వేసి అక్కడ్నించి పారి పోయేది. వాళ్ళు కూడా ఖంగారు పడిపోతారు. గబగబా తన ముందు నుంచి వెళ్ళిపోతారు. ఏవిటో ఈ జాడ్యం. ఈ జబ్బు? పదో తరగతిలో ఒక మాష్టారు తన భార్య సుమ టీచరుకు ఈ విషయం చెప్పి ‘కొంచం నువ్వు ఆ అమ్మాయికి అలా చూడద్దని చెప్పు ఆమెకే ప్రమాదం అసలా అమ్మాయి ఎందుకలా చూస్తుందో కనుక్కో” అన్నాడు. అప్పటికీ ఇద్దరు ముగ్గురు మాష్టార్లు అదే చర్చించుకుంటున్నారు. పీటీ టీచర్‌తో సహా.

”ఏమో… నాకు తెలీదు… మా నాన్న మొగాళ్ళ మొఖం చూడద్దన్నాడు. చూస్తే చంపేస్తానన్నాడు” తను అలా ఒకసారి రమాకాంత్‌కి పాఠం చెబితే, అందరి ముందూ చెప్పుతో ఎట్టా కొట్టించాడో తను సుమ టీచరుకు చెపుతూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ”అవును నాకు భయంగా ఇబ్బందిగా అన్పిస్తుంది. అసలా అలవాటు ఏఁవిటో… నా మీద నాకే అసహ్యమేస్తున్నది. సచ్చిపోవాలని ఉంది. నాకు తెలీదు, నాకు తెలీకుండానే అలా చేస్తుంటాను. నా చూపట్టా అక్కడే ఆగిపోతుంది, కానీ మనసులో ఏ చెడ్డ ఆలోచనలుండవు. నేనట్టాంటి దాన్ని కాదు. నన్ను నమ్మండి టీచర్‌” అని టీచర్ని పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చింది. ”పొండి… లోపల్కి పొండి… గుమ్మాల్లో బోగం ముండల్లా ఎందుకే నిల్చుంటారు. మొగాళ్ళు పంచలిప్పి కాళ్ళ మధ్యన ఎంత పొడవుందో చూపిస్తారనే…” నాన్న మాటలు ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి. ఇంటి ముంగిట్లో నిల్చుంటే బోగం పనులు చేయడానికా… అంటే ఏఁవిటి? బోగం వాళ్ళు ఎవరసలు? వాళ్ళేం చేస్తారు? ఇట్టా గుమ్మాల్లో నిల్చుంటారా? మరి అందరాడాళ్ళూ గుమ్మాలో నుల్చుంటారు, అరుగుల మీద కూర్చుని ముచ్చట్లు చెఁవుతుంటారు. అంతెందుకు బళ్ళకి తమ టీచర్లు… ఆడాళ్లే మరి వెళుతూంటారు. గుళ్ళకీ… ఊర్లకీ వెళుతుంటారు. బస్సుల్లో, రైళ్ళల్లో పడి, రోడ్డెమ్మట నడుచుకుంటూ… పెళ్ళిళ్ళకీ, పూజలూ, నోములకీ పోతుంటారు. వీళ్ళంతా మరి నాన్నారన్నట్టు బోగం ముండలేనా?  అంత పచ్చిగా… నిసిగ్గుగా… అమ్మతో… చిన్న పిల్లైన తనతో ఎట్టా అనగలిగేవాడు… కాళ్ళ మధ్య ఏం చూపిస్తారని అనేవాడు నాన్న… అని చిన్నప్పుడే ఆశ్చర్యపోయేది. మొఖం వైపు, నిలువెల్లా చూసే మగాళ్ళని చూసింది కానీ… వాళ్ళ కాళ్ళ మధ్య పంచ విప్పి చూపించే మగాళ్ళనసలు ఎప్పుడూ చూడలేదు. మరి ఎందుకలా అమ్మతో నాన్నలా తరచూ అనేవాడు. అట్టా చూపించే మగాళ్ళుంటారా లోకంలో? అమ్మ అందుకే ఎప్పుడూ పెరట్లోనే కూర్చునేది. అమ్మంటే ఇష్టం ఉండే అమ్మలక్కలంతా అమ్మకోసం పెరట్లోకి, వంటింటిలోకి వచ్చి మాట్టాడి వెళ్ళేవాళ్ళు.

నాన్నారు మాట్టాడిన ఆ మాటలేనా? తనకిప్పుడు శాపమయ్యింది? మానసిక జాడ్యమైంది…?

ఇంటరు కూడా అమ్మాయిల కాలేజీనే. అక్కడా లెక్చరర్స్‌ మగవాళ్ళైతే ఇదే సమస్య… రోజు రోజుకీ ఎక్కువై పోయింది. తన నియంత్రణలోకి లేకుండా అయిపోయింది. ఆఖరికి అన్నతో మాట్టాడేటప్పుడు కూడా… ఒణికిపోయింది. కుమిలిపోయింది. అన్నవైపు చూడకుండా మట్టాడ్డం అలవాటు చేస్కుంది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. మగాళ్ళ ముందుకెళ్ళి ఎట్టా కూర్చోడం. కూర్చోకూడదు కదా… చూడకూడదు కదా… నేను రాను అని పెళ్ళి చూపులకి కూచోలేదు తను… అసలు తనకు పెళ్ళే వద్దని గొడవ, గొడవ చేసింది. డిగ్రీ పూర్తయ్యింది.

డిగ్రీ పూర్తయ్యే లోపల తనకింకో భయంకరమైన సమస్య వచ్చింది. పాఠాలు వింటున్నా, బస్సుల్లో, ట్రైయిన్లలో, పెళ్ళిలల్లో ఎక్కడికి వెళ్లినా అబ్బాయిలు ఏ వయస్సు వాళ్ళైనా తను ఉన్న చోటే ఉంటూ… మానసికంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళున్న చోటే అక్కడే చీర విప్పేసి, నఘ్నంగా అయిపోయి వాళ్ళతో ఆ క్షణాల్లోనే శృంగారంలో పాల్గొంటున్నట్లు…

నిజంగానే జరుగుతున్నట్లు తనను తాను ప్రత్యక్షంగా చూసుకొంటున్నట్లుగా అనుభూతి చెందడం మొదలయ్యింది. శృంగారంలో పూర్తి స్థాయిలో పాల్గొనే దాకా ఆ దృశ్యం కొనసాగుతుంది. తరువాత తను ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. తను ఉన్నచోటే ఒంటి నిండా బట్టలతో ఉంటుంది. తనెదురుగా ఆ సదరు పురుషుడూ అలానే ఏదో తన పనిలో తాను ఉంటాడు. కానీ తనే మానసికంగా… ఆ పని పూర్తయ్యే వరకూ ఆ వ్యక్తి వైపుకే తను కళ్ళు తిప్పుకోకండా చూస్తూనే ఉంటుంది. తన చూపులకి కొంత మంది మగాళ్ళు ఇబ్బంది పడతారు. కొంతమంది అసభ్యంగా సైగలు చేస్తారు. ఒకసారి డిగ్రీ కాలేజీ మాష్టారు చిరాకుపడి క్లాసు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకో మాష్టారు ”అంతలా తినేసాలా చూడకపోతే రాత్రి ఎక్కడైనా కలుద్దాం వీలైనప్పుడల్లా రారాదు” అన్నాడు. సిగ్గుతో చితికిపోయింది. అన్నయ్యపై చదువులకి ఢిల్లీ వెళ్ళిపోయాడు. నాన్న రిటైరై పోయాడు. ముసలైపోయాడు. కోపం, అమ్మని తననీ కాపలా కాయడం బాగా తగ్గిపోయింది. కానీ ఏం లాభం? అమ్మ జీవితం ఎట్టాగూ నాశనం అయ్యింది తన జీవితంతో పాటు.

– – –

”నాన్నా నేను పెళ్ళి చేస్కోను” తను చెప్పేసింది నాన్నతో. ”ఏం ఎందుకనీ అందరూ చేసుకోవట్లా నీకేం రోగం…” నాన్న మండిపడ్డారు. ”భయం నాన్న భయం. మగవాడంటే భయం. ఏ మగవాణ్నీ చిన్నప్పట్నించీ కన్నెత్తి చూడద్దనీ, మాట్టాడద్దనీ, పక్కన కూడా కూర్చోవద్దనీ, నీ పక్కన, అన్నయ్య పక్కన కూడా అని పెంచావో, మగాడితో మాట్టాడినందుకు, ఇంకో మగాడితో చెప్పులతోనే మొఖం మీద ఎట్టా కొట్టించావో గుర్తు లేదా నాన్నా? ప్రేమతో నిన్నెప్పుడూ ముట్టుకోలేదు నాన్నా. నువ్వెప్పుడన్నా ముట్టావా నాన్నా నన్ను? అందరు అమ్మాయిలూ నాన్నల వీపుల మీద ఆటలు ఆడుతుంటే, ఆ పసి వయసులో కూడా నన్ను ఆడదానిలా చూసావు కదా నాన్నా…. నాకసలు మగాడితో పెళ్ళే చేయవు అనుకున్నాను. నాకొద్దు నాన్నా పెళ్ళే వద్దు నాకు. మగాడంటే భయం, ఒణుకు నాన్నా ఒద్దు” ఏడుస్తూ చెప్పేసింది నాన్నకి. నిర్ఘాంతపోయాడు నాన్న, అమ్మ వలవలా ఏడ్చేసింది.

తర్వాత నాన్న చాలా మారిపోయాడు. ఉండుండి కళ్ళు తుడుచుకునేవాడు మౌనంగా తన గదిలో ముడుచుకు పడుకునేవాడు.

 

ఒక రోజు అమ్మ తరఫు బంధువులు ఇంటికొచ్చారు. మీ అమ్మాయిని మా అబ్బాయి ఆదిత్యకు చేస్కుంటామని.

ఇక అప్పట్నించీ నాన్నలో కదలిక మొదలయ్యింది. ”అందరూ నాన్నారిలా ఉండరే చాలా మంచివాళ్ళు  పెళ్ళాలని కట్టడి చెయ్యని మగాళ్ళు ఉంటారు అలేఖ్య… ఒప్పుకోమ్మా పిల్లాడు చాలా మంచాట్ట…” అమ్మ కళ్ళ నీళ్ళెట్టుకుంటూ బఁతిమిలాడింది.

తను ఎప్పటిలాగే… ”అమ్మా ఇప్పటి దాకా ఒక్క మగాడితో ఒక రెండు నినిషాలు మాట్లాడలేదు. భయం ఒణుకూ కమ్మేస్తాయి. ఎట్టా చేస్కోవడం. రోజూ ఒక మగాడితో ఎట్టా కలిసి ఉంటం. అమ్మా నాతో కాదు… అమ్మా… అమ్మా… నీకో సంగతి చెప్పాలి. నాకు మగాళ్ళను చూస్తే ఏం అనిపిస్తుందో… ఎట్టాంటి ఆలోచనలు వస్తాయో” అని పదవ తరగతి మాష్టారి దగ్గర్నించీ అన్నయ్యా, నాన్నారి మీదుగా డిగ్రీ దాకా నాకు ఎదురయిన మగాళ్ళతో నాకెట్టాంటెట్టాంటి ఆలోచనలు వచ్చేవో చెప్పాను. పొద్దు వాలుతున్న సమయంలో పూజగదిలో అమ్మకి అన్ని చెప్పాను ”అమ్మా… నాన్నారు… అన్నయ్యతో కూడా అట్టాంటి ఆలోచనలు… నేను బతకను అమ్మా సచ్చిపోతాను. అంతెందుకమ్మా… అదిగో ఆ దేవుడి పటంలో మగదేవుణ్ణి చూసినా అట్టాంటి ఆలోచనలు వస్తాయి. నేను బతకనే అమ్మా… బతకను… అమ్మ అలా చూడకు… నేను చెడ్డదాన్ని కాదమ్మా… కానే కాదు… నన్ను నమ్ము” పూజగదిలో అమ్మ తెలివి తప్పి పడి పోయింది.

– – –

నెల రోజుల తర్వాత తనని చేసుకుంటానని వచ్చిన ఆదిత్య అమ్మ నాన్నలు మళ్ళీ వచ్చారు. ”అమ్మాయి చాలా నచ్చింది మావాడికి కూడా, తననే చేస్కుంటానంటున్నాడు” అని ”ఇంకో నెలలో మంచి ముహుర్తాలున్నాయి తరువాత లేవు చూడండి అయినా అమ్మాయి ఎందుకు చేస్కోనంటుందీ” అని అడిగారు వాళ్లు ”పీజీ చేస్తానంటున్నది” నాన్న పొడిగా గొంతు తడారి పోతుంటే అన్నాడు. ”హయ్యోఁ దీనికేనా పెళ్ళయ్యాక మేఁవు చదివిస్తావండీ అబ్బాయీ అదే చెప్పమన్నాడు’ అంది ఆదిత్య తల్లి.

”నాకెందుకీ శిక్ష… చేసుకో తల్లీ నా తరువాత నిన్నెవరు చూస్తారు చెప్పు” ఎన్నడూ నాన్నంత సౌమ్యంగా మాట్లాడలేదు నాతో. తను నాన్నవైపు వింతగా చూసింది. ”నువ్వెట్టా చూస్కున్నావు నాన్నా నన్ను..” అంది. నాన్న చటుక్కున కళ్ళు దించుకున్నాడు. తర్వాత ‘సరే… చేసుకోనంటావు అంతేగా’ అంటూ అక్కడే గూట్లో ఉన్న మొక్కలకు కొట్టే పురుగు మందుని అందుకొని ఆసాంతం గటగటా తాగేసి విరుచుకు పడిపోయాడు.

– – –

నాన్న మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నాక డిశ్చార్చి అయ్యాడు. ఊర్నించి నాన్నను చూట్టానికి సుమనత్తయ్య వచ్చింది.

 

ఆ రాత్రి అత్త తనను దగ్గర తీస్కుంది. ”నాన్న ఊరందరికీ, మన చుట్టాలకీ చాలా మంచోడు కదత్తయ్యా, మరి మమ్మల్నెందుకు ఇట్టా నరకయాతన పెట్టాడు?” తను సుమనత్తయ్యను అడిగింది. సుమనత్తయ్య తన కళ్ళల్లోకి దీర్ఘంగా చూసింది.

”మీ తాతయ్య చాలా దుర్మార్గుడు. మా అమ్మ చాలా అందగత్తె. చాలా మంచిది. పదిహేనేళ్ళకే మా అమ్మకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయసున్న మా నాన్నతో పెళ్ళైంది. నేనూ, మీ నాన్న వర్సగా పుట్టాం. మా నాన్న అంటే, మీ తాతాయ్య కొంచెం పొట్టి అయినా మంచి కళ ఉండేది మొఖంలో. మా అమ్మ మాత్రం మీ అమ్మలా అందంగా ఉండేది. మా నాన్న ఎప్పుడూ అమ్మను కొడుతుండేవాడు. తాగుడు అలవాటుంది. బయట ఆడవాళ్ళతో సంబంధాలుండేవి. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నాన్నెప్పుడొస్తాడో… తెలీదు. అమ్మనీ, నన్ను, మీ నాన్ననీ చితక్కొట్టేవాడు. అమ్మనైతే చాలా హింసించేవాడు. ఊరి పంతులెవడో చెప్పాట్ట కాళ్ళ మీద వెంట్రుకలున్న ఆడదానికి కామం ఎక్కువనీ, తిరుగుబోతూ వేశ్యా అవుతుందనీ, కావలిస్తే పెద్ద బాలశిక్ష పుస్తకంలో కూడా ఉంది చూడమనీ, జాగ్రత్తగా కాపలా కాచుకోవాలనీను. మా అమ్మకు కాళ్ళమీద పాదల చీలమండల మీద నించీ, మోకాళ్ళ దాకా నల్లగా వెంట్రుకలు కొద్దిగా ఎక్కువగా ఉండేవి. మా నాన్న అనుమానించడం అక్కడ్నించే మొదలయ్యింది. ”ఎట్టా పుట్టావే అట్టా” అని అమ్మని కొట్టేవాడు. అమ్మ భరించలేక ఏడిచేది. ”ఎవరు… ఎక్కడ చెప్పారు? రాముడు చెప్పాడా… భగవత్‌గీతలో ఉందా చెప్పు?” అని అడిగేది. ”శ్రీరాముడు చెప్పటం కాదు, గీతా కాదు, చిన్న పిల్లల పెద్ద బాల శిక్షలోనే ఉంది కావలిస్తే చూడు” అని పెద్ద బాలశిక్ష అమ్మ ముఖం మీదికి విసిరేసాడు. నిజఁవే సుమీ పెద్ద బాలశిక్షలో చూద్దును కదా… ”ఒంటి మీద వెంట్రుకలున్న ఆడదానికి కామం ఎక్కువ” అనే ఉంది. చిన్న పిల్లలు చదివే పుస్తకంలో ఈ అప్రాచ్యపు రాతలు రాయడానికి సంస్కారఁవెలా ఒప్పిందీ ఆ రాసిన పెద్ద మనుషులకీ… అసలు ఆ రాతలు రాసింది ఆడా… మగా… ఎవరు? అమ్మ ఆ పుస్తకంలో అది చదివి కుమిలిపోయింది. ఏ గురువు రాసిన రాతలు ఇవి అనుకుంటూ… నిజం కావని తల బాదుకొని ఏడ్చింది. ఇక అమ్మ ఇంటి పనంతా అయిపోయాక ఏం చేసేదో తెలుసా అలేఖ్య తల్లీ… మాణిక్యం నువ్వూ విను మా అమ్మేం చేసేదంటే.. బండమీద సీసపు పెంకులు మెత్తగా నూరి దానికింత మైదా రాసి, ఆ మూద్దను పాదాల చీలమండల నుంచీ మోకాళ్ళ దాకా రాస్కుని… సంక్రాంతికి ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు కట్టే దారఁవుంటుంది చూడూ, ఆ దారానికీ ఈ సీసపు ముద్ద రాసి కాళ్ళ మీద వెంట్రుకలున్నంత మేరా కత్తితో చెక్కినట్లు చెక్కేసుకునేది… నొప్పి మంటా పుట్టేవేఁమో.. పళ్ళు బిగిస్తూ… అమ్మా అని ఏడుపు ఆపుకుంటూ ఆ పని చేసేది. ఒక్కోసారి రక్తం కూడా వచ్చేది. దారంతో వెంట్రుకలు పోకపోతే కూరగాయల కత్తితో తీసేది. ఆ పనంతా అయ్యాక అమ్మ కాళ్ళు ఎట్టా ఉండేవో తెలుసా అలేఖ్య తల్లీ… కసాయివాడు మేక చర్మం వలిచాక ఎర్రగా రక్తంతో మెరుస్తూ జీవం సచ్చిన మేక మాంసంలా ఉండేది. మంట తగ్గడానికి అమ్మ మోకాళ్ళ దాకా వెన్న పూస రాస్కునేదేమో, ఎర్రగా, నున్నగా మెరిసిపోతూ అమ్మ కాళ్ళు భయపెట్టేవి. ”అమ్మా ఎందుకట్టా కోసుకుంటున్నావు ఒద్దమ్మా నాన్నట్టా అంటే… అననీ అమ్మా పట్టించుకోబాకే” అంటూ నేను వలవలా ఏడుస్తూ అమ్మను బతిమిలాడేదాన్ని. చేతులు పట్టి లాగేదాన్ని. ఆ దారాలు నా చేతుల్ని కూడా కోసేవి ఆ పెనుగులాటలో. అమ్మ ఏడుస్తూనే ”నువ్వు ఫో ఇక్కడ్నించి” అని నన్ను పెరట్లోంచి ఇంట్లోకి తీస్కెళ్ళి వంటింటి తలుపేసి మళ్ళా ఆ నరకంలో పడేది. నెలకోసారన్నా అమ్మ అట్టా కాళ్ళ మీద వెంట్రుకలు సీసపు దారంతో తెగ్గోసుకునేది. నొప్పితో వారం దాకా మౌనంగా ఏడ్చేది. మధ్య, మధ్యలో నా కాళ్ళు కూడా తడుముతూ పరీక్షగా చూసేది. మా నాన్న అట్టాంటి మూఢనమ్మకాలతో ఉండేవాడు. మీ నాన్న కూడా అంతే కదూ… మీ అదృష్టాలు నీకూ మీ అమ్మకూ కాళ్ళ మీద వెంట్రుకలు లేవు కామోసు” అంది సుమనత్తయ్య. ‘లేదు ఒదినా నాకున్నాయి… అలేఖ్యకు లేవు’ అమ్మ తన కాళ్ళ మీద చీర మోకాళ్ళ దాకా పైకి లేపి చూపించింది. ఎప్పట్నించో దాచుకుంటున్న రహస్యాన్ని తొలిసారిగా చెప్పాల్సి వస్తున్నప్పటి ఉద్వేగం, భయం అమ్మ మొఖంలో కనిపించింది. మబ్బుల వెనక దాక్కున్న చందమామ ఇక తప్పదన్నట్లు చటుక్కున బయటకు వచ్చినప్పటి వెలుగులో ఒక్క క్షణం అమ్మ మొఖం వెలిగింది. ఆ వెలుగు ఎలా ఉందంటే ఒక నిజం సాక్షాత్కారంలాగా కానీ వెంటనే మబ్బులు మళ్ళీ కమ్మేసినట్లు అమ్మ మొఖంలో కాంతి తగ్గిపోయి ముడుచుకుపోయింది. అమ్మ కాళ్ళ మీద కూడా నల్లని వెంట్రుకలు, కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. అందుకేనా నాన్న ఇట్టా అమ్మని అనుమానిస్తాడు? మరి తనకు లేవుగా తనను కూడా ఎందుకు..? సుమనత్తయ్య అమ్మ కాళ్ళ వైపు చూస్తూ ఆశ్చర్యపోయింది. ”ఇదన్నమాట… ఇందుకన్న మాట… మీ నాన్న అమ్మని వేధించటం, అనుమానంతో కొట్టి చంపటం, సరే ఇక మీ తాతయ్య అంటే మా నాన్న సంగతి వినండి ఎంత హింసించేవాడో మా అమ్మని తాతయ్య? వాతలు పెట్టేవాడు. మాముందే చల్లని చలికాలం చీరవిప్పి వజ వజ వణికే చలి గాలిలో పెరట్లో నిలబెట్టేవాడు. అమ్మ చలి భరించలేక ఏడుస్తూ తలుపు తియ్యమని బతిమిలాడేది. చీకటి మిద్దెలో బంధించి రెండు మూడు రోజులు అన్నం నీళ్ళు ఇచ్చేవాడు కాదు. ఒక రోజు పెద్ద జీతగాడు శీనయ్య అమ్మకిమ్మని లేకపోతే సచ్చిపోతుందనీ నా చేతికి రెండు మావిడి పళ్ళు ఇచ్చాడు. అమ్మ ‘ఆకలి దాహం’ అని ఏడుస్తున్నా అమ్మకి మమ్మల్ని ఏమీ ఇవ్వనిచ్చేవారు కాదు నాన్న. ఎట్టా మిద్దెలోకి ఆ పళ్ళు చేరనివ్వాలో నాకు తెలీక నేను అల్లాడుతుంటే, మిద్దె కిటికీ ఊచలు విరగొట్టి పండ్లు, నీళ్ళ సీసా అందులోకి జారవిడుస్తున్న శీనయ్యని అప్పుడే వచ్చిన నాన్న చూసాడు. అంతే నాన్న కొట్టిన దెబ్బలతో దేహమంతా గాయాలతో రక్తాలు కారుతుంటే అమ్మ స్పృహ తప్పిపోయింది. శీనయ్య ”సచ్చిపోతారండి అమ్మగారు… కొట్టబాకండి” అని అడ్డమొచ్చిన శీనయ్యకీ అదే గతి పట్టింది. రెండు రోజుల తర్వాత మా అమ్మ శీనయ్యతో పారిపోయింది. మాకు అమ్మ లేకుండా అయిపోయింది. తర్వాత మా నాన్న అమ్మ తను పెట్టే చిత్రహింసల వలన మనసు విరిగి పారిపోయింది అని చెప్పకుండా శీనయ్యతో లేచిపోయింది అని ప్రచారం చేసాడు. తమ్ముడికీ, అదే మీ నాన్నకీ అదే నూరిపోసి ”అందుకే అంత కట్టడి చేసాను మీ అమ్మనీ. ఈ ఆడముండల్ని మగాళ్ళతో లేచిపోకుండా చూట్టమే మన పనిరా గుర్తెట్టుకో. ఒరేయ్‌ మోహనా కాళ్ళ మీద వెంట్రుకలున్న ఆడదాన్ని నమ్మకూడదరోయ్‌… ఇదిగో ఒళ్ళు కొవ్వెక్కి ఇట్టా లేచిపోతారు, జాగ్రొత్తొరేయ్‌” అని చెప్పేవాడు. ”ఏం కాదు నువ్వు కొట్టే దెబ్బలకే అమ్మ పారిపోయింది” అని నేను అరిస్తే నా చెంపలు పగలగొట్టేవాడు. అలేఖ్యా తల్లీ నేను కూడా నీలాగే పంజరంలో చిలకలాగే పెరిగానే పెళ్ళయ్యేదాకా నన్నూ గడపదాటనివ్వలేదు మీ తాతయ్య… కానీ తమ్ముడు మాత్రం అచ్చం మీ తాతయ్యలాగే తయారయ్యాడు. మీ అమ్మనెంత నరక బాధ పెడతాడో నాకు తెలీకనా… ఎన్నిసార్లు చెప్పానో అలా కొట్టబాకురా కట్టడి చేయబాకురా అని. అమ్మెంత నరకం అనుభవించిందో నువ్వు చూళ్ళేదా” అని. కానీ వాడి మీద మా నాన్న ప్రభావమే చాలా ఉంది ”అది కాదే అక్కాయ్‌ దానికి అదే మాణిక్యానికి కూడా అమ్మకున్నట్టే కాళ్ళమీద వెంట్రికలు ఎక్కువగా ఉన్నాయే… అమ్మ శీనయ్యతో లేచిపోయినట్లు ఇదీ లేచిపోతే నా పరువేం కానూ… మనింట్లో ఆడాలిట్టా లేచిపోతారు… మగాళ్ళు పనికి రాని సన్నాసులు కామోసు అని ఊరంతా మొఖాన ఉమ్మితే నేనే బాఁవి చూసుకోనే మునిగి చావటానికీ అంటాడే మీ నాన్నా” సుమనత్తయ్య అంది. ”మీ నాన్నకెంత చెప్పినా వినేవాడు కాదే అలేఖ్య తల్లీ, అమ్మనట్టా లేచిపోయింది అనబాకుర మోహనా… అమ్మ కాళ్ళ మీద వెంట్రకలుంటం మూలాన్న అట్టా శీనయ్యతో వెళ్ళిపోలేదు రా… నాన్నారు పెట్టే చిత్రహింసలకి ఓపలేక అట్టా వెళ్ళిపోయింది. అంతే శీనయ్య మీద మోజుపడి మాత్రం కాదు. నువ్వు కూడా మాణిక్యాన్ని అట్టాగే హింసిస్తే అది కూడా బాధలు బరించలేక అమ్మలాగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది జాగ్రత్త అని కూడా చెప్పానే తల్లీ అయినా మీ నాన్న వింటేగా? ఏమైనా మీ అమ్మకి చాలా ఓపికే తల్లీ… సుమనత్తయ్య అమ్మ తల నిమురుతూ ప్రేమగా అంది. ”నాన్నమ్మ నిజంగా శీనయ్యతో వెళ్ళిపోయి పెళ్ళి చేస్కుందా అత్తయ్యా?” తను అడిగింది. ”వెళ్ళిపోతే ఏం అలేఖ్య తల్లీ… మా నాన్న కొట్టిన దెబ్బలకి శీనయ్య మందులిప్పించాడు అమ్మ కోలుకుంది. శీనయ్య దగ్గరే ఉండిపోవాలని అనిపించిందేమో… రోజూ దెబ్బలూ, తిట్లు, వాతలు, అన్నం పెట్టకుండా మాడ్చడం, చలిలో బట్టలు లేండా నిలబెట్టడం, కుక్కని కట్టేసినట్లు చీకటి మిద్దెలో కట్టెయ్యడం ఇవన్నీ అనుభవించిన మా అమ్మ తనని మనిషిలా గౌరవించిన శీనయ్యతో ఉండిపోతే తప్పేవిఁటి. పండు వెన్నెల్లో ఆ అర్ధరాత్రి… అమ్మ, శీనయ్యతో బండిమీద వెళ్ళిపోతుంటే… నేను ఆపలేదు తెలుసా, ఏడవలేదు కూడా పైగా సంతోషం వేసింది తెల్సా? ఏం మాణిక్యం నువ్వు చెప్పు” అంది సుమనత్తయ్య అమ్మ వైపు చూస్తూ.. ”అస్సలు అస్సలు తప్పేలేదు అత్తయ్య చేసిన పని చాలా మంచిది” ఒణుకుతున్న కంఠంతో కిటికీలోంచి కనిపిస్తున్న చందమామ వైపు చూస్తూ అంది అమ్మ గాజు కళ్ళలో నిండా నిండిపోయిన కన్నీళ్లు మెరుస్తుంటే.. ”మరి అమ్మా నువ్వెందుకే నానమ్మ లాగా వెళ్ళిపోలేదు” తను కోపంగా అడిగింది. అమ్మ చటుక్కున తన వైపుకి తల తిప్పి కళ్ళ నీళ్ళు చంపలపైకి తెర్లిపోతుంటే… ‘నీకోసం’ అంది అంత దుఃఖంలోనూ మెత్తగా నవ్వుతూ… ఆ పండు వెన్నెల్లో కన్నీళ్ళతో తడిసిపోయిన అమ్మ సమాధానం విని తనకు ఏడుపొచ్చేసింది. అత్తయ్యా… మరి మాఁవయ్య మంచోడేనా నిన్ను బాగా చూసుకుంటాడా? లేక తాతయ్యలాగా, మా నాన్నారిలాగానా? తను సుమనత్తయ్యను అడిగింది. ”అబ్బేఁ మీ మామయ్య మంచివాడేనే… అట్టాంటి వేషాలేం లేవు మా అమ్మ దీవెనల వలన” అంది అత్తయ్య చిన్నగా నవ్వుతూ. ”మరి నాన్నమ్మను కలిసావా సుమనత్తయ్యా ఎపుడన్నా” అన్న తన ప్రశ్నకి సుమనత్తయ్య మౌనంగా ఉండిపోయింది. కళ్ళ నిండుకు నీరు చేరింది. అర చేతులతో కళ్ళ పక్కలకంటా తుడుచుకుంటూ… ఊఁ చూసాను. ఇంట్లోంచి వెళ్ళిపోయిన రెండేళ్ళ తర్వాత ఏదో పెళ్ళికి వెళితే అక్కడ… అమ్మ కడుపుతో ఉంది. మునుపటి కంటే ఆరోగ్యంగా, ఇంకా అందంగా ఉంది. నన్ను చూసింది. నేను సంతోషంతో అమ్మని కౌగలించుకున్నా. ఇద్దరం కరువు తీరా ఏడ్చుకున్నాం అమ్మ నా ఒళ్ళంతా పుణుకుతూ ముద్దులు కురిపించింది. ”ఎట్టా ఉన్నావు బంగారూ, మోహనుడెట్టా ఉన్నాడు? తింటున్నారా ఎవరు వంట చేస్తున్నారు… నువ్వేనా” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతలో మీ నాన్న వచ్చి నన్ను మా అమ్మ నించి విడిపించి… ఛీ వదులు దాన్ని పాపిష్టిదానా అంటూ అమ్మని తిడుతూ నన్న పందిట్లోంచి లాక్కెళ్ళాడు. అదే చూట్టం కడసారిగా మా అమ్మని” సుమనత్తయ్య దీర్ఘంగా నిట్టూర్చింది. తర్వాత సుమనత్తయ్య మెల్లగా… ‘అలేఖ్యా… అందరూ  తాతయ్యలాగా మీ నాన్న లాగా ఉండరే… ఆదిత్య చాలా మంచోడంటనే, ఆదిత్య వాళ్ళమ్మా నాన్నా కూడా మంచి చదువూ సంస్కారం ఉన్న వాళ్ళేనంట. నా మాటిని ఆదిత్యను పెళ్ళి చేస్కోవే అమ్మా… పీజీ కూడా నీకిష్టమైనట్లే చేయిస్తారట నీతో పెళ్ళాయ్యాక” తన వీపుని పుణుకుతూ సుమనత్తయ్య మాట్లాడుతుంటే అమ్మ కూడా… తనవైపు అభ్యర్థనగా చూసింది.

– – –

ఆదిత్యతో తన పెళ్ళై పోయింది.

తొలి రాత్రి మాత్రం సంవత్సరం అయినా కాలేదు.

మగాడన్నా, శృంగారం అన్న భయం ఇంకా పోలేదు.

పెళ్ళిలో అంత మంది మగాళ్ళ మధ్య చిగురుటాకులా ఒణికిపోయింది.

మామగారి వైపు, మరిది వైపు చూస్తూ మాట్లాడలేదు. ఆదిత్యను పూర్తిగా ఎప్పుడూ చూడదు. తాకనివ్వదు.

కానీ ఆదిత్యది చాలా మంచి మనసు అత్త చెప్పినట్లే.

చాలా ఓపిగ్గా తనతో స్నేహం చేసాడు. సెక్స్‌ వద్దు అని తనంటే… ముట్టనే లేదు. ఎందుకని మాత్రం అడిగాడు. ”భయం అంతే… నొప్పి, రక్తం వస్తుందేమోననీ” అని అబద్దం చెప్పింది. చాలా కౌన్సిలింగ్‌ ఇచ్చాడు. అయినా తను అతనితో శృంగారానికి సిద్దం కాలేదు. మామయ్యతో, మరిదితో అస్సలు మాట్లాడదు. వాళ్ళెదురుగా వెళ్ళటం, కల్సి భోజనం చెయ్యడం చెయ్యదు గాక చెయ్యదు.

తనను ఒక మగ సెక్సాలజిస్టు దగ్గర్కి తీస్కెళ్ళాడు. ”వయస్సులో ఉన్న కుర్రాడు ఎంత కాలం ఆగుతాడు. ఇదిగో ఈ జెల్‌తో నొప్పి తెలీదు” అని ఏవో జెల్స్‌ రాసిచ్చాడు. ఊహూఁ పని చేయలేదు. అసలు తను ఒప్పకోలేదు.

ఆఖరికి సైకియాట్రిస్టులు అయ్యారు. ఒకాయని నిద్రమాత్రలు రాసిచ్చాడు. నిద్రలో అయితే నొప్పి తెలవదనీ, తెలిసినా మత్తులో పడి ఉండి ప్రతిఘటించననీ, తర్వాత మెల్లగా అదే అలవాటవుతుందనీ, కానీ ఆదిత్య ఆయన మీద విరుచుకుపడ్డాడు ”అంటే నా భార్యను మత్తు మందిచ్చి ఆమె నిస్సత్తువలో మునిగిపోయాక ఆమెని రేప్‌ చేయమంటారా? రేపిస్ట్‌ని కమ్మంటారా నన్ను? సిగ్గులేదా మీకు ఆ మాటలు అనడానికీ” అని ప్రిస్‌క్రిప్ష్‌న్‌ పరపర చింపేసి డాక్టర్‌ టేబుల్‌ మీదకు విసిరేశాడు.

– – –

”నేనంటే ఎందుకంత భయం అమ్మాయీ నీ తండ్రిలాంటి వాడిని కదా” అని మామయ్య ఎన్నోసార్లు బాధపడ్డాడు.

 

”మాఁవయ్యగారితో.. అంత తలవొంచుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముంది?” అని అత్తగారు కూడా బాధపడింది. ”ఆదిత్య తమ్ముడు నిఖిల్‌ నీకంటే చిన్నవాడు. వాడంటే అంత భయం దేనికి. తల్లి వరస అవుతావు. ఏంటమ్మా నీ సమస్య” అత్తగారొక రోజు నిలదీసారు. చెప్పలేకపోయింది. ఎట్టా చెబుతుందని? మెల్లగా ఆదిత్య ఎంత మంచివాడో అర్థం అయ్యేకొద్దీ తనలో పశ్చాత్తాప భావన పెరిగిపోసాగింది. రాత్రిళ్ళు నిద్రపట్టక, తనని బాధపెట్టలేక మెల్లగా తాగుడికి అలవాటు పడ్డాడు. అత్త మామలకీ, అమ్మా నాన్నలకీ ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు రాత్రి తను తన జీవితమంతా అతను ముందు విప్పి చెప్పింది. తన మానసిక సమస్యతో సహా… ఏడుస్తూ ఒణికిపోతూ… భయపడిపోతూ చెప్పేసింది.

ఆదిత్య ముఖంలో మారుతున్న రంగుల్ని చూడలేక కళ్ళు మూస్కుని నిద్ర నటించింది.

ఆ రాత్రంతా ఆదిత్య తాగుతూ నిద్ర లేకుండా గడిపాడు. తను ఏడుస్తూ గడిపింది. తెల్లారుతుండగా ఆదిత్య తన దగ్గరకు వచ్చాడు.

తన పక్కన పడుకుని తన తల నిమురుతూ ఉండిపోయాడు. మెల్లగా తన వైపుకి తిప్పుకుని గుండెలమీద పడుకోబెట్టుకుని నుదిటిపై ముద్దు పెట్టాడు.

– – –

”మనం విడాకులు తీసుకుందాం నీకు నాతో సుఖం లేదు. నా వల్ల నీ జీవితం నాశనం కావద్దు” మరునాడు తను చాలా స్పష్టంగా చెప్పేసింది ఆదిత్యకు.

”కానీ నాకు జీవించడానికి నువ్వే కావాలి ఎలా” నవ్వుతూ అన్నాడు ఆదిత్య. సైకియాట్రిస్టు దగ్గరకు వెళదాం, తగ్గుతుంది” అన్నాడు ఆదిత్య.

ఆదిత్య తన కోసం విశాఖపట్నానికి ట్రాన్సఫర్‌ చేయించుకున్నాడు. తమ్ముడు, అమ్మ నాన్నల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తను నలిగిపోతున్నది అని.

ఇద్దరూ కలిసి సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్ళారు. ఒకళ్ళు కాదు నలుగురు. ఒకాయన తనకు సెక్స్‌ కోరికలు ఎక్కువగా ఉన్నాయని ‘నింఫోమానియా’ అని రాసి మందులు  రాస్తాడు.

ఇంకో డాక్టరు ఆదిత్యనే తప్పు పడతాడు ‘నీకు నీ భార్యని ఆనందంగా పెట్టే కళ తెలీదు నేర్చుకో’ అని అతనికేవో మందులు రాస్తాడు. మరో డాక్టరు తనను భ్రమాన్వితగా ముద్ర వేసి ఈలిజితిరీరిళిదీబిజి ఈరిరీళిజీఖిలిజీ అని తన రోగం పేరు నిర్ధారించి రోజూ గుప్పెడు మాత్రలు రాస్తాడు. ఊహుఁ తగ్గటం లేదు. నిద్ర… ఒఠ్ఠి నిద్ర… గంటలు గంటలు నిద్ర, తినడం, నిద్రపోవడం. మెలకువ వస్తే తన పరిస్థితికి, ఆదిత్య జీవితం నాశనమయ్యిందనే కుమిలి ఏడవడం.

 

ఆఖరికి… ఒక డాక్టరు దొరికింది. ఆగిపోయే ఊపిరికి, శ్వాస దొరికినట్లుగా. ఈ సమస్యకు, లక్షణాలకు మూల కారణాలు ఒంటిమీద వెంట్రుకలతో ఆడదాన్ని గుణాన్ని అంచనా వేసే మూఢ విశ్వాసాలు రచించిన పుచ్చిపోయిన రుషులది అనీ, అలాగే నాన్న చేసిన విపరీతమైన కట్టడి అని, స్త్రీని ఆ విధంగా కట్టడి చేయనిచ్చే సిస్టంది అనీ చెప్పింది. ముందు తప్పు తనది కాదు. కాబట్టి పశ్ఛాత్తాపడద్దు అని చెబుతూ కౌన్సిలింగ్‌ మొదలు పెట్టింది. కొద్దిగా శాంత్వన దొరికింది. పూర్తిగా తగ్గితే బాగుణ్ణు.

– – –

తగ్గితే బాగుణ్ణు తగ్గిపోతే బాగుణ్ణు. తను అందరిలా సహజంగా ఆనందంగా ఉండాలి. మగాళ్ళతో స్వేచ్ఛగా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మాట్లాడాలి. తను ఆదిత్యని సంతోషంగా ఉంచాలి. తగ్గితే బాగుణ్ణు తగ్గితే బాగుణ్ణు… పూర్తిగా.

అలేఖ్య డ్రెస్సింగ్‌ టేబుల్‌ అద్దం ముందు కూర్చోని డైరీలో తను రాసినదంతా చదువుతూ, ఏడుస్తూ… మధ్య మధ్యలో ఆగ్రహంగా అరుస్తూ పుస్తకం విసిరికొట్టి మళ్ళీ అందుకొని చదువుతూ ఉంది. ముఖం కళ్ళూ ఎర్రబడిపోయి చెంపలు పాత కన్నీళ్ళతో ఉప్పుబారి… కొత్త కన్నీళ్ళతో తడిసిపోతూ… ఎక్కిళ్ళు పెడుతూ విపరీతమైన తలనొప్పితో తల పట్టుకొంటూ… చదువుతూనే ఉంది.

ఈ లోపల వచ్చిన ఆదిత్య తనను పొదివి పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు.

– – –

డాక్టరు ఇచ్చిన వారం రోజుల హోంవరక్కు తరువాత డాక్టరు దగ్గరికి వెళ్ళింది తను. ఏదో శాంత్వన దొరుకుతున్నది… బాధ, పశ్చాత్తాపం తగ్గుతున్నది. అలా నెల రోజులు వెళ్ళింది. మగాళ్ళ వైపుకి చూస్తూ మాట్లాడగలుగుతున్నది. వాళ్ళ గురించి వచ్చే చెడు ఆలోచనలను కట్టడి చేసుకోగలుగుతున్నది. కౌన్సిలింగ్‌ జరుగుతుండగానే ”ఈ పుస్తకం చదువమ్మా… ఇదయ్యాక ఇంకో పుస్తకం ఇస్తాను” అని కొన్ని పుస్తకాలు ఇచ్చింది. ”మనం చాలా భ్రమల్లో బతుకుతాం ఈ సిస్టం మనల్ని అలాంటి భ్రమల్లోకి నెడుతుంది. మనల్ని స్త్రీలను చాలా వీక్‌ చేసి పడేస్తుంది. మనం తప్పు చేయక పోయినా మన తప్పే అనుకుంటూ మగాడు చేసిన తప్పులకు కూడా మనమే కారణం అనుకుంటాం నరకం అనుభవిస్తాం. ఈ పుస్తకం, ఇలాంటి చాలా పుస్తకాలు మీ నాన్నని… మీ తాతని… అలాంటి మగవాళ్ళని తయారు చేసిన ఈ సిస్టంని అర్థం చేస్కోడానికి, నీమీద నీకు గౌరవం, ఇష్టం పెరగడానికి ఉపయోగపడుతుంది. తరువాత ఇంకొన్ని పుస్తకాలు ఇస్తాను. అన్నట్లు పీజీ కాలేజీలో చేరు” అంది డాక్టర్‌.

– – –

అలేఖ్య బస్సులో కూర్చుంది. రోజూ యూనివర్సిటీకి వెళుతోంది. ఈ లోపల ముందు వైపు నుంచి ఒక ముప్ఫై ఏళ్ళ మనిషి బస్సెక్కాడు. వెనకకు వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడు. తనకు నచ్చిన ఒకమ్మాయిని చూస్తూ చిరునవ్వు నవ్వసాగాడు మెల్లగా ఆ అమ్మాయి సీటువైపుకి జరిగాడు.

అలేఖ్య అతని వైపుకి చూడసాగింది. తెల్లటి బట్టల్లో టక్‌ చేస్కుని ఎంతో అందంగా ఉన్నాడు. ఏదో అలజడి తనలో, మెల్లగా పాత అలవాటు ప్రకారం ఏదో తిరిగి జరగబోతుందేమో ఒక అరక్షణం అనిపించింది, ఖంగారు పడింది.

వెంఠనే తన పర్సులో డాక్టరు ఇచ్చిన చలం ‘స్త్రీ’ పుస్తకం తీసి తలవంచుకుని చదవసాగింది. పూర్తిగా దాంట్లో మునిగిపోయింది.

ఇంతలో ఛెళ్ళుమని చప్పుడు… ‘రాస్కెల్‌’ అన్న తిట్టూ వినిపించి తల ఎత్తి చూసింది.

తనని అసభ్యంగా చూస్తూ, చూపులతో సైగలు చేస్తున్న అతన్ని అమ్మాయి చెప్పుతో ఛెళ్ళుమని చెంపమీద కొట్టింది.

*

 

గీతాంజలి

4 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనస్సును హృదయాన్ని కదిలించే ఈ బాధను చదవడం కష్టమే. గీతాంజలి గారి కధ చదువుతుంటే 2016 లో పరుచూరి బ్రదర్స్ జరిపిన నాటికపోటీల్లో ఒక న్యాయ నిర్ణేతగా “అగ్నిపుష్పం” నాటిక జ్జ్ఞపకం వొచ్చింది . ఆ నాటికలో ముఖ్య పాత్రదారిణిని చిన్నవయస్సులో తన మేనమావ చేసిన అత్యాచారం జ్జ్ఞపకం వల్ల తన భర్త రాత్రిపూట తన మీద చెయ్యి వేస్తే భయపడిపోయి కేకలు పెట్టేది . ఆదిత్య లాగే అతనుకూడా ఆ అమ్మాయిని సైకియాటృస్ట్ దగ్గరకు తీసుకెళ్లి ఆమెను ఆ బాధనుంచి తప్పించే మార్గంలోకి తీసుకెడతాడు. తెలుగులో చాలా అరుదుగా వచ్చే మంచి నాటీక.

    • Thanks deverKonda garu..ఈ కథలో ముగ్గురి పేషెంట్స్ అనుభావాలు ఉన్నాయి..
      ఆదిత్య లాంటి మంచి పురుషులని కూడా నా పేషెంట్స్ భర్తల్లో చూసాను.అంత మానవీయంగా ఉండాలి కూడా..నిజంగా ఈ మనోలైంగిక సమస్యలతో ఆ స్ర్తీలు నరక బాధ అనుభ వించారు.. స్త్రీల మనోలజ్నగిక సమస్యలకి కారణాలుగా పితృస్వామ్యము..ఆ ఆధిపత్య రాజకీయాల్ని పసిపిల్లలు చదువే పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చే అగ్ర వర్ణ బ్రహ్మణీయ వ్యవస్థ. ఆ పుస్తకాలు చదివే పిల్లలు కథలో మోహనుడు లాగా,ఆయన తండ్రిలాగా స్త్రీలకు పీడకుల్లాగా మారిపోతారు. ఇప్పుడు RSS ఇదేపని మీద ఉంది పాఠ్య పుస్తకాల్లో సంస్కృతీ పరిరక్షణ పేరిట బ్రహ్మణీయ మనుధర్మాలతో నింపివేస్తున్నది.

      • ఈ క్రింది వ్యాఖ్య చేసాను కాబట్టి నన్ను మనుస్మృతిని అమలుపరచాలని పోరాడుతున్నవాడిగా భావించనక్కరలేదు. సమస్యని సమగ్రంగా చూడాలంటే రాగద్వేష జనిత విశ్లేషణ పనికిరాదు, సంయమనంతో గమనించాలని చెప్పేందుకు
        ఇదంతా వ్రాసాను. పాఠ్యపుస్తకాలలో సంస్కృతీ పరిరక్షణ పేరుతో బ్రహ్మణీయ మనుధర్మాలతో నింపిన వైనం, సంఘటన, సందర్భం నిజంగా జరుగుతున్నాదా? మీకు తెలిస్తే వాస్తవ సంఘటన ఒక్కటి చెప్పగలరు. అలాగే, మనుధర్మము గురించి మీరు సమగ్రంగా చదివారా? బ్రాహ్మణులు మనుధర్మాన్ని (కులవ్యవస్థ ను, కుల వివక్షను) వ్రాసి, రూపొందించి వేల యేళ్లుగా అమలు చేస్తున్నారా? మీ దగ్గర ఆధారాలేమైనా వున్నాయా? లేదు అని నేను నిరూపించగలను. మనుస్మృతిని పూర్తిగా మీరు చదివివుండకపోతే ఇక్కడ వివరాలిస్తున్నాను. చదివి మీకు యిష్టమైతే చర్చించవచ్చు. ఒకప్రక్కనే చూసే విశ్లేషణ సమస్యను అవగాహన చేసుకోడానికి తోడ్పడదు…….ఇది కేవలం ఒక ధర్మ శాస్త్రమే తప్ప శాసనాల సంహిత కాదు . శాసించే నియమావళీ కాదు. ఇది ఏ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్న ఏ వర్గాన్నీ , సమూహాన్నీ శాసించేందుకు ఉద్దేశించిన న్యాయ సంహిత కాదు.

        ప్రధానంగా ఈ ధర్మ శాస్త్రం లో అన్నికాలాల్లో, అన్ని దేశాల్లో మానవుడి సాంఘిక జీవితానికి వర్తించే సూత్రాలు ఉన్నాయి. మనిషి యొక్క, సమాజం యొక్క జీవనం లో నిత్యము, శాశ్వతము అనదగ్గ అంశాలను నొక్కిచెప్పే బోధలు ఉన్నందువల్ల దీని ప్రాముఖ్యం విశ్వ వ్యాప్తమైనది.”

        మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి, కులవ్యవస్థ గురించి చెప్పాడనే మాటలన్నీ అసత్యాలు, అర్థసత్యాలు. హిందూ సమాజం మీద తీవ్రాక్షేపణ అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది మనుస్మృతి . ఈ మధ్య దీని మీద హిందూ వ్యతిరేక మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేస్తున్నది. మనువాదం అనేది భయంకరమైన తిట్టుపదమైంది. మనుధర్మ శాస్త్రం పేరు చేబుతేనే హిందువుల్లో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అన్ని వైపులనుంచి దాని మీద వస్తున్న అక్షేపణలకు , అభ్యంతరాలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. కాబట్టి మొదట దాని మీదే దృష్టి పెడదాం. మనుధర్మాన్ని ద్వేషించే, అసహ్యించుకునే వారితో వాదులాడటం నా ఉద్దేశం కాదు. ఇప్పటికే తిరుగులేని నిశ్చిత అభిప్రాయాన్నిఏర్పరుచుకున్న వారితో ఇక్కడ వాదించి , గెలవాలని నేను కోరుకోవటం లేదు.

        స్రీల గురించి మనుస్మృతి ఏమి చెప్పింది?

        యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
        యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ( మనుస్మృతి 3 -56 )

        ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు దయ కలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం – అంటే స్త్రీలను నెత్తిన పెట్టుకున్నట్టా ? కాళ్ళ కింద వేసి తొక్కినట్టా ?

        శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం
        న శోచంతి తు యత్రైతా వర్దతే తద్ది సర్వదా ( 3 – 57 )

        స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించి పోతుంది . స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు , వారి వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది – అన్నవాడు మహిళల మేలు కోరినట్టా ? కీడు కోరినట్టా?

        సంతుష్తో భార్యయా భర్తా భర్త్రా భార్యా తథైవ చ
        యస్మిన్నేవ కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం ( 3 -60 )

        భర్త భార్యను, భార్య భర్తను సంతోష పెడుతూ ఉంటే ఆ ఇంట నిత్యకల్యాణము గా సంపద నిలుస్తుంది అని హితవు చెప్పటం అతివ ను ఆదరించడమా ? అణచి వేయడమా ?

        ప్రజనార్థం మహాభాగాః పూజార్హా గృహ దీప్తయః
        స్త్రియః శ్రియశ్చ గేహేషు న విశేషోస్తి కశ్చన ( 9-26 )

        సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు . వారు ఇంటికి కాంతుల వంటి వారు. శ్రీ (సంపద) లేని ఇల్లు ఎలా శోభాయమానం గా ఉండదో స్త్రీ లేని ఇల్లు కూడా కాంతి హీనమే – అన్నవాడు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్టా? తుంచినట్టా ?

        స్త్రీ విశిష్టతను గుర్తించి , ఆమె డిగ్నిటీని పెంచి సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మనువు. ఆస్తి హక్కుల విషయంలో ” పుత్రేణ దుహితా సమా ” కొడుకు , కూతురు ఇద్దరూ సమానులే అని ప్రాచీన కాలం లోనే ఘంటా పథం గా చాటిన మహనీయుడు మనువు. అదీ ఎంత చక్కగా ?!

        యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా
        తస్యామాత్మని తిష్థన్త్యాం కథ మన్యో ధనం హరేత్ ( 9- 130 )

        తానెంతో కొడుకంత . కొడుకెంతో కూతురంత . కొడుకులు లేకపోతె
        తండ్రి ధనం కూతురికి కాకపొతే ఇంకెవరికి వెళుతుంది ?అలాగే –

        మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సః
        దౌహిత్ర ఏవచ హరేదపుత్ర స్యాఖిలం ధనం ( 9- 132 )

        జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః
        భజేరన్మాతృకం రిక్థం భగిన్యస్చ సనాభయః ( 9- 192 )

        తల్లి చనిపోతే ఆమె స్త్రీ దానం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి . కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి . పెళ్లి అయిన కూతుళ్ళకు తండ్రి ధనం లాగే తల్లి ధనం లోనూ నాలుగవ పాలు పంచి ఇవ్వాలి .. అని చెప్పిన మనువు స్త్రీలకు శత్రువా ?

        అవిశేషేణ పుత్రాణామ్ దాయో భవతి ధర్మతః
        మిధునానాం విసర్గాదౌ మను స్వయంభువోబ్రవీత్ ( iii-1-4 )

        (పారంపర్యం గా వస్తున్న ఆస్తిలో కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభువ మనువు చెప్పాడు. )

        మనువు గురించి పై వ్యాసంలో చెప్పిన సమాచారం తప్పని
        తెలుసుకోవాలని ఆసక్తి వున్నవారికి ఈ లంకెలో పిడియఫ్ ఫైలులో కొంత సమాచారం యిస్తున్నాను.

        http://www.mediafire.com/file/cwnhi8m4kv8aq98/%25E0%25B0%25AE%25E0%25B0%25A8%25E0%25B1%2581%25E0%25B0%25A7%25E0%25B0%25B0%25E0%25B1%258D%25E0%25B0%25AE%25E0%25B0%25B6%25E0%25B0%25BE%25E0%25B0%25B8%25E0%25B1%258D%25E0%25B0%25A4%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%2582.pdf/file

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు