పెద్దల ‘చాటు’ బుద్ధులపై చెంప పెట్టు!

‘తలలు బోడులైన తలపులు బోడులౌనా?’ అనే గీత మీద నడిచే కథ. కామంతో కళ్ళు కప్పుకు పోయిన మూర్ఖులకు చెంప పెట్టు లాంటి కథ ఇది.   

తెలంగాణ సాహిత్య భీష్ముడు, శతాధిక గ్రంధ కర్త, అక్షర తపస్వి డా. కపిలవాయి లింగమూర్తి తొంభై వసంతాలు జీవించి 6 నవంబర్ 2018న సాహితీ లోకాన్ని వీడి వెళ్లారు. తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో రచనలు చేసిన కపిలవాయిని ఎన్నో పురస్కారాలు, బిరుదులు వరించాయి. కపిలవాయి నిరంతర పరిశోధకుడిగానే కాదు కవిగా, రచయితగా, కథా రచయితగా, బాల సాహిత్య రచయితగా, నాటక కర్తగా, సంకలన కర్తగా, సంకీర్తనాకారుడిగా, శతక కర్తగా, గ్రంథ పరిష్కర్తగా, అనువాదకుడిగా, గేయ కవిగా బహుముఖీన ప్రతిభను  కనబరిచినవారు. వీరు రచించిన ‘పాలమూరు జిల్లా దేవాలయాలు’, ‘పామర సంస్కృతం’ తదితర గ్రంథాలు వీరికి ఎంతో కీర్తి ప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టాయి. తెలంగాణ నుండి తొలి గౌరవ డాక్టరేట్ ను పొందిన కపిలవాయి లింగమూర్తి 1959 నుండి 1961 మధ్య రాసిన ఆరు కథల్ని వనపర్తికి చెందిన ‘సాహిత్య దుందుభి’ సంస్థ 2015లో ‘కపిలవాయి లింగమూర్తి కథానికలు’ పేర ప్రచురించింది. వీటిలో కనిపించే తెలంగాణ సామెతలు, సంభాషణలు, పాలమూరు జిల్లా పదజాలం ఆకట్టుకుంటాయి. ఇందులో మానవ సంబంధాలు, మధ్య తరగతి మమతలు, సామాజిక సమస్యల్ని కపిలవాయి చర్చించారు. వీరి కథల్లో కెల్ల కలికితురాయి లాంటి కథ ‘చాటువులు’. ఈ కథ 1959 ఏప్రిల్ 11న కృష్ణా ప్రతికలో అచ్చయింది.

వయస్సును అనుసరించి ప్రవర్తించకుండా వక్ర బుద్ధితో సమాజాన్ని మోసం చేసే ఓ వైద్యుడికి ‘చాటువులు’ చెప్పారు ఈ కథలో కపిలవాయి. ‘తలలు బోడులైన తలపులు బోడులౌనా?’ అనే గీత మీద నడిచే కథ. కామంతో కళ్ళు కప్పుకు పోయిన మూర్ఖులకు చెంప పెట్టు లాంటి కథ ఇది.

ఒకానొక గ్రామంలోని చౌరస్తాలో మదుకర్ రావు అనే ప్రైవేట్ వైద్యుడు చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో క్లినిక్ తెరిచి ప్రాక్టీస్ చేస్తుంటాడు. వయసు నలభై ఏళ్ళు. ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలైనా మదుకర్ రావు ఇంటికి రాక పోవడంతో ఆయన భార్య నళిని ఆందోళన పడుతుంటుంది. అసలే ఆ గ్రామం అటవీ ప్రాంతంలోనిది. అవి గెరిల్లా పోరాట దినాలు. దుండగులు విచ్చలవిడిగా తిరుగుతూ ఒంటరిగా చిక్కిన మనుషుల్ని డబ్బు కోసం వేదించడమో, చంపడమో అక్కడ మామూలు విషయం. అప్పటికప్పుడే మదుకర్ రావు కనిపించకుండా పోయిన విషయం ఊరంతా తెల్సిపోతుంది. ఎవరైనా రోగులను చూడ్డానికి వెళ్ళాడేమో! అని ఒకరు, కాదు కాదు ఎవరో ఎనిమిది మంది గూండాలు వచ్చారట డాక్టరును ఉన్న పళంగా పట్టుకుపోయారట అని మరొకరు చెప్పుకుంటుంటారు. ఈ విషయం అక్కడి ఇన్స్పెక్టర్ కు, సర్కిల్ కు కూడా తెలిసిపోతుంది. వెంటనే అడవంతా గాలించడానికి బలగాలు బయలుదేరుతాయి.

అసలు విషయం ఏమిటంటే మదుకర్ రావు అద్దెకున్న ఇల్లు ఒక రోడ్డు కాంట్రాక్టర్ ది. ఇతడు పని మీద చుట్టు పక్క గ్రామాల్లో తిరుగుతూ రెండు మూడు రోజులకొకసారి ఇంటికి వచ్చి పోతుంటాడు. ఈ కాంట్రాక్టర్ కు ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు అరవింద. చాలా అందగత్తె. వీరి వీధికి ఎదురుగా ఉన్న ఒక గదిలో రమణ అనే కుర్రాడు అద్దెకుంటాడు. ఇతడు అరవిందకు మూగ ప్రేమికుడు. ఒక రోజు రాత్రి భోజనం తరువాత భృగుపంచకమనే చాటువులను తిరిగేస్తూ కూర్చుంటాడు. ఇంతలో అతని గదికి రామారావు అనే  స్నేహితుడు వచ్చి మదుకర్ రావు అదృశ్యం గురించి చెప్తాడు. ఇంతలో అరవింద ఇంటి గడప ఎవరో దాటడం రమణ చూస్తాడు. వాళ్ళ అన్నయ్య కావచ్చు అనుకుంటాడు.

లోపలికి వచ్చిన మదుకర్ రావును చూసిన అరవిందకు ఆయన ఎందుకు వచ్చాడో అర్థం అవుతుంది. మీరిక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని అరవింద గదికి బయటకు గొళ్ళెం వేసి పోతుంది. లోపలున్న  మదుకర్ రావు మనసు ఆనందంతో తాండవమాడుతుంది. కాసేపట్లో రానున్న ఆమెతో ఎలా రాసలీలల్లో మునిగి పోవాలో కలలు కంటుంటాడు.

ఇక్కడ రమణ తన చాటువులను చదువుతూనే ఉంటాడు.

“అళికుల వర్య పద్మ ముకుళాంతరమందున నుండజాలకన్

చలనమునొందెనేల నవ సారస మిత్రుడ రాక యందునా

తొలగక యిందే నుండుమిక తోయజ వైరి స్థిరంబె రాత్రి ఈ

కలవర మేల తమ్మి తుదిగానక నూరక యూరకుండుమా!”

అరవింద ఇంకా రాక పోయే సరికి తలుపు తీసి చూద్దామని తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తాడు. అవి రావు. ఏమైందో ఊహించుకుంటాడు మదుకర్ రావు. రాత్రి పన్నెండైనా ఆమె రాదు. తన పొరపాటు తెలుసుకొని కుమిలిపోతాడు.  క్రమంగా ఈ వార్త అరవింద అన్నయ్యకు కూడా తెలుస్తుంది. డాక్టర్ కే రక్షణ లేదు తన చెల్లెలు ఇంట్లో ఒక్కర్తే ఉంది అని ఆయన ఇంటికి బయలుదేరుతాడు. నళిని ఇంటి దగ్గర వంటా గింటా వదిలేసి ఏడుస్తూ కూర్చుంటుంది. పోలీసు దళాలు ఇంకా వెతుకుతూనే ఉంటాయి. వేకువ జాము నాల్గంటలకు వెనక వైపు గోడ దూకి పారిపోతాడు మదుకర్ రావు. దీన్ని కనిపెట్టిన ఒక ముసలమ్మ తన మనవరాలితో ‘పిల్లా! కుక్కలు గోడలు దూకుతున్నాయే భద్రం’ అంటుంది.

మొత్తం మీద  తెల్లవారే సరికి మదుకర్ రావు ఇంటికి చేరేటప్పటికి  అటు భార్య, తల్లీ, ఇటు ఊళ్ళో వాళ్ళూ అందరూ ఊపిరి తీసుకుంటారు. ఊళ్ళో వాళ్ళు అందరూ గుంపుగా మూగి మదుకర్ రావును ఏమైందేమైంది అని ప్రశ్నిస్తుంటారు. అతనికి ఏమి చెప్పాలో అర్థం కాక తత్తర పడుతుంటాడు. ఇది గమనించిన అరవిందకు నవ్వాగదు. కిల కిలా నవ్వేస్తుంది. మదుకర్ రావు కళ్ళు ఓడిపోయినట్లు వాలి పోతాయి. అక్కడున్న ఆడవాళ్ళకే కాదు మగ వాళ్ళకు కూడా అరవింద ఎందుకు నవ్విందో అర్థం కాదు. రమణ మాత్రం ఆ నవ్వులో విజయ గర్వ రేఖను పోల్చుకుంటాడు. అరవింద అన్న ఇంటిలో కాలు పెట్టేలోగా మదుకర్ రావు బయట పడ్డాడు కాని లేకుంటే ఏమయ్యేది? పడుచు వాళ్ళకే ఇలాంటి బుద్ధులుంటాయనుకుంటే వయసు మీద పడ్డ పెద్దలకు కూడా ఈ చాటు బుద్ధులేమిటీ? అనుకుంటాడు రమణ.  “కొలనులో విచ్చుకున్న ఎర్ర తామరను చూసి తుమ్మెద అది తన కోసమేనని శోభాయమానంగా తయారై ఎదురు చూస్తుందని భ్రమిస్తుందట. అలాగే మూర్ఖుడు కూడాను విలాసవంతులను చూస్తే అది వారి నైజమనుకోక తమ కోసమే వారి విలాసమంతానని మోసపోతారు.” అని ముగిస్తాడు కథకుడు.

మీ టూ, క్యాస్టింగ్ కౌచ్ లు చెలరేగుతున్న ఈ కాలంలో కూడా ఈ కథ ప్రాసంగికత కోల్పోలేదనిపిస్తుంది. పేరున్న ఎంతో పెద్ద వారు కూడా అల్ప బుద్ధితో చాటు మాటు రంకు పనులకు తెగబడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కథలు చాలా రావాలి. కథకుడు ఈ కథకు ‘చాటువులు’ అని పేరు పెట్టాడు. సాహిత్యంలో ‘చాటువు’ అంటే అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి ఆశువుగా చెప్పబడేది అని అర్థం. ఒకప్పుడు కవులు ఈ చాటువును రాజులను హెచ్చరించడానికి, వారు చేసే దుష్కృత్యాన్ని నిందించడానికి, పొగడడానికి, తెగడడానికి వాడేవారు.

ఈ కథలో కూడా అరవింద తనకు ఎదురైన విషమ సందర్భానికి తగ్గట్టుగా ప్రతి క్రియ చేసి ఆపద నుండి తనను తాను రక్షించుకుంటుంది. అంతే కాదు ‘చాటు మాటుగా చేసే పనులు’ అనే అర్థంలో కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ కథకు ‘చాటువులు’ అనే పేరు అన్ని విధాలా తగియున్నది. రమణ చదివే చాటువుల్లో కూడా కథా సూచనను బిగించడం ఇందులోని అబ్బురపరిచే శిల్పం. పైన ఉదాహరించిన పద్యంలో ‘తొలగక యిందే నుండుమిక తోయజ వైరి స్థిరంబె రాత్రి’ అనే పాదం లోనే మదుకర్ రావుకు వేసే శిక్ష తొంగి చూస్తుంది. కథకుడు ఎన్నుకున్న శిల్పం చాలా అమోఘమైంది. కథ మొదట్లోనే ఒక ముడి వేసి కథ చివర దాన్ని విప్పడం వల్ల పాఠకుడు ఉత్కంఠకు గురౌతాడు. దీని ద్వారా కథకుడు గొప్ప గూఢత (Suspense)ను సాధించాడు. అదేవిధంగా స్త్రీలు తమ మాన, ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత తెలివిగా ప్రవర్తించాలో చాలా సున్నితంగా చెప్పిన కథ.

కథలోని బుగ్గాల ముసలమ్మకు ఒక్క డైలాగే ఇచ్చాడు కథకుడు కానీ అది చాలా పవర్ ఫుల్ డైలాగ్. మదుకర్ రావు పాత్ర ఇప్పుడున్న కుళ్ళిపోయిన సమాజానికి ప్రతినిధి అయిన పాత్ర. వైద్య రంగంలో ఉండి ఇలాంటి పనికి పూనుకోవడం మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి వారు అప్పుడే కాదు, ఇప్పటికీ ఉన్నారు. కామాంధుల పాలిటి సింహ స్వప్నం ఈ కథ. కథలో అక్కడక్కడ ప్రబంధ శైలి తొంగి చూస్తుంది. సన్నివేశానికి తగ్గ చాటువుల్ని రాయడం కూడా కథకుని ప్రతిభను చాటుతుంది. పురుషులు ఏ హద్దుల్లో ఉండాలో చెప్తూనే అనేక మానవీయ విలువల్ని తడుముతుందీ కథ.

(డా. కపిలవాయి లింగమూర్తిగారికి అశ్రు నివాళి)

 

 

 

 

 

 

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

8 comments

Leave a Reply to రావుల కిరణ్మయి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథను, కథకుడి ప్రతిభను.. కథ ప్రాసంగికతను చాలా బాగా విశ్లేషించారు సార్..

  • డాక్టర్ మొసాలు అనాటినుంచి ఈనాటికి అట్లగనే ఉన్నాయి. ఇటీవల ఫిజియోథెరపి కి వచ్చిన పేషంట్ ను పరిచయం చేసుకోని అక్రమ సంబంధం కొనసాగించఠమే గాకుండా ఏక్ంగా భర్తను హత్యచేసి భర్త స్థానంలో ప్రియునికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలనే సమయంలో హత్య బయటపడింది. స్వాతి రాజేష్ ల కథ సంచలనం సృష్టించింంది.ఇది నాగర్ కర్నూలు లోనే జరిగింది. ఈ విషయం జరిగినప్పుడు నేను కపిలవాయి లింగమూర్తి గారితో చర్చిస్తున్నప్పడు ఈ కథ గురించి చెప్పాడు. ఆయన చాలా కథల్ని భద్రపరుచలేదని చెప్పాడు.వివిధ పత్రికల్లో అచ్చైనా రాత ప్రతులు కూడ లేవని బాధపడేది.కథానికలపై మంచి సమీక్షవిశ్లేషణ రాసినవు అన్న.అబినందనలు హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • మీ టూ ఉద్యమానికి అనుగుణంగా ఉంది. అన్న మీ విశ్లేషణ బాగుంది.

  • నమస్కారం సార్
    ఒక మంచి కథ ను నాకు పరిచయం చేశారు.చాటువులు పదం కు ఉన్న విస్తృతార్థం తెలుసుకోగలిగాను.
    మీకు అభినందనలు మరియు ధన్యవాదములు

  • మహోన్నతుడు కపిలవాయి గురించీ, ఆయన కథల గురించీ బాగా పరిచయం చేశారు శ్రీధర్. ఆనాటి గొప్ప కథకుల గురించి ఈనాటి కథకులకు తెలియాల్సింది, చెప్పాల్సింది చాలానే ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు