పుస్తకోదయం! 

మనం ముఖ పుస్తకాలం కాకూడదు.  పుస్తక ముఖులం కావాలి. 

వాస్తవికం, కాల్పనికం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం…ఏదైనా కావొచ్చు.  అదే పుస్తకమైనా కావొచ్చు.  పుస్తకం అంటే ఒక సంభాషణ. ఒక వర్తమానం. ఒక సందేశం.  ఒక వ్యక్తి సమాజానికి తాను చెప్పాలనుకున్నది చెప్పే అత్యుత్తమ మాధ్యమం పుస్తకం.  మరో వ్యక్తి తాను తెలుసుకోవాలనుకున్న, వినాలనుకున్న విషయం పొందటానికీ అత్యుత్తమ సాధనమూ పుస్తకమే.  ఆదిమ దశలోని ఆహారాన్వేషణ కాలం నుండి నేటి వరకు మనిషికి యుద్ధాలు కొత్త కాకపోవచ్చు.  కానీ పుస్తకాల ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఆవిష్కృతమయ్యాయి. కాగితాన్ని, పుస్తక ముద్రణ యంత్రాన్ని కనుక్కున్న తర్వాతనే భూమ్మీద మనిషి హల్చల్ బాగా పెరిగింది.  పుస్తక వ్యాప్తి ద్వారానే మనిషి ఆలోచన విస్తరించింది.  మనిషి శాస్త్ర, సాంకేతిక అశ్వాల్ని ఉరకలెత్తించిందీ పుస్తకరథం మీదనెక్కే కదా!
ఇరవై ఒకటో శతాబ్దం మనిషి కాగితం ప్రపంచం నుండి డిజిటల్ లోకంలోకి ప్రయాణించటం ఎక్కువైంది.  అంకెల మీద ఆధారపడ్డ కంప్యూటర్ వాస్తవదృశ్యాన్ని పోలిన భ్రాంతియుత వాస్తవాల్ని ప్రతిబింబించి మనిషి కుర్చీలోనే కూర్చొని  ఎదురుగా వున్న కొన్ని అంగుళాల తెర మీద విశ్వాన్ని చూసే అవకాశాన్ని కల్పించింది.  దృశ్య శ్రవణ, పఠన మాధ్యమాల వేదికైంది కంప్యూటర్.  ఆ తరువాత మొబైల్ సంగతి చెప్పే పనిలేదు.  బాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మొబైల్ వచ్చాక సాధారణ పోస్ట్ కార్డ్ దాదాపుగా పెట్రోమాక్స్ లైట్, గ్రాం ఫోన్ రికార్డ్ సరసన చేరింది.  ఇమెయిల్ కూడా టెలెక్స్ కి ఇప్పటికే, ఫాక్స్ మెషీన్ కి దాదాపుగా అదే గతి పట్టిస్తున్నది.   మొబైల్లో పిడిఎఫ్ పుస్తకాలు సులువుగా లభ్యమౌతున్నాయి.  స్మార్ట్ మొబైల్ అంటే  అదో ఆటస్థలం. సంగీతం పెట్టె.  సినిమా హౌస్.  సమాచార జ్ఞాన భాండాగారం.  అదొక కార్యక్షేత్రం కూడా! మరి ఈ పరిస్తితుల్లో పుస్తకానికి ప్రాధాన్యత వున్నదా?  మనిషి ఇంకా కాగితం మీద రాతల్ని పట్టుకు వేలాడాల్నా?  అని ప్రశ్నిస్తే ఎంత అధునాతన ఫారెక్స్ అయినా అమ్మ చేతి ముద్దలుగా తినాల్సిందేగా? అనే ప్రశ్నే జవాబుగా చెప్పాల్సొస్తుంది.  చెప్పే విషయం మారొచ్చు కానీ పుస్తకానికి సాటి లేదు.  పుస్తకంలోని అక్షరాలు హత్తుకున్నట్లు మరేది హత్తుకోదు.  పుస్తకంలోని లైన్ల వెంట కళ్ళు పరిగెత్తినంత ఉద్వేగంగా కంప్యూటర్, మొబైల్ స్క్రోలింగ్ వుండదు. అందుకే పుస్తకం చిరంజీవి.  జ్ఞానానికి పుస్తకం అమ్మ వంటిది.  మనిషి తన తయారీల్లో అన్నింటిల్లోకి పుస్తకంతొనే అత్యంత ఎక్కువ భావోద్వేగ బంధాన్ని కలిగి వున్నాడు.  అందుకే పుస్తక మహోత్సవాలు పుస్తక ప్రేమికులకి బ్రహ్మోత్సవ వేడుకల్లా కళకళలాడుతుంటాయి.
****
పుస్తకాల సేకరణ, భద్రపరచటం గురించి నాకు భిన్నాభిప్రాయం వుంది.  పుస్తకాలను సేకరించి చాలామంది అపురూపంగా చూసుకుంటుంటారు.  వాటిని ఒక తరగని ఆస్తిగా భావిస్తుంటారు.  చక్కగా షోకేసుల్లో పెట్టుకొని ముచ్చట పడుతుంటారు.  వాటికీ దుమ్ము దులుపుతూ మురిపెంగా చూసుకుంటారు.  వాటి కోసం చాలా ఖర్చు పెడుతుంటారు.  ఇంట్లో వాళ్ళు ఎంత విసుక్కున్నా పట్టించుకోరు.  వారి పుస్తక ప్రేమ, మోజు చిన్నవేం కావు.  అయితే వారు అందులో ఎన్ని పుస్తకాలు చదువుతారనేది వేరే విషయం.  అది వారికే తెలియాలి.  ఊరకే పుస్తకాలు కొనుక్కొని అలా పూజించేవారికి విమర్శించటం ఈ వ్యాసం లక్ష్యం కాదు.  వాళ్ళ డబ్బులు వాళ్ళిష్టం.  ఎప్పటికైనా చదవకపోతామా అన్న ఉద్దేశ్యం కావొచ్చు.  మనిషి ఆశాజీవి కనుక చదవగలిగినా లేకపోయినా పుస్తకాలు  కొనుక్కోవటంలో తప్పులేదు.  నేను కూడా అలా అనుకునే కొంటుంటాను.
నిజానికి పుస్తకాలు చదవని వారి మీద నాకేం ఫిర్యాదు లేదు.  ఎందుకంటే ఎప్పటికైనా చదువుతా కదా అన్న వారి పాయింట్ కి వ్యతిరేకంగా నా దగ్గర కౌంటర్ పాయింట్ లేదు. మీకు విడ్డూరంగా అనిపించొచ్చు కానీ నా ఫిర్యాదల్లా పుస్తకాలు చదివే వారి మీదనే.  పుస్తకాలు చదివేసి తరువాత మరొకరికి ఇవ్వకుండా ఇనప్పెట్టెల్లో నగల్లా దాచిపెట్టుకునే వారి మీదనే.  మీకు మళ్ళీ విడ్డూరంగా  అనిపించొచ్చు కానీ ఒక పుస్తకం మంచిదని తెలిసాక అది మన దగ్గరుండకూడదు అనుకుంటాను.  మనం పుస్తకాలకి ధర చెల్లించేది మనం చదవటానికే కానీ దాచుకోటానికి కాదని అని నా దృఢాభిప్రాయం.  పుస్తకం ఒక కుక్కపిల్ల కాదు మురిపెంగా చేసుకోటానికి.  పుస్తకం ఒక పూలమొక్క కాదు ముద్దుగా పెంచుకోటానికి.  పుస్తకం బంగారు నగ కాదు బీరువాలో దాచుకోటానికి. పుస్తకం ఇల్లు, పొలం వంటి స్థిరాస్తి కాదు యజమానిలా ఫీలైపోటానికి.  పుస్తకమంటే మన గుమ్మం ముందు నాటిన వేపచెట్టు.  పుస్తకమంటే కేవలం కాగితాల సమాహారం కాదు.  అక్షరాల కూర్పు కాదు. పుస్తకమంటే వ్యాప్తి చేయాల్సిన జ్ఞానం. సృజనాత్మకత.  అందుకే చెడ్డ పుస్తకమైతే చెత్త బుట్టకి దాఖలు చేయాలి.  మంచి పుస్తకమైతే పంచుకోవాలి.  (నేను నిత్య పారాయణ మత గ్రంధాల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే వాటితో నాకు సంబంధం లేదు.  నేను ఆ సమూహానికి చెందిన వాడిని కాను.)
కొందరి ఇళ్లల్లో వారి షోకేసుల్లో దసరా బొమ్మల కొలువులో ప్రదర్శించే లక్కపిడతల్లా వందలు, వేల కొద్దీ పుస్తకాలు కనబడుతుంటాయి.  శుభ్రంగా, తళతళలాడుతూ, ఖడక్ ఖడక్గా పుస్తకాలు  కూడా కనబడితే అది పుస్తక దుర్వినియోగంలా కనబడుతుంటుంది.  పుస్తకాన్ని సద్వినియోగం చెయ్యటమంటే ఒక మంచి పుస్తకాన్ని చదివేసాక వేరొకరికి ఇవ్వటమే కానీ వాటికి ఉక్కపోసినట్లుగా బంధించటం కాదు.  కరెన్సీ చేతులు మారినదానికంటే పుస్తకాలు చేతులు మారాలి. పుస్తకాన్ని గౌరవించటమంటే ఆయా పుస్తకాల్లో ఘోషించిన రచయితల్ని మరింతమందికి చేర్చటమే.  పుస్తకం నలుగురికి చేరాలంటే అమ్మకాలొక్కటే మార్గం కానక్కర్లేదు.  చదివేసి పుస్తకాల్ని పంచుకోవటం ద్వారా సాహిత్యం, తత్వం, జ్ఞానం వృద్ధి చెందుతాయి.  చదివేసి పుస్తకాల్ని దాచుకోవటమంటే బ్లాక్ మనీ దాచుకోవటం వంటిదేనని భవదీయుడు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాడు.  (అయితే నా ఫిర్యాదుల నుండి అకడమిక్ వ్యక్తుల్ని, విమర్శకులని, పుస్తక పరిచయకర్తల్ని మినహాయిస్తున్నాను.  ఎందుకంటే  వారు    రిఫరెన్స్ కోసం నిరంతరం పుస్తకాల్ని తడమాల్సి ఉంటుంది.)
ఎవరో ఒక యువకవికి వాటి గొప్పదనం గురించి చెప్పండి చదివిన పుస్తకాల్ని ఇచ్చేస్తూ.   లేదా మారుమూల లైబ్రరీలో ఇచ్చేయండి వాటి మీద మీ పేరుని రాసి, ఒక జాబితా తయారు చేసి నిర్వాహకుల నుండి రసీదు తీసుకుంటూ.  ఎంత బాగుంటుంది?  ఎంత తృప్తిగా ఉంటుంది?
***
సరే!  ఇన్ని చెప్పిన నా సంగతి చెప్పక తప్పదు.  చెబుతాను.  ఇప్పుడు నా దగ్గర ఒక్క చలం పుస్తకం లేదు.  కొడవటిగంటిది ఒకే ఒక్క పుస్తకం క్రితం రెండు సంవత్సరాల క్రితం కొన్నదె వున్నది.  కారా మాస్టారి కథలు, శ్రీపాద…. నా బుక్ షెల్ఫ్ లో వీరెవ్వరూ లేరు.  అంతెందుకు నా దగ్గర మహాప్రస్థానం లేదు. తిలక్ కవిత్వం కానీ కథలు కానీ లేవు.  నా దగ్గర ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి లేడు.  మార్క్స్ లేడు. ఏంగెల్స్ లేడు.  రష్యన్ సాహిత్యం లేదు.  ఉదయగీతిక వంటి చైనా విప్లవ నవలలు లేవు.   నిజానికి ఇవేవీ, వీరెవ్వరిని చదవి వుండకపొతే నేను లేను.  అయితే ఆయా మహారచయితలు, వారి  రచనలు మిగిల్చిన ప్రభావం మాత్రమే వుంది.  ఆ రచనల్లోని ముఖ్య ఘట్టాలు కూడా నాకు గుర్తుండవు.  మైదానం లో రాజేశ్వరి మాటలు గుర్తు లేవు.  నేను చదివిన పుస్తకాల్లో ఏ పేజీలో, ఏ అధ్యాయాల్లో ఏమున్నదో, ఒకట్రెండు ముఖ్య పాత్రలు తప్ప పూర్తిగా ఏదీ గుర్తుండదు.  అయితే ఆయా పుస్తకాల సారాంశం మాత్రం మనసులోకి దిగిపోతుంది. ఆయా గొప్ప పాత్రలు నా మీద మిగిల్చిన ప్రభావం అపారం.  నాకెందుకో ఒక గొప్ప రచనని మళ్లీమళ్లీ చదవాలనిపించదు.  అది సోమర్  సెట్ మామ్ అయినా, చలం అయినా సరే.  ఒకసారి చదివితే చాలు అవిచ్చిన ఛార్జింగ్ ఎప్పటికి పోదు.  మరో రచన చదవొచ్చు కదా అనిపిస్తుంది.  పుస్తకమంటే ఇష్టమే కానీ దానికి నేను యజమానిలా భావించేవాడిని కాను.  బానిసనీ కాను.
అనేక కారణాల వల్ల ఒక ఇరవై సంవత్సరాల క్రితం నాకు సాహిత్యం, జ్ఞానం మీద ఆసక్తి తగ్గింది.  పదేళ్ల నుండి వార్తాపత్రికలు చదవటం కూడా మానేసాను.  (అలాగని మరీ భీషణ శపథం కాదు.  వార్తల కంటే పరిణామాలు ముఖ్యం అన్నది నాకున్న ఎరుక. అందుకే అన్ని విషయాలు కొంచెం ఆలస్యంగా తెలుస్తుంటాయి నాకు.)  ఆచరణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు రాయటమే కాదు, చదవటం కూడా ఎందుకనిపించింది.  జీవితం మీద ఎంతో శ్రద్ధ పెడితే తప్ప అప్పటివరకు పుస్తక పఠనం ద్వారా నేర్చుకున్న సంస్కారం వంట పట్టదనిపించింది.  ఆచరణలేని జ్ఞానం, సాహిత్యం నిరర్ధకం అనిపించింది.  చదివిన దానికి జీవితంలో న్యాయం చేయటం సబబనిపించింది.  జీవితాన్ని ఒక చిన్న స్థాయిలో అయినా ప్రయోగశాల చేయటమే సరైన పద్ధతి అనిపించింది.  వేదిక మీద వెలుగులో వుండటమే కాదు చివరి బెంచిలో ఎవరికీ కనబడకుండా ముందు కనిపించేదాన్నంతా ఆసక్తిగా చూడటం కూడా బాగానే వుంటుందనిపించింది.  పుస్తకాలు నా దగ్గర వుండటం న్యాయంగా అనిపించలేదు. అంతే.  చాలావరకు పుస్తకాలు ఇచ్చేసాను.  నేను విశాఖలో వున్నప్పుడు అక్కడి యువకవులకి నేను చదివేసిన పుస్తకాలు ఇచ్చేసేవాడిని.  లేదా స్థానిక చిన్న చిన్న లైబ్రరీల్లో ఇచ్చేసేవాడిని.  హైదరాబాద్ వచ్చాక ఒకట్రెండు స్వచ్చంద సంస్థలతో కలిసి పని చేసినప్పుడు తెలుగు మీడియం హైస్కుళ్ళలో చదివే (వలస కుటుంబాలకు చెందిన) పిల్లలకు బాగా ఇచ్చే వాడిని.  నా  దగ్గరున్న పుస్తకాలే కాదు కొత్తగా కొని మరీ ఇచ్చేసేవాడిని.  ఒక్కో పుస్తకం ఇచ్చినప్పుడల్లా చాలా తృప్తిగా అనిపించేది.  చివరికి నా కవిత్వ సంకలనం (ఒక్క కాపీ మినహా) అన్ని ఇచ్చేసాను.
మళ్ళీ సాహిత్య సాంగత్యంలోకి వచ్చాక మళ్ళీ గత మూడు సంవత్సరాల నుండి  కొన్ని పుస్తకాలు కొంటున్నాను.  ఇప్పుడు నా దగ్గ్గర వున్న పుస్తకాలు నేను చదవనివే.  మా పిల్లల కోసం వాళ్ళ వయసులో నేనున్నప్పుడు ఎం పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యానో అవి కూడా మళ్ళీ మెల్లగా కొంటున్నాను.   నేను చదవటానికి కాదు   ఆ మాటకొస్తే నేనసలు గొప్ప చదువరినే కాను. ఎన్ని చదివాం అనేదాని కన్నా ఎన్ని పుస్తకాలు మన రక్తంలో ఇంకిపోయాయనేదే ముఖ్యం.  మనం ముఖ పుస్తకాలం కాకూడదు.  పుస్తక ముఖులం కావాలి.
****
అన్ని దానాలకన్నా పుస్తకదానం మిన్న!!!
*

అరణ్య కృష్ణ

7 comments

Leave a Reply to Aranya Krishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అరణ్య కృష్ణ గారూ…పుస్తకాల గొప్పదనం గురించీ, పుస్తక దాన విశిష్టత గురించి చాలా చక్కగా రాశారు..
    చెప్పడమే కాదు మీ ఆలోచనలను ఏ విధంగా అమలు చేస్తున్నారో చాలా చక్కగా వివరించారు….అభినందనలు…

    btw sir, for some reason I couldn’t see your Facebook posts….Seems you blocked me by mistake…

    Please accept my request if you blocked me by any change..

    My Face book ID: Ramesh Pala

  • కృష్ణగారు! మొదటిసారి ఇలాంటి ఆలోచనను చదివాను. దాచిపెట్టుకోవడానికి బంగారమూ కాదూ, కరెన్నీ నౌట్లూ కాదూ! . 20 ,సంవత్సరాలముందు చదవటం రాయటం వదలి, కారణాలు విశ్లేషించారు. చదివి ఆశ్చర్యం! పంచటంలో ఆనదం! చాలా బాగా విశ్లేషించారు! ధన్యవాదాలు.

  • బాగుంది. “ఎన్ని చదివాం అనే దాని కన్నా ఎన్ని పుస్తకాలు మన రక్తంలో ఇంకిపోయాయనేదే ముఖ్యం. మనం ముఖ పుస్తకాలం కాకూడదు. పుస్తక ముఖులం కావాలి.”
    మొత్తంగా మీరు చెప్పదల్చుకున్నదంతా ఈ వాక్యాల్లో నింపేశారు. నేనూ అదే అనుకుంటాను. కొన్ని తప్ప చాలామటుకు ఇచ్చేసాను. మీకు అభినందనలు పుస్తకాలపట్ల…చదువరులపట్ల మీరు చూపిన అభిమానానికి.

  • ఊహు నేను ఒప్పుకోను– నిజంగా నాకు బుక్స్ అంటే చిన్నప్పటినుండి ప్రాణము– కథ తెలిసినా- విషయము మెదడులోకి ఇంకిపోయినా సరే మళ్ళీ మళ్ళీ చదువుతా– చీరలు నగలు ఎవరు తీసుకున్న నాకు ఏమి అనిపించేది కాదు ఎప్పుడు – బుక్ అడిగితే మాత్రము– అందుకు కారణము కూడ వుంది తీసుకౌన్న వాళ్ళు జాగ్రత్త గా చదివి ఇస్తే బాగుంటుంది– కాని పిల్లలకు ఆడుకోవటనికి ఇచ్చి– బుక్ ని మడత పెట్టి చదివి దాని స్వరూపన్నే మార్చి ఇచ్చినప్పుడు నా బాధ ఇక్కడ చెప్పలేను– కాని బుక్స్ షోకేస్ లో బొమ్మల్లాంటివి మాత్రము కాదు– అవి నాకు పంచప్రాణలు– నేను పోయాక ఎవ్వరైన తీసుకోనీ అని మాత్రమే అనుకుంటా —

  • చదివిన పుస్తకాలు ఇచ్చేయడానికి కేసు బలంగా నిర్మించారు. ఇక మీదట నేనూ ఇచ్చేస్తానేమొ.
    అందుకే డిజిటల్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఎన్ని కాపీలు పంచినా ఇంకా మన దగ్గర ఒక కాపీ ఎప్పుడూ వుంటుంది. ఎన్ని పంచినా తరగని అక్షయపాత్ర డిజిటల్ పుస్తకం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు