పిల్లలు లేని దేశం

ఇక్కడిప్పుడు క్షణ క్షణం
ముఖమల్ దేహాలు ఛిద్రం చేస్తున్నారు

ఎవడో ఒకడు
రోజూ రక్తం తాగిపోతున్నాడు

పాలుగారే దేహంపై పంటి గాట్లతో
చీరిపోతున్నాడు

కల్మషమంటని కనులు
స్వప్నాలకు దూరమవుతున్నాయి

ముప్పాతికేళ్ళ స్వతంత్రం
మెదడు వాపుతో కుళ్ళిపోతోంది

వెన్నెలంటి ముఖాలపై నిస్సహాయంగా
కన్నపేగులు దుఃఖపు మట్టిని పోస్తున్నాయి

తెలవారుతుందో లేదో
తెలీని కాలమిప్పుడు కత్తుల వంతెన

పసికందుల దేహపు కమురువాసనతో
ఈ దేశమింకెన్నాళ్ళు ఊపిరి తీయగలదు.

 

పాత పద్యం

ఎప్పుడో రాసిందే
ఎందుకో మరల మరల
చదువుకోవాలనిపిస్తుంది

పాతదే
కాగితం కూడా రంగు మారి
చినిగిపోయేట్లుగా శిధిలమౌతున్నా

ఏదో వాసన ఇంకా
ఆ అక్షరాలనంటి ఏవో జ్ఞాపకాలను
తవ్వతూంది

నువ్వంటావు
ఆ తరువాత రాసావు చాలా
ఇంకా ఆ పేజీకే అతుక్కు పోతావేమని?

నిజానికి
ఆ పాత పద్యం కొనసాగింపే
ఇంకా రాస్తూంది కదా!!

చిత్రం: సత్యా బిరుదరాజు 

కెక్యూబ్ వర్మ

2 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పసికందుల దేహపు కమురువాసనతో
    ఈ దేశమింకెన్నాళ్ళు ఊపిరి తీయగలదు.
    Yes varma garu

    నిజానికి
    ఆ పాత పద్యం కొనసాగింపే
    ఇంకా రాస్తూంది కదా!!

    Baga raasaaru

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు