పది మందికి అతీతంగా…

నాకు మట్టుకు నాకు, నాకంటూ ఒక పుస్తక ప్రపంచం ఏర్పరుచుకోవడం పదకొండో ఏట నుంచి మొదలయింది.

వ్యాస క్రమంలో, మొదటి భాగంలో, నా చిన్న తనంలో నా పుస్తకాలు చదివే అలవాటు గురించి రాశాను. కొందరు మిత్రులు చదవడానికి కారణాలేమిటి అని అడిగారు. ఆ ప్రశ్నని మొదటి భాగంలో  కొట్టివేసినా దానికి సమాధానం చెబుతూ ఈ భాగం మొదలు పెడతాను.

చిన్నపుడు, మరీ చిన్నపుడు, అంటే బాగా గుర్తు లేనప్పుడు అందరి పిల్లల్లాగే తెలిసిన కథనే మళ్ళీ మళ్ళీ మా అక్కయ్య తో చెప్పించుకొనే వాడిని. అలవాటు పడిన వాసనలు, రుచులు లాగే, ఒకే కథలు అలవాటు అయి, అమ్మ  అన్నం తినిపించేటప్పుడు రానున్న ముద్ద లాగా, అదే కథకోసం ఎదురు చూశే వాడిని. నిజానికి, ఈ కథల్లో వాక్యాలు, రూపం కూడా పునరుక్తమవుతుంటాయి. ఉదాహరణకి, అనగనగా ఒక ఈగ కథ గుర్తు చేసుకోండి — ఈ పునరుక్త బలం తెలుస్తుంది. ఒకే గాడిలో నడిచే బండిలాగా, సునాయాసంగా, ఎటువంటి ఉత్కంఠ లేకుండా కథ సాగిపోతుంది. సూర్యుడు, చంద్రుడు, అమ్మ, నాన్న ల్లాగ ఒక స్థిరత్వాన్ని మన లోకానికి ఆ కథ ఇస్తుంది.

కొంత ఎదిగిన తర్వాత అంటే, నా అంతట నేను చదువుకోగలిగేటప్పటికి , నేను పుస్తకాలు చదవడానికి కారణం మారింది. చందమామలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి కథలు, భట్టి విక్రమార్క కథలు — ఇటువంటివి ముందు ఉబలాటం కొద్దీ, అందరి లాగే చదివాను. ఈ కల్పితగాథలు సృష్టించే లోకాలు సరళంగానూ, సరదాగానూ, అర్థం అయే లాగూ ఉంటాయి. ఆ లోకాలు కొన్ని నియమాల ప్రకారం నడిచిపోతుంటాయి.  రాజకుమారుడు ఎప్పుడూ అందంగానూ, బలంగానూ, నీతిమంతుడిగానూ ఉంటాడు. దుర్మార్గులకు చివరికి సరైన శిక్ష పడుతుంది. ప్రపంచం మీద నమ్మకం కలిగిస్తూ, ఈ నియమాలు రకరకాలుగా రుజువవుతాయి.

నాకు లెక్కలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం మధ్య ఒక సారూప్యం కనబడుతుంది. ముందు ఎక్కాలు బట్టీ పట్టి నేర్చుకొంటాం. ఒకటికి పదిసార్లు వల్లె వేయడం వల్ల, అర్థం అయినా కాకపోయినా, నోటికి వచ్చేస్తాయి. బాగా పెద్దయిన తర్వాత మాత్రమే వాటిలోని పరమార్థం కనబడుతుంది. మరి కొన్నాళ్ల తర్వాత లెక్కల నియమాలు నేర్చుకుంటాం. రెండంకెల గుణహారాలు ఎలా చెయ్యాలి? ఇదిగో, ఈ నియమాల ప్రకారం. రక రకాలుగా అభ్యాసం చేస్తాం, నేర్చు కుంటాం. ఈ లోకంలో వర్గమూలాలుగా సహజ సంఖ్యలే ఉంటాయి. నియమాలు సరళంగానూ, సూటి గానూ ఉంటాయి బాల సాహిత్యంలోలాగే.

ప్రపంచాన్ని ఇలాగ సరళమైన నియమాల ద్వారా అర్థం చేసుకోవాలని చదివాను. డిటెక్టివ్ నవలల్లో, జానపద కథల్లో, యద్దనపూడి రచనల్లో, స్త్రీల వ్రతకథల్లో, గుడిపాటి చలం  పిల్లల పెంపకం పుస్తకంలో, పురాణాల్లో, ద్వివర్గ సమీకరణాల్లో, అన్నిట్లోనూ, ఈ విధమైన నియమాలు కనబడేవి. చదువుతున్న కొద్దీ ఒక ధైర్యం కలగడం మొదలు పెట్టింది. “తెలుసు తెలుసు నాకు తెలుసు, మీకు తెలియని రహస్యం తెలుసు,” అని పది మందిలో ఉన్నా, నేను ఆ పది మందికి అతీతంగా, తేడాగా ఉన్నట్లు భావన కలిగేది. రెండంకెల గుణహారాలనుంచి, అన్ని అంకెలనూ అలాగనే గుణించవచ్చని తెలుసుకున్నప్పుడు, నాకు అన్ని సంఖ్యలు అర్థం అయినట్లు అనిపించేది. అలాగే, కొత్త నేపథ్యపు కథలు చదివినపుడు నా కాల్పనిక జగత్తులో ఇంకొంచెం నేల సాగు లోకి తెచ్చినట్లు, ఇంకొన్ని భవనాలు కట్టినట్లు, అనిపించేది.

ఇందాక అన్నట్లు, పది మందిలో ఉండీ పది మందికి అతీతంగా ఉండడం అనేది సాధారణం కాదు. కానీ, నేను మొదటి వ్యాసంలో  చెప్పినట్టు మా ఊరు చిన్న ఊరు. మా ఊరి వారి లోకం చిన్నది. వారి మానసిక లోకాలు మరీ సరళంగానూ, లెక్కల పరిభాషలో చెప్పాలంటే, రెండు లేదా మూడు అంకెల గుణహారాల్లోనే తిరుగుతూ ఉండేవి. కానీ, చదువుతున్న పుస్తకాలలో కొత్త కొత్త లోకాలు, నా మానసిక ప్రపంచాన్ని గొప్పగా, సంక్లిష్టంగా, ఆసక్తికరంగా చేసేందుకు తోడ్పడ్డాయి.

మనిషి జీవితానికి ఏది ముఖ్యం? ప్రాథమికావసరాలు తీరాక, మనిషికి ఏది ముఖ్యం? ఈ ముఖ్యాంశం ప్రాధమికం కాదు కాబట్టి, శారీరక నిర్ణయం కాదు. అది సామాజిక నిబంధన. చిన్నప్పుడు నేను సినిమాల్లో హీరోలను గుర్తు పట్టగలిగేవాడిని. వీడు భలే  తెలివిగలవాడురా, అని మా ఊరు వాళ్ళనేవారు. అందుకని చిన్నపుడు హీరోల గురించి ఇంకెక్కువ తెలుసుకోటానికి ప్రయత్నించేవాడిని. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఫలానాది ముఖ్యమంటే నేను దానిలో నిష్ణాతుడిని కావడానికి ప్రయత్నించాను!

ఇది చాలా గమనించవలసిన విషయం. “పెరిగిన వాతావరణం” అంటే ఇది. పిల్లలు పెరిగిన పరిసరాలు, వాతావరణం వారికి ఏది ముఖ్యమో, ఏది అందమో, ఏది ఆనందమో లాంటివన్నీ పాజిటివ్ రి ఇన్ ఫోర్స్ మెంట్  ద్వారా బోధిస్తాయి. మనిషి సంఘజీవి. ప్రతి వాడూ, తన సంఘం తనని గుర్తించాలని కోరుకొనేవాడే. అందుచేత ఆ విలువలు, అభిరుచులు, ఆశలు, కలకాలం, తర తరాలుగా కొనసాగుతాయి, తెలుగు సినిమాల్లో కథలాగా.

పుస్తకాలు, నేను ఈ పెరిగిన వాతావరణం నుంచి బయట పడటానికి సహాయ పడ్డాయి.  నేను పుస్తకాలు చదవడం మూలాన, దాదాపు ప్రతి విషయంలోనూ, నా చుట్టు పక్కలున్న వారినమ్మకాలతో విభేదించాను. నా కాల్పనిక జగత్తులో ఉండే విలువలు వేరు. అక్కడ మనుషులు నా చుట్టూ లాగా కాకుండా, వేరే విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ఇక్కడ ఒక పిట్టకథ చెబుతాను. దానికి ముందు కొంచెం నేపథ్యం వివరించాలి.    నేను ఐఐటీ లో బీటెక్ కి అప్లికేషన్ పెట్టేటప్పుడు, నేను మద్రాసు (చెన్నై) లోని ఐఐటీ లో, కంప్యూటర్ సైన్స్ ని మొదటి స్థానంలో ఎన్నుకున్నాను. రెండవ స్థానంలో ఢిల్లీలోని ఐఐటిలో, కంప్యూటర్ సైన్స్ ని ఎంచుకున్నాను. ఆ రోజుల్లో, ప్రతి తరగతికి కేవలం 14 సీట్లు మాత్రమే ఉండేవి. నాకు దక్షిణ భారతంలో 14వ స్థానం వచ్చింది.  అదనంగా ఏ ఒక్కరైనా, బయటనుంచి వస్తే మద్రాసులో నాకు సీటు రాదు. అందుకని నేను ఢిల్లీకి వెళ్ళవలసి వస్తుందని నాకు నేనే నిర్ణయించేసుకున్నాను.

ఆ సీటు ఫలితాలు వచ్చేముందు వేసవి సెలవుల్లో మా చుట్టాలున్న ఊరు వెళ్లాను. మాటల సందర్భంలో వాళ్లకి నేను ఢిల్లీలో చదువు కోబోతున్నాను అని చెప్పాను. “అక్కడ తినడానికి ఏం  పెడతారురా అబ్బాయి?” అని అడిగాడు ఆయన. బహుశా చపాతీలు, కూరలూ పెడతారేమో అని అన్నాను. నా వైపు జాలిగా చూసి, “ఇంత చదువు చదువుకొని, అన్నం తినటానికి నోచుకోలేదురా!” అని ఆయన వాపోయాడు. జాతీయ పోటి పరీక్షలలో కాస్త ఉన్నత విజయాన్నే సాధించిన నాకు, పుట్టి పెరిగిన ఊరు, ఆ వాతావారణం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు తెలిసి వచ్చి ఒక్క సారి మనసు చివుక్కుమంది. వారి ప్రపంచంలో సేద్యం చేసుకుని,ఆ బియ్యంతో వండుకున్న ‘అన్నం’ తినడం ఒకానొక ప్రధానమైన ఆనందం.  అదే కేంద్ర బిందువుగా, దాని చుట్టూ వారి ప్రపంచం తిరుగుతుంటుంది. నేను ప్రవేశించనున్న ప్రపంచంలో “అన్నం” తినడం అనేది ముఖ్యమైన అంశం కాదు.

కేవలం స్వానుభవం మీద ఆధారపడితే, లేదా  కేవలం మన చుట్టుపక్కల వాళ్ళ అనుభవాల మీద ఆధారపడితే, మన ప్రపంచం చాలా చిన్నదవుతుంది. ఒక విధంగా చూస్తే అదేమీ తప్పు కాదు. నిజానికి, అది ఒక స్వయంసంతుష్టిని, సంతృప్తిని ఇస్తుంది. ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక ఆనందాన్ని ఇస్తుంది. సాధారణంగా  తాము పుట్టిపెరిగిన పల్లెటూళ్లని, తమ బాల్యాలని గుర్తుతెచ్చుకుని, గతించిన దినాలను తలపోసే వారు ఈ విధమైన సరళమైన, చిన్నదైన, అవిరుద్ధమైన ప్రపంచాన్ని కోరుకోవడమే.

నేను పల్లెటూరిలో పెరిగి చదువుకుని విద్యా రంగంలో పైకి వచ్చిన వాళ్ళని చాలా మందిని కలిశాను. నాఅభిప్రాయం  వాళ్ళు ఆ ప్రపంచం నుంచి బయటకి రావడానికి, వారి దృష్టి పరిధి పెరగడం కారణం. ఈ పరిధి పెరగడానికీ, వారికి కొత్త అనుభవాలు, అభిరుచులు, ఆలోచనలు కలగడానికీ, సాహిత్యం ప్రధాన కారణం.  నిజానికి పట్టణాల్లో పుట్టి పెరిగి బాగా చదువుకున్న వారి కంటే, ఈ పల్లెలనుంచి వచ్చిన విద్యావంతులు సాహిత్యానికి ఎక్కువ ఋణపడి ఉంటారు.

అలాంటి, పుట్టి పెరిగిన నా వాతావరణాన్ని అధిగమించడం కోసం ఒక పదేళ్ల వరకు పుస్తకాలు చదివాను. ఆ తర్వాత, పుస్తకాలు చదవడానికి నా కారణాలు మారాయి. పుస్తకాలు చదవడం వల్ల, నాకంటూ ఒక సమాజాన్ని/ ఒక సమూహాన్ని సృష్టించుకోవచ్చు అని అన్న అవగాహన మొదలయ్యింది. నాలా పుస్తకాలు చదివేవాళ్ళు ఉంటారనీ,  వారికీ నాకు మధ్య వారధిగా ఒక రహస్య భాష ఉంటుందనీ, ఆ పుస్తకాలు చదువుకున్నవారందరమూ ఆ సమూహానికి చెందిన వారమౌతామని తెలిసి వచ్చింది.

ఈ పుస్తకాలు చదివే పాఠకులకు ఒక  సమాజముంటుదని చిన్నప్పుడే గ్రహించాను. మా అక్కయ్యకి, తన స్నేహితులకి,  పుస్తకాలు ఒకరి ఇంటి నుండి మరొకరికి చేర్చేటపుడు వారందరిని కలిపింది పుస్తకాలని, వాటి ద్వారానే వారందరూ స్నేహితులయ్యారనిపించేది. విత్రమేమిటంటే వాళ్లలో ఎవరూ కూడా ఒకరినొకరు ముఖా ముఖీ కలుసుకున్నది లేదు. అయినా వారి మధ్య స్నేహానికి పుస్తకాలే వారధి అయ్యాయి. నాకు మట్టుకు నాకు, నాకంటూ ఒక పుస్తక ప్రపంచం ఏర్పరుచుకోవడం పదకొండో ఏట నుంచి మొదలయింది.

నా పదకొండో ఏట, మా పొరుగూరు పల్లపాడులో  ఆరో తరగతి చదువుకోవటానికి వెళ్ళినపుడు, అక్కడ మొదటి సారిగా అసలు అంతకు ముందు ఏ మాత్రం పరిచయం లేని వారిని కలిసాను. వారితో కలవడానికి సినిమాలు, హీరోలు, మాత్రమే కాకుండా, పుస్తకాలు కూడా సహాయం చేశాయి. నాకు  సినిమాలు, అభిమాన హీరోల సంఘాలకన్నా, నాకు పుస్తకాల ద్వారా పరిచయాలు, తద్వారా ఆ గ్రూపులు ఏర్పడటం నచ్చింది. ముఖ్యంగా, పుస్తకాల గ్రూపుల్లో అయితే, పెద్ద వాళ్ళు, టీచర్లు, ఆడపిల్లలు, ఇలాగ మన దైనందిన జీవితంలో  తారసపడేవారికన్నా, దాన్ని బయట ఉన్న వాళ్ళని కలుసుకోవడానికి ఆస్కారం ఉన్నది. అదే సినిమా హీరోల ప్రపంచమయితే, కేవలం నా ఈడు అబ్బాయిలు మాత్రమే ఆ సమూహాంలో ఉంటారు అనిపించింది.

ముఖ్యంగా, అప్పుడు కొంత మంది టీచర్లతో పుస్తకాల గురించి సంభాషించే అవకాశం వచ్చింది. మా హిందీ టీచర్ గారి నుండి నేను రామాయణ విషవృక్షం తీసుకొని చదివి ఆవిడతో నేను దాన్ని గురించి చర్చించేవాడిని. అలాగే, మా హెడ్ మాస్టర్ గారు కూడానూ. మేము చదువుకున్న రష్యన్ నవలల గురించి, ఏది, ఎందుకు నచ్చిందోనని వివరంగా మాట్లాడు కొనే వాళ్ళం.

అలా పుస్తకాలద్వారా మరో ప్రపంచం / సమూహం/గ్రూపు సమాజం ఏర్పడటం, దానిలో గుర్తింపు కోసం పుస్తకాలు చదవడం, ఆ  చదవటం ద్వారా ఇంకా ఆ సమాజంలో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ఆ తరుణ దశలో నాకు బాగా నచ్చింది. ఇప్పటికీ, ఈ నాటి పేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లోనూ, ఇటువంటి  పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లూప్ కనబడుతూ ఉంటుంది. మనం ఇతరులతో మాట్లాడు కోవడానికి సాహిత్యం ఒక పద, భావ, రస జాలాన్ని ఇస్తుంది.

ఇది ఇప్పటికీ నాకు బాగా ముఖ్యం అనిపిస్తుంది: సాహిత్యం, మనుషులు తమను తాము ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఉపయోగ పడుతుంది. ఎవరికీ తెలియని భాష తో మన భావాలను ఎలా ఇతరులతో పంచుకోలేమో, అలాగే ఎవరూ చదవని పుస్తకాలు కూడా పనికి రావు. [దీనికి వేరే తిరకాసు ఉంది, వచ్చే భాగాల్లో వివరిస్తాను.]  అందుకే, అప్పుడపుడు అమెరికాలో, ఒక ఊరు, ఊరు లో పాఠకులందరూ, ఒకే పుస్తకం చదవడం జరుగుతుంది. బస్సు స్టాప్ లో ఇతరులు ఎవరన్నా కనబడితే మాట్లాడటానికి అందరికీ ఒక ఆధారం దొరుకుతుంది. మనుషులకీ, మనుషులకీ దూరం పెరిగినపుడు సాహిత్యం వారిని సన్నిహితుల్ని చేస్తుంది. చదివే పుస్తకాల ఆధారంగా ఎదుటి వాళ్ళను బేరీజు వేసే పాఠకులు నాకు చాలా మంది తెలుసు.

ఒక్క సాహిత్యమే కాదు, పార్టిసిపేటరీ కళలు అన్నీ ప్రజలలో, ఒకరితో మరోకరికి త్వరగా సన్నిహిత సంబంధాలు ఏర్పడడానికి దోహదం చేస్తాయి.  ఉదాహరణకి, హీరో అభిమాన సంఘాలు అపరిచితులని కలుపుతాయి. రాజకీయాలు సరే సరి! అనేక మంది అమెరికాలో అమ్మాయిలు, అబ్బాయిలు, సంగీత అభిరుచులని  బట్టి జీవిత సహచరులను ఎంచుకోవడం కద్దు. అది ఏ మాత్రం సత్యదూరం కాదు.

అనేక బాదరాయణ సంబంధాల్లో సాహిత్యాభిరుచులు కూడా ఒకటి. కానీ సాహిత్యాభిరుచి, మన విలువలు, దృక్పథాలు, మానసిక స్థాయి, ఇష్టా ఇష్టాలవంటివి మనకి అనేకం కల్పిస్తుంది. అందుకేనేమో, సాహిత్యం పేరుతో స్నేహాలు తొందరగా అవడమే కాకుండా, బలంగా కూడా అవుతాయి. అరుదైన, కొంతమందికి మాత్రమే అర్థమయే పుస్తకాలు, మనుషుల మధ్య రహస్య సంకేతాల భాష, ఊహల సాన్నిహిత్యమూ, ప్రపంచం మీద ఉమ్మడి జాలి లాంటి అసంతృప్తి భావాలు, కలిగించి, ఒకరినొకరికి దగ్గిరచేస్తాయి. ఈనాటికీ, నా చిన్నప్పటి స్నేహాలు పుస్తకాల స్నేహాలనే చెప్పుకోవచ్చు.

ఇలాగ, ముందు సరళమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, తర్వాత నా చుట్టుపక్కల లోకాన్ని అధిగమించడం కోసం, ఆ తర్వాత నా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చిన్నపుడు పుస్తకాలు చదివాను. రాబోయే భాగంలో కాలక్రమేణా పుస్తకాలని ఎందుకు, ఎలాగ తిరస్కరించానో, రచయితలతో ఎందుకు విభేదించానో, నన్ను నేను ఏవిధంగా నిర్వచించుకున్నానో వివరిస్తాను. నేను పెద్దయిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఈ మానసిక ప్రపంచం ఉంటుందని, ఈ కాల్పనిక జగత్తు బాధ్యతా రాహిత్యం లేదా ఎస్కేపిజం మనుషులకి అలవాటు చేస్తుందని కూడా తెలిసి వచ్చింది. నాకు జీవితంలో సమతౌల్యం కలగటానికి, ఎస్కేపిజం నుండి తప్పించుకోవడానికి రెండు కారణాలు ముఖ్యంగా కనబడుతున్నాయి. (హింట్: లెక్కలు!) 

*

 

రామారావు కన్నెగంటి

రామారావు కన్నెగంటి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • పుస్తకాలు చదవటానికి ఏ కారణం అక్కర లేదు అన్న దగ్గర నుండి పుస్తకాలు చదవటం వలన కనిపిస్తున్న ఫలితాలను పుస్తకాలు చదవటానికి కారణాలుగా అన్వయించిన తీరు బాగుంది. నీ ఉద్దేశం నెరవేరింది. మొదటి భాగానికి రెండవ భాగానికి మారిన శైలి కూడా అందుకు అద్దం పడుతుంది. .మొదటిది నవలా సాహిత్యం లా అనిపించింది..రెండవది జటర్నలిజం లా అనిపించింది…మొదటిది చందమామ కథలా ఉంది.. ..ఇది విశ్లేషణాత్మకం గా ఉంది. …మూడవది విమర్శనాత్మకం గా ఉంటుందేమో అనిపించింది.

  “పుట్టి పెరిగిన ఊరు, ఆ వాతావారణం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు తెలిసి వచ్చి ఒక్క సారి మనసు చివుక్కుమంది. వారి ప్రపంచంలో సేద్యం చేసుకుని,ఆ బియ్యంతో వండుకున్న ‘అన్నం’ తినడం ఒకానొక ప్రధానమైన ఆనందం”

  “మనుషులకీ, మనుషులకీ దూరం పెరిగినపుడు సాహిత్యం వారిని సన్నిహితుల్ని చేస్తుంది. చదివే పుస్తకాల ఆధారంగా ఎదుటి వాళ్ళను బేరీజు వేసే పాఠకులు నాకు చాలా మంది తెలుసు.”

  “సాహిత్యం పేరుతో స్నేహాలు తొందరగా అవడమే కాకుండా, బలంగా కూడా అవుతాయి. అరుదైన, కొంతమందికి మాత్రమే అర్థమయే పుస్తకాలు, మనుషుల మధ్య రహస్య సంకేతాల భాష, ఊహల సాన్నిహిత్యమూ, ప్రపంచం మీద ఉమ్మడి జాలి లాంటి అసంతృప్తి భావాలు, కలిగించి, ఒకరినొకరికి దగ్గిరచేస్తాయి”

  ఇలా చాలా మంచి మంచి పద బంధాలు ఉన్నాయి. వాక్య నిర్మాణాలు ఉన్నాయి…మొదటి సారి చదివినప్పటి కంటే రెండవ సారి బాగా అనిపించింది…మళ్ళీ మళ్ళీ చదివిస్తుందేమో…

 • Sour Comment:

  నేను పెద్దయిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఈ మానసిక ప్రపంచం ఉంటుందని, ఈ కాల్పనిక జగత్తు బాధ్యతా రాహిత్యం లేదా ఎస్కేపిజం మనుషులకి అలవాటు చేస్తుందని కూడా తెలిసి వచ్చింది.

  And Marquez said…

  After some time I realised, you know fiction as an imaginary world, it started pushing me away from Reality.

  Conversely, my job (journalist ) did the opposite, and it bring me back to the reality.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు