కవులూ కళాకారులూ సహజంగా ఊహాలోక విహారులు. భౌతిక ప్రపంచంలో తమకు నచ్చిన విషయాలపట్ల మమకారాన్నీ నచ్చని విషయాలపట్ల చీత్కారాన్నీ తక్షణ చర్యగా తమ ప్రతిస్పందనలద్వారా తెలియజేస్తారు. తమను ఆహ్లాదపరిచే వాతావరణానికో ప్రకృతికో తన్మయం పొందుతారు. ఆ క్షణంలో తమ కళ్ళముందున్న ఆ విషయాలలోని సౌకుమార్యాన్నీ అందాన్నీ ఆరాధిస్తారు. ఆ ఆరాధనను తమ భాష ద్వారా ప్రపంచంతో పంచుకుంటారు. తమ మనసులను నొప్పించే విషయాలపై వారి స్పందన నిరాకరణగానో, సరిచేసే ఆలోచనతోనో ఉంటుంది.
ఈ మొత్తం ప్రక్రియ కవుల కళాకారుల మనస్సులో జరిగే ఒక పరిణామం. దానితో భౌతిక ప్రపంచానికి సంబంధం లేదు. అయితే తమ కళారూపాల ద్వారా బయటి ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రకటించే కళారూపాలలోని విభిన్న రీతులను అప్రయత్నంగానే వారు ఎంచుకుంటారు.
కళాసృజన ఒక మానసిక ప్రక్రియ. సామాన్య మానవులు కళాసృజనకు పూనుకోలేరు. కళాసృజనలో నిమగ్నమైనవారు ఒక ప్రత్యేక లోకంలో విహరిస్తూ వుంటారు. (కొందరు కొంటె వారు దానిని మనోవైకల్యమనీ పిచ్చి అనీ కూడా అంటూ వుంటారు). కళాకారులు భావుకులు. బయటి ప్రపంచంతో వారికి ఉన్న తాదాత్మ్యతా వైరుధ్యమూ వారి కళాసృజనకు ధాతువులు.
ఆధునిక సాహిత్య విశ్లేషకులు కొందరు సమకాలీన కళాసృజనకు అవసరమైన అంశాలు అంటూ ఆ సమయంలో వారికి తోచిన కొన్ని అంశాలను ప్రకటించడం, ఆ అంశాలను కళాకారుల కళాసృజనకు అవసరమైన అంశాలుగా వారి వారి ఆకాంక్షలను ప్రకటించడం చూస్తూ ఉంటాం. మిగిలిన కళలలోని ప్రతిపాదనలతో పోలిస్తే కాల్పనిక వచనం, కవిత్వాలపై అలాంటి ప్రతిపాదనలు ఎక్కువ.
Emotions recollected in tranquility అని ఒక కవి అన్నమాటలనే పరిశీలనకు తీసుకుంటే అందులో రెండు విషయాలున్నాయి. మనిషి Emotions సాధారణ స్థితికి వచ్చాక అవి మనసులను ప్రభావితం చేసినప్పుడు ఉన్నంత సహజంగా సాధారణ స్థితిలో ఉంటాయా? అలా ఉండకపోతే, అవి అలా ఉండకపోవడానికి కారణాలేమిటి?
అవేశమో, దుఖమో, ప్రేమో, వ్యామోహమో, ద్వేషమో, తాదాత్మ్యమో మనసులలో ఎక్కువకాలం మనలేని మానవ సహజాతాలు. భౌతిక ప్రపంచంలోని విలువలూ అవసరాలూ పరిస్థితులూ, మానవజీవితంలోని పరిమితులూ వాటిని ప్రభావితం చేయగల అంశాలలో కొన్ని. మనిషి కాల్పనికతను ప్రభావితం చేసే వాస్తవిక ప్రపంచంలోని ఇలాంటి అంశాలు కవి వాస్తవ ప్రపంచంపై ప్రకటించే సహజాతాలను అదుపు చేస్తూ ఉంటాయి.
ఇక్కడే కవులు తన భావాన్ని ప్రకటించడానికి తగిన రూపాన్ని ఎంచుకుంటారు. తమ అసహాయతనూ, వొంటరితనాన్నీ ఆ కళారూపం చాటున మరుగుపరుస్తూ తమ స్పందనను కళాత్మకంగా ప్రకటిస్తారు.
తమకు భౌతిక ప్రపంచంలోని విరోధ శక్తులతో ప్రమాదం అనుకున్నప్పుడు కళారూపం విషయాన్ని దొంతరలుగా పరుస్తుంది లేదా చెప్పదలచుకున్న దానిని సూచించే పద్దతిని ఎన్నుకుంటుంది.. ఇతర కారణాలవల్ల నేరుగా తెలుపలేని విషయాలూ అలాగే దొంతరలుగా మెరుస్తాయి.
ఉదాహరణకు ఒక కవి పర్యావరణం మీద ఒక కవిత రాస్తారనుకుందాం. ఆ కవిత ఎలా ఉంటుందీ? ఏముందీ, పర్యావరణ విధ్వంసం మీద ఆ కవి వగపోత ఉంటుంది అనుకుంటాం.
మనమిప్పుడు పర్యావరణ విధ్వంస శకంలో ఉన్నాం గనుక ఆ కవి కవిత ఉదాసీనమైతే మన అంచనాలు నిజమవుతాయి. ఆ కవి నిర్మించే పదబంధాలు ప్రకృతిని వర్ణించేవే అయినా కవి భావనలోని మార్మికత మనకేమి సూచిస్తుందో మనం ముందే ఊహించగలం. కానీ నిపుణుడైన కవి అక్షరాలతో పదబంధాలతో పద చిత్రాలతో ఆడుకునే తీరు చాలా సార్లు మనలను ఆశ్చర్యపరుస్తుంది.
అలాంటి కవితనొక దాన్ని చూసేముందు ప్రముఖ కవి ఇస్మాయిల్ రాసిన తాటి తోపు అనే ఈ కవితను చూద్దాం..
“నల్లటి ఈ తాటివనం అల్లిన నీడ వారిపై
ఎర్రటి సాయింత్రాన్ని ఎక్కు పెట్టింది.
గాలి శవాన్నెత్తుకుని కదల్లేదు తోట
గుచ్చుకుని సంధ్యాంగుళి గుడ్డిదయ్యె పాట
గాలి ముల్లు గుచ్చుకుని గాయపడెను సాయింత్రం
కాలిమసై పాట నిలిచె తాళ వనపు అస్థికలు.
తాటితెడ్లు వేసుకుంటు తరలిపోయే సంజ
పాటనురగ మదిని తేల మరలివస్తి ఒక్కణ్ణి”
(ఇస్మాయిల్ కవిత్వం సంపుటి నుండి)
పై కవితలో కవి ఒక దుఃఖాన్ని వర్ణించడానికి తాటి తోపును ఎన్నుకున్నాడు. మన వ్యావహారికంలో తాటి చెట్టుకు ఉండే ప్రాధాన్యత తెలిసిందే. అలాంటి చెట్ల వనాన్ని “వారికి” పర్యాయపదంగా ఎంచుకున్నాడు కవి. ఎక్కుపెట్టిన ఎర్రని సాయింత్రం, ఆ సాయింత్రం గుడ్డిదైన పాటా, ఆ సాయింత్రానికి గాయం, కాలి మసి అయి నిలిచిన పాట, తాళ వనపు అస్థికలు, తరలిపోయిన సంజ, పాట లేదుగానీ దాని నురగ మదిలో తేలుతోంది. కవి ఒక్కడూ తిరిగి వస్తున్నాడు.
ఈ కవితలో కవి ఆవిష్కరించిన విషాద స్వరం చదువరుల మదిని ఇట్టే తాకుతుంది. కవి సామయిక స్థితి కవో కవిని తెలిసిన వారో చెబితే తప్ప తెలియదుగానీ కవి ఆవిష్కరించిన విషాద చిత్రాలు చదువరులను వెంటాడుతాయి.
నవంబర్ 22 1960 న ప్రచురితమైన ఈ కవిత చదివిన వెంటనే ఒక విషాద గతాన్నీ, తరచి చూస్తే ఆ విషాదం వెనుక ఉన్న వాస్తవాన్నే సూచిస్తుంది.
ప్రమోద్ అనే కవి ఒంటరితనం నుండి వచ్చే పరాకునూ, ఆ పరాకును దూరం చేసే ప్రకృతినీ అది చేసే మాయనూ వర్ణిస్తూనే ఆ ప్రకృతి సృష్టించిన అద్భుతాన్ని ఆవిష్కరించే ఈ కవితను చూడండి.
వనవరం
ఏ కొమ్మలమాటు నుంచో ఓ పిట్ట కూస్తుంది
మనసు పరక మీద పూసిన పరాకునంతా ఆ కూత తీపి మేస్తుంది
తేటపడి తేలికపడి
తెల్ల కాగితంలా తళతళలాడే మనసు మీద
అటుగా పోయే సీతాకోక గుప్పెడు రంగులు గుమ్మరించి పోతుంది
మనసు మీద తీరుగా సర్దుకున్న రంగుల్లోంచి
ఓ కవిత కువకువమంటుంది
పదాతీతమైన ఓ అంతరంగ స్తుతిగీతం
నదిలా నెమ్మదిగా నీ దయకడలి వైపు కదిలెళ్లుతుంది
ప్రమోద్ వడ్లకొండ (28.06.2026 సాక్షి ఆదివారం అనుబంధం)
‘మనసు పరకమీద పూసిన పరాకు’ అంటూ వేసవిలో తొలకరికి ముందు గడ్డిపరకపై నిండిన ధూళిని పరాకుగా మార్చాడు కవి. వేసవి గరుకుతనాన్నీ వర్షపు కోమల స్పర్శనూ అక్షరాల వెనక పేనిన కవి అల్లిక కవిత మొత్తంలో అలాగే ప్రవహిస్తుంది.
వర్షం రాగానే తేటపడిన ‘మనసు పరక’ తెల్ల కాయితంలా తళతళలాడుతోంది. ఆ వర్షం భౌతిక వాస్తకమా కవి కాల్పనికమా? కాల్పనికమైతే అది ఏమి ఉంటుంది? చదువరికి ఇది ఒక ఆసక్తికరమైన అంశం. పిట్టల కూతలు వాన రాకడకు సూచికలు అనుకుందామా?. కవి అక్కడకూడా ఉత్ప్రేక్షను ఉపయోగించాడా?
Conceit ను extended metaphor అంటారు ఆంగ్ల పండితులు. ఈ కవితలో కవి ఉపయోగించిన Conceit కవితకు ఒక అర్థాల దొంతరను ఇస్తున్నదా? Conceit అనే ప్రక్రియ కవి చెప్పదలచుకున్న దానికంటే దాయదలచిన దానికే ప్రాదాన్యతనిస్తుండా?
“పదాతీతమైన ఓ అంతరంగ స్తుతిగీతం” దేన్ని స్తుతిస్తున్నది?
“యే వెలుగులకీ ప్రస్థానం” అని శ్రీ శ్రీ సంశయాత్మకంగా అడిగిన ప్రశ్న కాదు ఇది. ఆ ప్రస్థానానికి కూడా ఒక గమ్యాన్ని కలగంటున్నాడు కవి.
కవి తన భావుకతతో తన భావాల అలజడులను కప్పి వేసి ప్రకృతినీ మనిషినీ దయాకడలివైపు నడిపిన కవిత ఇది.
“ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్”
అన్న గురజాడ స్ఫూర్తి కవులకు దారి దీపం ఎలా కాగలదో ఈ కవితలో మనం చూడొచ్చు.
*








చాలా చక్కటి విశ్లేషణ చంద్రశేఖర్ గారూ. ఆద్యంతం హృద్యంగా సాగింది. కవిత మీ మాటల్లో పడి మరో స్థాయికేగింది. ధన్యవాదాలు. నమస్సులు. 🙏😍☘️