పతంజలి గారి  ప్రిస్క్రిప్షన్

  “మనం అప్పుడప్పుడు గుడ్డివాళ్ళ రాజ్యంలో ఉన్నామని వాడికి (రాజ్యానికి) తెలియచెప్పాలి. లేకపోతే మనల్ని మనపనిచేసుకోనివ్వకుండా అడ్డుపడతారు,” అన్నారు పతంజలి!

Patanjali means many things to many people. కొందరికి ఆయన గొప్ప జర్నలిస్టు. కొందరికి గొప్ప రచయిత. ఇంకొందరికి దీర్ఘకాలిక జబ్బుల్ని నయం చేసిన వైద్యుడు. మంచి మానవసంబంధాలు గల సహోద్యోగి. మంచి బాస్. ఉన్నతస్థాయి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వున్న వాడు. చిన్నపిల్లడి హృదయం, నవ్వు వున్నవాడు. ఆయన తోడుంటే ఎన్నిగంటలైనా నిమిషుల్లాగా అనిపిస్తాయి.

తెలుగు జర్నలిజాన్ని, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన పతంజలి గారి జన్మదినోత్సవం (మార్చి 29) సందర్భంగా ఆయన కొత్త రచయితలకు ఇచ్చిన సలహాల గురించి, మెళకువల గురించి  చెప్పాలనిపించింది.

‘ఉదయం’ పత్రిక 1995లో మూతపడగానే రోడ్డునపడ్డ వందలమంది ఉద్యోగుల్లో నేనూ ఒకడిని. నెలో, రెండునెలలో — నిరసన ఉద్యమం తర్వాత ‘మహానగర్’ పత్రికలో ఖాళీలున్నాయని ఎవరో చెప్తే సర్టిఫికెట్లు, నేను రాసిన వార్తల, వ్యాసాల కాపీలు పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళేను. సర్టిఫికెట్లు, వ్యాసాల కాపీలను ఒకటి రెండు నిమిషాలు తిప్పి పక్కన పెట్టి — కొకు దగ్గరనుండి ఎందరో రచయితల గురించి, రచనలగురించి ప్రస్తావన చేసి రెండు గంటలకు పైగా నన్ను ఎంగేజ్ చేసేరు.

నాకు అది ఒక కల. అప్పటికే మా ఉత్తరాంధ్ర, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే చోడవరం, సాహిత్యాభిమానులకు ఆయన ఆరాధ్యుడు. ఆయన మాటల్ని వాడకుండా మా ఏ సంభాషణా పూర్తికాదు. అలాటిది ఆయన నన్ను ఇంటర్వ్యూ చెయ్యడం! ఎటువంటి హెచ్చులూ చూపించకుండా,భేషజాలకు పోకుండా ఎప్పటినుంచో పరిచయం వున్న వారిలా ఆయన మాట్లాడేవారని ఆయన గురించి తెలిసిన వాళ్లకు చెప్పనక్కర్లేదు.

అక్కడ పనిచేసిన సంవత్సరమూ ఒక ‘paid learning’ అనుభవం. సాహిత్యం గురించో, రాజకీయాల గురించో, రాజ్య హింస గురించో, మనుషుల్లోని మరుగుజ్జు తనాల గురించో, జర్నలిజం గురించో,  — ఆయన దగ్గరనుంచి ఏదో ఒకటి నేర్చుకోని రోజు లేదు. ఏదో పుస్తకం గురించో, రచయిత గురించో, లాటిన్ అమెరికా దేశాల్లోని అరాచకానికి ఏమాత్రం తగ్గని ఇక్కడి అరాచకం గురించో, అప్పుడు వస్తున్న మురుగుపట్టిన కవిత్వం గురించో — గంటలు, గంటలు మాట్లాడేవారు.

అలాటి ఒక సందర్భంలో అడిగేను. “కొత్త రచయితలు, సాహిత్యాభిమానులు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలేమిటి, సార్,” అని.

పతంజలి గారు విశ్వ సాహిత్యాన్ని, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని విస్తృతంగా చదివేరు. చదవమని చెప్పేవారు. మాట్లాడుతున్నప్పుడు ఎక్కడెక్కడి పుస్తకాల, రచయితల  రచనల నుంచి అలవోకగా కోట్ చేసి చెప్పేవారు.

వెంటనే న్యూస్ ప్రింట్ పేపర్లతో చేసిన నోట్ పేడ్ లో ఒక పేజీ చించి ఈ పుస్తకాల పేర్లు రాసేరు. ఈ నోట్ ఎక్కడో పెట్టి మరిచిపోయాను ఆ తర్వాత. పతంజలిగారు చనిపోయాక ఈ నోట్ కోసం ఎంతో వెదికాను. ఎక్కడా దొరకలేదు. ఆ మధ్య పూణే పోలీసులు మా ఇంట్లో చేసిన సోదాల్లో ఎక్కడెక్కడి పాతపుస్తకాలు పైకి వచ్చాయి. ఆ పుస్తకాల్ని గతవారం సర్దుతూంటే ఓ క్లాసిక్ కథల పుస్తకంలో భద్రంగా కనిపించింది. ఎంత సంతోషం కలిగిందో ఆ నోట్ చూస్తుంటే. ఆయన చేతిరాతను చూస్తుంటే నల్లకుంట లోని ‘మహానగర్’ ఆఫీసులో పాతికేళ్ళక్రితం ఈ లిస్టును ఆయన రాసిన క్షణాలు సజీవంగా కళ్ళముందుకొచ్చాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ నోట్ మీతో, ముఖ్యంగా కొత్త రచయితలతో, సాహిత్యాభిమానులతో, పంచుకోవాలనిపించింది.

 

Must-read list for young writers. A list compiled by K N Y Patanjali

I

The Steppe — Anton Chekhov

The Kreutzer Sonata – Leo Tolstoy

The Wolf – Guy  de Maupassant

II

  1. i) Red and Black by Stendhal
  2. ii) The Brothers Karamazov — Dostoevsky

iii) Anna Karenina — Leo Tolstoy

ఇవి స్వయంగా ఆయన రాసి ఇచ్చిన పుస్తకాల లిస్టు. ఇది కాకుండా ఆయన మాటల్లో ఎన్నోపుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఎన్నోవస్తుండేవి. అందులోముఖ్యమైనది హెచ్ జి వెల్స్ రాసిన ‘The Country of the Blind’. కళ్ళుండీ దేన్నీ చూడనివ్వని, మాట్లాడనివ్వని,  రాయనివ్వని పరిస్థితుల్లో ఎవరైనా  నిజాన్ని చూడడానికి ప్రయత్నిస్తే, మాట్లాడడానికి ప్రయత్నిస్తే, రాయడానికి ప్రయత్నిస్తే నిన్ను బతకనివ్వరన్న సందేశాన్ని ప్రతీకాత్మకంగా చాలా శక్తివంతంగా రాస్తారు.

“మనం అప్పుడప్పుడు గుడ్డివాళ్ళ రాజ్యంలో ఉన్నామని వాడికి (రాజ్యానికి) తెలియచెప్పాలి. లేకపోతే మనల్ని మనపనిచేసుకోనివ్వకుండా అడ్డుపడతారు,” అన్నారు.

మహానగర్లో వున్నపుడే ఆయన ప్రపంచప్రసిద్ధి చెందిన కథలను ‘జ్ఞాపక కథలు’గా (రీటోల్డ్) పరిచయం చేశారు.

(ప్రస్తుతానికి గుర్తుకు వచ్చినవి ఇవి. గుర్తొచ్చినప్పుడు ఆయనకి  నచ్చిన మరికొన్ని పుస్తకాల గురించి చెప్తాను. విస్తృతమైన అధ్యయనం వున్నపతంజలి గారు తమకు నచ్చిన, నచ్చని పుస్తకాల గురించి ప్రతి సందర్భంలోనూ చెప్పే వారు.)

(పతంజలి జననం – మార్చ్ 29, 1952; మరణం – మార్చ్ 11, 2009)

 

*

 

 

 

 

 

Avatar

కూర్మనాథ్

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • స్వల్పమే అయినా మంచి విషయాలు చెప్పారు పతంజలి గారి గురించి

  • పతంజలి గార్ని ఇలా గుర్తు చేయడం సంతోషంగా ఉంది కూర్మనాథ్ గారు. ఆయన్ని, ఆయన రచనల్నీ ఇష్టపడనివారంటూ ఉండరేమో! టాల్ స్టాయ్ “యుద్ధము – శాంతి ” వెనకనుంచి ముందుకి అప్పచెప్పేవారని కూడా అన్నారెవరో! పతంజలి గారితో నాకు బాగా సన్నిహితం లేకపోయినా కొంత పరిచయం ఉంది. ఆయన చేసే ఆయుర్వేదం మందుల్లోకి ఊడుగ పూలు, పళ్ళూ కావాలని (నాతో ఆర్టిష్ట్ చంద్ర గారు) చెబితే నేను తీసుకెళ్ళి ఇచ్చాను. (ఆ చెట్టు అప్పట్లో నేను జాబ్ చేస్తున్న ఆల్విన్ కంపెనీలో ఉందేది ). ఆయన మననుండి వెళ్ళిపోడానికి వారం క్రితం – పనుండి నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది . అప్పుడు పతంజలి గార్ని కలవడానికి వర్మ, వేణు, మల్లీశ్వరి , చలం, రేడియో మధు గార్లతో పాటూ హాస్పటల్ కి వెళ్ళాను . ఆ చివరి దశలో కూడా నన్ను గుర్తుపట్టారు ! వారి జ్ఞాపకాలని మరోసారి నెమరువేసుకునేలా చేశారు – ధన్యవాదాలు .

  • కూర్మనాధ్ గారూ . గోగోల్ వ్రాసిన మృతజీవులు గురించి ఆయన చెప్పారా ?

    • లేదండీ.
      టాల్ స్టాయ్ వి ఇంకో రెండు, మూడు, గోర్కీ వి కూడా చెప్పేరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు